సినీభాషలో ఏ లోపాలు లేని వాడే హీరో. ఈ రోజుల్లోని సినిమా కథల్లో లోపాలున్న హీరోలయితే అస్సలు కనబడరు. అందరూ హీమేన్లే. మరి, తనలో లోపాలున్నా సినిమా చూసిన చాలాసేపటి వరకూ.. ఇంకా అతని గురించే ఆలోచించేలా చెయ్యగలిగాడు ఈ "Raanjhanaa". ఈ చిత్రం విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి లాభాలు గడించిందని వినికిడి.
బనారస్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు కుందన్. ఎనిమిదేళ్ల వయసులో నమాజ్ చేస్తున్న "జోయా" ను మొదటిసారి చూసినప్పటి నుండీ ఆమె అంటే పిచ్చి ప్రేమ కలుగుతుంది అతనికి. ఇలా స్కూలు పిల్లల మధ్యన ప్రేమ చూపించే పిల్లలను పాడుచేస్తున్నారు అనుకునే లోపూ స్కూలు వయసులోనే ఆమెను ఒప్పించటానికి బ్లేడ్ తో తన చెయ్యి కోసేసుకుంటాడు కుందన్. స్కూల్ డ్రస్సులో ఉన్న జోయా అతని ప్రేమను అంగీకరిస్తుంది కానీ నేను ఇంకా బాగా తిట్టుకున్నా. ఇదేం సినిమా బాబోయ్.. ఇలాంటివి సినిమాల్లో చూపించి అగ్నికి అజ్యం పోస్తున్నారే.. అని!
తర్వాత ఇంట్లోవాళ్ళు జోయాను వేరే ఊరు పంపించి చదివిస్తారు. ఓ ఎనిమిదేళ్ల తరువాత జోయా మళ్ళీ బనారస్ వస్తుంది. అప్పటికి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతూ ఉంటుంది. ఆమె లేకపోయినా జోయా తలపుల్లోనే గడుపుతూ, ఆమె ఇంటి చూట్టూ తిరుగుతూ ఇంట్లోవాళ్లని మచ్చిక చేసుకుంటాడు కుందన్. జోయా కోసమే ఎదురుచూసే అతనికి ఆమె తనని గుర్తుపట్టకపోవటం పెద్ద షాక్. మెల్లగా ఆమెతో మళ్ళీ స్నేహం కలిపి మనసులో మాట చెప్తాడు మళ్ళీ. చిన్నతనాన్ని మర్చిపొమ్మనీ, తాను యూనివర్సిటీలో వేరే మనిషిని ప్రేమిస్తున్నాననీ, అతను లేకుండా బ్రతకలేననీ చెప్తుండి జోయా. ఇది ఇంకా పెద్ద షాక్ కుందన్ కి.
వేదనతో మరోసారి ఆత్మహత్యాయత్నం చేసుకుని, అసలు జోయానింక కలవనని చెప్పినా, నెమ్మదిగా తేరుకుని, జోయా తండ్రిని ఆమె ప్రేమికుడితో పెళ్ళీకి ఒప్పిస్తాడు కుందన్. తనని చిన్నప్పటి నుండీ ఇష్టపడే బిందియాను పెళ్ళాడతానని ఇంట్లో ఒప్పుకుంటాడు. సరిగ్గా పెళ్ళి జరిగే సమయానికి జోయా ప్రేమికుడు ముస్లిం కాదని, హిందువే నని తెలిసి, పట్టరానికోపంతో జోయా ఇంటికి వెళ్ళి, న్యూస్పేపర్లోని ఋజువు చూపించి ఆ పెళ్ళి ఆగిపోవటానికి కారకుడౌతాడు. ఈలోపూ జోయా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందని, ఆమె బంధువులు కొట్టిన దెబ్బలకి జస్జీత్(ఆమె ప్రేమికుడు) కూడా తీవ్రంగా గాయపడ్డాడని తెల్సుకుంటాడు. జస్జీత్ ను వెతికి హాస్పటల్లో చేరుస్తాడు. ఈ హడావుడిలో తన పెళ్ళి సంగతి మర్చిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికీ కోపంతో ఉన్న తండ్రి కుందన్ ను గెంటివేస్తాడు.
జోయా దగ్గరకు వెళ్ళి ఆమె తనను అసహ్యించుకుంటున్నా, ఆగిపోయిన పెళ్ళి జరిపించాలనే ఉద్దేశంతో జస్జీత్ ఇంటికి తీసుకువెళ్తాడు ఆమెను. కానీ అక్కడ జస్జీత్ మరణం గురించి తెలుసుకుని అపరాధభావంతో కుమిలిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరకు గంగా తీరంలో కూచుని ఉండగా ఒకాయన ఓ మాట చెప్తాడు కుందన్ కి.. "ప్రపంచంలో ఏ పుణ్యస్థలానికీ హత్యానేరాన్ని క్షమింపగలిగే శక్తి లేదు. ఇక్కడ గంగ ఒడ్డున ముక్తి కోసం కూచోవటం కాదు..వెళ్ళు.. వెళ్ళి ఏది చెయ్యాలో అది చెయ్యి." అని! అప్పుడు మళ్ళీ జోయాను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె తనను క్షమించాలనే ఏకైన లక్ష్యంతో ఆమె అసహ్యాన్ని భరిస్తూ అక్కడే ఓ టీ కొట్టులో పనిచేస్తుంటాడు. విద్యార్థి నాయకుడిగా జస్జీత్ స్థాపించిన రాజకీయ పార్టీ తరఫున జోయా పనిచేస్తూంటే, తానూ ఆ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవటం మొదలుపెడతాడు.
ఇక్కడ్నుంచీ ప్రేమకథ హటాత్తుగా రాజకీయ కథనంగా మారిపోతుంది. కొన్ని సంఘటనల కారణంగా పార్టిలో కుందన్ ప్రముఖమైన వ్యక్తిగా మారిపోతాడు. జోయా ఇది సహించలేకపోతుంది. జస్జీత్ మరణానికి కారకుడిని నాయకుడిని చేసేస్తున్నారా? అని మిత్రులతోనూ, జస్జీత్ స్థానంలో కూచుని నన్ను దక్కించుకుందామనుకుంటున్నావా? అని కుందన్ తోనూ దెబ్బలాడుతుంది. ఆ ఆవేశంలోనే విద్యార్థుల పార్టీని తమవైపు తిప్పుకోవాలనుకుంటున్న సి.ఎం. మాటలను విని కుందన్ ప్రాణాలకి హాని తలపెడుతుంది.
కుందన్ ఏమౌతాడు? జోయా అతడిని క్షమిస్తుందా? అతడి ప్రేమలో స్వచ్ఛతను అర్థం చేసుకోగలుగుతుందా? ఈ కథ ఎలా ముగుస్తుంది? మొదలైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే "Raanjhanaa" చూడాలి మరి. ఈ కథకు ఈ ముగింపు సబబేనా? అన్న ప్రశ్న కలిగినా నచ్చకపోవటం మాత్రం జరగలేదు.
హిందీ జగ్రత్తగా నేర్చుకుని తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ధనుష్, 'కుందన్' పాత్రకు సరైన న్యాయం చేసాడు. impressive work! ఇదివరకూ ఇతని సినిమాలేం చూడలేదు నేను. ఇక జోయా గా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేసింది సోనమ్ కపూర్. చిలిపితనం, మంకుపట్టు, అహంకారం, వయసుతో పెరిగే పరిణితి.. అన్నిరకాల భావాలనూ జోయాగా చక్కగా చూపెట్టింది ఈ అమ్మాయి. చిత్రం చివరిభాగంలో సోనమ్ నటన ఆకట్టుకుంటుంది. చిన్న పాత్రే అయినా జస్జీత్ గా అభయ్ డియోల్ అలరిస్తాడు.
కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. రెహ్మాన్ పాటల కన్నా సీన్స్ కి సరిపడా ఇమోషన్స్ ప్రేక్షకుల్లో కూడా కలిగేలా చేసిన నేపథ్యసంగీతం చాలా బాగుంది. మొత్తమ్మీద తీసిపారేయాల్సిన సినిమా మాత్రం కాదు. కథలో, పాత్రల్లో ఏ లోపాలున్నా, మనసుని తాకే ఒక విభిన్నమైన ప్రేమకథగా మాత్రం గుర్తుండిపోతుంది. అప్పుడెప్పుడో చూసిన "Gangster" ఇలానే చాలా కాలం మనసుని కదిలించివేసింది!!
movie trailer:
9 comments:
మీ రీవ్యూ చాలా బాగుంది,కానీ కథ అంతా రాయాల్సిన అవసరం లేకుండా.... సినిమా ఆఖర్లో కుందన్ బెడ్ పైన ఉన్నపుడు వాయిస్ ఒవర్ వస్తుందే....."మళ్ళీ బతికి ఎంచేయాలి ఎవరికోసం బతకాలి....నాకు ఓపిక లేదు, మల్లీ ప్రేమించి ఒప్పించి పిచ్చివాడిలా అవడానికి ఓపిక లేదు..." అని సాగే డైలాగ్ ఒక్కటి చాలు! చాలా రోజుల తర్వాత మాంచి ఫీల్ ఉన్న సినిమా చూసానని అనిపించింది.
నాకు కూడా నచ్చింది సినిమా. కొంత నిడివి తగ్గించి ఉంటే ఇంకా బావుండేది.. మీరు రాసినది నిజం, లోపాలుండవచ్చు కానీ బావుంది..
Nice review.....thanks for posting.
చాలా కథే ఉంది తృష్ణ గారు. మీ రివ్యూ చూసి,ఇప్పుడు చూడాలనే అనిపిస్తోంది.
@narasimha: అవునండీ ఆ డైలాగ్ చాలా బావుంది.
Thanks for the visit.
@Subhadra:ఆ మాత్రం కథ ఉండాలిలెండి.. ధన్యవాదాలు.
@Padmarpita: thanks padmagaaru.
@jaya:వీలైతే చూడండి. ఎందుకొచ్చానా.. అనైతే అనుకోరు :)
ధన్యవాదాలు.
bagunadandi .
chala baaga rasarandi.indulo paatalu chaalaa nachaayi.
prema manishini entha katthinamga treat chestundi, treat chesela chestundi anadaniki... Raanjhanaa oka manchi example...
@radhika gaaru,
@mohana gaaru,
@karthik gaaru,
ధన్యవాదాలు.
Post a Comment