ప్రియాతి ప్రియమైన నీకు...
ఇన్నేళ్ల తరువాత ఈ పిలుపేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? మరి ఇలా తప్ప మరోలా మనం ఒకరినొకరం సంబోధించి ఎరుగుదుమా?! మనుషులం దూరం అయిపోయినా నువ్వు నా దగ్గరగానే ఉన్నావుగా ! ఇలా తప్ప మరోలా ఎలా పిలువను నిన్ను? ఎప్పుడన్నా నీకు నేను గుర్తుకు వస్తానేమో.. ఒక్కసారన్నా నీ ఉత్తరం వస్తుందేమో అని ఇన్నేళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నాను.. నువ్వు రాయలేదని నేను ఊరుకోలేనుగా.. అందుకే ఇవాళన్నా నిన్ను పలకరిద్దామని మొదలెట్టాను...
కానీ..ఎక్కడ మొదలెట్టాలో తెలీట్లేదే...
సిటి బస్సులో మన మొదటి పరిచయం అయిన దగ్గర నుంచా?
ఆ పరిచయం చిగురులు తొడిగి అందమైన స్నేహంగా మారిన దగ్గరనుంచా?
కాలేజీ అయిన దగ్గర నుంచా?
నువ్వు యూనివర్సిటీకి వేరే ఊరెళ్ళిన దగ్గరనుంచా?
నీ పెళ్ళి అయిన దగ్గర నుంచా.. నా పెళ్ళి అయిన దగ్గర నుంచా?
సంసారంలో కొట్టుకుపోయి నన్ను నేను మర్చిపోయిన దగ్గర్నుంచా?
ఉద్యోగబాధ్యతల్లో పడి నువ్వు నన్ను మర్చిపోయిన దగ్గర్నుంచా?
ఎక్కడ్నుంచి మొదలెట్టాలో తెలీట్లేదు...
"గొప్ప స్నేహితురాలివి నువ్వు..." అన్న నీ మాటలు.. కడగళ్ల వాకిట్లో నే నిలబడినప్పుడల్లా నా చెవులకు వినబడి నాకు ఓదార్పునిస్తునే ఉంటాయి. రేడియోలోనో, సిస్టంలోనో ఏ స్నేహగీతమో వినబడినప్పుడల్లా నీ జ్ఞాపకం నన్ను తడుముతూనే ఉంటుంది. తను నాకు తోడుగా నిలబడ్డ ప్రతిసారీ... 'don't worry yaar..something best is in store for you' అన్న నీ మాటలు వినబడి కళ్ళు చెమ్మగిల్లుతాయి. చీర కట్టుకున్నప్పుడల్లా.. మొదటిసారి నువ్వు,నేను చీరలు కట్టుకుని కాలేజీలో అడుగుపెట్టి ఆపసోపాలు పడిన రోజు గుర్తుకొచ్చి నవ్వుకుంటాను. ఇప్పుడు గుల్జార్ పాటలు వింటూ మైమరిచే నేను.. అప్పట్లో గుల్జార్ గొప్పని నువ్వూ, జావేద్ అఖ్తర్ గొప్పని నేను చేసుకున్న వాదనలు తల్చుకుని నవ్వుకుంటాను :) వర్షం వచ్చినప్పుడు... నువ్వు, నేనూ ఒకే గొడుగులో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన మధురక్షణాలు తలుచుకుంటాను. "నిన్ను మర్చిపోయిన స్నేహితురాలిని అంతగా తలుచుకోవాలా..." అని తనన్నప్పుడల్లా... నువ్వు నాకెంత ప్రియమైనదావివో తనకు చెప్పలేక సతమతమౌతాను...
శలవులకు నువ్వు వచ్చినప్పుడు నీకిష్టమని జిలేబీ చేసి; అప్పటికి నేనింకా సంపాదించట్లేదని అమ్మను రిక్షాకు డబ్బులడగటానికి నామోషీ వేసి, మీ ఇంటికి నేను నడుచుకుంటూ వచ్చివెళ్ళినప్పుడు నీ కళ్లలో కనబడ్డ ఆనందం, గర్వం.. చెమ్మగిల్లిన నీ కళ్ళు.. నాకింకా జ్ఞాపకమే. మన స్నేహానికి శ్రీకారం చుట్టిన ఎన్.సి.సీ కేంప్ నుండి నువ్వు నాకు రాసిన మొదటి ఉత్తరం, ఆ తర్వాత కాలేజీలో కూడా క్లాసు జరుగుతుండగా మనం రోజూ రాసుకున్న కాగితపు కబుర్లు, ఫోన్ లో గంటల కొద్దీ పంచుకున్న ఊసులు, ఇచ్చిపుచ్చుకున్న గ్రీటింగ్స్, గిఫ్ట్స్, మార్చుకున్న అలవాట్లు గుర్తున్నాయా? నువ్వు ఎన్.సి.సీ కేంప్ లకు, డిబెట్లకు వెళ్ళినప్పుడు మిస్సయిన నోట్స్ లన్నీ నేను రాసిపెడుతుంటే క్లాసులో అంతా ఎంత కుళ్ళుకునేవారో.. నీకొచ్చిన ఫస్ట్ ప్రైజ్ లు,బహుమతులు చూసి నేనంత సంతోషపడేదాన్నో! మన సాన్నిహిత్యాన్ని చూసి కాలేజీలో ఉన్న నీ ఫ్యాన్స్ ఎంత అసూయపడేవారో గుర్తుందా? ఎవరితోనూ పంచుకోని సంగతులు, స్వవిషయాలూ నువ్వు నాతో చెప్పుకున్నప్పుడు నేనంటే ఎంత నమ్మకమో అని సంతృప్తిగా ఉండేది. నీతో కలిసి సినిమాలకు వెళ్లటం, మీ ఇంటికి రావటం ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించేది నాకు. నీలాంటి టాపర్, బ్రిలియంట్ స్టూడెంట్ నా క్లోజ్ ఫ్రెండ్ కదా అని నేను గర్వంగా అంటుంటే, నువ్వేమో నీలాంటి నిజాయితీగల నమ్మకమైన స్నేహితురాలు దొరకటం నా అదృష్టం అనేదానివి..! యూనివర్సిటీ హాస్టల్లో చేరిన కొత్తల్లో "ఇక్కడందరూ అవసరాల కోసమే స్నేహం చేస్తారు. నిజాయితీగా ఏదీ ఆశించకుండా స్నేహం చేసేవారు ఒక్కరూ లేరు... యు ఆర్ మై గ్రేటేస్ట్ ఫ్రెండ్.. మై డియర్.. ఐ మిస్ యూ ఎ లాట్..." అని నువ్వు రాసిన వాక్యాలు నేను మర్చుపోలేదింకా.. ఆ ఉత్తరంతో నువ్వు పంపిన నీ బ్లాక్&వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నా అడ్రస్ బుక్ లో ఇంకా అలానే ఉంది...
సరే గానీ, అసలు ఇప్పుడెందుకు ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చాయని అడుగుతావా? అలా అడిగితే ఏం చెప్పను? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన స్నేహితురాలిని గుర్తుకుతెచ్చుకోవటానికి కారణాలు ఉంటాయా? తెలిసీ తెలియని వయసులో మనం పంచుకున్న మధురక్షణాలు, చెప్పుకున్న ఊసులు, చేసుకున్న వాగ్దానాలు, కలిసి పొందిన ఆనందాలు నా మనసులో ఇంకా సజీవమేననీ.. అవి మన మధ్య పెరిగిన దూరాన్ని నాకు కనబడనియ్యవని ఎవరికైనా ఎలా చెప్పను? ఇంత పిచ్చేమిటే నీకూ అని నవ్వుతారు కదా! ఒక్కసారి నీకు ఫోన్ చేసి ఎలా ఉన్నావే? అని అడగాలని, నిన్ను చూడాలనీ ఉందని నీకు ఎలా చెప్పను?
ఇంతసేపూ కూర్చుని రాసిన ఈ ఉత్తరం నీకు పోస్ట్ చేసాకా, నీ జవాబు రాకపోతే?? అందుకే ఇన్నేళ్ళుగా నీకు రాసి కూడా పోస్ట్ చెయ్యని ఉత్తరాల్లాగ, ఈ ఉత్తరాన్ని కూడా నీకు పోస్ట్ చెయ్యకుండానే దాచేస్తున్నా...
15 comments:
చాలా బాగుంది. నా స్నేహితులని గుర్తు చెస్కున్నాను.......
Excellent andi.. chaala bagga raasaru... idi chaduvuthunnantha sepu.. prana snehithulu madilo medilaaru..
చాలా బాగా వ్రాసారు తృష్ణ గారూ !మీ స్నేహితురాలు నిజంగానే మిమ్మల్ని .మిస్ చేసుకుంటున్నారు .ఈ టపా ఆవిడ చూసే అవకాశం ఉంటే బాగుండును .
మనసులోంచి వచ్చిన మాటలు కదూ ఇవి.!!!
entha realistic ga rasarandi na friends ni miss avuthunnanu ani nenu entha ga feel avuthunnano aa badha antha mi aksharalaloo kanipinchindi...
తడిసిన జ్ఞాపకం...పరిమళాలు పంచే రోజు రావాలని కోరుకుంటున్నాను తృష్ణ గారు.
స్నేహితులందరిని ఒక్కసారి గుర్తుచేశారు తృష్ణ గారు.
మీ స్నేహం మళ్ళీ మునుపటిలా తిరిగి చిగురించాలని కోరుకుంటున్నా.
బాగారాశారు అనేది చాలా చిన్న ప్రశంశ!కాలేజి రోజుల్లోని గాఢస్నేహం కూడా తరువాతతరువాత కాలమానపరిస్థితులబట్టి కొంత దూరమయినా నివురుకప్పిన నిప్పులా అదెక్కడికీ పోదు.బాధ్యతల బంధాలు కొంత సడలగానే తిరిగి పొద్దుతిరుగుడుపూవులా మనసు అప్పటిమిత్రులవైపు మనప్రమేయం లేకుండానే తిరుగుతుంది.సంతోషంగా వుండండి తృష్ణా!!
జ్ఞాపకాల తేనెతుట్టెని కదిలించారు తృష్ణ గారు. మీ అమూల్యమైన స్నేహం గురించి తెలుసుకోడం బాగుంది.
ఎంతందంగా రాస్తారో మీరు....చదువుతూనే ఉండాలనిపిస్తుంది.
Hmmmmm :(((((((((((((((
మనసుమీ పెనవేసుకున్న స్నేహబంధం అండి చాలా చాలా బాగా రాశారు తడిసినా కరిగిపోని జ్ఞాపకమే ఎప్పటికి
మీ "తడిసిన జ్ఞాపకం" గుండెను తడిమింది తృష్ణ గారు. చాలా చాలా చాలా బాగా రాశారు.
Sweet! Very touching..
ఈ టపా మెచ్చిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
Post a Comment