సినిమా ఒక ఊహాప్రపంచం ! వాస్తవంలో మనం చెయ్యలేనివీ, కేవలం ఊహించగల పనులను సినిమాల్లో హీరోలు చెయ్యటం చూసి మనం ఆనందపడతాం. అది నిజం కాదు... మానవమాత్రులెవ్వరూ అలా చెయ్యలేరు అని తెలిసినా సరే. ఊహాజనితమైన భ్రమలోకి మనలను తీసుకువెళ్ళి మనలో నిద్రాణమైఉన్న ఊహలకు, కోరికలకూ తమ పాత్రల ద్వారా రూపం కల్పిస్తారు కాబట్టి మనం నటినటులను అభిమానిస్తాం. కానీ అభిమానిస్తున్నాం కదా అని తర్కవిరుధ్ధమైన కథలున్న సినిమాల్లో నటిస్తే... అభిమానులకు మిగిలేది నిరాశే !
నేటితరం మేటి తారలతో తీయబడిన హిందీ చిత్రం "అగ్నిపథ్". హేమాహేమీలున్నారు... పబ్లిసిటి బాగుంది.. సినిమా అద్భుతంగా ఉంటుందని వెళ్ళిన నాకు మాత్రం నిరాశనే మిగిల్చింది "అగ్నిపథ్". నటీనటులందరు తమతమ పాత్రలలో శక్తివంచన లేకుండా నటించారు. అయితే కథనంలోని లోపాలు ఈ చిత్రంలోని రసానందానికి అడ్డుకట్టు వేసాయి. నటినటులు ఎంత బాగా చేస్తున్నా కథలో చెప్పబడిన '
ప్రతీకారాగ్ని' మనసుని తాకలేకపోయింది. సినిమాలో జరిగే సన్నివేశాలేమీ మనసుని కదిలించలేకపోయాయి. ఎప్పుడయిపోతుందా అని టైమ్ చూసుకున్నాను. Total feel is missing అనిపించింది నాకు.
ఈ చిత్రం అమితాబ్ గతంలో నటించిన
అగ్నిపథ్(1990) చిత్రదర్శకుడికి శ్రధ్ధాంజలి మాత్రమే... అనే ఒక వివరణ సినిమా మొదలయ్యే ముందు చూపెట్టారు. అందువల్ల ఆ సినిమాను యధాతథంగా పాత కథతో పునర్నిర్మించలేదని తెలుస్తోంది. రెండిటిలో సామ్యం చెప్పటానికి నేను పాత
అగ్నిపథ్ చూడలేదు కూడా. ఒక కొత్త చిత్రంగా చూస్తే, కొత్త అగ్నిపథ్ లోని లోపాలు నన్ను చాలా నిరాశపరిచాయి. పాత సినిమా కథ ఖచ్చితంగా కొత్త చిత్రానికి భిన్నంగా ఉండిఉంటుందని నా అంచనా... లేదా అది కూడా అమితాబ్ అభిమానుల వల్ల హిట్ చిత్రమయి ఉండచ్చు...!
సినిమా మొదట్లో పూలదండలు వేసి మరీ సత్కరించి, అభిమానించిన స్కూల్ టీచర్ పై నింద పడిన వెంఠనే గ్రామప్రజలు ఏ విచారణ చేయకుండా, అతను చెప్పేది ఒక్క మాటా వినకుండా అమాంతం అతడిని చితకబాది, ఉరి తీయటం అనేది చాలా అన్యాయమైన తీర్పు. ఊరి జమిందారు కూడా అసూయపడేంత జనాదరణ కలిగిన టీచర్ పై ఘోరమైన నింద పడితే గ్రామప్రజలు అతడికి సంజాయిషీ చెప్పుకునే అవకాశం ఇవ్వరా? మాస్టారిపై అమితమైన గౌరవ మర్యాదలు చూపిన ప్రజలు అంత సంస్కారరహితంగా ఎలా ఉంటారు? అన్నది నా మెదడు దొలిచిన ప్రశ్న.
ఇక చిత్రం మొదటి భాగంలో పగే ప్రాణంగా, ప్రతీకారమే ఊపిరిగా పెరిగిన కథానాయకుడు ఎన్నో తెలివైన పథకాలతో 'రౌఫ్ లాలా' లాంటి గేంగ్స్టర్ నే మోసగించగలుగుతాడు. అంచలంచలుగా అతడి స్థానాన్ని ఆక్రమించగల సమర్ధ్యం, తెలివి ఉన్న శక్తివంతమైన పాత్రగా చూపెట్టిన "
విజయ్ చౌహాన్" చిట్టచివరలో ఏ జాగ్రత్తా లేకుండా మాండ్వా కు వెళ్లటం, అక్కడ నరరూపరాక్షసుడైన కాంచా దగ్గరకు ఏకాకిగా వెళ్ళి చావుదెబ్బలు తినటం నాకు హాస్యాస్పదంగా తోచాయి. తెలివైన నాయకుడిగా చూపెట్టినప్పుడు ఒక తెలివైన పథకంతో కాంచా లాంటి దుర్మార్గుడిని అంతం చేసినట్లు చూపెడితే, లేదా కాంచా తన తప్పును గ్రామ ప్రజల ముందర ఒప్పుకునేట్లు చూపెట్టినా బాగుండేది. ఏ ముందస్తు పథకాలు లేకుండా కాంచా చేతిలో సులభంగా తన్నులు తిని, కత్తిపోట్లు పొడిపించుకుని హీరో నేలకూలటం అనేది సినిమాలో మొదట చూపిన అతడి తెలివికీ,పరాక్రమానికీ అవమానం.
చివరలో చూపెట్టినట్లు కేవలం తన బలం ద్వారానే ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం ఉంటే, ఏ అడవిలోనో లేదా వేరే ఊళ్ళోనో ఉండి...కండలు పెంచి పెద్దయ్యాకా వచ్చి విలన్ ని చంపెయ్యచ్చు కదా. ముంబై మాఫియా గొడవల్లో తలదూర్చి, అక్కడ తన శక్తియుక్తులతో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించినట్లు చూపించటం ఎందుకు? అదీకాక రెండు మూడు కత్తిపోట్లతో, బోలెడు దూరం బరాబరా ఈడ్చబడ్డాకా కూడా లేచి, నుంచుని, '
కాంచా' లాంటి బలమైన వ్యక్తిని అమాంతం లేవనెత్తి క్రిందపడేయ్యటం మానవమత్రులవల్ల అయితే కాదు...! (సినీహీరోల వల్లే అవుతుంది మరి..:)) ఇక అప్పటికప్పుడు తిరుగుబాటు చేసిన ఆ ఊరిప్రజలు అంతకు ముందు 'కాంచా' హీరోను ఒక్కడినీ చేసి కొడుతుంటే ఎందుకు ముందుకు రాలేకపోయారు? అన్నది కూడా అర్ధం కాని ప్రశ్నే !
రౌఫ్ లాలా, కాంచా ఇద్దరి మరణాలూ చాలా సులభంగా ఉండి ఏళ్ల తరబడి నాయకుడిలో పెరిగిన ప్రతీకారానికి తగ్గట్టుగా లేవు. నరరూప రాక్షసులు అని చెప్పినప్పుడు వాళ్ల చావు కూడా భయానకంగానే ఉండాలి కదా..! నటీనటులందరూ పోటీపడి నటించారేమో అనిపించింది.
హృతిక్, రిషీ కపూర్, జరీనా వహబ్, ఓంపురి అంతా తమ పాత్రలకు నూరుశాతం న్యాయం చేసారు. గతంలో "ఖల్ నాయక్" సినిమాతోనే నెగెటివ్ పాత్రలో రాణించగలనని
సంజయ్ దత్ నిరూపించాడు. ఇప్పుడు ఒక పూర్తిస్థాయి ప్రతినాయకుడిగా అద్భుతంగా చేసాడు. కానీ అతడి పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఎక్కువగా నటించే అవకాశం ఇవ్వనేలేదు. ఐటెమ్ సాంగ్ చేసిన
కత్రీనా, నాయకురాలి పాత్రలో
ప్రియాంక ఇద్దరూ కూడా (ఎంత బాగా చేసినా) మరింత సన్నబడి గడకర్రలుగా కనబడ్డారు తప్ప వినోదాన్ని పంచే అందగత్తెలుగా నాకయితే కనబడలేదు.
ఏ చిత్రానికయినా
నేపథ్యసంగీతం ఊపిరి లాంటిది. అందులో భాగంగా కీలకమైన సన్నివేశాల్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి ప్రేక్షకుడి నోట ఈలగా మారే 'theme music' ఒకటుంటుంది. సంజయ్ దత్ తాలుకూ సన్నివేశాలు వచ్చినప్పుడు, హృతిక్ ఎత్తులు వేసినప్పుడూ ఈ సినిమాలో theme music వినిపిస్తుంది. అది బావుంది కానీ మొత్తమ్మీద నేపథ్యసంగీతం లో
వాయిద్యాల హోరు ఎక్కువగా ఉందనిపించింది. నాకు సినిమాలో నాకు బాగా నచ్చినవి పాటలు. ఈ చిత్రంలో పాటలకు ఉత్సాహవంతమైన, హృద్యమైన సంగీతాన్ని అందించారు
అజయ్-అతుల్. ప్రతి పాటకూ "
అమితాబ్ భట్టాచార్య" అందించిన సాహిత్యం ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా నాకు రెండు పాటలు బాగా నచ్చేసాయి. రూప్ కుమార్ రాథోడ్ పాడిన "
ऒ सय्या..", సోనూ నిగం పాడిన "
अभी मुझ में कही.." ."గున్ గున్ గునారే..గున్ గున్ గునారే", "చిక్నీ ఛమేలీ" ఉత్సాహవంతంగా ఉన్నాయి.
Greater expectations can indeed lead to disappointment అని నాకు నిరూపించింది ఈ సినిమా. రీమేక్ చెయ్యాలనుకుంటే హింసాత్మక చిత్రాలే ఎందుకు? ఉత్సాహభరితమైన లేదా హాస్యరసప్రధానమైన చిత్రాలనెందుకు ఎన్నుకోకూడదు? అన్నది నా ప్రశ్న.