సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, June 27, 2013

వరంగల్ ప్రయాణం - వెయ్యిస్థంభాల గుడి




రామప్ప గుడి తర్వాత నేను అమితంగా చూడాలని ఉత్సాహపడినది ఈ వెయ్యిస్థంభాల గుడిని. 'హనుమకొండ' వచ్చాకా బస్సు డ్రైవరు ఓ చోట బస్సు ఆపి "ఆ కనబడేదే వెయ్యిస్థంభాల గుడి దిగండి.." అన్నాడు. మళ్ళీ ఏ ఆటో ఎక్కాలో, ఎన్ని మైళ్ళు నడవాలో అని భయపడుతున్న నాకు ఎదురుగా గుడి కనబడేసరికీ సంతోషం కలిగింది. ఇలా రోడ్డు మీదకే ఉందే గుడి అని ఆశ్చర్యం కలిగింది. 


రామప్ప గుడిలా కాక ఇది పూర్తిగా నల్ల రాతిబండలతో చెక్కబడింది. కానీ నిర్మాణం, గోడలపై పువ్వులు, శిల్పాలూ అన్ని అచ్చం రామప్ప గుడిలో మాదిరిగానే ఉన్నాయి. అక్కడ రాసి ఉన్న బోర్డులను బట్టి రామప్ప గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ గుడి కట్టి ఉంటారు. శిల్పులు కూడా వాళ్ళే అయి ఉంటారు. లేదా అది కట్టే సమయంలోనే ఇది కూడా మొదలెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ గుడి ఏకంగా డెభ్భైఏళ్ళు కట్టారని విన్నాను. వివరాలడగటానికి ఇక్కడ మాకు గైడ్ ఎవరూ దొరకలేదు కూడా. కానీ ఈ గుడి బాగా శిధిలమైపోయింది. రామప్ప గుడికి కాస్త బాగానే మరమత్తులు జరిగినట్లున్నాయి కానీ ఈ గుడి దుస్థితి(ఇలానే అనాలనిపించింది) చూస్తే చాలా విచారం కలిగింది :(

అత్యంత వైభవమైన చరిత్ర గల ఈ వెయ్యి స్థంభాల గుడి గురించి, కీర్తి ప్రతిష్టల గురించీ విని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నేను. నెట్లో బ్రౌజింగ్ చేసి ఫోటోలు అవీ చూసేస్తే ఉత్సాహం తగ్గిపోతుందని అలా కూడా చెయ్యలేదు. అందువల్ల వెలవెలబోతున్న గుడిని చూసి చాలా విచారపడ్డాను. ఈ గుడి ముఖ్యంగా శివుడు, సూర్యభగవానుడు, విష్ణువు ఈ ముగ్గురి ఆలయాలు కలిపిన త్రికూటాలయముట. నాలుగో వైపున రామప్ప గుడిలో ఉన్నలాంటి పెద్ద నందీశ్వరుడు అదే రూపంలో, అదే దిక్కులో ఉంటాడు. మొత్తం అలంకారం, మువ్వలు, గొలుసులూ అన్నీ సేమ్ సమ్ అన్నమాట :)





ఆకాశంలో చందమామ కనిపిస్తున్నాడా?


ఇది కూడా శిధిలంగానే ఉంది :(

త్రికూటాలయాల మధ్యలో రంగ మంటపం, పై కప్పులో ఉన్న శిల్పాలు, డిజైన్, చుట్టూరా ఉన్న నాలుగు స్థంభాలు, వాటిపై ఉన్న నగిషీ మొత్తం కూడా రామప్ప గుడిలో లాంటిదే. ఈ గుడి ఎక్కువ సార్లు ఓరుగల్లుని ఆక్రమించిన సుల్తానుల దాడికి గురైనదని విన్నాను. బహుశా రామప్ప గుడి బాగా లోపలికి ఉండటం వల్ల మరీ ఇంతగా దాడికి లోనవలేదేమో! కానీ ఎంత పగులగొట్టినా మిగతా గుళ్ళు గోపురాలు లాగ పూర్తిగా మాత్రం ధ్వంసం అవ్వలేదు ఇది. చాలా పకడ్బందీగా, ఎంతో శ్రమతో కట్టినట్లు తెలుస్తోంది చూస్తుంటే. 


గుడి ముందర ఇరువైపులా ఉండవలసిన గజాలలో ఒకటే ఉంది.అది కూడా శిధిలమైపోయి ఉంది. రెండో వైపు ఏదో త్రవ్వకాల్లో దొరికిన నందీశ్వరుణ్ణి పెట్టినట్లుగా నాకు తోచింది. అంత గొప్ప నిర్మాణం చేసినవారు ఒక వైపు గజాన్ని, మరో వైపు నందిని పెట్టరు గదా.





గుడి ఆవరణలో ఉన్న పేధ్ధ రావి చెట్టు చాలా బాగుంది. నాకెందుకో చెట్లన్నింటిలోకీ రావిచెట్టు ఇష్టం. 




గుడికి కనక్ట్ అవుతు నందీశ్వరుడి వెనకాల ఒక అద్భుతమైన నాట్య మంటపం ఉండేదట. లెఖ్ఖకు చెప్పే వెయ్యి స్థంభాలు ఆ మంటపంలోని నూరుకు పైగా ఉన్న స్థంభాలతో పూర్తి అవుతాయిట. కానీ అది బాగా శిధిమైపోయిందని అక్కడో గోడ కట్టేసి పునర్నిర్మాణం జరుపుతున్నారు. మొత్తం చూడడానికి అది ఎప్పటికి పూర్తి అవుతుందో! అసలు ఎప్పటికన్నా పూర్తి చేస్తారో లేదో తెలీదు. ఎందుకంటే కాకతీయుల భవన నిర్మాణం తాలూకూ టెక్నాలజీ చాలా గట్టిది, క్లిష్టమైనది. రామప్ప గుడిలో చూశాం కదా. అలాగనే ఇదీ ఉంది కాబట్టి ఇక్కడా సేమ్ టెక్నాలజీ వాడి ఉంటారు... తడి ఇసుక, దానిపై పీఠం మొదలైనవి. అలా చెయ్యగలరో లేదో.. అలాకాక మళ్ళీ మరోలా అంటే మనవాళ్ళు ఎలా కడతారో ఏమో!! నేనా గోడవారగా వెళ్ళి గోడ వెనుకకి చెయ్యి బయటకు పెట్టి ఓ రెండు ఫోటోలు తీసాను. "ఫోటోల సంగతి దేవుడెరుగు అంత ఎత్తు మీంచి కాలు జారితే..." అని ఇంటాయన కంగారుపెట్టకపోతే ఇంకొన్ని ఫోతోలు తీద్దును. ఇంటికొచ్చాకా ఆ ఫోటోలు చూస్తే ఆ నాట్య మంటపం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో అనిపించింది. ఇలా వచ్చాయి ఆ ఫోటోలు..

Place under reconstruction

place under reconstruction

ఇంకా గుడి చుట్టూరా అక్కడక్కడా శివలింగాలు ఉన్నాయి. 




 ఓ పక్కగా శిధిలాలు, ఇంకా తలుపులు వేసేసిన ఏవో శిధిలాలు ఉన్నాయి. గుహలో ఏమో అవి..



తీర్థప్రసాదలు తీసుకుని ఓ గట్టు మీద కాసేపు కూచుని, మేం అనుకున్న చివరి మజిలీ వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి బయల్దేరాం..

(రేపు 'భద్రకాళి ఆలయం' గురించి..)



11 comments:

Kottapali said...

నేను వరంగల్ కాలేజిలో చేరిన కొత్తల్లో ఇంకా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉండేది. ఆ రోజుల్లోనే ఆర్యీసీ ప్రొఫెసరుగారొకాయన స్వంత ఖర్చుతో ఒక పూజారి వచ్చి పొద్దునా సాయంత్రం దీపారాధన చేసే ఏర్పాటు చేశారు. తరవాతి కాలంలో ఆర్కియాలజీ వాళ్ళు చుట్టూతా ప్రహరీ కట్టి, ఈ మాత్రం శుభ్రంగా పెట్టారు. వర్షం సినిమాలో ఈ ఆలయాన్ని బాగా చూపించారు.
Good show with the pics and all. Brought back memories.

వేణూశ్రీకాంత్ said...

హ్మ్.. పరాయి పాలనలో ఇలా ధ్వంసమైన ఆలయాలెన్నో.. ఇటువంటి రెస్టొరేషన్ ప్రక్రియలు ఆలశ్యమైనా అవినీతికి పాల్పడకుండా పటిష్టంగా చేస్తే బాగుంటుంది. రిస్క్ చేసి మరీ ఫోటోలందించినందుకు థాంక్సండీ :)

తృష్ణ said...

@Narayanaswamy S.:రామప్ప గుడి కూడా అలానే ఉండేదిటండి. నీటిలో తేలే ఇటుకలను విదేశాల నూండి పరిశోధనలకి వచ్చినవారు కొట్టుకు వెళ్పోగా విరిగి, గడ్డి మొలిచి ఉండేదట గోపురభాగం. టూరిజంవాళ్ళు అజమాయిషీ తీస్కున్నాకా ప్లాస్టరింగ్ అదీ చేయించారుట.
"వర్షం" లో చూపెట్టిన ప్లేస్నే అనుకుంటా ఇప్పుడు గోడ కట్టి మూసేసారండి. మళ్ళీ అసలు సరిగ్గా కడతారో కట్టరో..:(
ధన్యవాదాలు.

@వేణూ శ్రీకాంత్: అవునండీ.. బోలెడు కోటలు, గుళ్ళూ గోపురాలు ఎన్ని ధ్వంసం అయ్యాయో.. డిగ్రీలో హిస్టరీ పాఠాల్లో ఎన్ని కథలు చదివామో!
ధన్యవాదాలు :)

Lakshmi Naresh said...

bavundi trushna gaaru... chuttu pakkala mottham illu kattesinattunanaru?

Sharada said...

ముదిగొండ శివప్రసాద్ గారి "ఆవాహన" చదివినప్పట్నించీ, ఈ ప్రదేశాలన్నీ చూడాలనీ, పిల్లలకి చూపించాలనీ బలే ఆశపడ్డాను. ఎప్పటికైనా చేస్తానో లేదో..

ఈ గుళ్ళూ, కట్టడాలూ శిథిలమవడానికి విదేశీ దండ యాత్రలతో బాటు మన అశ్రధ్ధ కూడా ఒక కారణం అనిపిస్తుంది. టూరిజం శాఖ కొంచెం మనసుపెట్టి (వాళ్ళ జేబులు నింపుకోగా మిగిలిన అడుగు బొడుగు) ధనాన్ని వెచ్చిస్తే ఇవన్నీ మళ్ళీ అందంగా చేసుకోవచ్చేమో! మన చరిత్ర మీదా, హెరిటేజ్ మీదా మనకే అభిమానమూ గర్వమూ లేనప్పుడు ఎవర్ని నిందించి ఏం లాభం?

Ennela said...

just adugudaamanukunnaa bhadra kaaLi temple ki veLLalEdaa ani! next episode lO annamaaTa..baagundi. wait chEstaa mari!

తృష్ణ said...

@పచ్చల లక్ష్మీనరేష్ :అవునండి అన్ని బిల్డింగుల మధ్యన సినిమాకు వేసిన సెట్టింగ్ లా కనబడింది చూడగానే.
ధన్యవాదాలు.

@Sharada:అయితే ఈ నవల చదవాల్సిందే. ఇందిర గారు కూడా ప్రస్తావించారు దీని గురించి.
మీరన్నది కరక్టేనండి.
ధన్యవాదాలు.

శిశిర said...

మీరు అవి చూడడం ఒక ఎత్తు. తరువాత చదివేవారికి ఆసక్తి కలిగేలా కళ్ళకి కట్టినట్టు చెప్పడం ఒక ఎత్తు. చాలా బాగా చెప్తున్నారు తృష్ణగారూ. Thank you.

Manasa Chamarthi said...

చాలా ఏళ్ళుగా పెద్ద కారణమంటూ ఏమీ లేకుండా వాయిదా పడ్డ మా ప్రయాణాల్లో ఇదీ ఒకటండీ! అసలు హైదరాబాదులో ఉంటూ వరంగల్ వెళ్ళలేని రాత ఏమిటో అని నాకెప్పుడూ అనిపిస్తూ ఉండేది (అక్కడ ఉన్నప్పుడు).

ఇప్పుడు మీ ఎంచక్కని వ్యాసం చూశాకా, ఇంకా బెంగ పెరిగిపోయింది. :)
(అన్నట్టూ ఆకాశంలో చందమామ కనిపించింది కానీ, మీ ఇంటి జాబిల్లిని ఎక్కడా చూపెట్టలేదేం! )

తృష్ణ said...

@శిశిర: ఇలా బ్లాగ్ లోచూసి ఎవరికైనా చూడాలనిపించి వెళ్తారని ఆశ + ఎప్పుడైనా చదువుకుంటే నాక్కూడా గుర్తుంటాయని స్వార్థం కూడా ఉంది :)
ధన్యవాదాలు.

@మానసా, మాదీ ఎప్పటినుండో వాయిదాపడుతూ వచ్చింది. అందుకే ఏ ప్లానింగ్ చేస్కోకుండా అలా వెళ్పోయాం.(దాదాపు అన్ని ప్రయాణాలూ అంతే మావి)
మా ఇంటి జాబిలి మా హడావిడి పరుగులనందుకోలేదని భద్రమైన చోట అప్పగించి వెళ్ళాం. మాదేమో ఎక్కే బస్సు దిగే బస్సు.. పైగా మైళ్లకు మైళ్ళు నడకలు, ఎండ, ఆకలి ఇంకా తట్టుకోగలిగే వయసు రాలేదుగా మరి!
థాంక్యూ :)

తృష్ణ said...

@ఎన్నెల: టపాలు నచ్చినందుకు ధన్యవాదాలు.