సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 23, 2011

Anuranan - a resonance


అప్పుడెప్పుడో ప్లానెట్ ఎం లో తీసుకున్న ఒక సీడి కొన్ని నెలల తరువాత ఓపెన్ చేసి చూస్తే సరిగ్గా లేదు. తిరిగి ఇచ్చేస్తే తీసుకుంటాడో లేదో అన్న సందేహంతో వెళ్ళే సరికీ మరో సీడీ తీసుకోండి అన్నారువాళ్ళు. ఏం కొనాలా అని వెతుకుతూంటే కనబడింది బెంగాలీ చిత్ర దర్శకుడు అనిరుధ్ధ్ రాయ్ చౌదరి తీసిన "అనురనన్" అనే హిందీ సినిమా. mainmeri-patni-aur-woh సినిమాతో నచ్చేసిన రితుపర్నాసేన్ గుప్తా, ఇంకా రాహుల్ బోస్ , రైమా సేన్ మొదలైనవారు కనబడేసరికీ బావుంటుందనిపించి సీడీ తీసేసుకున్నాను.

కథనం కొద్దిగా స్లోగా సాగినా ఆసక్తికరంగా ఉండటంతో చివరిదాకా చూసాం. కానీ చివర్లో ఎదురైన ట్విస్ట్ చూసి...ఎండింగ్ లో ఈ ట్రేజెడి ఏంటీ...అని బెంబేలెత్తిపోయాం. అయితే సినిమా చివరిలో వచ్చే ఒకే ఒక డైలాగు ఆ కథ బాగా నచ్చేలా చేసింది. నిజంగా భార్యాభర్తల అనుబంధం ఇలా ఉండాలి....ఒకరిపై ఒకరికి నమ్మకం ఇలా ఉండాలి అనిపించేలా ఉన్న క్లైమాక్స్ మనసుకు హత్తుకునేలా ఉంది. "a friend is one.. who comes in when the whole world has gone out.." అని ఒక కొటేషన్ ఉంది. భార్యాభర్తల అనుబంధం స్నేహంతొనే ముడిపడుతుంది కాబట్టి, ప్రపంచం అంతా నమ్మినా నమ్మకపోయినా జీవిత భాగస్వామి నమ్మకం, వారి అనుబంధం ఇలా ఉండాలి.. అన్న సిధ్ధాంతాన్ని చూపిస్తుందీ సినిమా.

"అనురనన్ - a resonance" అన్నది సినిమా పేరు. resonance అంటే అనుకంపన. అంటే ప్రతిధ్వని అనుకోవచ్చేమో. రాహుల్ - నందిత, అమిత్ - ప్రీతి; ఈ రెండు జంటలు కలినప్పుడు, ఆ నలుగురి పరిచయం వారి వారి వైవాహిక జీవితాలపై చూపిన ప్రభావమే కథాంశం. అదే resonance. రాహుల్, నందిత కొన్నేళ్ళుగా లండన్ లో ఉంటుంటారు. కాంచనజంగ లో ఒక రిసార్ట్ కట్టే ఉద్యోగబాధ్యతపై రాహుల్ ను ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తారు. లండన్ లో పరిచయమైన అమిత్, ప్రీతి దంపతులు ఇండియాలో వీరికి స్నేహితులుగా మారతారు. నొనీగా పిలవబడే నందిత మొదటి పరిచయంలోనే ప్రీతి జీవితంలో వెలితినీ, ఆమెలోని శూన్యతను పసిగడుతుంది. రాహుల్ ఊరు వెళ్ళినప్పుడు నందితను పలకరించటానికి అమిత్,ప్రీతి వచ్చినప్పటి సీన్ చాలా బావుంటుంది. అలంకరణ లేకుండా ఉదాసీనంగా ఉన్న నందిత ముహంలో భర్తను మిస్సవుతున్న భావం బాగా కనబడుతుంది. అదే సమయంలో వంటింట్లో బీటేన్ కాఫీ చేస్తుండగా వచ్చిన ప్రీతిని "दॊनॊं मॆं दरार कहां है? शरीर मॆं या मन मॆं या प्यार मॆं..." అని అడగటం, ప్రీతి దాటువెయ్యటం, "भागना है तॊ भाग.. लॆकिन खुद सॆ नही.." అని నందిత అన్న సీన్ చాలా నచ్చింది నాకు. ఈ సీన్ నందిత పాత్రను, ఆమె సునిశిత దృష్టినీ, వ్యక్తిత్వాన్నీ మరింత ఎలివేట్ చేస్తుంది.


రాహుల్ సినిమా మొదటి నుంచీ తన డిక్టాఫోన్(Digital Voice Recorder ) లో తన భావాలూ, అభిప్రాయాలూ రికార్డ్ చేస్తూ ఉండటం వెరైటీగా బాగుంది. సినిమా చివరలో కూడా కొన్ని బంధాలకు పేర్లు పెట్టలేము అని మాట్లాడే వాక్యాలు బాగుంటాయి. అవి కూడా అనుమానాన్ని వ్యక్తం చేసేలా ఉన్నా కూడా;ప్రీతి భర్తతొ సహా అందరూ రాహుల్,ప్రీతి ల స్నేహాన్ని అపార్ధం చేసుకున్నా సరే, అతనిని అపార్ధం చేసుకోకపోవటం ఆ భార్యాభర్తల గాఢానుబంధాన్ని తెలియజేస్తుంది.



రాహుల్, నందిత పాత్రల్లో అన్యోన్యమైన జంటగా రాహుల్ బోస్, రితుపర్నాసేన్ గుప్తా ల నటన ఆకట్టుకుంటుంది. భారతీయత ఉట్టిపడేలా చక్కని కాటన్ చీరల్లో, నుదుటిన ఎర్రని బొట్టుతో హీరోయిన్లిద్దరూ కనువిందు చేసారు. ముఖ్యంగా జుట్టుకు పెద్ద ముడి, కాటన్ చీర, నుదుటిన ఎర్రని బొట్టుతో సుచిత్ర సేన్ మనవరాలు, మున్ మున్ సేన్ కుమార్తె అయిన రైమా సేన్ చాలా అందంగా కనబడింది. నటన ఈమె రక్తంలో ఉందేమో అనిపించింది.



పౌర్ణమి పూట హిమాలయాలపై వెన్నెల పడే దృశ్యాన్ని అతి హృద్యంగా చిత్ర్రీకరించారు. ఆ సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ రాహుల్ - ప్రీటి ల మధ్య డైలాగ్స్ కూడా బాగున్నాయి. అంతం చాలా బరువుగా విషాద భరితంగా నాకు నచ్చని విధంగా ఉన్నా కూడా, రాహుల్ ని అతని భార్య అర్ధం చేసుకుంది అని తెలపటం కాస్త ఊరటనిచ్చింది. సినిమా చివరి సన్నివేశంలో నందిత "चल पगली...तन सॆ कॊई उड सकता हैं? मन कॆ साथ उड...आत्मा कॆ साथ उड... फिर दॆखना सारा आकाश निछावर हॊजायॆगा तॆरॆ सामनॆ...ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అంటుంది హాస్పటల్ బెడ్ పై ఉన్న ప్రీతి చేతిని తన చేతిలోకి తీసుకుని ! " ऎ मैं केह रही हूं तुम्सॆ केह रही हूं..." అన్న ఒక్క వాక్యంలో బోలెడు అర్ధం. ప్రీటి భర్త అమిత్ ఫోన్ చేసి సానుభూతి మాటలు చెప్పినప్పుడూ ఫోన్ మధ్యలో కట్ చేసేసి ఆమె ఏడుస్తుంది. దాని అర్ధం ఈ డైలాగ్ తో మనకు తెలుస్తుంది. కథనం స్లోగా ఉన్నా, అద్భుతమైన చిత్రీకరణ, అందమైన లాంస్కేప్స్, సరౌండింగ్స్ ముచ్చట గొలుపుతాయి. కథలోని ట్విస్ట్ మనసును భారం చేసినా, భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చూపిన ఈ చిత్రం చూడతగ్గది.

No comments: