నామిని ‘మూలింటామె’ నవల చదివాకా బాపూ రాసిన ఉత్తరం చదివిన తర్వాత బజార్లో కెళ్ళినప్పుడు ముందరా పుస్తకం కొని తెచ్చుకున్నా. అంతకు ముందు 2000లో పబ్లిష్ అయిన నామిని గారి సంకలనం "అమ్మకి జేజే" మాత్రమే చదివాను. 'అమ్మ' గురించి బాపురమణలు, బాలు, బాలమురళిగార్లు..మొదలైన ఒక 17మంది ప్రముఖులతో చెప్పించి, దాన్ని ఆంధ్రజ్యోతి వీక్లీ లో అచ్చువేసి, తరువాత వాటన్నింటినీ అమ్మకి జేజే పొందుపరిచారాయన. ఇవన్నీ వేరే వాళ్ళ వ్యాసలే తప్ప ఆయన రచన కాదు. సో, ఇప్పటిదాకా విలక్షణమైన ఆయన రచనాశైలిని గురించి విన్నా కానీ వీరి రచనలేమీ చదవలేదనే చెప్పాలి. అందువల్ల మొదట వారి రాయలసీమ మాండలీకం చదవడం నాకు పరీక్షగా మారింది. మామూలుగా ఓ వంద పేజీల పుస్తకం గంట-రెండుగంటల్లో చదివేస్తాను నేను. అలాంటిది ఎంతో నెమ్మదిగా చదివితే తప్ప అసలు మొదట పది పదిహేను పేజీలు నాకు అర్థం కాలేదు :( కానీ ఒక్కసారి కథలో లీనమైన తర్వాత ఇంక భాష పెద్ద సమస్యగా అనిపించలేదు నాకు. అంతటి పట్టు ఆ కథలో ఉంది. అసలా కథకు ఆ మాండలీకమే సగం ప్రాణం అని కూడా అర్థమైంది. కవర్ డిజైన్ కూడా వైవిధ్యంగా బాగుంది.
’మూలింటామె ’ పుస్తకం అమ్మావాళ్ళింటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నా. ఆ రాత్రి ఒంటిగంట దాకా చదివి పెట్టిన పుస్తకం అక్కడే తలగడ క్రింద మరిచిపోయి ఇంటికి వచ్చేసా. అంతదూరం మళ్ళీ ఇప్పట్లో వెళ్ళనని కొరియర్లో వెయ్యమన్నా. మధ్యలో వీకెండ్ వచ్చి ఆ కొరియర్ నాకు అందటానికి నాలుగైదు రోజులు పట్టింది. ఈలోపూ నాకు ఆ కథపైనే ధ్యాస.. ఏమై ఉంటుంది.. నారాయుడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడా? కొనామె సంగతి ఏమౌతుందో? అయ్యో మూలింటామె..ఎలా ఉందో..? అసలు కొరియర్ మిస్సయిపోతే మళ్ళీ పుస్తకం కొనుక్కోవాలేమో.. అని ఇవే ఆలోచనలు. ఆఖరికి పుస్తకం ఓ సాయంత్రం కొరియర్లో వచ్చింది మొత్తానికి. గభాలున పనులన్నీ పూర్తి చేసేసుకుని పుస్తకం పట్టుకుని కూచున్నా. పూర్తయ్యాకా కథ గురించీ, పాత్రల గురించీ చాలా రాయాలని అనుకున్నా కానీ మాటలు రావట్లే... ఒక గొప్ప ట్రాజెడీ చదివిన తరువాత కలిగే అనుభూతి మిగిలింది. చెప్పాలంటే there's a feeling of Catharsis.. అని కూడా అనచ్చేమో! మానవ సంబంధాల గురించీ, మనిషి నైజం గురించీ, మనసు లోతుల గురించీ గొప్ప అవగాహన ఉన్న వ్యక్తిగా నామిని గారిని గుర్తించాను నేను.
ఒక మనిషి ఏదన్నా తప్పు చేస్తే, మిగతావారు ఆ తప్పుకి కారణాలు వెతకరు. వెనకేసుకు రారు. ఎదుటి మనిషి దృష్టికోణం లోంచి ఆ తప్పు చెయ్యడానికి వాడి వెనుక ఉన్న పరిస్థితులేమిటని అంచనా వేసే ప్రయత్నం అసలే చెయ్యరు. పొరపాటున ఒక్క పొరపాటు దొర్లటం ఆలస్యం.. వీడెప్పుడు పొరపాటు చేస్తాడా అని కాచుక్కూర్చున్న జనం.. ఇన్నాళ్ళకు దొరికాడు కదా అన్నట్లు కాకుల్లా పొడిచేస్తారు. అనాల్సిన మాటలు, అనకూడని మాటలూ, నిఘంటువుల్లో పదాలు వెతొక్కొచ్చి మరీ కడిగిపారేస్తారు. జనాలకూ గొర్రెల మందకూ పెద్ద తేడా లేదు. మొదట నిలబడ్డవాడు ఏది చేస్తే వెనకున్నవాళ్ళు అదే చేస్తారు. జనంలో ఉన్న ఈ బలహీనతను పట్టుకున్నారు నామిని. "మూలింటామె" కథలో జనాలలో, సమాజంలో ఉన్న ఈ బలహీనతను ఎత్తి చూపారు నామిని.
చదువురాని ముసలి అవ్వ మూలింటామె. ఆమె పేరు కుంచమమ్మ. కుంచమమ్మ కూతురు మొగిలమ్మ. కొడుకు నారాయణ సామి నాయుడు. మొగిలమ్మ కూతురు రూపావొతి. మనవరాలిని కొడుక్కిచ్చి సంబంధం కలుపుకుంటుంది కుంచమమ్మ. రూపావొతికి ఇద్దరు బిడ్డలు. ఊళ్ళో ఒక మూలన వాళ్ల అడ్డాపిల్లుండటం వల్ల వాళ్ళూ "మూలింటోళ్ళు" గా పిలవబడుతుంటారు. ఆడ్డాపింట్లోని ముగ్గురాడవాళ్ళూ మొదుటామె, నడిపామె, కొనమ్మిగా పిలవబడుతుంటారు. హటాత్తుగా కొనమ్మి ఇల్లు వదిలి వెళ్పోవడంతో కథ మొదలౌతుంది. కాసేపటికి ఆమె కళాయోడితో తిరప్తి కి పోయిందని తెలిసి ఊరూవాడా ఇంటి ముంగిట్లో పోగవుతారు. మూలింటోళ్ళ బాగుని ఓర్వలేనివాళ్ళంతా అవకాశం దొరగ్గానే నానారకాల మాటలు మొదలొడతారు. ముఖ్యంగా రంజకం, మొలకమ్మ మొదలైనవాళ్లయితే ఇక దొరికినప్పుడల్లా మాటల తూటాలు పేలుస్తూ మూలింటోళ్ళకు ఊపిరిసలపనివ్వరు. మొదటామె కు మనవరాలంటే పంచప్రాణాలు. చివరిదాకా కొనామె పైనే ప్రాణాలు ఉంచుకుని తిరిగివస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తుందా ముసలి ప్రాణం. కొనామె తిరిగిరాకపోవడం కూడా లోపల్లోపల ఆనందమే ఆమెకు. మనవరాలెంత అభిమానవంతురాలో అని లోలోపల మురుస్తుంది. బీమారం నుండి వచ్చిన తన అక్క పోరు, ఊరోళ్ళ బలవంతం మీద కొడుక్కి మరొక పెళ్ళి చెయ్యక తప్పదు. అయితే, కోడలుగా ఇంటికొచ్చిన పందొసంత తో మాట్లాడదు. కోడలు చేతి చేతి గంజినీళ్ళు కూడా ముట్టదామె. అంత పట్టుదల మూలింటామెది. మనవరాలి స్థానాన్ని బలవంతంగా ఆక్రమించుకుందని బాధ, కోపం ఒక పక్క ఉండగానే పందొసంత చేసే పనులు ఇంకా చిత్రహింసకు గురిచేస్తాయి ఆమెని. పందొసంత ఇచ్చే అప్పులకూ, చేసే సహాయాలకూ ఆశపడే ఊళ్ళోవాళ్ళంతా ఆమె పబ్లిగ్గా చేసే తప్పులను ఉపేక్షిస్తూ, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన ఉత్తమురాలైన మనవరాలిని పదేపదే దెప్పిపొడవడం సహించలేకపోతుంది మొదటామె.
"మూలింటామె" నవల సమకాలీన సమాజానికొక దర్పణమనిపిస్తుంది నాకు. నారాయణ రెండవ భార్యగా వచ్చిన పందొసంత గురించి చదువుతూంటే కోపం, అసహ్యం, ఆశ్చర్యం, సంభ్రమం లాంటి భావాలన్నీ కట్టగట్టుకుని బుర్రలో నాట్యమాడేస్తాయి. అవును మరి ఇవాళ్టిరోజున బలమున్నవాడిదే పై చేయి. తప్పు చేసినా సరే. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో, సగనికి పైగా మనుషులు ఎలా ఉన్నారో వాళ్ళందరికీ సింబాలిక్ గా ఈ ప్రాత్రను సృష్టించారేమో నామిని అనిపించింది. ఈర్ష్య, అసూయ మొదలైన హేయ గుణాలకు ప్రతీకలు రంజకం, మొలకమ్మ, రంగబిళ్ల మొదలైన పాత్రలైతే, ఇంకా లోకంలో అక్కడక్కడా మిగిలున్న మంచీ,మానవత్వాలకు ప్రతీక చీమంతమ్మ పాత్ర. లోకంలో దుర్బలులైనవారికీ, భయస్తులకీ ప్రతీక మొదుటామె. ఈ ముసలి అవ్వ పాత్ర నాకు ఎంతగా నచ్చిందో చెప్పలేను. ఆమెలో ఆమె చెప్పుకునే స్వగతాలూ, మాటలూ, ఇతరుల ప్రశ్నలకు మనసులోనే చెప్పుకునే సమాధానాలూ చదివి తీరాల్సిందే. మనవరాలి పోటోను ఎదన బెట్టుకుని తెల్లార్లూ మొదుటామె చెప్పుకునే మాటలు విని గుండెలు ఎంత నీరౌతాయో, ఆమెతో చీమంతమ్మ అన్న మాటలు విన్నాకా "ఈ మాత్రం గుండెల్నిండికీ గాలి బీల్చుకోని ఎన్ని జాములైంది మూలింటామెకి!" అన్న వాక్యాలు చదివి మనసు అంత కుదుటపడుతుంది పాఠకులకు.
మొదుటామె వ్యక్తిత్వం, ఆమె జీవితం, ఆమె ముగింపు అన్నీ చదివాకా మొదట్లో చెప్పినట్లు మనసులో ఏదో ప్రక్షాళన జరిగిన భావన కలుగుతుంది. "నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేగాని, మియాం మియాం అంటూ నీ కాళ్ల కాడా నా కళ్ల కాడా చూట్టుకలాడే పిల్లిని చంపలేదే!" అన్న ఆమె మాటలు పుస్తకం మూసేసిన తర్వాత కూడా చెవుల్లో వినబడుతూ ఉంటాయి. మనవరాలిని అర్థం చేసుకుని క్షమించగలిగిన అంతటి విశాల హృదయం ఎంతో ఎత్తులో ఉండే విద్యావంతుల్లో కూడా కనబడదు. మనసున్న ప్రతి మనిషి మనసునీ తప్పక తాకే కథ ఇది.
8 comments:
Appude chadivesaara? Good.
@sujata:ఇంకా లేటండీ. కొని రెండు వారాలయ్యాక ఇప్పటికి చదవడం అయ్యింది. చాలా బాగుంది. తప్పకుండా చదవండి.
I may not get to read it trishnaji. I have decided not to buy telugu books. I will see if i can borrow it fm any library.
మూలింటామె గురించి బాపు గారు రాసిన ఉత్తరం చదివాను. మీ పరిచయం బాగుంది. నాకు నామిని పుస్తకాలు అంటే చాలా ఇష్టం. మీకు రాయలసీమ మాండలికం చదవడం మొదట్లో కష్టమయింది అని చెప్పారు కదా! చిన్నపుడు సినబ్బ కతలులో మొదటసారి ఈ మాండలికం చూసి, చదివి మాకు చాలా ఆనందం వేసింది. మేము మాట్లాడూకునే భాషలో కథలు ఉండడం అదే మొదటిసారేమో! అపుడపుడూ మా వూరు గుర్తుకు వస్తే ఈ పుస్తకాలే చదువుతాము.
తొందరలో ఈ పుస్తకం కొని చదవాలని ఉంది. ఇంకొకసారి మీ సమీక్షకు వందనాలు.
@sujata: ok..
@శ్రీ బసాబత్తిన:అవునా.. ఆ ప్రాంతంవారే అయితే మీరు కథతో బాగా కనక్ట్ అవ్వగలరు. వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.
చాలా ఆలస్యంగా చదివినా మంచి రివ్యూ మిస్ కాలేదని హాపీగా ఉందండీ..నేను మాండలీకం వేరేగా ఉంటె చదవడానికి ఇబ్బంది పడతాను..కానీ మీ రివ్యూ చదివాకా ప్రయత్నించాలని అనిపిస్తోంది..పరిచయం చేసినందుకు చాల థాంక్స్ :)
సమీక్షలో ఇంత సంయమనం ప్రముఖ విమర్శకులు అనబడే వారిలో ఉంటే ఎంత బావుండును
@malli: మీ వ్యాఖ్య ఆలస్యంగా చూస్తున్నానండి.. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
Post a Comment