సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label సినిమా పేజీ. Show all posts
Showing posts with label సినిమా పేజీ. Show all posts

Thursday, May 10, 2018

'మహానటి'ని చూసాకా...



కొన్ని సినిమాలు చాలా బావుంటాయి. చూసేసి ఇంటికి రాగానే ఎవరికైనా చాలా చెప్పాలనిపిస్తుంది. కానీ కొన్ని సినిమాలు చూశాకా అసలేమీ మాట్లాడాలనిపించదు. అలా మౌనంగా చాలా సేపు ఉండిపోవాలనిపిస్తుంది.


పునర్జన్మలు, ఋణాలు, పాపాలు, కర్మలు... ఇలా మనం ఎన్ని కబుర్లు విన్నా, ఎంత విద్యని సంపాదించినా, ఎంత తెలివైనవారైనా మనిషిగా పుట్టాకా ఎప్పుడో అప్పుడు అజ్ఞానానికి లొంగిపోయి, జీవితమనే మాయాజాలంలో ఇరుక్కుపోయి, ఇదే శాశ్వతమనుకుని అల్లకల్లోలంగా జీవించేస్తుండగా.. కొన్ని సంఘటనల ద్వారానో, ఎవరో మనుషుల ద్వారానో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లు కళ్ళ ముందుకు జీవితసత్యాన్ని అవిష్కరింపజేస్తాడు దేవుడు. ఇదిరా బాబూ జీవితమంటే.. ఇక్కడ నుండి నువ్వు కట్టుకుపోయేదేమీ లేదు. ఈ సత్యాన్ని గుర్తించు అని. సత్యాన్ని చూపెట్టే అలాంటి కొన్ని మెరుపుల్లో ఒక మెరుపు ఈ సినిమా!

 
ఇలాంటి సినిమా చూసినప్పుడు కధేమిటి? నటీనటులెవరు? టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అన్న ప్రశ్నలు స్ఫురించవు. అలాంటి ఒక జీవితాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలో అర్థమౌతుంది. నా వాళ్లు నా వాళ్ళు అని నమ్మినవాళ్ళు ఎంతటి వెన్నుపోటు పొడవగలరో; సుఖంగా ఉన్నప్పుడు చుట్టూ చేరిన వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఎలా మాయమైపోతారో, బాగున్నావా అని కాదు కదా అసలు బ్రతికున్నావా లేదా అని కూడా అడగరని; ముక్కలైన హృదయం శరీరంలో రోగాన్ని మాత్రమే పెంచుతుందని జీవితంలో మోసపోయినవారికీ, ఎదురుదెబ్బలు తిన్నవాళ్ళకే కదా బాగా తెలిసేది.

తెలివిగా ఉండి, అంతటి ప్రతిభ ఉండి, ధైర్యం ఉండి, అంతటి తెగింపు ఉండి కూడా ఒకే ఒక తప్పటడుగు వల్ల సర్వం కోల్పోయిన ఆ మహామనీషి, మహానటి ఏం సాధించింది  అంటే...
"స్మృతి మాత్రమే కదా చివరికి మిగిలేది..." అని పాటలో చెప్పినట్లు.. లక్షల హృదయాల్లో ఒక కమ్మని కలగా, ఒక మధురమైన స్వప్నంలా, ఒక తియ్యని జ్ఞాపకంగా మిగిలిపోయింది..!

 
సావిత్రి పాత్రను అసలు ఎవరూ తెరపై పోషించలేరు అనే చాలామందికి కలిగిన అనుమానాన్ని కీర్తి సురేష్ మటుమాయం చెయ్యడం వెనుక ముఖ్యంగా ముగ్గురి కృషి ఉంది అనిపించింది నాకు. దర్శకుడు, నటి, ఆమెకు మేకప్ చేసిన మేకప్ మాన్. ఈ ముగ్గురి సమిష్టి కృషికి ఈ పాత్ర ఈమే చెయ్యాలని దైవ సంకల్పం కూడా తోడైంది అని కూడా అనిపించింది చిత్రాన్ని చూస్తూంటే. ముఖ్యంగా విరామం తరువాత కొన్ని సన్నివేశాల్లో నిజంగా సావిత్రిగారే మళ్ళీ కనిపిస్తున్నట్లు అనిపించింది.

 

ఇంతకన్న మరేమీ రాయాలని లేదు..  హేట్సాఫ్ టు ద డైరెక్టర్!

 
 

Monday, March 26, 2018

నీదీ నాదీ ఒకే కథ



"హృదయమెంత తపిస్తే... బతుకు విలువ తెలిసింది. 
గుండెనెంత మథిస్తే... కన్నీటి విలువ తెలిసింది. 

చీకటసలే లేకుంటే... వెన్నెలకేం విలువుంది. 
నిన్న ముగిసిపోయాక... నేటి విలువ తెలిసింది"

చాలా రోజులకి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసానన్న ఆనందంతో కుర్చీలోంచి లేవబోతూంటే స్క్రోలింగ్ టైటిల్స్ తో పాటూ మొదలైన ఈ పాట మళ్ళీ కూర్చోపెట్టేసింది.. అప్పటికే తుడిచి తుడిచి చెమ్మగిల్లి ఉన్న కళ్ళు మరోసారి మసకబారాయి.

పాలలో బియ్యం ఉడికాకా, నేతిలో ఎర్రగా వేగిన పెసరపప్పు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి, సమ పాళ్లలో తగినంత తీపి వేసి వండిన చక్కని చక్రపొంగలిలో.. చివరిలో చిటికెడు పచ్చకర్పురం వేస్తే ఎంత అద్భుతమైన రుచి వస్తుందో - అలా ఉంది సినిమా చివర్లో వచ్చిన ఈ కవితా గానం - like a tasty topping on an already delicious cake - మనసుని ఎంతగానో కదిలించింది !!

చాలా వరకు మన సినిమాల్లో..
1) ఒక హీరో ఉండుట. అతడొక హీరోయిన్ ని చూచుట. ఆమెను ఒప్పించుట కొరకు అష్టకష్టాలు పడుట.
2) ఒక హీరో ఉండుట. అతడికి ఆల్రెడీ ఒక హీరోయిన్ పరిచయం ఉండుట. వారి ప్రేమను గెలిపించుకునేందుకు అష్టకష్టాలు పడుట.
3) ఒక హీరో ఉండుట. హీరోయిన్ కాదందని, లేదా విధి విడదీసిందనో జీవితాన్ని నాశనం చేసుకొనుట.
4) ఒక హీరో ఉండుట. అతగాడికి కనబడ్డ అమ్మాయి మాత్రమే ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సౌందర్యరాశి అయి ఉండుట. ఆమె కోసం ఏం చెయ్యడానికైనా సిధ్ధమయిపోయి, రకరకాల విలన్లతో రకరకాల యుధ్ధాలు చేయిట.
సినిమా అంటే 90% ఇవే కథలు. వీటిల్లో కొన్ని అంటే 10% సినిమాలు పాటల వల్లో, కథనం వలనో మనం ఇంప్రెస్ అయి బావుందనుకుంటాం. కానీ అసలు ఇవి తప్ప వేరే కథాంశాలే దొరకవా? జీవితం అంటే అబ్బాయి, అమ్మాయి కలుసుకోవడమో, లేక తప్పనిసరిగా ఎవరినో ఒకరిని ప్రేమించి తీరాలి అనో చూసేవాళ్లకి బోధించే విధంగా ఎందుకిలాంటి సినిమాలు తీస్తున్నారు అని ఎన్నోసార్లు అనుకుంటూంటాను. ఈమధ్యకాలంలో కాస్తంత మార్పు వచ్చి డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు (అంటే భారీ తారాగణం, బడ్జెట్ లు లేనివి) విభిన్నమైన ఇతివృత్తాలతో బావుంటున్నాయి. కానీ కమర్షియల్ ఎలిమెంట్ నుండి తప్పించుకోలేకపోతున్నాయి. ఓ ఫైట్, లేదా బలవంతంగా కథలో దూర్చిన ఐటెమ్ సాంగ్ లేకుండా సినిమా రావట్లేదు. ఇంకా ముఖ్యంగా "స్మోకింగ్ & డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టూ హెల్త్" అంటూనే సిగరెట్టు, మందు సిన్లు లేకుండా అసలు సినిమా ఉండట్లేదు. ఒక తండ్రి పాత్రధారి కొడుకుతో పాటూ తాగడం లాంటి దురదృష్టకరమైన సన్నివేశాలు కూడా కొన్ని సినిమాల్లో చూస్తున్నాం. ఇదేమిటని ఎవరినైనా ప్రశ్నిస్తే ఇవాళ సో కాల్డ్ ఫ్యాషనబుల్, కల్చర్డ్ సొసైటీలో ఇదొక క్యాజువల్ విషయం అని కొట్టిపారేస్తున్నారు. కానీ ఇలా చూపించడం అనేది యువత పై ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగిస్తోందో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇలాంటి కమర్షియల్ మొహమాటాలు లేకుండా చాలా మామూలుగా, నిజాయితీగా ఉన్న సినిమా "నీదీ నాదీ ఒకే కథ". 

పరీక్షలతో, పోటీ ప్రపంచంతో పోరాడుతూ స్కూళ్ళలో , కాలేజీల్లో నలిగిపోతున్న విద్యార్థులకు, వారిని స్టేటస్, పెద్ద ఉద్యోగాలు, డబ్బు సంపాదన పేరిట పోటీల చట్రంలో ఇరికించేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా పెద్ద కనువిప్పు. జీవితం అంటే ఉద్యోగం, డబ్బు సంపాదన కాదు... సంతోషంగా జీవించడం అని చెప్పే ఒక్క సినిమా ఇన్నాళ్లకు వచ్చిందని చాలా సంతోషం కలిగింది. ఇటువంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నందుకు, దానిని న్యాయంగా చిత్రీకరించినందుకు దర్శకుడికి హేట్సాఫ్ ! 

నాకు బాగా నచ్చిన మరో అంశం ఏమిటంటే, అంతటి సంఘర్షణతో మనసుతో యుధ్ధం చేస్తున్నా, హీరో పాత్ర ఎటువంటి చెడు అలవాట్ల వైపుకీ వెళ్లకపోవడం. తండ్రి 'చావరాదా..' అని తిట్టినా కూడా ఆత్మహత్య లాంటి పిరికి ప్రయత్నాలు చెయ్యకపోవడం. సినిమా హీరోలో  హీరోయిజం చూసి , మనలో లేనిదాన్ని ,కావాలనుకునేదాన్ని హీమాన్ లాంటి హీరోలని చూసి హీరో పట్ల ఎడ్మిరేషన్ పెంచుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే మనలో ఉండే బలహీనతలనీ, పిరికితనాన్నీ, పొరపాట్లనీ ఒక హీరోలో చూస్తామో, అప్పుడు మనతో పోల్చుకుంటాం. ఇతనూ మన తోడి వాడే అన్న ఆత్మీయత పెరుగుతుంది. శ్రీ విష్ణు గత సినిమా(మెంటల్ మదిలో) లోనూ , ఈ సినిమా లోనూ కూడా అదే తరహా - సామాన్య మధ్య తరగతి కుర్రాడి పాత్ర - పోషించడం వల్ల, కమర్షియల్ ఇమేజ్ కు భిన్నంగా ఉండడం వల్ల నటుడిగా అతను ప్రేక్షకులని బాగా మెప్పించగలిగాడు. తండ్రి ని ఎలాగైనా కన్విన్స్ చెయ్యాలని, తన పాయింట్ ఆఫ్ వ్యూ ని తండ్రికి అర్థం అయ్యేలా చెయ్యాలని సాగర్ పడిన తాపత్రయాన్ని ఎంతో కన్విన్సింగ్ గా చూపెట్టగలిగాడు. అమేజింగ్ టాలెంట్! కొందరు మంచి నటుల్లా కమర్షియల్ సినిమాల ఉచ్చులో పడకుండా ఉంటే తెలుగు సినిమాల్లో మరో మంచి నటుడు మిగులుతాడు.

ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా కథకు అనుకూలంగా ఉండి, సన్నివేశం తాలుకూ ఫీల్ ని ఇంకా ఎలివేట్ చేసింది. సాగర్ ఇంట్లోంచి వెళ్ళిపోయే దృశ్యంలో ఏ సంభాషణా అవసరం లేకుండా నేపథ్య సంగీతం తో సన్నివేశాన్ని పండించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఏ ఒక్క సన్నివేశం లోనూ కొత్త దర్శకుడు అనిపించలేదు. ఎంతో అనుభవజ్ఞుడైన దర్శకుడి చిత్రం చూసినట్లే అనిపించింది. పాత నలుపు-తెలుపు సినిమాల్లో రమణారెడ్డి తరువాత నెల్లూరు యాసను అంతే చక్కగా ఈ సినిమాలోనే విన్నాననిపించింది. సాగర్ తల్లి, తండి, చెల్లి, హీరోయిన్ లే కాక చిన్న చిన్న పాత్రధారులందరూ ఎవరికి వారే మెప్పించారు. 

రియలిస్టిక్ గా ఉన్నా కూడా నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం ఏమిటంటే, హీరో చెల్లెలిని కాలితో తన్ని లేపడం. చాలా ఇళ్ళల్లో అలానే జరుగుతుంది కానీ తెరపై చూపెట్టేప్పుడు అదంత సమంజసం కాదని నాకు అనిపించింది. వయసులోకి వచ్చిన తోడపుట్టినవారిని లేదా కూతురిని ఒక స్త్రీగా గౌరవించాలి. ఎక్కడపడితే అక్కడ తన్నకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. 

వేణు ఊడుగుల గారు ఇంకెన్నో మంచి, ఉపయోగకరమైన సినిమాలు తీయాలని, తద్వారా యువత ఆలోచనల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేశజనాభాలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. వారు సరైన మార్గంలో నడిస్తే కుటుంబాలు బావుంటాయి. సమాజం బాగుపడుతుంది. తెలుగు ప్రేక్షకులం ఇటువంటి చిత్రాలను ప్రోత్సహిస్తే, మరిన్ని మంచి సినిమాలు మన తెలుగు తెరకు అందించేందుకు దర్శకులకు బలాన్ని అందించినవాళ్ళమౌతాము.

Wednesday, March 25, 2015

విలువైన సత్యాలను సరదాగా చెప్పిన సినిమా!


కొన్ని నెలల క్రితం ఓ రోజు ఎఫ్.ఎం వింటూంటే "ఎవడే సుబ్రహ్మణ్యం" షూటింగ్ కబుర్లు చెప్పారొక ఆర్.జె. హిమాలయాల్లో చలిలో ఎన్ని ఇబ్బందులు పడుతూ షూటింగ్ కొనసాగిస్తున్నారో.. ఆ విశేషాల గురించి నానీ ఏం మాట్లాడాడు అవన్నీ చెప్పారు. అసలు మామూలుగానే నాకు హిమాలయాలు, అక్కడ యోగులూ, రహస్యాలూ లాంటి కబుర్లంటే మహా ఇష్టం. సో, హిమాలయాల్లో అంత ఎత్తున, అంత చలిలో ఏం షూటింగబ్బా...? ఏం కథా? అని కుతూహలం పెరిగింది. అప్పట్నుండీ ఈ సినిమా తాలూకూ కబుర్లు, అప్డేట్స్ ఫాలో అవడం మొదలెట్టాను. 

తర్వాత ఓ రోజు "ఓ కలా" అన్న పాట విని ఎందులోదీ అని వెతికితే ""ఎవడే సుబ్రహ్మణ్యం" లోదని తెలిసింది. ప్లే లిస్ట్లో "చల్ల గాలి" ఇళయరాజా పాట అని చూసి, విన్నాకా అది నాకు బాగా ఇష్టమైన "Thendral Vanthu"  సాంగ్ ట్యూన్ అని తెలిసి సిన్మా చూడాలనే ఇంట్రస్ట్ పెరిగింది. ఉగాది రోజనుకుంటా ఓ ఎఫ్.ఎంస్ లో నానీ ఇంటర్వ్యూ కూడా వచ్చింది. మొన్న రిలీజ్ రోజున తను ఆఫీస్ నుండి వచ్చాకా అప్పటికప్పుడు అనుకుని, టికెట్లు దొరుకుతాయో లేదో అనుకుంటూ సెకెండ్ షోకి వెళ్ళాం. అసలా అర్థరాత్రే పోస్ట్ రాయాలనిపించింది.. రాయలేకపోయా. నిన్న కూడా కుదర్లేదు. సినీ ప్రేమికులు తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా కాబట్టి ఇవాళ ఎలాగైనా బ్లాగ్ పోశ్ట్ రాయలని కూచున్నా..! 

ఎక్కువేమీ రాయను... నచ్చినవేమిటో చెప్తాను.. 
* ముఖ్యంగా పెద్ద పెద్ద సీరియస్ వేదాంత సూత్రాల్ని చిన్న చిన్న ఉదాహరణలతో తేలికగా చెప్పడం బాగా నచ్చింది నాకు. అయితే ఇన్-డెప్త్ కి వెళ్ళకుండా వాటిని మరీ తేలికగా చూపెట్టేసారేమో అన్న డౌటానుమానం కూడా కలిగింది. మరీ సీరియస్ గా చూపెట్టినా ప్రేక్షకులు చూడకపోవచ్చు..! 

* రిషి పాత్ర చాలా చాలా నచ్చింది. "కళ్ళజోడు పెట్టుకుంటే ఎక్కువ మార్కులు పడతాయని.." అని నానీ అన్నట్లు, ఆ గడ్డం రిషి పాత్రకి గంభీరతనిచ్చింది. ఆ కేరెక్టర్ ని చంపేయడం అంత జస్టిఫైయీంగ్ అనిపించలేదు. ఆ ప్రయాణంలో సుబ్బులో మార్పు ఎలానూ వస్తుంది కాబట్టి ముగ్గురూ కలిసి అక్కడికి వెళ్ళినట్లు చూపెట్టచ్చు కదా.. కానీ మళ్ళి ఏమనిపించిందంటే బహుశా మనిషిని కోల్పోతే గానీ స్నేహం విలువనీ, మనిషి విలువనీ గుర్తించనంత అయోమయపు లోకం తయారైంది అని చెప్పడం డైరెక్టర్ ఉద్దేశం కావచ్చు! సుబ్బుతో దెబ్బలాడి వెళ్పోయే ముందు "ఇదే ప్రపంచం అయితే ఈ ప్రపంచం నాకక్కర్లేదు.." అనే రిషి డైలాగ్ నచ్చింది నాకు. 

* ప్రస్తుతం స్నేహాన్ని గురించిన నా డెఫినిషన్స్ మారిపోయినా కథలో స్నేహానికి ఇచ్చిన ప్రాముఖ్యత నచ్చింది. ఈమధ్యన Red Fmలో వస్తున్న 'భాగవత ప్రవచనం'లో కుచేలుడి గురించి చెప్తూ, స్నేహం అంటే ఎలా ఉండాలో చాగంటివారు చెప్పిన మాటలు గుర్తువచ్చాయి నాకు సినిమాలో రిషి ని చూస్తూంటే. 

* ఓల్డ్ ఫ్రెండ్ గా షావుకారు జానకి, సీతాకోకచిలుక తోటలో ప్రతాప్ పోతన్, రామయ్య గా కృష్ణంరాజు, సుబ్బు బాస్ గా నాజర్.. ఇలా చిన్నవైనా కీలకమైన పాత్రల్లో సీనియర్ నటుల్ని పెట్టడం బావుంది. కృష్ణంరాజు పాత్ర, ఆయన చెప్పిన ప్రతీ డైలాగ్ బావుంది. సూపర్ కూల్ కేరెక్టర్ రామయ్యది! 

* జీవితపు పరుగుపందాల్లో పడి జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో సులువుగా చెప్పిన విధానం నచ్చింది. సుబ్బు పాత్ర అచ్చం "జిందగీ నా మిలేగీ దొబారా" లో అర్జున్ పాత్రలాంటిది. స్నేహితులతో చేసే అడ్వంచర్ ట్రిప్ లో గ్రాడ్యుయల్ గా అర్జున్ లో ఎలాంటి మార్పులు వస్తాయో..అలానే సుబ్బులో కూడా నెమ్మది నెమ్మదిగా మార్పు వస్తుంది. అదే హిందీ సినిమాలో నటాషా - కబీర్ ల రిలేషన్ లాంటిదే బాస్ కూతురితో సుబ్బు రిలేషన్ కూడా. రియలైజేషన్ వచ్చాకా కబీర్ పెళ్ళి బ్రేక్ చేసుకున్నట్లే సుబ్బు కూడా తనామెకి కరెక్ట్ కాదని చెప్పేస్తాడు. 

* రాధన్ సంగీతం చాలా బాగుంది. Promising!

* బాల నటి నుండి హీరోయిన్ గా ఎదిగిన మాళవిక నాయర్ కూడా బొద్దుగా, ముద్దుగా బావుంది. అప్పుడప్పుడు నిత్యా మీనన్ లా, అప్పుడప్పుడు శోభన లాగ ఉందీ అమ్మాయి. "జబ్ వియ్ మెట్" లో కరీనా పాత్రలాగ తనకు తోచింది, నచ్చింది చెయ్యడం ఈ అమ్మాయి అలవాటు. ఆ సినిమా చివర్లో షాహిద్ కపూర్ చెప్పిన ఒక డైలాగ్ లాంటిదే సుబ్బూ కూడా చెప్తాడు.. "నువ్వెంత కూలో నీకు తెలీదు.." అంటూ. 

* మరి హీరో గారి గురించి కూడా చెప్పాలి కదా.. నానీ ఒక మామూలు పక్కింటి అబ్బాయి లాగ ఉంటాడు కాబట్టే అంతమంది అభిమానుల్ని పోందగలిగాడన్నది నా అబిప్రాయం. ఈ పాత్ర అతని సహజ ప్రవృత్తికి బాగా సరిపోయినట్లు నాకనిపించింది. కామెడీ పడించడం చాలామంది గొప్ప హీరోలకు కూడా సరిగ్గా రానిది. ప్రేక్షకులను సహజంగా, హాయిగా నవ్వించగలగడం వచ్చిందంటే గొప్ప ఏక్టర్ అయిపోయినట్లే! ఇంకా మంచి కథలు, సినిమాలు వచ్చి ఇతగాడు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. 

*ఆ మంచుకొండలు, గుట్టలు, జలపాతాలు, నదులు, చెట్లు, పచ్చదనం, టోటల్ గా సెకెండ్ హాఫ్ లో లొకేషన్స్ చాలా బాగున్నాయి. అర్జెంట్ గా అక్కడికి వెళ్పోవాలనిపించేలా.

 

మన తెలుగు తెరకి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా  ఇలాంటి  ఎన్నో మంచి  చిత్రాలను అందించాలని కోరుకుంటున్నాను. హిమాలయాల్లో షూటింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు కాబట్టి అక్కడి పార్ట్ ఆఫ్ సినిమాలో కనబడ్డ లోటుపాట్లను లిస్ట్ కట్టడం బావుండదేమో. ఏదేమైనా "ఎవడే సుబ్రహ్మణ్యం" అందరూ చూడాల్సిన ఒక సరదా అయిన మంచి విలువైన సినిమా! అదన్నమాట..:-) 

చివరిగా హరిణి పాట వినేస్తారా మరి.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం..




Sunday, March 1, 2015

తులసి మొక్కలా... 'Dum Laga Ke Haisha'


నిన్న రాత్రి చూసిన ఈ సినిమా పూర్తయ్యేసరికీ విషయం తక్కువ  హంగామా ఎక్కువ అనిపించేట్లు ఉంటున్న ఈ కాలపు సినిమాల మధ్యన ఈ చిత్రం నిజంగా "...వనంలో తులసి మొక్క" అనిపించింది. ఇటువంటి మణిపూసని మనకందించిన దర్శకుడు శరత్ కతారియాను అభినందించి తీరాలి. ఈ చిత్రం యాష్ రాజ్ ఫిల్మ్స్ నుండి రావడం గొప్ప ఆశ్చర్యం! ఆ ప్రొడక్షన్ హౌస్ అదృష్టం.  చిత్రాన్ని గురించి ఇంకేమైనా చెప్పేముందు ఈ పాట వినండి(చూడండి)..




ఊ..చూసేసారా?! అమేజింగ్ కదా అసలు. పాట మొదలవగానే అసలు ఏదో లోకంలోకి వెళ్పోయాను నేనైతే. లుటేరా లో "సవార్ లూ.." పాడిన అమ్మాయి మోనాలీ ఠాకుర్ ఈ పాట పాడింది. ఆ పాట కన్నా ఈ పాటలో క్లాసికల్ బేస్ ఉన్న మోనాలీ ట్రైన్డ్ వాయిస్ బాగా తెలిసింది. ట్యూన్ అలాంటిది మరి. చాలా రోజులకి అనూ మాలిక్ కంపోజ్ చేసారు. ఇదే పాటకు మేల్ వర్షన్ Papon అనే పేరుతో ప్రసిద్ధుడైన గాయకుడు అంగరాగ్ మహంతా పాడారు. మనసుని సున్నితంగా తట్టే ఈ పాటకు సాహిత్యాన్ని వరుణ్ గ్రోవర్ అందించారు. నా దృష్టిలో "ఎక్స్ట్రార్డినరీ" పదం ఒక్కటే ఈ పాటకు, అది తయారవడానికి కారణమైనవారందరికీ సమంగా సరిపోతుంది. ప్రముఖ గాయకుడు కుమార్ సానూ కూడా చాలారోజులకి ఒక పాట పాడి, సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

కుమార్ సానూ పాట:





ఇంతకీ ఇదెలాంటి సినిమా అంటే ఎలా చెప్పాలి...
తావి లేని కనకాంబరాల మధ్యన గుబాళించే మల్లె మొగ్గలా..
చుక్కల మధ్య మెరిసిపోయే చందమామలా..
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందమైన పువ్వులా..
ఉంది సినిమా. డెభ్భైలు, ఎనభైల్లో బాలీవుడ్ లో తయారైన మధ్యతరగతి కథలు, తళుకుబెళుకులు లేని అతి మామూలు సదాసీదా కామన్ మేన్ జీవిత కథలతో తయారైన చిత్రాలు ఒక్కసారిగా గుర్తు వచ్చాయి.  సినిమాల్లో, తద్వారా మనుషుల్లో పెరిగిపోయిన అసహజత్వాలనీ
, ఆర్భాటాలనీ పక్కన పెట్టి ఇలాంటి డౌన్ టూ ఎర్త్ సినిమాను తీయాలనే ఆలోచనకు గొప్ప ధైర్యం కావాలి. ఇమేజ్ నూ, పాపులారిటీను పక్కన పెట్టి తండితో ప్రాక్టికల్ గా చెప్పు దెబ్బలు తినే ఒక నిరాశాపరుడైన, పిరికి అబ్బాయి పాత్రను ఒప్పుకున్నందుకు హీరో ఆయుష్మాన్ ఖురానా మరింత నచ్చేసాడు. "విక్కీ డోనర్" లో కన్నా ఎక్కువగా! (ఒక నటుడిగా మాత్రమే :))

చిత్రకథ తొంభైల కాలం లాంటిది. ఆ కాలం నాటి హిట్ హిందీ చిత్ర గీతాలు తెలిసిన వాళ్ళు, 'శాఖ ట్రైనింగ్' గురించి తెలిసినవాళ్ళూ సినిమాని బాగా ఎంజాయ్ చెయ్యగలరు. బాగా కనక్ట్  అవుతారు. గాయకుడు "కుమార్ సానూ" వీరాభిమాని హీరో. పదవ తరగతి రెండుసార్లు ఫెయిలయి, హరిద్వార్ లో తండ్రి నడిపే ఒక కేసెట్ రికార్డింగ్ సెంటర్ లో పాటలు రికార్డ్ చేసే పని చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల, తండ్రి బలవంతం వల్ల బీఎడ్ చదివి టీచరవబోతున్న అమ్మాయిని ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటాడు. గుడిలో జరిగిన పెళ్ళి చూఫుల్లోనే కాస్త ఎక్కువ బొద్దుగా ఉన్న పెళ్ళికూతురు నచ్చదతనికి. ఒక అమ్మాయి బీయిడీ చదువుకుంది.. 'టీచర్ అవ్వాలన్నది ఆమె చిన్ననాటి కల' అన్న సంగతి ఇంకా నచ్చదతనికి. మరి తను 10th ఫెయిల్ కదా! చాలా అయిష్టంగానే ఒక సామూహిక వివాహవేదిక మీద సంధ్య వర్మ(
భూమీ పెడ్నేకర్) ను పెళ్ళాడతాడు ప్రేమ్ ప్రకాష్ తివారీ(ఆయుష్మాన్ ఖురానా). అదిమొదలు తన అయిష్టాన్నీ ప్రకటించడానికి అతగాడు, భార్యగా తన స్థానాన్ని కాపాడుకోవాలని సంధ్య చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏదీ కలిసిరాక ఒకానొక అవమానకరమైన సందర్భంలో అభిమానం దెబ్బతిని అత్తవారిల్లు విడిచి వెళ్పోయి, తర్వాత విడాకుల నోటీసు పంపిస్తుంది సంధ్య. విడాకుల మంజూరుకు ముందు ఓ ఆరునెలలు కలిసి ఉండమని ఆ జంటను కోర్టు ఆదేశిస్తుంది. ఈ ఆరు నెలల్లో ఏమౌతుంది? ఉత్తర దక్షిణ ధృవాల్లా మారిపోయిన ఆ భార్యాభర్తలు కలుస్తారా? అన్నది మిగిలిన చిత్ర కథ.




ఇక చెప్పుకోవాల్సింది హీరోయిన్ భూమీ పెడ్నేకర్ గురించి. కాస్త ఎక్కువ బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉందీ అమ్మాయి. మొదటి సినిమా అయినా నటనలో పి.హెచ్.డి ఇచ్చేయచ్చు. నటిగా మారే ముందు కాస్టింగ్ డైరెక్టర్ ట  అమ్మాయి! ఆ కాన్ఫిడేన్స్, ముఖ కవళికలు, భావ ప్రకటన అన్నీ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి వాయిస్ ఎంత స్వీట్ గా ఉందో అసలు. కోపంలో ఉన్నప్పుడు హీరో అంటుంటే తప్ప లావు అనే పాయింటే గుర్తుకురాలేదు. అంత అందంగా నటించిందా అమ్మాయి. యాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో మామూలుగా కనబడే చిట్టి పొట్టి దుస్తుల గ్లామరస్ అమ్మాయిలకు విభిన్నంగా!


ఈ ఇద్దరి తర్వాత హీరో తండ్రి పాత్రధారి సంజయ్ మిశ్రా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకు ముందు " jolly LLB" లో హవాల్దార్ పాత్రలో అలరించిన ఈ నటుడి ప్రతిభకు తగ్గ పాత్రలు ఇంతవరకూ ఎక్కువ దక్కలేదనే చెప్పాలి. హీరో ఇంట్లో ఉండే అతని మేనత్త పాత్ర కూడా గుర్తుండిపోతుంది. ఒక ఉదయాన ఆవిడ మరిది నుండి ఫోన్ వచ్చే సన్నివేశం చాలా టచ్చింగ్ గా ఉంది. హీరోయిన్ తల్లిగా వేసినావిడ చిన్నప్పుడు దూరదర్శన్లో ఫేమస్ అయిన "బునియాద్" సీరియల్లో ఉన్నారని గుర్తు. ఇక పదవ తరగతి చదివే సంధ్య తమ్ముడు చెప్పే డైలాగ్స్ భలే నవ్వు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్స్ ఫ్యామిలీస్ రెండింటిలో అందరు కుటుంభ సభ్యుల మధ్యన అన్యోన్యత, దగ్గరతనం బాగా చూపించారు. ఫ్యామిలీ కోర్ట్ లో కుటుంబసభ్యులందరి మధ్యా వాగ్వివాదాలయ్యే సీన్ కూడా భలే నవ్వు తెప్పిస్తుంది. కోర్టులో కలవగానే వియ్యపురాళ్ళిద్దరూ కాగలించుకుని దు:ఖపడే సీన్ కదిలిస్తుంది.


 తొంభైల్లో పాపులర్ పాటల ద్వారా భార్యాభర్తలు తమ నిరసనలు వ్యక్తం చేసుకునే సీన్ సినిమాకే హైలైట్. హాల్లో అంతా పొట్ట చక్కలయ్యేట్టు నవ్వులే నవ్వులు. ఆ పాటలు తెలిసినవాళ్ళు ఆ సీన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ సాంగ్స్ అన్నీ కూడా. ప్రేమ్ గదిలో చిందర వందరగా పడిఉన్న కేసెట్ల్స్ ద్వారా అతడి జీవితాన్ని, తాను వచ్చాకా అవి సర్దిన సంధ్య మనస్తత్వాన్నీ సింబాలిక్ గా బాగా చూపెట్టారు. చివర్లో భార్యను ఎత్తుకు పరిగెత్తే పోటీ కూడా భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక అనిపించింది. ఈ పోటీలో బరువుని ఎత్తడం అనే విషయం కన్నా ఇద్దరి మధ్యన ఉండే సంయమనమే విజయాన్ని ఇస్తుంది. పోటీ అయిపోయాకా ఆమెని దింపకుండా ఇంటిదాకా తీసుకుపోయే సీన్ నాకు బాగా నచ్చింది.



ఇంకా.. రెండు మూడు సన్నివేశాల్లో భార్యాభర్తలు లో గొంతుకల్లో గుసగుసగా మాట్లాడుకునే డైలాగ్స్,
వాళ్ళ మధ్యన నిశ్శబ్దం,
వాళ్ల కన్నీళ్ళూ,
వారి వారి స్థానాల్లో వారు కరక్టేననిపించే సందర్భాలూ,
రిక్షలో ప్రయాణాలు,
హరిద్వార్,
ఆ పాత పట్టణపు వాతావరణం,
చిత్ర సన్నివేశాల వెనుక మౌనంగా ప్రవహిస్తూ కనబడే పవిత్ర గంగానది,
ఓ పాటలో కనబడే లక్ష్మణ్ ఝూలా,
వేలితోనో పెన్ను తోనో పాడయిన కేసెట్ లోకి టేప్ చుట్టే సన్నివేశం,
ఇవన్నీ కూడా మనల్ని రకరకాల పాత ఙ్ఞాపకాల్లోకి తీశుకువెళ్ళి సినిమాతో బాగా కనక్ట్ అయ్యేలా చేస్తాయి.


మరో విశేషం ఇటాలియన్ కంపోజర్ Andrea_Guerra అందించిన అద్భుతమైన నేపధ్య సంగీతం.  నటీనటుల భావావేశాల ప్రవాహంలో మనల్నీ కొట్టుకుపోయేలా చేస్తుందీ సంగీతం.

చివరిగా ఏం చెప్పనూ... విభిన్నతకు నాంది పలికే ఓ మంచి నిజాయితీ నిండిన ప్రయత్నమీ చిత్రం. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఇలాంటి అతి మామూలు సినిమాలు ఇంకా ఇంకా రావాలంటే మనం ఇలాంటి సినిమాలని ఆదరించాలి. చివరలో డ్యూయెట్ అనవసరం అనిపించింది. అంత చూసే ఓపిక మన జనాలకి ఉండదు కదా! షూట్ చేసేసిన పాటను మధ్యలో పెట్టే అవకాశం లేక చివరలో ఇరికించి ఉంటారనుకున్నాం
.

చిత్రంలో నాకు బాగా నచ్చిన పాట "Moh Moh Ke Dhage" మేల్ వర్షన్తో post పూర్తి చేస్తాను. 


***    ***

Friday, November 21, 2014

हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती..


రోజు ముగిసి, సద్దుమణిగే సమయంలో రేడియో పెట్టుకుని నిద్రపట్టేదాకా వింటూ పడుకునే ఓ అలవాటు చిన్నప్పటి నుండీ! ఇవాళ కూడా ఊపిరి సలపని హడావిడి తరువాత, ఇందాకా రేడియో పెట్టాను.. ఉత్కంఠభరితమైన అమితాబ్ గొంతు ఖంగుమని మోగింది.. గభాలున గుర్తుకొచ్చింది IFFI మొదలైన సంగతి. చేస్తున్న పనులు వదిలేసి వాల్యూమ్ పెంచి, ఆ స్పీచ్  వింటూ కూచుండి పోయాం ఇద్దరం..! ఎంతో ఉత్సాహభరితమైన, ఉద్వేగభరితమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు.. వరుసైన, పధ్ధతైన క్రమంలో చాలా ఉత్తేజాన్ని కలిగించాయి. చివరలో తండ్రిగారైన హరివంశరాయ్ బచ్చన్ ప్రేరణాత్మక కవిత.. "హిమ్మత్ కర్నే వాలోం కీ హార్ నహీ హోతీ.." వినిపించారు తన గంభీరమైన గళంలో!

ఆ చివరి వాక్యాలు...

"संघर्ष करॊ मैदान छॊड मत भागॊ तुम
कुछ कियॆ बिना ही जय जयकार नहीं हॊती
हिम्मत करनॆ वालॊं की हार नहीं हॊती"

సమయానుకూలంగా మా కోసమే చెప్పాడేమో అన్నట్లుగా ఉన్నాయి. ఎంత చక్కని కవితని చెప్పావయ్యా.. లవ్ యూ అమిత్ జీ!! అనుకున్నాం. గబగబా మొత్తం కవిత వెతికి మొదలు నుండీ చివరి దాకా చదివాం. 
నిస్పృహను దులిపేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపే వాక్యాలు..!
ఉత్తేజపూరితమైన ఆ కవిత మొత్తం క్రిందన ..


Wednesday, June 11, 2014

కాస్త ఉప్పు తక్కువైనా రుచి బానే ఉంది!



మొన్న శనివారం రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్ళి వస్తున్నాం.. సమయం 10:10 అయ్యింది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న సినిమా హాల్ దగ్గరకు వచ్చాకా ఏదైనా సినిమాకి టికెట్లు దొరికితే వెళ్దామా అనుకున్నాం. మరి మొదలైపోయినా పర్లేదా అన్నారు అయ్యగారు. ఓకే పదమన్నాను. ఆ హాల్లో సెకెండ్ షో టైం పదింపావు, పది ఇరవై అలా ఉంటుంది. మూడు స్క్రీన్స్ హౌస్ఫుల్ ఉన్నాయి. నాలుగో దాంట్లో టికెట్స్ ఉన్నాయన్నాడు కౌంటర్లో. అదే "ఉలవచారు బిర్యాని" సినిమా. శనివారానికి నిన్న అంటే శుక్రవారం రిలీజయినట్లుంది ఆ సినిమా. "కొత్త సినిమాకి వీకెండ్ టికెట్లు ఉన్నాయా...? ఎలా ఉందయ్యా సినిమా..?" అనడిగితే పర్లేదండి బానే ఉందని చెప్పాడు టికెట్లబ్బాయ్. గబగబా హాల్లోకి ఎంటరయ్యేసరికీ ఆట మొదలయిపోయి ఓ పెళ్ళిచూపుల సీన్ జరుగుతోంది. 

 ఈ సినిమా చూసెయ్యాలని ఆశేమీ పడలేదు కానీ చూడద్దనేమీ అనుకోలేదు. పూర్వాపరాలు కొంత తెలుసు. ప్రకాష్ రాజ్ సొంత సినిమా అనీ, డైరెక్టర్ కూడా అతనే అనీ, ఒరిజినల్ ఒక మళయాళీ చిత్రమనీ,  ప్రకాష్ రాజ్ రైట్స్ తీసుకుని త్రిభాషా చిత్రంగా.. ఒకేసారి మూడు భాషల్లోనూ చిత్రీకరించారనిన్నీ, ఇంకా... ఇళయరాజా సంగీతం సమకూర్చారనీ తెలుసు.(అబ్బో ఎన్ని తెలుసో కదా :)) అంతకు ముందు అతను దర్శకత్వం వహించిన సినిమాలు చూడలేదు కానీ ఒక మంచి కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ అంటే ఓ మంచి ఇంప్రెషన్ ఉంది. ప్రకాష్ రాజ్ ను చూస్తున్నప్పుడు నాకు బాలీవుడ్ నటుడు నానాపాటేకర్ గుర్తుకు వస్తాడు. ఒకేలాంటి ఇంటెన్సివ్ ఏక్టింగ్ ఇద్దరిదీ. కాంట్రవర్సీస్ లో కూడా ఇద్దరూ సమానులే :)


ఇంక సినిమాలోకి వచ్చేస్తే... మొదట నన్నాకట్టుకున్నది ఇళయరాజా టచ్! మొదటి నుండీ చివరిదాకా అలా మనసుని తాకుతూ ఉంది. చిరపరిచితమైన ఆ ట్యూన్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ బిట్స్, పాటల మధ్యన ఇంటర్లూడ్స్.. అన్నీ ఏదో లోకంలోకి తీసుకుపోతూ ఉంటాయి. పాటలు పెద్ద గొప్పగా లేవు :( కైలాష్ ఖేర్ తో పాడించిన పాట లిరిక్స్ బాగున్నాయి కానీ అతని గొంతు ఆ songకు నప్పలేదు. అంతకన్నా అసలు ఇళయరాజా పాడాల్సింది ఆ పాట. రెండవది "తీయగా తీయగా.." క్యాచీగా ఉంది. మూడోది ఓ మాదిరి. నాలుగోది సాహిత్యం బాగుంది. మొదటి రెండు వాక్యాలూ నాకు బాగా నచ్చాయి..

" రాయలేని లేఖనే మార్చటం ఎలా
తీయలేని రాగమే మరవటం ఎలా "

ఈ రెండు వాక్యాలు వినగానే కడుపు నిండిపోయింది. నాలుగింటిలో ఇది బాగుంది. సాహిత్యం చాలా బాగుంది. క్రింద లిస్ట్ లో ఆఖరి పాట..



ఇదేమీ అద్భుతమైన సినిమా అనను కానీ సినిమాలో గుర్తుండిపోయే సీన్స్ కొన్ని ఉన్నాయి. క్లాసిక్ టచ్ ఉన్న సీన్స్. డైరెక్టర్ టేస్ట్ తెలిపే సీన్స్. మణీరత్నం సినిమాలో కనబడేలాంటి సీన్స్ కొన్ని. ఆదివాసి జగ్గయ్య ను ఇంటికి తీసుక్కురావడం, కొన్ని సన్నివేశాల్లో అతని ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేకంగా చూపెట్టడం. అలా అతన్ని ఇన్వాల్వ్ చెయ్యడం బాగుంది. స్నేహ డైలాగ్స్ కొన్ని బాగా నచ్చాయి నాకు. అలానే బ్రహ్మాజీ పాత్ర బాగుంది. బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ ల మధ్యన హాస్యం, ఇంట్లో వాళ్లందరి మధ్య నడిచే సంభాషణలూ బాగున్నాయి. వాళ్ళింట్లో డైనింగ్ టేబుల్ మధ్యన పెట్టిన బుల్లి బుల్లి జాడీలు బాగున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర జరిగే రెండు మూడు సన్నివేశాల్లో ఆ జాడీలు అలానే ఉన్నాయి. మారిపోలేదు. 


నాకసలు అర్థం కానిది ఒక్కటే.. తెలుగులో ఈ Title(ఉలవచారు బిర్యాని) ఎందుకు పెట్టారా? అని. వేరే ఏదైనా పెట్టాల్సింది. అసలా పేరు పెట్టినందుకు ఓసారయినా బిర్యానీనో, ఉలవచారునో వాళ్ళు తింటున్నట్లయినా చూపలేదు. దోశ దోశ.. అని పిలుచుకున్నారు.. కనీసం ఆ కుట్టుదోశ పేరైనా పెట్టాల్సింది.


ట్రైలర్ చూసినప్పుడు "చీనీ కమ్" లాంటి సినిమానేమో అనుకున్నా. అలా తీసినా బాగుండేది. దోశ, కేక్ మేకింగ్ తప్పితే ఎక్కడా మళ్ళీ ఏ రెసిపీ గురించీ మాటలే ఉండవు. మొదటి భాగం ఎంత చకచకా గడిచిందో, రెండవ భాగం అంత స్లో అయిపోయింది సినిమా. ఆ పార్ట్ పట్ల శ్రధ్ధ తీసుకుని ఉంటే చాలా మంచి చిత్రంగా మిగిలి ఉండేది. రెండవ ప్రపంచ యుధ్ధం, ఆ రెయిన్బో కేక్ మేకింగ్ అదీ బాగా వచ్చింది. అలానే ఆదివాసి జగ్గయ్య వెనక్కి వెళ్పోయే సీన్ లో ఏ తెలుగు హీరోనో ఉండి ఉంటే దుమ్ము రేపేసి, అక్కడున్నవాళ్ళందరినీ చితగ్గొట్టేసి, కార్లు ఎగరగొట్టేసి జగ్గయ్యను ఎలాగైనా రష్కించేసేవాడు కదా అనిపించింది..:) అలాంటివి చూసినప్పుడు తిట్టుకుంటాం గానీ నిజంగా అలా మనుషుల్ని పడగొట్టేసి, తుక్కు రేగ్గొట్టేసి, జనాలూ.. 'అమ్మో వీడికి దూరంగా ఉండాలి' అనుకునేలాంటి హీమేన్ ఒకడుండాలి అనిపిస్తూ ఉంటుంది. 'భీమ్ బాయ్ భీం బాయ్..ఇక్కడన్యాయం జరుగుతోంది చూడు' అనగానే వచ్చేసి అక్కడివాళ్ళందరినీ చితగ్గొట్టేసేలాంటి హీమేన్ మనందరికీ కావాలి కదూ..!!




ఇంక స్నేగ..అదే మన స్నేహ గురించి ఎం చెప్పాలి? ఇంకా స్లిమ్ అయిపోయి బోళ్డు అందంగా ఉందిప్పుడు. మంచి మంచి కాటన్ డ్రస్ లు వేసేసుకుంది. కథ మొదట్లో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు దోశ ఆర్డర్ ఇచ్చినప్పుడు వేసుకున్న కాటన్ డ్రెస్(పై ఫోటో లోది) నాకెంత నచ్చిందో. ముఖ్యంగా ఆ  గ్రీన్ చున్నీ..భలే ఉంది. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేసాడు కానీ చివర్లో వాళ్ళీద్దర్నీ పక్కపక్కన చూస్తే.... మన స్నేగ పక్కన ఇతనేమిటీ.. రామ రామ... అనుకున్నా! 

ఓ పెళ్ళికాని అమ్మాయిగా స్నేహ పడే వేదన నిజంగా ఆలోచింపచేస్తుంది. దేశంలో ఎంత అభివృధ్ధి జరిగినా, ఎంత సంపాదన ఉన్నా, మన దేశంలో ఆడపిల్లకి పెళ్ళి అవ్వలేదు అంటే అదేదో ఘోరం, నేరం అన్నట్లు చూస్తారు ఇవాళ్టికీనూ! తన కాళ్ళపై తాను కాన్ఫిడెంట్ గా బ్రతికే అమ్మాయిని కూడా పెళ్ళి తప్ప జీవితానికింకో పరమార్థం లేదు అనుకునేలా చేసేస్తారు జనాలు. పెళ్ళి అనేది ఎవరికైనా జీవితంలో ఓ ముఖ్య ఘట్టం, ఓ భాగం తప్ప పెళ్ళే జీవితం కాదు అని ఈ దేశంలో ప్రజలు ఎప్పటికి నమ్ముతారో కదా అనిపించింది.


చివరికి ఎలానో కథ కంచికి తెచ్చి 'భశుం' అనిపించారు మొత్తానికి. హమ్మయ్య అనుకుని లేచి బయటకు నడిచాం. సినిమా ఇంకా బాగుండి ఉండవచ్చు కానీ హటాత్తుగా అప్పటికప్పుడు అనుకుని హాల్లోకి వెళ్ళి కూచుని డబ్బునీ, సమయాన్నీ నష్టపోలేదని మాత్రం అనిపించింది. నెమరేసుకోవడానికి కొన్ని చక్కని సన్నివేశాలు మిగిలాయి. 

హమ్మయ్య! మూడు రోజుల్నుండీ కుదరలేదు..ఇప్పటికి రాసాను :-)

Saturday, May 24, 2014

అక్కినేని కోసమే 'మనం'


ఈ సినిమా చూడాలనుకోవడానికి ఏకైక కారణం నాగేశ్వర్రావ్. మరొక్కసారి స్క్రీన్ మీదైనా సజీవంగా నాగేశ్వరావ్ ని చూడాలన్న కోరిక. ఆ కోరిక తీరింది. తెరపై డైలాగులు చెప్తూ, నవ్వుతూ చూస్తున్న అక్కినేనిని చూస్తుంటే మనసులో ఏమూలో ఉండిపోయిన బాధకి కాస్త ఉపశమనం కలిగింది. ఈ ఒక్క ఆనందం కోసం "మనం" చూడచ్చు. 


చిత్ర కథ అద్భుతమైనదేమీ కాదు. మామూలు తెలుగు సినిమాలలోలాగనే అవాస్తవికంగానే ఉంది. కానీ అటువంటి కథని దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా నడిపించిన తీరు ప్రశంసనీయం. మొదటి భాగం కాస్త స్లో గా నడిచింది. రెండవ భాగంలో జరగాల్సిన కథ ఎక్కువగా  ఉండటం వల్ల సెకెండ్ హాఫ్ బాగుంది. నాగేశ్వరరావు ఉన్న ప్రతి సన్నివేశాన్నీ రెండూ కళ్ళూ చాలవన్నంత ఇదిగా, ఆత్రంగా చూశాను నేనైతే. మరి మళ్ళీ ఇంకెప్పుడూ కనపడ్డు కదా :(


నాగార్జున చాలా స్మార్ట్ గా ఉన్నాడు. కొడుకుతో డాన్స్ చేస్తూంటే, కొడుకు కన్నా తండ్రే బాగున్నాడు అనిపించింది. శ్రియా బాగా చేసింది. ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్ సీన్స్ లో. ఈ అమ్మాయి కళ్ళు నాకు చాలా నచ్చుతాయి. సమంత కూడా తన వంతు న్యాయం చేసింది. ఎటొచ్చీ నాగచైతన్య పాత్ర గురించే ఆశ్చర్యం వేసింది. అందరి పాత్రలకీ కాస్తో కూస్తో వెయిటేజీ ఉంది కానీ అతని పాత్ర ఎటూ కాకుండా అయినట్లనిపించింది. గత జన్మలో నాగార్జున తండ్రి అన్న ఒక్క పాయింట్ తప్పించి అతని పాత్రలో చిన్న ప్రత్యేకత కూడా లేకపోవడం వల్ల ఆ పాత్రకు అస్సలు వెయిటేజ్ లేకుండా పోయింది. ఎయిర్ హోస్టస్, మహిళా పోలీస్ తో సహా ఆడవాళ్లందర్నీ అలా చూడ్డం నాకసలు నచ్చలేదు. పైగా ఆరోగ్యానికి హానికరం అని చూపెడుతూనే గ్లాసులకి గ్లాసులు తాగేసినట్లు చూపించడం..ప్చ్!!  కానీ తాత, తండ్రి, కొడుకూ ముగ్గురూ ఉన్న సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. థియేటర్లో అంతా కూడా కేకలూ, చప్పట్లు. ANR ఆ వయసులో, అనారోగ్యంతో కూడా అంత ఉత్సాహంగా డైలాగ్స్ చెప్పడం అబ్బురమనిపించింది. నాగేశ్వరావ్ లోని ఆ 'డేడికేటెడ్ ఆర్టిస్ట్' నే నేను ప్రేమించేది. ముగ్గురి పేర్లు అలా మిక్స్ చేసి పెట్టడం బాగుంది.

అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్యసంగీతం బాగుంది. ముఖ్యంగా నాగేశ్వరరావు ఉన్న సీన్స్ లో పియానో, హార్మోనికా, వయోలిన్స్ కలిపి చేసిన ఒక స్పెషల్ musical bit రిపీటవుతూంటుంది. ఆ థీం మ్యూజిక్ బాగుంది. దాన్నే సినిమా భాషలో 'రికరింగ్ రిథిమ్' లేదా 'Leitmotif' అంటారు.


వెకిలి హాస్యం లేదు. గాల్లో ఎగిరే ఫైటింగ్స్ లేవు. అందుకే సినిమా అయిపోయాకా మనసుకి హాయిగా అనిపించింది. అంతా అంటున్నట్లుగా 'ఫీల్ గుడ్ మూవీ' అన్నమాట. నేను చాలా ఎక్కువగా ఆశించడం వల్లనేమో ఇంకా బాగుండి ఉండచ్చు అనిపించింది కానీ బాలేదని మాత్రం అనిపించలేదు. అక్కినేని అభిమానులు, నాగార్జున అభిమానులూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక చివర్లో వచ్చిన షాట్ సూపర్. తాత, తండ్రి, ఇద్దరు మనవలు..మొత్తం నలుగురూ నిలబడిన షాట్. 


చివరలో కనబడ్డ అఖిల్ గురించి ఓ మాట... కుర్రాడు చాకులా ఉన్నాడు! ముఖ్యంగా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోని చూడబోతున్నామన్న ఆశ కలిగింది. 


Monday, May 5, 2014

Monpura




బ్లాగుల్లో ఈమధ్యన మిస్సయిన కొన్ని పాత టపాలు తిరగేస్తూంటే సామాన్య గారి 'అమయ' బ్లాగ్లో ఒక పాట కనబడింది. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉన్న ఆ పాట తాలూకూ సినిమా వివరాలను గూగులించాను. అది "Monpura" అనే బంగ్లా సినిమాలోదనీ, ఆ చిత్రం బాంగ్లా సినీచరిత్రలో కొత్త రికార్డును సృష్టించిందనీ తెలిసింది. చిత్రకథ ఈ మామూలు ప్రేమకథ + విషాదాంతం కూడానూ :( కానీ తన మొదటి సినిమాను దర్శకుడు సృజనాత్మకంగా చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం. వందరోజులు ఆడిన ఈ చిత్రం ఐదు జాతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. "మోన్పురా" దక్షిణ బాంగ్లాదేశ్ లో ఉన్న ఒక అందమైన ద్వీపం. ఈ ప్రాంతం తాలూకూ ఒక జాలరి కుమార్తె విషాదాంత ప్రేమకథే "Monpura" చిత్రకథ.


ఈ చిత్రంలో మొదటగా, ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఫోటోగ్రఫీ, సీనిక్ బ్యూటీ గురించి. చిత్రంలోని పల్లె వాతావరణం, రమణీయమైన ప్రకృతి దృశ్యాలూ ఆనందపరుస్తాయి. యూట్యూబ్ లో మొత్తం చిత్రం ఉంది. కొన్ని సన్నివేశాల్లో అసలు బ్యాక్గ్రౌండ్ దృశ్యాలూ, ఆ ఏంగిల్స్ చాలా బాగున్నాయి. నాయిక కూడా బావుంది. ’సినిమాటోగ్రాఫర్ కమ్రుల్ హసన్ ఖస్రు’ పనితనాన్ని తప్పక అభినందించాలి. తర్వాత సంగీతం. గ్రామీణ చిత్రకథ కాబట్టి సంగీతం కూడా నేచురల్ గా అనిపించాలని బాంగ్లా ఫోక్ మ్యూజిక్ ఆధారంగా తయారుచేసారుట. ఇక ఈ చిత్రంలో పాటల్ని చూసేద్దామా? మొదటిది సామాన్య గారు బ్లాగ్ లో పెట్టినది. చివరిలో ఉన్న ట్రాజిక్ సాంగ్ మినహా మిగతా నాలుగూ కూడా ఇక్కడ లింక్స్ ఇస్తున్నాను. సుందరమైన ప్రకృతినీ, అందమైన చిత్రీకరణనూ చూసి మీరూ ఆనందించండి..


Jao Pakhi Bolo Tare  


 Nithua Pathare  


 Amar Sonar Moyna Pakhi  
 
 Age jodi Jantam


youtube link for the movie:
https://www.youtube.com/watch?v=-R8FmC2v6Uo 



Saturday, April 26, 2014

'Queen' సినిమా... కొన్ని ఆలోచనలు..



'బావుంది చూడమని' కొందరు మిత్రులు చెప్పాకా మొత్తానికి ఇవాళ ఈ సినిమా చూసాను. మొదటిసారి నేను కంగనా ని "గ్యాంగ్ స్టర్" సినిమాలో చూసాను. ఆ సినిమా బాగా నచ్చింది అనేకన్నా నన్ను బాగా కదిలించేసింది అనాలి. ఆ తర్వాత చాలా రోజులు పట్టింది ఆ కథ తాలూకూ బాధలోంచి బయట పడడానికి. ఆ తర్వాత మళ్ళీ మరో కంగనా సినిమా.. అది మధుర్ భండార్కర్ "ఫ్యాషన్"! అది కూడా చాలా నచ్చింది నాకు. ఈ రెండు సినిమాలూ చాలు కంగనా ఎంత ఫైన్ ఏక్ట్రస్సో తెలియడానికి. గాసిప్స్ & రూమర్స్ సంగతి ఎలా ఉన్నా, ఒక మంచి నటిగా గుర్తుంచుకోదగ్గ ఆర్టిస్ట్ కంగనా. ఇప్పుడు "క్వీన్" సినిమా దగ్గరికి వచ్చేస్తే ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ! మొత్తం కథంతా హీరోయిన్ భుజాలపైనే నడుస్తుంది. రాణీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది కంగనా.


కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది. సన్నివేశాలు కాస్త స్లో గా ఉన్నా కథాబలం వల్ల చిత్రం నడిచిపోతుంది. ఈ కథ ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ చాలా నచ్చింది. అది ఏమిటంటే మనుషుల కన్నా జీవితం చాలా గొప్పది. ఎన్ని ఆటంకాలు వచ్చినా జీవితం ఆగిపోదు.. life goes on..! కొద్దిగా మనకొచ్చిన సమస్య లోంచి తల బయటకు పెట్టి జీవితాన్ని పరికించి, పరిశీలిస్తే చాలు! తిరిగి జీవించడానికి మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. మన జీవితంలోకి ఎందరో మనుషులు వస్తూంటారు.. వెళ్తూంటారు. కొందరు వెళ్పోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వము కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడతాము. చాలాకాలం నిలదొక్కుకోలేము కూడా. కానీ "when God closes one door, he'll open another" అన్నట్లు మరో దారి.. ముందరి కన్నా మంచి దారి భగవంతుడే మనకు చూపెడతాడు. ఈ సినిమా చివర్లో తనను కాదన్న పెళ్ళికొడుకు దగ్గరకొచ్చి ఉంగరం ఇచ్చేసి, మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి వెళ్తుంది రాణి. ఆ సీన్ నాకు చాలా చాలా నచ్చింది. ఒకోసారి కొందరు మన జోవితంలోంచి వెళ్పోవడమే మంచిది. అప్పుడు కానీ మనం వాళ్లకి ఎంత అనవసరపు ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవ్వదు.


చిత్రంలో పెళ్ళి తప్పిపోవడం ప్రధాన అంశం కానీ ఈ కథ నాకు చాలా మందిని గుర్తుచేసింది. ఆడ, మగ అని కాదు. ప్రేమ, పెళ్ళీ అని కాదు. అసలు ఏదో ఒక పరిచయం, అనుబంధం పేరుతో జోవితాల్లోకి ప్రవేశించి అర్థాంతరంగా మాయమైపోతుంటారు కొందరు. అలాంటివాళ్ళు గుర్తుకు వచ్చారు. కేవలం నా జీవితం అనే కాదు నా మిత్రులు, పరిచయస్థులు కొందరి జీవితాల్లో కూడా ఇలాంటివాళ్ళను చూశాను నేను. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఇలానే ఉంటుందేమో అనుకుంటూంటాను నేను. మనం పట్టించుకోనంతవరకూ మనకెంతో విలువ ఇస్తారు. వెనక వెనకే ఉంటారు. కానీ ఒక్కసారి మనం పట్టించుకుని ప్రాముఖ్యతనిచ్చి నెత్తిన పెట్టుకున్నామా...అంతే! మనల్ని లోకువ కట్టేసి ఇగ్నోర్  చేసేయడం మొదలుపెడతారు. అంతకు ముందర చూపెట్టిన శ్రధ్ధ, ఆసక్తి ఏమౌతాయో తెలీదు. బహుశా వాళ్ల అవసరం తీరేదాకానో, మన వల్ల పొందాల్సిన సహాయమేదో అయ్యేదాకానో అలా బిహేవ్ చేస్తారేమో అనుకుంటాను నేను. లేదా వాళ్ళు కావాలనుకున్నది మన దగ్గర లభించదు, మన వల్ల వాళ్ల పనులు అవ్వవు అని అర్థమయ్యాకా ఇంక వదిలేస్తారు. కానీ అంతకు ముందు వాళ్ళు చూపెట్టిన శ్రధ్ధనీ, అభిమానాన్నీ చూసి మనం వాళ్ళకు అలవాటు పడిపోతాం. అవతలి వాళ్ళ నిర్లక్ష్యాన్ని భరించి, అధిగమించి, మళ్ళీ ఆ అలవాటు నుండి బయటపడడానికీ మన జీవితం మనం జీవించడానికీ ఎంతో సమయం పడుతుంది. దీనికంతటికీ ఎవర్నో ఏమీ అనలేము. మనమే దానికి బాధ్యులం. ఒక వ్యక్తికో, అభిమానానికో, అలవాటుకో బానిస అయిపోవడం మన బలహీనత. కానీ అందులోంచి బయటపడ్డాకా కానీ తెలీదు మనం కొందరికి ఎంత అనవసరపు ప్రాముఖ్యత ఇచ్చామో. అలాంటి ఒక బలహీనత లోంచే బయటపడుతుంది "క్వీన్" చిత్రనాయిక "రాణీ". సినిమాలో ఏ రకమైన సన్నివేశాలు చూపెట్టినా నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి తన బాధలోంచి బయటపడటం. 


ఈ చిత్రంలో ఓ పెళ్ళికొడుకు ఓ అమ్మాయి వెంట పడి, పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలి, తీరా ఆమె ఒప్పుకుని అతడ్నే నమ్ముకుని, అతడికి అలవాటు పడిపోయి, పెళ్ళికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యాకా హటాత్తుగా పెళ్ళి వద్దని వెళ్పోతాడు. కన్నీళ్ళతో ప్రాధేయపడినా వినడు. ఒక్కసారిగా ఆ అమ్మాయి ప్రపంచమంతా తలక్రిందులైపోతుంది. కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళి జీవితాన్ని చూశాకా ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది. తన దు:ఖం జీవితాన్ని తలక్రిందులు చేసేది కానే కాదని. మనుషుల చుట్టూ, అనుబంధాల చూట్టూ జీవితాన్ని ముడిపెట్టేసుకోవడం కన్నా జీవితాన్ని జీవించడంలో ఎంతో ఆనందం ఉందని తెలుసుకుంటుంది. ఆ అబ్బాయి వద్దన్నాడు కాబట్టే తను ఆ సంగతిని కనుక్కోగలిగింది. అందుకే చివర్లో థాంక్స్ చెప్తుంది. ఇదే సత్యాన్ని మనం చాలా సందర్భాలకు అన్వయించుకోవచ్చు. ఒక చెడు సంఘటన, చేదు అనుభవం మొత్తం జీవితాన్ని చీకటి చేసేయదు. ఆ క్షణంలోనే ఉండిపోతే తప్ప!! ఆ క్షణాన్ని దాటి ముందుకు వెళ్తే తెలుస్తుంది జీవితం ఎంత గొప్పదో.. మనకు ఎన్ని ఆనందాలను ఇవ్వగలదో! నేనూ ఇలాంటి ఎన్నో క్షణాలను దాటి ముందుకు నడిచాను కాబట్టే నాకు ఈ చిత్రం నచ్చింది. 


ఇవాళ్టిరోజున నేను మనుషులనూ, అనుబంధాలనూ, సిధ్ధాంతాలనూ.. ఏమీ నమ్మను. జీవితాన్ని మాత్రం నమ్ముతాను. జీవితం అందించే పాఠాలను నేర్చుకుంటాను.. మనుషుల కన్నా జీవితమే ఎక్కువ ఆనందాలను ఇవ్వగలదని నమ్ముతాను.. ఎందుకంటే నేను దాటిన చీకటి క్షణాల నుండి నేను జీవితాన్ని ప్రతిక్షణం జీవించడం నేర్చుకున్నాను కాబట్టి..!

Monday, April 21, 2014

బానే ఉందనిపించిన '2 States'



సిన్మా చూడ్డానికి ఊళ్ళో హాల్స్ కి వెళ్లాలంటే పదిహేను, ఇరవై కిలోమీటర్లు పైమాట. అంత పరుగులెట్టే గొప్ప సిన్మాలు లేవు..టైం వేస్ట్ కూడా. సో, మా ఇంటి దగ్గర హాల్లోకొచ్చిన వాటిల్లో ఏదో ఒకటి చూడటం కుదురుతోందీ మధ్యన. ఇంట్లో అత్తయ్యగారున్నారని పాపని అట్టేపేట్టి, రిలీఫ్ కోసం ఏదో ఒకటిలెమ్మని ఈ సినిమాకెళ్ళాం. షరా మామూలే.. అప్పటికప్పుడు అనుకున్నందువల్ల, గబగబా పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళేసరికీ సిన్మా మొదలైపోయింది :( 


ఈ చిత్రానికి ఆధారమైన నవల చదవలేదు కానీ 'ట్రైలర్' చూసి అసలు చూడాలనుకోలేదీ సినిమా. కాలేజీపిల్లలను తప్పుదోవ పట్టించేట్లు ఉందనిపించింది! ఫస్ట్ హాఫ్ నిజంగా అలానే ఉంది. ఇళ్ళకి దూరంగా హాస్టల్లో చదువుకునే పిల్లలంతా నిజంగా ఎలా ఉంటారో తెలీదు కానీ ఇలాంటి సినిమాలు చూస్తే నిజంగా భయమేస్తుంది పిల్లల్ని దూరాలు పంపడానికి. పైగా ఈమధ్యన సినిమాల్లో ఇలా పెళ్ళికాని ప్రేమికుల మధ్యన ఇంటిమేట్ సీన్స్ చూపించడం రివాజయిపోయింది. సమాజం ఏమైపోతోందో..నైతిక విలువలు ఎటు పయనిస్తున్నాయో.. అన్న దిగులు కలుగుతుంది ఇలాంటివి చూసినప్పుడు. 


ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అక్కడక్కడ బోరింగ్ అనిపించింది. ఇదేదో కాలేజీ పిల్లల కోసం తీసిన సినిమా.. పొరపాటున వచ్చామా..అనుకున్నాం కానీ సెకెండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఎక్కడైతే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చూపించాడో, అక్కడ స్టోరీలో డెప్త్ వచ్చింది. "ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు కానీ పెళ్ళాడాలంటే రెండు కుటుంబాలు కలవాలి" అనే డెఫినిషన్తో తెలుగులోనూ, హిందీ లోనూ కూడా డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల పిల్లల మధ్యన ప్రేమ,పెళ్ళి నేపథ్యంతో రీసేంట్ గా చెప్పాలంటే 'చెన్నై ఎక్స్ప్రెస్' లో తమిళమ్మయి-హిందీ అబ్బాయి, దానికన్నా ముందు 'విక్కీ డోనర్' లో పంజాబీ-బెంగాలీ ఫ్యామిలీస్ మధ్యన ఘర్షణ చూపెట్టారు. ఇందులో కొత్తగా ఏముందంటే తండ్రీ కొడుకుల మధ్యన డిస్టర్బ్ద్ రిలేషన్. అది గ్రాడ్యువల్ గా ఎలా బాగయ్యిందో చూపెట్టడం బాగుంది. టివీ సీరియల్స్ తో తలపండిపోయిన రోనిత్ రాయ్ హీరోకి తండ్రిగా బాగా చేసాడు. అమృతా సింగ్ కన్నా వీరోవిన్ తల్లి పాత్రలో రేవతి బాగా మెప్పించింది. 


"ఐ వాంట్ టూ మేరీ యువర్ ఫ్యామిలీ" అని హీరో త్రీ రింగ్స్ తో ప్రొపోజ్ చెయ్యడం చాలా బాగుంది. బాలీవుడ్ కి మరో యంగ్ & ప్రామిసింగ్ హీరో దొరికాడు. పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటే నిలబడగలడు. క్రితం వారం ఏదో పేపర్లో ఇతనిదో పెద్ద ఇంటర్వ్యూ చదివాను. అందులో ఎంతవరకూ నిజాయితీ ఉందో తెలీదు కానీ బాగా మాట్లాడాడు. ఇక 'ఆలియా భట్' గురించి కొత్తగా చెప్పేందుకేమీ లేదు. చిరునవ్వుతో సహా తల్లిపోలికలు బాగా ఉన్న యంగ్ & ఎనర్జిటిక్, టాలెంటెడ్ తాటాకుబొమ్మ. చివర్లో పెళ్ళికూతురు డ్రెస్ లో అచ్చం బొమ్మలా ఉంది. చిన్నవైనా expressive eyes ఉన్నాయీ అమ్మయికి. But, సినీలోకపు కమర్షియల్ పరుగుపందాల్లో జారిపోకుండా ఉంటుందా అన్నది ప్రశ్నే! 


తమ కుటుంబాలను ఏకం చేసే ప్రయత్నాలేమీ ఫలించట్లేదని, క్రిష్ కూడా సహకరించట్లేదనిపించి అతనికి దూరంగా జరిగడం నచ్చింది నాకు. ఆ పాయింట్ లో, మళ్ళీ హీరో తండ్రి వచ్చి వెళ్ళాకా క్రిష్ కు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి పాత్రకు ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. అక్కడ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఒక మామూలు కమర్షియల్ సినిమాలా మూడు ఫైట్లు, ఆరు పాటలతో పూర్తి చెయ్యకుండా ప్రేమికులు తల్లిదండ్రుల అనుమతి కోసం పాటుపడడం అనే కాన్సెప్ట్ వల్ల వెయిటేజ్ పెరిగి బానే ఉంది.. పైసా వసూల్.. అనిపించుకుందీ సినిమా. Moreover.. there is love... love that we can feel with our hearts! 


పాటలన్నీ ఓ మాదిరే కానీ అమితాబ్ భట్టాచార్య రాసిన ఈ పాట సాహిత్యం చాలా బాగుంది... 



Monday, March 24, 2014

ఆదివారం - రెండు సినిమాలు..



ఈ వారమంతా శెలవులని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అది లేకపోతే ఏమి తోచట్లేదు :( నిన్న సాయంత్రం ఆరున్నరకి అనుకున్నాం.. ఏదైనా సినిమాకెళ్దామా చాలారోజులైంది అని. లాస్ట్ 'ఉయ్యాలా జంపాల' అనుకుంటా!  సరే ఏది దొరికితే అది చూద్దాం లే అని మా ఇంటి దగ్గర్లో ఉన్న హాలుకి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ షో ఏడింటికి. మేం డిసైడై తయారయి వెళ్ళేసరికీ ఏడయ్యింది. తీరా అక్కడ ఒక్క పేరూ చూడాలని అనిపించేలా లేదు! ఉన్న నాలుగింటిలో 'రాజా రాణి' అనే పోస్టర్ కాస్త చూడబుల్ గా అనిపించి అడిగితే అది ఫస్ట్ షో లేదన్నాడు. మరేముందయ్యా అంటే.. 'భద్రమ్!' అన్నాడు. సరే ఏదో ఒకటి ఇవ్వు అని టికెట్ తీసుకుని వెళ్ళేసరికీ టైటిల్స్ పడుతున్నాయి. కానీ లాస్ట్ మినిట్ డెసిషన్ నాదే కాబట్టి.. "అసలూ తెర తీసినప్పటి నుండీ తెర పూర్తిగా పడేవరకూ చూస్తేనే సిన్మాచూడటం తాతలనాటి ఆచారం మా ఇంట్లో..." అంటూ నూటొక్కోసారి అయ్యగారిని దెప్పే చాన్స్ పోయింది!




సిన్మా సగం దాకా సస్పెన్స్ బాగానే మెయింటైన్ అయ్యింది. ఒకటి రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. నేపథ్యసంగీతం కూడా ఓకే. కానీ ఎప్పుడైతే ఇన్సురెన్స్ పాలసీ గురించి రివీలయ్యే పాయింట్ వచ్చిందో అప్పుడిక క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ అయిపోయింది. అసలు అది తేలే ముందరే నాకు అర్థమైపోయింది ఇలా రిలేషన్ లేని మనుషులని కనక్ట్ చేసే పాయింట్ ఏదో ఉందన్నమాట అని! నాకిలాంటి సస్పెన్స్ సినిమాలంటే భలే సరదా! చిన్నప్పుడు(ఇప్పుడు కూడానూ:)) భయం వేస్తున్నా చెయ్యి అడ్డుపెట్టుకుని వేళ్ల సందుల్లోంచి చూసేసేదాన్ని కానీ చూడ్డం మానేదాన్ని కాదు. సో, సస్పెన్స్ బ్రేక్ అయిపోయాకా ఇంక ఇంట్రస్ట్ పోయింది. పైగా సెకెండ్ హాఫ్ చివర్లో బాగా డ్రాగ్ అయ్యింది. అసలు క్లైమాక్స్ అయితే బోర్ అనిపించింది. ప్రొఫెసర్ గారిని ఇరికించేసారు కల్ప్రిట్ ఫ్రేమ్ లో ఆఖరికి! ఇంకా నయం ఫ్రెండ్ సలీమ్ ని ఇరికించలేదు అని నవ్వుకున్నాం. హీరో పర్లేదు. హీరోయిన్ కూడా బాగానే చేసింది కానీ ఏమిటో బక్కగా ఉఫ్ అంటే ఎగిరిపోయేలా.. పాపం! పెద్ద కళ్లైనా నచ్చలే నాకు! ఫొటోగ్రఫీ బాగుంది. చాలా మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి. టైటిల్స్ అయిపోయాయిగా పేరు చూడలేదు :(





రెండో సినిమా:

భద్రమ్ అయిపోయి బయటికి వస్తుంటె అన్నా.. రాజారాణి అనుకున్నాం కదా అది కూడా చూసేసి వెళ్పోదామా అని! అయ్యాగారు టికెట్స్ కొనేసారు. ఓ అరగంట టైమ్ ఉంది. ఇంటికెళ్ళి తిని రావడానికి లేదు. మా ఇంటి నుండి పది,పదిహేను కిలోమీటర్లు దూరమెళ్తే కాని టిఫిన్ సెంటర్స్ లేవు. ఇంక అక్కడే పక్కన పీజ్జా కార్నర్ ఉంటే వెళ్లాం. బహుశా మూడునాలుగేళ్ల తరువాతేమో పీజ్జా తిన్నా! ఇదివరకూ పీజ్జా బేస్ కొనుక్కొచ్చి మరీ ఇంట్లో చేసేదాన్ని!!


టైమ్ అయిపోతోందని గబగబా తినేసి మళ్ళీ హాల్లోకొచ్చాం. అసలు వీకెండ్ లో డకోటా సినిమాక్కూడా టికెట్లు దొరకవు. అలాంటిది హాల్లో బొత్తిగా ఇరవై మంది కూడా లేరు. క్రికెట్ ఎఫెక్ట్ అనుకున్నాం. కమర్షియల్ ఏడ్స్ అయిపోయి కొత్త సినిమా ట్రైలర్స్ మొదలైయ్యాయి. రెండు ట్రైలర్స్ అయ్యాకా 'రాగిణి ఎమ్మెమ్మెస్' అని సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. మళ్ళీ 'పొగాకు ఆరోగ్యానికి హానికరం' వచ్చింది. ట్రైలర్ క్కూడా మధ్యలో ఏడ్ ఏమిటో అనుకున్నాం! ఇంతలో ఢామ్మని సినిమా మొదలైపోయింది. నాక్కాస్త కంగారేసింది. ఇదేమిటండీ ఏ సినిమా టికెట్టు కొన్నారు? అనడిగా. గబగబా హాలు ఎంట్రన్స్ దగ్గరికెళ్ళి బాబూ ఇదేం సినిమా అనడిగితే 'రాగిణి ఎమ్మెమ్మెస్' అన్నాడతను. నాకు ఇంకా కంగారేసింది. మేము ఫలానా దానికని టికెట్టడిగాం అన్నా. మా టికెట్స్ చూసి సెకెండ్ ఫ్లోర్ లోని స్క్రీన్ కి వెళ్లాలి మీరు అన్నాడు. ఇందాకా టైమ్ అయిపోయిందని స్క్రీన్ నంబర్ సరిగ్గా చూడలేదని అర్థమైంది. మేం గబగబా అసలు హాలుకి వెళ్ళేసరికీ పావుగంట ఆట అయిపోయింది :((




ఈ సినిమా టైటిల్ వేరేది పెట్టాల్సింది. సినిమా బానే ఉంది. not bad.. తప్పకుండా చూసేయక్కర్లేదు కానీ ఓసారికి చూడచ్చు. ముఖ్యంగా థీమ్ బాగుంది. తమిళ్ సినిమా కాబట్టి కొన్ని సీన్స్ కాస్త ఓవర్ అనిపించాయి. ఇద్దరు హీరోలూ పర్వాలేదు. బాగానే చేసారు. నయన తార బాగుంది కానీ క్లోజప్స్ ఎందుకో భయపెట్టాయి. సెకెండ్ హాఫ్ లో కట్టుకున్న ఓ ఎల్లో చీర చాలా నచ్చింది నాకు. ఆ రెండవ హీరోయిన్ ఎవరో కాని  బాగుంది. పెద్ద కళ్ళు, మంచి ఎక్స్ప్రెషన్స్. ఈ అమ్మాయీ సన్నంగానే ఉంది గానీ ఇందాకటి సిన్మాలో హీరోయిన్ కన్నా బాగుంది. నయన తార ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెద్ద లాజికల్ గా లేకపోయినా అందులో ఉన్న డెప్త్, రెండవ హీరో కథలో లేదు. సత్యరాజ్ పాత్ర బాగుంది. చివర్లో కూతురికి "ఇదే నీ ఇల్లు, ఇదే నీ జీవితం.." అని చెప్పడం నచ్చింది నాకు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది కమెడియన్ సంతానం. ఇతని సిన్మా గతంలో కూడా ఒకటి చూసాను. మనిషి బావుంటాడు. డైలాగ్స్ బాగా చెప్తాడు. ఈ సిన్మాకి సగం స్ట్రెంత్ ఇతని పాత్రే! ఇలాంటి యంగ్ కమెడియన్ మన తెలుగులో కూడా ఎవరైనా రాకూడదూ..రొటీన్ ఓల్డ్ రోల్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది.. అనిపించింది. మొత్తానికి ఎలాగోలా భశుం! అనిపించి ఇంటికి చేరాం.


ఏదేమైనా ఓ మంచి సినిమా చూసాం అని satisfy అయ్యేలాంటి తెలుగు సినిమా ఈమధ్యకాలంలో ఏదీ రాలేదు!



Sunday, December 29, 2013

"ఉయ్యాల జంపాల" - ఓసారి ఊగచ్చు..


'అత్తారింటికి దారేది' తర్వాత మళ్ళీ నిన్న "ఉయ్యాల జంపాల" ఊగడాకిని వెళ్లాం. హాల్లొంచి బయటకొస్తుంటే 'పర్లేదు.. ఓసారి ఊగచ్చు' అనుకున్నాం! ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లడం వల్ల నేను నిరుత్సాహపడలేదు. బావా మరదళ్ల కాన్సెప్ట్ పాతదే అయినా కథని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాకి ప్రాణం, గాలి, నీరు, ఆక్సిజన్ అన్నీ హీరోనే! ఆ కుర్రాడు బాగా చేసాడు. తంతే లారీలూ,జీపులు ఎగురిపోయేంతలా ఎలివేట్ చెయ్యకుండా కేరెక్టర్ ని ఎంతవరకూ చూపెట్టాలో అంతవరకే చూపెట్టాడు. కానీ హీరోని ఉన్నతంగా నిలబెట్టే ప్రయత్నంలో వీరోవిన్ క్యారెక్టర్ పై దృష్టి కాస్త తగ్గిందేమో అనిపించింది. అల్లరిగా చెలాకీగా కనబడ్డా, కాస్త బుర్ర తక్కువ అమ్మాయిగా, తిండిపోతులా చూపించడం వల్ల ఆ పాత్రకు మార్కులు తగ్గిపోయాయి. కొన్ని సీన్స్ లో ఆ అమ్మాయికి మేకప్ కూడా సరిగ్గా వెయ్యలేదు పాపం.


గోదావరి జిల్లాల అందాలను కెమేరాలో అందంగా బంధించారు. గోదారి యాసని చక్కగా వాడుకున్నారు. అందువల్ల ఆ ప్రాంతాలవాళ్ళు బాగా కనక్ట్ అయ్యి ఇది మన కథే అనుకునేలా ఉంది. నాకైతే ఆ హీరో మానరిజంస్ చూస్తున్నా, అతని మాటలు వింటున్నా అచ్చం నర్సాపురవాసి అయిన మా మావయ్యగారి మనవడిని చూస్తున్నట్లు, అతనితో మాట్లాడుతున్నట్లే అనిపించింది. 


వెకిలి హాస్యం లేకపోవడం హాయినిచ్చింది. హీరో,హీరోయిన్ ఇద్దరి స్నేహితులూ కొత్తవారే అయినా ఆ ప్రాంతాలతాలూకూ నేటివిటితో విసుకుతెప్పించలేదు. ఏ ఘట్టాన్ని ఎంతవరకు లాగాలో అంతవరకూ మాత్రమే సాగదీయడంలో దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు స్టేజి మీద నాటకం చూస్తున్న ఫీలింగ్ ని కలగజేసాయి. "లపక్ లపక్" అనే పాట కాస్త బోర్ అనిపించింది. దర్శకుడు ఇంకొన్ని జాగ్రత్తలు పాటించి ఉంటే ఒక మంచి చిత్రంగా మిగిలి ఉండేదేమో అనిపించింది. తప్పక చూసితీరాల్సిన చిత్రం కాదు గానీ కుటుంబసమేతంగా వెళ్ళి ఓసారి చూసి రావచ్చు అనదగ్గ చిత్రం.


 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టుగా బాగుంది. పాటల్లో ఈ టైటిల్ సాంగ్ ఒక్కటీ నాకు చాలా బాగా నచ్చింది:

Monday, July 29, 2013

రహస్య గూఢచారులకు నివాళి - D-Day



 Yes, its a tribute to all our secret agents who risk their lives for the sake of our country. Their sacrifices are worthy, but the saddest part is that they die unknown. మనకు తెలిసి దేశం కోసం పోరాడేది దేశ సైనికులైతే, తెలియకుండా దేశాన్ని రక్షించే రహస్య గూఢచారులు ఎందరో ఉంటారు. చాలామంది చేసే త్యాగాలు ప్రజలకు తెలియకుండానే ఉండిపోతాయి. దేశ రక్షణ కోసం తమ జీవితాలను పణంగా పెట్టే అటువంటి గుర్తు తెలియని వీరుల కోసం ఒక్కసారి తప్పక చూడాలి అనిపించే సినిమా D-Day! 


కజిన్స్ అందరూ కలవాలని ప్లాన్ చేసుకుని ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసారు. శనివారం రాత్రి షో, అదీ సీరియస్ మూవీ అనేసరికీ నాకు కొంచెం బోర్ గా అనిపించింది. కానీ అందరిని కలవాలనే ఉద్దేశంతో ఓకే చెప్పేసి బయల్దేరాం. హాఫ్ హర్టెడ్ గా సిన్మా హాల్లో కూచున్న నేను మూవీ మొదలైన పదినిమిషాల్లో బాగా లీనమైపోయాను. ఆసక్తికరమైన కథనంతో, చక్కని ఏక్షన్ సన్నివేశాలతో, చివరిదాకా ఉత్కంఠం రేపుతూ సాగింది సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. 


'నిఖిల్ అద్వానీ' దర్శకత్వం వహించిన ఐదు(?) సినిమాల్లో నేను 'Kal ho naho', 'salaam-e-ishq'.. రెండే చూసాను. ఆ రెండుంటికన్నా ఎన్నో రెట్ల పరిపక్వత కనపడింది ఈ సినిమాలో. చిన్నప్పటి దూరదర్శన్ సిరియల్స్ రోజుల్నుండీ ఇర్ఫాన్ ఖాన్ మంచినటుడన్న అభిప్రాయం. సినిమాల్లోకొచ్చాకా అతని ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది అనుకుంటుంటాను నేను. నటినటులందరూ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. నలుగురు సీక్రెట్ ఏజంట్లుగా ఇర్ఫాన్, అర్జున్ రాంపాల్, హ్యూమా ఖురేషీ, కొత్త నటుడు సందీప్ కులకర్ణీ; గోల్డ్ మాన్ 'ఇక్బాల్ సేఠ్' గా రిషి కపూర్, ఇర్ఫాన్ వైఫ్ గా వేసిన అమ్మాయి అందరూ కూడా పోటీపడి నటించారా అనిపించింది. ముఖ్యంగా అర్జున్ రామ్ పాల్ చాలా బాగా చేసాడు. ఇర్ఫాన్ ఖాన్ ఫ్యామిలితో ఉండే సీన్స్ ఇమోషనల్ గా ఉన్నాయి.


ఊహించని మలుపులు తిరుగుతూ కథనం సాగిన తీరు బాగుంది. ఉద్వేగానికి లోనైనా చివరిసమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు వాలీ ఖాన్(ఇర్ఫాన్ ఫాన్). క్లైమాక్స్ లో ఇక్బాల్ ఖాన్(రిషి కపూర్), రుద్ర్ (అర్జున్ రామ్ పాల్) ఇద్దరూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.. ఆలోచింపజేస్తాయి. నాజర్ బాగా చేసాడు, కష్టపడి తన డైలాగ్స్ తనే చెప్పుకున్నాడు కానీ అతని హిందీ ఏక్సెంట్ పూర్ గా ఉంది. డబ్బింగ్ చెప్పించాల్సింది లేదా అతనొక సౌత్ ఇండియన్ ఆఫీసర్ అని చూపించాల్సింది. శృతి హాసన్ రోల్ చిన్నదే అయినా బాగా చేసింది. అయితే కథకు ఏ మాత్రం ఉపయోగపడని ఆ పాత్ర అనవసరమేమో అనిపించింది. ఇక సినిమాలో ఉన్న మరో మెరుపు 'రాజ్ పాల్ యాదవ్'. కమిడియన్ గా పేరుపొందిన రాజ్ పాల్ తన నటనాకౌశలాన్ని mein meri patni aur woh ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో "దమాదమ్ మస్త్ కలందర్" పాడే ఉత్సాహావంతమైన గాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తాడు. 


'శంకర్-ఎహ్సాన్-లాయ్' అందించిన నేపధ్యసంగీతం బాగుంది. సీరియస్ మూవీలో పాటలు ఎందుకసలు అనిపించింది. "అల్విదా" పాట సాహిత్యం బాగుంది కానీ శృతి మరణవిధానాన్ని తెలిపే నేపథ్యంలో ఆ పాట పెట్టడం నాకైతే నచ్చలేదు. సంగీత దర్శకుడు 'విశాల్ భరద్వాజ్' భార్య 'రేఖ భరద్వాజ్' పాడిన "ఏక్ ఘడీ" పాట నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. ఆ రెండు పాటల లింక్స్ క్రింద ఇస్తున్నాను... 

 alvida 

ek ghadi 


'D-Day' tralier:

 


Wednesday, July 17, 2013

రెండు కొత్త సినిమాలు



విడిగా రాయటం కుదరట్లేదని ఈమధ్యన చూసిన రెండు సినిమాల గురించి ఒకే టపాలో రాసేస్తున్నా..

1. Lootera - a beautiful painting !

నిజంగా ఒక అందమైన చిత్రం ఇది. ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పైంటింగ్ లాగ ఉంది. ఫోటోగ్రఫీ అద్భుతం. 1950s ప్రాంతానికి సంబంధించిన ఒక బెంగాలి జమిందారు, అతని కూమార్తె తాలుకూ కథ "లుటేరా". ఆ కథకు తోడుగా, ప్రఖ్యాత ఆంగ్ల కథకుడు ఓ.హెన్రీ కథానిక "The Last Leaf" కధను ఈ సినిమా రెండవ భాగంలో వాడుకున్నారు. 


ఈనాటి ఫాస్ట్ ఫార్వార్డ్ కాలంలో ఇలాంటి స్లో సినిమాను తీసినందుకు దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. విక్రమాదిత్య మోత్వానికి తన రెండవ సినిమా కూడా అవార్డుల వర్షం కురిపించేస్తుంది అనిపించింది. అసలు చిత్రం షూటింగ్ కి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయిట. షూటింగ్ కాన్సిల్ అయి, బోల్డు డబ్బు వృధాపోయిందిట. అయినా మళ్ళీ మంచు ప్రాంతపు లొకేషన్ సెట్టింగ్స్ వేసి మరీ పూర్తిచేసారుట సినిమాను. 


కథాంశం పాత తరానికి చెందినది కాబట్టి నాయికా నాయకుల వస్త్రధారణ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా వాడారు. నాయిక "పాఖీ" పాత్రను 'సోనాక్షి సిన్హా' గుర్తుండిపోయేలా, సమర్థవంతంగా పోషించింది. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనచ్చు. అసలీ కాలంలో కనబడుతున్న తాటాకుబొమ్మల్లాంటి వీరోవిన్నుల్ని చూసి చూసి కళ్ళు కూడా సన్నబడిపోయాయేమో, తెరపై నిండుగా, బొద్దుగా, ముద్దుగా, సిన్మా మొత్తం చీరకట్టులో కనబడ్డ ముద్దుగుమ్మ నిజంగా మనసుని దోచేసింది. ఆమె ముక్కు మాత్రం కాస్త చెక్కేసినట్లు ఉంది గానీ పిల్ల అందంగానే ఉంది. నాయకుడు పాత్ర కాస్త నెగెటివ్ షేడ్ ఉన్నది కాబట్టి 'రన్వీర్ సింగ్' మొహం సరిగ్గా సరిపోయింది అతని పాత్రకి. 


పరమ స్లో టేకింగ్! కొన్ని సీన్స్ లో నాకే బోర్ కొట్టింది ఇంకా కెమేరా కదపడేంటి? ఏం చెప్తాడు ఇంకా? అని. (ముఖ్యంగా కొలను దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సీన్ లో.) కొత్త సినిమాల్లోని హడావుడి డైలాగులతో, షాట్స్ తో, ఫైటింగులతో, సీన్ లో అంతమంది ఎందుకున్నారో కూడా తెలియని గుంపు బంధుత్వాలతో, లేనిపోని ఆర్భాటాలతో విసిగిపోయి ఉన్నామేమో చిత్రం లోని స్లో టేకింగ్ ని, అతితక్కువ పాత్రల్ని కూడా ఎంజాయ్ చేసాము మేము. స్టేజ్ ఫిఫ్టీస్ లోది కదా అందుకని టెకింగ్ కూడా అప్పటి సినిమాల మాదిరిగా తీసారేమో అనుకున్నా. 


సంగీత దర్శకుడు 'అమిత్ త్రివేది', పాటల రచయిత 'అమితాబ్ భట్టాచార్య' ల కాంబినేషన్ బాగా కుదిరినట్లుంది. వీరిద్దరి జోడీలో వచ్చిన పాటలన్ని బాగుంటున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగినట్లుగా ఉంది. 'SAWAAR LOON' పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట గురించి ఈ టపాలో చూడవచ్చు: http://samgeetapriyaa.blogspot.in/2013/07/sawaar-loon.html


ఈ 'మన్నర్జియా' పాట కూడా బాగుంది..

అసలు ట్రాజడీల జోలికి వెళ్ళని నేను ఒక రొమాంటిక్ ట్రాజెడిని మొదటిసారి ఎంజాయ్ చేసాను. బహుశా హీరో చెడ్డవాడు కాదు, ఆమెను మోసం చెయ్యలేదు నిజంగానే ఆమెను ప్రేమించాడు అన్న సాటిస్ఫాక్షన్ వల్లనేమో! ఇంత మంచి సినిమాను నాకు చెప్పకుండానే టికెట్లు బుక్ చేసేసి చూపించినందుకు 'తుమ్ పర్ లగాయీ మేరీ సారీ షికాయెతే మాఫ్' అనేసా శ్రీవారితో :-) 

ఈ సినిమా ట్రైలర్:


2. సాహసం - విఠలాచార్య రంగుల సినిమా 



ఈమధ్యన చూసిన రెండవ సినిమా గోపీచంద్ నటించిన "సాహసం". ఈ సినిమా కోసం నేనైతే ఎదురుచూసాననే చెప్పాలి. చిన్నప్పుడు "ట్రెజర్ ఐలాండ్" చదివిన రోజుల్నుండీ నాకు ఎడ్వంచర్స్ అంటే మహా ఇష్టం. హీరో గోపీచంద్ + ఇలాంటి థీం అనగానే బాగుంటుందేమో అని ఆశ. పైగా ఈ దర్శకుడు గతంలో తీసిన సినిమాలు కూడా నా ఆశను నిలబెట్టి ఉంచాయి. నేను ఇలా ఎక్కువగా ఆశ పడిపోవటం వల్ల కాస్త నిరుత్సాహపడ్డాను కానీ మొత్తమ్మీద సినిమా బాగుంది. 


మన 'జానపద బ్రహ్మ' విఠలాచార్య సినిమాలు చూసినప్పుడల్లా.. అసలు ఈయనకు ఇప్పటి టెక్నాలజీ, గ్రాఫిక్స్ అందుబాటులో ఉండి ఉంటే స్పీల్బర్గ్ ను మించిన అద్భుతాలు సృష్టించేవాడు కదా అనుకుంటూ ఉంటాను. ఇంకా, ఇప్పుడెవరూ ఇలాంటి సినిమాలు తియ్యరేమని దిగులుపడుతుండేదాన్ని. ఇన్నాళ్లకి ఆ సరదా తీరింది. ఈ సినిమా రెండవ భాగంలో గుడి లోపల సీన్లు చాలా బాగా వచ్చాయి. మళ్ళీ విఠలాచర్య సినిమా చూసినంత ఆనందం కలిగింది. ఆ తలుపులు, పాత నిర్మాణాలూ, సెట్టింగ్స్ అంతా కూడా అద్భుతంగా వచ్చాయి. 


'శ్రీ' చాలా రోజులకు సంగీతాన్ని అందించారు బాగుంటాయి పాటలు అనుకున్నా కానీ పాటలు పెద్ద గొప్పగా లేవు. అసలు ఆ పాటలు కూడా ఏదో పేట్టాలి కాబట్టి పెట్టినట్లు ఉన్నాయి. అవి లేకపోయినా బాగుండేది సినిమా. అయితే 'నేపథ్యసంగీతం' మాత్రం చాలా బాగా చేసారు. సన్నివేశాలకు ప్రాణం పోసేది నేపథ్యసంగీతమే మరి! 


ఈ సినిమాలో వీరోవిన్ను ని మొదటిసారి కాస్త భరించగలిగాననిపించింది. వెకిలి కామిడీ ట్రాక్ లేకపోవటం హాయి నిచ్చింది. పెద్ద సెక్యూరిటి ఆఫీసర్ గా అలీని పెట్టడం బాగుంది కానీ అంత పెద్ద ఆఫీసర్ అని చెప్తూ అలా పిరికివాడిగా చూపించటం నచ్చలేదు నాకు. 


సినిమా అయ్యాకా ఒక దిగులు మొదలైంది.. ఇది బాగుంది కదా అని ఇలాంటివే మరో పాతిక సినిమాలు వచ్చేస్తాయేమో అని !!


Sunday, June 30, 2013

లోపాలున్నా, మనసుని తాకిన 'Raanjhanaa'





సినీభాషలో ఏ లోపాలు లేని వాడే హీరో. ఈ రోజుల్లోని సినిమా కథల్లో లోపాలున్న హీరోలయితే అస్సలు కనబడరు. అందరూ హీమేన్లే. మరి, తనలో లోపాలున్నా సినిమా చూసిన చాలాసేపటి వరకూ.. ఇంకా అతని గురించే ఆలోచించేలా చెయ్యగలిగాడు ఈ "Raanjhanaa". ఈ చిత్రం విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి లాభాలు గడించిందని వినికిడి.


బనారస్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు కుందన్. ఎనిమిదేళ్ల వయసులో నమాజ్ చేస్తున్న "జోయా" ను మొదటిసారి చూసినప్పటి నుండీ ఆమె అంటే పిచ్చి ప్రేమ కలుగుతుంది అతనికి. ఇలా స్కూలు పిల్లల మధ్యన ప్రేమ చూపించే పిల్లలను పాడుచేస్తున్నారు అనుకునే లోపూ స్కూలు వయసులోనే ఆమెను ఒప్పించటానికి బ్లేడ్ తో తన చెయ్యి కోసేసుకుంటాడు కుందన్. స్కూల్ డ్రస్సులో ఉన్న జోయా అతని ప్రేమను అంగీకరిస్తుంది కానీ నేను ఇంకా బాగా తిట్టుకున్నా. ఇదేం సినిమా బాబోయ్.. ఇలాంటివి సినిమాల్లో చూపించి అగ్నికి అజ్యం పోస్తున్నారే.. అని! 


తర్వాత ఇంట్లోవాళ్ళు జోయాను వేరే ఊరు పంపించి చదివిస్తారు. ఓ ఎనిమిదేళ్ల తరువాత జోయా మళ్ళీ బనారస్ వస్తుంది. అప్పటికి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతూ ఉంటుంది. ఆమె లేకపోయినా జోయా తలపుల్లోనే గడుపుతూ, ఆమె ఇంటి చూట్టూ తిరుగుతూ ఇంట్లోవాళ్లని మచ్చిక చేసుకుంటాడు కుందన్. జోయా కోసమే ఎదురుచూసే అతనికి ఆమె తనని గుర్తుపట్టకపోవటం పెద్ద షాక్. మెల్లగా ఆమెతో మళ్ళీ స్నేహం కలిపి మనసులో మాట చెప్తాడు మళ్ళీ. చిన్నతనాన్ని మర్చిపొమ్మనీ, తాను యూనివర్సిటీలో వేరే మనిషిని ప్రేమిస్తున్నాననీ, అతను లేకుండా బ్రతకలేననీ చెప్తుండి జోయా. ఇది ఇంకా పెద్ద షాక్ కుందన్ కి.


వేదనతో మరోసారి ఆత్మహత్యాయత్నం చేసుకుని, అసలు జోయానింక కలవనని చెప్పినా, నెమ్మదిగా తేరుకుని, జోయా తండ్రిని ఆమె ప్రేమికుడితో పెళ్ళీకి ఒప్పిస్తాడు కుందన్. తనని చిన్నప్పటి నుండీ ఇష్టపడే బిందియాను పెళ్ళాడతానని ఇంట్లో ఒప్పుకుంటాడు. సరిగ్గా పెళ్ళి జరిగే సమయానికి జోయా ప్రేమికుడు ముస్లిం కాదని, హిందువే నని తెలిసి, పట్టరానికోపంతో జోయా ఇంటికి వెళ్ళి, న్యూస్పేపర్లోని ఋజువు చూపించి ఆ పెళ్ళి ఆగిపోవటానికి కారకుడౌతాడు. ఈలోపూ జోయా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుందని, ఆమె బంధువులు కొట్టిన దెబ్బలకి జస్జీత్(ఆమె ప్రేమికుడు) కూడా తీవ్రంగా గాయపడ్డాడని తెల్సుకుంటాడు. జస్జీత్ ను వెతికి హాస్పటల్లో చేరుస్తాడు. ఈ హడావుడిలో తన పెళ్ళి సంగతి మర్చిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికీ కోపంతో ఉన్న తండ్రి కుందన్ ను గెంటివేస్తాడు. 


జోయా దగ్గరకు వెళ్ళి ఆమె తనను అసహ్యించుకుంటున్నా, ఆగిపోయిన పెళ్ళి జరిపించాలనే ఉద్దేశంతో జస్జీత్ ఇంటికి తీసుకువెళ్తాడు ఆమెను. కానీ అక్కడ జస్జీత్ మరణం గురించి తెలుసుకుని అపరాధభావంతో కుమిలిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరకు గంగా తీరంలో కూచుని ఉండగా ఒకాయన ఓ మాట చెప్తాడు కుందన్ కి.. "ప్రపంచంలో ఏ పుణ్యస్థలానికీ హత్యానేరాన్ని క్షమింపగలిగే శక్తి లేదు. ఇక్కడ గంగ ఒడ్డున ముక్తి కోసం కూచోవటం కాదు..వెళ్ళు.. వెళ్ళి ఏది చెయ్యాలో అది చెయ్యి." అని! అప్పుడు మళ్ళీ జోయాను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె తనను క్షమించాలనే ఏకైన లక్ష్యంతో ఆమె అసహ్యాన్ని భరిస్తూ అక్కడే ఓ టీ కొట్టులో పనిచేస్తుంటాడు. విద్యార్థి నాయకుడిగా జస్జీత్ స్థాపించిన రాజకీయ పార్టీ తరఫున జోయా పనిచేస్తూంటే, తానూ ఆ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవటం మొదలుపెడతాడు. 


ఇక్కడ్నుంచీ ప్రేమకథ హటాత్తుగా రాజకీయ కథనంగా మారిపోతుంది. కొన్ని సంఘటనల కారణంగా పార్టిలో కుందన్ ప్రముఖమైన వ్యక్తిగా మారిపోతాడు. జోయా ఇది సహించలేకపోతుంది. జస్జీత్ మరణానికి కారకుడిని నాయకుడిని చేసేస్తున్నారా? అని మిత్రులతోనూ, జస్జీత్ స్థానంలో కూచుని నన్ను దక్కించుకుందామనుకుంటున్నావా? అని కుందన్ తోనూ దెబ్బలాడుతుంది. ఆ ఆవేశంలోనే విద్యార్థుల పార్టీని తమవైపు తిప్పుకోవాలనుకుంటున్న సి.ఎం. మాటలను విని కుందన్ ప్రాణాలకి హాని తలపెడుతుంది.


కుందన్ ఏమౌతాడు? జోయా అతడిని క్షమిస్తుందా? అతడి ప్రేమలో స్వచ్ఛతను అర్థం చేసుకోగలుగుతుందా? ఈ కథ ఎలా ముగుస్తుంది? మొదలైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే "Raanjhanaa" చూడాలి మరి. ఈ కథకు ఈ ముగింపు సబబేనా? అన్న ప్రశ్న కలిగినా నచ్చకపోవటం మాత్రం జరగలేదు. 

హిందీ జగ్రత్తగా నేర్చుకుని తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ధనుష్, 'కుందన్' పాత్రకు సరైన న్యాయం చేసాడు. impressive work! ఇదివరకూ ఇతని సినిమాలేం చూడలేదు నేను. ఇక జోయా గా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేసింది సోనమ్ కపూర్. చిలిపితనం, మంకుపట్టు, అహంకారం, వయసుతో పెరిగే పరిణితి.. అన్నిరకాల భావాలనూ జోయాగా చక్కగా చూపెట్టింది ఈ అమ్మాయి. చిత్రం చివరిభాగంలో సోనమ్ నటన ఆకట్టుకుంటుంది. చిన్న పాత్రే అయినా జస్జీత్ గా అభయ్ డియోల్ అలరిస్తాడు.


కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. రెహ్మాన్ పాటల కన్నా సీన్స్ కి సరిపడా ఇమోషన్స్ ప్రేక్షకుల్లో కూడా కలిగేలా చేసిన నేపథ్యసంగీతం చాలా బాగుంది. మొత్తమ్మీద తీసిపారేయాల్సిన సినిమా మాత్రం కాదు. కథలో, పాత్రల్లో ఏ లోపాలున్నా, మనసుని తాకే ఒక విభిన్నమైన ప్రేమకథగా మాత్రం గుర్తుండిపోతుంది. అప్పుడెప్పుడో చూసిన "Gangster" ఇలానే చాలా కాలం మనసుని కదిలించివేసింది!!

movie trailer:

 

Monday, May 20, 2013

అలరించిన 'Epic'




ఈ వేసవిలో పిల్లలను ఆకట్టుకోవటానికి మన దేశం వచ్చిన అమెరికన్ కంప్యూటర్ ఏనిమేటెడ్ ఫాంటసీ 3D చిత్రం "Epic". 'విలియమ్ జాయిస్' రాసిన ఒక పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందించబడ్డ ఈ సినిమా ఏనిమేషన్ మాత్రమే కాక 3D  కూడా అవడం వల్ల ఇంకా ఆకర్షణీయంగా రూపుదిద్దికుంది. ఇవాళ మా పాపను తీసుకువెళ్ళి చూపెట్టాను. మా ఇద్దరికీ బాగా నచ్చింది.


 ఈ సినిమా కథ క్లుప్తంగా చెప్పాలంటే మంచి, చెడుల మధ్యన యుధ్ధం. చివరికి విజయం మంచివారినే వరిస్తుంది అన్నది పాత కథాంశమే అయినా అడవి నేపథ్యం, అందులో ఉండే రహస్యప్రపంచం.. ఆ ప్రపంచంలోని మనుషులు, వాళ్ల జీవితాలు.. చెడుతో వాళ్ల పోరాటం... ఇదంతా ఆసక్తికరంగా మలిచారు. మేరీ కేథరీన్ అనే టీనేజ్ అమ్మాయి అడవిలో పరిశోధన జరుపుతున్న తండ్రి వద్దకు వస్తుంది. అతడికి పరిశోధనే ప్రపంచం. అనుకోని పరిస్థితుల్లో మేరీ చిన్నగా మారిపోయి, తండ్రి ఇంతకాలంగా పరిశోధిస్తున్న "leafmen" అనే లిల్లీపుట్ల లాంటి బుల్లి బుల్లి మనుషుల విచిత్రప్రపంచంలోకి వెళ్ళి పడుతుంది. వాళ్లతో కలిసి వాళ్ళ యుధ్ధంలో పాల్గొని, చివరికి మేరీ మళ్ళీ ఎలా మామూలు మనిషౌతుంది? అన్నది కథ. నాకు వాళ్ళ రాణి భలే నచ్చేసింది. ఆమె నడుస్తూంటే విచ్చుకునే పువ్వులు, కలువలూ ఎంత అందంగా ఉన్నాయో. ఆమె ఉన్నది కాసేపే అయినా ఆ కాసేపూ చాలు 'what a visual feast !' అనుకోవడానికి.


మామూలు 2D సినిమా కన్నా ఏనిమేషన్ తీయడం,అందునా 3D తీయడం  ఎంతో శ్రమతో కూడుకున్న పని. అది కాస్తయినా బాలేకపోతే ఆ శ్రమంతా వృధా పోతుంది. అలా కాక చూసేవాళ్లకి చక్కని అనుభూతిని మిగిలిస్తే, కష్టపడి తీసినవాళ్లకు కూడా తృప్తి. మీ ఇంటి దగ్గరలో ఆడుతూ ఉంటే, ఏనిమేషన్ ఇష్టముంటే మిస్సవకుండా తప్పక చూడండి. టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అని ఖచ్చితంగా అనుకుంటారు.

'Epic' trailer:

Wednesday, May 8, 2013

గ్రీకువీరుడు Ironman 3





అబ్బే.. ఈ రెండు టైటిల్స్ కీ లింక్ ఏమీ లేదు. కొత్త సినిమాల్లో బాగున్నాయని టాక్ వచ్చిన ఈ రెండింటిని దర్శించుకున్నాం. నాకైతే ఓ మాదిరిగానే అనిపించాయి రెండూ ! ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అని గొప్పగా పొగిడేస్తున్నారని ముందర "గ్రీకువీరుడు"కి వెళ్ళాం. "అనుబంధాలను నిలుపుకోవాలి. గొడవలొస్తే అహాన్ని వీడి ఎవరో ఒకరు ముందుకెళ్తే సమస్యలు సర్దుకుపోతాయి. బంధాలు నిలుస్తాయి." అన్నారు డైరెక్టర్ గారు. నిజంగా ఈ కాన్సెప్ట్ బాగుంది. కానీ కథే కాస్త తేలికగా ఉంది. బరువు లేదు. ఫీల్ లేదు. ఏ కథ అయినా కథనంలో గ్రిప్ లేకపోతే తేలిపోతుంది. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్స్ తీసిన దర్శకుడేనా? అనిపించింది. ఆ స్టాండర్డ్ లో ఎంతమాత్రం ఈ సినిమా లేదు :(

కథానాయకుడు నవ్వితే మనం నవ్వాలి. అతను బాధపడితే మనమూ బాధపడాలి. అటువంటి ఇమోషనల్ ఫీల్ లేనిదే సినిమా ఎంత గొప్ప నీతి చెప్పినా ఇన్వాల్స్ అవటం కష్టం.

ఏం బాగున్నాయి:
* అశ్లీల దృశ్యాలు లేకపోవడం, వీరోవినుకి నిండైన బట్టలు ఉండటం చాలా హాయినిచ్చాయి.
* వెకిలి హాస్యం లేకపోవటం.
* నయనతార మొహంలో ఏదో మార్పు.. బావుంది. ప్రశాంతంగా కనబడుతోందిప్పుడు.
* నాగార్జున స్మార్ట్ గా, పదేళ్ళు చిన్నగా బాగున్నాడు. But.. నలభై ఏడేళ్ల షారుఖ్ ఖాన్ నే చూడ్డానికి ఇబ్బంది అవుతుంటే ఏభై మూడేళ్ళ నాగార్జునని చూడటం కాస్త కష్టం గానే అనిపించింది. మంచి నటుడిగా ఎదిగిన నాగార్జున కాస్త వైవిధ్యమైన పాత్రలు చేస్తే చూడాలని ఉంది.

నాకొచ్చిన డౌట్స్:
* అసలా టైటిల్ కీ కథకూ సంబంధం ఉందా?
* ఫ్లైట్ లో కలిసి జర్నీ చేసిన కాస్త పరిచయానికే ముచ్చటపడిపోయి ఏ బుర్ర ఉన్న అమ్మాయి అయినా గాళ్ఫ్రెండ్ ఉందని చెప్తున్న ఓ అపరిచితుడితో తాళి కట్టించేసుకుంటుందా? ఎంత అబధ్ధమైనదైనా పెళ్ళి పెళ్ళే కదా? కాగితాల సంతకం కూడా కాదాయే..:(

చివరిగా:
ఓపికున్నవాళ్ళు ఓసారి చూడచ్చు.


***
Ironman 3



ఐరన్ మాన్ సిరీస్ లో వచ్చిన మూడో సినిమా.('ఎవెంజర్స్' తో కలిపితే నాలుగోది.)
భారీ బడ్జెట్ తో రూపొందించబడి, ప్రపంచవ్యాప్తంగా బోలెడు లాభాలు తెస్తున్న సినిమా! 'Ironman-2' చాలా నచ్చింది నాకు. ఇది మాత్రం అక్కడక్కడ కాస్త బోరింగ్ గా, వేస్టేజ్ ఆఫ్ టెక్నాలజీ గా తోచింది. ఇందులో కూడా కథ కన్విన్సింగ్ గా లేదు. ఇంతక్రితం వచ్చిన 'The Avengers' కన్నా చాలా బెటరే కానీ 'Ironman-2' లో ఉన్న ఇమోషనల్ ఫీల్ ఇందులో కలగదు. విలన్స్ కూడా ఇంప్రెసివ్ గా లేరు. మొదట్లో గంభీరంగా చూపించిన బెన్ కిన్స్లే ను, ఆ తర్వాత మరీ బఫూన్ లా చూపెట్టడం బాలేదు. ఎండిపోయినట్లున్న Gwyneth Paltrow ని చూడ్డం కష్టమైంది కానీ Ironman (Robert Downey) మాత్రం స్మార్ట్ గా బాగున్నాడు.

 చివరిగా: 

3D ఎఫెక్ట్ కోసం ఒకసారి చూడచ్చేమో..

ట్రైలర్:
http://www.youtube.com/watch?v=Ke1Y3P9D0Bc