పెద్దగా జనాదరణ పొందని బాపూ సినిమాల్లో ఒకటి 1982 లో తీసిన "కృష్ణావతారం". ఇందులో కృష్ణ, శ్రీదేవి ముఖ్య తారాగణం. ముళ్ళపూడి వెంకటరమణగారు డైలాగులూ, స్క్రీన్ ప్లే అందించారు. మామాఅల్లుళ్ళైన కంస-కృష్ణుల కథను సోషలైజ్ చేసి తీసిన సినిమా ఇది. ఈ సినిమా పాటల తాలూకూ గ్రామ్ఫోన్ రికార్డ్(LP record) ఉండేది మా ఇంట్లో. కారణమేమంటే ఈ సినిమాలో "సిన్నారి నవ్వు.." అనే పాటను నాన్నగారి రేడియో మిత్రులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు రాసారు.
నాకు చాలా చాలా ఇష్టమైన తెలుగు పాటల్లో ఇదీ ఒకటి. ఈ పాట ఎన్నిసార్లు వినేదాన్నో ... ! కె.వి.మహాదేవన్ గారు అద్భుతంగా స్వరపరిచిన ఈ పాట మొత్తంలో వెనకాల వచ్చే "ఫ్లూట్ బిట్" నాకు చాలా ఇష్టం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ కూడా ఈ పాటను చాలా బాగా పాడారు.
http://www.raaga.com/play/?id=193134 సాహిత్యం:
సిన్నారి నవ్వు.. సిట్టి తామర పువ్వు..
సెరువంత సీకటినీ సుక్కంత ఎలుగు
సుక్కంత ఎలుగేమో సూరీడు కావాల
సిన్నారి సిరునవ్వు బతుకంత పండాలా
పువ్వులో పువ్వుంది.. బంగారు తల్లీ
పువ్వునంటే ముళ్ళు పొంచిఉన్నాయి
మనసున్న మడిసొకడు ఈడనున్నడు
కీడు రాకుండాను తోడుండగలడూ...
సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు...
ఓ కంట కన్నీరు ఉరికేను చూడు
ఓ కంట పన్నీరు కురిసేను నేడు
కన్నతల్లీ మనసు మురిపాలవెల్లీ
కళ్ళలో మెరిసేను అనురాగవల్లీ
ఒంటిమలినాలేవీ మనసంటవోయీ
ఒడిలోని పాపాయి వటపత్రసాయి..
హాయి హాయి హాయి ఆపదలూగాయీ(2)
సిలకల్లె కులికేవు మొలకపాపాయి
హాయి హాయి హాయి.. ఆపదలూగాయీ..(2)
సిలకల్లె కులికేవు మొలకపాపాయి
హాయి హాయి హాయి ఆపదలూగాయీ
సిలకల్లె కులికేవు మొలకపాపాయి
అత్తరూలేదురా పన్నీరు లేదు
ఉడుకునీరే సాలు మనకూ పదివేలు
సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ
నీ అగులుచుక్కా సొగసు అద్దానికీసు
కన్నతల్లికీ కంటిపాపవే గానీ
కడమాళ్ళకే కంటి నలుసువయ్యావు
నేలపై పారాడు బాలకిట్టమ్మా
నెమలికన్నేదిరా నాకూ సూపమ్మా
నేలపై పారాడు బాలకిట్టమ్మా
నెమలికన్నేదీరా నాకూ సూపమ్మా...
ఈ సినిమాలో జనాదరణ పొందిన మరో పాట "మేలుకోరాదా కృష్ణా మేలుకోరాదా.. నలుగురి మేలుకోరే వాడా మమ్మేలుకోవేరా " ఎప్పుడూ రేడియోలో వస్తుండేది. ఇది నారాయణరెడ్డిగారు రాసినట్లున్నారు. ఈ చిత్రం లోని మిగిలిన పాటలు ఇక్కడ వినవచ్చు...
http://www.cineradham.com/newsongs/song.php?movieid=1614&moviename=Krishnavataram(1982)
No comments:
Post a Comment