సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, June 3, 2013

వానొచ్చింది..





నిన్న సాయంత్రం...
ఆకాశం దట్టమైన నల్లని మేఘాలతో నిండిపోయింది. రోడ్డుపై వెళ్తుంటే దారిపొడుగునా వీస్తున్న చల్లని గాలి ఎగురుతున్న చున్నీ తో పాటూ మనసుని కూడా కాసేపు ఎక్కడెక్కడో ఎగరేసేసింది. గాలికి ఊగుతున్న చెట్లు, రోడ్డుపై ఎగురుతున్న ఆకులు నా పులకింతకి 'సై' అన్నాయి. వర్షం మొదలైపోతే అక్కడ చిక్కడిపోతామనిపించినా, పొద్దున్నెప్పుడో తిన్నామేమో.. బాగా ఆకలేస్తోందని ఓచోట ఆగాము. అదివరకు మేం ఉన్న ఏరియా అది. బస్టప్ ఎదురుగా ఉన్న షాప్ లో పానీ పూరీలు తిన్నాం. వేడి వేడిగా బాగున్నాయి. ఎందుకు బాగుండవు.. బాగా ఆకలి వేస్తూంటే ఏది తిన్నా అద్భుతంగానే ఉంటుంది మరి! 


పక్కనే టీ పెడుతున్నాడొక బండి అబ్బాయ్. పందార తక్కువేసి రెండు టీ చెప్పాం. కావాల్సినట్లు డికాషన్ అదీ వేయించుకున్నాం. హోటల్లో లేని సౌకర్యం ఇక్కడ దొరుకుతుంది. అక్కడ వాడిచ్చే పానకం టీ చచ్చినట్లు తాగాల్సిందే! ఇక్కడ కావాల్సినట్లు పెట్టి ఇస్తారు. టీ తీసుకుని అక్కడే గట్టు మీద కూచున్నాం. గాలి ఉధృతం పెరిగింది. కడుపు కాస్త నిండింది కదా మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది. నిరంతరం ఈగల్లా ముసిరి బుర్రలో యుధ్ధం చేసే సమస్యలు కాస్త దూరంగా జరిగాయి. ఎదురుగా ఉన్న పేద్ద వేపచెట్టు కొమ్మలు బాగా ఊగిపోతున్నాయి. ఇంత అందమైన సాయంత్రం ఈ మధ్యకాలంలో చూసి ఎరుగను. ఈసారి మంటలెక్కించిన మండుటెండలు ఒక్క చల్లని సాయంత్రాన్ని కూడా మిగల్చలేదు మరి. అప్పుడే అయిపోయిందా అనుకునేలా టీ గ్లాస్ ఖాళీ అయిపోయింది. ఆ గట్టు మీద ఇంకో అరగంట అయినా అలానే కూచోవచ్చు. అంత అందంగా ఉందా వాతావరణం. కానీ ఇంకా కూరల మార్కెట్ కి వెళ్ళాలి... మళ్ళీ బండేక్కాం!


మెయిన్ రోడ్డు మీదకి వచ్చామో లేదో చిరుజల్లు మొదలైంది. నెమ్మదిగా టప్ టప్ మని వాన చినుకులు చురుక్కుమని మొహాన్ని తాకడం మొదలెట్టాయి. బండి మీద వెళ్తూంటే మొహంపై పడే వాన చినుకులు భలే చురుక్కు మనిపిస్తాయి..! ఆపనా అని అడిగారు అయ్యగారు. ఇన్నాళ్లకు ఆకాశం కరుణిస్తోంది కదా వద్దు.. పోనీమన్నాను. ఇలా చిరుజల్లులో తడుసుకుంటూ బైక్ మీద వెళ్ళిన ఆనందం బస్సు లేదా కారు ఇవ్వగలదా? కూడా ఉన్న లగేజ్ ఇంట్లో పడేసి, మళ్ళీ రైతు బజార్ వైపు బయల్దేరాం. ఈసారి బయల్దేరే లోపూ తనకేదో ఫోనొచ్చింది. అబ్బా..మాయ ఫోన్ కాల్ ఎంతకీ అవ్వదు..! ఆ ఫోన్ కాల్ అయ్యేసరికీ వర్షం పెరిగిపోయింది. రెండు నిమిషాలు ఆగి నిలబడితే తల తడిసేంత వాన. అయినా సరే పోదాం.. వాన బాగుంది అనుకున్నాం. ఈసారి వేసవి అంతలా ఏడిపించింది మరి. 


మార్కెట్కెళ్ళే దారిలో ఒక గుడి ఉంది. మధ్యలో గుళ్ళోకి కూడా వెళ్ళాం. వాన వల్ల ఎవ్వరూ లేరు. అలా ప్రశాంతంగా ఖాళీగా ఉన్న గుడి కూడా చాలా బాగుంది. గుడి మధ్యలో వర్షానికి తడిసిన రావి ఆకులు, ఒరిగిన పసుపచ్చని సువర్ణ గన్నేరు పూల కొమ్మలు మరింత అందంగా కనబడ్డాయి. రైతు బజార్లో వాన పడి కూరలన్నీ చక్కగా మెరుస్తున్నాయ్. ప్రభుత్వం ఏదో ఆఫర్ పెట్టిందని వంద రూపాయలకి తొమ్మిది రకాల కూరలు అని మైక్ లో అరుస్తున్నారు. జనాలు గుంపులుగా అక్కడ చేరి సంచీలు కొనుక్కెళ్తున్నారు. ఆఫర్ బావుందనిపించి నేనూ ఓ వంద రూపాయల సంచీ కొన్నాను. ఇప్పుడు రోజుకి ఐదువందల సంచీలు అమ్ముతున్నారుట. బాగా అమ్ముడయితే ఇంకా ఎక్కువ సంచీలు పెడతామని చెప్పారు. తాజాగా ఉన్నాయి కూరలు. ఇంకా కొన్ని ఆకుకూరలు అవీ కొనేసి ఇంటిదారి పట్టాం. అప్పటికి వర్షం కాస్త తెరిపిచ్చింది. 

వందకి ఇన్నంటే మంచి ఆఫరే!

మా ఇంటికెళ్ళే దారిలో ఒక రెండు కిలోమీటర్లు దాకా అటు ఇటూ చెట్లే ఉంటాయి. ఎండలకి అవన్నీ ఈ రెంణ్నెళ్ళుగా ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క వర్షానికే ఆకులు నిలబడి పచ్చగా కనిపిస్తున్నాయి.  క్రిందటేడు మేం వచ్చిన కొత్తల్లో గమనించాం. నాలుగు వర్షాలు పడగానే ఇదంతా అడవిలా గుబురుగా పెరిగి మరింత పచ్చాగా అయిపోతుంది. పచ్చని చెట్ల మధ్యన అడవిలోంచి వెళ్తున్నట్లు మెయిన్ రోడ్ దాకా రావడమొక చక్కని అనుభూతి. ఇంక వర్షాకాలం వచ్చేసినట్లే కాబట్టి ఆ నాలుగు వర్షాలు ఎప్పుడు పడతాయా... మా అడవి ఎప్పుడు తయారవుతుందా.. అని ఎదురుచూడటమే!!

12 comments:

శిశిర said...

:) బాగున్నాయి మీ అనుభూతులు.

MURALI said...

బాగా అడవి పెరిగాక ఒక ఊసెయ్యండి మేమొచ్చి పిక్‌నిక్ చేసుకుంటాం.

శ్రీలలిత said...


వేసంకాలం వెళ్ళాక మొదటి వర్షంలో తడిసే అనుభూతి అపురూపమైనది. అటువంటి చక్కటి అనుభూతిని ఎంతో బాగా వర్ణించినందుకు అభినందనలు...

PRASAD said...

తృష్ణ గారూ, చాలా బాగుంది. మీ వూళ్ళో కురిసిన వానలో తడిసిన అనుభూతి మాకు కూడా కలిగించారు. ఇంతకీ హైదరబాదు లో యే ప్రాంతం అది ?

....ప్రసాద్ శర్మ, హైదరాబాదు.

Unknown said...

బాగున్నాయి మీ వర్షం లో ప్రయాణం కబుర్లు .మాకు ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి.

Indira said...

వానమీద బాగుంది టపా!!అసలే ఎనాళ్ళకో కురిసినవాన,అందులో పక్కన తృష్ణుడుగారు, చిన్నసైజు చిట్టడివిలాంటి మీఏరియా,అందులోనూ బండిమీద సవారి ఇంక ఏంకావాలి మీకు ఈరోజుకి?

Dantuluri Kishore Varma said...

వర్షపుగాలిలాంటి బహుచక్కని టపా!

తృష్ణ said...

@శిశిర: థాంక్యు :)
@MURALI: ఆ ఆడవి చూడ్డానికేనండోయ్.. ఆ రోడ్డు మధ్యలో రెండు నిమిషాలు నిలబడాలన్నా భయమేస్తుంది.
@శ్రీలలిత: ధన్యవాదాలండీ :)

తృష్ణ said...

@PRASAD: ఈ ఆదరాబాదరా ఊళ్ళో ఓ మారుమూల అండీ..:)
@Unknown:Hope u r enjoying the monsoon.
@Indira: :-))
@Dantuluri Kishore Varma:ధన్యవాదాలు వర్మ గారూ.

Sujata M said...

How Romantic !!! :D Bavundi.

తృష్ణ said...

@sujata: thanQ..:)

Balu said...

బాగున్నాయండీ మీ వర్షం కబుర్లు. ఫోటో కూడా చాలాబాగుంది.