ఆహ్లాదానికో, పొద్దుపోవడానికో చదివే కాలక్షేపపు సాహిత్యంలా
కాకుండా వివేకాన్నీ, ఆలోచననీ, ఆవేశాన్నీ
నిద్ర లేపే ఉపయోగకరమైన సాహిత్యం మరింతగా అందుబాటులోకి రావాలని తోపించడమే "ఇప్పపూలు" కథాసంకలనం ప్రత్యేకత.
"ఇప్పపూలు" కథలు పాఠకులని నాగరిక సమాజం నుండి అమాంతం అడవుల్లోకి తీసుకుపోతాయి.
ప్రకృతి శోభ, కొండా కోనా అందాలు, రకరకాల
పశుపక్ష్యాదులు, వన్యమృగాలు, అటవీ సంపద,
గిరిజనుల పాటా పదం.. అన్నింటినీ చూసి ఆస్వాదించి ఆనందించే లోపూ అక్కడి
గిరిజనుల జీవితాలలో అలుముకున్న అలజడుల తాలూకూ విషాదం హృదయాలను దిగాలు పెట్టేస్తాయి..!
వీళ్ళ కోసం మనమేం చెయ్యగలము? అన్న ప్రశ్న డ్రిల్లింగ్ మషీన్ లా
మెదడుని దొలిచేస్తుంది. గిరిజన తెగలన్నింటికీ ఒకో ప్రత్యేకత, ఒకో దైవం, విశ్వాసాలూ, నమ్మకాలూ
ఉన్నాయి. ఎన్ని విశిష్టతలు ఉన్నా వీరందరూ గురైయ్యే దోపిడీ విధానం మాత్రం ఒక్కటే! కాంట్రాక్టర్లు,
దొంగ వ్యాపారులు కాలుపెట్టాకా పల్చబడిన అడవి, గిరిజనుల
భూమి తగాదాలు, వారి నిరక్షరాస్యత వల్ల జరిగే మోసాలూ.. అవన్నీ
గిరిజన యాస, భాష, మాండలీక పదజాలంలో రాస్తేనే
చదువరులకి గిరిజనుల ఆవేదన వాడిగా తగలాలనేనేమో పుస్తకంలోని చాలా కథలు ఆయా ప్రాంతాల
మాండలీకాలనూ, గిరిజన యాసనూ మనకు పరిచయం చేస్తాయి.
2009 వరకూ గిరిజన సంచార తెగలపై కథాసంకలనం రాలేదు కాబట్టి గిరిజన సంచార తెగల జీవితం, సంస్కృతి, వాటి పరిరక్షణకై సాగే సంఘర్షణల ఇతివృత్తంతో
ఒక కథాసంకలనం తేవాలనే సంకల్పంతో 2009లో ప్రతిభాప్రచురణలు
వారు "ఇప్పపూలు" అనే కథా సంకలనాన్ని వెలువరించారు సంపాదకులు ప్రొ.జయధీర తిరుమల రావు, జీవన్ గార్లు. 1930 నుండీ వస్తున్న గిరిజన,
సంచార తెగల కథాసాహిత్యాన్ని తమ శక్తిమేరకు పరిశీలించి, లభ్యమైనంతలో ఉత్తమ రచనలను ఈ సంకలనంలోకి తెచ్చామని, ఇంతకన్నా
సమగ్రమైన సంకలనం తేవాలనే ఆశనీ వ్యక్తపరుస్తూ అందుకు తగ్గ ప్రోత్సాహాన్నీ అభిలషించారు.
పుస్తకాన్ని "గిరిజన హక్కులు మానవహక్కులేనని ఎలుగెత్తిన బాలగోపాల్ కు.."
అంకితమిచ్చారు. కథల చివరన ప్రచురణా కాలం తేదీ వివరాలు, పుస్తకం
చివరన కథారచయితల వివరాలూ, చిరునామాలు అందించారు.
కథాన్వేషణలో 1930 మొదలు
1970 వరకూ జరిగిన కథారచనలు పరిశీలిస్తే గిరిజనజీవితాల ఇతివృత్తంతో వేళ్ల మీద లెఖ్ఖించగలిగిన
కథలే లభ్యమయ్యాయట. 1970లో శ్రీకాకుళ, తర్వాత1980 ఉత్తర తెలంగాణా గిరిజన ఉద్యమాల నేపధ్యంలో అనేక కథలు వచ్చినా,
ఉద్యమానంతరం అవీ మందగించాయిట. వాటిల్లో కూడా అదీవాసీలపై జరుగుతున్న ఆర్ధిక
దోపిడీ గురించి రాసినంతగా గిరిజన సంస్కృతిపై నాగరిక సంస్కృతి చేస్తున్న దాడిని గురించిన
కథలు కనబడలేదట. అభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరున జరుగుతున్న
అనేక విధ్వంసాల కారణాలుగా పెద్ద ఎత్తున నిర్వాసితులౌతూ, మనుగడే
ప్రశ్నార్థకంగా మారిన గిరిజనుల దయనీయ స్థితిగతుల గురించి ఈతరం కథకులు దృష్టిపెట్టకపోవడం
శోచనీయమంటారు ప్రచురణ కర్తలు.
ఈ పుస్తకంలోని ముందుమాటలు
చాలా ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వందేళ్ళ
తెలుగు కథ వాస్తవికత, అవాస్తవికత, హాస్యం,
శృంగారం, స్త్రీవాదం, కుటుంబ
సమస్యలు, సమాజంలోని ఇతర సమస్యలు మొదలైనవాటి గురించే ఎక్కువ మాట్లాడింది
కానీ అడవిలో పుట్టి పెరిగి, ప్రతి చెట్టుపుట్ట, ఆకూపువ్వూ తమ సొత్తైనా కూడా అడుగడుగునా ఆంక్షలకు లోబడుతూ అన్యాయానికి గురౌతున్న
గిరిజనుల వ్యధలను, ఆరాట పోరాటాలనూ అక్షరీకరించడంపై కథారచయితలు
దృష్టి సారించలేదన్న ఆవేదనని సంపాదకులు తమ ముందుమాటలో వ్యక్తపరిచారు. శ్రీకాకుళం,
నల్లమల, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల్లో ఉన్న కోయ,
గోండు, పరిధాను, బంజార,
సవర, మేరియా, చెంచు,
కోదు వంటి ౩౩ గిరిజన తెగల గురించిన 29 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సంచార,అరసంచార తెగలైన గంగిరెద్దులు, నక్కల వారి గురించి రెండు
కథలున్నాయి. "మీటూ భూక్య"అనే మౌఖిక కథ కూడా ఉంది. ఏడాదిలో ఆరునెలలైనా ఊరూరా
తిరిగి జీవనాలు సాగించే మందహెచ్చులు, డక్కలి, పెద్దమ్మలవారు, కిన్నెర వాద్యకారులు, శారదలు మొదలైన సంచార,అర సంచార సమూహాల గురించి ప్రత్యేకంగా
మరో సంకలనాన్ని తేవాలనే అభిలాషను ప్రచురణకర్తలు వ్యక్తం చేసారు.
సంకలనంలోని మొదటిదైన
"చెంచి" (భారతి,1932) కథలో అమాయక జంటైన చెంచి,చెంచుగాడు ఒకరికోసం ఒకరు పడే తాపత్రయం, కథాంతం మనసును
తడిచేస్తాయి. "పులుసు" కథలో బోడేమ్మ ముసలిపై పోలీసు బూటూ కాలు పడినప్పుడు
మనలో మరిగే ఆవేశం "ఇప్లవం వొర్దిల్లాలి" అని ఆమె అరిచినప్పుడు చల్లబడుతుంది.
ఎ.అప్పల్నాయుడు గారి "అరణ్యపర్వంలో మాకీ యాపీసులొద్దు, ఆపీసర్లొద్దు,అప్పూ సప్పులొద్దు. ఆకటి సబ్సిడీలొద్దు, వొద్దు బాబో
వొద్దు. మీ కాయితం కలాల వాయికొంటపాళీలాటలొద్దే వొద్దు! మమ్మల్ని పావులు మింగేత్తాయి.అవును
బావ్. మమ్మల్నొగ్గీయండి. యిది నా ఒక్కడి గోశ కాదు. మా అడవి బతుకోలందరి గోస..!
" అని ప్రార్ధించే కొయ్యంగాడి మాటలు గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలతో పాటూ నాగరీకుల
వికృతరూపాన్నీ కళ్లముందుంచుతాయి. ఈ కథ తరువాయి కథలన్నీ గిరిజనలపై కాక, వారి ఆస్తులపై, వన సంపదలపై జరుగుతున్న రకరకాల అన్యాయాలను,
దోపిడీ విధానాలను గురించి చెప్తాయి. అభివృధ్ధి, వన్యపరిరక్షణ ముసుగులో జరుగుతున్న వివిధ అక్రమాల గురించి చదవడం ఆవేశాన్నే కాక,
తెలివైన మనిషులు తెలివిలేని మనిషులను ఇన్ని రకాలుగా మోసం చెయ్యగలరా అన్న
ఆశ్చర్యం కూడా కలగుతుంది. "జంగుబాయి" కథలో గోండుల ఆచారాలూ, మూఢవిశ్వాసాలనూ ఒకపక్క, కొత్తగా అడవికి వచ్చిన స్కూల్
మాష్టారి భార్యకు ఎదురైన అనుభవాలూ, భయాలూ, కొన్ని విషయాలలో కలగజేసుకోవాలనున్నా చెయ్యలేకపోయిన ఆమె నిస్సహాయతను కళ్ళకు
కట్టినట్లు చూపెట్టారు రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి.
వాడ్రేవు వీరలక్ష్మి గారి
"కొండఫలం"లో గిరిజనుల భూమి తగాదాలను పరిచయం చేస్తే, "గోరపిట్ట", "ఆర్తి", "కలలోని వ్యక్తి","గోస","పయనం" మొదలైన కథలు గిరిజన తెగల
నిస్సహాయతను, తద్వారా ఉద్యమం దిశగా సాగిన కొందరి పయనాలనూ తెల్పుతూ
తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. కొండవీటి సత్యవతి గారి "గూడు" లో తండావాసులందరికీ
ఇళ్ళూ కట్టించాలని ఆఫీసర్ చందన పడే తాపత్రయం స్ఫూర్తిదాయకంగా ఉండి, ఆఫీసర్లందరూ ఇలా పాటుపడితే గిరిజనుల బ్రతుకులు ఎంత మెరుగౌతాయో కదా అనిపిస్తుంది.
"అరణ్య రోదన", ""పోటెత్తిన జనసంద్రం"
రెండు కథలూ పోలవరం ప్రాజక్ట్ గురించిన ఎన్నో విషయాలను ఎరుకపరుస్తాయి. ఇవన్నీ ఒకరకమైతే
చివరలో రచనైన "మూగబోయిన శబ్దం" కథ ద్వారా రచయిత్రి పద్దం అనసూయ చెప్పినట్లు
’మతమే లేని కోయ జాతిలోకి మతం వేరుపురుగులా ప్రవేశించిందన్న ’ సత్యం కలవరపరుస్తుంది.
ఈ కథల్లోని మాన్కు, శిడాంశితృ, డోబి,
యిస్రూ, వడ్డియా, గైతా మొదలైన
చిత్రమైన పేర్లు, ఆ పేర్ల తాలూకూ మనుషులూ వాళ్ళ అమాయకత్వాలతో
సహా గుర్తుండిపోతారు. డోలోళ్ళ పూర్భం గానం , గుస్సాడి నృత్యం,
ధింసా నృత్యం.. మన:ఫలకంపై ఆ నృత్యాల తాలూకూ చిత్రాలను చూపెడతాయి.
"ఆకాశం పండిన పత్తిచేను గాలికి కదులుతున్నట్లుగా ఉంది..", "పొట్టలు విచ్చుకుని తెల్లగా నవ్వుతూ భూమి మీద రాలిన నక్షత్రాల్లా పత్తిచేలు..",
"అడవిలో కాస్తున్న ఎండ కూడా వెన్నెలలా చల్లగా ఉంది..",
"గూడేనికి పచ్చల హారం తొడిగినట్లుగా అన్నివైపులా చేలూ,చెలమలూ.." మొదలైన అలంకార వాక్యాలు అడవి అందాలను కళ్ళ ముందు నిలబెడతాయి.
ఇటువంటి గుర్తుండిపోయే కథల
ఎంపికే కాకుండా తెలుగు కథాసాహిత్యంలో తొలి గిరిజన కథకుడుగా భావించే చింతా దీక్షితులు
కన్నా ముందే గూడూరు రాజేంద్రరావు "చెంచి" అనే కథను రాసారన్న సమాచారం సంపాదించడం
సులభసాధ్యమైన విషయం కాదు. ఇలానే పుస్తకం పేరుని గురించి వివరిస్తూ గిరిజ తెగలలో, వారి సమాజంలో, కర్మకాండలో,
పూజలో, విశ్వాసాలలో, నమ్మకాలలో
ఇప్పపూలకి ఎంతో ప్రాధాన్యత ఉన్నందువల్ల; ఇంతకు మునుపే బోయి
జంగయ్య గారు "ఇప్పపూలు" పేరుతో తమ కథా సంపుటిని వెలువరించినా,
ఈ సంకలనానికి వారి అనుమతితో, "గిరిజన సంచార
తెగల కథలు" అనే ఉప శీర్షికతో ఇప్పపూలు పేరునే నిర్ణయించామని తెలియపరచడం మొదలైనవాటి
వల్ల ఈ పుస్తకం తయారీ వెనుక ఉన్న సంపాదకుల శ్రధ్ధ, గిరిజనుల సంక్షేమం
పట్ల వారి తపన వెల్లడౌతాయి.