సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, September 22, 2010

"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ !!


"మనసుగతి ఇంతే.." పాటకు పేరడీ సరదాగా రాద్దామనిపించింది...చదివి నవ్వుకోండి..!!

బ్లాగరు బ్రతుకింతే
బ్లాగు కథ ఇంతే
బ్లాగున్న మనిషికీ
తృప్తిలేదంతే

పోస్ట్ రాస్తే ఖూషీరాదు
వ్యాఖ్య కోసం ఆశపోదు
రాసే చేతికి అదుపులేదు
రాయకపోతే శాంతిలేదు

అంతా చదువుతారని తెలుసు
అయినా వ్యాఖ్య రాయరని తెలుసు
తెలిసీ చూసే ఎదురుచూపులో
తీయదనం బ్లాగరుకే తెలుసు

మరుజన్మ ఉన్నదోలేదో
ఈ బ్లాగులప్పుడేమౌతాయో
బ్లాగరు కథయే ఓ ప్రహసనం
బ్లాగరెలా వదుల్చుకుంటాడీ వ్యసనం

***** ****** *****

అసలు పాట ఇక్కడ వినండీ..


Monday, September 20, 2010

సలీల్ చౌదరి మాట...అంతరా చౌదరి పాట


"అంతరా చౌదరి" ప్రముఖ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి కుమార్తె. ఆమె చిన్నప్పుడు "మీనూ" అనే అమోల్ పాలేకర్ తీసిన హిందీ చిత్రంలో "తేరీ గలియోంమే హమ్ ఆయే.." అనే పాటను పాడించారు. శాస్త్రీయంగా హిందుస్తానీ తో పాటుగా వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకున్న ప్రతిభగల కాళాకారిణి. పాటలకు బాణీలు సమకూర్చగలరు. ఆమె పియానో కూడా చక్కగా వాయించగలరు. బెంగాలీలో పిల్లల పాటలతో ఆమె ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేసారు. అయితే ప్రతిభ ఉన్నా కూడా, పిల్లల పాటలు పాడే గాయని అనే ముద్ర నుంచి తప్పుకోలేకపోయారు. అయితే గాయనిగా ఆమె తన తండ్రి దగర ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు.



నా చిన్నప్పుడు ఒకసారి డిడి-1లో సి.పి.సివాళ్ళు ప్రసారం చేసిన సలీల్ చౌదరీ ఇంటర్వ్యూ ప్రసారమైంది. అన్నింటిలానే అది కూడా రికార్డ్ చేసాం. సలీల్ చౌదరీ సంగీతం అంటే ప్రత్యేకమైన ఇష్టం నాకూ, నాన్నకూ. అందంగా, పాడటానికి సులువుగా ఉంటూనే ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఆయన ట్యూన్స్. ఆయన సంగీతం సమకూర్చిన పాటలు నేర్చుకోవటం అంత తేలికైన పని కాదు. ఇంతకీ ఆ కార్యక్రమంలో ఆయన స్వరపరిచిన కొన్ని ప్రైవేట్ గీతాలను వినిపించారు. ఎన్ని సార్లు ఆ కేసెట్ మొత్తం వినేవాళ్ళమో లెఖ్ఖ లేదు. వాటిల్లో అంతరా చౌదరి పాడిన ’బీత్ జాత్ బర్ఖా రుత్, పియ న ఆ..యేరీ...’ అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట సంగీతం, సాహిత్యం రెండూ చాలా అద్భుతంగా ఉంటాయి.

ఈ పాటను "మధుర్ స్మృతి" అనే ఆల్బమ్ లో రిలీజ్ చేసారు. కానీ అది బయట దొరకలేదు నాకు. నా దగ్గర ఉన్నది డిడి లోంచి రికార్డ్ చేసుకున్న పాట మాత్రమే. పాటను ఆసక్తి ఉన్నవాళ్ళు క్రింద వినండి. మొదట్లో ఉన్నది సలీల్ చౌదరి
ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు...

పాపం వినాయకుడు..!!


కొన్నాళ్ళ క్రితం ఒక రాత్రి మా ఇంటికి ఐదారిళ్ళ అవతల డాబా మీద ఒక పార్టీ జరిగింది. అలా చాలా జరుగుతూ ఉంటాయి, అర్ధరాత్రి దాటాకా లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేసేస్తూంటారు. కానీ ఆ రోజు పన్నెండు, ఒంటిగంట, రెండు అయినా ఆ పార్టీ అవలేదు. లౌడ్ స్పీకర్లో అలా భీకర శబ్దాలు(వాళ్ళ దృష్టిలో అది పార్టీ మ్యూజిక్ అన్నమాట) వస్తూనే ఉన్నాయి. పిచ్చి పిచ్చి పాటల ఆ విపరీతమైన సౌండ్ వల్ల ఇంటిల్లిపాది నిద్రకు చాలా ఇబ్బంది కలిగింది. మావారు ఇక ఆగలేక "ఫలానా ఏరియలో పార్టి....ఈ ఏరియాలో అందరికీ ఇబ్బంది కలిగిస్తోంది" అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కాసేపటికి పోలీస్ వ్యాన్ సైరను వినబడింది, పార్టీ ఆగింది. ప్రభుత్వం అర్ధరాత్రి లౌడ్ స్పీకర్స్ పెట్టరాదు, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడదు అని ఎన్ని రూల్స్ పెట్టినా ఉపయోగంలేదు. ఎక్కడో అక్కడ ఇలా లౌడ్ స్పీకర్స్ వల్ల చుట్టుపక్క జనాలకు చికాకు కలుగుతూనే ఉంది.


నిన్న రాత్రి అలానే కాస్తంత దూరంలో మళ్ళీ పెద్ద సౌండ్లో పాటలూ గట్రా వినబడ్డాయి. స్కై షాట్స్ అవీ కాల్చారు. కానీ పన్నెండు దాటినా ఇంకా పాటలు ఆగలేదు.నిద్ర పట్టడం లేదు. ప్రాంతీయ జానపద పాటలు, కొత్త సినిమా పాటలు ఒకటేమిటి అన్నిరకాలూ వినబడుతున్నాయి. "ఎందుకే రమణమ్మా....", "రింగ రింగా...." ఇంకా ఏవో. కాసేపయ్యాకా మళ్ళి "రింగ రింగా..." అంటూ ఇంకా పెద్దగా వినబడింది. ఏదో పెళ్ళి కాబోలు అనుకున్నాము. ఊరేగింపు దగ్గరకు వచ్చినట్లుంది, కిటికీలు మూసేస్తే కాస్తైనా సౌండ్ తగ్గుతుంది అని కిటికీ దగ్గరకు వెళ్ళాను. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఊరేగింపు వెళ్తోంది. మధ్య మధ్య ఆగి మైక్లో పాడుతూ వెళ్తున్నారు. గుంపుకి మధ్యన ఓపెన్ వ్యాను, అందులో వినాయక విగ్రహం....!! మతిపోయింది. నాకీ నవరాత్రి ఉత్సవాలు వద్దు బాబోయ్...ఇంకా పారిపోకుండా వినాయకుడు అందులోనే ఉన్నాడా? అని ఆశ్చర్యం కలిగింది... !


ఆ తరువాత "పాపం వినాయకుడు..!" అనిపించింది. జనాల మీద కోపం వచ్చింది. వాడ వాడలాదేవుడి పూజ చేస్తున్నారు. బాగుంది. సుభ్భరంగా భక్తి పాటలో, భజనో చేయకుండా ఈ చెత్త పాటలేమిటి? నేను విన్నది ఒక్కచోటే. ఇలాంటివి ఇంకెన్ని చోట్ల జరుగుతున్నాయో. చిన్నప్పుడు రామనవమి పందిళ్ళలోనూ, ఈలాటి గణేశనవరాత్రి రోజుల్లోనూ మైకుల్లో సినిమా పాటలు పెట్టడం ఎరుగుదును. కానీ ఇలా రోడ్డు మీద పబ్లిగ్గా రింగా రింగా పాటలు పాడుతూ నిమజ్జనానికి తీసుకువెళ్ళటం ఇదే మొదటిసారి నేను చూడటం. ఇంతకన్న ఘోరం లేదు అనిపించింది...ప్చ్...! పోలీసు బందోబస్తుల మధ్యన, అల్లర్ల మధ్యన, నిమజ్జనం అంటే ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకుని రోడ్డేక్కే జనాలను చూసి, చెత్త సినిమాపాటల ఊరేగింపుల మధ్యన...పాపం వినాయకుడు...అని మరోసారి నిట్టూర్చాను. అంతకన్నా చేసేదేముంది ఇలా బ్లాగ్ లో ఘోషించటం తప్ప...!!



ఒక సైట్లో కనబడిన ఈ జోక్ బాగుందని ఇక్కడ పెడుతున్నను. ఈ ఫొటో ప్రచురణపై ఎవరికన్నా అబ్యంతరాలుంటే తొలగించబడుతుంది.






Saturday, September 18, 2010

లీలానాయుడు




ఆమె ఒక మనోహరమైన స్త్రీ. ఒక కథ. ఒక జ్ఞాపకం. భారతదేశ చలనచిత్ర జగత్తలో ఒక వెలుగు వెలిగిన అలనాటి అందాల నటీమణి లీలానాయుడు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి కి చెందిన ప్రముఖ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రామయ్య నాయుడు గారి కుమార్తె లీలానాయుడు. తల్లి ఫ్రెంచ్ దేశస్తురాలు.1954లో మిస్ ఇండియా గా ఎన్నుకోబడింది. అప్పట్లో "వోగ్" అనే పత్రికవారు ప్రపంచంలోని పదిమంది అత్యంత సుందరీమణూల్లో ఈమెను ఒకతెగా ప్రకటించారు. ఆమె మొదటి చిత్రం హృషీకేష్ ముఖర్జీ తీసిన "అనురాధ(1960)". నాకెంతో ఇష్టమైన సినిమాలలో అది ఒకటి. ఆ సినిమాకు ఆ సంవత్సరంలో నేషనల్ అవార్డ్ కూడా లభించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమెకు నటిగా పేరును తెచ్చిపెట్టింది. ఆమె ఆంగ్ల నటి "సోఫియా లారెన్" తో పోల్చబడింది కూడా.

తరువాత 1962లో ఆమె "ఉమ్మీద్" అనే చిత్రం చేసారు. వివాదాస్పదమైన నానావతి మర్డర్ కేస్ ఆధారంగా చిత్రించిన "యే రాస్తే హై ప్యార్ కే(1963) సినిమాలోని ఆమె నటన దేశవ్యాప్తంగా గుర్తింపుని, మన్ననలనూ పొందింది. అదే సంవత్సరంలో లీలానాయుడు జేమ్స్ ఐవొరీ తీసిన "ద హౌస్ హోల్డర్" అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆమెకు ఎంతో ప్రతిష్ఠను సంపాదించిపెట్టింది.

సత్యజిత్ రాయ్ కూడా ఆమె నటనను ఎంతో ప్రశంసించి "ద జర్నీ" అనే సినిమా తీయాలని సంకల్పించారు కానీ చేయలేకపోయారు. రాజ్ కపూర్ ఆమెతో చిత్రాలు తీయాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతారు. ఒకసారి ఒప్పుకుని సెట్స్ కు కూడా వెళ్ళి ఆ తరువాత మరో నాలుగు చిత్రాలకు బాండ్ రాయటానికి ఇష్టపడక షూటింగ్ విరమించుకుని వెళ్ళిపోయరుట. "ద గురు(1969)" అనే సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించిన తరువాత లీలానాయుడు నటించటం మానివేసారు.

ఇరవైయేళ్ళు నిండకుండానే ఆమె ఒక పారిశామికవేత్తను వివాహమాడారు. ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె మొదటి వివాహం ఎక్కువకాలం నిలవలేదు. ఆ తరువాత 'డోమ్ మోరిస్' అనే కవిని వివాహమాడి పదేళ్ళు విదేశాల్లోనే భర్తతో గడిపారు. పత్రికా రంగంలో పేరున్న వ్యక్తి ఆయన. డోమ్ మోరిస్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ట్రాన్సలేటర్ గా వ్యవహరించారు. పలు పత్రికల్లో ఎడిటర్ గా, కొన్ని ఇతర దేశీయ చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసారు లీలానాయుడు.

ఎందువల్లనో ఆమె రెండవ వివాహం కూడా నిలవలేదని అంటారు. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్ళీ శ్యామ్ బెనిగల్ "త్రికాల్(1985)"లో ఆమె నటించారు. ఆమె చివరిసారిగా నటించినది 1992లో. కోర్టు ఆమె ఇద్దరు కుమర్తెల సంరక్షణను మొదటి భర్తకు అప్పగించింది. ఆ కేసును ఓడిపోయాకా ఆమె చాలా కృంగిపోయారు. తరువాత గొప్ప తత్వవేత్త అయిన జిడ్డుకృష్ణమూర్తి గారి బొధనల పట్ల ఆమె ఆకర్షితులై ఆయన శిష్యులైయ్యారు. దీర్ఘకాల అనారోగ్యం తరువాత 69 ఏళ్ళ వయసులో లీలానాయుడు కన్ను మూసారు. చిన్నవయసులోనే ఎంతొ ఖ్యాతి గడించిన ఆమె...ఎందరికో ఆరాధ్యమైన ఆమె జీవితంలో ఎన్ని విషాదాలో...!


కానీ భారతీయ చలనచిత్ర రంగంలో గుర్తుంచుకోదగ్గ మంచి నటి, అపురూప సౌందర్యవతి లీలానయుడు. ఆమె జెర్రి పింటో తో పంచుకున్న జ్ఞాపకాలను "ఏ పేచ్ వర్క్ లైఫ్" అనే పుస్తకంగా పెంగ్విన్ బుక్స్ వాళ్ళు ప్రచురించారు.

యూట్యూబ్ లో దొరికిన లీలానయుడు క్లిప్పింగ్స్:




Friday, September 17, 2010

"భజగోవిందం"


జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన "భజగోవిందం" అంటే నాకు చాలా చాలా ప్రీతి. అందులోనూ ఎమ్మెస్ గళంలో ! వింటూంటే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఒక భజనగా పాడుకునే "భజగోవిందాన్ని" వేదాంతసారంగా పరిగణిస్తారు. ఈ సంసారం, ధనం, ప్రాపంచిక సుఖాలు అన్నింటిలోనూ ప్రశాంతత ఎందుకు పొందలేకపోతున్నాము? జీవితం ఎందుకు? జీవితపరమర్ధం ఏమిటి? సత్యమేమిటి? మొదలైన ప్రశ్నలకు అర్ధాన్ని చెప్పి, మనిషిలోని అంత:శక్తిని మేల్కొలిపి సత్యాన్వేషనకు పురిగొల్పుతుందీ భజగోవిందం.

"భజగోవిందం" సాహిత్యం pdf
ఇక్కడ
చూడవచ్చు.

యూ ట్యూబ్ లో దొరికిన ఆంగ్ల అర్ధంతో పాటూ ఉన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారి గళం క్రింద వినండి. అదే లింక్ లో క్రిందుగా
శంకరాచార్యులవారు దీనిని రచించిన సందర్భం కూడా వివరించబడి ఉంది.



పెంకుటిల్లు


శీర్షికను బట్టే ఏ పుస్తకాన్నైనా చదవాలనే అభిలాష కలుగుతుంది. రచయిత సమర్ధత కూడా శీర్షికను ఎన్నుకోవటంలోనే ఉంటుంది. "పెంకుటిల్లు" చదివాకా, నవలకు ఇదే సరైన పేరు అనిపిస్తుంది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "పరిపరి పరిచయాలు" పుస్తకం చదువుతుంటే, అందులో 'అలనాటి ఆంధ్రాశరత్' అంటూ వారి మిత్రులైన "కొమ్మూరి వేణుగోపాలరావు" గారి గురించి రాసిన వ్యాసం చదివాను. వృత్తిరీత్యా డాక్టరైన వేణుగోపాలరావుగారి నవల గురించిన కబుర్లు, ఆయనతో తనకు గల స్నేహం, ఇతర రచనల గురించి శర్మగారు అందులో రాసారు. వ్యాసంలోని కొమ్మూరిగారు రచించిన నవలల పేర్లు చూసి, అందులో నేను చదివినది "హౌస్ సర్జన్" ఒక్కటే అనుకున్నాను. మెడిసిన్ చదివే రోజుల్లో, అంటే 17,18ఏళ్ళ వయసులోనే "పెంకుటిల్లు" అనే నవల రాసారనీ, అది ఎంతో కీర్తిని ఆర్జించిపెట్టిందని చదివాకా ఆ నవలపై ఆసక్తి కలిగింది. అంత చిన్న వయసులో ఆయన ఏ సబ్జక్ట్ పై రాసారో.... ఆ పుస్తకం కొనుక్కోవాలి అనుకున్నా.

మొన్నొక రోజు ఇంట్లో చదవటానికి కొన్ని పుస్తకాలు తీస్తూంటే "పెంకుటిల్లు" కనబడింది. ఆశ్చర్యపోయా. నేనెప్పుడు కొన్నానో కూడా గుర్తులేదు...సంతకం కూడా లేదు.(పుస్తకం కొనగానే ఫస్ట్ పేజీలో సంతకం, కొన్న తారీఖు రాయటం నాకు అలవాటు) ఓహో, పేరు ఆసక్తికరంగా ఉందని కొని ఉంటాను అనుకున్నాను. మొత్తం చదివేసాను. చదివి రెండువారాలు అవుతోంది. నవల గురించి రాయటానికి ఇప్పటికి కుదిరింది. టినేజ్ లో ప్రేమా, కలలు అంటూ కాక ఇటువంటి బరువు కధాంశాన్ని ఎన్నుకోవటం ప్రశంసనీయం.


అంత చిన్న వయసులో మనుషుల మనస్థత్వాలు, మనోభావాలు అంత క్షుణ్ణంగా వ్యక్తం చేయటం నిజంగా రచయిత గొప్పతనమే. కధలో పాత్రలైన చిదంబరం, శారదాంబ, రాధ, నారాయణ, ప్రకాశరావు, శకుంతల, వాసు, సుగుణ...మొదలైనవారి పాత్రల చిత్రీకరణ, వారి వారి మానసిక విశ్లేషణ, కధలో చూపెట్టిన దిగువ మధ్యతరగతి(lower middle class) జీవనవిధానం, కధను నడిపించిన తీరూ ఆకట్టుకుంటాయి. కథ చదువుతున్నంతసేపూ ఒక విశాలప్రదేశంలో ఓ పెంకుటిల్లు, ఆ పరిసరలు ఉన్న చిత్రం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. కథలోని వాస్తవికత హృదయాన్ని ద్రవింపజేస్తుంది.

కథ లోకి వస్తే, అనగనగా ఒక పెంకుటిల్లు. ఆ ఇంట్లో చిదంబరం, శారదాంబ అనే దిగువ మధ్యతరగతి దంపతులు. నారాయణ, ప్రకాశరావు, అన్నపూర్ణ, రాధ, వాసు, ఛాయ వారి సంతానం. ఆ ఇంటిలోని వ్యక్తుల జీవితాలలో జరిగిన సంఘటనలు, వారి జీవితాలలో వచ్చిన సమస్యలు, వాటివల్ల ఆయా వ్యక్తుల్లో వచ్చిన మార్పులు ఏమిటీ అన్నది కథ. చిదంబరానికి పేకాటే ప్రాణం. ఆర్ధిక ఇబ్బందులు అతడి బాధ్యతారహిత ప్రవర్తనను ఏమీ మర్చలేకపోతాయి. కధనంలో శారదాంబ పాత్ర ఎక్కువ లేక పోయినా పిల్లలకోసం, ఆ ఇంటి క్షేమం కోసం ఆమె పడే తపన అడుగడుగునా కనబడుతుంది. పెద్దకొడుకైన నారాయణ ఉన్నత వ్యక్తిత్వం, కుటుంబాన్ని నడపటం కోసం పాటుపడే అతని నిస్వార్ధతత్వం ముగ్ధుల్ని చేస్తుంది. అనుకూలవతి అయిన అతని భార్య సుగుణ, ప్రకాశరావును ప్రేమించి పెళ్ళాడే శకుంతల, ఆదర్శవంతమైన కోడళ్ళు అనిపించుకుంటారు.


తండ్రి మరణంతో వ్యాకులపడిన శకుంతలను "సుఖంగా ఉన్నప్పుడు బ్రతకగలిగి, దు:ఖం వచ్చినప్పుడు బ్రతకలేకపోతే మానవుడు జన్మించటం ఎందుకు?" అని ఓదార్చే ప్రకాశరావు ధైర్యం, నిరాడంబర జీవనం, బాధను భరించే శక్తిలేక ఇంటి బాధ్యతల నుండి పారిపోవాలనుకునే అతని పిరికితనం, శకుంతలను అర్ధం చేసుకోలేని అమాయకత్వం, కులాంతర వివాహం చేసుకోవటానికి అతను చూపిన తెగువ...ఇవన్నీ అతడి వ్యక్తిత్వం లోని బలాన్నీ, బలహీనతల్నీ, మానసిక సంఘర్షణను చూపెడతాయి. పావలా కోసం, అర్ధరూపాయి కోసం(అరవైల్లో ఆ నాణేలకున్న విలువ ఎక్కువే మరి) చిన్నవాడైన వాసు పడే తపన, అతనికి జరిగిన ప్రమాదం కంటతడిపెట్టిస్తాయి.

నవలలో ప్రకాశరావు, శకుంతలల ప్రేమకధ ఎక్కువ భాగమే ఉంటుంది. శకుంతలలోని ఔదార్యం, కరుణ, ధైర్యం అబ్బురపరుస్తాయి. ప్రేమించానని వెంటబడి, విపత్కర పరిస్థితుల్లో రాధ చేయి పట్టుకోలేని ఆనందరావు లాంటి పిరికి ప్రేమికులు, శ్రీపతి లాంటి గోముఖ వ్యాఘ్రాలు వాస్తవానికి ప్రతీకలు. ఇక కథలో సంపూర్ణ స్త్రీగా కనబడే పాత్ర రాధ. అందం, అణుకువ, ఆలోచన, తెలివితేటలు, చక్కని వ్యక్తిత్వం అన్నీ ఉన్న రాధ పాత్ర మనల్ని ఆకర్షిస్తుంది. వయసు ప్రలోభాలకు లొంగని, దీనమైన కుటుంబ పరిస్థితుల వల్ల ఏమాత్రం దిగజారని ఆమె వ్యక్తిత్వం ఆ పాత్రను ఎంతో ఎత్తున నిలబెడతుంది. పెద్దన్నలోని నిస్వార్ధగుణాన్ని, చిన్నన్న లోని అభిమానాన్ని, వదినలిద్దరి మంచితనాన్ని అమె అర్ధం చేసుకుంటుంది. ప్రమాదానికి గురైన వాసుకు మనోబలాన్ని అందిస్తుంది. కుటుంబక్షేమం కోసం పరితపిస్తుంది.

అటువంటి రాధ పాత్రకు కథలో జరిగిన (రచయిత చేసిన) అన్యాయం మాత్రం నాకు మింగుడుపడలేదు. వాస్తవం అంత కఠినంగా ఉంటుందని చెప్పటానికా? ఆమెకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే హృదయం బరువెక్కిపోతుంది. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని కోణాల్లోనూ అప్పట్లో చరిత్ర సృష్టించిన "పెంకుటిల్లు" గుర్తుంచుకోదగ్గ మంచి నవల అనిపించుకుంటుంది. కల్పనీకాలూ, మిథ్యాజగత్తులూ నిండినవి కాక యదార్ధానికి దగ్గరగా ఉండే కథలను మెచ్చే చదవరులకు ఈ నవల తప్పక నచ్చుతుందని నా అభిప్రాయం.

Thursday, September 16, 2010

BIG Paa


వచ్చింది....మళ్ళీ వచ్చింది...మళ్ళీ వచ్చింది. ఈసారి అతనికి కాక మరెవరికి? అతని కంటే ఘడెవ్వరు? అన్ని ప్రాంతీయ సినిమాల్లో ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారు. తప్పకుండా ఒప్పుకుని తీరాలి. కానీ యావత్ భారత దేశంలో 67ఏళ్ల వయసులో కూడా 'వాహ్! ఈ పాత్రను అతనొక్కడే చెయ్యగలడు' అనిపించాడు, నిరూపించాడు "పా" సినిమాతో. ఫిల్మ్ ఫేర్ వచ్చింది. ఇవాళ 2009 national awards లో best male actor award మరోసారి సాధించుకున్నాడు.


దేశంలో ఎన్నో రకాల అవార్డ్ లు ఇవాళ. ఎంతో మందికి ఎన్నో రకాల అవార్డ్ లు వస్తూంటాయి. కానీ ఈసారి ఇది ప్రత్యేకం ఎందుకంటే ఈ "ఆరో" పాత్ర అంతటి ప్రత్యేకం. వయసులో ఉన్న నటులు ఎన్ని రకాల పాత్రలైనా ప్రయోగాలు చేయవచ్చు...పోషించవచ్చు. కానీ వయసు మళ్ళిన వ్యక్తి అటువంటి చాలెంజింగ్ రోల్ ను ఈజీగా, సమర్ధవంతంగా చేయటం ఇక్కడి విశేషం.

గత డిసెంబర్లో అనుకుంటా "పా పాటల కబుర్ల"తో ఒక టపా రాసాను. ఈ సినిమా చూడాలని రిలీజ్ కు ముందు నుంచీ ఎంతో ఎదురుచూసాను...కుదరలేదు. ఒక ఆరు నెలల తరువాత సీడీ కొనుక్కుని చూడగలిగాను. అమితాబ్ ఎంత మంచి నటుడో నేను కొత్తగా చెప్పనక్కరలేదు. అందరికీ తెలిసున్నదే. కాని సినిమా చూసాకా నాకు అనిపించినది మాత్రం చెబుతాను...

మొదటిసారిగా అమితాబ్ సినిమాలో అమితాబ్ కనిపించడు. అది "పా" ద్వారా సాధ్యమైంది. సినిమాలో అమితాబ్ "ప్రోజేరియా" అనే అరుదైన జెనిటిక్ డిసాడర్ ఉన్న ఒక పిల్లవాడే మనకు కనిపిస్తాడు. ఒక పదమూడేళ్ళ కుర్రవాడుగా మాత్రమే కనిపిస్తాడు. విడిపోయిన తల్లిదండ్రులను కలిపాలని తాపత్రయపడే కొడుకుగా కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే, తన క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక జీనియస్ ఛైల్డ్ లా...అమ్మమ్మతో అల్లరి చేస్తున్నప్పుడు కొంటె మనవడుగా... తల్లితో ఉన్నప్పుడు ఒక వారిద్దరి అప్యాయానుబంధాన్ని చూపే అనురాగంలా...అముల్ తన తండ్రి అని తెలిసాకా తండ్రి ప్రేమ కోసం తహతహలాడే కొడుకుగా... తన చివరి క్షణాలు దగ్గరగా ఉన్నాయని తెలిసినప్పుడు ఓ గొప్ప
తాత్వికుడిగా... వివిధ కోణాల్లో కనిపిస్తాడు. అమితాబ్ ఇమేజ్ నూ, ఫాన్ ఫాలోయింగ్ నూ, స్టార్డం నూ మనం ఫీలవ్వము.

అది డైరక్టర్ ఆర్.బాలకృష్ణన్ ప్రతిభ, పి.సి.శ్రీరామ్ కెమేరా పనితనం, Stephen Dupuis ("Mrs. Doubtfire" సినిమాలో రోబిన్ విలియమ్స్ కు మేకప్ చేసినతను) మేకప్ వల్ల అనచ్చు. కానీ....కానీ ఈ పాత్ర కు అమితాబ్ తప్ప వేరెవారూ అంతటి న్యాయాన్ని చేసేవారు కాదేమో అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అది తండ్రీ-కొడుకుల సినిమా అని ప్రచారమైతే చేసారు కాని సినిమా చూసాకా ఇది ఒక తల్లీ-కొడుకుల బంధం అనిపించకమానదు.

మీరేమన్నా అమితాబ్ పంఖనా? అని అడగవచ్చు ఎవరన్న....కాదు !! కానీ భారతదేశం లోని గొప్పనటులలో ఒకనిగా, ఒక అత్యుత్తమ అభినయ నైపుణ్యం ఉన్న వ్యక్తిగా అతనంటే అభిమానం. గౌరవం.


Hats off to BIG Paa and a Standing Ovation to Amitabh..!!

Wednesday, September 15, 2010

మొగుడు పెళ్ళాలు(1985) డైలాగులు విని నవ్వుకోండి...


హాస్య బ్రహ్మ జంధ్యాల గారి అద్భుత హాస్య చిత్రరాజాల్లో "మొగుడు పెళ్ళాలు" ఒకటి. సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్లో నవ్వుల పువ్వులు పూయిస్తుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. దాదాపు 15ఏళ్ళ క్రితం ఒకసారి టివీలో ప్రసారమైనప్పుడు (అప్పుడు కంప్యూటర్లు, యూట్యూబ్ లు, డివిడీలు తెలియని క్రితం ) నేను టేప్ రికార్డర్లో కొన్ని హాస్య సన్నివేశాలు రికార్డ్ చేసాను. ముఖ్యంగా నా ఫేవొరేట్ హాస్యనటి శ్రీలక్ష్మి గారి డైలాగులు, సుత్తి వీరభద్రరావు గారి కొత్తరకం తిట్ల ప్రయోగాలు కడుపుబ్బ నవ్విస్తాయి.






మా ఇంట్లో ఇప్పటికీ "లకసుమపినాకీ", "కీ", "చించినాహట్" లాంటి తికమక పదప్రయోగాలు, "మొజాయిక్ ఫ్లోర్ మీద ఆవలు వేసి కొత్తిమీర మొలవలేదని ఏడ్చే మొహం నువ్వూనూ.." లాంటి వాక్యాలూ వాడుకుంటూ ఉంటాము. ఆ డైలాగుల్ని మిత్రులందరూ విని మరోసారి మనసారా నవ్వుకోండి.

http://www.esnips.com/doc/eda4acce-ffe8-4bc2-88bf-4c3d39e9d13d/mogudu-pellaalu-సుత్శోర్ట్



Friday, September 10, 2010

వినాయకచవితి శుభాకాంక్షలు




బ్లాగ్మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.




గణనాయకాయ గణదైవతాయ
గణాధ్యక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేశానాయ ధీమహీ
గుణాతీతాయ గుణాధీశాయ
గుణప్రవిష్ఠాయ ధీమహీ

ఏకదంతయ వక్రతుండాయ
గౌరీతనయాయ ధీమహీ
గజేశానాయ బాలచంద్రాయ
శ్రీ గణేశాయ ధీమహి {2}

గానచతురాయ గానప్రాణాయ గానంతరాత్మనే
గానోత్సుఖాయ గానమథాయ గానో సుఖమనసే
గురు పూజితాయ, గురు దైవతాయ, గురు కులస్థాయినే
గురు విక్రమాయ, గుల్హ ప్రవరాయ గుణవే గుణగురవే

గురుదైత్యకలేక్షేత్రే, గురు ధర్మ సదా రక్ధ్యాయ
గురుపుత్ర పారిత్రాత్రే గురు పాఖండ్ ఖండ్ఖకాయ
గీత సారాయ, గీత తత్వాయ గీతగోత్రాయ ధీమహీ
గూఢ గుల్ఫాయ, గంధ మట్టాయ
గోజయప్రదాయ ధీమహీ

గుణాతీతాయ గుణాధీషాయ
గుణప్రవిష్ఠాయ ధీమహీ
ఏకదంతయ వక్రతుండాయ
గౌరీతనయాయ ధీమహీ
గజేశానాయ బాలచంద్రాయ
శ్రీ గణేశాయ ధీమహి {2}
శ్రీ గణేశాయ ధీమహి శ్రీ గణేశాయ ధీమహి శ్రీ గణేశాయ ధీమహి




Wednesday, September 8, 2010

పోలాల అమావాస్య


శ్రావణమాసం చివరలో వచ్చే అమావాస్యను "పోలాలామావాస్య" అంటారు. ఆ రోజున "కంద" మొక్కకు పూజ చేయటం కొందరి ఆనవాయితీ. అమ్మవారిని పోలాంబ రూపంలో పూజించి పిల్లలు లేనివారు పిల్లల కోసం, పిల్లలు ఉన్నవారు పిల్లల క్షేమం కోరుతూ ఈ పూజ చేస్తారు. కంద మొక్కకు పూజ ఎందుకు చేస్తారంటే, కంద మొక్కకు ఎలాగైతే ఒక్క దుంప మట్టిలో వేసినా పక్కనుండి పిలకలు వేసి బోలెడు మొక్కలు పుడతాయో, అలానే పిల్లాపాపలతో ఇల్లు కళకళాలాడుతూ ఉండాలని అంతరార్ధం.

(ఒక్క దుంపలోంచి వచ్చి బోలెడు కంద పిలకలు)

తోరానికి పసుపుకొమ్ము కట్టి, ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసినవారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పసుపుకొమ్ము తోరాలు చేసి చేతికి కడతారు. గారెలు, బూరెలు, పులగం వండి నైవేద్యం పెట్టి అది రజకులకు ఇస్తారు. ఏ నైవేద్యం అయినా రజకులకు ఇస్తే కడుపు చలవ అని పెద్దలంటారు. పూజ ముగిసాకా చదివే కధలో... ప్రతిఏడూ బిడ్డను పోగొట్టుకుంటున్న ఒకావిడ, ఈ పూజ చేయటం వలన, అమ్మవారి దయతో చనిపోయిన బిడ్డలందరినీ తిరిగి ఎలా పొందగలిగిందో చెబుతారు.

ఇతర ప్రాంతాలవారు చాలా మంది తెలియదంటారు కానీ మా గోదావరి జిల్లాల్లో పోలాలమావాస్య, కంద పూజ తెలియనివారు తక్కువే. జులై,ఆగస్ట్ లలోనే మా అమ్మ కంద దుంప కొని మట్టిలో పాతిపెట్టేది. అది ఈ అమ్మావాస్య సమయానికి చక్కగా చుట్టురా పిలకలు వచ్చి బోలెడు మొక్కలు అయ్యేవి. వాటిల్లోంచి ఒక మంచి మొక్కను దుంపతో సహా తవ్వి ఇంట్లో దేవుడి మందిరం దగ్గర అమ్మ పూజ చేసేది. మొక్క ఇంట్లో పెట్టి పూజ చేయటం, పైగా ఆ పసుపుకొమ్ము తోరం కట్టుకుని స్కూలుకు వెళ్తే, అడిగినవారందరికీ కధంతా చెప్పటం చిన్నప్పుడు వింతగా ఉండేది మాకు.

చూడటానికి అందంగా ఉండే ఈ మొక్కను ఇలా ఇండోర్ ప్లాంట్లాగ కూడా వేసుకోవచ్చు.

Tuesday, September 7, 2010

భానుమతిగారి ప్రైవేట్ రికార్డ్ "పసిడి మెరుంగుల తళతళలు"


గాయని, నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, ప్రొడ్యూసర్, రచయిత, స్టూడియో ఓనర్ అయిన బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ గారి జయంతి ఈవేళ. ఈ సందర్భంగా ఆవిడ పాడిన ఒక ప్రైవేట్ రికార్డ్ "
పసిడి మెరుంగుల తళతళలు" ఈ టపాలో...

రేడియో రజనిగా ప్రసిధ్ధి పొందిన డా. బలాంత్రపు రజనీకాంతరావుగారు రచించి, స్వరపరిచిన పాట ఇది. ఆయనతో పాటుగా భానుమతి గొంతు కలిపి పాడిన పాట ఇది. 1948లో విజయవాడ రేడియోస్టేషన్ ప్రారంభించిన కొత్తలో ప్రతిరోజూ ప్రసారానికి ముందు ఈ
పాట వినిపించేవారు అని రజనిగారు తన తీపి జ్ఞాపకంగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

తెలుగుతనం ఉట్టిపడే మధురమైన ఈ పాట నిజంగా తియ్యగానే ఉంటుంది.





భానుమతిగారు పాడిన సినిమాపాటల్లో, "మల్లీశ్వరి" చిత్రంలో నాకు ఇష్టమైన రెండు పాటలు " ఇక్కడ "



మనసున మల్లెలు..




గాయని, నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, ప్రొడ్యూసర్, రచయిత, స్టూడియో ఓనర్ అయిన బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ(సెప్టెంబర్ 7th, 1925 - 24 December 2005)జయంతి ఈవేళ. ఈ సందర్భంగా అమె పాడిన పాటల్లో, "మల్లీశ్వరి" చిత్రంలో నాకు ఇష్టమైన రెండు పాటలు.

నా all time favourite ఈ పాట.
.
చిత్రం: మల్లీశ్వరి(1951)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి,
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
పాడినది: భానుమతి


మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో(2)
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో

కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా...
అలలు కొలనులో గల గల మనినా(2)
దవ్వున వేణువు సవ్వడి వినినా(2)
నీవు వచ్చేవని నీ పిలుపే విని(2)
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా(2)
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

**********************************

ఇదే సినిమాలోని మరో పాట "ఎందుకే నీకింత తొందర" కూడా నాకు బాగా నచ్చుతుంది.

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి,
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
పాడినది: భానుమతి


ఎందుకే నీకింత తొందర(2)
ఇన్నాళ్ళ చెరసల ఈ రేయి తీరునే (2)
ఓ చిలుక నా చిలుక ఓ రామ చిలుకా
వయ్యారి చిలుక నా గారాల చిలుకా
ఎందుకే నీకింత తొందర

బాధలన్నీ పాత గాధలై పోవునే(2)
వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే
ఏలాగో ఓలాగ ఈరేయి దాటనా
ఈ రేయి దాటనా
ఈ పంజరపు బ్రతుకు ఈ రేయి తీరునే
ఎందుకే నీకింత తొందర

ఆ తోట ఆ తోపు అకుపచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయిలే(2)
చిరుగాలి తరగలా చిన్నారి పడవలా
పసరు రెక్కల పరచి పరుగెత్తి పోదాము
ఎందుకే నీకింత తొందర


Monday, September 6, 2010

Jagjit Singh's "Sailaab" title song -- "Apni marji se.."


ఒకప్పుడు టివీ సీరియల్స్ "meaningful drama" అనిపించేవి. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్సవ్వకుండా చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ తో ఆ డైలాగ్స్, పాత్రలు, కథ గురించిన చర్చలకి అంతు ఉండేది కాదు. కొన్ని సీరియల్ డైలాగ్స్ అయితే పేపర్ మీద రాసుకుని దాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేం చదువుకునే రోజుల్లోని హిందీ సీరియల్స్ గురించి. తెలుగులో బాలచందర్ వి రెండు సీరియల్స్, ఋతురాగాలు తప్ప ఇంకేమీ చూడతగ్గవి ఉండేవి కాదు. జీ టివీ లో బనేగీ అప్నీ బాత్, కషిష్, సైలాబ్, స్పర్ష్, మొదలైనవి ఎంతో బాగుండేవి. నెట్ లో ఏదో వెతుకుతూంటే "సైలాబ్" సీరియల్ టైటిల్ సాంగ్ దొరికింది.

ఈ పాట సాహిత్యం కోసం సీరియల్ మొదలైనప్పుడు, ఆఖరులో టైటిల్స్ అప్పుడు కాయితం పెట్టుకుని రాసుకుంటూ ఉండేదాన్ని. సీరియల్ లో డైలాగ్స్ అయితే అద్భుతంగా ఉండేవి. "రవిరాయ్" దర్శకత్వం వహించిన అన్ని సీరియల్స్ లోనూ డైలాగ్స్ అలానే ఉండేవి.

"సైలాబ్" తరువాత "రవిరాయ్" దర్శకత్వం వహించిన "స్పర్ష్" అనే సీరియల్ సోనీ లో వచ్చేది. చాలా బాగుండేది. కృష్ణ పాత్ర అయితే మా స్నేహితులందరికీ ఫేవొరేట్ అయిపోయింది. Mahesh thakur(anand), Mrinalkulkarni (krishna) మధ్యన జరిగే డైలాగ్స్ బాగున్నాయనిపించేవి రాసుకునేదాన్ని. ఇప్పటికీ దాచుకున్నాను....!



ఇంతకీ "సైలాబ్" సీరియల్ టైటిల్ సాంగ్ ను talat aziz స్వరపరచగా, Jagjit singh పాడారు. ఎంతో పాపులర్ అయ్యిందీ గజల్. ఇదిగో వినండి...



lyrics:

अपनी मर्जी सॆ कहाँ अपनी सफर की हमनॆ
रुख हवावॊं का जिधर है उधर की हमनॆ

पेहलॆ हर चीज थी अपनी मगर अब लगता है
अपनॆ ही घर में किसी दूसरॆ घर कॆ हम है

वक्त कॆ साथ मिट्टी का सफ़र सदियॊं सॆ
किसकॊ मालूम कहाँ कॆ है किधर कॆ हम है

चलतॆ रेहतॆ हैं कॆ चलना है मुसाफिर का नसीब
सॊचतॆ रेहतॆ हैं किस राह गुजर कॆ हम हैं



Sunday, September 5, 2010

సుల్తానా మిస్



ప్రతి టీచర్స్ డే కీ, ఏప్రిల్ 16 కీ నాకు గుర్తు వచ్చేది "
సుల్తానా మిస్". నా ఫేవొరేట్ టీచర్. మా 7th క్లాస్ మిస్. అన్ని సబ్జక్ట్స్ కూ ఆవిడే టీచర్. మేము స్కూల్లో అందరు టీచర్స్ నూ "మిస్" అనే పిలిచేవాళ్ళం. అందరూ మిస్సులే ఉండేవారు. (అంటే "సార్లు ఉండేవారు కాదు) నేను 7th క్లాస్ దాకా ఇంటికి దగ్గరగా ఉన్న ఒక క్రిష్టియన్ స్కూల్లో చదివాను. అక్కడ అంతదాకే ఉండేది. స్కూల్ పిల్లలందరికీ "సుల్తానా మిస్" అంటే భయమ్. చాలా స్ట్రిక్ట్, వెరీ డిసిప్లీన్డ్. చదువు విషయంలో ఏమాత్రం అలక్ష్యం సహించేవారు కాదు. అప్పట్లో ఫోటోలు తీసుకుని దాచుకోవాలి అనే తెలివితేటలు ఉండేవికాదు. గుర్తున్నంతమటుకు ఆవిడ సమానమైన ఎత్తులో, తెల్లగా, కాస్త ఎక్కువ బొద్దుగా, అందంగా ఉండేవారు. ఆవిడ మట్టెలకు మువ్వలు ఉండేవి. నడుస్తూంటే విచిత్రమైన శబ్దం వచ్చేది. ఆ మువ్వల సవ్వడి వినిపిస్తే ఆవిడ వచ్చేస్తున్నారని అర్ధం. పిల్లలందరూ గప్చుప్ అయిపోయేవారు. మా హెడ్మిస్ట్రెస్ కూడా సుల్తానా మిస్ కు చాలా అధికారాలు ఇచ్చేవారు.


మమ్మల్ని 6th క్లాస్ దాకా ఇంట్లోనే అమ్మ చదివించేది. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్స్ ఉండేవి. అందుకని అప్పటి నుంచీ ట్యూషన్కు పంపించేది, మా 7th క్లాస్ మిస్ "సుల్తానా మిస్" దగ్గరకు. మేము బెజవాడలో సూర్యారావు పేటలో ఉండేవాళ్ళం. మిస్ ఇల్లు ఏలూర్ రోడ్డులో రామమందిరం ఎదురు సందులో ఉండేది. రిక్షాలు తెలియవు. అంత దూరం నడుచుకునే వెళ్ళేవాళ్ళం. 5.30-6pm నుంచీ 8.30-9pm దాకా ట్యూషనే. స్కూల్ నుంచి రాగానే ఏదో తినిపించేసి ట్యూషన్కు తోలేసేది అమ్మ. మాననిచ్చేది కాదు. 1st floorలో మిస్ వాళ్ళ ఇల్లు, ఆ పై మేడ మీద ట్యూషన్. మేడంతా పిల్లలతో నిండిపోయేది. వాళ్ళఇంట్లో మొత్తం ఐదుగురు సిస్టర్స్, తల్లి ఉండేవారు. ఇంకో అమ్మాయి, అబ్బాయి వేరే ఊళ్ళో ఉండేవారు. మిగిలిన వివరాలు మాకెవరికీ తెలియవు. ముగ్గురు సిస్టర్స్ మా స్కూల్లోనే చేసేవారు. మిగిలిన ఇద్దరూ మరో స్కూల్లో చేసేవారు. చాలా సాంప్రదాయమైన ముస్లిం ఫ్యామిలీ. మిస్ వాళ్ళ అమ్మగారు ట్యూషన్ పిల్లలందరినీ ఎంతో ప్రేమగా పలకరించేవారు. పరీక్షలుంటే అందరం లైన్లో వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. అదో సామ్రాజ్యం. భయంతో పాటే ఆవిడంటే ఎంతో గౌరవం ఉండేది అందరికీ.

ఒకసారి ఏదో విషయంలో ఒక అమ్మాయి "ఉండు..మిస్ కు చెప్తాను నువ్విలా చేసావని" అని భయపెట్టింది. నాకు చాలా భయం వేసింది. ఎందుకనో మరి ధైర్యంగా ఆవిడ దగ్గరకు వెళ్ళి, "ఇలా జరిగిందండీ, తను మీతో చెప్తానని భయపెడుతోంది. మీఋ నన్ను కొడతారాండీ?" అని అడిగేసాను. ఆవిడ నవ్వేసి, "నిన్నెందుకు కొడతానురా...నీ గురించి నాకు బాగా తెలుసు...నువ్వు నా ఫేవొరేట్ స్టుడెంట్ వి" అంటూ దగ్గరగా తీసుకున్నారు. నాకు అదో అద్భుతం క్రింద తోచింది. స్కూలంతా భయపడే సుల్తానా మిస్ కు నేనంటే ఇష్టమా? ఆశ్చర్యం వేసింది. ఆనందం వేసింది. ఆ అభిమానాన్ని నేను చివరిదాకా కాపాడుకున్నాను.


పిల్లలందరమూ మంచి మార్కులు తెచ్చుకోవాలని సుల్తానా మిస్ శ్రమించేవారు. 7th క్లాస్ లో ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేయించేవారు. పొద్దున్నే చదివితే బాగా గుర్తుంటాయి అని అందరూ పొద్దున్నే 4.30am లేచి చదవాలనీ, పేరెంట్స్ అందరూ పిల్లలు ఎన్నింటికి లేచారో,ఎంతదాకా చదివారో డైరీలో టైములు రాయమనేవారు. "నేను మీ ఇళ్ళకు వచ్చి చూడను. ఇది మీకోసమే. మీరు నన్ను మోసం చెయ్యాలని మీవాళ్ళతో తప్పు టైమింగ్స్ వేయించి తెస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. నాకు ఒరిగేదేమీ లేదు." అని చెప్పారు. అందరం పొద్దున్నే లేచి చదివేవాళ్ళం. నాన్న అలారం పెట్టుకుని నన్ను లేపి చదువుతున్నానో, నిద్రోతున్నానో చెక్ చేస్తూ ఉండేవారు. ఆవిడ పుణ్యమా అని చదువు మీద ఆ శ్రధ్ధ ఇప్పటికీ ఉండిపోయింది నాకు. ఇంకా ఏదన్నా కోర్సు దొరికితే చదవటానికి నేనిప్పటికీ రెడీ.

పిల్లలకు చదువు పట్ల శ్రధ్ధ, ఆసక్తి కలిగించటమేకాక ఇతర విషయాల పట్ల కూడా అవగాహన ఉండేలాగ అన్ని కబుర్లూ మాతో చెప్తూ ఉండేవారు. ఏ స్టూడెంట్ ఏ సబ్జక్ట్ లో వీక్ గా ఉన్నాడో తెలుసుకుని అది బాగా అర్ధమయ్యేలా చెప్పి, ప్రత్యేక శ్రధ్ధ తీసుకుని చదివించేవారు. చాల అందంగా రాసేవారు. బహుశా నేను గుడ్ హేండ్ రైటింగ్ కూడా ఆవిడను చూసే నేర్చుకుని ఉంటాను. పిల్లలందరూ ఇంగ్లీష్ సరిగ్గా మట్లాడేలా నేర్పించేవారు. క్లాస్ లో ఒక బ్రైట్ స్టూడెంట్, ఒక వీక్ స్టూడెంట్, అలా ఆర్డర్లో కూర్చోపెట్టేవారు. తెలియనివి వెంఠనే తెలుస్తాయి, పక్కనున్నవాళ్ళను చూసి సగం నేర్చుకోవచ్చు అంటూండేవారు. పిల్లలందరూ ఆవిడ అనుకున్న ప్రకారం మార్కులు తెచ్చుకునేలా చూసేవారు. ఇంతకన్న బెస్ట్ టీచర్ ఉండరేమో అనిపించేది. స్కూల్ మారాకా కూడా నేను మరో రెండేళ్ళపాటు ఆవిడ దగ్గరకే ట్యూషన్కు వెళ్ళేదాన్ని. తరువాత ఇల్లు మారిపోయాకా దూరమైందని మానేసాను.

స్కూల్ వదిలి వెళ్ళిపోయిన ఐదారు బ్యాచ్ ల తాలుకూ పిల్లలు అందరూ మిస్ ను కలవటానికి వస్తూండేవారు. నేను కూడా ఇంటర్ అయ్యేదాకా కూడా ప్రతి ఏడూ ఏప్రిల్ 16 కి వెళ్ళి కలిసేదాన్ని. ఆ రోజు ఆవిడ పుట్టినరోజు. ఏమిటో నీకింకా గుర్తే అని నవ్వేవారు. "నా ఫేవొరేట్ స్టూడెంట్" అని అక్కడున్నపిల్లలందరికీ చెప్పేవారు. ఇంటర్లో "HSC" గ్రూప్ తీసుకున్నానంటే నేనూ లిటిరేచర్ స్టూడెంట్ నే అని సంతోషించారు. ఆ తరువాత స్కూల్ మారారనీ, ఊరు మారిపోయారని విన్నాను. ప్రయత్నించాను కానీ ఆచూకీ తెలియలేదు. గట్టిగా ప్రయత్నిస్తే దొరికేదేమో అనుకుంటూ ఉంటాను. ఇప్పుడెకడున్నారో తెలీదు. ఎక్కడున్నా ఆరోగ్యంగా, కుశలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అటువంటి డిసిప్లీన్డ్ వ్యక్తిని, మంచి డేడికేటెడ్ టిచర్నూ నేను చదువుకున్నంత కాలం మళ్ళీ ఎక్కడా చూడలేదు. ఆవిడను చూసి నేను చాల నేర్చుకున్నాను. ఇప్పటికీ ప్రతి టీచర్స్ డే కీ, ఏప్రిల్ 16 కీ ఆవిడను తలుచుకుంటూనే ఉంటాను.



Saturday, September 4, 2010

It's my Day ...!!



"భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో అపురుపమైనది..అందమైనది..అద్భుతమైనదీ..
అందుకే దాన్ని ఆస్వాదించాలి..ప్రేమించాలి..ప్రతి క్షణం జీవించాలి..
I have to live everyday to the fullest as there is no tomorrow.. .."

ఇది నేను క్రితం ఏడాది నా పుట్టినరోజుకు రిజొల్యుషన్ అనుకున్నాను...ఆ రోజు రాసిన పోస్ట్ లో కూడా అదే రాసాను.
చాలావరకూ ఆచరణలో కూడా పెట్టాను. అనుకోకుండా గత సంవత్సరంలో చాలా నెలలు ఎన్నో ఇబ్బందులు,సమస్యలు, షాక్ లతో గడిచిపోయింది...జీవితమ్ అయిపోయిందేమో అన్న దిగులులో కూడా పడ్డాను. బాధలకూ ఏడ్చాను, ఇబ్బందుల్లో కష్టపడ్డాను, దిక్కుతోచనప్పుడు తల్లడిల్లాను... కానీ గత ఏడాది పుట్టినరోజునాడు చేసిన ఆ రిజొల్యుషన్ నేను మర్చుపోలేదు. జీవితాన్ని ద్వేషించలేదు. మన ప్రాప్తానికీ, కర్మకూ, ఇబ్బందులకూ జీవితాన్ని తిట్టుకోవటం అవివేకమని నా అభిప్రాయం. జీవితంలో ఏర్పడే బాధలూ, సమస్యలూ ఇబ్బండికరమైనవి కానీ జీవితం కాదు. Life is beautiful. అందుకే భగవంతుడు ఇంత అందమైన అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆనందపడతాను.

చాలామంది ఇంత వయసు వచ్చేసింది ఏం పుట్టినరోజులే? అనుకుంటారు. . కానీ, అందమైన పువ్వుల్ని చూసే కళ్ళని, కమనీయమైన గానాన్ని వినే చెవులను, వెన్నలలోని చల్లదనాన్ని అనుభూతి చెందే మనసునూ ఇచ్చిన ఈ జీవితానికి, అది ఏర్పడటానికి కారణమైన ఈ రోజు నాకెంతో అపురూపం గా తోస్తుంది. మనిషిగా పుట్టాం కాబట్టే కదా ఇంత గొప్ప అనుభూతుల్నీ,ఆనందాల్నీ feel అవ్వగలుగుతున్నాం అనిపిస్తుంది నాకు. అందుకే ఈ పుట్టినరోజంటే కూడా నాకు చాలా ఇష్టం.

మా ఇంట్లో డేట్స్ ప్రకారమే కాక తిథుల ప్రకారం కూడా కలిపి రెండు పుట్టిన రోజులు చేసేసుకుంటాం. నిజానికి ఇప్పటిదాకా మరీ ఇంత ఆరోగ్యం బలహీనపడింది ఇప్పుడే...ఇంకా ఎప్పటికి కోలుకుంటానో కూడా తెలియని స్థితి. అయినా ఈసురోమని ఉండటం నాకస్సలు నచ్చదు. అందుకే ఈరోజు కూడా బయటకు వెళ్ళకపోయినా నాకు తోఛినట్లు ఈ రోజును ఆనందంగా గడిపాను. It's my Day ..It's my birthday and i love it !!

TO ME...!!!



Thursday, September 2, 2010

दुनिया ने कहा..



मैं खामोश रही
दुनिया ने कहा
व़ो मुस्कुराना भूल गयी ll


मैं हँसनॆ लगी
दुनिया ने कहा
उसने अपना ग़म भुलादिया ll

दुनिया क्या जानॆ
कि ऎ भी एक अदा है
ग़म छुपानॆ 
का ll

*******************************

తెలుగులో..

నేను మౌనంగా ఉన్నాను
లోకమంది
అమె చిరునవ్వును మరిచిందని

నేను నవ్వాను
లోకమంది
ఆమె దు:ఖాన్నే మరిచిందని

లోకానికేంతెలుసు
బాధని మరిచేందుకు
ఇదీ ఒక పధ్ధతని..

(తెలుగులో కూడా అర్ధం అడిగారని రాసాను. )


Wednesday, September 1, 2010

జో అచ్యుతానంద జో జో ముకుందా...




ఇవాళ 'తృష్ణ'లో పొస్ట్ చేసిన శ్రీ ఎమ్.ఎస్.శ్రీరాంగారి "శ్రీకృష్ణస్తుతి" ఇక్కడ వినవచ్చు.

అ పోస్ట్ పెట్టినా తనివి తీరలేదు. అందుకని రాత్రయ్యింది కదా బజ్జోపెట్టేద్దామ్ బుల్లి కృష్ణయ్యని అని మళ్ళీ ఇక్కడ నా కిష్టమైన ఎమ్మెస్ పాడిన "జో అచ్యుతానంద.." పెడుతున్నాను.



అన్నమాచార్య విరచిత ఆ అద్భుత సాహిత్యం:

జో అచ్యుతానంద జో జో ముకుందా ||
రావే పరమానంద రామ గోవింద ||

1. నందునింటనుచేరి నయము మీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దు రంగ

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

2. పాల వారాశి లో పవ్వళించినావు
బాలుగా మునులక భయమిచ్చినావు
మేలుగా వసుదేవుకుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

3. అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనవి యట్ట యడుగవిన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

4. గోల్లవారిండ్లకును గొబ్బునకు బోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చేల్లునామగనాండ్ర జెలగి ఈ శాయి
చిల్లితనములు సేయ జెల్లునట వోయి

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

5. రెపల్లె సతులెల్ల గొపంబుతోను
గొపమ్మ మీ కొడుకు మా ఇండ్లలోను
మాపు గానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱచె - నేమందుమమ్మ!

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

6. ఒక యాలిని దెచ్చి - నొకని కడబెట్టి
జగడముల గలిపించి సతిపతుల బట్టి
పగలు నలు జాములును బాలుడై నట్టి
మగనాండ్ర జేపట్టి మదనుడైనట్టి !

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

7. అంగజునిగన్న మాయన్న ఇటురార బంగారుగిన్నెలో పాలుపొసేరా
దొంగనీవని సతులు బొందుచున్నారా ముంగిటనాడరా మోహనాకారా

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

8. గోవధనంబెల్ల గొడుగుగా బట్టి
కావరమున నున్న కంసుబడగొట్టి
నీవు మధురాపురము నేలజేపట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

9. అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పే నీజోల
సంగతిగా సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మదనగోపాల

జో అచ్యుతానంద జో జో ముకుందా ||

************************************

ఎమ్మెస్ పాడిన "మధురాష్టకం" కూడా నాకు బాగా ఇష్టం.
అది ఇక్కడ వినండి. విజువల్స్ కూడా చాలా మంచివి ఇచ్చారు యూట్యూబ్ లో.

ఎమ్.ఎస్.శ్రీరాంగారి "శ్రీకృష్ణస్తుతి"


ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన "శ్రీకృష్ణస్తుతి", "కృష్ణాష్టమి" సందర్భంగా ఈ టపాలో...

ఈమని శంకర శాస్త్రిగారి మేనల్లుడైన ఎమ్.ఎస్.శ్రీరాం గారు "పెళ్ళి రోజు", "మంచి రోజు" మొదలైన తెలుగు చిత్రాలు, "అనుమానం" మొదలైన డబ్బింగ్ చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

ఈ కృష్ణస్తుతిని స్తుతించిన మహామహులు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీ ఎన్.సీ.వీ.జగన్నాధాచార్యులు గారు, వింజమూరి లక్ష్మిగారు, వి.బి.కనకదుర్గ గారు. ఎమ్.ఎస్.శ్రీరాం గారు స్వరపరిచిన ఈ కృష్ణస్తుతి, శివస్తుతి మొదలైనవి విజయవాడ రేడియోకేంద్రం నుండి ఎన్నోసార్లు ప్రసారమై ఎంతో ప్రజాదరణ పొందాయి.

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే "శ్రీకృష్ణస్తుతి" ...



Get this widget | Track details | eSnips Social DNA

Tuesday, August 31, 2010

promising "BoBo"


మనసు బాగున్నప్పుడు, బాగోనప్పుడు మనం మూడ్ కు సరిపడే సంగీతాన్ని వినటానికి ఇష్టపడతాము. కానీ మనసు బాగుందో బాలేదో తెలీని కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు నాకైతే కొత్త సినిమా పాటలు వినాలనే "దుర్బుధ్ధి" పుడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామటుకు కొత్త సినిమా పాటలు బాగున్నాయో, బాలేవో చెప్పలేని సందిగ్ధంలో పడేస్తూంటాయి కాబట్టి. ఎక్కడో ఇదివరకూ విన్నట్టు, పాత పాటల్ని మార్చేసారనో, మళ్ళీ అదే ట్యూన్ వాడారనో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చిరాకు పెడుతున్న మనసులా ఆ పాటలు కూడా దిక్కుతోచకుండా చేస్తాయి. ఒకోసారి అన్నీ మర్చిపోయి ఆ బీట్ కు అనుగుణంగా చిందులెయ్యాలని కూడా అనిపిస్తుంది. అందుకే కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు నేనెప్పుడూ కొత్తపాటలనే వింటాను. ఇంతకీ నేను కొత్తపాటలను మెచ్చుకుంటున్నానా? తిడుతున్నానా? అదీ ఒక కన్ఫ్యూజనే.


ఇంతకీ నిన్న అలాంటి ఒక మనస్థితిలో కొత్త పాటలు విందామనే దుర్బుధ్ధితో గూగులమ్మ నడిగి ఓ నాలుగు కొత్త సినిమా పాటలు మనసారా వినేసాను...ప్చ్..లాభం లేదు...ఏ పాటలకీ మనసు చిందు వెయ్యలేదు కదా ఇంకాస్త భారం ఎక్కువైనట్లు అనిపించింది. వంశీగారి కొత్త సినిమా పాటల్లో కొత్తదనమెక్కడా వినబడలేదు. నెట్ లో అక్కడక్కడా కనిపించిన క్లిప్పింగ్స్లో విజువల్స్, లొకేషన్స్ బాగున్నాయి కానీ వంశీ వీరోవిన్ కి ఎప్పుడు ఉండే పెద్ద నల్ల బొట్టు, టకటక లాడించే కనురెప్పలూ, విన్యాసాలు చేసే గ్రూప్ డ్యాన్సర్లు...సేమ్ ఓల్డ్ స్టైల్. (కథ అయినా బాగుండి సినిమా ఆడాలనే కోరుకుంటున్నాను.) పాటలలో సాహిత్యం బాగుంది కానీ వింటూంటే ఆహా అని మాత్రం అనిపించలేదు...

ఇక పేరు ఎప్పుడూ వినని ఇద్దరు కొత్త సంగీత దర్శకుల పాటలు విన్నాను...లాభంలేదు. డబ్బాలో గులకరాళ్ళ డమడమలు, చెవులదిరే హోరు తప్ప కొత్తదనమేమీ వినబడలేదు.

హ్మ్మ్మ్మ్....అని కొన్ని నిట్టూర్పుల తరువాత "లయరాజు"గారి పాటలు వినటం మొదలుబెట్టాను. "తగలబడుతోంది..." అంటూ భయంకర శబ్దాలు వినిపించాయి. అమ్మో...అని భయపడిపోయి మిగిలిన వాటివైపు వెళ్ళా. బానే ఉన్నాయి కానీ వాటిలోనూ కొత్తదనమేం లేదు. ఆఖరిలో "రాజా"గారే ఒక పాట పాడేసారు. నేను గతంలో బాగుందనిపించి రికార్డ్ చేయించుకున్న ఒక తమిళ్ పాట గుర్తువచ్చింది. అది ఆయనే పాడారు. నాజర్ ఉంటాదనుకుంట ఆ పాటలో. సరే ఈ చివరిపాట పర్వాలేదు అనుకున్నా.

ఇక నాకు దొరికిన న్యూ రిలీజెస్ లో చివరిది మిగిలింది. "తకిట తకిట". ఇదేం పేరో...ఇదెలా ఉంటుందో..
అని మొదలేట్టా...వెంఠనే సంగీతం ఎవరా అని పైకి చూసా.."BoBo Shashi" అని ఉంది. రోబో లాగ బోబో ఏమిటో..అనుకున్నా. ఈ మధ్యన నేను కొత్త సినిమాలనసలు ఫాలో అవ్వట్లేదు. ఎవరీ "BoBo" అని గుగులమ్మలో శోధించా...ఫలానా మురళీ అనే అతని కొడుకు, మ్యూజికల్ బ్యాండ్ ఒకటి ఉంది, తమిళం లో చేసిన "Kulir 100 Degree" పాటలు బాగా పాపులర్ అయ్యాయని...ఆ తరువాత ఇంకా సినిమాలు వచ్చాయనీ...గట్రా..గట్రా...విషయాలు తెలిసాయి. గట్టివాడే. అనుకున్నా.
ఈ "బోబో" తెలుగులో ఏం చేసాడా అని వెతికితే "బిందాస్" అని వచ్చాయి. కొందరు సినీవారసుల సినిమాలు చూసే సాహసం చెయ్యను కాబట్టి ఆ సినిమా వచ్చిందని తెలుసు కానీ వివరాలు నాకు తెలీదు. పాటలు వింటే ఎన్నొ సార్లు ఎఫ్.ఎమ్.లో విన్నవే. బాగా పాపులర్ అయ్యాయి. బానే చేస్తున్నాడు. అనిపించింది.

ఇంతకీ "తకిట తకిట" లో మూడు పాటలు బాగున్నాయి. "Ishq Hai Yeh " అని ప్రసన్న, శ్రేయా ఘోషాల్ పాడారు. వనమాలి రాసారు. "మిలమిలల" అనే గ్రూప్ వింటేజ్ మిక్స్ ఒకటి బాగుంది. భాస్కరభట్ల సాహిత్యం బాగుంది. ఇక ముఖ్యంగా బాగా నచ్చిన మరో పాట "మనసే అటో ఇటో" కార్తీక్, చిన్మయీ పాడారు. ఈ సాహిత్యం కూడా భాస్కరభట్లగారిదే. ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు ప్రముఖనటులు చిన్నవయినా, కీ రోల్స్ లో వేస్తున్నారని చదివిన గుర్తు. మరి సినిమా బాగ ఆడుతుందని అనిపించింది పాటలు వింటే. ఈ పాటల్ని ఈ లింక్ లో వినవచ్చు.


అద్గదీ "BoBo" కధ. యువన్ శంకర్ రాజా, హారిస్ జైరాజ్, మిక్కీ జె మేయర్ తదితరుల తరువాత దిగుమతి అయిన ఈ తమిళ "
శశి" మరో ప్రోమిసింగ్ కంపోజర్ అని నాకనిపిస్తోంది. మరి ఎంతవరకు రాణిస్తాడు అన్నది వేచి చూడాల్సిందే...!!


Monday, August 30, 2010

ఒక వెరైటీ కథ - "సెవెన్త్ సెన్స్"



ఆంధ్ర జ్యోతి-అనూస్ హాస్తల్స్ నిర్వహించిన కధావసంతం కథలపోటీలో బహుమతి గెలుచుకున్న ఈ కథను నిన్నటి ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో ప్రచురించారు. వెరైటీగా, సామాజిక స్పృహ ఉన్న ఈ కథ నాకు నచ్చింది.

ఆసక్తి ఉన్నవారు క్రింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ లో కథను చదువుకోవచ్చు....

దగ్గుపాటి ప్రభాకర్ గారు రాసిన "సెవెన్త్ సెన్స్" కథను ఇక్కడ చూడవచ్చు.