సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 23, 2011

Anuranan - a resonance


అప్పుడెప్పుడో ప్లానెట్ ఎం లో తీసుకున్న ఒక సీడి కొన్ని నెలల తరువాత ఓపెన్ చేసి చూస్తే సరిగ్గా లేదు. తిరిగి ఇచ్చేస్తే తీసుకుంటాడో లేదో అన్న సందేహంతో వెళ్ళే సరికీ మరో సీడీ తీసుకోండి అన్నారువాళ్ళు. ఏం కొనాలా అని వెతుకుతూంటే కనబడింది బెంగాలీ చిత్ర దర్శకుడు అనిరుధ్ధ్ రాయ్ చౌదరి తీసిన "అనురనన్" అనే హిందీ సినిమా. mainmeri-patni-aur-woh సినిమాతో నచ్చేసిన రితుపర్నాసేన్ గుప్తా, ఇంకా రాహుల్ బోస్ , రైమా సేన్ మొదలైనవారు కనబడేసరికీ బావుంటుందనిపించి సీడీ తీసేసుకున్నాను.

కథనం కొద్దిగా స్లోగా సాగినా ఆసక్తికరంగా ఉండటంతో చివరిదాకా చూసాం. కానీ చివర్లో ఎదురైన ట్విస్ట్ చూసి...ఎండింగ్ లో ఈ ట్రేజెడి ఏంటీ...అని బెంబేలెత్తిపోయాం. అయితే సినిమా చివరిలో వచ్చే ఒకే ఒక డైలాగు ఆ కథ బాగా నచ్చేలా చేసింది. నిజంగా భార్యాభర్తల అనుబంధం ఇలా ఉండాలి....ఒకరిపై ఒకరికి నమ్మకం ఇలా ఉండాలి అనిపించేలా ఉన్న క్లైమాక్స్ మనసుకు హత్తుకునేలా ఉంది. "a friend is one.. who comes in when the whole world has gone out.." అని ఒక కొటేషన్ ఉంది. భార్యాభర్తల అనుబంధం స్నేహంతొనే ముడిపడుతుంది కాబట్టి, ప్రపంచం అంతా నమ్మినా నమ్మకపోయినా జీవిత భాగస్వామి నమ్మకం, వారి అనుబంధం ఇలా ఉండాలి.. అన్న సిధ్ధాంతాన్ని చూపిస్తుందీ సినిమా.

"అనురనన్ - a resonance" అన్నది సినిమా పేరు. resonance అంటే అనుకంపన. అంటే ప్రతిధ్వని అనుకోవచ్చేమో. రాహుల్ - నందిత, అమిత్ - ప్రీతి; ఈ రెండు జంటలు కలినప్పుడు, ఆ నలుగురి పరిచయం వారి వారి వైవాహిక జీవితాలపై చూపిన ప్రభావమే కథాంశం. అదే resonance. రాహుల్, నందిత కొన్నేళ్ళుగా లండన్ లో ఉంటుంటారు. కాంచనజంగ లో ఒక రిసార్ట్ కట్టే ఉద్యోగబాధ్యతపై రాహుల్ ను ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తారు. లండన్ లో పరిచయమైన అమిత్, ప్రీతి దంపతులు ఇండియాలో వీరికి స్నేహితులుగా మారతారు. నొనీగా పిలవబడే నందిత మొదటి పరిచయంలోనే ప్రీతి జీవితంలో వెలితినీ, ఆమెలోని శూన్యతను పసిగడుతుంది. రాహుల్ ఊరు వెళ్ళినప్పుడు నందితను పలకరించటానికి అమిత్,ప్రీతి వచ్చినప్పటి సీన్ చాలా బావుంటుంది. అలంకరణ లేకుండా ఉదాసీనంగా ఉన్న నందిత ముహంలో భర్తను మిస్సవుతున్న భావం బాగా కనబడుతుంది. అదే సమయంలో వంటింట్లో బీటేన్ కాఫీ చేస్తుండగా వచ్చిన ప్రీతిని "दॊनॊं मॆं दरार कहां है? शरीर मॆं या मन मॆं या प्यार मॆं..." అని అడగటం, ప్రీతి దాటువెయ్యటం, "भागना है तॊ भाग.. लॆकिन खुद सॆ नही.." అని నందిత అన్న సీన్ చాలా నచ్చింది నాకు. ఈ సీన్ నందిత పాత్రను, ఆమె సునిశిత దృష్టినీ, వ్యక్తిత్వాన్నీ మరింత ఎలివేట్ చేస్తుంది.


రాహుల్ సినిమా మొదటి నుంచీ తన డిక్టాఫోన్(Digital Voice Recorder ) లో తన భావాలూ, అభిప్రాయాలూ రికార్డ్ చేస్తూ ఉండటం వెరైటీగా బాగుంది. సినిమా చివరలో కూడా కొన్ని బంధాలకు పేర్లు పెట్టలేము అని మాట్లాడే వాక్యాలు బాగుంటాయి. అవి కూడా అనుమానాన్ని వ్యక్తం చేసేలా ఉన్నా కూడా;ప్రీతి భర్తతొ సహా అందరూ రాహుల్,ప్రీతి ల స్నేహాన్ని అపార్ధం చేసుకున్నా సరే, అతనిని అపార్ధం చేసుకోకపోవటం ఆ భార్యాభర్తల గాఢానుబంధాన్ని తెలియజేస్తుంది.



రాహుల్, నందిత పాత్రల్లో అన్యోన్యమైన జంటగా రాహుల్ బోస్, రితుపర్నాసేన్ గుప్తా ల నటన ఆకట్టుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా చక్కని కాటన్ చీరల్లో, నుదుటిన ఎర్రని బొట్టుతో హీరోయిన్లిద్దరూ కనువిందు చేసారు. ముఖ్యంగా జుట్టుకు పెద్ద ముడి, కాటన్ చీర, నుదుటిన ఎర్రని బొట్టుతో సుచిత్ర సేన్ మనవరాలు, మున్ మున్ సేన్ కుమార్తె అయిన రైమా సేన్ చాలా అందంగా కనబడింది. నటన ఈమె రక్తంలో ఉందేమో అనిపించింది.



పౌర్ణమి పూట హిమాలయాలపై వెన్నెల పడే దృశ్యాన్ని అతి హృద్యంగా చిత్ర్రీకరించారు. ఆ సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ రాహుల్ - ప్రీటి ల మధ్య డైలాగ్స్ కూడా బాగున్నాయి. అంతం చాలా బరువుగా విషాద భరితంగా నాకు నచ్చని విధంగా ఉన్నా కూడా, రాహుల్ ని అతని భార్య అర్ధం చేసుకుంది అని తెలపటం కాస్త ఊరటనిచ్చింది. సినిమా చివరి సన్నివేశంలో నందిత "चल पगली...तन सॆ कॊई उड सकता हैं? मन कॆ साथ उड...आत्मा कॆ साथ उड... फिर दॆखना सारा आकाश निछावर हॊजायॆगा तॆरॆ सामनॆ...ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అంటుంది హాస్పటల్ బెడ్ పై ఉన్న ప్రీతి చేతిని తన చేతిలోకి తీసుకుని ! " ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అన్న ఒక్క వాక్యంలో బోలెడు అర్ధం. ప్రీటి భర్త అమిత్ ఫోన్ చేసి సానుభూతి మాటలు చెప్పినప్పుడూ ఫోన్ మధ్యలో కట్ చేసేసి ఆమె ఏడుస్తుంది. దాని అర్ధం ఈ డైలాగ్ తో మనకు తెలుస్తుంది. కథనం స్లోగా ఉన్నా, అద్భుతమైన చిత్రీకరణ, అందమైన లాంస్కేప్స్, సరౌండింగ్స్ ముచ్చట గొలుపుతాయి. కథలోని ట్విస్ట్ మనసును భారం చేసినా, భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చూపిన ఈ చిత్రం చూడతగ్గది.

Tuesday, November 22, 2011

జంధ్యాల గారి "చిన్నికృష్ణుడు"(1988) నుంచి రెండు మంచి పాటలు..





రమేష్ బాబు, ఖుష్బూ నటించిన జంధ్యాల గారి "చిన్నికృష్ణుడు" సిన్మా నుంచి రెండు మంచి పాటలు. రెండూ కూడా నాకు భలే ఇష్టం :


పాడినది: ఎస్.జానకి
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం:వేటూరి


మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచే నా ప్రేమ
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు(2)

పొద్దే తాంబూలాలై ఎర్రనాయే సంజెలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ బాటలాయె
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో ((ప))

కన్నె చెక్కిళ్ళలో సందె గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు(2)
వచ్చే మాఘమాసం పందిరేసే ముందుగానే
నీవూ నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో
((ప))
=============================================

2)song:జీవితం సప్తసాగర గీతం
పాడినది: ఆశా భోంస్లే
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం:వేటూరి


ప: జీవితం సప్తసాగర గీతం
వెలుగు నీడల వేగం
సాగని పయనం
కల ఇల కౌగిలించే చోట(2)

1చ: ఏది భువనం ఏది గగనం తారాతోరణం
ఈ చికాగో సిల్స్ టవరే స్వర్గసోపానము
ఏది సత్యo ఏది స్వప్నం నిజమీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
హే...బ్రహ్మ మానసచిత్రం చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించే చోట(2)
((ప))

2చ: ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేఛ్ఛా జ్యోతులు
ఐక్యరాజ్య సమితిలోనా కలిసే జాతులు
ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మియామీ బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము
హే..సృష్టికే ఇది అందం
దృష్టి కందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట(2)
((ప))

Sunday, November 20, 2011

Speilberg - టిన్ టిన్


Steven Speilberg. ప్రపంచంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన ప్రముఖ దర్శకుల్లో ఒకడు. నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకడు. ఊళ్ళోకి స్పీల్ బర్గ్ సినిమా వచ్చిందంటే మాకు తప్పకుండా చూపించేవారు నాన్న. అలాగ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాల్లో సగం పైనే సినిమాలు చూడగలగటం వల్ల అతనంటే ఒక విధమైన ఆరాధన. మా ముగ్గురికీ(siblings) సుపరిచితుడు. ఒక చిరకాల నేస్తం. ఒక యుధ్ధ నేపధ్యంతో తీసిన "షిండ్లర్స్ లిస్ట్" కు ఆస్కార్ అవార్డ్ రావటం అనందకరమే అయినా ,కెరీర్ ప్రారంభించిన ఎన్నో ఏళ్ల తరువాత ఆస్కార్ రావటం ఆశ్చర్యకరం. చాలా సినిమాలు నేను చూడటం కుదరనే లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు విచిత్రంగా మేం ముగ్గురం, నాన్నతో కలిసి ఇవాళ స్పీల్ బర్గ్ తీసిన " The Adventures of Tintin " 3D చూడటం మధురమైన అనుభూతిని మిగిల్చింది నాకు.

విశ్వ విఖ్యత కార్టూన్ కేరెక్టర్ "టిన్ టిన్" గురించి కొత్తగా చెప్పేదేమీలేదు. ఎన్నో యేనిమేషన్ సిరీస్ లూ, కార్టూన్ పుస్తకాలూ, టివీ సీరియళ్ళూ. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, "టిన్ టిన్" కేరెక్టర్ స్పీల్ బర్గ్ కి చాలా ఇష్టమని... సినిమా తీయాలని కొన్నేళ్ళ క్రితమే స్క్రిప్ట్ రెడి చేసుకున్నాడని...అది ఇప్పటికి కార్య రూపం దాల్చిందని. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక
performance capture చిత్రం. అంటే సినిమాలోని పాత్రలను ఒక పధ్ధతి ద్వారా యేనిమేట్ చేస్తారు. గతంలో మొదటిసారిగా ఇలాంటి ప్రయోగంతో 2004 లో వచ్చిన చిత్రం "The Polar Express". 3D గానే కాక ఐమాక్స్ స్క్రీన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసారు ఈ చిత్రాన్ని. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఈ టిన్ టిన్ సినిమా తీసారు. 3Dలో ఈ చిత్రాన్ని చూడటమే ఒక ఆనందం అనుకుంటే, performance capture technique లో చూడటం ఇంకా గొప్ప అనుభూతి.



గతంలో స్పీల్ బర్గ్ సినిమాలకు సంగీతాన్ని అందించిన జాన్ విలియమ్స్ ఈ సినిమాకు కూడా ఆకర్షణీయమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు. చిత్రకథ ఒక సాహసోపేతమైన రిపోర్టర్ కథ. టిన్ టిన్ అనే ఒక చిన్న రిపోర్టర్ ఒక చోట అందంగా కనబడ్డ ఒక పాత ఓడ నమూనాను కొంటాడు. ఆ బొమ్మ లో ఏదో రహస్యం దాగి ఉందని అది తన ఇంటి నుండి దొంగలించబడ్డాకా అనుమానం వస్తుంది టిన్ టిన్ కి. దానిని వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అలాంటివే మరో రెండు ఓడ నమూనాలు ఉన్నాయనీ, వాటి వెనుక ఎన్నో ఏళ్ళ క్రితం సముద్రం పాలైన ఒక గుప్తనిధి తాలూకూ వివరాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది.


టిన్ టిన్ చివరికి ఆ రహస్యాన్ని చేదింఛగలుగుతాడా? నిధి అతనికి దొరుకుతుందా? అన్నది మిగిలిన కథ. కథలో మరో ముఖ్య పాత్ర టిన్ టిన్ పెంపుడు కుక్క "స్నోయీ"ది. టెక్నికల్ గా చాలా బాగుంది. సినిమా నాకయితే బాగా నచ్చేసింది.

పిల్లలు చాలా బాగా ఆనందిస్తారని అనిపించింది. కార్టూన్లూ, యేనిమేటెడ్ ఫిల్మ్స్ ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది.


స్పీల్ బర్గ్ ప్రేమికులెవరైనా ఉంటే వారికి మరో ఆనందకరమైన వార్త ఏంటంటే తను దర్శకత్వం వహించిన "War Horse" అనే సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోందొహోయ్ !!!

Saturday, November 19, 2011

బాపు-రమణల మ్యాజిక్ "శ్రీ రామరాజ్యం"


బాపూగారు తమ "శ్రీ రామరాజ్యం"తో నయనానందం, శ్రవణానందం, రసానందం మూడూ కలిగించారు. ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. తన సినిమా ద్వారా ప్రేక్షకుడికి నయనానందాన్ని అందించటం బాపూగారి సినిమాల్లోని ప్రత్యేకత. ఆ ఆనందానికి రమణ గారి సంభాషణలు శ్రవణానందాన్ని కూడా జోడిస్తాయి. ఈ రెండు కలిసి ప్రేక్షకుడికి శాశ్వత రసానందాన్ని మిగులుస్తాయి. అదే బాపు-రమణల మ్యాజిక్. ఆ మ్యాజిక్ మళ్ళీ జరిగింది. చాలా ఏళ్ల తరువాత. నెట్ బుకింగ్ కుదరక, చాలా రోజుల తర్వాత నిన్న గంట ముందు వెళ్ళి నిలబడి కౌంటర్లో మొదటి టికెట్టు నేనే కొన్నా. కష్టానికి ఫలితం దక్కింది. శాశ్వత రసానందం మిగిలింది.

చిన్నప్పుడు ఎన్నిసార్లో బాపూ బొమ్మలతో ఉన్న బొమ్మల రామాయణం పుస్తకాన్ని తిరగేస్తూ, ఆ బొమ్మలను చూస్తూ ఉండేవాళ్ళం. వాటిల్లో కొన్ని బొమ్మలు మా తమ్ముడు వేసాడు కూడా. ఆ బొమ్మలను టైటిల్స్ లో మరోసారి మళ్ళీ చూసి బాల్య స్మృతుల్లోకి వెళ్పోయా ప్రారంభం లోనే. ఎర్రటి కేన్వాస్ మీద తోరణంలో కదులుతున్న పచ్చటి మామిడిఆకులు చిత్రమైన ఆనందాన్ని కలిగించాయి. మళ్ళీ ఓ "సంపూర్ణ రామాయణం", ఓ "సీతా కల్యాణం", ఓ "శ్రీరమాంజనేయ యుద్దమో" చూస్తున్న భావన. ఇన్నాళ్ళకు మళ్ళీ తెరపై పూర్తినిడివి రంగుల చిత్రాన్ని గీసాడే బాపూ అని మనసు మురిసిపోయింది. రాముడి ద్వారా, వాల్మీకి ద్వారా చెప్పించిన కొన్ని రమణ గారి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ కొట్టినట్లు, చికాకుగాను అనిపించలేదు. టకా టకా సీన్ పై సీన్ వెళ్పోయింది. నటీనటులందరూ తమ వంతు నటనా బాధ్యతను సమర్ధవంతంగా పోషించేసారు. డైరెక్టర్ ప్రతిభ ప్రతి ఫ్రేం లోనూ కనబడింది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇదే టెక్నాలజీ అందుబాటులో ఉండిఉంటే స్పీల్ బర్గ్ సినిమాలను మించిన చిత్రాలను మన విఠలాచార్య వంటివారు అందించేవారు కదా అనిపించింది.

ఇళయరాజా కూడా చాన్నాళ్ళకు ఏకాగ్రతతో పనిచేసినట్లు నేపధ్య సంగీతం తెలుపకనే తెలిపింది. ముఖ్యమైన సన్నివేశాల వెనకాల వచ్చిన వయోలిన్స్ మొదలైనవి ఇళయరాజా మార్క్ సంగీతాన్ని అద్భుతంగా వినిపించాయి. పాటలు కూడా విడిగా వినేకన్నా సినిమాలో చూస్తూంటే ఇంకా బాగున్నాయి అనిపించాయి. "జగదానంద", "ఎవడున్నాడీ లోకంలో", "రామ రామ రామ అనే రాజమందిరం" మూడు పాటలు నాకు బాగా నచ్చాయి. బాలు గళం చాన్నాళ్ళకు ఖంగుమంది.బాపూగారు ముందే చిత్రం గీసేసి, సన్నివేశాన్ని అలానే చిత్రీకరిస్తారని వినికిడి. ప్రతీ సన్నివేశానికీ బాపూ గారి ఫ్రేమింగ్, రాజు గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. కొని దాచుకున్న పౌరాణిక చిత్రాల సీడీలకు ఈ చిత్రాన్ని కూడా జోడించాలి అని బలంగా అనిపించేలా ఉంది చిత్రం.

బాలకృష్ణ, నయనతార, శ్రీకాంత్ మొదలైన నటులను వారి పాత్రలలో చూసి ప్రేక్షకుడి మనసు తృప్తి పడిందంటే అది ఆ యా నటుల కృషి తో పాటుగా, వారితో అలా నటింపజేసిన ఘనత దర్శకుడిదే. సునీతా డబ్బింగ్ వాయిస్ సీత పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఏ.ఎన్.ఆర్ నటన చిత్రానికి అదనపు ఆకర్షణ. వశిష్ఠులవారిగా నటించిన బాలయ్యగారు డైలాగులు చెప్పేందుకు కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించగా, ఇంత వయసులో కూడా అంత స్పష్టంగా, పూర్వపు ధాటితో ఆయన డైలాగు చెప్పటం ఆశ్చర్యపరిచింది. నాగేశ్వరరావు సినీప్రస్థానంలో మరో మైలు రాయిగా ఈ వాల్మీకి పాత్ర నిలిచిపోతుంది. హనుమంతుడి పాత్రధారి నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోయపిల్లవాడు బాలరాజుగా చేసిన పిల్లవాడు నాకు లవకుశుల కన్నా బాగా నచ్చేసాడు. లవకుశలుగా వేసిన పిల్లలిద్దరూ కాస్తంత బొద్దుగా ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ నటనలో ఎక్కడా ఓవరేక్షన్ వగైరాలు లేకుండా బహుచక్కగా చేసారు. పాటలు పాడేప్పుడు కూడా లిప్ సింక్ బాగా కుదిరింది.

అయితే అన్నీ ప్రశంసలేనా? లోపాలే లేవా సినిమాలో అంటే ఉన్నాయి. నటనా పరంగా ఒకటి రెండు చెప్పలంటే నయనతార ఎంత వంకపెట్టలేనటువంటి అత్యుత్తమ నటన కనబరిచినా "సీతాదేవి" వంటి శక్తివంతమైన పౌరాణిక పాత్రలో అంజలీదేవిలో, చంద్రకళనో, జయప్రదనో, బీ.సరోజాదేవినో మరచి నయనతార ను కూర్చోబెట్టలేకపోయాను నేను. బహుశా ఆమె బాపు మార్క్ పెద్ద కళ్ళ హీరోయిన్ కాకపోవటం కారణం కావచ్చు. ఇక వీపుపై ఎన్.టి.ఆర్ లాగనే పుట్టుమచ్చను పెట్టుకున్నా కూడా రాముడన్న, కృష్ణుడన్నా ఎన్.టి.ఆర్ మాత్రమేనన్న నానుడిని అధిగమించటం మరెవరివల్లా కాదేమో అనిపించింది. ఎన్.టి.ఆర్ లోని గాంభీర్యం కూడా బాలకృష్ణ నటనలో లోపించిందేమో అని కూడా అనిపించింది. అయినా చంద్రుడి అందాన్ని చూస్తామే కానీ మచ్చలు వెతుకుతామా మరి? ఇదీ అంతే. రా-వన్, రోబో లాంటి సినిమాలూ మాత్రమే పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా మారిన నేటి సూపర్ ఫాస్ట్ శతాబ్దపు రోజుల్లో అత్యుత్తమ విలువలతో ఇటువంటి పౌరాణిక చిత్రం రావటమే అదృష్టం నా దృష్టిలో.




కాకపోతే ఈ విజయానందాన్ని అనుభూతి చెందటానికీ, పంచుకోవటానికీ "రమణ" గారు బాపుగారితో, మనతో లేరన్నదొక్కటే విచారకరమైన విషయం. మొత్తమ్మీద రమణగారికి అంకితమిచ్చిన ఈ చిత్రం బాపురమణల కీర్తిప్రతిష్ఠలకు మరో కలికి తురాయి.







Thursday, September 15, 2011

break at 400... !!


ఐదు బ్లాగులు..
వంద మంది నాతో నడిచేవాళ్ళు..
నాలుగొందలు టపాలు..
బోలెడు ప్రశంసలు..
మూడే మూడు ఘాటు విమర్శలు..
సులువుగా వేళ్ళపై లెఖ్ఖపెట్టుకునేంత తక్కువ పరిచయాలు..
ఒక మనసు చివుక్కుమనే బాధ..
ఇవన్నీ..
నా రెండున్నరేళ్ళ బ్లాగ్ ప్రయాణంలో మజిలీలు.


తోడొచ్చినవాళ్లకు కృతజ్ఞతలు
ప్రోత్సహించినవారికి వందనాలు
మిత్రులైనవారికి ధన్యవాదాలు
నొచ్చుకున్నవారికి క్షమాపణలు

నేనీ ఈ ఐదు బ్లాగ్లులూ నిర్వహించగలగటానికి అనుమతినిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, అప్పుడప్పుడు మందలింపులతోనే ఎంతో ప్రోత్సాహాన్నీ అందించిన మావారికి బ్లాగ్ ముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తన ప్రోత్సాహం లేనిదే నేను వంద టపాలు కూడా పూర్తి చేయకుండానే బ్లాగ్ మూసేసేదాన్నేమో.

ఎప్పుడూ అందరూ ఆనందంగా, క్షేమంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. జీవితంలోనూ, బ్లాగుల్లోనూ కూడా నేను ఎవ్వరి చెడునూ ఎప్పుడూ కోరలేదు. తోచింది రాసాను. అభిరుచులను పంచుకోవటానికీ, జీవితాల్లోని బరువునూ, భారాన్ని తేలిక చెసుకోవటానికి బ్లాగు ఒక చక్కని వేదిక. దీనిని సద్వినియోగ పరుచుకోవాలే తప్ప వాగ్వివాదాల్లోకి దిగి మనసులను మరింత భారం చేసుకోకూడదు అన్నదే నా అభిప్రాయం. అందమైన ప్రపంచంలో జీవించే అవకాశం దొరికినందుకు, మనిషి గా రకరకాల అనుబంధాలను ఆస్వాదించే అదృష్టం దొరికినందుకు ఆనందిస్తూ గడపాలి తప్ప చేదునీ, చీకటినీ, ద్వేషాన్నీ తల్చుకుని కాదు అన్నది నా జీవన విధానం.

ఇది నా బ్లాగ్ ఫాలోవర్స్ కోసం :
ఇలా బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాలనూ, అభిరుచులనూ పంచుకునే అవకాశం దొరికినందుకు ఎప్పటికీ ఆనందమే. అయితే మాకు ఈ తెలుగు ప్రాంతం నుంచి తరలి వెళ్ళే సమయం దగ్గర పడింది. మరో కొత్త రాష్ట్రానికీ, కొత్త మనుషుల మధ్యకూ. అందువల్ల ఈ బ్లాగ్ ప్రయాణానికి కొన్ని నెలలు విరామం ఇవ్వక తప్పటం లేదు. అన్నీ సర్దుబాటు అయ్యాకా మళ్ళీ బ్లాగ్ జీవన స్రవంతిలోకి రావాలనే నా కోరిక. బ్లాగుల్లో, బజ్జుల్లో కూడా కనబడకపోతే నన్ను మర్చిపోకండేం !!

.
అందరికీ శుభాభినందనలతో..
మీ
తృష్ణ.




Wednesday, September 14, 2011

రెండు CDలు

ఏ సినిమానో, నటీనటులెవరో తెలియకపోయినా పదే పదే వినటం వల్ల కొన్ని పాటలు అలా గుర్తుండిపోతాయి. ఇటీవల కొన్న రెండు సీడీలు వింటుంటే చిన్నప్పుడు రేడియోలో పదే పదే విన్న ఆ పాటలన్నీ గుర్తుకు వచ్చి భలేగా ఉంది. ఒక కేసెట్ షాప్ లో నాకు ఇద్దరు సంగీతదర్శకుల పాటల సీడిలూ దొరికాయి. రమేష్ నాయుడు గారు, సత్యం గారూ...ఇద్దరివీ. 60 - 80 ల దాకా గుర్తుంచుకోదగ్గ తెలుగు సినిమా పాటలనందించిన మేటి సంగీత దర్శకులలో ఈ ఇద్దరికీ వారి వారి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి.




మొదటిదైన " మెలొడీస్ ఆఫ్ రమేష్ నాయుడు" పాటల సీడీలో గతంలో రమేష్ నాయుడు టపాలో నే రాసిన పాటల లిస్ట్ లోవి దాదాపు చాలా ఉన్నాయి. అందుకని ఆ సీడి లోని పాటల లిస్ట్ రాయటం లేదు.


ఇక రెండవ సీడీ "సత్యం" గారి పాటలది. సీడి లోని ఏభై పాటలూ నాకు తెలియవు గానీ చాలా వరకూ విన్నవే. వాటిలో నాకు ఇష్టమైనవి కొన్ని ఇక్కడ రాస్తున్నా...


నీ కౌగిలిలో _ కార్తీక దీపం
ఏ రాగమో _ అమర దీపం
ఓ బంగరు రంగుల చిలకా _ తోటరాముడు
కలిసే కళ్లలోన _ నోము
ఇది తీయని వెన్నెల రేయి _ ప్రేమలేఖలు
కురిసింది వాన _ బుల్లెమ్మ బుల్లోడు
ఏ దివిలో విరిసిన _ కన్నెవయసు
సిరిమల్లె సొగసు _ పుట్టినిల్లు మెట్టినిల్లు
ఆకాశం దించాలా _ భక్త కన్నప్ప
రాధకు నీవేరా ప్రాణం _ తులాభారం
ఇది మౌన గీతం _ పాలూ నీళ్ళూ
పూచే పూల లోన _ గీత
స్నేహ బంధమూ _ స్నేహ బంధం
అమ్మా చూడాలి _ పాపం పసివాడు

"పాపం పసివాడు” లోని పాట చిన్నప్పుడు రేడియోలో వస్తుంటే పాడేసుకోవటం బాగా గుర్తు నాకు. అప్పట్లో హిట్స్ అయిన పాటలు వింటుంటే ఒక రకమైన ఉత్సాహం అనిపించింది. నేరుగా ఈ పాటలు తెలియకపోయినా రేడియో స్మృతులలో ఓలలాడాలంటే ఈ సీడీలు కొనేసుకోవటమే. అన్నీ గొప్ప పాటలు కాకపోయినా కొన్ని పాటల కోసమైతే కొనుక్కుని తీరాలి అనిపించింది నాకైతే.

Tuesday, September 13, 2011

ఆత్రేయ గారి "కనబడని చెయ్యేదో "



కమ్మని పాటలనీ, జీవిత సత్యాలనూ సులువైన మాటల్లో సినీగేయాల రూపంలో మనకు అందించిన మన ప్రియతమ సినీ గేయరచయిత ఆత్రేయ గారి పాటలతో ఛానల్స్ అన్నీ మారుమ్రోగుతున్నాయి. నాక్కూడా కొన్ని పాటలు గుర్తుచేసుకుందాం అనిపించింది. కోకొల్లలుగా ఉన్న వారి పాటల్లో ఎన్నని గుర్తుచేసుకునేది..?? మనసు పాటలు అందరికీ తెలిసినవే....
మనసు లేని బ్రతుకొక నరకం(సెక్రటరీ)
మనసు గతి ఇంతే(ప్రేమ్ నగర్)
మానూ మాకును కాను(మూగమనసులు)
ముద్ద బంతి పువ్వులో(మూగమనసులు)
మౌనమే నీ భాష(గుప్పెడు మనసు)
మనసొక మధుకలశం(నీరాజనం)
మొదలైనవన్నీ అద్భుతమైన పాటలే. ఈ పాటల్లోని ఏ వాక్యాలను....కోట్ చేసినా మరొక పాటను అవమానించినట్లే.

ఇక నాకు బాగా నచ్చే మరికొన్ని పాటల్లో "ఆడాళ్ళూ మీకు జోహార్లు" అనే సినిమాలో "ఆడాళ్ళూ మీకు జోహార్లు..ఓపిక ఒద్దిక మీ పేర్లు; మీరు ఒకరి కన్నా ఒకరు గొప్పోళ్ళు.." అనే పాట ఉంది. పాట చాలా బావుంటుంది. కొద్దిపాటి సన్నివేశాలు మినహా సినిమా కూడా బావుంటుంది. ఇది కాక అభినందన, మూగ మనసులు, మౌనగీతం, నీరాజనం, ఇది కథ కాదు, ఆకలిరాజ్యం, మరోచరిత్ర మొదలైన సినిమాల్లో ఆత్రేయ గారు రాసిన పాటలు అన్నీ ఈనాటికీ మనం వింటూనే ఉంటాం. "కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదానా..". ఇది శ్రీశ్రీ రాసారని చాలామంది అపోహపడేవారుట అప్పటి రోజుల్లో. ఇంకా చిరంజీవి "ఆరాధన" సినిమాలో "అరె ఏమైందీ" , "తీగెనై మల్లెలు పూసిన వేళ" రెండూ నాకు భలే ఇష్టం.

నాకు బాగా నచ్చే పాటలు మరికొన్ని..
* నీవు లేక వీణ( డాక్టర్ చక్రవర్తి)
* ఆనాటి ఆ స్నేహమానందగీతం (అనుబంధం)
* ఆకాశం ఏనాటిదో(నిరీక్షణ)
* ప్రియతమా నా హృదయమా(ప్రేమ)
* రేపంటి రూపం కంటి(మంచిచెడు)
* దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి(అంతులేని కథ)
* ఈ కోవెల నీకై వెలిసింది(అండమాన్ అమ్మాయి)
* జాబిల్లి కోసం ఆకాశమల్లే(మంచి మనసులు)
* కలువకు చంద్రుడు(చిల్లర దేవుళ్ళు)
* కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే(కోరికలే గుర్రాలైతే)
* లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు(కంచుకోట)
* నాలుగు కళ్ళు రెండైనాయి(ఆరాధన)
* నీ సుఖమే నే కోరుకున్న(మురళీకృష్ణ)
* నేనొక ప్రేమ పిపాసిని(ఇంద్రధనుస్సు)
* పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో(కోకిలమ్మ)
* వేళ చూడ వెన్నెలాయె(నాటకాల రాయుడు)


ఇవన్నీ ఒక ఎత్తైతే, 'తాశీల్దారు గారి అమ్మాయి(1971)' సినిమాలో కె.బి.కె.మోహన్ రాజు గారు పాడిన "కనబడని చెయ్యేదో " పాట కూడా సాహిత్యపరంగా చాలా బావుంటుంది. కె.వి. మహాదేవన్ సంగీతం చేసిన ఆ పాటను, మరికొన్ని మోహన్ రాజు గారి పాటలను క్రింద ఈ
లింక్ లో వినవచ్చు:

http://kbkmohanraju.com/songslist.asp?tab=Janaranjani1977#

సాహిత్యం:
కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం,కీలుబొమ్మలం
నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
ఆ కాళ్ళు లాగి నీ చేత తైతక్కలు ఆడిస్తుంది
((కనపడని...))

కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ ఉంటూనే ఆడుతాము నువ్వూ నేనూ బూటకం
తలచింది జరిగిందంటే నీతెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు
మననూ మనవాళ్ళనీ మాటల్లో అంటావు
నేనూ నేనన్న అహంతో తెంచుకుని పోతావు
((కనపడని...))

కర్మను నమ్మిన్వాళ్లెవరూ కలిమిని స్థిరమనుకోరూ
కళ్ళు మూసుకోరు
మనసు తెలిసినవాళ్ళేవరూ మమత చంపుకోరు
మనిషినొదులుకోరు
ఉన్నదాని విలువ తెలియనివారు పోగొట్టుకుని విలపిస్తారు
((కనపడని...))

మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది
కావాలని నిప్పుని తాకితే చెయ్యి కాలక మానదు
కాలినందుకు కర్మ అంటే గాయమేమో మానదు
((కనపడని...))

Friday, September 9, 2011

కొన్ని సమయాలలో కొందరు మనుషులు


తమిళ సాహిత్యాభివృధ్ధికి తమ వంతు కృషికి గానూ ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారాలను అందుకున్న ఇద్దరు తమిళ రచయితలు అఖిలన్ గారూ, జయకాంతన్ గారూ. అఖిలన్ గారి గురించీ, ఆయన రాసిన "చిత్తిరప్పావై"(చిత్రసుందరి) , "స్నేహితి"(మనస్విని) నవలానువాదాల గురించీ గతంలో రెండు టపాలు రాసాను. ఆయన లానే ఎన్నో నవలలు, కథలూ రాసి మరిన్ని పురస్కార సత్కారాలను పొందిన మరో ప్రముఖ తమిళ రచయిత శ్రీ డి.జయకాంతన్ గారు. వారి నవల "Sila nerangalil Sila manithargal" 1972లో సాహిత్య అకాడమీ అవార్డ్ ను అందుకుంది. ఈ నవలను ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ గారు "కొన్ని సమయాలలో కొందరు మనుషులు" పేరున తెలుగులోకి అనువదించారు. ఇది నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ముద్రణ.




ఈ నవల ఆధారంగా తీసిన తమిళ సినిమా పేరు కూడా "Sila nerangalil Sila manithargal" యే. చిత్రానికి సంభాషణలు కూడా జయకాంతన్ గారే రాసినట్లున్నారు. నటి లక్ష్మికి ఈ సినిమా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఆవిడ కెరీర్ లోని ఉత్తమ పాత్రల్లో ఈ చిత్రంలోని పాత్ర ఒకటి అనటం అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన నటన కనబరిచింది ఆమె ఈ చిత్రంలో. ఎమ్మెస్ విశ్వనాథన్ అందించిన సంగీతం కూడా మన్ననలు పొందింది. మనిషిలోని సున్నితమైన భావాలను తట్టి లేపి, మృగం లాంటి మనిషిలో కూడా పరివర్తన తేగల అద్భుతశక్తి, ఉత్తమ సంస్కారవంతమైన గుణాన్ని కూడా అధోగతి పాలు చేసే దుష్టశక్తి...రెండూ ప్రేమకు ఉన్నాయని ఈ నవల కథనం తెలుపుతుంది.

డభ్భైల కాలంలో సమాజపు కట్టుబాట్లకు ఎదురుతిరిగే బలమైన స్త్రీ పాత్రను సృష్టించటం సులువైన విషయమేమీ కాదు. అటువంటి పాత్రనే కాక, మనుషుల చిత్తప్రవృత్తులు సందర్భానుసారంగా ఎలా మారిపోతాయో తెలిపే కథ ఇది. టైటిల్ జస్టిఫికేషన్ ఇక్కడ జరిగిపోతుంది. నవలలో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది పాత్రల మానసిక విశ్లేషణ. ఏ పాత్రనూ తక్కువ చేయకుండా, కథానాయిక పాత్ర ఎక్కువ భాగ మున్నా సరే, మిగిలిన పాత్రలను తక్కువ చేయకుండా వారి వారి కోణాల్లోంచి వారిని సమర్ధించుకుంటూ చేసిన జయచంద్రన్ గారి రచనాశైలి నిజంగా మెచ్చదగ్గది. మాలతీ చందూర్ గారి అనువాదం కూడా అందుకు అనుకూలంగా చక్కగా కుదిరింది.

కథ లోని వస్తే, కథానాయిక గంగ కాలేజీ విద్యార్ధినిగా ఉన్నప్పుడు ఒకానొక వర్షాకాలపు సాయంత్రం.. తన కారులోలిఫ్ట్ ఇచ్చిన ఒక విలాసవంతుడి చేతిలో శీలాన్ని కోల్పోతుంది. అన్నగారితో గెంటివేయబడిన గంగను మేనమామ తీసుకువెళ్ళి చదివించి, ఉద్యోగస్థురాలయ్యేదాకా సహాయపడతాడు. తన కాళ్ళపై తాను నిలబడి, ఉత్తమ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న గంగకు తల్లి తోడుగా నిలుస్తుంది . కొన్ని విచిత్ర పరిస్థితుల్లో గంగ తన పతనానికి కారణమైన వ్యక్తిని వెతికి, అతనిని కలుస్తుంది. అనుకోని విధంగా వారిద్దరి మధ్యనా ప్రగాఢానురాగం చిగురిస్తుంది. పాఠకులను వారిద్దరి నిష్కల్మషమైన అనురాగానికి ఆర్తులను చేయటం రచయిత గొప్పదనం. అయితే ఆ అనుకోని పరిచయం వారిద్దరి జీవితాలనూ ఏ దరికి చేర్చింది అన్నది మిగిలిన కథ.

మూడొంతులు కథ అయ్యాకా నవల మరింత ఆసక్తికరంగా మారుతుంది. కానీ ముగింపు మాత్రం నాకు వేదనను మిగిల్చింది. కొన్ని కథలు ఇంతే అనుకోవాలో...మరి ఈ నవల పేరును సార్థకం చేసుకోవటం మాత్రమే కథలోని అంతరార్థమో తెలీలేదు. ప్రతి కథకూ సుఖాంతమే ఉండాలని నియమమేమీ లేదు కానీ గంగ జీవితవిధానాన్ని దిగజార్చేయటమెందుకో బోధపడలేదు. అయినా సరే పుస్తకం మూసిన తరువాత రచయితపై కోపం రాదు. కథలోని పాత్రల స్వభావాలను, అంతరంగాలనూ సవిస్తరంగా ఆయన చిత్రించిన విధానం గుర్తుండిపోతుంది.


Wednesday, September 7, 2011

అనుబంధం



మేం ఇప్పుడున్న ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో మా పక్కన ఒక అపార్ట్ మెంట్ కడుతున్నారు. నాలుగునెలల క్రితం అది పూర్తవటం జనాలు అద్దెకు రావటం జరిగింది. వేసం శెలవుల్లో మా పిల్లని సంగీతంలో చేర్చాను. నాతో పాటే ఆ అపార్ట్మెంట్లో ఒకావిడ కూడా వాళ్ల అబ్బాయిని తీసుకువచ్చి దింపేవారు. ఆవిడను ఎక్కడో చూసినట్లు, బాగా తెలిసినట్లు అనిపించేది.



నెమ్మదిగా మాటలు కలిసాకా పాపని మాఇంటికి పంపండి బాబుతో ఆడుకుంటుంది అనడిగేవారు. అప్పటిదాకా ఒక్కర్తే ఉండటం వల్ల మా అమ్మాయి కూడా వెళ్తానని పేచీ పెట్టేది.నాకేమో కొత్తవాళ్ళింటికి పంపటం ఇష్టం లేదు. ఏదో ఒకటి చెప్పి కొన్నాళ్ళు దాటేసాను. సంగీతం క్లాసులో వాళ్ళ బాబుతో బాగా స్నేహం కలిసాకా మాపిల్ల ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి ఆడుకుంటానని బాగా మారాం చేస్తే ఇక తప్పక తీసుకెళ్ళాను. కాసేపు మాటలయ్యాకా చుట్టాలను గురించిన మాటలు వచ్చాయి. నువ్వు ఫలానావాళ్ల అమ్మాయివా...నువ్వా? అంది ఆశ్చర్యంగా? వాళ్ళాయన కూడా ఫలానానా ? అని ఆశ్చర్యపోయారు. తీరా తెలిసినదేమిటంటే మా అమ్మకు పెద్దమ్మ మనవరాలు ఈవిడ. నాకు "అక్క" వరస అవుతుంది. అదీగాక వాళ్ళన్నయ్య మా మేనమామకు అల్లుడు.





కాకినాడలో అక్కావాళ్ల అమ్మనాన్నలు ఉంటారు. మేం చిన్నప్పుడు కాకినాడ వెళ్ళినప్పుడల్లా వాళ్ళింటికి పేరంటాలకు వెళ్ళేవాళ్లం. అలా వాళ్ళు బాగా తెలుసు నాకు. అమ్మావాళ్ల పెద్దనాన్నగారు (అంటే అక్కా వాళ్ల తాతగారు) ఒకప్పుడు కాకినాడలో పేరుమోసిన ఆయుర్వేద వైద్యులు. చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళ నుంచి వైద్యానికి మనుషులు వచ్చేవారుట. ఇక వాళ్లయనేమో మా నాన్నగారి అమ్మమ్మగారి వైపు చుట్టాలు. బంధుత్వాలు దూరమే అయినా రాకపోకలుండటం వల్ల బాగా పరిచయస్తులమే.




అదివరకూ వాళ్ళు చాలా దూరంలో ఉండేవారు. అందువల్ల ఇటువైపు వస్తారనీ, వాళ్ళు వీళ్ళేనేమో అనీ నాకు తోచలేదు. చూసి చాలా కాలం అవటం వల్ల గుర్తుపట్టలేదు ఒకర్నొకరం. కానీ ఆవిడను చూసినప్పుడల్లా నాకు గుర్తు వచ్చినది మాత్రం ఈవిడే. (అంటే ఫలానా అక్క లాగా ఉందీవిడ అనుకునేదాన్ని). అక్క కు కూడా నన్ను చూస్తే తెలిసినట్లు, పిల్లను చూస్తే అసలు వదలాలని అనిపించేది కాదుట. బంధుత్వాలు తెలిసాకా ఓహో ఇదే కాబోలు రక్త సంబంధం అంటే...అని డైలాగులు చెప్పేసుకున్నాం. ఇక పిల్లలిద్దరు బాగా కలిసిపోయారు. అక్కావాళ్ల బాబు పేరు "కృష్ణ". మా పాపకన్నా ఓ ఏడు చిన్న. వాడు 1st క్లాస్, ఇది 2nd క్లాస్. ’అదికాదే.. ఒసేయ్" అని వాడంటే, ’రార" అని ఇది చెప్పే కబుర్లు వినితీరాల్సిందే. ఇద్దరికీ తోడు లేని లోటు తీరింది అని మేం కూడా ముచ్చటపడిపోయాం. మ్యూజిక్ క్లాస్కి ఇద్దరూ కలిసివెళ్ళి కలిసి రావాల్సిందే. సైకిళ్ళ మీద ఇద్దరికీ పోటీ. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని.


మేమెవరం ఊరు వెళ్ళినా ఒకరు వచ్చేదాకా ఒకరు కాలుగాలిన పిల్లిలా తిరుగుతారు ఇద్దరూ. పొద్దున్నొకసారి, స్కూలు నుంచి వచ్చాకా ఒకసారిఊకర్నొకరు చూసుకోవాల్సిందే. ఇక వాళ్ళ స్నేహం ఎంత పెనవేసుకుపోయిందంటే రోజూ దెబ్బలాడుకునేంత. ఫోవే ఫో..అంటాడు వాడు. ఇదేమో నాలిక బయట పెట్టి వెక్కిరిస్తుంది. పెద్దవాళ్లం దగ్గర లేకపోతే కొట్టేసుకుంటారు కూడా. మళ్ళీ అంతలోనే కలిసిపోయి కబుర్లాడేసుకుంటారు. ’వీళ్ళ వేవ్ లెంత్ బాగా కలిసిందే.." అంటుంది అక్క. ఫెండ్షిప్ బాండ్ కట్టుకున్నారు. రాఖీ కి బుల్లికృష్ణుడి బొమ్మ ఉన్న రాఖీ దొరికితే కట్టించాను. మొన్న గణేశుడి పందిట్లో వాళ్ళ టీచర్ పిల్లలందరితో శ్లోకాలు అవీ పాడించారు. అప్పుడు చూడాలి వీళ్ళిద్దరి అల్లరినీ..!!



ఒకే కుర్చీలో..








భగవద్గీత శ్లోకాలు చెప్తున్న కృష్ణ







స్టేజ్ మీద పాడుతూండగా


విడదియలేనంతగా అల్లుకుపోయిన వాళ్ల అనుబంధాన్ని చూస్తే కళ్ళు చెమరుస్తాయి. మరో తోడుని పిల్లకు అందించలేకపోయానన్న బాధ మనసుని మెలిపెడుతుంది. భగవంతుడి లీలలు అర్ధం కానివి కదా...వీళ్ళిద్దరూ విడిపోవాల్సిన సమయాన్ని కూడా దగ్గర పడేస్తున్నాడు...! ఇకపై దూరాల్లో ఉన్నా ఎప్పటికీ వీళ్ళ అనుబంధం ఇలానే నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను.

Monday, September 5, 2011

"Abraham Lincoln's Letter to his Son's Teacher "


టీచర్స్ డే సందర్భంగా నాకొక ఫ్రెండ్ పంపిన మైల్ ఇది. బాగుందని టపాలో పెడుతున్నాను...గురువులందరికీ వందనాలు.

"Abraham Lincoln's Letter to his Son's Teacher "

He will have to learn, I know,
that all men are not just,
all men are not true.
But teach him also that
for every scoundrel there is a hero;
that for every selfish Politician,
there is a dedicated leader...
Teach him for every enemy there is a
friend,

Steer him away from envy,
if you can,
teach him the secret of
quiet laughter.

Let him learn early that
the bullies are the easiest to lick... Teach him, if you can,
the wonder of books...
But also give him quiet time
to ponder the eternal mystery of birds in the sky,
bees in the sun,
and the flowers on a green hillside.

In the school teach him
it is far honourable to fail
than to cheat...
Teach him to have faith
in his own ideas,
even if everyone tells him
they are wrong...
Teach him to be gentle
with gentle people,
and tough with the tough.

Try to give my son
the strength not to follow the crowd
when everyone is getting on the band wagon...
Teach him to listen to all men...
but teach him also to filter
all he hears on a screen of truth,
and take only the good
that comes through.

Teach him if you can,
how to laugh when he is sad...
Teach him there is no shame in tears,
Teach him to scoff at cynics
and to beware of too much sweetness...
Teach him to sell his brawn
and brain to the highest bidders
but never to put a price-tag
on his heart and soul.

Teach him to close his ears
to a howling mob
and to stand and fight
if he thinks he's right.
Treat him gently,
but do not cuddle him,
because only the test
of fire makes fine steel.

Let him have the courage
to be impatient...
let him have the patience to be brave.
Teach him always
to have sublime faith in himself,
because then he will have
sublime faith in mankind.

This is a big order,
but see what you can do...
He is such a fine fellow,
my son!


Friday, September 2, 2011

Versatile కార్తీక్


ఒకానొకరోజున వాన సినిమాలోని "ఎదుటనిలిచింది చూడు.." పాట వింటూంటే ఎవరు పాడారా అని సందేహం వచ్చింది. నెట్లో వెతికితే "కార్తీక్" పాడినదని తెలిసింది. ఇక పరిశోధన మొదలుపెడితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ప్రస్తుతం ముఫ్ఫై ఏళ్ళున్న ఈ తమిళ గాయకుడు ఇప్పటికే ఐదు భాషల్లోనూ(తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ) కొన్ని వందల పాటలు పాడాడు. అన్ని పాటల జాబితాలూ వెతికితే చాలావరకూ అన్నీ హిట్ సంగ్సే. ఈ విజయపరంపర వెనుక ఉన్నది ఒకే రహస్యం... అతని గొంతులోని versatility.

చిన్నప్పటి నుంచే కర్ణాటక సంగీతంలో ప్రవేశం ఉండటం వల్లనేమో కార్తీక్ అన్నిరకాల పాటలూ చాలా సులువుగానే పాడేస్తాడు. సినిమా పాటల్లో కోరస్ లు పాడుతున్న కార్తీక్ ను అతని దగ్గరి బంధువైన గాయకుడు శ్రీనివాస్ రెహ్మాన్ కు పరిచయం చేసాడు. తన అభిమాన సంగీతదర్శకుడైన రెహ్మాన్ కు కార్తిక్ చాలా పాటలనే పాడాడు. వయసు చిన్నదయినా గొంతులోని గాంభీర్యం, హెచ్చు స్థాయిలో పాడగలగటం అతని ప్లస్ పాయింట్స్. అందువల్లే అతను బాలీవుడ్ లో సైతం తనదైన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. పిన్న వయసులోనే బెస్ట్ మేల్ ప్లేబాక్ సింగర్ గా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఒక నంది, మరెన్నో ఇతర అవార్డులు అతని సొంతమయ్యాయి. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు తెలుగు పాటలకు(హేపీడేస్ లోని "అరెరే అరెరే", కొత్త బంగారు లోకం లోని "నిజంగా నేనేనా") రావటం విశేషం. ఇళయరాజా, రెహ్మాన్, యువన్ శంకర్ రాజా, హేరిస్ జైరాజ్, మణిశర్మ, దేవీశ్రీప్రసాద్ మొదలైన మేటి సంగీత దర్శకుల దగ్గర మళ్ళీ మళ్ళీ పాడే అవకాశాలు వచ్చాయి కార్తీక్ కు.

"పదహారూ ప్రాయంలో నాకొక గాళ్ఫ్రెండ్ కావాలి" అనే పాటతో పాటూ "బాయ్స్" సినిమాలో మరో రెండు పాటలు పాడిన తర్వాత కార్తీక్ కు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోయింది. తెలుగు లో ’అరెరే అరెరే”, ’ఓ మై ఫ్రెండ్ ’ , నిజంగా నేనేనా’, 'ఎదుట నిలిచింది చూడు ', హిందీ గజనీ సినిమాలో ’బెహ్కా మై బెహ్కా, రావణ్ లో ’బెహనే దే’ , తమిళ్ లో (నాకు తెలిసీ) హస్లి ఫిస్లీ (సూర్యా s/o కృష్ణన్), ఉన్నాలే ఉన్నాలే (నీవల్లే నీవల్లే), ఒరు మాలై(గజిని) మొదలైనవి అతనికి మంచి పేరు తెచ్చిన పాటలు. తమిళ్ పాటలు ఇంకా మంచివి ఉండి ఉండచ్చు. నాకు అంతగా తెలీదు.

ఒక ప్రాంతపు గాయకుడు అదే ప్రాంతానికి పరిమితమవ్వకుండా మరెన్నో భాషల్లో పాడటం కొత్తేమీ కాదు కానీ పోటీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో బాలోవుడ్లో సైతం తనదంటూ ఒక చోటు ఏర్పరుచుకోవటం విశేషమే మరి. once upon a time in mumbai లో " iam in love ", Delhi-6 లో "Hey kala bandar", 13B లో "Bade se shehar mein ", saathiya లో "Chori pe Chori" (తెలుగు సఖి లో ’సెప్టెంబర్ మాసం” పాట), The legend of bhagat singh లో అద్భుతమైన డ్రం బీట్స్ తో పాటూ వచ్చే ఒక చిన్న వర్స్, Lahore లో కే.కేతొ పాటూ "ab ye kafila" మొదలైనవి కార్తీక్ పాడిన హిందీ పాటల్లో చెప్పుకోదగ్గవి.

తెలుగులో కూడా కార్తీక్ కు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇటీవలి చిత్రం "కందిరీగ" సినిమాలోని "చంపకమాలా.." కూడా బాగా పాడాడు. కార్తీక్ తెలుగు సినిమాల్లో పాడిన నాకు తెలిసిన పాటలు కొన్ని:

* నీవల్లే నీవల్లే టైటిల్ సాంగ్ (నీవల్లే నీవల్లే)
* అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యొ (ఇంద్ర)
*కోపమా నాపైనా (వర్షం)
నిలువద్దం నిను ఎపుడైనా (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
* మెరుపై సాగారా (స్టైల్)
* పిలిచినా రానంటావా(అతడు)
* హేపీ...టైటిల్ సాంగ్ (హేపీ)
* కలనైనా ఇలనైనా (చుక్కల్లో చంద్రుడు)
* చిలకమ్మ (గుడుంబా శంకర్)
* అడిగి అడగలేక (దేవదాసు)
* చూడద్దంటున్నా (పోకిరి)
* దేవదాసు కన్నా (మధుమాసం)
* నీతో ఉంటే (జోష్)
* గోరే గోగోరే (కిక్)
*ఏమంటావే (కుర్రడు)
*సరదాగా (ఓయ్)
* గెట్ రెడీ (రెడీ)
*ఓరోరి యోగి (యోగి)
*నా మనసుకి (ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే)
* అరెరే(హేపీ డేస్)
* ఓ మై ఫ్రెండ్(హేపీ డేస్)
* డిస్టర్బ్ చెయ్యకు (అతిధి)
* ఎదుట నిలిచింది చూడు (వాన)
*నిజంగా నేనేనా(కొత్తబంగారు లోకం)
* వింటున్నావా (ఏం మాయ చేసావే)
*ప్రేమా ప్రేమా (మరో చరిత్ర)
* రేలారే రేలారే (వరుడు)
* ఉసురై పోయెను (విలన్)
* చంపకమాలా (కందిరీగ)

ఎవరికైనా ఇంకా తెలిస్తే రాయండీ..! ఇలానే మరెన్నో శిఖరాలను ఈ యువగాయకుడు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.

బ్లాగ్మిత్రులు మధురవాణి గారు రాసిన పాటల లిస్ట్:180 - నీ మాటలో మౌనం నేనేనా!
ఆట - హొయ్ నా..
అనగనగా ఒక ధీరుడు - చందమామలా అందగాడిని
ఆవకాయ్ బిర్యాని - అదిగదిగో, నన్ను చూపగల అద్దం
ఆవారా - చుట్టేసేయ్ చుట్టేసేయ్
చందమామ - రేగుముల్లోలే
బృందావనం - నిజమేనా
దుబాయ్ శీను - once upon a టైం
గణేష్ - లైలా మజ్నూ, రాజా గణరాజా
గాయం -2 - రామ రాజ్యం (సీరియస్ పాట ఇది.. కార్తీక్ గొంతులానే ఉండదు అసలు.. :)
ఘటికుడు - అసలే పిల్లా
గోపి గోపిక గోదారి - బాల గోదారి
హరే రామ్ - సరిగమపదని, లాలి జో
ఝుమ్మంది నాదం - బాలామణి (సంక్రాంతి పాట)
కావ్యాస్ డైరీ - తెలుసుకో నువ్వే
కిక్ - I dont want love, గోరే గోరే
మహాత్మ - ఏం జరుగుతోంది
మిరపకాయ్ - గది తలుపులు
ఆరెంజ్ - చిలిపిగా చూస్తావలా
శుభప్రదం - నీ నవ్వే కడ దాకా
సూర్య s/o కృష్ణన్ - అదే నన్నే నన్నే
తకిట తకిట - కమాన్ కమాన్, మనసే అటో ఇటో
వీడొక్కడే - కళ్ళు మూసి యోచిస్తే
విలేజ్లో వినాయకుడు - నీలి మేఘమా





Tuesday, August 30, 2011

ఆకలిరాజ్యం(1981)





ఇది గత నెలలో 'చిత్రమాలిక 'లో ప్రచురితమైన వ్యాసం :










కొన్ని సినిమాలు వాటిని తీసిన కాలం నాటి దేశ పరిస్థితులను అద్దం పట్టి చూపిస్తాయి. 70లలోని దేశ రాజకీయ, కాల, సామాజిక పరిస్థితులకు ఒక అద్దం వంటి సినిమా "ఆకలిరాజ్యం". 1980లో తమిళం లో "Varumayin Niram Sivappu" పేరుతో విడుదలైన ఈ సినిమాను తరువాత 1981లో తెలుగులో రీమేక్ చేసారు. నిరుద్యోగ సమస్య తారస్థాయిలో ఉన్న రోజులు అవి. ఎందరో చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో, పేదరికంతో, అవమానాలతో, నిస్పృహలతో కాలం వెళ్లదీసిన పరిస్థితులను ఈ సినిమాలో అత్యంత ప్రభావితంగా ప్రతిబింబించారు శ్రీ కె.బాలచందర్. ఈ సినిమా వచ్చి ఇప్పటికి ముఫ్ఫై ఏళ్ళు. ఈ ముఫ్ఫై ఏళ్ళలో మన దేశకాలపరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. నిరుద్యోగ సమస్య అయితే అరికట్టబడింది కానీ పేదరికం, ఆకలి చావులు మొదలైన వాటిల్లో పెద్దగా మార్పులేవీ రాలేదనే చెప్పాలి. తమ తమ పాత్రల్లో అత్యుత్తమ నటనను ప్రదర్శించారు ముఖ్య భూమికలు పోషించిన కమల్ హాసన్, శ్రీదేవిలను ...at their best అనచ్చు. దర్శకుడు, నాయకుడు, సంగీత దర్శకుడు, గీతకర్త, పాడినవారూ....ఇలా చాలామంది ఇష్టమైనవాళ్ళతో నిండిన ఈ సినిమా ఇష్టమైన సినిమాల్లో ఒకటిగా నిలవటం ఆశ్చర్యకరమేమీ కాదు.



ఇది ఒక ఆకలి కావ్యం. దారిద్ర్యపు అంచుల్లో మునిగితేలిన బాధాతప్త హృదయాలు పడే అశ్రుకావ్యం. ముగ్గురు నిరుద్యోగ మిత్రులు రాజధాని నగరంలో ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ ఉత్సాహ నిరుత్సాహాలు, ఆకలి బాధల చుట్టూ చిత్రకథను అల్లారు బాలచందర్. ఉద్యోగం కోసం కమల్ పడే పాట్లు, ఆకలి తాళలేక డబ్బు కోసం శ్రీశ్రీ పుస్తకాలను సైతం అమ్ముతున్నప్పుడు అతని వేదన, దుర్భరమైన జీవనయానంలో ఎడారిలో ఒయాసిస్సు లాంటి శ్రీదేవి పరిచయం, వారిద్దరికీ దొరికిన మరొక స్నేహితుడు ఒక మూగ చిత్రకారుడు అవటం, నాయికా నాయకులు తమతమ స్వగతాలను అతని ముందు చెప్పుకోవటం...ఇవన్నీ కథనం లోని తీక్షణతను పెంచుతాయి. ఈ చిత్రం ఒక దృశ్య కావం అని చెప్పుకోవచ్చు. ఇంకా చిత్రంలో ముఖ్యంగా తలుచుకోవాల్సిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే... ముగ్గురు స్నేహితులు అన్నం తింటున్నట్లు నటించే సన్నివేశం, భోజనం ముందు కూర్చున్నా తినలేకపోయిన సన్నివేశం, తండ్రి కమల్ పనిచేసే బార్బర్ షాపు కు వచ్చిన సన్నివేశం, శ్రీదేవి తండ్రిని కమల్ బెదిరించే సన్నివేశం, చిత్రకారుడైన మిత్రుని చావు, పార్క్ లో కమల్, శ్రీదేవి కలిసే సినిమాలోని చివరి సన్నివేశం..మొదలైనవి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే ఆర్ద్రమైన సన్నివేశాలు.



కమల్ శ్రీశ్రీ వాక్యాలను ఉదహరించే కొన్ని సన్నివేశాలను క్రింద లింక్లో చూడవచ్చు:












దక్షిణ భారతంలోని గొప్ప సంగీతకారుల్లో ఒకరైన ఎం.ఎస్. విశ్వనాథన్ ఈ చిత్రానికి కమనీయమైన బాణీలను సమకూర్చారు. "ఆకలిరాజ్యం" అని పేరు వినగానే వెంఠనే గుర్తుకొచ్చే రెండు పాటలు.. "సాపాటు ఎటూ లేదు", "కన్నెపిల్లవని కన్నులున్నవని". వీటిలో మొదటి పాట గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పాడిన మంచి పాటల జాబితాలోకి వస్తుంది. పాటలో పలికిన హావభావాలు, కిషోర్ కుమార్ లాగ Yodeling చేసిన తీరూ ప్రశంసాపాత్రమైనవి. రెండవది నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఒకటి. సాహిత్యం కూడా బాణీతో పోటీపడేలా అద్భుతంగా కుదిరిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా విసుగురాదు. బాలు, జానకి గార్లు ఇద్దరూ సమగ్రమైన న్యాయం చేకూర్చారు ఈ పాటకు. సుశీల పాడిన "గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య..", జానకి పాడిన "तु है राजा.. मैं हू रानी.." పాటలు కూడా బావుంటాయి. ఆత్రేయ గారి సాహిత్యం గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. ఈ నాలుగు పాటలు ఈ లింక్ లో చూడొచ్చు:



http://www.bharatmovies.com/telugu/songs/akali-rajyam-songs.హతం










ఈ సినిమా చివరి సీన్ నాకు చాలా ఇష్టం. వాగ్యుధ్ధాలు, వాదోపవాదాలు లేకుండా విడిపోయిన నాయికానాయకులు మౌనంగా కలిసిపోవటం బావుంటుంది. బాలచందర్ సుఖాంతం చేసిన అతికొద్ది సినిమాల లిస్ట్ లో ఈ చిత్రాన్ని పెట్టవచ్చు. సుఖాంతం చెయ్యకపోయినా ఈ సినిమాకు ఇవే పేరుప్రతిష్టలు మిగిలి ఉండేవేమో అనిపిస్తుంది నాకు. నాటి సమాజానికి అద్దం పట్టిన ఆ కథాంశం అటువంటిది. ప్రశాంతంగా ఉండాలనిపించినప్పుడల్లా వినాలనిపించేది ఈ సినిమా చివర్లో బాలు పాడే 'ఓ మహాత్మా, ఓ మహర్షీ...!' ఎంతో అర్ధం నిండిన ఆ వాక్యాలతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను..





ఓ మహాత్మా….. ఓ మహర్షి…..

ఏది చీకటి? ఏది వెలుతురు?

ఏది జీవిత మేది మృత్యువు?

ఏది పుణ్యం? ఏది పాపం?

ఏది నరకం? ఏది నాకం?

ఏది సత్యం? ఏదసత్యం?

ఏదనిత్యం? ఏది నిత్యం?

ఏది ఏకం? ఏదనేకం?

ఏది కారణ మేది కార్యం?

ఓ మహాత్మా….. ఓ మహర్షి…..

ఏది తెలుపు? ఏది నలుపు?

ఏది గానం? ఏది మౌనం?

ఏది నాది? ఏది నీది?

ఏది నీతి? ఏది నేతి?

నిన్న స్వప్నం నేటి సత్యం

నేటి ఖేదం రేపు రాగం

ఒకే కాంతి ఒకే శాంతి

ఓ మహర్షి…..ఓ మహాత్మా…







కాంచన ద్వీపం



Treasure Island by Robert Louie Stevenson -- 1883


"ఓడ మీద ఉండి ప్రస్తుతం నేను చెయ్యగలిగిందేమీ లేదు.అందు చేత తీరానికి పోయి ఏవో సాహసకృత్యాలు చెయ్యాలని, గుప్తధనం ఉన్న చోటు నా మిత్రుల కంటే ముందు కనిపెట్టి వాళ్ళను ఆశ్చర్యపరచాలని ఒక ఊహ తట్టింది.వెనకాముందూ ఆలోచించుకోకుండా అయిదారుగురు కళాసీలున్న ఒక బోటులోకి దూకేసాను....ఇది వట్టి తెలివితక్కువ ఆలోచనే కావచ్చు. కానీ నేనలా చెయ్యకపోతే మా ప్రాణాలు నిష్కారణంగా కాంచన ద్వీపానికి బలి అయిఉండేవి..."

"వంద గజాల దూరంలో ఒక చిన్న కొండ ఉంది.హఠాత్తుగా దాని శిఖరం నుంచి రాళ్ళు, రప్పలు దొర్లటం ప్రారంభించాయి.కొంతసేపటికి ఒక ఆకారం శిఖరం మీద కనబడింది.అతివేగంగా ఎగురుతూ గెంతుతూ కిందకు వస్తోంది.అది ఎలుగుబంటో, కొండముచ్చో, మరే ఇత జంతువో తెలియలేదు.ఆకారం మటుకు అతి వికృతంగా ఉంది.దాన్ని చూసీ చూడగానే భయంతో ఒళ్ళు బిగుసుకుపోయినట్టయి ఆగిపోయాను."

"ఆ రోజు యుధ్ధంలో గాయాలు తిన్న ఎనిమిదిమందిలో అయిదుగురు అప్పుడే చనిపోయారు.మిగతావారిలో ఒకడు తిరుగుబాటుదారు.వాడికి డాక్టరుగారు శస్త్రచికిత్స చేస్తూండగానే గుటుక్కుమన్నాడు.మరొకడు మా హంటర్.ఇక మిగిలింది మా కెప్టెన్ స్మాలెట్.ఒక తూటా భుజంలోంచి దూసుకుపొయింది.మరొకటి ఎడమకాలికి తగిలింది."

"జిమ్! దూరంగా నుంచో. ఇదిగో ఈ పిస్టల్ తీసుకో.అవసరం రవచ్చు," అన్నాడు.అంటూనే కళాసీలకూ,గోతికీ దూరంగా జరిగాడు.అతని చూపుల్లో ఇప్పుడు నాపై ద్వేషం, క్రోధం మచ్చుకైనా లేవు.ప్రపంచెంలో నాకంటే ఆప్తుడు లేడన్నంత ప్రేమగా చూస్తున్నాడు.క్షణ క్షణానికీ మారిపోయే అతని చిత్త ప్రవృత్తి చూసి నాకు పరమ అసహ్యం కలిగింది..."

ఈ సన్నివేశాలు "కాంచన ద్వీపం" అనే Robert Louie Stevenson రచించిన సాహసోపేతమైన పిల్లల నవల లోనివి. అవటానికి పిల్లలదే అయినా పెద్దలకు కూడా ఉత్కంఠత కలిగిస్తుందీ నవల.
తెలుగు చదవటం నేర్పించాలన్న ఉద్దేశంతో మా చిన్నప్పుడు నాన్నగారు ఇలాంటి ఇంగ్లీష్ నవలల అనువాదాలను కొనేవారు. సముద్రపు దొంగలూ, వారు దాచిపెట్టిన ధనం, సాహసకృత్యాలతో,మంచి మానవతా విలువలను తెలియచేసే ఈ "కాంచన ద్వీపం" కధ 18వ శాతాబ్ద మధ్యాంతంలో రాయబడినదైనా కూడా, ఇప్పటికీ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అప్పటి UK ప్రధాని William Ewart Gladstone ఈ పుస్తకాన్ని పూర్తి చెయ్యటానికి 2a.m దాకా మెలకువగా ఉండి చదివారని చెప్పుకుంటారు. William Butler Yeats, Henry James, Gerard Manley Hopkins వంటి అప్పటి సమకాలీన నవలా రచయితలచే ప్రశంసలందుకుందీ నవల.

నండూరి రామమొహనరావుగారు తెలుగులోకి "కాంచన ద్వీపం"గా అనువదించిన ఈ నవల 1951-52 ప్రాంతాలలో ఆంధ్రవారపత్రికలో సీరియల్ గానూ, ఆ తరువాత ముడుసార్లు పుస్తకరుపంలోనూ ఆనాటి పాఠకులను ఉర్రుతలూగించింది.నా దగ్గర ఉన్నది 1979 edition, నవోదయా పబ్లిషర్స్ ద్వారా ప్రచురితమైంది.ఆ తరువాత ఎన్నిసార్లు అచ్చయ్యిందో తెలీదు మరి. సముద్రపు దొంగలూ, సాహస కృత్యాలూ, సముద్రయానాలతో నిండిన ఈ నవల నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటాను.



"కాంచన ద్వీపం" కధ:

ఇది జిమ్ హాకిన్స్ అనే పిల్లవాడి కధ.అతడే ఈ కధానాయకుడు. అతని తండ్రి ఇంగ్లాండ్లోని ఒక సముద్రతీరపు పల్లెలో "ఎడ్మిరల్ బెన్ బౌ" అనే హోటల్ నడుపుతూ ఉంటాడు.వారి హోటల్ కు ఒక రోజు "బిల్లీ బోన్స్" అనే ఒక వృధ్ధ నావికుడు వస్తాడు. డబ్బు కట్టకుండా చాలా రొజులు హోటల్లో నివాసముంటూ వాళ్ళను నానా ఇబ్బందులకూ గురి చేస్తాడు.అనుకోని పరిస్థితుల్లో కొద్ది రోజుల తేడాలో జిమ్ తండ్రి అనారోగ్యంతోనూ, విపరీతమైన తాగుడు వల్ల ఆ "బిల్లీ బోన్స్" , ఇద్దరూ చనిపోతారు. అసలు కధ అప్పుడు మొదలౌతుంది.

బిల్లి బోన్స్ చనిపోకముందే అతడిని వెతుక్కుంటూ పెద్ద సముద్రపు దొంగల ముఠా ఒకటి ఊరిలోకి వస్తుంది. ఒక చిన్నపాటి యుధ్ధంలో కొందరు దొంగలు చనిపోగా మిగిలినవారు పారిపోతారు. చనిపోయిన బిల్లీ బోన్స్ పెట్టేలో జిమ్ కు ఒక "ద్విప పటం" దొరుకుతుంది. దాని కోసమే ఘర్షణ జరిగిందని తెలుసుకుంటారు అందరూ. సముద్రపు దొంగలు తాము దోచుకున్న సొమ్మునంతా దాచిపెట్టిన చోటు(ట్రెజర్ ఐలాండ్)కు దారి చూపే మ్యాప్ అది.మొత్తం "1,00,000 pounds" గుప్తధనం ఉన్న చోటు.(ఎప్పుడో 1883లో అంత పెద్ద మొత్తం అంటే...అద్భుతమే కదా)

ఆ ఊరి జమిందారు ట్రేలానీ, ఆయన స్నేహితుడు డాక్టర్ లివ్ సే, జిమ్ హాకిన్స్ ముగ్గురూ జమిందారుగారు ఏర్పాటు చేసిన "హిస్పానియోలా" అనే ఓడలో, కొందరు సహాయక సిబ్బందితో, కెప్టెన్ స్మాలెట్ ఆధ్వర్యంలో "కాంచన ద్వీపానికి" బయల్దేరుతారు. మార్గ మధ్యలో అదృష్టవసాత్తూ జిమ్ హాకిన్స్ వల్లనే ఓడలో కొందరు సముద్రపు దొంగలు చేరినట్లూ, వారు ఒక కుట్ర పన్నినట్లూ తెలుస్తుంది. ఓడలో వంటవాడిగా చేరిన "లాంగ్ జాన్ సిల్వర్" అనే ఒంటికాలు మనిషే దొంగల నాయకుడు అనీ, అతడు రెండు కాళ్ళు ఉన్న టైం లో పేరుమోసిన సముద్రపు దొంగ అనీ తెలుస్తుంది.

కాంచన ద్వీపానికి వారంతా ఎలా చేరారు, మధ్యలో ఎన్ని కుట్రలు జరిగాయి, తీరా వెళ్ళాకా అక్కడ డబ్బు ఉందా? వెళ్ళిన వారిలో ఎందరు తిరిగి వచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే "కాంచన ద్వీపం" నవల చదవాల్సిందే మరి..!!




ఈ నవలను గురించిన వివరాలు, పూర్తి కధ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడచ్చు !!



Sunday, August 28, 2011

ఉరుమి






క్రితంవారం చేసిన పొరపాటు ఈవారం చెయ్యలేదు. దీని బదులు మరోటి చూసి బుక్కయిపోయాం. ఈసారి ఈ సినిమా చూసినవాళ్ళను అడిగి అడిగి వెళ్ళాం సినిమాకి. ట్రాఫిక్లో చిక్కుకు లేటయ్యేసరికీ షో మొదలైపోతుందని కంగారు నాకు. పేరు పడకముందు నుంచీ తెర పడేదాకా చూడకపోతే అసలు సినిమా చూసినట్లే ఉండదు. సరే గుమ్మంలోకి అడుగుపెట్టేసరికీ సిన్మా పేరు పడేసరికీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.






డైరెక్టరే సినిమాటోగ్రాఫర్ అయితే ఇంక చెప్పేదేముంది..కళ్ళకు పండగే. కాబట్టి ఈ సినిమా ముందుగా కళ్ళకు పండుగ. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమాల్లో హిందీలో తీసిన "అశోకా" తప్ప మరేమో చూడలేదు నేను. అప్పట్లో ఆ సినిమా కూడా బాగా నచ్చింది నాకు.షారుఖ్,కరీనా ఇద్దరూ చాలా బాగా చేసారు. ఆ సిన్మా పాటలయితే ఇప్పటికీ వింటూంటా. అంతిష్టం. "ఉరుమి" సినిమా చూస్తూంటే ఇది స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కానందుకు బెంగ వేసింది. డబ్బింగ్ అయినా మరీ అలా అనిపించనందుకు ఆనందం వేసింది. ముఖ్య పాత్రధారుల నటన ముచ్చట గొలిపింది. మరీ ముఖ్యంగా హీరో పాత్రధారి పృధ్వీరాజ్ పై అభిమానం కొండంత పెరిగిపోయింది. "శివపురం" సిన్మాలో వేసినతననుకుంటాను. మరెక్కడా చూసిన గుర్తు లేదు. అబ్బ..హీరో అంటే ఇలా ఉండాలి అనిపించింది. చాలాసార్లు అతని నటన మృగరాజు సింహాన్ని గుర్తుకుతెచ్చింది. జుట్టు వెనక్కు వెళ్ళేలా తల విదిల్చినప్పుడు రాజసం, నాయకుడుగా ఠీవీ, గంభీరమైన చూపులు ఆకట్టుకున్నాయి. ఇతన్ని హీరోగా పెట్టి చందమామ, బాలమిత్రల్లోని మంచి మంచి రాజుల కథలను సినిమాలు తీసేస్తే భలే ఉంటుంది అనిపించింది. ఈ సినిమా నిర్మాత అవతారమే కాక ఒక పాట పాడి గాయకుడి అవతారం కూడా ఎత్తాడితను.

అంతమంది పెద్ద పెద్ద నటీమణులను ఎందుకు పెట్టారో అని మాత్రం అనిపించింది. 'విద్యాబాలన్' కు రెండు మూడు సీన్స్ ఉన్నయి కానీ 'తబ్బు 'కు ఒక పాటలో మినహా పాత్రే లేదు. పైగా ఎప్పటి నిన్నే పెళ్ళాడాతాలోని తబ్బు..వయసు మీరిపోయింది..అనిపించింది. విద్యా కు పాట అనవసరం. సీరియస్ కథ నడుస్తూండగా ఎందుకు పెట్టారో తెలీలేదు. పైగా పాటలేమీ మళ్ళీ మళ్ళీ వినేలా లేనందువల్ల, డబ్బింగ్ అయినందువల్ల వినసొంపుగా లేవు. ఒక్క హీరో హీరోయిన్ల మధ్య పాట మాత్రం కాస్త బావుంది. మొదటిసారి జనీలియాను ఒక రీజనబుల్ రోల్ లో చూసాననిపించింది. కత్తి యుధ్ధాలు అవీ చాలా శ్రధ్ధగా చేసేసింది. 'నిత్యా మీనన్' ఓపినింగ్ సిన్ లో భయపడేలా కనబడింది కానీ తర్వాతి సినిమాలో బావుంది ముద్దుగా. ఈ అమ్మాయి ఏ మాత్రం లావయినా కెరీర్ దెబ్బతింటుంది. చిరక్కల్ రాజుగారి దగ్గర పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ కనబడ్డ జంటలో అమ్మాయి కూడా రంగు తక్కువైయినా బావుంది. వాన, వాతావరణం, పచ్చదనం అన్నీ కథకు అనుగుణంగా నప్పేసాయి. ఈ తరహా సినిమాకు ముఖ్యమైన సౌండ్ ఎఫెక్ట్స్, నేపథ్యసంగీతం చాలా బావున్నాయి.





ఈ సినిమాలో నచ్చనిదేదైనా ఉంటే అది ప్రభుదేవా. అందులోనూ 'నిత్య' పక్కన అస్సలు సరిపోలా. నటన బాగుంది కానీ ఆ పాత్రలో మరెవరైనా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంకా యుధ్ధాలకోసం తీసుకొచ్చిన గుర్రాలకు పాపం దెబ్బలు తగులుతాయే అనిపించింది. మొత్తమ్మీద బాగుంది కానీ ఇంకా బాగుండొచ్చేమో అనిపించింది. హిస్టరీ స్టూడెంట్ ను కాబట్టి నాకు పౌరాణికాలు, చారిత్రాత్మకాలూ బాగా నచ్చేస్తాయి. అసలు నేను కూడా ఏ రాజులకాలంలోనో ఎప్పుడో పుట్టే ఉంటాను అనిపిస్తూంటుంది నాకు. సినిమా చూసి వస్తూంటే కూడా ఆ ఆడవి, గుర్రాలు కళ్ళ ముందే కదులుతూ ఉన్నాయి. ఒక మంచి ఫీల్ ఉంది సినిమాలో. తెలుగులో కూడా ఎవరైనా పూర్తి నిడివి చారిత్రాత్మక చిత్రాన్ని తీయకూడదా అని మరీ మరీ అనిపించింది. రొటీన్ కు భిన్నంగా చూడాలనుకునేవారికి బాగా నచ్చుతుంది ఈ సినిమా.

Wednesday, August 24, 2011

సంగీతప్రియులకు తాయిలం - "స్వర్ణయుగ సంగీత దర్శకులు"



తెలుగు పాటలపై అత్యంత ప్రేమ కలిగిన సంగీతప్రియులు ఏదైనా పాత పాట గురించో, ఫలానా పాట పాడిన గాయని గాయకుల గురించో, ఆ పాట తాలూకూ సంగీత దర్శకులెవరో తెలుసుకోవాలన్నా.. నాకు తెలిసీ అంతర్జాలంలో మనం మొదట వెతికేది "చిమటమ్యూజిక్.కాం"లోనే. ఆ వెబ్సైట్ అధినేత శ్రీ చిమట శ్రీనివాసరావు గారి ప్రోత్సాహంతో తయారై, చిమటమ్యూజిక్.కాం వారిచే పబ్లిష్ చేయబడిన పుస్తకమే "స్వర్ణయుగ సంగీత దర్శకులు". ఈ పుస్తకానికి అక్షర రూపాన్ని అందించింది, ఆ అక్షరాల వెనుక అవిరామ కృషి చేసినది శ్రీ పులగం చిన్నారాయణ గారు.


ఇంతకు పూర్వం 'హాసం ప్రచురణల' ద్వారా ప్రచురిచబడిన " జంధ్యామారుతం" రెండు భాగాలు, ఆ తర్వాత 75 మేటి చిత్రాల తెర వెనుక కబుర్లతో తయారైన వారి రెండవ పుస్తకం "ఆనాటి ఆనవాళ్ళు" 2009లో 'ఉత్తమ సినీ గ్రంధం'గా రాష్ట్ర ప్రభుత్వ 'నంది' అవార్డ్ ను అందుకుంది. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జీవిత ప్రస్థానం "సినీ పూర్ణోదయం" తరువాత పులగం చిన్నారాయణ గారికి ఇది నాలుగవ పుస్తకం. ఈ పుస్తకం కోసం, పలువురు సంగీత దర్శకుల వివరాల కోసం చిన్నారాయణ గారు చేసిన కృషి, పడిన కష్టం ప్రతి పేజీ లోను కనబడుతుంది. అన్ని అపురూపమైన చిత్రాలను కలక్ట్ చేయటానికి ఎంత కష్టపడి ఉంటారో అనిపించింది ఆ ఫోటోలను చూస్తూంటే.

ఈ పుస్తకంలో ఏముంది?

సీనీసంగీతజగత్తులో గాన గంధర్వులు శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యంగారికి అంకితమిచ్చిన ఈ పుస్తకంలో 1931-1981 వరకూ తెలుగు సినీపరిశ్రమను, తెలుగు పాటను అత్యంత ప్రభావితం చేసిన ఒక ముఫ్ఫై మంది సంగీత దర్శకుల గురించిన వివరాలు, వారి జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానం, వారి వృత్తిపరమైన ఒడిదొడుకులు, వారి తాలుకు కొన్ని అరుదైన ఫోటోలు, వారు స్వరాలందించిన కొన్ని చిత్రాల పేర్లు, వారు స్వరకల్పన చేసిన పాటల జాబితాలు...మొదలైన అపురూపమైన విశేషాలు ఉన్నాయి. ముందుగా డా.సి.నారాయణరెడ్డి గారు, రావు బాలసరస్వతిగారు, పి.సుశీల గారు, కీరవాణి గారు, కౌముది.నెట్ ఎడిటర్ శ్రీ కిరణ్ ప్రభ మొదలైన వారి సంతకాలతో కూడిన అభినందనలు ఉన్నాయి. వీరిలో మధురగయని జానకి గారి అభినందనలు లేకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా పుస్తకరూపానికి సహాయ సహకారాలు అందించిన మరికొందరు మిత్రుల అభినందనలు కూడా ఉన్నాయి. వారిలో మన బ్లాగ్మిత్రులు నిషిగంధ గారి శుభాకాంక్షలు కూడా ఉండటం మనకు ఆనందకరం.


ఇక పుస్తకంలో ప్రస్తావించబడిన ముఫ్ఫై మంది సంగీత దర్శకులు ఎవరంటే...
1. హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి
2. గాలి పెంచల నరసింహారావు
3. భీమవరపు నరసింహారావు
4.ఓగిరాల రామచంద్రరావు
5. సాలూరి రాజేశ్వరరావు
6. చిత్తూరు నాగయ్య
7. బాలాంత్రపు రజనీకాంతరావు
8. మాస్టర్ వేణు
9. సుసర్ల దక్షిణామూర్తి
10. సి.ఆర్.సుబ్బరామన్
11. ఘంటసాల
12. సాలూరి హనుమంతరావు
13. పెండ్యాల నాగేశ్వరరావు
14. ఆదినారాయణరావు
15. అశ్వత్ధామ
16. టి.వి.రాజు
17. ఎమ్మెస్ విశ్వనాథన్
18. తాతినేని చలపతిరావు
19. భానుమతి రామకృష్ణ
20. బి.గోపాలం
21 రమేష్ నాయుడు
22. రాజన్-నాగేంద్ర
23. కె.వి.మహదేవన్
24. ఎస్.పి.కోదండపాణి
25. జి.కె.వెంకటేశ్
26. సత్యం
27. జె.వి.రాఘవులు
28. చక్రవర్తి
29. ఇళయరాజా
30. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


తన పుస్తకాన్ని మనతో ఆసాంతం ఆసక్తికరంగా చదివించగల విభిన్నమైన శైలి పులగం చిన్నారాయణగారిది. ఏభైఏళ్ళ సినీప్రపంచపు సంగీతాన్ని గురించి, తెలుగు పాటల గురించీ, వాటి వెనుక ఉన్న సంగీత దర్శకుల తాలుకూ మనకు తెలియని జీవిత వీశేషాలను పొందుపరిచిన "స్వర్ణయుగ సంగీత దర్శకులు" పుస్తకం తెలుగు పాట పై అత్యంత అభిమానమున్న సంగీతప్రియులందరూ అపురూపంగా దాచుకోవాల్సిన తాయిలమే.


అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యమవుతున్న ఈ పుస్తకం వెల 500 రూపాయిలు.

Monday, August 22, 2011

ఎస్.జానకి గారు పాడిన అరుదైన రెండు కృష్ణ గీతాలు





వైవిధ్య సుమధురగాయని ఎస్.జానకి గారు పాడిన రెండు కృష్ణుని గీతాలను ఈ కృష్ణాష్టమి పూటా బ్లాగ్మిత్రులకు వినిపించాలని...


మొదటిది ఎస్.జానకి గారు ఒక రేడియో ఇంటర్వూ లో వేసినది. తమిళం లో ఒక సినిమా కోసం ఆవిడ స్వయంగా ఈ రాసిన పాటను మళ్ళీ తెలుగులో రాసి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో పాడినట్లు తెలిపారు. మూడేళ్ళ పాప కృషుడి కోసం పాడుతున్నట్లున ఈ పాటను , జానకి గారి మాటలని క్రింద లింక్ లో వినేయండి మరి ...


Get this widget |Track details |eSnips Social DNA




రెండవ పాట " అంత మహిమ ఏమున్నది గోపాలునిలో.." అనీ మద్రాసు ఆకాశవాణి రికార్డింగ్.

రచన: ఎం. గోపి (వీరు అతి తక్కువగా మంచి సినిమాపాటలు కూడా రాసారు)

Get this widget |Track details |eSnips Social DNA


కవిత్వంలో నిందాస్తుతి లాంటి ఈ పాట సాహిత్యం బావుంటుందని ఇక్కడ రాసాను:

ప: అంత మహిమ ఏమున్నది గోపాలుడిలో
నన్ను నేను మరిచేందుకు వాడి ధ్యాసలో


1చ: యశోదమ్మ తల్లైతే అంతా కన్నయ్యకే
రేపల్లె వంటి పల్లేలో అందరూ గోపాలురే
ఊరివారు భరియిస్తే ప్రతివారూ ఘనులే
అంత మంది వరియిస్తే అందరూ శ్రీకృష్ణులే ((అంత మహిమ))


2చ: చిరునవ్వులె తప్ప తనకు నిట్టూర్పులు తెలుసా
ఆలమందలేమో గానీ ఆలివెతలు తెలుసా
వెదురుల రుచి తెలిసినంత పెదవుల రుచి తెలుసా
గీత పలికెనేమో గానీ ఈ రాధ గీత తెలుసా ((అంత మహిమ))

------------------

ఇస్కాన్ టెంపుల్ లో ఇవాళ తీసిన ఫోటోలు ’మనో నేత్రం’లో చూసేయండి...




Sunday, August 21, 2011

two memorable songs from "paap"


"Paap" అని నటి పుజాభాట్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఒకటి ఉంది. పెద్దగా ఆడినట్లు లేదు. జాన్ అబ్రహం పర్వాలేదు కానీ ఆ హీరోయిన్ను అసలు చూడలేం. దాంట్లో రెండు పాటలు చాలా బావుంటాయి. ఒకటి 'అనురాధా పౌడ్వాల్' పాడినది. అప్పట్లో పత్రికల్లో వచ్చిన కారణాలు నిజమో కాదో తెలిదు కానీ చాలా బాగా పాడే ఈవిడ ఎక్కువ హిందీ పాటలు పాడలేకపోవటం దురదృష్టకరం. ఆవిడ పాడిన మంచి పాటల్లో ఇది ఒకటి అనిపిస్తుంది ఈ పాట వింటే. "ఇంతేజార్.." అనే ఈ పాట సాహిత్యం చాలా నచ్చుతుంది నాకు. ఓ సారి వినేయండి మరి..

సంగీతం: Anu Malik,
సాహిత్యం: Sayeed Quadri




*** *** ***

రెండవ పాట "లగన్ లాగీ తుమ్సే మన్ కి లగన్.." అనీ 'రాహత్ ఫతే అలీ ఖాన్' పాడినది. "నస్రత్ ఫతే అలీ ఖాన్" మేనల్లుడైన ఈ గాయకుడు ఈ పాటతో బాలీవుడ్లో అడుగుపెట్టి మరేన్నో అద్భుతమైన పాటలను పాడాడు.

 .
పాట: మన్ కి లగాన్
సంగీతం : Shahi,
సాహిత్యం: Amjad Islam Amjad




ఇతను పాడిన మిగిలిన పాటల జాబితా ఇక్కడ చూసేయండి .


Thursday, August 18, 2011

प्यार है या सज़ा..


మొన్న రాత్రి వంటిల్లు సర్దుకుంటూ Fm స్పీకర్లో పెట్టుకుని వింటున్నా. రేడియో సిటీలో ఫహాద్ షో వస్తోంది. ఫహాద్ గొంతు చాలా బావుంటుంది. రాత్రి పూట నిశ్శబ్దంగా ఉన్న సమయంలో షాయరీలు చెప్తూంటే అసలు కట్టేయాలనిపించదు. పాటలు కూడా చాలావరకూ మంచివే వేస్తాడు. నిన్న అలానే వింటూంటే ఒక పాట వేసాడు. అదివరకూ విన్నదే కానీ పెద్దగా ఎప్పుడు పట్టించుకోలేదు. నిన్న ఎందుకనో ఆ నిశ్శబ్దంలో పాట చాలా బావుందనిపించింది. 'ప్యార్ హై యా సజా..' అంటూ కైలాష్ ఖేర్ పాడుతున్నాడు. ఏసినిమాలోదో తెలీదు. ఇవాళ ఖాళీ అయ్యి పాట ఎందులోదో అని వెతికాను నెట్లో. 'సలామే ఇష్క్" అనే సినిమాలోదని తెలిసింది. యూట్యూబ్ లో పాట చూస్తే చాలామంది హేమాహేమీలు(నటులు) ఉన్నారు. ఇంట్లోని ఏదో మిక్స్డ్ సినిమాల సిడిలో ఉన్నట్లుంది చూడాలి.


మేం బొంబాయిలో ఉండగా విన్నాను మొదటిసారి కైలాష్ ఖేర్ వాయిస్. 'టూటా టూటా ఏక్ పరిందా ఐసే టూటా...' పాట అస్తమానం Fm లో వచ్చేది. అప్పట్లో సూపర్ హిట్ సాంగ్. ఆ తర్వాత బాలీవుడ్ లో అతనికి చాలా అవకాశాలు వచ్చినట్లున్నాయి. బేస్ వాయిస్ కాకపోయినా ఒక రకమైన ఆర్తి, వేదన ఉంటాయి 'కైలాష్' వాయిస్ లో. కొన్ని పాటలకు కావాల్సిన బాధ అతని గొంతులో స్పష్టంగా ధ్వనిస్తుంది. ఎందుకనో గాని ఈ 'ప్యార్ హై యా సజా..' పాట నన్ను ఎంతగానో ఆకట్టేసుకుంది. సాహిత్యం కూడా చాలా బాగుంది. ప్రఖ్యాత సినీగేయ రాచయిత "సమీర్ " రాసిన ఈ సినిమా పాటలకు "శంకర్-ఎహ్సాన్-లాయ్" స్వరాలను సమకూర్చారు.

రెండు పాటలకూ పోలిక లేకపోయినా ఈ పాట వింటూంటే , 'ఎవ్వరినెప్పుడు తన ఒడిలో' పాట, 'ప్రేమా ప్రేమా చెప్పమ్మా' పాట గుర్తుకు వచ్చాయి . ప్రేమ గురించిన వర్ణన వల్లనేమో. ఈ పాటను క్రింద చూసేయండి..




प्यार है या सज़ा , ए मेरे दिल बता ,
टूटता क्यों नहीं , दर्द का सिलसिला ,
इस प्यार में हो कैसे कैसे इम्तिहाँ ,
यह प्यार लिखे कैसी दास्ताँ ,

या रब्बा , दे दे कोई जान भी अगर
दिलबर पे हो न , दिलबर पे हो न कोई असर
हो या रब्बा , दे दे कोई जान भी अगर
दिलबर पे हो न , दिलबर पे हो न कोई असर
हो प्यार है या सज़ा , ए मेरे दिल बता ,
टूटता क्यों नहीं , दर्द का सिलसिला ,

कैसा है सफ़र वफा  की मंजिल का ,
न है कोई हल दिलो की मुश्किल का ,
धड़कन धड़कन बिखरी रंजिशें ,
सांसें सांसें टूटी बन्धिस्हें ,
कहीं तो हर लम्हा होंठों पे फ़रियाद है ,
किसी की दुनिया चाहत में बर्बाद है ,

या रब्बा , दे दे कोई जान भी अगर ,
दिलबर पे हो न दिलबर पे हो न कोई असर ,
हो दे दे कोई जान भी अगर ,
दिलबर पे हो न दिलबर पे हो न कोई असर

कोई न सुने सिसकती आहों को ,
कोई न ढर्रे तड़पती बाहों को ,
आधी आधी पूरी ख्वाहिशें ,
टूटी फूटी सब फरमाईशे  ,
कहीं शक है कहीं नफरत की दीवार है ,
कहीं जीत में भी शामिल पल पल हार है ,

या रब्बा दे दे कोई जान भी अगर ,
दिलबर पे हो न दिलबर पे हो न कोई असर
हो या रब्बा दे दे कोई जान भी अगर ,    
दिलबर पे हो न दिलबर पे हो न कोई असर
हो प्यार है या सज़ा , ए मेरे दिल बता ,
टूटता क्यों नहीं , दर्द का सिलसिला , हो -ओ ,

न पूछ दर्द बन्दों से ,
हंसी कैसी  ख़ुशी कैसी ,
मुसीबत सर पे रहती है ,
कभी कैसी कभी कैसी
हो रब्बा , रब्बा ..
रब्बा हो -ओ -ओ ,
हो -ओ -ओ रब्बा ..

--

బంతినారు



బంతి మొక్కలకీ, నాకూ అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ప్రతి వర్షాకాలం జులై నెల చివరలోనో, ఆగష్టు మొదట్లోనో స్కూల్ నుంచి వచ్చేసరికి ఓ మగ్గు నీళ్ళలో పెట్టిఉంచిన రెండు మూడు "బంతినారు" కట్టలు దర్శనం ఇస్తూండేవి. ("బంతినారు" అంటే తెలియనివాళ్ళకు చిన్న వివరణ: బంతి పువ్వులు ఎండిపోయాకా వాటిని విడదీసి ఆ రేకులు మట్టిలో చల్లితే బంతి మొక్కలు వస్తాయి. మొక్కలు అమ్మేవాళ్ళు అలా బంతిమొక్కలు పెంచి, రెండంగుళాలు పెరిగాకా వాటిని తీసి కట్టగా కట్టి బజార్లో అమ్ముతారు. ఆ చిన్న చిన్న బంటి మొక్కలనే "బంతినారు" అంటారు. వాటిని ఒక క్రమంలో వేసుకుంటే మొక్కలు బాగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తాయి.)


బాగా చిన్నప్పుడు అమ్మ నాటేసేది కానీ నాకు మొక్కలపై మమకారం పెరిగేకా ఆ బాధ్యత నేనే తీసుకునేదాన్ని. మగ్గులో బంతినారు చూడగానే గబగబ స్కూల్ డ్రెస్ మార్చేసుకుని, గునపం,బకెట్టులో నీళ్ళు తీసుకుని నాటడానికి బయల్దేరేదాన్ని. ఎంతెంత దూరంలో ఆ బుజ్జి బుజ్జి బంతి మొక్కలు పాతాలో అమ్మ చెప్తూంటే, ఆ ప్రకారం రెండు మూడు మొక్కలు కలిపి నాటేసేదాన్ని. రెండుమూడు మొక్కలు కలిపి ఎందుకంటే పొరపాటున ఒక మొక్క బ్రతక్కపోయినా రెండవది బ్రతుకుతుందన్నమాట. వాటికి చుట్టూ నీళ్ళు నిలవటానికి పళ్ళేంలాగ చేసి అన్నింటికీ నీళ్ళు పోసి మట్టిచేతులు కడిగేసుకోవాలన్నమాట. అప్పటికి తలలు వాల్చేసిన ఆ బుజ్జి మొక్కలు బ్రతుకుతాయో బ్రతకవొ అని నేను బెంగ పడుతుంటే, పొద్దున్నకి నిల్చుంటాయిలే అని అమ్మ ధైర్యం చెప్పేది. మర్నాడు పొద్దున్నే తలలు నిలబెట్టు నిలబడ్డ బంతి మొక్కలని చూస్తే భలే సంబరం వేసేది. అవి మొండి మొక్కలు. బ్రతకాలే గానీ ఇక చూసుకోవక్కర్లేదు. కాసిన్ని నీళ్ళు పోస్తే వాటి మానాన అవే పెరుగుతాయి.


ఒకోసారి పండగలకి గుమ్మానికి కట్టిన బంతి తోరణాలని జాగ్రత్తగా ఎండబెట్టి దాచేది అమ్మ. ఆగస్టు వస్తోందనగానే వాటిని మట్టిలో చల్లేసేది. నాలుగైదురోజుల్లోనే మొక్కలు వచ్చేసేవి. కాస్తంత పెరిగాకా, ఆ బంతినారు తీసేసి మళ్ళీ దూరం దూరంగా నాటేవాళ్ళం. కానీ ముద్ద పువ్వుల రెక్కలతో మొలిచిన మొక్కలకి రేక బంతిపువ్వులు పూసేవి ఒకోసారి. అందుకని విత్తనాలు వేసి మొలిపించినా, ఒక కట్ట అయినా బంతినారు కొనకుండా ఉండేది కాదు అమ్మ. అలా ఆగస్టులో వేసిన బంటి మొక్కలు సప్టెంబరు చివరికి పూలు పూసేసేవి. కొత్త సంవత్సరం వచ్చాకా మార్చి దాకా పూసేవి ఆ పూలు. ముద్ద బంతి రెండు మూడు రంగులు, రేక బంతి రెండు మూడు రంగులు, కారబ్బంతి(చిన్నగా తోపు రంగులో ఉంటాయే అవి) మొదలైనవి పెంచేవాళ్ళం మేము. నా పెళ్ళి అయ్యేదాకా ప్రతి ఆగష్టు నుంచి మార్చి దాకా క్రమం తప్పకుండా బంతి తోట ఉండేది మా ఇంటి ముందు. వాటి పక్కన రెండు మూడు రకాల చామంతులు. ఇవి కూడా ఈ అర్నెలలూ పూస్తాయి. ఈ మొక్కలన్నింటికీ కలిపి నేను గట్టి కర్రలు ఏరుకొచ్చి దడి కట్టేదాన్ని. అదో పెద్ద కార్యక్రమం. ఆ దడికి శంఖుతీగలను ప్రాకిస్తే స్ట్రాంగ్ గా గోడలా ఉండేది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న శంఖు పువ్వులు ఎంత బావుడేవో..

(పాత ఫోటోల్లో దొరికిన మా బంతి తోట)


మార్చి తరువాత బంతి మొక్కలు వాటంతట అవే ఎండిపోవటం మొదలు పెడతాయి. అప్పుడు వాటిని తీసేసి మళ్ళీ ఏవో వేరే మొక్కలు వేసుకునేవాళ్ళం. బంతి పువ్వులు పూసినన్నాళ్ళు ప్రతి బుధవారం అమ్మ వాటిని కోసి బంతి ఆకులే మధ్య మధ్య వేసి దండలు కట్టి అన్ని దేవుడు పటాలకూ వేసేది. అమ్మ చాలా బాగా మాలలు కడుతుంది .అదీ ఎడం చేత్తో. నాకు కుడి చేత్తో కూడా సరిగ్గా కట్టడం రాదు. నాకు రాని ఏకైక పని అది ఒక్కటే..:(( మొన్న శ్రావణ శుక్రవారం బోలెడు పువ్వులు కొనుక్కొచ్చి, ఏదో ఎమోషన్ లో మాల కడదామని తెగ ప్రయత్నించాను. నాలుగు పువ్వుకు కట్టగానే తయారైన వంకర టింకర మాల చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్న శ్రీవారిని చూసి ఇక కట్టడం ఆపేసా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలివైనవాళ్ళకి అర్ధమైపోతుంది కదా..:))

పెళ్ళైయాకా మళ్ళీ బంతిమొక్కలు పెంచటం కుదరనేలేదు. అమ్మ కూడా మానేసింది వేసే చోటు లేక. ఇన్నేళ్ళ తరువాత బజార్లో మొన్నొకరోజు బంతినారు కనపడింది. మట్టినేల లేదు ఏం పెంచుతానులే అనుకున్నా కానీ మనసొప్పలేదు... ఒక్క కట్ట కొన్నాను. రెండు మూడు కుండీల్లో అవే వేసాను. అన్నీ నిలబడ్డాయి. ఇక పువ్వుల కోసం ఎదురుచూపులు...






Tuesday, August 16, 2011

"జో తుమ్ తోడో పియా" - మూడు వర్షన్స్


సూర్ దాస్, తులసీ దాస్, మీరా మొదలైనవారి భజన్స్ లో మీరా భజన్స్ చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. మీరా భజనల్లో కృష్ణ భక్తురాలు "మీరా" పాడిన భజనలలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన "జో తుమ్ తోడో పియా" భజన్ చాలా బావుంటుంది. నాకు తెలిసీ మూడు హిందీ సినిమాల్లో ఈ భజన ఉంది. సరదాగా ఈ మూడు వర్షన్స్ ఒకచోట పెడదామన్న ఆలోచన వచ్చింది. మూడిటినీ ఒకేచోట వినేద్దామా...


మొదటిది 1955లో "Jhanak jhanak paayal baaje" సినిమాలోది. దీనిని లతా మంగేష్కర్ పాడారు. వసంత్ దేశాయ్ సంగీతాన్ని సమకూర్చారు.




తరువాత రెండవ వర్షన్ 1979లో గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన "Meera" సినిమాలోది. హేమమాలిని మీరాగా నటించిన ఈ సినిమాకు సంగీతాన్ని ప్రసిధ్ధ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ భజనను అత్యంత మధురంగా పాడినది విశిష్ఠగాయని వాణి జయరాం. ఈ సినిమాలో వాణిజయరాం పాడిన అన్ని మీరా భజన్స్ ఎంతో బావుంటాయి. వాణి జయరాం గొంతులో అత్యంత మధురంగానూ, మధ్య మధ్య వచ్చే అందమైన సితార్ వాదన తోనూ ఉన్న ఈ రెండవ వర్షన్ నాకు చాలా ఇష్టం.





మూడవ వర్షన్ 1981 లో "Silsila" కోసం చేసారు. శివ్-హరి సంగీత సారధ్యంలో ఇరవై ఆరేళ్ల తరువాత అదే భజనను లతా మంగేష్కర్ ఈ సినిమా కోసం మళ్ళీ పాడారు.



Sunday, August 14, 2011

'షమ్మీ' జ్ఞాపకాలు ..




ఆదివారం సాయంత్రం వచ్చే దూరదర్శన్ హిందీ సినిమాల కోసం పడిగాపులు పడుతూ ఎదురు చూసే రోజుల్లో ఒకరోజు టివిలో "జంగ్లీ" సినిమా వచ్చే ఆదివారం అని ఏడ్ చూసి నాన్న మమ్మల్ని తెగ ఊరించేసారు. ఇక మేమూ చాలా ఎక్సైట్ అయిపోయి ఆ సినిమా కోసం ఎదురు చూసాం. సినిమా మొదలైంది. ఇదేమి హీరో నాన్నా అసలు బాలేడు అన్నాను. సినిమా మొత్తం చూసి మాట్లాడు అన్నారు నాన్న. సినిమా పూర్తయ్యేసరికీ నాకు షెమ్మీ కపూర్ ఎక్కడా కనబడలేదు...ఆ సినిమాలోని రాజవంశీయ యువరాజు పాత్ర తప్ప. అంత లీనమయ్యేలా ఉంది అతని నటన. మొదటి భాగంలోని సీరియస్ నటనకూ, రెండవ భాగంలోని హుషారు పాత్రకూ ఎంత తేడానో. ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు నవ్వు అన్నది ఎరుగని అతని సీరియస్ మొహం చూసి నవ్వకుండా మనం ఉండలేము. అలానే హీరోయిన్ పరిచయం అయ్యాకా చలాకీగా మారిపోయిన అతని వైనం చూసి మనమూ సరదా పడకుండా ఉండలేము. ఆ సినిమాలో అన్నీ పాటలూ ఎంత బావుంటాయో." ऎह्सान तेरा हॊगा मुझ पर.. दिल चेह्ता है वॊ केहनॆ दॊ.." అని పాడుతూంటే కరిగిపోని ప్రేమికురాలు ఉంటుందా? అనిపిస్తుంది. రాజ్ కపూర్ కి ముఖేష్ వాయిస్ అతికిపోయినట్లు, షమ్మీ కపూర్ కి రఫీ గాత్రం అతికిపోయింది.

ఇక ఆ తర్వాత టివీలో షమ్మీకపూర్ సినిమా ఎప్పుడు వచ్చినా వదలలేదు మేము. అలా మంచి మంచి సినిమాలను, "చిత్రహార్" ద్వారా పాటలనూ పరిచయం చేసిన దూరదర్శన్ కు ఎంతైనా ఋణపడిపోయామనిపిస్తుంది నాకు. రాజ్కపూర్ సినిమాల్లో నేను టివీలో చూసినవి Junglee, kashmir ki kali, An evening in paris, Brahmchari, Teesri manzil, Andaz, Dil tera deewana, Prince, Pyar kiya to darna kya, Raj kumar, Dil deke dekho, Janwar, Professor, Tumse achcha kaun hai మొదలైనవి. ఇవన్నీ హిట్సే. ముఖ్యంగా kashmir ki kali, Teesri manzil , An evening in paris మొదలైనవి చాలా బావుంటాయి. వాటిల్లో పాటలన్నీ కూడా సూపర్ హిట్స్. కపూర్ కుటుంబంలో తమ్ముడు శశి కపూర్ లాగ అందగాడు కాకపోయినా, అన్న రాజ్ కపూర్ లాగ బహుముఖ ప్రజ్ఞాశాలి కాకపోయినా నటనలో తనదంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకునీ, ఇది షమ్మీ కపూర్ స్టైల్ అనేంతటి ప్రత్యేక స్టైల్ నూ, తనకంటూ ఒక క్రేజ్ నూ, ఫాలోయింగ్ నూ ఏర్పరుచుకున్నాడు షమ్మీ. పాటల్లో అతడు చేసే విన్యాసాలూ, అచ్చం జంగ్లీ లాగ ప్రవర్తించే తీరూ మనల్ని సరదా పెడతాయి, నవ్విస్తాయి. షమ్మీ సినిమాల్లో 'wooing' (నాయిక ప్రేమను పొందటం కోసం కథానాయకుడు చేసే ప్రయత్నం) చాలా ఆసక్తికరంగా ఉండేది. ఈ పాత్ర ఇతనే చెయ్యాలి అనిపించేలాగ. అలా ఇంకెవ్వరు చెయ్యలేరు కూడా. అందువల్లే అలనాటి ప్రముఖ హీరోల్లో ప్రత్యేక స్థానం అతడిది.

పొద్దున్నే వార్తల్లో షమ్మీ కపూర్ గురించి చూసి అయ్యో..ఈ మధ్యన ఇలాటి వార్తలే వింటున్నామే అనిపించింది. అయినా..విని నిట్టూర్చటం మినహా ఏం చెయ్యగలము? మనిషి జన్మ ఎత్తిన ప్రతివాళ్లం ఎప్పుడో అప్పుడు వెళ్లకతప్పదు కదా..! ఏదో నా తృప్తి కోసం అతడిని ఈ విధంగా తలుచుకుంటున్నా..! షమ్మీ హిట్ సాంగ్స్ లోని పల్లవులతో చాలా కొత్త హిందీ సినిమాల టైటిల్స్ రావటం ఒక విశేషం. షమ్మీ కపూర్ సినిమాపాటల్లో నాకు బాగా ఇష్టమైన పాటలు కొన్ని...

* आजा आयी बहार, दिल है बॆकरार..ऒ मेरॆ राज कुमार [raj kumar]
* तुम्नॆ किसि की जान कॊ जातॆ हुयॆ दॆखा है..वॊ दॆखॊ मुझ सॆ रूठ कर मॆरी जान जा रही है..[raj kumar]
* तुम्नॆ पुकारा और हम चलॆ आयॆ [raj kumar]
* इस रन्ग बदल्ती दुनिया में [raj kumar]


* आज कल तेरॆ मेरॆ प्यार के चर्चॆ हर जबान पर.. [brahmchari]
* मैं गावूं तुं सॊजावॊ..सुख सप णॆं मॆं खॊ जावॊ.. [brahmchari]
*दिल कॆ झरोकॆ मैं तुझ कॊ बिठाकर [brahmchari]


* आवाज़ दॆकॆ हमॆ तुम बुलावॊ..मोहॊब्बत में इत्ना न हम कॊ सतावॊ [professor]
* ऎ गुल्बदन ऎ गुल्बदन..फॊलॊं की मेहेक, कटॊं की चुभन [professor]
* खुली पलक मॆं झूठा गुस्सा बंद पलक मॆं प्यार [professor]


* Yahoo...Yahoo..चाहॆ कॊइ मुझॆ जंगली कहॆ.. (Junglee)
* अय्यय्या करू मैं क्य सूकू सूकू (Junglee)
* ऎह्सान तॆरा हॊगा मुझ पर..(Junglee)
* नैन तुम्हारॆ मजॆदार ऒ जनाबॆ आली [Junglee]

* अकॆलॆ अकॆलॆ कहा जा रहॆ हॊ [An evening in paris]
* Title song [An evening in paris]
* आस्मान सॆ आय फरिश्ता प्यार का सबक सिखलानॆ [An evening in paris]
* मॆरा दिल है तॆरा, तॆरा दिल है मॆरा [An evening in paris]


* बदन पॆ सितारॆ लपॆटॆ हुयॆ..ऒ जानॆ तमन्ना किधर जा रही हॊ
जरा पास आवॊ तॊ चैनाजायॆ (prince)

* दिल उसॆ दॊ जॊ जान दॆ दॆ, जा उसॆ दॊ जॊ जान दॆदॆ (Andaaz)

* लाल छडी मैदान खडी, क्या खूब लडी क्या खूब लडी [jaanwar]

* दीवाना मुझ सा नही [teesri manzil]
* तुम्नॆ मुझॆ दॆखा हॊ कर मेहर्बा [teesri manzil]
* आजा आजा मैं हू प्यार तॆरा [teesri manzil]
* ऒ मॆरॆ सॊन रॆ सॊना रॆ सॊना रॆ [teesri manzil]
* ऒ हसीना जुल्हॊ वाली जानॆ जहा [teesri manzil]


* ये चान्द स रॊषन चेहरा, यॆ झील सी नीली आखॆं (kashmir ki kali)
* दीवाना हुवा बादल ऎ दॆख कॆ दिल झूमा (kashmir ki kali)
* इषारॊं इषारॊं मॆं दिल दॆनॆ वालॆ (kashmir ki kali)
* बार बार दॆखॊ हजार बार दॆखॊ (kashmir ki kali)
* है दुनिया उसी की जमाना उसी का...(kashmir ki kali)

* हम और तुम और यॆ समा (Dil deke dekho)
* Tilte song (Dil deke dekho)
* बॊलॊ बॊलॊ कुच तॊ बॊलॊ (dil deke dekho)

* तुम मुझॆ यू भूला न पावॊगॆ (paglaa kahIkaa)

* तुम्सॆ अच्चा कौन है (janwar)
* लाल छडी (janwar)

* तुमसा नही दॆखा (tumsa nahi dekha)
* जवानिया यॆ मस्त मस्त बिन पोयॆ (tumsa nahi dekha)





షమ్మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.



Saturday, August 13, 2011

రాఖీ...







ఈసారి రాఖీ పండుగ డల్లుగా ఉంది..:((


రాఖీ కట్టగానే "फोलों का तारोंका सबका कहना है.. लाखहजारो में मेरी बहना है.." అని పాడేందుకు అన్నయ్య ఉళ్లో లేడు, తమ్ముడు కూడా ఊళ్ళో లేడు ! ఊరేళ్ళేముందు ఇద్దరికీ రాఖీలు ఇచ్చి పంపేసా కట్టుకోండర్రా అని. ఏం చేస్తాం తప్పదు కొన్నిసార్లు. పోస్ట్ లో పంపగలిగినవాళ్ళకు రాఖీ పంపేసా. గ్రీటింగ్స్ మాత్రమే పంపటం కుదిరే వాళ్ళకు గ్రీటింగ్స్ పంపాను.

ఈసారి ఒకరికి మొదటిసారి రాఖీ పంపాను. అందిందని చెప్పి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. మొదటిసారి మాట్లాడినందుకు. నా అభిమానంపై వారికి నమ్మకం ఉన్నందుకు. ఏ బంధం ఎక్కడ మొదలై ఏ రూపు దాలుస్తుందో ఎవరూ చెప్పలేరు...మనలోని నిజాయితీని అవతలివాళ్ళు నమ్మితే, అవతలవాళ్ళకు మనపై నమ్మకం ఉంటే, మనకూ వారి నిజాయితీ పై నమ్మకం ఉంటే, అది కాలాన్ని తట్టుకుని నిలబడితే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది.




రాఖీ పండుగ సందర్భంగా అందరు అన్నదమ్ములకూ, అక్కచెల్లెళ్లకూ శుభాభినందనలు.. శుభాకాంక్షలు.