సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, February 28, 2012

"గాయం(1993)" పాటలు



ఇందాకా టివీ లో "గాయం(1993) " సినిమా వస్తూంటే కాసేపు చూసాను. అప్పట్లో ఇలాంటి సినిమాలు రామ్ గోపాల్ వర్మ పై నమ్మకాలు పెంచాయి. సిరివెన్నెల రాసిన "నిగ్గదీసి అడుగు" పాట ఇన్నాళ్ల (nealrly 20years) తర్వాత మళ్ళీ వింటుంటే ఇన్నేళ్ల తరువాత కూడా ఎంత సమకాలీనంగా ఉందో ...! సమాజంలో లేశమాత్రమైనా మార్పు రాకపోగా మరింత దిగజారినట్లు కనబడటం ఆశ్చర్యం కలిగించింది. మళ్ళీ ఇలాంటి పాటను రాయమంటే ఇప్పుడు ఎటువంటి పదునైన పదాలను వాడతారో సిరివెన్నెల.. అనిపించింది. ఆమధ్యన ఓ కార్యక్రమంలో 'దర్శకుడు త్రివిక్రమ్' చెప్పినట్లు సీతారామ శాస్త్రిగారి వంటి సమర్ధులైన కవులంతా సినీగీత తచయితలు అయిపోవటం వల్ల సాహితీలోకం గొప్ప కవులను నిజంగా కోల్పోయిందే...అని బాధ కలిగింది కూడా !

ఓసారి "నిగ్గదీసి అడుగు" పాట సాహిత్యాన్ని చూస్తూ పాట వినేస్తారా... మన "బాలు" గాత్రం కాబట్టే ఈ పాటకు ఇంత గాంభీర్యం, హుందాతనం వచ్చాయి అనటం నిస్సందేహం..!!




సాహిత్య0:

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుదు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రె దాటు మందకి నీ జ్ఞనబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
((నిగ్గదీసి))

పాత రాతి గుహలు పాలరాతి గృహాలైనా..
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా..
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా..
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండా
((నిగ్గదీసి))

** ** ** **

"గాయం" సినిమాలో నాకు చాలా ఇష్టమైన మరో పాట "అలుపన్నది ఉందా".రామ్ గోపాల్ వర్మ తీసిన అన్ని సినిమాల్లో తప్పనిసరైన సముద్రతీరాల్లో తీసిన పాటలన్నీ ఆదరించబడినవే ! చిత్ర పాడిన తీరు, "శ్రీ" సమకూర్చిన సంగీతం, చిత్రికరణ మూడూ అపురూపమైనవే. (శ్రీ స్వరపరిచిన మరో రెండు మంచి పాటల గురించి "ఇక్కడ"). ఉన్నతమైన బాణీలను అందించగల సామర్ధ్యం ఉన్న "శ్రీ" మరిన్ని తెలుగుపాటలు చేసుంటే బావుండేది అని అతని పాటలు విన్న ప్రతిసారి అనుకుంటాను.



పాట: అలుపన్నది ఉందా
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: శ్రీ
గాయని: చిత్ర



సాహిత్యం:


అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకూ
మెలికలు తిరిగే నది నడకలకూ
మరిమరి ఉరికే మది తలపులకూ ((అలుపన్నది))


నా కోసమే చినుకై కరిగి ఆకశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతికావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకూ...
ల..ల..లల..లలలలల లాలా...


నీ చూపులే తడిపే వరకూ ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల..ల..లల..లలలలల లాలా...
ఊ...ఊ...


*** *** ***

ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా బావుంటాయి. వాటి లింక్స్ ఇక్కడ:


* నైజాం పోరి నజ్దీకు జేరి

చెలి మీద చిటికెడు దయ రాదా

* సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని



No comments: