సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label గార్డెనింగ్. Show all posts
Showing posts with label గార్డెనింగ్. Show all posts

Tuesday, November 29, 2011

కొత్త మొక్కల్.. కొత్త మొక్కల్...

సంచీలో...కొత్తగా కొన్న మొక్కలు


చలికాలంలో పూసే చామంతులు ఎన్ని రంగులు ఉన్నా మళ్ళీ కొత్త మొక్కలు కొందామనిపిస్తుంది. పెద్ద చామంతులు ఐదారు రంగులున్నాయి కదా అని ఈసారి చిట్టి చామంతులు కొన్నా. కుండీ నిండుగా బాగా పూస్తాయి ఇవి.


తెల్లటి ఈ స్వచ్ఛమైన గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా? ఒకే చెట్టుకి ఎన్ని మొగ్గలేసాయో...


ఎన్నో రోజుల నుంచీ చెంబేలీ తీగ కొనాలని. కుండీలో బాగా పెరగదేమో అని ఆలోచన. మొత్తానికి ఈసారి కొనేసా. మొగ్గ పింక్ కలర్లో ఉండి పువ్వు పూసాకా తెల్లగా ఉంటుంది. చాలా మత్తైన సువాసన ఈ పువ్వుది. చాలా ఇళ్ళలో గేటు పక్కగా గోడ మీదుగా డాబాపైకి పాకించి ఉంటుందీ తీగ.



క్రింది ఫొటోలోని గులాబీ రంగు గులాబి పువ్వు చెట్టు విజయవాడలో మా క్వార్టర్ గుమ్మంలో ఉండేది. చాలా పేద్ద చెట్టు. రోజుకు ఇరవైకి మించి పూసేది. ఎన్ని కొమ్మలు ఎందరికి ఇచ్చామో...అందరి ఇళ్ళలో ఈ మొక్క బతికింది. నర్సరిలో కనిపించగానే వెంఠనే కొనేసా.



ఇక ముద్దబంతి పువ్వులు అలా పేద్దగా పూసేసరికీ కొనకుండా ఉండగలనా? ఇంతకు ముందు కుండీలో వేసిన బంతునారు బాగానే పెరిగాయి. కొన్ని రేకపూలు పూస్తున్నాయి. కొన్ని ఇంకా మొగ్గలే రాలా..:(( అందుకని ఈ ముద్దబంతి కొనేసా...:))



Thursday, August 18, 2011

బంతినారు



బంతి మొక్కలకీ, నాకూ అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ప్రతి వర్షాకాలం జులై నెల చివరలోనో, ఆగష్టు మొదట్లోనో స్కూల్ నుంచి వచ్చేసరికి ఓ మగ్గు నీళ్ళలో పెట్టిఉంచిన రెండు మూడు "బంతినారు" కట్టలు దర్శనం ఇస్తూండేవి. ("బంతినారు" అంటే తెలియనివాళ్ళకు చిన్న వివరణ: బంతి పువ్వులు ఎండిపోయాకా వాటిని విడదీసి ఆ రేకులు మట్టిలో చల్లితే బంతి మొక్కలు వస్తాయి. మొక్కలు అమ్మేవాళ్ళు అలా బంతిమొక్కలు పెంచి, రెండంగుళాలు పెరిగాకా వాటిని తీసి కట్టగా కట్టి బజార్లో అమ్ముతారు. ఆ చిన్న చిన్న బంటి మొక్కలనే "బంతినారు" అంటారు. వాటిని ఒక క్రమంలో వేసుకుంటే మొక్కలు బాగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తాయి.)


బాగా చిన్నప్పుడు అమ్మ నాటేసేది కానీ నాకు మొక్కలపై మమకారం పెరిగేకా ఆ బాధ్యత నేనే తీసుకునేదాన్ని. మగ్గులో బంతినారు చూడగానే గబగబ స్కూల్ డ్రెస్ మార్చేసుకుని, గునపం,బకెట్టులో నీళ్ళు తీసుకుని నాటడానికి బయల్దేరేదాన్ని. ఎంతెంత దూరంలో ఆ బుజ్జి బుజ్జి బంతి మొక్కలు పాతాలో అమ్మ చెప్తూంటే, ఆ ప్రకారం రెండు మూడు మొక్కలు కలిపి నాటేసేదాన్ని. రెండుమూడు మొక్కలు కలిపి ఎందుకంటే పొరపాటున ఒక మొక్క బ్రతక్కపోయినా రెండవది బ్రతుకుతుందన్నమాట. వాటికి చుట్టూ నీళ్ళు నిలవటానికి పళ్ళేంలాగ చేసి అన్నింటికీ నీళ్ళు పోసి మట్టిచేతులు కడిగేసుకోవాలన్నమాట. అప్పటికి తలలు వాల్చేసిన ఆ బుజ్జి మొక్కలు బ్రతుకుతాయో బ్రతకవొ అని నేను బెంగ పడుతుంటే, పొద్దున్నకి నిల్చుంటాయిలే అని అమ్మ ధైర్యం చెప్పేది. మర్నాడు పొద్దున్నే తలలు నిలబెట్టు నిలబడ్డ బంతి మొక్కలని చూస్తే భలే సంబరం వేసేది. అవి మొండి మొక్కలు. బ్రతకాలే గానీ ఇక చూసుకోవక్కర్లేదు. కాసిన్ని నీళ్ళు పోస్తే వాటి మానాన అవే పెరుగుతాయి.


ఒకోసారి పండగలకి గుమ్మానికి కట్టిన బంతి తోరణాలని జాగ్రత్తగా ఎండబెట్టి దాచేది అమ్మ. ఆగస్టు వస్తోందనగానే వాటిని మట్టిలో చల్లేసేది. నాలుగైదురోజుల్లోనే మొక్కలు వచ్చేసేవి. కాస్తంత పెరిగాకా, ఆ బంతినారు తీసేసి మళ్ళీ దూరం దూరంగా నాటేవాళ్ళం. కానీ ముద్ద పువ్వుల రెక్కలతో మొలిచిన మొక్కలకి రేక బంతిపువ్వులు పూసేవి ఒకోసారి. అందుకని విత్తనాలు వేసి మొలిపించినా, ఒక కట్ట అయినా బంతినారు కొనకుండా ఉండేది కాదు అమ్మ. అలా ఆగస్టులో వేసిన బంటి మొక్కలు సప్టెంబరు చివరికి పూలు పూసేసేవి. కొత్త సంవత్సరం వచ్చాకా మార్చి దాకా పూసేవి ఆ పూలు. ముద్ద బంతి రెండు మూడు రంగులు, రేక బంతి రెండు మూడు రంగులు, కారబ్బంతి(చిన్నగా తోపు రంగులో ఉంటాయే అవి) మొదలైనవి పెంచేవాళ్ళం మేము. నా పెళ్ళి అయ్యేదాకా ప్రతి ఆగష్టు నుంచి మార్చి దాకా క్రమం తప్పకుండా బంతి తోట ఉండేది మా ఇంటి ముందు. వాటి పక్కన రెండు మూడు రకాల చామంతులు. ఇవి కూడా ఈ అర్నెలలూ పూస్తాయి. ఈ మొక్కలన్నింటికీ కలిపి నేను గట్టి కర్రలు ఏరుకొచ్చి దడి కట్టేదాన్ని. అదో పెద్ద కార్యక్రమం. ఆ దడికి శంఖుతీగలను ప్రాకిస్తే స్ట్రాంగ్ గా గోడలా ఉండేది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న శంఖు పువ్వులు ఎంత బావుడేవో..

(పాత ఫోటోల్లో దొరికిన మా బంతి తోట)


మార్చి తరువాత బంతి మొక్కలు వాటంతట అవే ఎండిపోవటం మొదలు పెడతాయి. అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ ఏవో వేరే మొక్కలు వేసుకునేవాళ్ళం. బంతి పువ్వులు పూసినన్నాళ్ళు ప్రతి బుధవారం అమ్మ వాటిని కోసి బంతి ఆకులే మధ్య మధ్య వేసి దండలు కట్టి అన్ని దేవుడు పటాలకూ వేసేది. అమ్మ చాలా బాగా మాలలు కడుతుంది .అదీ ఎడం చేత్తో. నాకు కుడి చేత్తో కూడా సరిగ్గా కట్టడం రాదు. నాకు రాని ఏకైక పని అది ఒక్కటే..:(( మొన్న శ్రావణ శుక్రవారం బోలెడు పువ్వులు కొనుక్కొచ్చి, ఏదో ఎమోషన్ లో మాల కడదామని తెగ ప్రయత్నించాను. నాలుగు పువ్వుకు కట్టగానే తయారైన వంకర టింకర మాల చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్న శ్రీవారిని చూసి ఇక కట్టడం ఆపేసా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలివైనవాళ్ళకి అర్ధమైపోతుంది కదా..:))

పెళ్ళైయాకా మళ్ళీ బంతిమొక్కలు పెంచటం కుదరనేలేదు. అమ్మ కూడా మానేసింది వేసే చోటు లేక. ఇన్నేళ్ళ తరువాత బజార్లో మొన్నొకరోజు బంతినారు కనపడింది. మట్టినేల లేదు ఏం పెంచుతానులే అనుకున్నా కానీ మనసొప్పలేదు... ఒక్క కట్ట కొన్నాను. రెండు మూడు కుండీల్లో అవే వేసాను. అన్నీ నిలబడ్డాయి. ఇక పువ్వుల కోసం ఎదురుచూపులు...






Saturday, August 6, 2011

ఒకే ఒక్కటి ?!


పూసినదొక పువ్వుట..


అది వేసినదొక పిందెట..


కాసినదొక కాకరకాయట..


ఒక్క దానితో ఏం చేయాలో తెలియదట..!!









Friday, May 20, 2011

కాకరపాదే !!


బుజ్జి బుజ్జిగా తలలెత్తిన కాకరపాదు తాలుకూ "బుజ్జి మొక్కలు" ఫోటోలు పెడితే రావికొండలరావుగారి "ఆనప్పాదా? బీరపాదా" జోక్ లాగ ఇవి కాకరపాదు మొక్కలేమిటి? అని సందేహం వచ్చింది కదా మిత్రులకు...అందుకని ఇదిగో అసలు ఆకులు వచ్చాయి. ఇందాకా తీసాను ఫోటోలు. జాగ్రత్తగా గమనిస్తే కాకరపాదుకే ఉండే స్ప్రింగ్ లాంటి సన్నని తీగెలు కూడా కనిపిస్తాయి. ఆ స్ప్రింగ్ లాంటి తీగెలను దేనికి చుడితే దానిపైకి(కర్ర్ర, తాడు etc) పాదు పాకుతుంది.





హమ్మయ్యా ! నమ్మారా ! ఇక హాయిగా బుజ్జి బుజ్జి కాకరకాయల గురించి కలలు కంటా !
గింజ గట్టిపడని లేత కాకరకాయలు కాయ పడంగా వండుకుని తింటే... ఆహా...!!


Monday, May 16, 2011

బుజ్జి మొక్కలు



ఒకేలా ఉన్నా కొంచెం తేడా ఉంది రెండు ఫోటోలకి...
ఇంతకీ ఈ మొక్కలేమిటో చాలామందికి తెలిసిపోతుంది.
పండిపోయిన కాకరకాయ గింజలు కాస్తంత ఎండబెట్టి మట్టిలో వేస్తే వచ్చిన బుజ్జి మొక్కలు.
కాబోయే కాకర పాదులు !



Friday, March 25, 2011

మరువం పూలు + పేరు తెలీని మొక్క ?


కదంబం లో ఒదిగే మరువం సువాసన మాత్రమే తెలుసిన్నాళ్ళూ. మరువానికి కూడా పూలు పూస్తాయని ఊహన్నా లేదేమిటో. అదివరకూ కూడా కొంత కాలం పెంచాను ఈ మొక్కను. కానీ పూలెప్పుడూ పూయలేదు. ఇదే మొదటిసారి నేను మరువం పూలు చూడటం. నాకులా ఇప్పటిదాకా చూడనివాళ్ళుంటే ఓసారి ఈ ఫోటోలు చూసేయండి.



**** ***** ****

ఈ క్రింది ఫోటోలోని మొక్కలు మా సందులో గోడవారగా మొలకెత్తాయి. ఏం మొక్కలో తెలీక పెరిగేదాకా ఉంచాను. ఇప్పుడు ఇలా తెల్లని పూలు పూస్తున్నాయి. ఆకులకు గానీ, పువ్వులకు గానీ ఏ వాసనా లేవు. వఠ్ఠి గడ్డి మొక్కలేమో కూడా. ఇవేం మొక్కలో ఎవరికన్నా తెలుసా?



Saturday, March 5, 2011

ఇవేం పూలు?


ఏమిటీ కాగితం పూలు అనేద్దామనుకుంటున్నారా? అదేం కదు. ఇవి "చుక్కాకు పులు". ఆకుకూరల్లో ఒకటైన చుక్కాకుకు ఈ పూలు పూసాయి.నేనూ ఇదే చూడటం.కుండీలో పెంచిన చుక్కాకు పప్పులోకి రెండు కోతలు అయిపోయాకా ఇలా పూలు వస్తూంటే బాగున్నాయని ఉంచేసాను. కుండీ నిండుగా ఇలా పూసేసాయి. కాగితo పూల్లాగా ఉన్న ఈ పూలు చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇలా ఉంచేస్తే ఎండిపోయి విత్తనాలయిపోతాయని ఉంచేసాను. బాగున్నాయి కదా.




Tuesday, January 4, 2011

మరో మంచి ఇండోర్ ప్లాంట్ (నిన్నటి టపాలోని మొక్క గురించి)


నిన్న పెట్టిన "ఇదేం మొక్కో చెప్పుకోగలరా?" టపాకు ఆరు వ్యాఖ్యలు వచ్చాయి. రాసిన అందరికీ బోలెడు థాంక్స్ లు. అందులో ఇద్దరు(సూర్యుడు గారు, స్నేహ గారు) కరెక్ట్ గా రాసారు. అది potato మొక్క. పైన ఫోటోలో దుంప కనబడుతోంది చూడండీ...


మా చిన్నప్పుడు ఒకసారి ఓ బంగాళాదుంపకు బాగా మొలకలు వచ్చేసాయని మట్టిలో పాతిపెట్టాం. అది పెరిగి అందమైన మొక్కగా తయారైంది. బాగా పొడుకు అయిపోతే నాన్న నాలుగు పుల్లలతో చిన్నపాటి పందిరి కూడా కట్టారు వంగిపోకుండా. కొన్నాళ్ళకు మొక్క ఎండిపోయింది. తవ్వితే క్రిందన చిన్న చిన్నవి నాలుగైదు బంగాళాదుంపలు ఉన్నాయి. ఎంతో అపురూపంగా ఆ బుజ్జి బుజ్జి దుంపలను ఉడకపెట్టుకుని తిన్నాం. ఇది చిన్ననాటి ఊసు.


అలానే మొన్నొకరోజు ట్రేలోని ఓ బంగాళాదుంపకి బాగా మొలకలు వచ్చేసాయి. ఎందులో పాతుదాం అని ఆలోచిస్తూంటే, బీట తీసినా పడేయలేక దాచిఉంచిన ఒక 'అన్ బ్రేకబుల్ డిష్' కనపడింది. వెంఠనే మట్టివేసి potato పాతేసాను. చల్లదనం వల్ల ఓ వారానికి బాగా ఏపుగా పెరిగింది. మరో వారానికి ఇదిగో పైన ఫోటోలోలా అయ్యింది. ఇండోర్ ప్లాంట్ లాగ చక్కగా ఇంట్లో ఏదో ఓ చోట పెట్టుకుంటే ఎంతబాగుంటుందో కదా అని ఐడియా వచ్చింది. మీరూ వేసి చూడండి. చలికాలం కాబట్టి ఇప్పుడే బాగా పెరుగుతుంది. మొక్క పెరిగాకా ఇంట్లో పెట్టినా అప్పుడప్పుడు ఎండలో పెట్టడం మర్చిపోకండేం...:)


గతంలో ఒకసారి చిలకడ దుంపతో అందమైన ఇండోర్ ప్లాంట్ ఎలా తయారౌతుందో రాసాను. ఆ టపా తర్వాత నుంచీ రెగులర్గా మీ బ్లాగ్ చదువుతున్నాం అని కొందరు రాసారు కూడా.

Monday, January 3, 2011

ఇదేం మొక్కో కనుక్కోగలరా..?

మంచి ఇండోర్ ప్లాంట్ అవ్వగల ఈ మొక్క ఏమిటో చెప్పుకోగలరా...




Friday, December 24, 2010

తోట కబుర్లు

మొలకెత్తే చిట్టి చిట్టి మొక్కలను రోజూ చూసుకోవటం భలే ఉంటుంది

చిన్నారి చుక్కకూర మొక్కలు


చిగురులు తొడిగిన పుదీనా


తోటకూర మడిఇన్ ప్రోగ్రెస్...












తల ఎత్తుతున్న బెండ మొక్క

తల ఎత్తిన మూడు బెండకాయ మొక్కలు


పూసిన మొదటి నందివర్ధనం


పెరిగిన మెంతికూర

Monday, November 29, 2010

మెంతి పులకింత



చిట్టి చిట్టి మెంతులు కుండీలో పోసి
కాస్తమట్టి తెచ్చి వాటిపై వేసి
కాసిన్నీళ్ళు పోసి, రెణ్నాళ్ళు ఆగి
పొద్దున్నే చూస్తే.. మొక్కలెచ్చేసాయి...:)

ఒక సరదా ఇన్నాళ్ళకు మళ్ళీ వెలుగు చూసింది. ఇది కొన్నేళ్ళ తరువాత నే వేసిన చిరు మెంతి మడి...!
మట్టి చీల్చుకుని బయటకు వచ్చి చిన్న చిన్న తలలను బయటకు పెట్టి ఇవాళ వెలుగు చూసిన కుండీ లోని మెంతి మడి..ఎలా పెరిగిందో మీరూ చూడండి...











గార్డెనింగ్ ఆసక్తి ఉన్నవాళ్ళు సరదాకి ఈ లింక్ కూడా చూడండి.




Wednesday, October 13, 2010

పూసింది పూసింది మందారం..!


మూడు నాలుగేళ్ళ తరువాత నేను కొన్న మొక్క ! నెల రోజులుగా ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా ఓ నర్సరీలో పది రకాల రంగురంగుల మందారాలను చూస్తున్నా. వాటిల్లో ఈ తెలుపు రంగు నన్ను బాగా ఆకట్టుకుంది. చిన్నప్పుడు మామ్మయ్య(నానమ్మ) పెంచిన పదమూడు రకాల మందారాలూ గుర్తుకొచ్చాయి. చూసి చూసి మొత్తానికి ఓ రోజు కొనేసాను. అప్పుడే ఇది మూడో పువ్వు...