సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, May 24, 2014

అక్కినేని కోసమే 'మనం'


ఈ సినిమా చూడాలనుకోవడానికి ఏకైక కారణం నాగేశ్వర్రావ్. మరొక్కసారి స్క్రీన్ మీదైనా సజీవంగా నాగేశ్వరావ్ ని చూడాలన్న కోరిక. ఆ కోరిక తీరింది. తెరపై డైలాగులు చెప్తూ, నవ్వుతూ చూస్తున్న అక్కినేనిని చూస్తుంటే మనసులో ఏమూలో ఉండిపోయిన బాధకి కాస్త ఉపశమనం కలిగింది. ఈ ఒక్క ఆనందం కోసం "మనం" చూడచ్చు. 


చిత్ర కథ అద్భుతమైనదేమీ కాదు. మామూలు తెలుగు సినిమాలలోలాగనే అవాస్తవికంగానే ఉంది. కానీ అటువంటి కథని దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా నడిపించిన తీరు ప్రశంసనీయం. మొదటి భాగం కాస్త స్లో గా నడిచింది. రెండవ భాగంలో జరగాల్సిన కథ ఎక్కువగా  ఉండటం వల్ల సెకెండ్ హాఫ్ బాగుంది. నాగేశ్వరరావు ఉన్న ప్రతి సన్నివేశాన్నీ రెండూ కళ్ళూ చాలవన్నంత ఇదిగా, ఆత్రంగా చూశాను నేనైతే. మరి మళ్ళీ ఇంకెప్పుడూ కనపడ్డు కదా :(


నాగార్జున చాలా స్మార్ట్ గా ఉన్నాడు. కొడుకుతో డాన్స్ చేస్తూంటే, కొడుకు కన్నా తండ్రే బాగున్నాడు అనిపించింది. శ్రియా బాగా చేసింది. ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్ సీన్స్ లో. ఈ అమ్మాయి కళ్ళు నాకు చాలా నచ్చుతాయి. సమంత కూడా తన వంతు న్యాయం చేసింది. ఎటొచ్చీ నాగచైతన్య పాత్ర గురించే ఆశ్చర్యం వేసింది. అందరి పాత్రలకీ కాస్తో కూస్తో వెయిటేజీ ఉంది కానీ అతని పాత్ర ఎటూ కాకుండా అయినట్లనిపించింది. గత జన్మలో నాగార్జున తండ్రి అన్న ఒక్క పాయింట్ తప్పించి అతని పాత్రలో చిన్న ప్రత్యేకత కూడా లేకపోవడం వల్ల ఆ పాత్రకు అస్సలు వెయిటేజ్ లేకుండా పోయింది. ఎయిర్ హోస్టస్, మహిళా పోలీస్ తో సహా ఆడవాళ్లందర్నీ అలా చూడ్డం నాకసలు నచ్చలేదు. పైగా ఆరోగ్యానికి హానికరం అని చూపెడుతూనే గ్లాసులకి గ్లాసులు తాగేసినట్లు చూపించడం..ప్చ్!!  కానీ తాత, తండ్రి, కొడుకూ ముగ్గురూ ఉన్న సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. థియేటర్లో అంతా కూడా కేకలూ, చప్పట్లు. ANR ఆ వయసులో, అనారోగ్యంతో కూడా అంత ఉత్సాహంగా డైలాగ్స్ చెప్పడం అబ్బురమనిపించింది. నాగేశ్వరావ్ లోని ఆ 'డేడికేటెడ్ ఆర్టిస్ట్' నే నేను ప్రేమించేది. ముగ్గురి పేర్లు అలా మిక్స్ చేసి పెట్టడం బాగుంది.

అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్యసంగీతం బాగుంది. ముఖ్యంగా నాగేశ్వరరావు ఉన్న సీన్స్ లో పియానో, హార్మోనికా, వయోలిన్స్ కలిపి చేసిన ఒక స్పెషల్ musical bit రిపీటవుతూంటుంది. ఆ థీం మ్యూజిక్ బాగుంది. దాన్నే సినిమా భాషలో 'రికరింగ్ రిథిమ్' లేదా 'Leitmotif' అంటారు.


వెకిలి హాస్యం లేదు. గాల్లో ఎగిరే ఫైటింగ్స్ లేవు. అందుకే సినిమా అయిపోయాకా మనసుకి హాయిగా అనిపించింది. అంతా అంటున్నట్లుగా 'ఫీల్ గుడ్ మూవీ' అన్నమాట. నేను చాలా ఎక్కువగా ఆశించడం వల్లనేమో ఇంకా బాగుండి ఉండచ్చు అనిపించింది కానీ బాలేదని మాత్రం అనిపించలేదు. అక్కినేని అభిమానులు, నాగార్జున అభిమానులూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక చివర్లో వచ్చిన షాట్ సూపర్. తాత, తండ్రి, ఇద్దరు మనవలు..మొత్తం నలుగురూ నిలబడిన షాట్. 


చివరలో కనబడ్డ అఖిల్ గురించి ఓ మాట... కుర్రాడు చాకులా ఉన్నాడు! ముఖ్యంగా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోని చూడబోతున్నామన్న ఆశ కలిగింది. 


7 comments:

Sujata M said...

Nakoo nacchindi. Sriya and samantha did well. Chaitanya is dull as usual.. they could have chosen a worthy farewell story for anr. But perhaos they had to rush. Lived the cars. And sarees.

Sujata M said...

Loved the cars and sarees

Unknown said...

Nakuu chaalaa nachindi.
Avunu akhil ni ;tana voice chusi same ade anukunnaam :)

Unknown said...

Radhika (nani)

Unknown said...

అక్కినేని వీడ్కోలు చిత్రం! వ్యాధిగ్రస్తుడు అయినా సత్తువ అంతా ఉపయోగించి పంటి బిగువున నటించాడు! నాగార్జున కూడా చలాకీగా నటించాడు!నాగ చైతన్యకు ఇది ఒక వైవిధ్య పాత్ర అవుతుంది! అఖిల్ ఇక ముందు రాజ్యం ఏలతాడు! దర్శకుడు విక్రమ్ కుమార్ ఇలా అక్కినేని నాగేశ్వరరావుకు చివరి దర్శకుడు అయ్యాడు!

Sreenivas said...

నేను కూడా అంతేనండి.. నాగేశ్వరరావ్ గారు ఉన్న సీన్లు రెండు కళ్ళు చాలవన్ననంత ఇదిగా ఆత్రంగా చూశాను... నాగేశ్వరరావ్ ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనుకున్నా.. సినిమా మహబాగా నచ్చేసింది నాకు.. ఇంకో రెండు మూడు సార్లు చుసేస్తా.. :-)

తృష్ణ said...

@sujata gaaru,
@radhika gaaru,
@surya prakash apkari,
@srinivasa rao kamaraju,
వ్యాసం నచ్చినందుకు, మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.