సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, December 28, 2019

కథ లాంటి నిజం


సినిమాల్లో మాత్రమే చూసేలాంటి కథ ఒకటి ఎదురుగా కనబడితే? సినిమా కష్టాలు అనేలాంటి కష్టాలన్నీ మూకుమ్మడిగా ఒకరి జీవితంలో కనబడితే? వినడానికే హృదయం పగిలిపోతూంటే అనుభవించే ఆ మనసుకు ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు..ఎన్ని సమస్యలో!! అసలు ఒకే మనిషిని ఇన్ని కష్టాలు చుట్టుముట్టగలవా? అంటే ఆ కర్మఫలం ఎంత ఎక్కువ ఉందో...!! ఎవరా జీవి? ఏమిటా కష్టాలు అంటే చెప్పలేను. మరొకరి జీవితాన్ని గురించి రాసే హక్కు నాకెక్కడిది? నాకా హక్కు లేదు. అది తప్పు కూడా. కానీ బాధను తట్టుకోలేక నా సొంతమనుకునే ఈ బ్లాగులో ఈ నాలుగు వాక్యాలూ రాసుకుంటున్నాను. 
అబ్బా! నిజంగా పొద్దున్నుంచీ తట్టుకోలేకుండా ఉంది. ఆ మనిషికి దేవుడు అలా అన్నీ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసేసుకుంటూంటే అసలు ఏమనాలో నాకైతే తెలీట్లేదు. అవును.. ప్రాప్తం, పూర్వజన్మ పాపం, కర్మఫలం, ఋణాలూ ఎక్సట్రా ఎక్సట్రా... అన్నీ తెలుసు. అందులో సత్యం ఉంది. అయినా కూడా పాపం కదా..అయ్యో.. అనుకుంటూ ఎన్ని అఫ్సోస్ లు పడ్డా దు:ఖం తీరట్లేదు..అయ్యో, నేనా మనిషికి ఏ సహాయమూ చెయ్యలేనే అనే బాధ నన్ను తొలిచేస్తోంది.. :( 
అనుభవాలు మనిషికి గట్టిదనాన్ని నేర్పుతాయి అంటారు. రాటుదేలాలి అంటారు. నేనేమిటో రాను రానూ ఇంకా ఇంకా బలహీనంగా, ఏదీ తట్టుకోలేనంత సెన్సిటివ్ గా అయిపోతున్నాను. ఇది తప్పు అని తెలుసు. జీవితంలో అన్నింటినీ తట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కొన్నింటిని మర్చిపోవాలి. నిలబడాలి. పోరాడాలి. బతకాలి. ఉదాహరణగా మిగలాలి.. అంటారు జ్ఞానులు. ఎవరి ఊతమూ లేకుండా నిలబడడం అయితే వచ్చింది ఇన్నేళ్లకి. కానీ ఒక దు:ఖాన్ని చూసి చలించిపోయి, అతలాకుతలం అయిపోయే బలహీనత మాత్రం పోవట్లేదు. ఇలా అన్నింటికీ కదిలిపోతుంటే ఎన్ని వందల మైళ్ళు నడిచి, ఎన్ని రకాల మిల్లెట్లు తిని, ఎన్ని కషాయలు తాగితే మాత్రం లోనున్న రోగం తగ్గుతుంది? నా ఆరోగ్యం కూడా నేను చూసుకోవాలిగా! తామరాకు మీద నీటిబొట్టు స్థాయికి రావాలంటే ఎంతో సాధన కావాలి. భగవంతుడా నాకు ధైర్యాన్ని ఇవ్వు. శక్తిని ఇవ్వు. అన్నట్లు, నేనొక పనిచెయ్యగలను...అవును.. ఆ మనిషికి సరైన సహాయాన్ని, మార్గాన్ని చూపెట్టమని భగవంతుడిని ప్రార్థించగలను. ఇప్పుడు ఇలా రాయడం వల్లే ఇంత మంచి ఆలోచన వచ్చింది. అవును..ఆ పని చేస్తాను. ప్రార్థిస్తాను. ఆ మనిషి కోసం, నా కోసం కూడా..! ఇలా అనుకుంటే కాస్త ఊరటగా బావుంది.

Thursday, November 28, 2019

రామ్ గారు !!



బ్లాగ్ మొదలెట్టిన ఏడాది తర్వాతేమో నాన్న గురించి సిరీస్ రాసిన తర్వాత ఒకరోజు ఒక కామెంట్ వచ్చింది. కాకినాడలో మీ అన్నయ్యగారి ఫ్రెండ్ ని. నేను ఫలానా. మీ అన్నయ్య మెయిల్ ఐడీ ఇవ్వగలరా? అని. అలా మొదలైన ఒక చిన్న పరిచయం స్నేహశీలత నిండిన ఒక ఆత్మీయ పరిచయంగా మారింది. పరిచయానికీ, స్నేహానికీ మధ్యన ఎక్కడో ఉండే ఒక మధ్య మెట్టులోనే ఆ పరిచయం ఉండేది. అయితే, ఎప్పుడో అప్పుడప్పుడూ జరిగే రెండు వాక్యాల పలకరింపుల్లో కూడా ఎంతో స్నేహశీలత, ఆప్యాయత తొంగిచూసేవి. సద్భావన, సచ్ఛీలత, సహృదయత నిండుగా మూర్తీభవించిన మనిషి రామ్ గారు. సుప్రసిధ్ధ రచయిత, ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత శ్రీ ఎం.వీ.ఎల్ గారి అబ్బాయి శ్రీ ఎమ్.వీ.ఎస్.రామ్ ప్రసాద్ గారు. ఇది ఆయన బ్లాగ్ లింక్ -
http://mvl-yuvajyothi.blogspot.com/

దాదాపు నేను రెగులర్ గా బ్లాగ్ రాసినన్నాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు. చివర చివరలో ఆఫీసు పని వత్తిడులలో చాలా బిజీ అయిపోయారు ఆయన. నేనూ బ్లాగ్ మూసేసాకా అసలు ముఖ పుస్తకం, బ్లాగులు, బ్లాగిళ్ళు...వేటి వంకా కన్నెత్తయినా చూడని కారణంగా గత ఐదేళ్ళుగా అసలు ఏ పలకరింపులూ లేవు. ఆ స్నేహపరిచయం అలా ఆగిపోయింది. 2017 చివర్లో ఎం.వీ.ఎల్ గారి రచనల పుస్తకావిష్కరణ జరిగిందని, మొదటి పేజీలో కృతజ్ఞతలలో మీ పేరు కూడా ఉందని ఆ పేజీ కాపీ పంపించారు. ధన్యవాదాలు తెలిపాను. అదే చివరి ఈ-మెయిల్. 

ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మాత్రం నాన్నగారింట్లో రామ్ గారూ, అన్నయ్య, నేనూ, మా వారూ అంతా కలిసాము. వారం రోజుల క్రితం అన్నయ్య నుంచి వచ్చిన మెసేజ్ చదివి దిగ్భ్రాంతి చెందాను. రామ్ గారి హఠాన్మరణం గురించి!!! ఎంతో దారుణమైన వార్త! నమ్మశక్యం కాని ఆ వార్తను జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇవాళ పొద్దున్నకి ఆయన భౌతికశరీరం ఇండియా వస్తుందని, ఎయిర్పోర్ట్ కి వెళ్తానని అన్నయ్య రాత్రి చెప్పాడు. బహుశా ఈ సమయానికి ఆయన సొంతఊరైన నూజివీడు లో అంతిమకార్యక్రమాలు జరుగుతూ ఉండిఉంటాయి. ఆ ఊరంటే ఎంతో ప్రేమ రామ్ గారికి. కనీసం ఈరకంగా అయినా ఆయన ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను. 

వాళ్ల నాన్నగారి రచనలను వెతికి, వాటిని ప్రచురణ వరకు తీసుకువెళ్లడమే భగవంతుడు ఆయనకు కేటాయించిన ముఖ్యమైన పనేమో! ఆ రకంగా బాధ్యత తీర్చేసుకున్నారు. కానీ ఎంతో ప్రతిభ ఉన్న ఒక మంచి మనిషి ఇలా అర్థాంతరంగా వెళ్పోవడం చాలా బాధాకరం. ఆయన ప్రతి మాట, ప్రతి అక్షరం ఎంతో మాజికల్ గా ఉండేవి. ఆయన శ్రధ్ధ పెట్టలేదు కానీ ఎంతో గొప్ప కవి లేదా రచయిత అయి ఉండేవారు రచనా ప్రపంచంలోకి గనుక వచ్చి ఉంటే!  అక్షరాలతో మేజికల్ గా పదాలల్లడంలో ఆయనకు ఆయనే సాటి. రామ్ గారు పండుగలకు శుభాకాంక్షలు తెలుపడం కూడా గమ్మత్తుగా ఉండేది. తెల్ల కాగితంపై అందమైన చేతి వ్రాత తో, ఏ పండగ అయితే ఆ పండుగకు సంబంధించిన పదాలతో అల్లిన ఒక అద్భుతమైన కవిత పి.డి.ఎఫ్ రూపంలో ఈమయిల్ కు అటాచ్ అయి వచ్చేది. అందులో పన్లు,సెటైర్ లు, ప్రాసలూ అనేకం కలగలిపి ఉండేవి. ఈకాలంలో అటువంటి ప్రజ్ఞాశాలిని అరుదుగా చూస్తాము. It's a great loss. I express my deepest condolences to his family.

క్రితం వారం కలిసినప్పుడు అన్నయ్య, రామ్ గారితో తన మొదటి పరిచయం గురించి చెప్పాడు. కాకినాడలో ఓ పాటల పొటీకి వెళ్ళారుట. రామ్ గారు "బ్రోచేవారెవరురా" పాడితే, అన్నయ్య "ఊహా పథాలలో..." అనే లైట్ మ్యూజిక్ సాంగ్ పాడాడుట. "లిరిక్ చాలా బావుంది.. మీరెవరు?" అంటూ వచ్చి పరిచయం చేసుకున్నారుట రామ్ గారు. ఇంజినీరింగ్ కాలేజీలో రామ్ గారు తనకు సీనియర్ అని అప్పుడు తెలిసిందిట. 

కొన్ని పరిచయాలకి పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు కానీ మనసులో ఆ పరిచయానికి ఓ పేరు ఎప్పుడూ ఉంటుంది. రామ్ గారు అనగానే ఆప్యాయంగా పలకరించే ఓ పెద్దన్నయ్య అనిపించేవారు నాకు. బ్లాగింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా ఎన్నో సలహాలు, సూచనలు అందించేవారు. బ్లాగులో ఫీడ్జిట్ కౌంటర్ ఇస్టాల్ చేసుకోమని ఎన్నో సార్లు చెప్పారు. లింక్ కూడా మెయిల్ చేశారు. అప్పట్లో ఎందుకో అది ఇన్స్టాల్ చేయడం సరిగ్గా తెలియలేదు నాకు. ఇందాకా ప్రయత్నించాను కానీ పనిచేయట్లేదు. వేరే ఏదైనా తప్పకుండా ఇన్స్టాల్
చేయడానికి ఇప్పుడన్నా ఆయన కోరిక మేరకు ప్రయత్నిస్తాను. 

రామ్ గారూ! మీరు ఎప్పుడూ చెప్పేవారు కదా.. రాస్తూనే ఉండమని! తప్పకుండా గుర్తుంచుకుంటానండీ! మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
సెలవు...

Friday, November 22, 2019

HINDI RETRO - myTuner Radio app




" my Tuner Radio " ! నా ఫోన్ లో ఇదిక inbuilt app. చాలా కాలంగా ఎప్పుడూ పట్టించుకోలేదు. కొన్ని అద్భుతమైన వస్తువులు/విషయాలు వాటి విలువ తెలిసేవరకూ అలా అజ్ఞాతంలోనే ఉంటాయి. వాకింగ్ లో వీలుగా ఉంటుందని hands free earphones కొనుక్కున్నాకా సదుపాయం బాగా కుదిరింది కానీ రోజూ వినే ఎఫ్.ఎమ్ రేడియో అందులో వినపడ్డం మానేసింది. గంటకు పైగా ఏమీ వినకుండా నడవడం నావల్ల కాదు. సో, ఆల్టర్నేట్ కోసం వెతుకుతుంటే నా ఫోన్ లోనే ఇన్నాళ్ళూ మూగగా పడి ఉన్న ఈ యాప్ కనబడింది. ట్రై  చేస్తే hands free earphones లో వినపడుతోంది.  ఇదేదో బానే ఉంది అని అన్ని ఛానల్సూ వింటూ వెళ్తూంటే అందులో "HINDI RETRO" స్టేషన్ దగ్గర నా చెవులు ఆగిపోయాయి. ఆ రోజు నుంచీ ఇంట్లో కూడా చెవుల్లో అదే మోగుతోంది. ఈ మత్తు కొన్నాళ్ళలో దిగేది కాదని అర్థమైంది.  ఆ అమృతాన్ని ఇంకెవరన్నా ఆస్వాదించి శ్రవణానందాన్ని పొందుతారని ఇక్కడ రాయడం! ఈ యాప్ ని విడిగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంతకీ "HINDI RETRO" లోని ప్రత్యేకత ఏమిటంటే ఈ స్టేషన్లో నిరంతరం 70s&80s లోని హిట్ హిందీ సాంగ్స్ వస్తూ ఉంటాయి.  ఏ సమయంలో పెట్టినా ఏదో ఒక అద్భుతమైన పాట అమాంతం మన మూడ్ ని మార్చేసి ఆనందంలో ముంచెత్తేస్తుంది. కాబట్టి పాత హిందీ పాటల మీద మక్కువ ఉన్న వారు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఛానల్ ని తప్పకుండా ఆస్వాదించాలని ప్రార్థన :) 
జయహో HINDI RETRO !!

Thursday, November 21, 2019

నిట్టూర్పే మివులు !





కలలు 
కోరికలు
ఆశలు
ఆశయాలు
అపారం!
నిరాశ 
నిట్టూర్పు
అవమానం
అభిమానం
వాటికి అడ్డకట్ట!

గాయాలు మానినా
గురుతులు మానవు
తేదీలు మారినా
తేడాలు మాయవు!

ఉషోదయాల వెంబడి
జ్ఞాపకాల నిశీధి వెన్నంటు!

కనుగొనే ఆనందాలకి 
కన్నీటి పొర ఆకట్టు
చిరునవ్వు చివరన 
నిట్టూర్పే మివులు !

Thursday, September 26, 2019

"జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి" దిగిపోయారుగా!!



రెండేళ్ల క్రితం అనుకుంటా అనుకోకుండా మీ రేడియో టాక్ ఒకటి విన్నాను. మీరు ఎలా రాయటం మొదలుపెట్టారు దగ్గర నుంచీ రచనలు ఎలా చెయ్యాలి మొదలైన విషయాలు టూకీగా పది నిమిషాల్లో చెప్పేసారు. ఒక కన్యాశుల్కం, ఒక బారిస్టర్ పార్వతీశం, ఒక బుడుగు, ఒక మిథునం, ఇల్లేరమ్మ కతలు! అలా గుర్తుండిపోతాయి. అంతే!

Satirical Comedy రాయడంలో మీకు మీరే సాటి. ఆలస్యంగా మొదలుపెట్టినా అతి కొద్ది రచనలతోనే తెలుగు పాఠకుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించేసుకున్నారు. Your works will live long సుశీల గారూ. నిండైన జీవితాన్ని చూశారు. ధన్యులు.


సాయంత్రం ఎవరో చెప్తే నమ్మలేదు.. నిజం కాదేమో అనుకున్నాను. కానీ రెండో మెసేజ్ వచ్చేసరికీ నమ్మక తప్పలేదు. చెప్పింది చెప్పినట్లు చెయ్యడం మీకు చిన్నప్పటి నుండీ అలవాటే కదండీ! "జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమే" అని ఎంత తేలికగా చెప్పారు ! అలా అన్నట్టుగానే హటాత్తుగా దిగిపోయారు కూడా :((
చాలా రోజుల క్రితం ఫార్వార్డ్ లో వచ్చింది మీ "ప్రయాణం"! ఎంతగానో నచ్చేసి దాచుకున్నాను.. ఇవాళ ఇలా మీరెళ్ళిపోయాకా ఇక్కడ పోస్ట్ చేస్తానని అనుకోలేదు.



ప్రయాణం                     
-- డా. సోమరాజు సుశీల


పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా?
అప్పుడే వచ్చేసిందా?
నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసిమురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా అని విసుక్కున్నదెప్పుడూ… నాలుగు రోజుల క్రితమేగా!

ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!

నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !

అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే, నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, 'మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !

అయినా ఏం లోటయిందని ?వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ, వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్… అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!

ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ…ఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….
ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మా… అమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !

ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు! చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?

పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు…ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు… గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు…ఎంత హాయిగా వుందో!
ఒకటే ఇడ్లీ తింటే గంటకే ఆకలేస్తుంది.. పోనీ అని రెండు తింటే అపరాహ్నమయినా అన్నానికి లేవబుధ్ధి కాదు!
ఆవకాయని చూస్తే బీపీ, మామిడి పండుని తల్చుకుంటే సుగరూ, పగలు కాస్త రెండు ముద్దలెక్కువయితే రాత్రికి మజ్జిగ చాలు… ఎంత తేలిక అవసరాలు!
సగం భోజనం మిగతా సగం మందులు .. అవి ఉండ బట్టే కదా ఇంకా మనగల్గుతున్నాం!

ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ .. మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు!
ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు !
అంతా నిశ్శబ్ద సంగీతం!
ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా!
అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు.ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా !

ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం…అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు.మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
 కాబట్టి హాయిగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కుళ్లు జోకులకి కూడా గట్టిగా నవ్వుకోవచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు.

అవునూ… మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?
’ పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తిను’ అంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే?
అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట! 

చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.

అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ?
తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!

***    ****

మీ పుస్తకం - ముగ్గురు కొలంబస్ లు  గురించి నాలుగు మాటలు..

Monday, August 5, 2019

స్నేహితులు




పైన పద్యంలో చెప్పినట్లుగా ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో ద్రవించింది మనసు నిన్న. నా ప్రియమైన స్నేహితులందరినీ కలిసిన తరువాత. అచ్చంగా పాతికేళ్ళ తరువాత ఐదేళ్ళపాటు కలిసి చదువుకున్న మా మారిస్ స్టేల్లా కాలేజీ మిత్రురాళ్ళము కొందరం నిన్న బెజవాడలో కలుసుకున్నాం. టీనేజ్ లో విడిపోయిన మేము మళ్ళీ టీనేజీ పిల్లల తల్లులుగా మారాకా జరిగిన ఈ కలయిక మాలో ఎంత అద్భుతమైన ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ నింపిందో అసలు మాటల్లో చెప్పలేను. మరీ దూరాల్లో ఉన్న స్నేహితులను వీడియో కాల్స్ చేసి పలకరించాము. అందరి కళ్ళల్లో సంబరం, ఆశ్చర్యం, ఆత్మీయత! ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు అన్నీ మర్చిపోయి, సంసారాన్ని పక్కన పెట్టి, మళ్ళీ మేము చిన్నపిల్లలమైపోయి అప్పట్లో క్లాస్ లో లాగ గలగలా గట్టిగట్టిగా మాట్లాడుకుని, ఏమే, ఒసేయ్ అని పిలుచుకుంటూ మహా ఆనందపడిపోయాం. మేము ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకోకుండా నిన్న "ఫ్రెండ్ షిప్ డే " అవ్వడం మరో గొప్ప కోయిన్సిడెన్స్!!

నాది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా సెక్లూడెడ్ లివింగే. నా కొకూన్ లో, నా కంఫర్ట్ జోన్ లో జీవిస్తూ గడపడం నా స్వభావం. మధ్యలో ఒక్క రెండు మూడేళ్ళు మాత్రం మునుపెన్నడూ ఎరుగని ఆర్థిక ఇబ్బందుల వల్ల, వాటిని మర్చిపోవడానికి ఎక్కువ భాగం ల్యాప్టాప్ ముందర గడిపాను. అదే నేను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఒకేలాంటి ఆసక్తులు ఉన్న మనుషులందరూ ఒక్కలాగ ఆలోచిస్తారనుకునే పిచ్చి భ్రమలో ఉండి జీవితాంతం మర్చిపోలేని అవమానాల్ని భరించాల్సి వచ్చింది!! దైవికంగా ఇప్పుడు నా మిత్రురాళ్ల కలయికతో ఆ బాధ అంతమైంది. అంత స్నేహమూ, అంత ప్రేమాభిమానాలూ ఉంటే ఇన్నాళ్ళూ ఎందుకు కలవలేదు? కనీసం ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంటే ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా పెళ్ళి, సంసార బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగాలూ, వయసుతో పాటూ వచ్చిన ఆరోగ్య సమస్యలూ... ఒకటా రెండా? సవాలక్ష కారణాలు. నామటుకు నేను గుర్తుకొచ్చినప్పుడు తలుచుకోవడం తప్ప ఏనాడూ గట్టిగా కలవడానికి గానీ, కనీసం మాట్లాడడానికి గానీ ప్రయత్నించలేదు. ఏమో...అలా గడిచిపోయాయి రోజులు.. అంతే. 


" बेक़रार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा न थे
तुम भी खो गए, हम भी खो गए
एक राह पर चलके दो क़दम..."
అందరమూ పాతికేళ్ల తర్వాత కలిసినా అదే స్నేహభావం, అదే ఆప్యాయత, అందరి కళ్ళల్లో అదే ప్రేమ. ఇది కదా నిజమైన స్నేహం అంటే. చెప్పుడు మాటలు విని అకారణ ద్వేషభావాల్ని పెంచుకుని మనసుని ముక్కలుచేసే వర్చువల్ స్నేహాల్లాంటివి కావవి. అందరమూ మొత్తం ఐదేళ్ళు 9a.m to 4p.m కలిసిమెలసి గడిపినవాళ్ళం.ఒకరిగురించి ఒకరం పూర్తిగా ఎరిగిన మనుషులము.


ఇంటర్ లో మా స్పెషల్ ఇంగ్లీష్(HSC) గ్రూప్ లో మొత్తం నలభై మందిమి. తర్వాత B.A లో కూడా సేమ్ బ్యాచ్. ఎకనామిక్స్ గ్రూప్, Eng.Litt రెండు గ్రూప్స్ నీ కలిసి ఒకే క్లాస్ లో కూర్చోపెట్టేవారు. క్లాస్ లో మొత్తం ఎనభై, తొంభై మందిమి ఉండేవాళ్ళం. ఆ రెండు సబ్జెక్ట్స్ కీ, లాంగ్వేజెస్ కీ రూమ్స్ మారేవాళ్ళం. లంచ్ టైమ్ లో మా లిట్రేచర్ వాళ్లమందరమూ రౌండ్ గా కూచుని ఒకరి బాక్సెస్ ఒకరం ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ లంచ్ చేసేవాళ్ళం. పాటలు పాడే అమ్మాయిగా నేను అందరికీ బాగా తెలిసేదాన్ని. మేడమ్ రాకపోతే లీజర్ పిరియడ్ లో నాతో పాటలు పాడించుకునేవారు. డిగ్రీలో నాకు తోడు మరొక సింగర్ క్లాస్ లో జాయిన్ అయ్యాకా నాకు కాస్త రెస్ట్ వచ్చింది. తను చాలా బాగా పాడేది. బోల్డు హై పిచ్. ముఖ్యంగా మల్లీశ్వరిలో పాటలు ఎంత బాగా పాడేదో. నేనైతే "ఎందుకే నీకింత తొందర.." పాటని మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునేదాన్ని. ఆ పాటల వల్లే నాకు మంచి స్నేహితురాలైంది కూడా తర్వాతర్వాత. ఇప్పుడు కెనడాలో ఉంటోందా రాక్షసి.

విజయవాడకు దగ్గరలో ఉన్న ఊళ్ళవాళ్లందరూ నిన్న వచ్చారు. ఇంతకీ నిన్న కలిసిన వాళ్ళల్లో చాలా మటుకు అందరూ మంచి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీలలో టీచింగ్ ప్రెఫెషన్ లోనే ఉన్నారు. చాలావరకూ పి.హెచ్.డీ కేండిడేట్ లే. ప్రెఫెసర్ గిరీలే! వివరాలు అప్రస్తుతం కానీ ఇలా మంచి పొజిషన్స్ లోకి ఎదిగినవాళ్ళు మా బ్యాచ్లో ఇంకా కొందరున్నారు.

దాదాపు అందరూ వర్కింగే అవడం వల్ల పని ఒత్తిడి, పలు ఆరోగ్య సమస్యలూ కూడా కామన్ గానే కనబడ్డాయి మాలో! కానీ నాకు ముఖ్యంగా సంతోషం కలిగించిన విషయం పిల్లలు. అందరూ కూడా పిల్లలని చక్కని క్రమశిక్షణతో, ఉన్నతమైన చదువులు చదివించారు. చదివిస్తున్నారు. బుధ్ధిమంతులుగా పెంచుతున్నారు. మన మంచితనం, మన బాధ్యతా నిర్వహణలే మన పిల్లలకూ మార్గదర్శకంగా మారతాయి. ఇవే కదా మనం పిల్లలకు ఇచ్చే ఆస్తులు. 

నేను గమనించిన ఇంకో సరదా విషయం మా మానసిక ఎదుగుదల. ఒకప్పుడు టీనేజ్ ఆలోచనలతో ఉన్న మేమే మాకు తెలుసు. ఇప్పుడు అందరమూ దాదాపు సగం జీవితాన్ని చూసిన, గడిపిన అనుభవంతో ఉన్నాము. అందువల్ల అందరి మాటల్లోనూ లోతైన అవగాహన, చక్కని పరిపక్వత ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇదంతా జీవితంలో నేర్చుకున్న పాఠలు అనేకన్నా మా కాలేజీ మాకు ఇచ్చిన శిక్షణ వల్లనే అనుకోవడమే సబబు. అప్పట్లో అధ్యాపకులు కూడా ఎంతో ఆదర్శవంతంగా, విజ్ఞానవంతులుగా ఉండేవారు. అలానే బోధించేవారు. ఇప్పుడు కూడా క్లాస్ చెప్పేప్పుడూ ఫలానా మేడమ్ మాటలు గుర్తుచేసుకుంటూ ఉంటాము అని కూడా ఒకరిద్దరు స్నేహితురాళ్ళు అన్నారు నిన్న. అందరు అధ్యాపకులనూ పేరు పేరునా తల్చుకున్నాం. నాలుగైదు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. 

గిఫ్ట్స్ ఎక్ఛెంజ్ చేసుకుని, నెక్స్ట్ మీట్ లోపూ మరికొందరు మిత్రులని వెతికిపట్టుకోవాలనే నిశ్చయంతో, భారమైన హృదయాలతో, కళ్లల్లో నీళ్ళతో, కౌగిలింతలతో వీడ్కోలు చెప్పుకున్నాం. ఏడాదిలో ఒక్కసారైనా ఇలా కలుస్తూ ఉందామర్రా! అని గట్టిగా చెప్పుకున్నాం. అప్పటికే లేటయిపోవడం వల్ల ఇంక వేరే ఎవరినీ కలవకుండానే ఇంటిదారి పట్టాను. దారిలో కృష్ణా బ్యారేజ్ దాటాకా అదేదో పవిత్ర సంగమంట. కృష్ణా,గోదావరుల కలయికా స్థలం. పార్క్ లా డేవలప్ చేశారు. అది మాత్రం చూశాము. రాత్రి ఇల్లు చేరేసరికీ పన్నెండైంది. ఆదివారం కాబట్టి ఇలా కలవడం సాధ్యమైంది అందరికీ. కానీ మరొక్కసారి టీనేజ్ లోకి వెళ్ళి వచ్చినట్లు ఉన్న magical intoxication లోంచి మాత్రం ఎవ్వరమూ ఇంకా బయటకురాలేదు. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న మా కాలేజీ వాట్సప్ గ్రూప్ లో ఇందాకటిదాకా టింగ్ టింగ్ మని వస్తున్న మెసేజెస్ అందుకు సాక్ష్యం :-)

 స్నేహసుగంధాల మత్తులో, ఈ జ్ఞాపకాలతో మరోసారి మేమందరమూ కలిసే వరకూ బహుసంతోషంతో బతికేయచ్చు అని మాత్రం ధీమాగా అనిపించింది.









Friday, August 2, 2019

ఇప్పపూలు

  


                                                  

ఆహ్లాదానికో, పొద్దుపోవడానికో చదివే కాలక్షేపపు సాహిత్యంలా కాకుండా వివేకాన్నీ, ఆలోచననీ, ఆవేశాన్నీ నిద్ర లేపే ఉపయోగకరమైన సాహిత్యం మరింతగా అందుబాటులోకి రావాలని  తోపించడమే "ఇప్పపూలు" కథాసంకలనం ప్రత్యేకత. "ఇప్పపూలు" కథలు పాఠకులని నాగరిక సమాజం నుండి అమాంతం అడవుల్లోకి తీసుకుపోతాయి. ప్రకృతి శోభ, కొండా కోనా అందాలు, రకరకాల పశుపక్ష్యాదులు, వన్యమృగాలు, అటవీ సంపద, గిరిజనుల పాటా పదం.. అన్నింటినీ చూసి ఆస్వాదించి ఆనందించే లోపూ అక్కడి గిరిజనుల జీవితాలలో అలుముకున్న అలజడుల తాలూకూ విషాదం హృదయాలను దిగాలు పెట్టేస్తాయి..! వీళ్ళ కోసం మనమేం చెయ్యగలము? అన్న ప్రశ్న డ్రిల్లింగ్ మషీన్ లా మెదడుని దొలిచేస్తుంది. గిరిజన తెగలన్నింటికీ ఒకో ప్రత్యేకత, ఒకో దైవం, విశ్వాసాలూ, నమ్మకాలూ ఉన్నాయి. ఎన్ని విశిష్టతలు ఉన్నా వీరందరూ గురైయ్యే దోపిడీ విధానం మాత్రం ఒక్కటే! కాంట్రాక్టర్లు, దొంగ వ్యాపారులు కాలుపెట్టాకా పల్చబడిన అడవి, గిరిజనుల భూమి తగాదాలు, వారి నిరక్షరాస్యత వల్ల జరిగే మోసాలూ.. అవన్నీ గిరిజన యాస, భాష, మాండలీక పదజాలంలో రాస్తేనే చదువరులకి గిరిజనుల ఆవేదన వాడిగా తగలాలనేనేమో పుస్తకంలోని చాలా కథలు ఆయా ప్రాంతాల మాండలీకాలనూ, గిరిజన యాసనూ మనకు పరిచయం చేస్తాయి.

2009 వరకూ గిరిజన సంచార తెగలపై కథాసంకలనం రాలేదు కాబట్టి గిరిజన సంచార తెగల జీవితం, సంస్కృతి, వాటి పరిరక్షణకై సాగే సంఘర్షణల ఇతివృత్తంతో ఒక  కథాసంకలనం తేవాలనే సంకల్పంతో 2009లో ప్రతిభాప్రచురణలు వారు "ఇప్పపూలు" అనే కథా సంకలనాన్ని వెలువరించారు సంపాదకులు ప్రొ.జయధీర తిరుమల రావుజీవన్ గార్లు. 1930 నుండీ వస్తున్న గిరిజన, సంచార తెగల కథాసాహిత్యాన్ని తమ శక్తిమేరకు పరిశీలించి, లభ్యమైనంతలో ఉత్తమ రచనలను ఈ సంకలనంలోకి తెచ్చామని, ఇంతకన్నా సమగ్రమైన సంకలనం తేవాలనే ఆశనీ వ్యక్తపరుస్తూ అందుకు తగ్గ ప్రోత్సాహాన్నీ అభిలషించారు. పుస్తకాన్ని "గిరిజన హక్కులు మానవహక్కులేనని ఎలుగెత్తిన బాలగోపాల్ కు.." అంకితమిచ్చారు. కథల చివరన ప్రచురణా కాలం తేదీ వివరాలు, పుస్తకం చివరన కథారచయితల వివరాలూ, చిరునామాలు అందించారు.

కథాన్వేషణలో 1930 మొదలు 1970 వరకూ జరిగిన కథారచనలు పరిశీలిస్తే గిరిజనజీవితాల ఇతివృత్తంతో వేళ్ల మీద లెఖ్ఖించగలిగిన కథలే లభ్యమయ్యాయట. 1970లో శ్రీకాకుళ, తర్వాత1980 ఉత్తర తెలంగాణా గిరిజన ఉద్యమాల నేపధ్యంలో అనేక కథలు వచ్చినా, ఉద్యమానంతరం అవీ మందగించాయిట. వాటిల్లో కూడా అదీవాసీలపై జరుగుతున్న ఆర్ధిక దోపిడీ గురించి రాసినంతగా గిరిజన సంస్కృతిపై నాగరిక సంస్కృతి చేస్తున్న దాడిని గురించిన కథలు కనబడలేదట. అభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరున జరుగుతున్న అనేక విధ్వంసాల కారణాలుగా పెద్ద ఎత్తున నిర్వాసితులౌతూ, మనుగడే ప్రశ్నార్థకంగా మారిన గిరిజనుల దయనీయ స్థితిగతుల గురించి ఈతరం కథకులు దృష్టిపెట్టకపోవడం శోచనీయమంటారు ప్రచురణ కర్తలు.

ఈ పుస్తకంలోని ముందుమాటలు చాలా ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వందేళ్ళ తెలుగు కథ వాస్తవికత, అవాస్తవికత, హాస్యం, శృంగారం, స్త్రీవాదం, కుటుంబ సమస్యలు, సమాజంలోని ఇతర సమస్యలు మొదలైనవాటి గురించే ఎక్కువ మాట్లాడింది కానీ అడవిలో పుట్టి పెరిగి, ప్రతి చెట్టుపుట్ట, ఆకూపువ్వూ తమ సొత్తైనా కూడా అడుగడుగునా ఆంక్షలకు లోబడుతూ అన్యాయానికి గురౌతున్న గిరిజనుల వ్యధలను, ఆరాట పోరాటాలనూ అక్షరీకరించడంపై కథారచయితలు దృష్టి సారించలేదన్న ఆవేదనని సంపాదకులు తమ ముందుమాటలో వ్యక్తపరిచారు. శ్రీకాకుళం, నల్లమల, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల్లో ఉన్న కోయ, గోండు, పరిధాను, బంజార, సవర, మేరియా, చెంచు, కోదు వంటి ౩౩ గిరిజన తెగల గురించిన 29 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సంచార,అరసంచార తెగలైన గంగిరెద్దులు, నక్కల వారి గురించి రెండు కథలున్నాయి. "మీటూ భూక్య"అనే మౌఖిక కథ కూడా ఉంది. ఏడాదిలో ఆరునెలలైనా ఊరూరా తిరిగి జీవనాలు సాగించే మందహెచ్చులు, డక్కలి, పెద్దమ్మలవారు, కిన్నెర వాద్యకారులు, శారదలు మొదలైన సంచార,అర సంచార సమూహాల గురించి ప్రత్యేకంగా మరో సంకలనాన్ని తేవాలనే అభిలాషను ప్రచురణకర్తలు వ్యక్తం చేసారు.

సంకలనంలోని మొదటిదైన "చెంచి" (భారతి,1932) కథలో అమాయక జంటైన చెంచి,చెంచుగాడు ఒకరికోసం ఒకరు పడే తాపత్రయం, కథాంతం మనసును తడిచేస్తాయి. "పులుసు" కథలో బోడేమ్మ ముసలిపై పోలీసు బూటూ కాలు పడినప్పుడు మనలో మరిగే ఆవేశం "ఇప్లవం వొర్దిల్లాలి" అని ఆమె అరిచినప్పుడు చల్లబడుతుంది. ఎ.అప్పల్నాయుడు గారి "అరణ్యపర్వంలో మాకీ యాపీసులొద్దు, ఆపీసర్లొద్దు,అప్పూ సప్పులొద్దు. ఆకటి సబ్సిడీలొద్దు, వొద్దు బాబో వొద్దు. మీ కాయితం కలాల వాయికొంటపాళీలాటలొద్దే వొద్దు! మమ్మల్ని పావులు మింగేత్తాయి.అవును బావ్. మమ్మల్నొగ్గీయండి. యిది నా ఒక్కడి గోశ కాదు. మా అడవి బతుకోలందరి గోస..! " అని ప్రార్ధించే కొయ్యంగాడి మాటలు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలతో పాటూ నాగరీకుల వికృతరూపాన్నీ కళ్లముందుంచుతాయి. ఈ కథ తరువాయి కథలన్నీ గిరిజనలపై కాక, వారి ఆస్తులపై, వన సంపదలపై జరుగుతున్న రకరకాల అన్యాయాలను, దోపిడీ విధానాలను గురించి చెప్తాయి. అభివృధ్ధి, వన్యపరిరక్షణ ముసుగులో జరుగుతున్న వివిధ అక్రమాల గురించి చదవడం ఆవేశాన్నే కాక, తెలివైన మనిషులు తెలివిలేని మనిషులను ఇన్ని రకాలుగా మోసం చెయ్యగలరా అన్న ఆశ్చర్యం కూడా కలగుతుంది. "జంగుబాయి" కథలో గోండుల ఆచారాలూ, మూఢవిశ్వాసాలనూ ఒకపక్క, కొత్తగా అడవికి వచ్చిన స్కూల్ మాష్టారి భార్యకు ఎదురైన అనుభవాలూ, భయాలూ, కొన్ని విషయాలలో కలగజేసుకోవాలనున్నా చెయ్యలేకపోయిన ఆమె నిస్సహాయతను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి.

వాడ్రేవు వీరలక్ష్మి గారి "కొండఫలం"లో గిరిజనుల భూమి తగాదాలను పరిచయం చేస్తే, "గోరపిట్ట", "ఆర్తి", "కలలోని వ్యక్తి","గోస","పయనం" మొదలైన కథలు గిరిజన తెగల నిస్సహాయతను, తద్వారా ఉద్యమం దిశగా సాగిన కొందరి పయనాలనూ తెల్పుతూ తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. కొండవీటి సత్యవతి గారి "గూడు" లో తండావాసులందరికీ ఇళ్ళూ కట్టించాలని ఆఫీసర్ చందన పడే తాపత్రయం స్ఫూర్తిదాయకంగా ఉండి, ఆఫీసర్లందరూ ఇలా పాటుపడితే గిరిజనుల బ్రతుకులు ఎంత మెరుగౌతాయో కదా అనిపిస్తుంది. "అరణ్య రోదన", ""పోటెత్తిన జనసంద్రం" రెండు కథలూ పోలవరం ప్రాజక్ట్ గురించిన ఎన్నో విషయాలను ఎరుకపరుస్తాయి. ఇవన్నీ ఒకరకమైతే చివరలో రచనైన "మూగబోయిన శబ్దం" కథ ద్వారా రచయిత్రి పద్దం అనసూయ చెప్పినట్లు ’మతమే లేని కోయ జాతిలోకి మతం వేరుపురుగులా ప్రవేశించిందన్న ’ సత్యం కలవరపరుస్తుంది. ఈ కథల్లోని మాన్కు, శిడాంశితృ, డోబి, యిస్రూ, వడ్డియా, గైతా మొదలైన చిత్రమైన పేర్లు, ఆ పేర్ల తాలూకూ మనుషులూ వాళ్ళ అమాయకత్వాలతో సహా గుర్తుండిపోతారు. డోలోళ్ళ పూర్భం గానం , గుస్సాడి నృత్యం, ధింసా నృత్యం.. మన:ఫలకంపై ఆ నృత్యాల తాలూకూ చిత్రాలను చూపెడతాయి. "ఆకాశం పండిన పత్తిచేను గాలికి కదులుతున్నట్లుగా ఉంది..", "పొట్టలు విచ్చుకుని తెల్లగా నవ్వుతూ భూమి మీద రాలిన నక్షత్రాల్లా పత్తిచేలు..", "అడవిలో కాస్తున్న ఎండ కూడా వెన్నెలలా చల్లగా ఉంది..", "గూడేనికి పచ్చల హారం తొడిగినట్లుగా అన్నివైపులా చేలూ,చెలమలూ.." మొదలైన అలంకార వాక్యాలు అడవి అందాలను కళ్ళ ముందు నిలబెడతాయి.

ఇటువంటి గుర్తుండిపోయే కథల ఎంపికే కాకుండా తెలుగు కథాసాహిత్యంలో తొలి గిరిజన కథకుడుగా భావించే చింతా దీక్షితులు కన్నా ముందే గూడూరు రాజేంద్రరావు "చెంచి" అనే కథను రాసారన్న సమాచారం సంపాదించడం సులభసాధ్యమైన విషయం కాదు. ఇలానే పుస్తకం పేరుని గురించి వివరిస్తూ గిరిజ తెగలలో, వారి సమాజంలో, కర్మకాండలో, పూజలో, విశ్వాసాలలో, నమ్మకాలలో ఇప్పపూలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నందువల్ల; ఇంతకు మునుపే బోయి జంగయ్య గారు "ఇప్పపూలు" పేరుతో తమ కథా సంపుటిని వెలువరించినా, ఈ సంకలనానికి వారి అనుమతితో, "గిరిజన సంచార తెగల కథలు" అనే ఉప శీర్షికతో ఇప్పపూలు పేరునే నిర్ణయించామని తెలియపరచడం మొదలైనవాటి వల్ల ఈ పుస్తకం తయారీ వెనుక ఉన్న సంపాదకుల శ్రధ్ధ, గిరిజనుల సంక్షేమం పట్ల వారి తపన వెల్లడౌతాయి.


Friday, July 26, 2019

శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు..



చాలా పుస్తకాల కబుర్లు రాయాలని మనసులో ఉన్నా; కాస్తంత పని ఒత్తిడి, కూసింత బధ్ధకం, అంతరంగంలో నిండుకుంటున్న మౌనం.. అన్నీ కలగలిసి బ్లాగు వైపు కన్నెత్తనివ్వలేదు. ఇంతలోనే నిన్న పొద్దుటే వచ్చిన దుర్వార్త జ్ఞాపకాల మూటలతో అటకెక్కిన ఎన్నో బెజవాడ కబుర్లను, ఎన్నో మధురస్మృతులను విషాదంతో మేల్కొలిపింది. స్కూలు రోజుల నుండీ పీజీ పూర్తయ్యాకా కూడా, అంటే దాదాపు ఇరవై పాతికేళ్లపాటు నేను యద్ధేచ్ఛగా తిరుగుతూ గడిపిన బెజవాడ రేడియో స్టేషన్, దాని చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, ఆ అపురూపమైన మరపురాని రోజులూ గుర్తుకువస్తూనే ఉన్నాయి నిన్నంతా.
"బాల్య కౌమారాలు చిరు పగడాలు సంజల కలియగా 
తరిపి వెన్నెల యౌవనంలో జాజిపూవులు పూయవా"
అన్న శర్మ గారి పద్యమూ గుర్తుకు వచ్చింది. ఎన్ని కవితలు, ఎన్ని మాటలు, ఎన్ని జ్ఞాపకాలో... ఒక అద్భుతమైన కవిగా నాకు ఆయనంటే ఎనలేని అభిమానం.

శ్రీకాంత శర్మ మావయ్యగారంటే ఒక నడిచే ఎన్సైక్లోపీడియా.
శ్రీకాంత శర్మ మావయ్యగారి భాష తేనెల తేటల తెలుగు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు వాడే పదాలు తాజా పూతరేకులు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి కవితలు పుస్తకంలో దాచుకున్న నెమలీకలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడని జాజిపూల పరిమళాలు.
శ్రీకాంత శర్మ మావయ్యగారు ఒక అనుపమానమైన వ్యక్తి !!


ఆయన గొప్పదానాన్నో, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవనో, లేదా ఆయన పాండిత్యాన్ని గురించో చెప్పేంతటి దాన్ని కాదు. వాటి గురించి చెప్పే పెద్దలు చాలామంది ఉన్నారు. కానీ నా చిన్న ప్రపంచంలో, నా జ్ఞాపకాల దొంతరల్లోంచి ఆయన గురించిన మాటలు కొన్ని తలుచుకోవడమనేది ఇవాళ నేనెంతో మురిపెంతో చేస్తున్న పని. అంత అభిమానం నాకు శ్రీకాంత శర్మ మావయ్యగారంటే! అభిమానాన్ని మించిన ఆప్తస్నేహం నాన్నదీ, ఆయనదీ. మావయ్యగారి సమగ్ర సాహిత్యం రెండు భాగాలుగా విడుదల అయ్యాకా నాన్నకు పంపించిన కాపీ చదువుతూ, మొదటి భాగం సృజనలో "వెనుదిరిగి చూసుకుంటే..." అనే ముందుమాటలో ప్రస్తావించిన ఆప్తమిత్రుల్లో తన పేరు చూసుకుని "అయ్యా, నా పేరు కూడా రాశారే" అన్నారట ఫోన్ లో నాన్న. "అయ్యో, భలేవారే! మీ పేరు లేకుండానా" అన్నారట శర్మ గారు. ముఫ్ఫై ఏళ్ల ఉద్యోగ సాంగత్యాన్నే కాక అంతకు మించిన మధురమైన స్నేహసౌరభాన్ని వారిద్దరి పరిచయానికి అద్దింది రేడియో. మొన్నటి దాకా అది పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. ఈమధ్యన నాన్నకూ బాగోవడం లేక ఒక్కరూ ఎక్కడికీ  వెళ్ళలేకపోతున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే కృష్ణమోహన్ అంకుల్ నాన్నను తనతో పాటూ తీసుకువెళ్ళారు శర్మగారిని కలవడానికి. మావయ్యగారు తన కూడా ఉన్న అటెండర్లు చెప్పారట "పొద్దున్నుంచీ మూడు నాలుగుసార్లు చెప్పారు నా ఫ్రెండ్స్ వస్తున్నారు.." అని. కృష్ణమోహన్ అంకుల్ , శర్మగారూ, నాన్న ముగ్గురిదీ మరో స్నేహం! కాసేపు కబుర్లయ్యకా మళ్ళీ నాన్నని ఇంటి దగ్గర దింపేసి వెళ్లారుట అంకుల్. బాగా నీరసపడిపోయారని నాన్న చెప్పినా ఎప్పటిలానే శర్మగారు మళ్ళీ కోలుకుంటారనే అనుకున్నాం అమ్మ,నేనూ.

పిల్లని స్కూలుకి పంపించే హడావుడిలో ఉండగా నిన్న పొద్దున్నే నాన్న ఫోన్ చేసి ఏంచేస్తున్నావని అడిగారు. ఈ టైంలో ఫోన్ చేయవు కదా, ఏమిటి అని అనుమానంగా అడగగానే చెప్పారు.. ఇప్పుడే ప్రాంతీయ వార్తలు విన్నాను... అని! "వెళ్తావా" అని అడిగాను. "పలకరించే ఆ మనిషే లేనప్పుడు ఎలా వెళ్ళనే?" అన్నారు దిగులుగా. ఈమధ్య ఆరోగ్యం బాగుండటం లేదని వెళ్ళే ప్రయత్నం చెయ్యలేకపోయారు నాన్న. వీక్ డే అవడంతో ఎంత మనసైనా నిన్న ఇంటికి వెళ్ళలేకపోయాను. రోజంతా పది, పదిహేను సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతూనే ఉన్నాను నాన్నని.

నిన్నటి రోజు చాలా అన్యమనస్కంగానే గడిచింది నాక్కూడా. బాగా దగ్గరగా తెలిసినవాళ్ల గురించి రాయాలన్నా మనసు ఒప్పదు. సాయంత్రం ఆల్వాల్ లో కార్యక్రమం జరుగుతుందని నెట్ లో చదివాను. సాయంత్రం వాకింగ్ చేస్తూ మౌనంగా శర్మమావయ్యగారికి మనసులోనే నమస్కరించాను. ఇవాళ మధ్యాహ్నానికి కాస్త అక్షరాలు రాయగలననిపించి మొదలుపెట్టాను. 

బెజవాడ క్వార్టర్స్ లో ఇంట్లో నా గదిని మావయ్యగారు ఉండటానికి ఇచ్చి నాన్న ఆయనతో అవార్డ్ ప్రోగ్రామ్స్ గురించి చేసిన చర్చలు, మా ఇంట్లో భోజనాలు, కూరలు, పెరుగు పచ్చళ్ళు, అగర్బత్తీలు, ఒకటేమిటి...ఎన్ని కబుర్లు గుర్తుకొచ్చాయో... ఎన్ని జ్ఞాపకాలో!! పెళ్లయి వెళ్పోయాకా కూడా తెలుగు భాషపై ఏ సందేహం వచ్చినా వెంటనే నాన్నకు ఫోన్ చేసి మావయ్యగారిని ఫలానా సందేహం గురించి అడగమని ఆర్డరేసేదాన్ని. నాన్న ఆయనను అడిగితే సందేహ నివృత్తి చేసేసి, "తను నన్నే నేరుగా అడగచ్చు. మళ్ళీ మీతో ఎందుకు అడిగించడం" అనేవారుట. ఒకసారి కొన్నాళ్ళు అమ్మావాళ్ల దగ్గర ఉన్నాకా, నన్ను అత్తవారింట్లో దింపడానికి అమ్మ,నాన్న ఇద్దరూ వచ్చారు. మధ్యలో వస్తుంది శర్మగారు అప్పట్లో ఉండే అపార్ట్మెంట్ . ఆయనతో ఏదో పని మీద అక్కడ ఆగి ఇద్దరూ పైకి వెళ్లారు. నా పెళ్ళిలోనే ఆయనను  ఆఖరు కలవడమే. తరువాత బొంబాయి వెళ్పోవడం వల్ల తెలిసినవారెవ్వరినీ కొన్నేళ్లపాటు కలవలేదు నేను. ఆ రోజు కారులో సామాను ఉండడం వల్ల నేను పైకి వెళ్లలేదు. మా పాప కూడా చిన్నది అప్పటికి. అప్పటికే శర్మ గారికి మోకాళ్ల నెప్పులకు వైద్యం జరుగుతోంది. వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నారని చెప్పారు. గేట్ వైపు అమ్మావాళ్ల కోసం చూస్తూంటే, లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్ మెట్లు దిగి ఆయన క్రిందకి వచ్చేసారు. చాలారోజులైంది చూద్దామని వచ్చానన్నారు. అయ్యో.. నా కోసం మెట్లు దిగి వచ్చారా అని నొచ్చుకుంటూ గబుక్కున పాపతో క్రిందకి దిగాను. మా మనవరాలు కూడా అచ్చం ఇలానే ఉంటుంది అన్నారు మా అమ్మాయిని చూసి. వాళ్ళిద్దరిదీ ఒకటే వయసు. నెలలు తేడా. చిన్నప్పటి నుండీ ఎరిగినవాళ్లంటే అభిమానాలు అలా ఉంటాయి. నిన్న పాండురంగారావు మావయ్యగారిని తీసుకుని రాధిక వచ్చిందని తెలియగానే తనకి మెసేజ్ పెట్టాను. తనూ అదే రాసింది "ఎంత కలిసి ఉండేవాళ్లమో అందరమూ..ఆ రోజులే వేరు.." అని. అప్పటి అప్యాయతలు, అభిమానాలే వేరు. ఇప్పుడన్నీ కాగితం పూలకు మల్లే నాజూకైన స్నేహాలేగా! 

నాన్నకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మావయ్యగారూ, జానకీ బాల గారూ ఇద్దరూ వచ్చారు చూడడానికి. అప్పుడు కూడా ఆయన మోకాళ్ల నెప్పులతో బాగా ఇబ్బంది పడుతూ వాకింగ్ స్టిక్ వాడుతున్నారు. నాన్నావాళ్ల లిఫ్ట్ రిపేర్ లో ఉందప్పుడు. ఆయన ఎంతో అవస్త పడుతూ మూడంతస్తులు మెట్లు ఎక్కి వచ్చారు. అయ్యో, ఎంత ఇబ్బంది పడ్డారో అని ఎంతో బాధ పడ్డాము అందరమూ. ఎలాగైనా రామంగారిని చూడాలని పట్టుబట్టి వచ్చారని జానకీ బాల గారు అన్నారు. శర్మగారిని తలుచుకోవడం మొదలుపెడితే ఎన్నో కబుర్లు... ఎన్నని రాయను? ఒకసారి నాన్న మావయ్యగారిని కలవడానికి వెళ్తూంటే నేను రెగులర్ గా బ్లాగింగ్ చేసిన సమయంలో కౌముది వెబ్ పత్రికకు రాసిన "నవలా నాయకులు" సిరీస్ ను ప్రింట్ తీసి ఇచ్చి పంపించాను. మావయ్యగారికి, శారదత్తకీ ఇద్దరికే ఇచ్చాను అలా ప్రింట్ తీసి. నా దగ్గర కూడా లేదు కాపీ. మావయ్యగారు అది చదివాకా ఏమంటారో తెలుసుకోవాలని. ఆయన అభిప్రాయం ఎంతో అపురూపం నాకు. ఒక్క నాలుగు వాక్యాలు రాసి ఇవ్వమని దాచుకుంటానని నాన్నని అడగమన్నాను. ఆయన అలాగే తప్పకుండా అన్నారుట. వారం రోజుల్లో నాన్న అడ్రస్ కి కొరియర్లో ఒక కవర్ వచ్చింది. నాలుగు వాక్యాలు అడిగితే రెండూ పేజీల కానుకని అందించారు మావయ్యగారు. ఆయన స్వదస్తూరీతో ఉన్న ఆ కాగితాలని ఎంతో భద్రంగా దాచుకున్నాను. పెద్ద అవార్డ్ తో సమానం నాకు ఆయన మాటలు.






ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ, నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు శర్మగారింటికి వెళ్తూంటే నేను కూడా వెళ్ళాను. చాలా అనారోగ్యం చేసి కోలుకున్నారప్పుడు. కులాసాగా ఉన్నారు. చాలాసేపు కబుర్లు చెప్పారు. అలా అనర్గళంగా మాట్లాడడం ఆయనకు విసుగు లేని పని. అప్పుడు, నవలా నాయకులు గుర్తుచేసుకుని "బావుంది. చక్కగా రాశావు. ఏమిటి ఇంకా ఏమేమి రాశావు?" అని నన్నడిగారు. లేదండీ, ఇప్పుడు ఏమీ రాయట్లేదు అన్నాను. ఎందుకని అడిగితే, ఎవరు చదువుతారులే అనే నిర్లిప్తత వల్ల రాయట్లేదండీ అన్నాను. ఆప్పుడాయన "అది చాలా తప్పు. అలా ఎప్పుడూ అనుకోకూడదు. మన వే ఆఫ్ థింకింగ్ తో కలిసేవాళ్ళు, ఫలానావాళ్ళు రాస్తే చదవాలి అని ఎదురుచూసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. మనకు వాళ్ళు ప్రత్యక్ష్యంగా తెలియకపోవచ్చు. కానీ మనం రాసేది చదవడానికి ఎదురుచూసేవాళ్ళు, చదివేవాళ్ళు తప్పకుండా ఉంటారు. అంచేత, రాయటం ఎప్పుడూ మానద్దు. రాస్తూ ఉండు" అని చెప్పారు. ఆశీర్వచనంలాంటి ఆ మాటలు శ్రీకృష్ణుడి గీతాబోధలా నా మీద పనిచేసాయి. పుస్తకాలు చదవడం కూడా మానేసిన నేను మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను.

ఒక నిండు జీవితాన్ని చూసిన వ్యక్తి. తాను రాసిన సమగ్ర సాహిత్యాన్ని అచ్చువేయించుకున్నారు. ఆత్మకథ రాసుకున్నారు. పిల్లల ఎదుగుదలను చూశారు. తృప్తికరమైన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. నిజానికి ఆయన మరణానికి దు:ఖించకూడదు. కానీ అభిమానం అనేది కన్నీళ్ళని ఆగనీయదు. సత్యాన్ని చూడనివ్వదు. తెలుగు సాహిత్యానికి తన వంతు సేవని అందించిన ఆ మహానుభావుడికి నమస్సుమాంజలి.



----------------------------------------------

(ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాత్రమే ఆ photoలను ఇక్కడ పెట్టాను తప్ప గొప్పలు చెప్పుకోవడం కోసం అయితే ఆయన పంపిన వెంటనే పెట్టుకుని ఉందును. పలు సందర్భాల్లో మావయ్యగారితో తీసుకున్న ఫోటోలేవీ కూడా ఇక్కడ షేర్ చెయ్యట్లేదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే తత్వమే ఉండుంటే చాలా సందర్భాల్లో ఎందరో పెద్దలతో ఉన్న ఫోటోలను ’పక్కన్నేను, పక్కన్నేను ’ అని ఎప్పుడో చాటింపుగా బ్లాగులో ప్రచురించుకుని ఉండేదాన్ని. సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ కొన్ని విషయాలు చెప్తే కాని అర్థం కానివాళ్ళు కూడా ఉంటూంటారని ఇలా రాయడం! )

Sunday, May 19, 2019

తెలుగు సినీప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే రాళ్లపల్లి !


రాళ్లపల్లి అనగానే -
"దర్శకరత్న దాసరి నారాయణరావ్ పక్కన్నేను
నటశేఖర కృష్ణ పక్కన్నేను
నూతన్ పెసాదు పక్కన్నేను
జయప్రద పక్కన్నేను
శరత్ బాబు పక్కన్నేను
రాళ్లపల్లి పక్కన్నేను" అనే డైలాగ్ ఠక్కున గుర్తుకొస్తుంది.
లేడీస్ టైలర్ సినిమాలో 'అడ్డతీగల హనుమంతు' అనే కోయదొర వేషం చిన్నదే అయినా, కథానాయకుడు రాజేంద్రప్రసాద్ కు జోస్యం చెప్పి, అప్పటి నుంచీ మొదలయ్యే మొత్తం కథంతటికీ మూలకారణమవుతాడు. 




కొన్ని దశాబ్దాల పాటు వెండితెరపై రకరకాల పాత్రలను అవలీలగా పోషించి, ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న కళాకారుడు రాళ్ళపల్లి. రాళ్లపల్లి వెంకట నరసింహారావు ది ఒక పెక్యూలియర్ వాయిస్. అదే ఆయన ప్లస్ పాయింట్. పేరు పెద్దగా ఉందని ఒక దర్శకుడు రాళ్లపల్లి అని వేయించారుట టైటిల్స్ లో. అలా ఇంటిపేరుతోనే ప్రసిధ్ధులైపోయారు ఆయన. ఎనిమిదివందలకు పైగా సినిమాల్లో నటించిన రాళ్లపల్లి సినీపాత్రల వైవిధ్యాల గురించి చెప్పడం నాలాంటి సాధారణ మానవులకు సాధ్యం కాని పని. కానీ ఒక ఇష్టమైన కళాకారుడి గురించి, నాకు గుర్తున్నంత వరకూ, నేను చూసిన చిత్రాలలో ఆయన నటించిన కొన్ని పాత్రలను ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నాను. 

ఒక నటుడు తన అసలు పేరుతో కాక పోషించిన పాత్రల పేరుతో గుర్తుండిపోయినప్పుడు అసలైన కళాకారుడిగా గుర్తింపబడతాడు. అటువంటి విలక్షణ నటుడు రాళ్లపల్లి. లేడీస్ టైలర్ లో కోయదొర తర్వాత నాకు గుర్తుకొచ్చేది "రెండు రెళ్ళు ఆరు"లో తికమక. ఈ సినిమాలో ఒకే వాక్యాన్ని ఐదారు రకాల భాషల్లోకీ తర్జుమా చేసి చెప్పే చిత్రమైన పాత్రను రాళ్లపల్లికి ఇచ్చారు జంధ్యాల.  పేరు "తికమక". అర్థం ఏమిటని అడిగితే - "అన్నిభాషల్లోనూ!" అంటాడు. "తెలుగు కి ’తి ’, కన్నడానికి ’క ’, మరాఠీ కి ’మ ’, కొంకిణీ కి ’క ’ కలిపి అలా పెట్టుకున్నాను. మిలిటరీలో వంటవాడు గా పనిచేసినప్పుడు అన్ని భాషలూ మాట్లాడే సైనికులతో మాట్లాడడానికి దాదాపు పధ్నాలుగు భారతీయ భాషలు నేర్చుకున్నాను" అని చెప్తాడు. 



ఆ తర్వాత "శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్" సిన్మాలో సిలోన్ సుబ్బారావు బావ!! ఆ సినిమా చూసినప్పుడల్లా, పట్టు పద్మిని పాత్ర "మా సిలోన్ సుబ్బారావు బావ.." అని అన్నప్పుడల్లా ఘొల్లున నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు అందరూ "టేకిట్ ఈజీ.." అని చెప్తూంటారు కానీ అలాంటి ఈజీ పాత్రని ఎప్పుడో సృష్టించారు వంశీ. ఎవరెంత వేళాకోళంగా మాట్లాడినా ఏ మాత్రం తొణక్కుండా, తడుముకోకుండా, ఎంతో అవలీలగా, ఏదో ఒక జవాబు ఠక్కున చెప్పేసే ఆ పాత్ర చాలా రోజులు గుర్తుండిపోయింది. 



బాపూ తీసిన "మంత్రిగారి వియ్యంకుడు" లో అల్లూ రామలింగయ్య అల్లుడుగా రాళ్లపల్లి చేసిన "సిర్కిల్ ఇన్స్పెక్టర్" పాత్ర భలే ఉంటుంది. పేరుతో కాకుండా ఎప్పుడూ "ఏమయ్యా సర్కిలూ" అంటూంటాడు అల్లూ రామలింగయ్య. బాపూ తీసిన మరో చిత్రం ’రాధా కల్యాణం ’లో "ఏమ్మొగుడో...ఏమ్మొగుడో " అనే గమ్మత్తైన పాట ఉంది. నిందాస్తుతి పధ్ధతిలో తాగుబోతు మొగుడుని ముద్దుగా తిడుతూ ఓ భార్య పాడే పాట. అందులో ఆ తాగుబోతు వేషం రాళ్ళపల్లిది. చిన్న వేషం అయినా, చిన్నప్పుడెప్పుడో చూసిన సినిమా అయినా, చాలా ఏళ్లవరకూ ఆ పాట గుర్తుండిపోవడానికి కారణం రాళ్లపల్లి అంటే అతిశయోక్తి కాదు. 

నిన్న పేపర్లో రాళ్లపల్లి గురించిన వార్త చదివాక గుర్తుకొచ్చిన మరికొన్ని సినిమాలు - పాత్రలు - "సితార"( పాత్ర పేరు గుర్తులేదు), "అన్వేషణ"లో సత్యనారాయణ డ్రైవర్ పాండు పాత్ర, "ఏప్రిల్ ఒకటి విడుదల" లో శర్మ గారు, "శుభలేఖ"లో "గుర్నాధం"! ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మరిన్ని సినిమాల్లో ఇంకా మంచి పాత్రలు రాళ్లపల్లి పోషించే ఉంటారు కానీ చిన్నప్పుడు మాకు విశ్వనాథ్, జంధ్యాల, బాపూ, వంశీ ఈ నలుగురు  దర్శకుల సినిమాలే ఎక్కువగా చూపెట్టేవారు. అందువల్ల నాకు ఈ పాత్రలు మాత్రమే బాగా గుర్తుండిపోయాయి. 

మాకు కేబుల్ కనక్షన్ లేదు కాబట్టి ఎప్పుడు ప్రసారమయ్యేదో తెలీదు కానీ ఆమధ్యన యూట్యూబ్ లో ఎక్కడో "బాబాయ్ హోటల్" అనే ఒక టివీ షో చూశాను. ఏదో వంటల కార్యక్రమం. ఇంత పెద్ద వయసులో ఇది కూడా హోస్ట్ చేస్తున్నారా. చాల గ్రేట్ అనుకున్నాను. 


టివీ చూడకపోవడం చాలా అదృష్టకరమైన విషయం అని ఇలాంటి వార్తలు పేపర్లో చదివినప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎంతో బాగా హెల్తీగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తుల్ని, చివరి దశల్లో బలహీనంగా, అనారోగ్యంతో ఉన్న క్లిప్పింగ్స్ నీ, చనిపోయిన వీడియోలను చూడలేము. నేనైతే ఇప్పటికీ పేపర్ లో వచ్చిన ఇలాంటి వార్తలను కూడా రెండోసారి చూడడానికి మనసొప్పక పాత పేపర్ల వెనుక దాచేస్తూంటాను. రాళ్లపల్లిపై ఉన్న అభిమానం కొద్దీ ఈ నాలుగు వాక్యాలనూ ఆయనకు నా నివాళిగా రాయాలనిపించి రాయడం. ఒక అనుభవజ్ఞుడైన నటుడిని గుర్తుచేసుకోవడం. అంతే!

కొద్దిగా గూగులిస్తే రాళ్లపల్లి నటించిన కొన్ని సినిమా సీన్ల లింక్స్ రెండు దొరికాయి. క్రింద ఇస్తున్నాను -











Monday, May 6, 2019

మహాత్మునికీ గాంధీకీ మధ్య

                            
                             


భారతదేశం యావత్తూ మహాత్మునిగా కొనియాడిన బోసినవ్వుల బాపూకి భార్యా, పిల్లలు ఉంటారని, దేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించి నిర్దేశించడం మాత్రమే కాక బాపూజీకి వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందనే ఆలోచన చిన్నతనంలో ఉండేది కాదు. "గాంధీ" చిత్రం ద్వారా మాత్రం వారి వ్యక్తిగత జీవితం గురించి, కస్తూరి బా గురించీ కొన్ని వివరాలు తెలిసాయి. అయితే వారి పిల్లల గురించిన వివరాలు మరెక్కడా చదివిన గుర్తు లేదు. కాలేజీ రోజుల్లో ఒక ఆంగ్ల పత్రికలో వారి మొదటి కుమారుడి గురించి ఆర్టికల్ చదివి, భద్రపరిచిన గుర్తు. అప్పటి నుండీ హరిలాల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. కొన్నేళ్ళ క్రితం నటుడు అక్షయ్ ఖన్నాతో అనిల్ కపూర్ "గాంధీ, మై ఫాదర్" అనే చిత్రం నిర్మించారు. ఒక నవల ఆధారంగా చిత్రాన్ని తీసారని అన్నారు. ఆ నవల నాకు దొరకలేదు కానీ ఇన్నేళ్ళ తెరువాత ప్రముఖ గుజరాతీ రచయిత దినకర్ జోషీ నవల(ప్రకాశవో పరభావో)కు కూచి కామేశ్వరి గారి అనువాదం నాకు లభించింది.  అదే "మహాత్మునికీ గాంధీకీ మధ్య"! బాపూని ఒక సాధారణ తండ్రిలా మనకు చూపెట్టే కథ ఇది. గాంధీ మహాత్ముని పెద్ద కుమారుడైన హరీలాల్ జీవిత కథ. ఒక వ్యధాభరితమైన యదార్థ గాధ. 

ఈ నవల ద్వారా నాకొక మంచి రచయిత పరిచయమయ్యారు. దినకర్ జోషీ గారి వంటి డేడికేటెడ్ రైటర్ గురించి ఇప్పటికైనా నేను తెలుసుకోవడం చాలా ఆనందకరమైన సంగతి. కథా సంకలనాలు, నవలలూ, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు అన్నీ కలిపి ఇప్పటివరకూ జోషీ గారివి 152 పుస్తకాల ప్రచురించబడ్డాయి. ఎనభై వసంతాలు దాటిన వయసులో కూడా సాహిత్యాభివృధ్ధికి ఆయన ఇంకా చేస్తున్న సేవ అపారమైనది. గుజరాతీ రచనలను ఎక్కువమందికి చేరవేయాలనే సదుద్దేశంతో ఆయన "గుజరాతీ సాహిత్య ప్రదాన్ ప్రతిష్ఠాన్ " అనే సంస్థను మొదలుపెట్టారుట. “We talk about Shakespeare, Tennyson…and Dostoevsky, but we don’t read books of our own languages. We lose out on a lot. It doesn’t make sense..” అంటారాయన. ప్రాంతీయ భాషా సాహిత్యానికి ఎంత ప్రాధ్యాన్యత ఉందో, మన సాహిత్యానికి మనం ఎంత విలువ ఇవ్వాలో తెలియచెప్తూ ఆయన అన్న ఈ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. ఎవరి భాషను వారు నిలబెట్టుకోవడానికి సాహిత్యకారులు, రచయితలు ఎంతటి కృషి చేయ్యవలసి ఉందో ఈ మాటలు చెప్తాయి.

"మహాత్మునికీ గాంధీకీ మధ్య" నవలలో ఏ ఒకరి పక్షాన్నీ వహించకుండా బాపూకీ, వారి కుమారుడికీ మధ్యన నిలబడి, ఇధ్దరి దృష్టికోణాల్లోంచీ వారి వారి జీవితాలను మనకు చూపెట్టి; తుది నిర్ణయాన్ని పాఠకులకే వదిలేయడం రచయిత సామర్ధ్యానికి నిదర్శనం. నాకు మాత్రం వారు బాపూ వైపుకి సమానమైన న్యాయం చూపెట్టడానికి ఎక్కువ కష్టపడ్డారేమో అనే అనిపించింది. వ్యక్తిగతంగా గాంధీజీ పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ హరిలాల్ జీవితగాధ చదువుతున్నంత సేపూ హరిలాల్ పై అవ్యాజమైన కరుణ కలుగుతుంది. జాతిని నడిపించిన మహాత్ముడి కుమారుడికా ఈ దురవస్థ? అయ్యో బిడ్డా.. ఎన్ని ఇక్కట్లపాలయ్యావయ్యా అని మనసు దు:ఖపడుతుంది. అతడి బలహీనతలపై జాలి కలుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా అతడు చూపే వివేకం, వాటిని అతడు ఎదుర్కున్న నేర్పూ, సామర్ధ్యాలను చూసి ఆశ్చర్యం వేస్తుంది. చదువుతునంత సేపూ దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు గాంధీ గారు అని సరిపెట్టుకోలేకపోయాను. కాస్తంత ఆధారం, రవ్వంత ప్రేమ, కొద్దిపాటి మార్గదర్శకత్వం దొరికి ఉండుంటే అతడి జీవితం ఏ ఉన్నత శిఖరాల వైపుకు పయనించి ఉండేదో అన్న ఆలోచన రాకమానదు.  ఏదేమైనా గాంధీజీ ఒక చోట అన్నట్టు కర్మ ఫలాన్ని మార్చడం ఎవరి తరం?! ఆ తల్లికి ఆ ఆక్రోశం, ఆ తండ్రికా అవమానం, ఆ బిడ్డకా పతనం రాసిపెట్టి ఉన్నాయి..!!

హరిలాల్ మరణవార్తతో, కేవలం వేళ్ళపై మాత్రమే లెఖ్ఖపెటగలిగిన సభ్యుల సమక్షంలో జరిగిన అతని అంత్యక్రియ ఘట్టంతో మొదలౌతుంది హరిలాల్ జీవితగాథ. ఉత్సాహవంతుడైన యువకుడిగా గాంధీ బాటలో సత్యాగ్రహంలో, పలు స్వాతంత్ర్యౌద్యమాల్లో పాల్గొన్న ఎంతో తెలివైన వ్యక్తిగా, ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించే ప్రాసంగికుడిగా పాఠకులకు పరిచయమైన హరిలాల్ జీవనపయనం పాఠకుల ఉత్సాహాన్నీ, ఆశ్చర్యాన్నీ చివరిదాకా ఆపకుండా నడిపిస్తుంది. అతడి వ్యక్తిత్వ పతనం ఎలా మొదలైంది, ఎటువంటి దీనావస్థలో చివరికి ఒంటరిగా మిగిలాడు అన్న సంగతులు పాఠకుడి కళ్ళని చెమ్మగిల్లకుండా ఆపలేవు. ఆ పతనానికీ, జరిగిన విషయాలన్నింటికీ మూలకారణంగా స్వకర్మనో, తల్లిదండ్రులనో కాక విధిని నిలబెట్టడం అనేది జోషీ గారి విఙ్ఞతకు నిదర్శనం.

పుస్తకం పూర్తయిన తర్వాత అంతర్జాలంలో హరిలాల్ గురించిన మరిన్ని వివరాల కోసం వెతుకుతూంటే ఎన్నో ఆశ్చర్యకరమైన వివరాలు దొరికాయి. పలు వార్తాపత్రికల్లో అచ్చయిన గాంధీగారి స్వదస్తూరీ తాలూకూ ఉత్తరాలూ.. కొన్ని సంగతులు.. వాటిని సొమ్ము చేసుకోవడానికి వాటి హక్కుదారులు చూపిన ఉత్సుకత.. వగైరా వగైరా! వాటి వల్ల అర్ధమైంది ఏమిటంటే, హరిలాల్ జీవితంలోని కొన్ని సత్యాలని విపులీకరించకుండా రచయిత ఎంతో శ్రధ్ధతో ఈ కథని తీర్చిదిద్దారని, తద్వారా గాంధీమహాత్మునికి, హరిలాల్ కి కూడా ఎంతో గౌరవాన్ని మిగిల్చినవారయ్యారని!! శ్రీ దినకర్ జోషీ పట్ల మరింత గౌరవం పెరిగింది. ఈ కథ అనే కాదు కానీ కొన్ని చారిత్రక విశేషాలను, మనుషులను గురించి చదివిన ప్రతిసారీ నన్నో ప్రశ్న వేధిస్తూ ఉంటుంది - గతించిన చరిత్ర తెలిసినవాళ్ళ కన్నా తెలియనివాళ్ళే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, ఎవరిదైనా గాథ రాసేప్పుడు వారి చరిత్రల్లోని లోటుపాట్లని, చీకటి కోణాలను యదార్థం పేరుతో తెలియనివాళ్ళకు తెలియచెప్పి ఆ మనుషులకు అప్పటిదాకా ఉన్న గౌరవాన్ని తుడిచిపెట్టేయడం అనేది ఎంతవరకూ సమంజసం? అని! ఇప్పుడా గతించిన చీకటిని తవ్వుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది? సమాజం, మానవాళి మరింతగా ఎదగటానికి మాత్రమే చరిత్ర ఉపయోగపడాలి. అంతే తప్ప ఎవరికీ ఏమాత్రం ఉపయోగకరం కాని గత కాలపు అభ్యంతకరమైన విశేషాలనూ, వివరాలనూ కెలికి, వెలికితీయడమనేది గతించిన వారిని అవమానించడమే కాక వ్యర్థ ప్రయాస అన్నది నా స్వాభిప్రాయం. 

ఈ నవల గురించి మరి కొన్ని వాక్యాలు రాస్తే పుస్తకాభిమానులతో ఈ పుస్తకం చదివించాలన్న నా ఉద్దేశం చప్పబడిపోతుందన్న అభిప్రాయంతో వ్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. ఈ నవల ద్వారా గాంధీగారి గురించి, కస్తూరి బా గురించీ, వారి ఇతర కుటుంబ సభ్యుల గురించీ, మనుషుల్లోని భిన్న స్వభావాల గురించీ ఎన్నో తెలియని విషయాలను తెలియపరిచిన శ్రీ దినకర్ జోషీ అభినందనీయులు.


Sunday, April 28, 2019

Music Teacher





యాదృచ్ఛికంగా మొన్నొక రోజు ఈ సినిమా చూడడం జరిగింది. పచ్చని కొండలు, లోయలు, వాటి మధ్య సన్నని రోడ్డు, నీలాకాశం, మబ్బులు, మంచు... ఈ దృశ్యాల మీద ఒక అందమైన ఫాంట్ లో వస్తున్న టైటిల్స్, and as a cherry on top - backgroundలో ఒక వీనులవిందైన అర్థవంతమైన పాట!! వీటి మించి ఏం కారణం కావాలి స్క్రీన్ కి అతుక్కుపోవడానికి :) 





కథ, పాత్రలు పక్కన పెడితే మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చినది ఆ కొండలు, మంచు వాతావరణం, drizzling, ఆకుల చివర్ల నుంచి జారుతున్న నీటి బిందువులు, స్క్రీనంతా పరుచుకున్న పచ్చదనం! ఆహ్లాదకరమైన అటువంటి వాతావరణం ఏ కథనైనా బోర్ కొట్టించదు. రెండు ప్రఖ్యాత పాత హిందీ పాటల్ని రీమేక్ చేసారు. మధ్య మధ్య టీ కొట్లో తగిలించిన రేడియో లోంచి పాత పాటలు వస్తూ ఉంటాయి. స్క్రీన్ పై కనబడుతున్న ఆ రాతి గోడ మీద కూచుని టీ తాగుతూ, వాన తుంపరలని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోతే ఎంత బావుంటుందో , ఆ ప్రాంతంలో నివశించే ప్రజల ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. సిమ్లా అందాలను అంతగా కళ్ళకి కట్టాడు సినిమాటోగ్రాఫర్ కౌశిక్ మొండాల్. కథ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న నాన్ లీనియర్ టెక్నిక్ ప్రేక్షకులలో ఉత్సుకతని చివరిదాకా నిలిపి ఉంచుతుంది. గౌరవ్ శర్మ అందించిన డైలాగ్స్ బాగా గుర్తుండిపోతా
యి.

కథలోకి వస్తే ఒక ఇంట్లో ఒక తల్లి, కొడుకు, కూతురు ఉంటారు. (చిన్నప్పటి నుంచి బుల్లితెరపైనా, వెండితెరపై కూడా పలురకాల పాత్రల్లో చూసిన నీనా గుప్తా వయసెంతైనా తల్లి పాత్రలో నేనస్సలు ఊహించలేను. కానీ తప్పలేదు.) కొడుకు సంగీతం మాష్టారు. సింగర్ అవ్వాలనే కలతో బొంబాయి వెళ్ళి విఫలయత్నాల తరువాత తండ్రి మరణంతో తిరిగి ఇల్లు చేరతాడు. సంగీతం పాఠాలు చెప్పుకుంటూ, చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుకుంటూ జీవనం గడుపుతుంటాడు. నెరవేరని కలని, బాలీవుడ్ లో పెద్ద గాయకురాలుగా మారిన ఒకప్పటి తన శిష్యురాలిని తలుచుకుంటూ, వీలైనప్పుడల్లా సిగరెట్లు కాలుస్తూ, మౌనంగా విలపిస్తూ కొండల్లో, లోయల్లో తిరుగుతుంటాడు. ఇంతలో ఆ గాయక శిష్యురాలు కాసర్ట్ ఇవ్వడానికి వారి ఊరికి వస్తోందని తెలిసి అందరూ అతడిని పలకరిస్తూ ఉంటారు. ఆమెను కలవకుండా ఉండాలనే ఉద్దేశంతో అదే రోజు తన చెల్లెలి పెళ్ళి ఫిక్స్ చేస్తాడు సంగీతం మాష్టారు. ఎనిమిదేళ్ళుగా ఎటువంటి కమ్యూనికేషన్ లేని ఆ శిష్యురాలి గురించి కొన్ని డైలాగులు విన్నాకా అసలు కథ ఏంటా అని ఆసక్తి ఎక్కువౌతుంది. 









ఇక హీరోయిన్ అమృతా బాగ్చీ చాలా బావుంది. ఆమె పళ్ళు మాత్రం కాస్త పెద్దగా ఉన్నాయి కానీ చూడముచ్చటైన మొహం. పెద్ద పెద్ద కళ్ళు, గుబురు జుట్టు ఆమెను చాలా ఇష్టపడేలా చేస్తాయి. అసలా కళ్ళు...they speak volumes! అలాంటి స్వచ్ఛమైన పెద్ద పెద్ద కళ్ళ ను చూస్తూ ఒక జీవితం గడిపేయచ్చు. బాపూ ఉండి ఉంటే తప్పకుండా తన తదుపరి చిత్రంలో ఆమెనే తీసుకునేవారు. చివరి పది, పదిహేను నిమిషాల్లో మాష్టారికీ, శిష్యురాలికీ మధ్య జరిగిన సంభాషణ మనసుకు హత్తుకుంటుంది. రెండు మూగమనసుల  బాధ అది. we feel that pain. ఆ సన్నివేశంలోని ప్రతి డైలాగ్ గుర్తుండిపోతుంది. "ఎనిమిదేళ్ల పాటు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నా ఉత్తరాలకి జవాబు రాయలేదు" అని బేనీ ప్రశ్నించినప్పుడు, ఒక గాయపడిన ఎక్స్ప్రెషన్ తో "ఆప్ తో జాన్తే హై... గుస్సా కిత్నీ ఖతర్నాక్ చీజ్ హై" అంటుంది జ్యోత్స్న.  కళ్లల్లో నీళ్ళతో "తుమ్హారా ఇంతజార్ కిత్నా సుందర్ హై.." అని అతడంటే, మీకు తెలుసా.. కేవలం మిమ్మల్ని చూడడానికే ఈ ఊళ్ళో కాన్సర్ట్ కి ఒప్పుకున్నానంటుంది.  "ఆప్ కో పతా హై క్యా హువా? ఆప్కీ వో భోలీ సీ, మాసూమ్ సీ జునాయ్ థీ.. వో మర్ గయీ.." అంటుంది. మనసు చచ్చిపోయాకా ఏ బంధాలు మిగులుతాయని?!




ఒక కీలకమైన పాత్ర పోషించిన దివ్యా దత్తా గురించి తప్పక చెప్పుకోవాలి. చిత్ర కథకు ఏ మాత్రం అవసరం లేని ఆమెకూ, సంగీతం మాష్టారికీ మధ్య జరిగే కథ నాకు అస్సలు నచ్చలేదు. కేవలం స్నేహం చూపెట్టి, వారిదొక అందమైన అనుబంధంలా ఉంచేయచ్చు కదా! బేనీ పాత్రని మరింత బలహీనపరచడానికి గీత కథని వాడుకున్నాడేమో దర్శకుడు అని మాత్రం నాకు అనిపించింది. కావాలసింది దొరకలేదని ఏడుస్తూ కూర్చోకుండా ఆమెకు కమిట్మెంట్ ఇచ్చి ఉంటే కనీసం గీతకు ఆసరా ఇచ్చాడని అతడిపై గౌరవం అన్నా ఉండేది. ఏదీ చెయ్యకుండా కేవలం ఒక అవకాశవాదిగా మాత్రం బేనీ ఉండిపోతాడు. కానీ గీత పాత్ర నాకు చాలా నచ్చింది. ఆమె చేసినది తప్పే అయినా కూడా ముసలి మామగారిని చూసుకుంటూ ఆమె గడిపే ఒంటరి జీవితం, చివర్లో ఆయనకు అంతిమ సంస్కారం కూడా తానే చెయ్యడం, బేనీ జీవితంలో తనకు స్థానం ఉండదని అర్థమయ్యాకా మౌనంగా అక్కడి నుంచి వెళ్పోవడం.. గొప్ప సంస్కారానికి నిదర్శనం. దివ్యా వాయిస్, ఆమె చెప్పే స్లో డైలాగ్స్ లో ఎంతో బరువు, విలువ ఉన్నాయి.  వాటిల్లో కొన్ని..

* " అకేలీ తో హమేషా హీ థీ.. బస్ అబ్ ఖాలీ హో గయీ."

* "రిష్తే జబర్దస్తీ జోడే జా సక్తే హై..లేకిన్ దిల్ నహీ"

* "జిందగీ మే జబ్ వహీ ఖ్వాయిష్ రెహ్ జాయె నా...తో ఇంతెజార్ కర్నా ఔర్ భీ ముష్కిల్ హో జాతా హై"

* "ఏ జో పహాడ్ హైనా, యహా జిత్నా మర్జీ రో లో.. జిత్నా మర్జీ చిల్లాలో, ఆవాజ్ జాకర్ హమ్ తక్ హీ పహుంచ్తీ హై"


చివరిగా, ఇదేమీ అద్భుతమైన సినిమా కాదు. కానీ హిమాచల్ లోయల అందాలు, పాటల్లో సాహిత్యం, మనం మమేకమై అనుభూతి చెందిన కొన్ని క్షణాలు మాత్రం తప్పకుండా మనతో ఉండిపోతాయి. ఈ చిత్రాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చిన దర్శకుడు సార్థక్ దాస్ గుప్తా సార్థక నామధేయుడై మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.





Saturday, April 27, 2019

వేసవిలో వర్షంలా - జర్సీ




"కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం
ఓడద్దు అంటే లేదు యుద్ధం
లేకుంటే కష్టం హాయి వ్యర్థం
ఎవరి కోసం మారదద్దం "

చిత్రాన్ని చూసి వారం అవుతున్నా ఇదే పాట పదే పదే అప్రయత్నంగా హమ్ చేస్తున్నాను.
"ఓటమెరుగని ఆట కనగలరా...." పల్లవితో కృష్ణకాంత్ రచించిన ఈ పాట చాలా బావుంది. వెరీ ఇన్స్పిరేషనల్! కానీ డబ్బింగ్ పాటకి లిరిక్స్ రాసినట్లు పొందిక సరిగ్గా కుదరలేదు. నాలుగుసార్లు వింటే గానీ కొన్ని వాక్యాలు తెలీట్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో అనుకుంటా ఈయన రాసిన ఇంకో పాట "నువ్వంటే నా నువ్వు" పాట కూడా చాలా బావుంటుంది. 




ఈ చిత్రాన్ని గురించి వెంఠనే రాయాలనిపించినా... రాద్దామా వద్దా అనే మీమాంసలో ఉండగానే నిన్న మరో మంచి సినిమా చూడడం జరిగింది. ఇక ముందర మన తెలుగు సినిమా గురించి రాయకుండా ఎలా అని మొదలుపెట్టాను. ఈమధ్యన రెండు, మూడు తెలుగు చిత్రాలు చూశాకా, తెలుగులో మంచి సినిమాలు వచ్చేస్తున్నాయి అని బోలెడు ఆనందం కలిగింది. హీరో గారు కాలు నేల కేసి కొట్టగానే భూకంపాలూ, ఒక్క గుద్దు గుద్దగానే మైలు దూరం వెళ్ళి పడడాలు, గాల్లోకి బళ్ళు ఎగరడాలు.. హీరోలు మారినా అవే దృశ్యాలు ఏళ్ల తరబడి తీసీ, తీసీ వీళ్ళకి విసుగెత్తదా అనిపించేది. కాస్త ట్రెండ్ మారుతోందని ఇన్నాళ్ళకి గట్టిగా అనిపిస్తోంది. నాని టాలెంట్ కి సరిపోయే చిత్రం ఇన్నాళ్లకు వచ్చింది. పాత్రలో నటుడిని కాకుండా పాత్రని చూడగలిగినప్పుడే కదా సత్తా బయటపడేది. జెర్సీ లో "అర్జున్" మాత్రమే కనిపిస్తాడు. ఏవరిదైనా యదార్థ గాథేమో అనిపించే ఈ పాత్రని ప్రేమించకుండా అసలు ఎవ్వరూ ఉండలేరు. అందుకే ఈ వేసవిలో వర్షంలాంటి ’జెర్సీ ’ మనసు దోచేసింది. దర్శకుడి రెండవ ప్రయత్నం కూడా బావుంది. హ్యాట్రిక్ కోసం ఎదురుచూడాల్సిందే!

ఇది ఒక ఆటగాడి కథ అనేకన్నా, ఒక తండ్రీ కొడుకుల కథ అనాలి. తండ్రీ కొడుకుల మధ్య చూపెట్టిన ప్రతి సన్నివేశం అపురూపంగానే ఉంది. జెర్సీ కొనలేకపోయిన తండ్రికి తాను బాధపడడం లేదని కన్విన్స్ చేయడం కోసం పిల్లాడు చెప్పిన మాటలు, అల్మారాలో పోస్టర్ మార్చినప్పుడు చెప్పే మాటలు,  
"ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయనిది నా కొడుకొక్కడే. వాడికి మా నాన్న ఉద్యోగం చేస్తాడా, డబ్బులు సంపాదిస్తాడా, సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా?ఇదేం సంబంధం లేదు? వాడికి నేను నాన్న !! అంతే." అనే డైలాగ్ విన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఛారిటీ మ్యాచ్ అయ్యాకా కొడుకు చేతులెత్తి అప్లాస్ చెప్తూంటే అర్జున్ మొహంలో కనబడ్డ ఆనందం వర్ణనాతీతం!

ఇంకా - 
"మా ఇంట్లో ఒకళ్ల మీద ఒకళ్ళం అరుచుకోవడం ఉండదు, నేనే అరుస్తాను. నేనే బాధపడతాను. నేనే ఏడుస్తాను"

"అర్జున్ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు.. సక్సెస్ అవ్వలేకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది" 
ఇలా.. చాలా బావున్న డైలాగ్స్ బోలెడున్నాయి.

అర్జున్ ని "బాబూ.." అని హీరోయిన్ పిలవడం భలే తమాషాగా ఉంది. కొన్ని సీన్స్ కూడా బాగా గుర్తుండిపోతాయి. 
* రైల్వే స్టేషన్ లో అరవడం ఐడియా చాలా బావుంది. ఎప్పుడైనా ప్రయత్నించచ్చు.
* "అమ్మ అడిగితే నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు" అని అర్జున్ కొడుకుని అడిగే సీన్ !
* లేడీ జర్నలిస్ట్ కి ఆమె ప్రేమికుడిని వదలద్దని చెప్పే సీన్.
* "మా నాన్న సంకల్పం ఎంత గొప్పదంటే.." అంటూ చివరలో అర్జున్ కొడుకు చెప్పే స్పీచ్.

ఎనభైల్లో కథ అని చెప్పడమే కాక ప్రతి సీన్ లోనూ సెట్టింగ్స్ కూడా చాలా ఏప్ట్ గా వేశారు. ఒక సీన్ లో గోడ దగ్గర బల్ల మీద పాత కాలంనాటి సింగిల్ స్టీరియో టేప్ రికార్డర్. అతి మామూలు సాదా సీదా ఇల్లు. చివరి సీన్ లో గ్రూప్ ఫోటో కోసం తంటాలు పడడం చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. సెల్ఫీలు తీసుకోవడం ఎలా అనే కోర్సుల్లో చేరుతున్న నేటి తరాలవారికి ఆనాటి మధుర జ్ఞాపకాలు ఎలా అర్థమౌతాయి. ఐదొందలు సంపాదించాలని అర్జున్ పడే పాట్లు డబ్బుకి విలువే తెలియని ఈతరం యువతకి అర్థమౌతుందా? అనిపించింది. కష్టం తెలీకుండా, కాలు కిందపెట్టనివ్వకుండా, అపురూపంగా పెంచేస్తున్నారు పిల్లల్ని చాలామంది. రూపాయి రూపాయికీ వెతుక్కుని, చెమటోడ్చి సంపాదించినవాళ్ళకే రూపాయి విలువ, మనిషి విలువ తెలుస్తాయి. కష్టపడితేనే సుఖం విలువ అర్థమౌతుంది. 

కారణాలు ఏవైనా, పని ఎలాంటిదైనా, ఒక ఇష్టమైన పని చేయడం ఆపేస్తే మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా బాగా చూపెట్టాడు దర్శకుడు! భార్య ఎంత తిడుతున్నా స్పందన లేకపోవడం, ఏ పనినీ ఆసక్తిగా చెయ్యలేకపోవడం, కరెంట్ బిల్లు డబ్బుతో నిర్లక్ష్యంగా పేకాట ఆడడం మొదలైనవి చూసి ఈ పాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నాడీ దర్శకుడు? అని ఆశ్చర్యపోయాను. స్టేడియంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిన కట్టప్పగారితో "ఈ లోకంలో తప్ప బయట బతకలేనని అర్థమైంది సార్" అన్నప్పుడు నాకు అర్థమైంది ఈ పాయింట్ ని స్ట్రెస్ చెయ్యాలని ఆ క్యారెక్టర్ ని అలా చూపించారన్న మాట అని! 

కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి. పుస్తకం అచ్చైన తర్వాతే ఎందుకు జెర్సీ పంపారు? అన్నేళ్లదాకా క్రికెట్ బోర్డ్ వాళ్ళు అర్జున్ కుటుంబాన్ని కాంటాక్ట్ చెయ్యలేదా? ఏ ఆటలో అయినా ఆటగాళ్లకు మెడికల్ టెస్ట్ లు అవీ చేస్తారు కదా.. మరి అర్జున్ కి హార్ట్ ప్రాబ్లం ఉందని ఆ మెడికల్ టెస్ట్స్ లో తెలియలేదా? తెలిస్తే అన్ని మ్యాచ్ లు ఎలా ఆడనిచ్చారు? మొదలైన సందేహాలు! ఆట మానేసాడన్న సంగతి మొదటిసారి విన్న అతడి భార్య, మిగతా సన్నిహితుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉండి ఉండచ్చేమో! 
చివరాఖరి సందేహం ఏమిటంటే - ఈ పాత్రని నాని కాకుండా ఎవరో కొత్త వ్యక్తి, ఇంతే బాగా నటించినా కూడా చిత్రాన్ని ఇలానే ఆదరించేవారా?? అని :)

Friday, April 19, 2019

అల్లం శేషగిరిరావు కథలు




సమకాలీన సామాజిక పరిస్థితులను, జీవితాలనీ ముందు తరాలకు అద్దం పట్టి చూపించే ఉత్తమ సాహితీ ప్రక్రియ కథానిక. తెలుగు కథానిక ఎందరో కథకుల చేతుల్లో ఎన్నో రూపాంతరాలను చేందుతూ వందేళ్ళ మైలు రాయిని కూడా దాటి ఇంకా మున్ముందుకు పయనిస్తోంది. ఇటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కొందరు ఉత్తమ కథకులు తమ కలాల ద్వారా సమాజానికి అందించిన స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ప్రతి తరానికీ పరిచయం చేయాలనే సదుద్దేశంతో సమాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తూ ’అరసం’ గుంటూరుజిల్లా శాఖవారు, ప్రముఖ కథకుల ప్రసిధ్ధ కథానికలను సమర్ధులైన సంపాదకులచే ఎంపిక చేయించి "కథాస్రవంతి"  శీర్షికతో పలు కథాసంపుటాలు ప్రచురించారు. వాటిలో ఒక కథాసంపుటి "అల్లం శేషగిరిరావు కథలు". జనవరి,2015 ప్రచురణ.


విలక్షణమైన శైలితో,అరుదైన కథావస్తువుతో రచనలు చేసిన శేషగిరిరావు గారు 17 కథలు, ఒక రేడియో నాటిక రాసారు. "శబ్దాన్ని అక్షరీకరించడం, నిశ్శబ్దాన్ని దృశ్యీకరించడం" తెలిసిన ఆయన తెలుగు హెమింగ్వే గా ప్రసిధ్ధిగాంచారు. వీరి కథలు ఇంగ్లీషు, మళయాళం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి. ’అరణ్యఘోష ’, ’మంచి ముత్యాలు’ వీరి కథా సంపుటాలు. "బాధతో, భయంతో, బాధ్యతతో" రచించిన శేషగిరిరావుగారి కథలు మనిషికి మనిషి చేసే అన్యాయానికి దర్పణాలు. వీరికి 1981 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, నూతలపాటి గంగాధరం స్మారకసాహిత్య పురస్కారం లభించాయి. 



ఈ సంకలనంలో ప్రిన్స్ హెమింగ్వే, వఅడు, ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్, చీకటి, నరమేథం, శిధిల శిల్పాలు.. మొత్తం ఆరు కథనికలు ఉన్నాయి. అన్నీ కూడా చాలావరకూ వేట కథలే. వేటకథలు అల్లంవారి ప్రత్యేకత.  "ఎడిటర్లూ, స్నేహితులూ అంతా అడవి నేపథ్యంలోనే కథలు రాయమంటే రాస్తూ అలా ముద్రపడిపోయాననీ, ఆ ముద్రను కాపాడుకోవడం కోసం రాత్రిపూట కొండల్లో, చిట్టడవుల్లో తిరుగుతూ నానా యాతనలూ పడుతున్నానని” హాస్య ధోరణిలో రచయిత తనకు తెలిపిన వైనాన్ని పుస్తకం ముందుమాటలో ఏ.ఎన్.జగన్నాధశర్మ గారు తెలిపారు. ఈ కథలన్నీ కూడా సమాజంలోని కొన్ని అట్టడుగు వర్గాల జీవనవిధానాలను, వారి కన్నీళ్ళను, వేదనలనూ కళ్ళకు కట్టినట్టు చూపెడుతూ ఒక రకమైన ఆర్ద్రతతో మనసును కమ్మేస్తాయి. సామాజిక వ్యంగ్యానికి నిదర్శనమనిపించే "నరమేథం" కథలో ఒక నిరుపేద ఢక్కువాడి జీవితం, వాడి ఆకలి, నిస్సహాయపు చావు గుండెల్ని పిండేస్తాయి.  "నరనారాయణుల ధన,మాన ప్రాణాల రక్షణకి సాయుధులైన పోలీసులు తుపాకులతో గుడిని గస్తీ కాస్తున్నారు" అనే వాక్యం వాడిగా తగులుతుంది.



చిత్రోపమమైన "వఅడు" కథలో ప్రతి సన్నివేశం ఒక దృశ్యాన్ని మన:ఫలకంపై నిలబెడుతుంది. అధికారుల కోపాలకి, చికాకులకీ చిరుఉద్యోగస్థులు ఎలా అన్యాయంగా బలౌతూ ఉంటారో తెలిపే కథ ఇది. ప్రధాన పాత్రధారి ’మిలట్రీ మాన్ ’ చిన్నయ్య చాలా కాలం గుర్తుండిపోతాడు. ఇలాంటి చిన్నయ్యలు ఓ పది మంది ఉంటే చాలు సమాజం ఎంతగా బాగుపడగలదో కదా.. అనిపించకమానదు. ఈ కథానిక దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్ లో "దర్పణ్" సిరీస్ లో బాసు ఛటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్ గా ప్రసారమైంది. అంతేకాక రంగస్థల నాటకంగా మలచబడి 2000 లో నంది నాటకోత్సవాలలో వెండి నంది బహుమతిని పొందటమే కాక పలు పరిషత్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనా బహుమతులందుకుని ప్రేక్షకాదరణ పొందింది.



"ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్" కథలో పులి వేట కోసం విశ్వాసపాత్రుడైన తన నౌకరునే ఎరగా వాడుకునే కర్కోటకుడైన కనకరాజు పాత్ర మనుషుల్లో పెరిగిపోతున్న నిర్దయతకు ప్రతికృతి. అటువంటి వంచన మొదటికే మోసాన్ని తెస్తుందన్న సత్యాన్ని చిట్టిబాబు మృతి ద్వారా తెల్పుతారు రచయిత.



ఈ కథాసంపుటిలో ఎక్కువగా ఆకట్టుకుని, చదివిన చాలాకాలం వరకూ పాఠకుల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి". "వంశీకి నచ్చిన కథలు" కథాసంకలనంలోనూ, "కథానేపథ్యం" పుస్తకం లోనూ ఈ కథ చదివిన మీదట మూడోసారి సుపరిచితమైన పాత మిత్రుడిలా పుస్తకంలో పలకరిస్తుందీ కథానిక. తానా ప్రచురణల వారి "కథానేపథ్యం" లో ఈ కథ రాయడం వెనుక గల కథాకమామిషులను ఆసక్తికరంగా చెప్తారు శేషగిరిరావు. ఒక ఏజన్సి ప్రాంతంలో రచయిత పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఆ చిన్న సంఘటన నేపథ్యాన్ని ఈ కల్పిత కథకు జోడించాననీ శేషగిరిరావు చెప్తారు. వేట నేపథ్యంతో సాగే ఈ కథలో ప్రధానపాత్రధారి డిబిరిగాడు. పెంపుడు కొంగ నత్తగొట్టుని చెంకన పెట్టుకు తిరుగుతూ, అరవై దాటి  వయసు ముదురినా ఒడిలిపోని శరీరంతో, అడవి జంతువులా తీక్షణంగానూ, పరిశీలనగానూ ఉన్న చీపికళ్ళతో ఉండే డిబిరిగాడు నక్కలోళ్ళనే సంచార తెగకు చెందినవాడు. ఇటువంటి కొన్ని సంచార తెగల తాలూకూ జీవనవిధానాల గూర్చి కూడా చక్కని సమాచారం కథలో దొరుకుతుంది. రచయిత యొక్క సునిశితమైన పరిశీలనా దృష్టిని ఈ కథలోని ప్రతి వాక్యమూ తెల్పుతుంది. బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపుతుందీ కథ. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు సంచార తెగల జనజీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని దిగ్భ్రాంతి కలుగుతుంది. డిబిరిగాడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు పాఠకుల రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. కథ చదివిన చాలారోజుల వరకూ డిబిరిగాడి ఆకారం కలల్లో, ఆలోచనల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 


Wednesday, April 10, 2019

Old wine in new bottle




మంచి కథలు ఎక్కడ నుంచి పుడతాయి? ఊహల్లోంచి పుట్టే కథలు బావుంటాయి కానీ కొన్నాళ్ళకి మర్చిపోతాము. వాస్తవంలోంచి పుట్టిన కథలు మాత్రం మనసుకి హత్తుకుంటాయి. ఎన్నాళ్ళైనా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మంచి కథలు కావాలంటే మన చుట్టూ వందల కొద్ది దొరుకుతాయి. సమాజాన్నీ, జీవితాలనీ, మనుషులనీ దగ్గరగా గమనిస్తే వందల ఉదాహరణలు దొరుకుతాయి కథలు పుట్టించడానికి. 

ఒక సినిమా కోసం మంచి కథ, మనసుని కదిలించే కథ, గుర్తుండిపోయే కథ కావాలంటే జీవితాల్లో వెతుక్కోవాలి. మన చుట్టూ వెతుక్కోవాలి. అప్పుడా కథలు కలకాలం నిలుస్తాయి. మంచి కథని పాత సినిమాల్లో ఎందుకు వెతుక్కుంటారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. పాత కథల్ని అటు తిప్పీ, ఇటు తిప్పీ, మనుషులనీ, పరిస్థితులనీ మార్చేసి, మసి పూసి మారేడు కాయ చేసేసి ఇది కొత్త కథ, ఉత్తమైన వాస్తవికమైన కథ అని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? పోనీ ఫలానా సినిమా నాకు ఇస్పిరేషన్, ఫలానా కథ నాకు చాలా ఇష్టం, అలాంటి కథ తీయాలనే ప్రయత్నమిది అని కూడా చెప్పరు.

కొన్నేళ్ల క్రితం ఒకానొక మహానుభావుడైన దర్శకుడు తీసిన మరపురాని చిత్రరాజం "సాగరసంగమం"!  కాస్త కథనీ, కొన్ని పాత్రలనీ మార్చేసి అదే కథని మళ్ళీ సినిమాగా తీస్తే అది గొప్ప సినిమా అయిపోతుందా? ఈ కథ తెలియని నేటి తరం ప్రేక్షకులు ఉన్నరేమో కానీ ఆ చిత్రాన్ని మర్చిపోని ప్రేక్షకులు ఇంకా ఉన్నారు.  ఆ చిత్రరాజం గుర్తున్న నాలాంటివాళ్లం ఈ చిత్రాన్ని ఒక గొప్ప చిత్రం అని ఒప్పుకోలేము. గొప్ప కథేమో, మరో గొప్ప చిత్రమేమో అని ఆశపడిపోయి, తీరా సగమన్నా చూడకుండానే ఇది అదే కదా అని గుర్తుకొచ్చేస్తే ఎంత నిరాశగా ఉంటుందో.. !!!! కొత్త ఒరవడిని సృష్టించే సత్తా ఉంది అనుకున్న కొత్త దర్శకులు కూడా ఇలా చేస్తే ఇంకా బాధ వేస్తుంది!!

అవే అవే పాత కథల్ని వెనక్కీ, ముందుకూ తిప్పి లేక రెండు మూడు పాత సినిమాలని కలిపేసి ఒక కొత్త వంట వండడం. ప్రతి కొత్త చిత్రానికీ ముందర మాదో విభిన్నమైన కథ, ఎప్పుడూ కనీ వినీ ఎరుగని గొప్ప కథ అని ప్రచారం చేస్తారు. తీరా చూస్తే ఎనభై శాతం కథలు ఏదో పాత చింతకాయ పచ్చడికో , మాగాయ పచ్చడికో కొత్త పోపు. అంతే. ఎందుకిలా? అసలు కొత్త కథలు ఎందుకు పుట్టవు? ఒక్క క్షణం ఆగి పరికిస్తే మన చుట్టూ ఎన్నో కథలు కనిపిస్తాయి! సమాజంలో ఎన్నో సమస్యలు. ఎన్నో ప్రేరణాత్మకమైన ఉదంతాలు. 

సినిమా సరదాగా ఉండాలి. ఆటవిడుపుగా ఉండాలి. నిజమే. కానీ అది ఒక పవర్ఫుల్ మీడియా. దానిని కేవలం ఒక వినోదాత్మకమైన మాధ్యమం గా మాత్రమే కాకుండా దానిని ఒక సందేశాత్మక మాధ్యమం లాగ ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో, పాత తరం దర్శకులలా చిత్రాలు తయారుచేస్తే చాలా బావుంటుంది. భావితరాలు బాగుపడతాయి.