Tuesday, October 14, 2014

'Minnale' songs


మిన్నలె, చెలి, రెహ్నా హై తేరే దిల్ మే.. పేర్లతో మూడు భాషల్లోనూ వచ్చిన ఈ సినిమా పాటలు మూడూ భాషల్లోనూ సూపర్ డూపర్ గా హిట్ అయిపోయాయి. సాహిత్యం, భాషల కన్నా సంగీతానికే ఇక్కడ మార్కులు పడ్డాయి. ప్రతి గల్లీలో, ట్రైన్లో, టివీల్లో, రేడియోలో అన్నిచోట్లా రిలీజైన కొన్నాళ్ళ పాటు ఈ పాటలే. సంగీత దర్శకుడిగా "హేరిస్ జైరాజ్" మొదటి సినిమా అనుకుంటా ఇది. ఈ తమిళ్ సాంగ్స్ కేసెట్ పెట్టుకుంటే అటు, ఇటు రెండు పక్కాలా అయ్యేకే ఆపేవాళ్ళం మేము. పాటల కోసం, మాధవన్ కోసం సినిమా చూసాం కానీ భరించడం చాలా కష్టం అయ్యింది. కేవలం పాటల్ని విని ఆస్వాదించాల్సిందే తప్ప కథ జోలికి, సినిమా జోలికీ వెళ్ళకూడని సినిమాల కోవలోకి వస్తుందీ సినిమా! 

చాలా మొదట్లో మాధవన్ జీ టివీలో "బనేగీ అప్నీ బాత్" అనే సీరియల్ లో వేసేవాడు. అప్పట్లోనే మా ఫ్రెండ్స్ అందరం తెగ మెచ్చేసుకునేవాళ్ళం భలే ఉంటాడు, బాగా ఏక్ట్ చేస్తాడని. ఆ సీరియల్ కూడా బావుండేది. సాగీ..సాగి..సాగీ...ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ టైటిల్ సాంగ్ కూడా రికార్డ్ చేసుకున్నా అప్పట్లో. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడీ అబ్బాయ్. ఇతని నవ్వు చాలా బావుంటుంది. Sweet smile!


మళ్ళీ పాటల్లోకి వచ్చేస్తే... ఈ పిక్చర్ థీమ్ మ్యూజిక్ ను ఫోన్లలో కాలర్ ట్యూన్ గా ఇప్పటికీ పెట్టుకుంటున్నవాళ్ళు ఉన్నారు. 

 థీమ్ మ్యూజిక్ ..



అన్నింటిలోకీ నాకు బాంబే జయశ్రీ పాడిన "వసీగరా.." చాలా చాలా ఇష్టం. ఏ రాగమో కనుక్కోవాలి.. 

 



అన్ని పాటలూ క్రింద లింక్ లో వినచ్చు:



Monday, October 13, 2014

'Duet' songs


పదే పదే కొన్ని పాటల్ని కేవలం సంగీతం కోసమే వినాలనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఆ మ్యూజికల్ ఇంట్రస్ట్ వల్లే. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన అద్భుతమైన ట్యూన్స్ లో కొన్ని బాలచందర్ చిత్రం "డ్యూయెట్" లోని పాటలు. సినిమా ఓ మాదిరిగా ఉంటుంది. కేవలం పాటల కోసం భరించాలంతే. అసలు సినిమా వచ్చిన కొత్తల్లో ఆ తమిళ్ పాటలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖలేదు. నాకు ఆ తెలుగు డబ్బింగ్ పాటలు నచ్చక తమిళ్ కేసెట్ కొనుక్కుని అవే వినేదాన్ని. బాలూ కూడా ఎంతో అద్భుతంగా పాడారా పాటలను. అన్నింటికీ సాహిత్యం వైరముత్తు రాసారుట.


ఈ ఆల్బం కి 'రాజు' ఏ.ఆర్.రెహ్మాన్ అయినా 'మంత్రి' మాత్రం పద్మశ్రీ కద్రి గోపాల్నాథ్ గారే! ఆ Sax.. మెస్మరైజింగ్ అసలు!! ఈ ఆల్బంలో టైటిల్ ట్రాక్స్ కాకుండా మిగిలిన చిన్న చిన్న Sax bits రాజు అనే ఆర్టిస్ట్ ప్లే చేసారని వికీ చెప్పింది. మొత్తం పాటలు saxophone instrumental bitsతో పాటుగా వినాలంటే క్రింద ఉన్న రాగా.కామ్ లింక్ లో  వినవచ్చు :  http://play.raaga.com/tamil/album/duet-t0000042


యూట్యూబ్ లింక్స్ నాకు బాగా నచ్చే మూడూ పాటలకి మాత్రమే పెడుతున్నాను.. 

1) ఎన్ కాదలే ఎన్ కాదలే.. 

SPB voice అల్టిమేట్ అసలీపాటలో..




2)Vennilaavin Therileri.. 

amazing interlude bits..
 


3) anjali anjali..

just for the tune.. 
 


ఇంకా ఇవి కూడా సరదాగా బావుంటాయి...
 Kulicha Kuttalam 

Katheerika Gundu Katheerika 

Sunday, October 12, 2014

Veesum Kaatrukku..


"ఉల్లాసం" అని ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వచ్చింది. అజిత్, విక్రమ్, మహేశ్వరి.. ఇంకా రఘువరన్, బాలు కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. "ఉల్లాసం" పేరుతోనే తెలుగులోకి డబ్బింగ్ చేసారు. అందులో రెండు మూడు పాటలు బావుంటాయి. కార్తీక్ రాజా నే సంగీతం. అన్నింటిలోకీ "Veesum Kaatrukku " అని ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటొకటి నచ్చేది నాకు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ కూడా బావుంటుంది. ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడో విన్నట్టు అనిపించేది. ఓ రోజు నాన్న కేసేట్లలో వెతికి ఈ పాట అసలు మాతృక కనిపెట్టాను. ఉల్లాసం సినిమా రాక ముందు "Pocahontas" అనే యేనిమేషన్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. నాకు బాగా నచ్చే యేనిమేషన్స్ లో ఒకటి అది. ఇందులో "Can you paint with all the Colors of the Wind" అనే పాటకు అకాడమీ అవార్డ్ వచ్చింది. చాలా బావుంటుందా పాట . ఇది కాక అందులో "Listen With Your Heart.. you will understand " అనే మరో పాట ఉంది. ఈ పాట పల్లవి, పల్లవి ముందర వచ్చే వేణువాదన tune ఆ పాటలోనిదే. ముందర తమిళ్ సాంగ్ వినేసి, తర్వాత క్రింద ఉన్న ఇంగ్లీష్ సాంగ్ కూడా వినండి.. తెలుస్తుంది మీకు.





Pocahontas - Listen With Your Heart  


ఈ సిన్మాలో ఇంకా Yaro yar yaro... , Muthae muthamma పాటలు బావుంటాయి.


Bright sunday !





పొద్దున్నే లేవడం లేటైనా వాకింగ్ మానలేక గబగబా తెమిలి బయల్దేరా. మిష్టర్ సూర్యదేవ్ అప్పుడే ఎదురైపోయాడు. వెలుతురు రాకుండా వాకింగ్ చేస్తే బావుంటుంది కానీ ఇలా మిష్టర్ సూర్యదేవ్ వంక చూస్తూ ఆ వెచ్చని చూపులు తనువుని తాకుతూండగా నడవడం కూడా భలేగా ఉంటుంది. లేటవడం కూడా బావుంది అనుకున్నా. ఓ ఎఫ్.ఎం లో గణేష సుప్రభాతం పాడుతున్న బాలమురళీకృష్ణగారి గాత్రం తాలూకూ బేస్ వైబ్రేషన్ నెమ్మదిగా ఇయర్ఫోన్స్ లోంచి మెదడుని తాకుతోంది.

నిన్నసలు రోజు మొదలవ్వడమే చిరాగ్గా మొదలైంది. ఒక సంఘటన చాలా బాధపెట్టేసింది. సాయంత్రం దాకా ఫీలయ్యీ ఫీలయ్యి..లయ్యీ..ఈ.... ఇక లాభం లేదనుకుని 'ఓ సామీ ఎలాగూ దీపావళి వస్తోంది కదా కాస్తలా షాపింగ్ కి తీసుకుపోదురూ' అని బ్రతిమాలా అయ్యవారిని. ఏదో పొదుపు చేసేద్దామనుకున్నప్పుడే ఖర్చులు ఇంకా పెరుగుతాయి..(నెలకి రెండు పండగలు వస్తాయి) కదా... పాపం జేబులు తడుముకుంటూ బయల్దేరారు! నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నాతో పాటూ అరడజను షాపులు తిప్పేసాకా, 'అమ్మా ఇంక వెళ్పోదామని' పిల్ల పేచీ మొదలెట్టే సమయానికి, ఆఖరికి రోడ్డు మీద ఓ పక్కగా గుట్టగా పోసి అమ్మేస్తున్న టాప్స్ లోంచి య్యగారి అనుమతితో రెండు సెలక్ట్ చేసి షాపింగ్ పూర్తి చేసా. అంతకు ముందే పిల్లకి బాగా నచ్చిన ఫ్రాక్ కొనేసాం కాబట్టి 'అమ్మా నువ్వు రెండు కొనుక్కున్నావ్..' అని పోటీకి రాలేదని. బస్సులో కూచున్నాకా 'హమ్మయ్య హేపీనా..' అనడిగారు అయ్యవారు. 'ఏదీ ఇంకా ఒక టాప్ మీదకి మ్యాచింగ్ పటియాలా బాటమ్,చున్నీ కొనుక్కోవాలి కదా..' అన్నా. 'హతవిధీ!!' అని తలకొట్టుకున్నారు పాపం :) ఏదేమైనా మూడ్ బాలేనప్పుడు షాపింగ్ చెయ్యడమే మంచి ఉపాయం...! ఇంటికొచ్చి భోం చేసి, సంగీతప్రియలో పాట పోస్ట్ పెట్టి, పురాణం చదువుకుని పడుకునేసరికీ సమయం రెండు గంటలు చూపించింది. (ఈ పురాణ పఠనం గురించి ఓ పోస్ట్ రాయాలని నెలరోజుల్నుంచీ అనుకుంటున్నా!! ఎప్పటికవుతుందో) అందుకే ఇవాళ పొద్దున్న లేవలేకపోయా. అదన్నమాట.

సరే మళ్ళీ పొద్దుటి వాకింగ్ దగ్గరికొచ్చేస్తే.. కొత్త రూట్ లో వెళ్దాం అని వేరే సందులోకి తిరిగాను. ఇదివరకూ అక్కదంతా ఖాళీ జాగా ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇళ్ళు రెడీ అయిపోతున్నాయి..అక్కడుండే చెట్లు మొక్కలు అన్నీ కొట్టేసారు :( 


సెక్యూరిటీ గార్డ్ గుడిసె అనుకుంటా..బాగుంది కదా..

ఓ ఇంటి ముందర కాశీరత్నం తీగ కనబడింది. ఈ ఎర్రటి నాజూకైన పూలు నాకెంత ఇష్టమో చెప్పలేను. బెజవాడలో మా క్వార్టర్ గుమ్మానికి పక్కగా క్రీపర్ పెంచి ఎంతమందికి ఈ విత్తనాలు పంచానో..! చిన్నప్పుడు భాస్కరమ్మగారింటి వెనక పెరట్లో పిచ్చిమొక్కలతో పాటూ ఎన్ని తోగలు పెరిగేవో.. ఈ తీగ కనబడితే చాలు నేను నాస్టాల్జిక్ అయిపోతాను. నెమ్మదిగా ఆ గుమ్మం దాకా వెళ్ళి నాలుగు విత్తనాలు కోసేసుకుని చున్నీ చివర ముడి వేసేసాను. ఇంట్లో ఎవరూ లేచిన అలికిడి లేదు. ఎవరైనా కనబడితే అడిగే కోసుకుందును. గొప్ప ఆనందంతో వేరే సందులోకి వెళ్ళా. అక్కడ ఉండే ఓ ఇండిపెండెట్ హౌస్ నాకు బాగా ఇష్టం. చుట్టూరా చక్కగా  బోలెడు కూరగాయల  మొక్కలు వేస్తూంటారు వాళ్ళు. సీజనల్ కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. పపాయా పిందెలు చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా వంకాయ, కాలిఫ్లవర్, చిక్కుడు వేసారు. కన్నులారా ఆ మొక్కల్ని చూస్తూ ఆ సందు దాటాను.





వంకాయలు కనబడుతున్నాయా?



సత్సంగ్ కాలనీ లో ఫస్ట్ సిటీ బస్సు ఆగి ఉంది. వాళ్ల కాలనీ బయట పెంచే మొక్కలు కూడా చాలా బావుంటాయి చూడ్డానికి. అవి చూడడానికే అటువైపు వెళ్తుంటాను నేను. అప్పుడే లోపల్నుండి పాల బెల్లు ఔంవినపడింది. వాళ్లవన్నీ ఖచ్చితమైన పధ్దతులు. మా గేటేడ్ కమ్యూనిటీలో కూడా ఉన్నారు బోలెడుమంది సత్సంగీస్. పొద్దుటే నాలుగున్నరకే ప్రయర్ కి వెళ్టూంటారు. అక్కడ రౌండ్ పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నా రోజూ నాకెదురయ్యే జంట దూరంగా వెళ్పోతూ కనబడ్డారు. నేను లేట్ కదా ఇవాళా. చెవిలో గణేశ సుప్రభాతం అయిపోయి 'ఢోల్ బాజే' పాట ఎప్పుడు మొదలయ్యిందో గమనించలేదు కానీ అది పూర్తయ్యి 'నీ జతగా నేనుండాలి..' మొదలయ్యింది. ఎదురుగా ఉన్న మిష్టర్ సూర్యదేవ్ చూపుల వేడి ఎక్కువయ్యింది. ఇక ఈ పూటకి ఎనర్జీ బానే వచ్చేసింది వాకింగ్ చాలెమ్మనుకుని ఇంటిదారి పట్టాను.

బ్లాగ్ ముట్టుకుని చాలారోజులైందనిపించి ఈ ఉదయపు నడక కబుర్లన్నీ ఇక్కడ ఇలా నమోదు చేసా. సరే మరిక కబుర్లయిపోయాయి.. మీ పనుల్లో మీరుండండి..:-)

Saturday, October 11, 2014

Intha Siru Pennai ..


'లలలాల లాలాల... లాలాలలాలాలా..' అనే హమ్మింగ్ అలా చెవుల్లో అప్పుడప్పుడూ నాకు వినబడుతూ ఉంటుంది..భలే బావుంటుంది. ఇది " Intha Siru Pennai  .. " అనే పాటలోది. ప్రభుదేవా , మీనా నటించిన Naam Iruvar Namakku Iruvar అనే చిత్రం లోనిది. ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఈ సిన్మా గురించి తెలియవు. 

కార్తీక్ రాజా సంగీతం. హరిహరన్, విభాశర్మ పాడారీ పాట.

ఈ పాట క్రింద లింక్ లో వినచ్చు: 
http://7starmusiq.com/audio-player-popup-3.asp?MovieID=689&SongsId=4463

క్రింద లింక్ లో చూడచ్చు:
https://www.youtube.com/watch?v=SMHPVTrW1XI

Friday, October 10, 2014

May madham songs


వినీత్, సోనాలి కులకర్ణీ జంటగా "May Madham" పేరుతో వచ్చిన ఈ సినిమాని తెలుగులో 'హృదయాంజలి' పేరుతో డబ్బింగ్ చేసారు. తర్వాత అక్షయ్ ఖన్నా,సోనాలి బేంద్రే లతో హిందీలో రీమేక్ చేసారు. నాకు అసలు సినిమాలోని తమిళ్ సాంగ్స్ బాగా నచ్చుతాయి. వైరముత్తు సాహిత్యాన్ని అందించిన ఈ పాటలకు రెహ్మాన్ సంగీతాన్నందించారు. ఇందులో పాటలన్నీ బోలెడన్నిసార్లు రిపీటవుతూ ఉండేవి ఛానల్స్ లో. 

అన్నింటికన్నా ఎక్కువగా మనం పొద్దుటే వినే సుప్రభాతం ట్యూన్ తో మొదలయ్యే "Marghazhi Poove" బాగా హిట్ సాంగ్. నాకు మాత్రం బాలూ పాడిన "మిన్నలే.." మహా ఇష్టం. బాలూ గొంతులో ఉన్న ఎక్స్ప్రెషన్, ఆర్తి, వేదన మరెవరి వాయిస్ లోనూ పలకవని నాకో గాఠ్ఠి నమ్మకం. ఈ పాట మొత్తంలో వెనకాల రిపీట్ అయ్యే బోలెడు వయోలిన్స్ కలిపి చేసిన బిట్ అద్భుతంగా ఉంటుంది. తెలుగు ఆల్బం లో ఇది లేదనుకుంటా. 

1) minnalae..
  


 2)"En Mel Vizhunda... " అని మొదలయ్యే ఈ పాట చాలా నెమ్మదిగా మెలోడియస్ గా ఉంటుంది. "ఎదపై జారిన ప్రియ చినుకా ఎక్కడ దాగావిన్నాళ్ళూ.. గుండె తెరెచిన చిరు కవితా ఎక్కడ దాగావిన్నాళ్ళూ.."(http://www.youtube.com/watch?v=k26s8DBOqzw ) అని పాట తెలుగులో. తమిళానికి సరైన అనువాదం అవునో కాదో తెలీదు కానీ ఇది ఒక్కటీ మాత్రం తెలుగులో కూడా నచ్చింది నాకు. భువనచంద్ర సాహిత్యం అనుకుంటా.  
















3) తెలుగులో "మానస వీణ మౌన స్వరాన.."(http://www.youtube.com/watch?v=33VasJ-EbHM) అని మొదలయ్యే ఈ పాట తమిళంలో "Marghazhi Poove.." అని మొదలౌతుంది. ఇప్పుడంటే ఓ మంచి నటిగా సోనాలీ కులకర్ణీ బాగా తెలుసు కానీ అప్పట్లో ఎవరో కొత్త హీరోయిన్ అనుకునేవాళ్ళం :) ఈ పాటలో  పిక్చరైజేషన్ బావుంటుంది.

 

Thursday, October 9, 2014

Thenmerkku paruvakkaatru... + Porale Ponnuthayi..


"కరుత్తమ్మ" అనే చిత్రంలో దాదాపు అన్ని పాటలూ బాగుండేవి. సినిమా కూడా టివీలో వచ్చినప్పుడు చూసిన గుర్తు. కాస్త భారమైన సినిమా అయినా బావుంటుంది. భారతీరాజా సినిమా. ఇది "వనిత" పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసారని గుర్తు. రెహ్మాన్ సంగీతం. 'Porale Ponnuthayi' పాట తెలుగులో "పూదోట పూసిందంట" అని ఉండేది. ఇది sad version కూడా ఉంది కానీ నేను హేపీ వర్షన్ నే వినిపిస్తాను:) మిగతావాటి తెలుగు వర్షన్స్ గుర్తులేవు.

ఈ సినిమాలో మహేశ్వరి మీద పిక్చరైజ్ చేసిన " Thenmerkku.." అనే మరో పాట కూడా నాకు బాగా ఇష్టం. మిగిలిన వాటిల్లో "Pacha Kili Paadum" ( http://www.youtube.com/watch?v=FKdv48FL5Qw), "Kaadu Potta Kaadu" ( http://www.youtube.com/watch?v=4T0aPXIl3tM) బావుంటాయి. ఈ పాటల్లో కనబడే పల్లె వాతావరణం, పచ్చదనం ముఖ్యంగా ఆకట్టుకుంటాయి. 


1) Thenmerkku paruvakkaatru... 
 ఈ పాటలో వర్షాన్ని బాగా చూపిస్తారు. రెహ్మాన్ అందించిన ట్యూన్ కూడా మర్చిపోలేనిది.

 



2) Porale Ponnuthayi.. 
ఈ పాటకు గానూ రెండు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఒకటి వైరముత్తు సాహిత్యానికీ, మరోటి గాయని స్వర్ణలతకీ. రెహ్మాన్ పైకి తెచ్చిన మరో మంచి గాయని స్వర్ణలత. 

Wednesday, October 8, 2014

menamma... + pulveli pulveli..



ఇవాళ ఒకే సినిమాలోవి రెండు పాటలు.. తెలుగులో 'ఆశ ఆశ ఆశ' పేరుతో డబ్బింగ్ చేసిన ఈ తమిళ్ మూవీ పేరు "ఆశై". అజిత్ హీరో. అప్పట్లో అజిత్ సినిమాలన్నీ చూసేసేవాళ్లం.. మరి బావుంటాడు కదా :) ఈ సిన్మాలో వీరోవిన్ బావుంటుంది కానీ పేరు గుర్తులేదు. 

సరే పాటల్లోకొచ్చేస్తే "మీనమ్మా..." అనే పాట, "pulveli pulveli.." అనే పాట రెండూ చాలా బాగుంటాయి. ఇంకోటి అజిత్ ది సోలో సాంగ్ ఒకటి ఉంది .అది కూడా బావుంటుందని గుర్తు. ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో ఈ రెండు పాటలు షేర్ చేస్తున్నాను. దేవా సంగీతం. ఈయన బాణీలు కూడా చాలా మెలోడియస్ & మెమొరబుల్. 

1)"మీనమ్మా... "
ఈ పాట ఇంటర్ల్యూడ్స్ లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే బిట్ చాలా బావుంటుంది.

  


2) ఈ పాటకి తెలుగులో "మెల్లగా మెల్లగా తట్టి..." పల్లవి అని గుర్తు. 




Tuesday, October 7, 2014

Thendral Vanthu Theendum Pothu... ఇళయ్ మైకం


  
 భాష తెలీదు.. ఒక్క ముక్క అర్థం కాదు కానీ ఆ రాగం.. ఆ పదాలు.. ఎందుకో మనసుకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి. రికార్డ్ అయిన కేసెట్స్ వచ్చాకా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వెనక్కి తిప్పుకుని వినేదాన్ని..! 

ఇళయరాజా ఏం చేసినా మహాప్రసాదం. పాడినా అంతే. ఆయన గళం నచ్చనివారూ ఉన్నారు. కానీ నాకు ఆయన పాడిన పాటలన్నీ కూడా ఇష్టమే. "కుర్ర కళ్ళు చీర గళ్ళలో దారే లేక తిరుగుతున్నవి.. ముంచే మైకమో మురిపించే మోహమో.." అని పాడినప్పుడు కూడా :) 

 ఈ పాటలో జానకి స్వరం.. ఇళయరాజా బాణీ.. రెండూ మహదానందాన్ని  కలిగించేవే..i just love this song..

Monday, October 6, 2014

Malargale Malargalae..



సన్ టివిలో "Pepsi Ungal choice" ప్రతీ వారం చూసిన రోజుల్లో 'ఉమ' అనే అమ్మాయి హోస్ట్ చేసేదా కార్యక్రమాన్ని. బోలెడుమంది ఫాన్స్ ఉండేవారా అమ్మాయికి. ముద్దుగా బావుండేది ఆ అమ్మాయి కూడా. అందులో నచ్చిన పాటలన్నీ లిస్ట్ రాసుకుని, పేర్లు గుర్తుండకపోతే నటీనటుల పేర్లు రాసిపెట్టి, అప్పట్లో మద్రాసులో చదువుకుంటున్న మా కజిన్కి ఆ లిస్ట్ పంపించి ఆ పాటలన్నీ రికార్డ్ చేయించుకున్నాను. వాటిల్లో కొన్నింటిని ఈ బ్లాగ్ లో పోస్ట్ చెయ్యాలని. ఒకటి నిన్న పోస్ట్ చేసా కదా. ఇది మరొకటి.. "Malargale Malargalae" అని రెహ్మాన్ స్వరపరిచినది. అందువల్ల ఇష్టం. specially tune & interludes..

 ఇదిగో ఇదే పాట..