పైన పద్యంలో చెప్పినట్లుగా ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో ద్రవించింది మనసు నిన్న. నా ప్రియమైన స్నేహితులందరినీ కలిసిన తరువాత. అచ్చంగా పాతికేళ్ళ తరువాత ఐదేళ్ళపాటు కలిసి చదువుకున్న మా మారిస్ స్టేల్లా కాలేజీ మిత్రురాళ్ళము కొందరం నిన్న బెజవాడలో కలుసుకున్నాం. టీనేజ్ లో విడిపోయిన మేము మళ్ళీ టీనేజీ పిల్లల తల్లులుగా మారాకా జరిగిన ఈ కలయిక మాలో ఎంత అద్భుతమైన ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ నింపిందో అసలు మాటల్లో చెప్పలేను. మరీ దూరాల్లో ఉన్న స్నేహితులను వీడియో కాల్స్ చేసి పలకరించాము. అందరి కళ్ళల్లో సంబరం, ఆశ్చర్యం, ఆత్మీయత! ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు అన్నీ మర్చిపోయి, సంసారాన్ని పక్కన పెట్టి, మళ్ళీ మేము చిన్నపిల్లలమైపోయి అప్పట్లో క్లాస్ లో లాగ గలగలా గట్టిగట్టిగా మాట్లాడుకుని, ఏమే, ఒసేయ్ అని పిలుచుకుంటూ మహా ఆనందపడిపోయాం. మేము ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకోకుండా నిన్న "ఫ్రెండ్ షిప్ డే " అవ్వడం మరో గొప్ప కోయిన్సిడెన్స్!!
నాది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా సెక్లూడెడ్ లివింగే. నా కొకూన్ లో, నా కంఫర్ట్ జోన్ లో జీవిస్తూ గడపడం నా స్వభావం. మధ్యలో ఒక్క రెండు మూడేళ్ళు మాత్రం మునుపెన్నడూ ఎరుగని ఆర్థిక ఇబ్బందుల వల్ల, వాటిని మర్చిపోవడానికి ఎక్కువ భాగం ల్యాప్టాప్ ముందర గడిపాను. అదే నేను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఒకేలాంటి ఆసక్తులు ఉన్న మనుషులందరూ ఒక్కలాగ ఆలోచిస్తారనుకునే పిచ్చి భ్రమలో ఉండి జీవితాంతం మర్చిపోలేని అవమానాల్ని భరించాల్సి వచ్చింది!! దైవికంగా ఇప్పుడు నా మిత్రురాళ్ల కలయికతో ఆ బాధ అంతమైంది. అంత స్నేహమూ, అంత ప్రేమాభిమానాలూ ఉంటే ఇన్నాళ్ళూ ఎందుకు కలవలేదు? కనీసం ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంటే ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా పెళ్ళి, సంసార బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగాలూ, వయసుతో పాటూ వచ్చిన ఆరోగ్య సమస్యలూ... ఒకటా రెండా? సవాలక్ష కారణాలు. నామటుకు నేను గుర్తుకొచ్చినప్పుడు తలుచుకోవడం తప్ప ఏనాడూ గట్టిగా కలవడానికి గానీ, కనీసం మాట్లాడడానికి గానీ ప్రయత్నించలేదు. ఏమో...అలా గడిచిపోయాయి రోజులు.. అంతే.
" बेक़रार दिल इस तरह मिले
जिस तरह कभी हम जुदा न थे
तुम भी खो गए, हम भी खो गए
एक राह पर चलके दो क़दम..."
అందరమూ పాతికేళ్ల తర్వాత కలిసినా అదే స్నేహభావం, అదే ఆప్యాయత, అందరి కళ్ళల్లో అదే ప్రేమ. ఇది కదా నిజమైన స్నేహం అంటే. చెప్పుడు మాటలు విని అకారణ ద్వేషభావాల్ని పెంచుకుని మనసుని ముక్కలుచేసే వర్చువల్ స్నేహాల్లాంటివి కావవి. అందరమూ మొత్తం ఐదేళ్ళు 9a.m to 4p.m కలిసిమెలసి గడిపినవాళ్ళం.ఒకరిగురించి ఒకరం పూర్తిగా ఎరిగిన మనుషులము.
ఇంటర్ లో మా స్పెషల్ ఇంగ్లీష్(HSC) గ్రూప్ లో మొత్తం నలభై మందిమి. తర్వాత B.A లో కూడా సేమ్ బ్యాచ్. ఎకనామిక్స్ గ్రూప్, Eng.Litt రెండు గ్రూప్స్ నీ కలిసి ఒకే క్లాస్ లో కూర్చోపెట్టేవారు. క్లాస్ లో మొత్తం ఎనభై, తొంభై మందిమి ఉండేవాళ్ళం. ఆ రెండు సబ్జెక్ట్స్ కీ, లాంగ్వేజెస్ కీ రూమ్స్ మారేవాళ్ళం. లంచ్ టైమ్ లో మా లిట్రేచర్ వాళ్లమందరమూ రౌండ్ గా కూచుని ఒకరి బాక్సెస్ ఒకరం ఎక్స్ఛేంజ్ చేసుకుంటూ లంచ్ చేసేవాళ్ళం. పాటలు పాడే అమ్మాయిగా నేను అందరికీ బాగా తెలిసేదాన్ని. మేడమ్ రాకపోతే లీజర్ పిరియడ్ లో నాతో పాటలు పాడించుకునేవారు. డిగ్రీలో నాకు తోడు మరొక సింగర్ క్లాస్ లో జాయిన్ అయ్యాకా నాకు కాస్త రెస్ట్ వచ్చింది. తను చాలా బాగా పాడేది. బోల్డు హై పిచ్. ముఖ్యంగా మల్లీశ్వరిలో పాటలు ఎంత బాగా పాడేదో. నేనైతే "ఎందుకే నీకింత తొందర.." పాటని మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునేదాన్ని. ఆ పాటల వల్లే నాకు మంచి స్నేహితురాలైంది కూడా తర్వాతర్వాత. ఇప్పుడు కెనడాలో ఉంటోందా రాక్షసి.
విజయవాడకు దగ్గరలో ఉన్న ఊళ్ళవాళ్లందరూ నిన్న వచ్చారు. ఇంతకీ నిన్న కలిసిన వాళ్ళల్లో చాలా మటుకు అందరూ మంచి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీలలో టీచింగ్ ప్రెఫెషన్ లోనే ఉన్నారు. చాలావరకూ పి.హెచ్.డీ కేండిడేట్ లే. ప్రెఫెసర్ గిరీలే! వివరాలు అప్రస్తుతం కానీ ఇలా మంచి పొజిషన్స్ లోకి ఎదిగినవాళ్ళు మా బ్యాచ్లో ఇంకా కొందరున్నారు.
దాదాపు అందరూ వర్కింగే అవడం వల్ల పని ఒత్తిడి, పలు ఆరోగ్య సమస్యలూ కూడా కామన్ గానే కనబడ్డాయి మాలో! కానీ నాకు ముఖ్యంగా సంతోషం కలిగించిన విషయం పిల్లలు. అందరూ కూడా పిల్లలని చక్కని క్రమశిక్షణతో, ఉన్నతమైన చదువులు చదివించారు. చదివిస్తున్నారు. బుధ్ధిమంతులుగా పెంచుతున్నారు. మన మంచితనం, మన బాధ్యతా నిర్వహణలే మన పిల్లలకూ మార్గదర్శకంగా మారతాయి. ఇవే కదా మనం పిల్లలకు ఇచ్చే ఆస్తులు.
నేను గమనించిన ఇంకో సరదా విషయం మా మానసిక ఎదుగుదల. ఒకప్పుడు టీనేజ్ ఆలోచనలతో ఉన్న మేమే మాకు తెలుసు. ఇప్పుడు అందరమూ దాదాపు సగం జీవితాన్ని చూసిన, గడిపిన అనుభవంతో ఉన్నాము. అందువల్ల అందరి మాటల్లోనూ లోతైన అవగాహన, చక్కని పరిపక్వత ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇదంతా జీవితంలో నేర్చుకున్న పాఠలు అనేకన్నా మా కాలేజీ మాకు ఇచ్చిన శిక్షణ వల్లనే అనుకోవడమే సబబు. అప్పట్లో అధ్యాపకులు కూడా ఎంతో ఆదర్శవంతంగా, విజ్ఞానవంతులుగా ఉండేవారు. అలానే బోధించేవారు. ఇప్పుడు కూడా క్లాస్ చెప్పేప్పుడూ ఫలానా మేడమ్ మాటలు గుర్తుచేసుకుంటూ ఉంటాము అని కూడా ఒకరిద్దరు స్నేహితురాళ్ళు అన్నారు నిన్న. అందరు అధ్యాపకులనూ పేరు పేరునా తల్చుకున్నాం. నాలుగైదు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి.
గిఫ్ట్స్ ఎక్ఛెంజ్ చేసుకుని, నెక్స్ట్ మీట్ లోపూ మరికొందరు మిత్రులని వెతికిపట్టుకోవాలనే నిశ్చయంతో, భారమైన హృదయాలతో, కళ్లల్లో నీళ్ళతో, కౌగిలింతలతో వీడ్కోలు చెప్పుకున్నాం. ఏడాదిలో ఒక్కసారైనా ఇలా కలుస్తూ ఉందామర్రా! అని గట్టిగా చెప్పుకున్నాం. అప్పటికే లేటయిపోవడం వల్ల ఇంక వేరే ఎవరినీ కలవకుండానే ఇంటిదారి పట్టాను. దారిలో కృష్ణా బ్యారేజ్ దాటాకా అదేదో పవిత్ర సంగమంట. కృష్ణా,గోదావరుల కలయికా స్థలం. పార్క్ లా డేవలప్ చేశారు. అది మాత్రం చూశాము. రాత్రి ఇల్లు చేరేసరికీ పన్నెండైంది. ఆదివారం కాబట్టి ఇలా కలవడం సాధ్యమైంది అందరికీ. కానీ మరొక్కసారి టీనేజ్ లోకి వెళ్ళి వచ్చినట్లు ఉన్న magical intoxication లోంచి మాత్రం ఎవ్వరమూ ఇంకా బయటకురాలేదు. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న మా కాలేజీ వాట్సప్ గ్రూప్ లో ఇందాకటిదాకా టింగ్ టింగ్ మని వస్తున్న మెసేజెస్ అందుకు సాక్ష్యం :-)
ఈ స్నేహసుగంధాల మత్తులో, ఈ జ్ఞాపకాలతో మరోసారి మేమందరమూ కలిసే వరకూ బహుసంతోషంతో బతికేయచ్చు అని మాత్రం ధీమాగా అనిపించింది.