విడిగా రాయటం కుదరట్లేదని ఈమధ్యన చూసిన రెండు సినిమాల గురించి ఒకే టపాలో రాసేస్తున్నా..
1. Lootera - a beautiful painting !
నిజంగా ఒక అందమైన చిత్రం ఇది. ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పైంటింగ్ లాగ ఉంది. ఫోటోగ్రఫీ అద్భుతం. 1950s ప్రాంతానికి సంబంధించిన ఒక బెంగాలి జమిందారు, అతని కూమార్తె తాలుకూ కథ "లుటేరా". ఆ కథకు తోడుగా, ప్రఖ్యాత ఆంగ్ల కథకుడు ఓ.హెన్రీ కథానిక "The Last Leaf" కధను ఈ సినిమా రెండవ భాగంలో వాడుకున్నారు.
ఈనాటి ఫాస్ట్ ఫార్వార్డ్ కాలంలో ఇలాంటి స్లో సినిమాను తీసినందుకు దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. విక్రమాదిత్య మోత్వానికి తన రెండవ సినిమా కూడా అవార్డుల వర్షం కురిపించేస్తుంది అనిపించింది. అసలు చిత్రం షూటింగ్ కి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయిట. షూటింగ్ కాన్సిల్ అయి, బోల్డు డబ్బు వృధాపోయిందిట. అయినా మళ్ళీ మంచు ప్రాంతపు లొకేషన్ సెట్టింగ్స్ వేసి మరీ పూర్తిచేసారుట సినిమాను.
కథాంశం పాత తరానికి చెందినది కాబట్టి నాయికా నాయకుల వస్త్రధారణ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా వాడారు. నాయిక "పాఖీ" పాత్రను 'సోనాక్షి సిన్హా' గుర్తుండిపోయేలా, సమర్థవంతంగా పోషించింది. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనచ్చు. అసలీ కాలంలో కనబడుతున్న తాటాకుబొమ్మల్లాంటి వీరోవిన్నుల్ని చూసి చూసి కళ్ళు కూడా సన్నబడిపోయాయేమో, తెరపై నిండుగా, బొద్దుగా, ముద్దుగా, సిన్మా మొత్తం చీరకట్టులో కనబడ్డ ముద్దుగుమ్మ నిజంగా మనసుని దోచేసింది. ఆమె ముక్కు మాత్రం కాస్త చెక్కేసినట్లు ఉంది గానీ పిల్ల అందంగానే ఉంది. నాయకుడు పాత్ర కాస్త నెగెటివ్ షేడ్ ఉన్నది కాబట్టి 'రన్వీర్ సింగ్' మొహం సరిగ్గా సరిపోయింది అతని పాత్రకి.
పరమ స్లో టేకింగ్! కొన్ని సీన్స్ లో నాకే బోర్ కొట్టింది ఇంకా కెమేరా కదపడేంటి? ఏం చెప్తాడు ఇంకా? అని. (ముఖ్యంగా కొలను దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సీన్ లో.) కొత్త సినిమాల్లోని హడావుడి డైలాగులతో, షాట్స్ తో, ఫైటింగులతో, సీన్ లో అంతమంది ఎందుకున్నారో కూడా తెలియని గుంపు బంధుత్వాలతో, లేనిపోని ఆర్భాటాలతో విసిగిపోయి ఉన్నామేమో చిత్రం లోని స్లో టేకింగ్ ని, అతితక్కువ పాత్రల్ని కూడా ఎంజాయ్ చేసాము మేము. స్టేజ్ ఫిఫ్టీస్ లోది కదా అందుకని టెకింగ్ కూడా అప్పటి సినిమాల మాదిరిగా తీసారేమో అనుకున్నా.
సంగీత దర్శకుడు 'అమిత్ త్రివేది', పాటల రచయిత 'అమితాబ్ భట్టాచార్య' ల కాంబినేషన్ బాగా కుదిరినట్లుంది. వీరిద్దరి జోడీలో వచ్చిన పాటలన్ని బాగుంటున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. 'SAWAAR LOON' పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట గురించి ఈ టపాలో చూడవచ్చు: http://samgeetapriyaa.blogspot.in/2013/07/sawaar-loon.html
ఈ 'మన్నర్జియా' పాట కూడా బాగుంది..
అసలు ట్రాజడీల జోలికి వెళ్ళని నేను ఒక రొమాంటిక్ ట్రాజెడిని మొదటిసారి ఎంజాయ్ చేసాను. బహుశా హీరో చెడ్డవాడు కాదు, ఆమెను మోసం చెయ్యలేదు నిజంగానే ఆమెను ప్రేమించాడు అన్న సాటిస్ఫాక్షన్ వల్లనేమో! ఇంత మంచి సినిమాను నాకు చెప్పకుండానే టికెట్లు బుక్ చేసేసి చూపించినందుకు 'తుమ్ పర్ లగాయీ మేరీ సారీ షికాయెతే మాఫ్' అనేసా శ్రీవారితో :-)
ఈ సినిమా ట్రైలర్:
2. సాహసం - విఠలాచార్య రంగుల సినిమా
మన 'జానపద బ్రహ్మ' విఠలాచార్య సినిమాలు చూసినప్పుడల్లా.. అసలు ఈయనకు ఇప్పటి టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందుబాటులో ఉండి ఉంటే స్పీల్బర్గ్ ను మించిన అద్భుతాలు సృష్టించేవాడు కదా అనుకుంటూ ఉంటాను. ఇంకా, ఇప్పుడెవరూ ఇలాంటి సినిమాలు తియ్యరేమని దిగులుపడుతుండేదాన్ని. ఇన్నాళ్లకి ఆ సరదా తీరింది. ఈ సినిమా రెండవ భాగంలో గుడి లోపల సీన్లు చాలా బాగా వచ్చాయి. మళ్ళీ విఠలాచర్య సినిమా చూసినంత ఆనందం కలిగింది. ఆ తలుపులు, పాత నిర్మాణాలూ, సెట్టింగ్స్ అంతా కూడా అద్భుతంగా వచ్చాయి.
'శ్రీ' చాలా రోజులకు సంగీతాన్ని అందించారు బాగుంటాయి పాటలు అనుకున్నా కానీ పాటలు పెద్ద గొప్పగా లేవు. అసలు ఆ పాటలు కూడా ఏదో పేట్టాలి కాబట్టి పెట్టినట్లు ఉన్నాయి. అవి లేకపోయినా బాగుండేది సినిమా. అయితే 'నేపథ్యసంగీతం' మాత్రం చాలా బాగా చేసారు. సన్నివేశాలకు ప్రాణం పోసేది నేపథ్యసంగీతమే మరి!
ఈ సినిమాలో వీరోవిన్ను ని మొదటిసారి కాస్త భరించగలిగాననిపించింది. వెకిలి కామిడీ ట్రాక్ లేకపోవటం హాయి నిచ్చింది. పెద్ద సెక్యూరిటి ఆఫీసర్ గా అలీని పెట్టడం బాగుంది కానీ అంత పెద్ద ఆఫీసర్ అని చెప్తూ అలా పిరికివాడిగా చూపించటం నచ్చలేదు నాకు.
సినిమా అయ్యాకా ఒక దిగులు మొదలైంది.. ఇది బాగుంది కదా అని ఇలాంటివే మరో పాతిక సినిమాలు వచ్చేస్తాయేమో అని !!
4 comments:
బాగున్నాయండీ మీ రివ్యూలు :) లుటేరా డివిడ్ కోసం ఎదురు చూస్తున్నా.. సాహసం నాకు కూడా నచ్చింది.
మీరు "స్వర్నకమలం" సినిమ చుసార? 25 సంవత్సరాలు క్రితం విదుదల ఐయింది.
@venu gaaru,థాంక్స్ అండి.లుటేరా మిస్సవకండి. బాగుంది. సాహసం గురించి మీ రివ్యూ చూసానండి. బాగా రాసారు.
@Andhraman:'స్వర్ణకమలం'నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటండి. నా ప్రొఫైల్లో ఇష్టమైన సినిమాల లిస్ట్ లో ఉంటుంది. ఆ సినిమా గురించి మొన్న సాక్షిలో వచ్చిన వ్యాసం:
http://www.sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=65614&Categoryid=2&subcatid=26
thanks for the visit.
Please share for our future
https://www.change.org/en-IN/petitions/government-of-india-ministry-of-finance-department-of-financial-services-not-to-keep-a-criteria-of-60-marks-in-grad-for-hring-of-officers-in-psbs#share
Post a Comment