భాగ్యనగరంలో జరుగుతున్న 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన రేపటితో ఆఖరు. ఈసారి ఓ రెండు విజిట్స్ వెయ్యడం కుదిరింది. మేమిద్దరం వెళ్ళినప్పుడు జాగ్రత్తగానే కొనుగోలు చేసాము కానీ మా అమ్మాయిలుంగారు నాతో వచ్చినప్పుడు మాత్రం, కూతురు పుస్తకాలు కొంటోందన్న మైమరుపులో కాస్త బడ్జెట్ తలకిందులైందనే చెప్పాలి. అమ్మాయి కొనేవి తొంభై ఐదు శాతం ఆంగ్ల పుస్తకాలే అయినా, పుస్తకాలు కొంటే చాలు అనుకుంటాను నేను. తను చదివిన పాఠశాలలో టీఛరు దొరకలేదని తెలుగు సబ్జెక్ట్ తీసేసి హిందీ పెట్టేయడం వల్ల వార్తాపత్రిక చదివేంత తెలుగు మాత్రమే అమ్మాయికి వచ్చింది. (అదీ పట్టుబట్టి ఇంట్లో నేర్పడం వల్ల)
అమ్మాయికి స్వయంగా చదువుకునే వయసు వచ్చాకా, నిద్రపుచ్చే సమయంలో రోజూ చెప్పే కథలు చెప్పటం మానేసి ఓ పుస్తకం ఇచ్చి నువ్వే కథ చదువుకో అని పుస్తకాలు అలవాటు చేసాను దానికి చిన్నప్పుడు. అలా అలవాటైన పుస్తక పఠనం ఇప్పుడు చదువు రీత్యా కాస్త తగ్గినా కూడా, ఇంకా కొనసాగటం ఆనందకరమే నాకు. ఈసారి తను కొన్న వాటిల్లో కాస్త భారీ పుస్తకం Yuval Noah Harari గారి Sapiens: A Brief History of Humankind. ఇంకోటి నామరామాయణం లోని ప్రతి నామానికి అర్థ,వర్ణనలు ఉన్న ఒక పుస్తకం కొంది.
కానీ ఇంటికొచ్చాకా బిల్లు చూసి ఇంటాయన కాస్త ఖంగుతిన్నమాట వాస్తవం :) పెద్ద ఏరు ఎలా పోతే... అన్న సామెత గుర్తుచేసుకున్నారు పాపం. నా బిల్లు ఇక తగ్గిపోయిందని వారు సంతోషించేలోపూ పిల్ల ఏరు తయారైంది. మరి ఏమాట కామాటే, ఉపయోగకరమైన విషయ పుస్తకాలే కొంటుందని నేనూ కాదనను.
ఇక నేను పుస్తక ప్రదర్శనలో గమనించినదేమిటంటే, ఈసారి చాలా కొత్త పుస్తకాలు పబ్లిష్ అయినట్లు కనిపించాయి. పాఠకులు కూడా ఎక్కువగానే కనిపించడం సంతోషకరమైన సంగతి. నూకల చిన్న సత్యనారాయణగారి "వాగ్గేయకారుల కృతిసాగరం" రెండు భాగాలు ఒక స్టాల్ లో దొరికాయి. కొద్దిగా డేమేజీ ఉంది వేరే పుస్తకాలు ఇమ్మని అడిగాను కానీ అసలు ఇంక ఎక్కడా కాపీలు లేవు.. ఇవే అఖరు కాపీలు అన్నారు. వెంటనే మారుమాటాడకుండా రెండు భాగాలు కొనేసాను. అందులో త్యాగరాజు తో సహా వివిధ వాగ్గేయకారుల కృతులన్నీ పొందుపరుచారు. చాలాసార్లు కొన్ని కృతులు వింటున్నప్పుడు సాహిత్యం కోసం నెట్ లో చాలా వెతుక్కోవలసి వస్తోంది. కాబట్టి అన్నీ ఒకేచోట ఉన్న ఇటువంటి అరుదైన పుస్తకాలు లభించడం అదృష్టంగా భావించాను.
ఈసారి యూనివర్సల్ పబ్లిషింగ్ వారి వద్ద మూడు పుస్తకాలు కొన్నాము. భారతదేశంలోని వివిధ ఆలయాల గురించిన వివరాలతో, శిలాశాసనాలు, విగ్రహాల రంగురంగుల ఫోటోలతో ఉన్న ఆ పుస్తకాలు నిజంగా కొనదగ్గవి. మేము కాశీ, అరుణాచలం, శ్రీశైలం ముడు ఆలయాల పుస్తకాలు కొన్నాము. నలభై శాతం డిస్కౌంట్ కూడా లభించింది మాకు. దానితో పాటే మల్లెపూల మీద రాసిన పుస్తకం ఒకటి కాంప్లిమెంటరీ అని ఇచ్చారు స్టాల్ యజమాని. వివిధ రకాల మల్లెపులతో, మల్లె దండల ఫోటోలతో ఉన్న ఆ పుస్తకం బహు అందంగా ఉంది.
మేము కొన్న మరో రెండు పుస్తకాలు - చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి కథలు గాథలు 1& 2 భాగాలు. చదవదగ్గ, కొనుక్కోవలసిన పుస్తకాలు ఇవి. ముఖ్యంగా భావితరాలకు మన గత వైభవాన్ని కళ్ళకు కట్టేవి ఇలాంటి పుస్తకాలే.
భైరప్ప గారి "పర్వ" తెలుగు అనువాదం క్రితం సారే చూశాను కానీ ఇక మామూలు పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిపోవడం వల్ల కొనలేదు. కానీ కవర్ పేజిలో భైరప్ప గారి పేరు "బైరప్ప" అని వేశారు. మరి ప్రూఫ్ చూసినవాళ్ళు అది గమనించలేదో ఏమో తెలీదు. ఇటువంటి అచ్చుతప్పులు, అదీ కవర్ పేజీ మీద వెయ్యడం ఆశ్చర్యకరం. లోపలి పేజోలో మళ్ళీ సమంగానే "భైరప్ప" అని వేశారు.
ఇవీ క్లుప్తంగా ఈసారి పుస్తక ప్రదర్శన కబుర్లు. గత కొన్నేళ్ళలో ఆన్లైన్ లోనే కాక పుస్తక ప్రదర్శనల్లో కూడా ఎంతో మంచి మంచి పుస్తకాలను కొనుక్కున్నాను. కొన్ని చదివాను. కొన్ని చదవాలి. వీలయినప్పుడు వాటి ప్రస్తావనతో టపా రాయాలని ఆశ అయితే ఉంది. రాబోయే సంవత్సర కాలం సహకరిస్తే ఆ కబుర్లు పంచుకుంటాను.
దూరదర్శన్ మాత్రమే ఏకఛత్రాధిపత్యం వహించిన ఎనభై దశకంలో ఎందరో నటీనటులు ప్రాంతీయ, భాషాభేదం లేకుండా మనలో చాలా మందికి ఆప్తులుగా మారిపోయారు. నిజజీవితానికి, ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా ఉండేలాంటి అప్పటి టీవీ సీరియళ్ళు కొన్ని ఇప్పటికీ మన మనసుల్లో బంగారపు ఇళ్ళు కట్టుకుని ఉండిపోయాయి.
హిందీ భాష నేర్పడం నుంచీ మొదలుపెట్టి, ఎంతో విజ్ఞానాన్ని అందించిన అప్పటి దూరదర్శన్ గురించి అసలు ఒక ప్రత్యేకమైన టపానే రాయాలి. కానీ ప్రస్తుతానికి నన్ను కదిలించిన నిన్నటి వార్త గురించి నాలుగు మాటలు - నటుడు సతీష్ షా మరణం! చిన్నప్పుడు "ఏ జో హై జిందగీ" అని ఒక సిరీస్ వచ్చేది. షఫీ ఇనాందార్, స్వరూప్ సంపత్ అందులో ముఖ్య పాత్రలు. ఆ సీరియల్ లో ఒక్కో ఎపిసోడ్ కీ ఒక్కో పాత్రలో సతీష్ షా కనిపిస్తారు. బొద్దుగా, అందంగా ఉండే ఆయన రూపం కూడా చూడగానే చిరునవ్వు తెప్పిస్తుంది. హాస్య నటుడిగా ఆయనది ఒక ప్రత్యేకమైన రీతి. బుల్లి తెరపై గానీ, వెండితెరపై గానీ సతీష్ షా కనిపించగానే సీరియస్ గా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా నవ్వులు పూస్తాయి. పోషించినవి లీడ్ రోల్స్ కాకపోయినా, చిన్న పాత్రలే అయినా, కొందరు ఉత్తమ నటులు మనసుకి దగ్గరగా ఉండిపోతారు. అందులో హాస్య నటులు మరీనూ. 'జానే భీ దో యారో' మొదలుకొని ఎన్నో సినిమాల్లో ఆయన పోషించిన హాస్య పాత్రలు చిరస్మరణీయం.
హాస్యనటులు అంటే నాకు మొదటి నుంచీ చాలా అభిమానం. ఎందుకంటే హాస్యం పండించడం తేలికైన పనేమీ కాదు. సీరియస్ రోల్స్ కూడా బాగా చెయ్యగలిగే కొందరు పెద్ద నటులు కూడా తెరపై హాస్యరసాన్ని సరిగ్గా పండించలేరు. అదీకాక మనిషిని ఆహ్లాదపరిచేదీ, మనసుని తేలికపరిచేది హాస్యమే. ఎప్పుడైనా బాగా చిరాకుగా ఉన్న ప్రతిసారీ నేను పాత బ్లాక్ అండ్ వైట్ రమణారెడ్డి, రేలంగీ హాస్యాన్ని చూస్తూ ఉంటాను. రిలాక్సింగ్ కి అంతకు మించిన మందు లేదనిపిస్తుంది నాకు. హాయిగా గట్టి గట్టిగా నవ్వేస్తే మనసు తేలికైపోతుంది. హాస్యానికి అంత పవర్ ఉంది. మనల్ని మనసారా నవ్వుకునేలా చేసే ప్రతి హాస్యనటుడూ ఒక గొప్ప మెజీషియన్ తో సమానం.
విలక్షణ హాస్యనటుడు సతీష్ షా కు నా హృదయపూర్వక శ్రధ్ధాంజలి.
సినిమా పేరు ఎంత బాగుందో కథలో ప్రేమ కూడా అంతే బాగుంది ! అందమైన ప్రకృతి.. తమిళనాడులోని "వాల్పరై" కొండప్రాంతాల రమణీయమైన అందాలు, చిత్రీకరణ చాలా చాలా బాగుంది. స్టన్నింగ్ ఫోటోగ్రఫీ! హీరో అబ్బాయిని ఇదివరకూ "వికటకవి" వెబ్ సిరీస్ లో చూసి బాగా నటించాడనుకున్నాము. ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని ఫిక్సయిపోయాము. ఈ చిత్ర కథ ఎలా ఉన్నా, నాయికా,నాయకుల మధ్య ప్రేమ చిత్రీకరించిన విధానం బాగుంది. వెరీ డీసెంట్ ఇన్ టుడేస్ టైమ్స్ అనే చెప్పాలి. సినిమాలో వీరిద్దరి ప్రేమకథ పార్ట్ చాలా చాలా బాగుంది. ఎంతో హృద్యంగా ఉంది. ఇద్దరి మధ్య డైలాగ్స్, ఇంకా పేరెంట్స్ తో హీరో హీరోయిన్ మాట్లాడే డైలాగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కొత్తమ్మాయి. కేరెక్టర్ చాలా బాగుంది. భలే సరదాగా ఉంది ఆ అమ్మాయి స్క్రీన్ మీద ఉన్నంతసేపూ. బాగా నటించింది. కానీ మొత్తం మీద ఇంకా బాగుండచ్చేమో అనిపించింది. బామ్మగా, శాస్త్రీయ సంగీత గాయనిగా రాధిక పాత్ర, ఆవిడ చీరలు, జువెలరీ, మేకప్ బాగా తనకి సెట్ అయ్యాయి. ముఖ్యంగా తను పెట్టుకున్న ముక్కుపుడక బాగా నచ్చింది నాకు. హీరోయిన్ ముక్కుపుడక కూడా అందరు హీరోయిన్ లూ ఈమధ్య పెట్టుకునే నోస్పిన్ లా కాకుండా కాస్త డిఫరెంట్ గా బాగుంది. గాయకులు ప్రిన్స్ రామవర్మ గారు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఒక అందమైన డీసెంట్ ఫిల్మ్ కేటగిరీలోకి ఈ సినిమా వస్తుంది. Sun NXT లో ఈ సినిమా చూడవచ్చు. యూట్యూబ్ లో కూడా ఉంది కానీ పాటలు ఉండవు. చిన్న చిన్న stanza songs 2,3 ఉన్నాయి. సో, ఆ పాటలతో కలిపి చూస్తేనే ఫీల్ ఉంటుంది కాబట్టి సన్ నెక్స్ట్ లో చూస్తేనే బాగుంటుంది.
క్రింద ఇన్సర్ట్ చేసిన పాట ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా వర్షం, గాలి, అందమైన ప్రకృతి, చిత్రికరణ, సాహిత్యం అన్నీ చాలా బాగున్నాయి. చరణ్ గళం మరోసారి బాలుని గుర్తు చేసింది. వాయిద్యాల హోరు కాకుండా నేచరల్ సౌండ్స్ ని ఉపయోగించుకున్న విధానం సృజనాత్మకంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
ఓటిటిలో వచ్చేరకరకాల భారతీయ భాషల సినిమాలు, వెబ్ సిరీస్లు చాలవన్నట్లు ఇతర దేశ భాషల వెబ్ సిరీస్లు బాగా చూసేయడం మన ప్రేక్షకులకి బాగా అలవాటయిపోయింది. (అలా అనేకన్నా నెమ్మదిగా అలవాటు చేసేసారు అనాలేమో!)
అందులో వింతేముంది.. విదేశీ భాషలలో సిన్మాలు, సీరియళ్ళు చూడడం తప్పా ఏమిటి? కొత్త భాష నేర్చుకోవచ్చును కదా అనుకోవచ్చు. అవును మరి మేమూ మా చిన్నప్పుడు టీవీ చూసే హిందీ, తమిళం, ఇంగ్లీషు మొదలైన రెండు, మూడు భాషలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఓటీటీ వల్ల మళయాళం, కన్నడం, మరాఠీ, బెంగాలీ మొదలైన భాషలు(కొన్ని లాంగ్వేజ్ సెలెక్షన్ లేని సినిమాలు కూడా ఉంటున్నాయి మరి) కూడా కాస్త బాగానే అర్థమైపోతున్నాయి. పోనీలే ఈ వంకన కొన్ని భారతీయ భాషల పదజాలాలు, పదాలు తెలుస్తున్నాయి అని చిన్నగా ఆనందపడుతూ పడుతూ ఉండగా, ఈమధ్యన అంటే ఈమధ్యన కాదుగానీ ఓ ఏడాది నుంచీ కొరియన్ వెబ్ సిరీస్లు ఇంట్లో బాగా వినిపిస్తున్నాయి. ఇదేమిటీ ఇన్ని భారతీయ భాషలు ఉండగా అవేమీ సరిపోవన్నట్లు కొత్తగా ఈ కొరియన్ భాషేమిటీ? అని ప్రశ్నిస్తే మా పాపగారికి అవే బాగా నచ్చాయట. పొద్దంతా అదే గోల. దే, వే అనుకుంటూ దీర్ఘాలు తీసుకుంటూ డైలాగులు వినిపిస్తూ ఉంటాయి వంటింట్లోకి. నేను అడిగితే ఒక్కదానికీ టైమ్ దొరకదు కానీ కూతురుతో పాటూ కొరియన్ సీరియళ్ళు చూడడానికి మాత్రం ఎక్కడ లేని సమయం దొరికేస్తుంది అయ్యగారికి. అందుకని నాకింకా కోపం అవంటే.
ఏదో ఒకటి పోనీ కలిసి చూసేద్దాం అని సరదా పడి కూచుంటే పది నిమిషాలు కూడా చూడలేకపోయాను నేనైతే. అందరు ఆడవాళ్ల మొహాలూ ఒకలాగే ఉంటాయి. గుండ్రంగా ఉండే కళ్ళు, మైదా పిండిలా తెల్లని తెలుపు, అందరూ ఒకేలా ఉంటారు, పోనీ అంత అందంగా ఉన్నారు కదా అని చూస్తే ముసలమ్మల్లాగ సాగదీసుకుంటూ మాట్లాడతారు ఏమిటో...చిరంజీవిలాగ అంత చక్కని రూపేంటీ? ఆ భాషేంటీ అంటాను నేను. మా అమ్మాయి ఆ భాషని ఎనలైజ్ చేసి, ఏమేమిటో లింగ్విస్టిక్ పాఠాలు చెప్తూ ఉంటుంది నాకు. మా ఇంట్లోనే అనుకుంటే కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ ఫోన్ చేసి మా పిల్లలు కూడా తెగ చూస్తారు కొరియన్ సిరీస్లు. నేనూ చూస్తాను వాళ్ళతో, ఎంత బాగుంటుందో! అని ఒక సీరీస్ పేరు చెప్పింది. పొరపాటున అది చెప్పాను. అంతే అది అయిపోయేదాకా వదల్లేదు మా వాళ్ళు. ఇదిగో మీ ఫ్రెండ్ చెప్పిందిగా నువ్వూ చూడు అని చూపెట్టేసారు. అదేదో అత్తగారూ, కోడలు, ఇగోలు, ఆస్థుల ఇగోలు, ఆస్తుల సిరీస్. ఎత్తుకు పై ఎత్తులు, చివరికి క్షమించేసుకోవడాలు! కథ బానే ఉంది కానీ ఇవన్నీ మన కథల్లో కూడా ఉన్నాయి కదా..
అంతకు ముందు ఏదో హోటల్ రిలేటెడ్ స్టోరీ. ఒక్కసారి చూడడమే కష్టం అంటే, కాస్త గ్యాప్ తర్వాత కామిడీ బాగుంటుంది అంటూ ఆ సిరీస్ ని రెండోసారి కూడా మోగించారు మా ఇంట్లో. ఒక స్టార్ హోటల్ ఓనర్, స్టాఫ్. ఒక ట్రయినీ పిల్ల పై ఓనర్ కి ప్రేమ. ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. అక్కడా ఏవేవో కుట్రలు,కుతంత్రాలూ. వాట్స్ న్యూ? ఐ డోన్నో !! అందులో పాటలు డౌన్లోడ్ చేసుకుని బట్టీ పట్టేసి పాడేసేంత పిచ్చిగా మా పిల్ల, ఇంకా రిలెటివ్స్ పిల్లలు అంతా కూడా తెగ చూసేసారు.
ఆ తర్వాత ఒక కోర్ట్ డ్రామా. సాధారణంగా అలాంటివి నేనూ చూస్తాను కానీ ఇందులో ఏం చేసారంటే హీరోవిన్ లాయర్ పిల్ల ఆటిస్టిక్ అమ్మాయి. అయినా అద్భుతమైన తెలివితేటలతో ఉండి, ఎవ్వరూ పట్టుకోలేని లా పాయింట్లు లాగి కేసులు గెలిచేస్తూ ఉంటుంది. అలాంటివాళ్లని నేను ఏమీ అనట్లేదు, కానీఅలాంటి కేరెక్టర్ ఉంటే అసలు చూడలేను. ఆ సిరీస్ ఇక ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అది కూడా వంటింట్లోకి దీర్ఘపు సాగతీత డైలాగులు వినిపించడమే.
ఆ తర్వాత మరో హారర్ సిరీస్. అందులో మాయలు కూడా. ఇంక చాలర్రా అంటే అపుతారా? ఇంక ఇప్పుడు ఓ వారం నుంచీ మరో కొత్త కొరియన్ సిరీస్ చూస్తున్నారు మా ప్రేక్షక మహాశయులు. నిన్న ఆదివారం పొద్దున్న మా పిల్ల ఇంక నన్ను పారిపోకుండా పట్టుకుని , అమ్మా నీకు వంటలు అయితే నచ్చుతాయి కదా ఇది వంటల సీరియల్ చూడు కొత్త కొత్త వంటలు ఎంత బాగా చేస్తుందో ఈ అమ్మాయి అని కూర్చోపెట్టింది. సేమ్ సేమ్ ఫేసెస్, సేమ్ సేమ్ డైలాగ్స్, నాకేమీ ఎక్సైటింగ్ గా అనిపించలేదు. అయినా వంటలు కదా అని కాసేపు చూశాను. ఏదో బుక్కు లోంచి రాజుల కాలంలోకి ఆ షెఫ్ వెళ్పోతుందిట.[మన టైం లోంచి రాజుల కాలం లోకా...ఇదేదో మన ఆదిత్యా 369 కథ లా ఉంది కదా] సో, ఆ రాజుగారికి ఆ అమ్మాయి వంట నచ్చేసి హెడ్ కుక్ గా పెట్టేసుకుని, రోజూ కొత్త కొత్త వంటలు చేయించుకుని తినేస్తూ, ఆమ్మాయిని విపరీతంగా ప్రేమించేస్తూ ఉంటాడు. ఇంతలో మరో రాజ్యం వారితో వంటల పోటీ. ఇరు రాజ్యాల వారూ అతి అరుదైన పదార్థాలతో రుచికరమైన వంటలు చేసి పెట్టేస్తే, ఆ రాజులు అద్భుతమైన ఫీలింగ్స్ చూపెడుతూ తినేస్తూ ఉంటారు. కథ బానే ఉంది గానీ ఆ వండే పదార్ధాలని చూస్తే కడుపులో తిప్పింది నాకు. డక్కులు, చికెన్లు, ఇంకా ఏవేవో క్రిమికీటకాలు, రోస్టింగులు. 'అవన్నీ చూడకూడదమ్మా, వంట ఎలా చేస్తున్నారో చూడాలంతే..' అని నాకు సలహాలు. మళ్ళీ ఆ కథలో కూడా కుట్రలు, ఎత్తుకు పై ఎత్తులు.. ఎక్కడ చూసినా అవే కథలు కదా! మన దగ్గర లేని కథాలా? మరి ఎందుకీ కొరియన్ పిచ్చి?
చాలా మంది ఇవి చూస్తున్నారనడానికి ఒక ఉదాహరణ - ఇటీవల ఏదో సినిమా టైటిల్స్ లో కథ కొరియన్ రైటర్ దని చూసి హాచ్చర్యపోయాను. ఇంకా మొన్నమొన్న ఓటీటీలో వచ్చిన కొత్త "సుందరకాండ" సినిమాలో హీరో తల్లి ఒక డైలాగ్ అంటుంది. ఏమంటున్నావే అంటారు ఆవిడ భర్త. ఆ ఫలానా డైలాగ్ ని కొరియన్ భాషలో అన్నానండి అంటుంది ఆ తల్లి. ఆవిడకి కొరియన్ సీరియళ్ల పిచ్చి అని, అస్తమానూ అవే సిరియల్స్ చూసేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. జంధ్యాల ఉండుంటే ఈ కేరక్టర్ని ఇంకాస్త బాగా ఎలివేట్ చేసేవారేమో అనిపించింది. అన్నట్లు ఆ కొత్త "సుందరకాండ" సినిమా కూడా బావుంది సరదాగా.
ఇంతకీ నాకు అర్థంకాని పాయింట్ ఒక్కటే.. మన భారతీయ కథల్లో, సినిమాల్లో లేని కొత్తదనం ఆ కొరియన్ కథల్లో ఏముందీ అని?! అవే మంచి-చెడు, అవే కుళ్ళు,కుట్రలు, పగలు-ప్రతీకారాలు, అవే చెడు అలవాట్లు, గృహ హింస, అవే ప్రేమలు. ఇంకా మన కథల్లో మనుషులు వేరు వేరుగా ఉంటారు. వాళ్ళేమో చూడ్డానికి కూడా అంతా ఒకేలా ఉంటారు. ఏమిటో.. నాకయితే ఎంత మాత్రం నచ్చవు.
ఈ వంట సీరియల్ అయిపోయాకా ఇంకో కొత్త కొరియన్ సిరీస్ రాకుండా ఉంటే బాగుండ్ను అని మాత్రం కోరుకుంటున్నాను. లేకపోతే నే అడిగే ప్రశ్నలకి నాకే మళ్ళీ క్వశ్చన్ మార్కులా మా అమ్మాయి చెప్పే కొరియన్ సమాధానాలకి నేను గూగుల్ సర్చ్ చేసుకోవాల్సివస్తోంది :((
కొసమెరుపు ఏమిటంటే నిన్న పొద్దున్న వంటల సీరియల్ చూస్తున్నప్పుడు యురేకా నేనొకరిని గుర్తుపట్టా అన్నాను. ఏమిటంటే ఈ హీరోయిన్ను ఇదివరకూ హోటల్ సీరియల్లో హీరోయిన్నుగా వేసినమ్మాయి అని!! "ఆహా..అమ్మా నువ్వు.. నువ్వు గుర్తుపట్టావా...నువ్వు అప్గ్రేడ్ అయ్యావమ్మా. ఐయామ్ వెరీ హేపీ" అంది మా అమ్మాయి!
నాలుగైదు సినిమాలు కలిపి ఒక టపా రాద్దామనుకుంటాను. ఈలోపూ మొత్తమంతా ఒకే సినిమా గురించి చెప్పాలనిపించేలాంటి సినిమా ఒకటి వస్తోంది. ఇది అలాంటి ప్రత్యేకమైన సినిమా! ఇంతకు ముందు ఏమి సినిమాలు తీశారో తెలీదు కానీ ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు ఫణింద్ర నర్సెట్టి గారికి అభినందనలు. ఇటువంటి మంచి తెలుగు సినిమాలు ఇంకా ఇంకా రావాలని మనస్ఫర్తిగా కోరుకుంటున్నాను.
పదేళ్ళక్రితం నిత్య బంగారం నటించిన "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" అని ఒక సినిమా వచ్చింది. యువతి యువకుల మధ్య ప్రేమ ఇలా ఉండాలి అనే ఒక గొప్ప నిర్వచనాన్ని చూపెట్టిందా కథ. మళ్ళీ ఇన్నేళ్లకు అటువంటి మరో గొప్ప నిర్వచనాన్ని ప్రేమకు ఆపాదించిన కథ ఈ ఎనిమిది వసంతాలు. ఒక ఆంగ్లపత్రికవారు ఎందుకనో మనస్ఫూర్తిగా మెచ్చుకోలేకపోయారు కానీ నాకయితే ఏ వంకా కనిపించలేదు. మూస సినిమాల నుంచి భిన్నంగా, ఆదర్శవంతంగా, పోజిటివ్ గా, ఉన్నతంగా ఉన్న సినిమాలని ప్రోత్సహించాలి. మెచ్చుకోవాలి. ఈకలు పీకకూడదు. హీరోయిన్ తల్లి చెప్పినట్లు ఈ "..కథలో రెక్కల గుర్రాల్లేవు, రాక్షసులతో యుధ్ధాల్లేవు, ఐనా ఇది చందమామ కథకు ఏ మాత్రం తీసిపోని కథ. మనిషి మీద, ప్రేమ మీద గౌరవాన్ని పెంచే కథ".
ఆ రోజు రిలీజయిన ఇంకేదో సినిమా కోసం ఓటీటీలో వెతుకుతూ ఉంటే ఇది కనిపించింది. ట్రైలర్ ఆ మధ్యన చూశాను. ఆసక్తికరంగా ఉంది. సరే ఇది చూసేద్దాం అని మొదలుపెట్టాము. చివరి దాకా కదిలితే ఒట్టు. ఆ అమ్మాయి..అదే హీరోయిన్ పిల్లని ఇదివరకూ MAD సినిమాలో చూశాం. ఈ సినిమాలో ఇంకా బాగుంది. ముఖ్యంగా ఆ పాత్రను మలిచిన తీరు అద్భుతం. సావిత్రి పాత్ర కోసమే కీర్తి సురేష్ పుట్టిందనుకున్నాం మహానటి చూశాకా. అలా ఈ పాత్ర కోసమే ఈ పిల్ల పుట్టిందేమో అన్నట్లుంది. జీవితంలో evolutionతో ఎదిగే పాత్ర కాదు. మొదటి నుంచీ ఒకటే రకం. గొప్ప విలువలు ఉన్న గట్టి పిల్ల. మంచి పిల్ల. అందమైన పిల్ల. బహుశా ఈ పాత్ర దర్శకుడి dream girl అయ్యింటుంది. నాకయితే ఈ పిల్ల చాలా చాలా నచ్చేసింది. Pure Gold. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో తొంభై ఐదు శాతం హీరోయిన్లకి పాపం వంటి నిండా వేసుకోవడానికి బట్టలు ఉండవు. నోటి నిండా మాట్లాడడానికి రెండు లైన్ల డైలాగులు ఉండవు. గుర్తుంచుకోవడానికి సమమైన పాత్ర ఉండదు. వేస్తే నాలుగు డాన్సులు ఉంటాయి లేదా జీవితంలో మరో ధ్యేయం లేనట్లు హీరో చూట్టూరా తిరగడాలు ఉంటాయి. రుద్రవీణలో డైలాగ్ లాగ అంత చక్కని రూపేంటీ? ఆ పాత్రేంటి? అని వాపోయే స్టేజ్ మన తెలుగు హీరోయిన్ ది.(మిగతా భాషల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కానీ ప్రస్తుతానికి తెలుగు సినిమా గురించే మాట్లాడుకుందాం). అటువంటి poor state నుంచి ఇంతటి elivated state లో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రని చూస్తే నిజంగా కడుపు నిండిపోయింది. "ప్రేమ" అంటే అబ్బాయి లేదా అమ్మాయి ఒకరి కోసం ఒకరి జీవితాలను ఒకరు పాడు చేసుకోవడం, చంపుకోవడాలు, హత్యలు, గొడవలు, మొదలైన చెత్త కాకుండా "ప్రేమించడం" అంటే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోవడం కూడా అనే గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు నాకు ఈ సినిమా నచ్చింది. ఈమధ్య ఇలాంటి బరువైన కంటెంట్ ఉన్న కొన్ని మంచి సినిమాలు ఓటీటీ ప్లాట్ఫార్మ్ లో చూశాము. అసలు ఓటీటీ వల్లనే ఇంకా down to earth సినిమాలు, మంచి సినిమాలు, కుటుంబ సమేతంగా కూర్చుని చూసే సినిమాలు వస్తున్నాయేమో అనడం అతిశయోక్తి కాదేమో.
సినిమాలో అందరూ బాగా చేశారు కానీ ఆ రెండవ హీరో హెయిర్ స్టైల్ బాలేదు. ఏమిటో విగ్గు పెట్టినట్లు.. నచ్చలేదు. బహుశా డీ గ్లామరైజ్డ్ గా చూపించాలనేమో మరి. ఇంకా చాలా రాయాలని ఉంది కానీ ఏమీ రాయాలని కూడా లేదు. సినిమా చూసి రేపటికి వారమేమో. అయినా ఆ అమ్మాయి వాయిస్, ఆ డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి -
"నిజానికి ఎవ్వరి వల్లా ఎవ్వరూ ఏమీ అయిపోరు. ఏదో దాస్తూ, బయటకు నిజం చెప్పే ధైర్యం లేక నిందలు మోపేసి, చెడ్డోళ్లని చేసేసి, వదిలించేసుకుంటారు".
"my mom raised me like a Queen and a Queen even at a funeral mourns with dignity. కన్నీళ్ళలో కూడా తన హుందాతనాన్ని కోల్పోదు"
ఈ సీన్ దగ్గర కళ్ళల్లోంచి నీళ్ళు జలజలా రాలాయి!!
"ఎవరు తుఫాన్లు వాళ్లకుంటాయి. కొందరు బయటపడతారు. ఇంకొందరు ఎప్పటికీ బయటపడరు"
"పుస్తకం పూర్తిచేసే పాఠకుడి గుండెల్లో గుప్పెడు ఆశను నింపకపోతే మన చేతిలో అక్షరం ఉండీ ఎందుకండీ?"
చివరిగా సర్కులేట్ అవుతున్న, నాకు బాగా నచ్చిన రెండు వీడియో బిట్స్ పెడుతున్నాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇష్టపడేవారు నెట్ఫ్లిక్స్ లో ఎనిమిది వసంతాలు సినిమా (ఇంకా చూడకపోయి ఉంటే) తప్పకుండా చూడండి.
ఎంతో అందమైన ఫోటోగ్రఫీ కూడా ఉన్న ఈ చిత్రం నిజంగా ఒక దృశ్యకావ్యమే!
ఐదున్నర ఏళ్ల క్రితం విజయవాడలో కొందరు కాలేజీ మిత్రులను కలిసినప్పుడు ఎంతో ఆనందంతో ఒక టపా రాసాను. ప్రతి ఏడాది తప్పకుండా కలుద్దాం అని ఆ రోజున గట్టిగా అనేసుకున్నాం కానీ మళ్ళీ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కొందరికి కుదరక మేము మళ్ళీ కలవనే లేదు :( అదే సంసార సాగరం మహిమ!
రెండేళ్ళ క్రితం ఒక స్నేహితురాలు అమ్రీకా నుంచి వస్తే ఇదే ఊళ్ళో ముగ్గురం స్నేహితురాళ్లము కలిసాము. మళ్ళీ ఇన్నాళ్లకు మరొక స్నేహితురాలిని ముఫ్పై ఏళ్ల తరువాత మొన్న కలిసాను. శైలూని!! వాళ్ళబ్బాయి ఉద్యోగం నిమిత్తం కొన్నాళ్ళు ఇక్కడ ఉంటూంటే, అబ్బాయికి కొన్నాళ్ళు వండిపెట్టడం కోసం అమ్మగారు వచ్చింది. మా ఇద్దరి ఇంటి మనుషులూ ఆశ్చర్యపోతున్నారు.. ముఫ్ఫై ఏళ్ల నుంచీ మళ్ళీ కలవనే లేదా? హౌ? వై? కై కు? అంటూ ప్రశ్నలు... అవి సమాధానాల్లేని ప్రశ్నలు. ఐదేళ్ల క్రితం బెజవాడలో కొందరం కలిసినప్పుడు మాత్రం మిగతావారితో ఫోన్లో మాట్లాడాము. అప్పుడు శైలూతో కూడా మాట్లాడాను. వాట్సప్ లో కూడా అప్పుడప్పుడు పలకరింపులే!
కానీ మొన్న చూడగానే అసలు అన్నేళ్ళు గడిచినట్లు మాకు అనిపించనేలేదు. నేనేమీ మారలేదు అంది శైలూ. చిత్రం ఏమిటంటే శైలూ, నేను పక్కపక్కనే కర్చునేవాళ్ళం. పి.జి అవ్వగానే తన మేరేజ్ అయిపోయి దూరం వెళ్పోయింది. ఆ తర్వాత కాంటాక్ట్ లేదు. పలు రాష్ట్రాలు మారుతూ ప్రస్తుతం గుజరాత్ లో ఉన్నారు. ఎలా గడిచాయో తెలీకుండా ఇన్నేళ్ళు గడిచిపోయాయి.. అని వాపోయాము ఇద్దరం. మేమే కాదు సగం మంది ఆడవాళ్ల జీవితాలు ఇలానే గడిచిపోతాయేమో. పెళ్ళయిన కొత్తల్లో అత్తవారింట్లో అడ్జెస్ట్మెంట్లు... సంసార తాపత్రయాలు.. పిల్లల చదువులు.. తర్వాత పెళ్ళిళ్ళు.. మధ్యలో ఎక్కడో కాస్త రిలీఫ్... అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని.. అయ్యో సగం పైగా జీవితం అయిపోయిందే అని కాస్త మన గురించి మనం ఆలోచించుకునే లోపూ.. ఇదిగో మేం ఉన్నాం అని చిన్నా చితకా అనారోగ్యాలు, చికాకులు..! ఇంకెక్కడ రెస్ట్? మన దేశంలో అయితే ఎనభై శాతం స్త్రీల జీవితాలు ఇంతే. ఉద్యోగాలు చేసే మహిళలకు మరిన్ని ఎక్కువ బాధ్యతలు, మరిన్ని ఎక్కువ తలనెప్పులు.
గుండ్రాల్లోంచి మళ్ళీ మొన్నట్లోకి వచ్చేస్తే - శైలూ, నేనూ అలా కాసేపు మంచి చెడూ మాట్లాడుకుని, మొక్కలు,పువ్వులు,చెట్లు గురించి ముచ్చట్లు చెప్పుకుని మురిపెంగా వీడ్కోలు తీసుకున్నాం. వాళ్ళు అస్సాం లో ఉన్నప్పుడు తను కూడా నా లాగే బోలెడు మొక్కలు పెంచింది. అన్నీ కాలనీలో దానం చేసి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ నుంచి కదిలితే అదే చెయ్యాలి. ఇంకా ఫ్లాట్ దగ్గర కింద వేసిన మొక్కలు, పది, పదిహేను కుండీలు వదిలేయగా ఇక్కడ ఓ నూట ఏభై కుండీల దాకా ఉంది నా వృక్ష సంసారం! ఏ నర్సరీ వాళ్ళకో ఇచ్చేయడమే అని ఇంటాయన తేలిగ్గా అనేస్తారు కానీ పిల్లల్లా పెంచుకున్న మొక్కల్ని వదిలెయ్యాలంటే చాలా కష్టమే మరి..!
ఇక ఇంటికి వచ్చాకా కూడా తనని కలిసిన ఆనందం తాలూకూ ట్రాన్స్ లో చాలాసేపు ఉన్నాకా ఎందుకింత సంబరం అని ఆలోచిస్తే ఒక సమాధానం తోచింది - ఓల్డ్ ఫ్రెండ్స్ తో ఏ బెంగ, భయం లేదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోనఖ్ఖర్లేదు. వీళ్ళు మన గురించి ఏమనుకుంటారో అని బెంగ పడక్ఖర్లేదు. ఎందుకంటే మాకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. పక్కపక్కనే కూచునేవాళ్ళం. కలిసిమెలసి గడిపాం. అయినా ఆ కాలంలో స్నేహాలే వేరు. ఇప్పటిలా ప్లాస్టిక్ స్నేహాలు కావు. యే ఫెవికాల్ కా జోడ్ హై అన్నట్లు.. ఇన్నాళ్ల తరువాత కలిసినా ఆ ఆనందం, ఆ సంతృప్తి.. మాటల్లో చెప్పలేనివి. ఈ తరువాత కూడా ఎక్కువ కలవకపోయినా ఈ ఒక్క కలయిక తాలుకూ ఆనందపు మత్తులో మరి కొన్నేళ్ళు గడిపేయచ్చు.
మా గ్రూప్ లో ఎవర్ని కలిసినా ఇదే ఫీలింగ్ అందరికీ కూడా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారా మరి :)
కొన్నేళ్ల క్రితం మనందరమూ ఇళ్ళల్లో బందీలమైన pandemic కాలంలో ఈ ఓటిటి వినోదం చాలామందిని తన దాసులుగా చేసేసుకుంది. ఒక సినిమాకి వెళ్తే ఐదువందల నుంచీ వెయ్యి రూపాయిల దాకా అవలీలగా ఖర్చవుతున్న కాలంలో ఇంట్లో కూర్చోపెట్టి, మూడు వెబ్ సిరీస్ లు, ఆరు సినిమాలు కాదు ముఫ్ఫై వెబ్ సిరీస్ లు , ఆరువందల సినిమాలు చందాన వినోదాన్ని చూపెడుతుంటే నాబోటి మధ్య తరగతి ప్రేక్షకులు ఎక్కడ వద్దనగలరు? వద్దంటే సినిమాలు...సినిమాలు.. సినిమాలు!! బోర్ కొట్టినప్పుడో, బయటకు వెళ్ళలేకపోయినప్పుడో, ప్రపంచాన్ని మర్చిపోవాలనుకున్నప్పుడో.. ఈ ఓటిటి ప్రపంచం రెండు చేతులు చాచి మనల్ని తన కౌగిట్లోకి తీసుకుని ఎవరి అభిరుచికి తగ్గ సినిమాలు వారికి చూపించి ఆహ్లాదపరుస్తోంది. నేను కూడా నే చూసిన కొన్ని సినిమాల గురించి సిరీస్ రాద్దామని 2021లో ఒకసిరీస్ మొదలుపెట్టాను కానీ రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకూ మళ్ళీ రాయలేకపోయాను. ఇటీవలే ఓటిటిలో చూసిన ఒక చిత్రవిచిత్రమైన సినిమా గురించి రాయడానికి ఇవాళ్టికి కుదిరింది !
గత వారంలో అనుకుంటా ఒకానొక ఉదయాన 339వ సారి "సాగరసంగమం" అనే చిత్రరాజాన్ని పెట్టి, సగం అయ్యాకా ఆఫీసుకి వెళ్పోయారు ఇంటాయన. సరే మరింక మొదలుపెట్టాకా కట్టేయలేము గనుక చివరిదాకా చూసేసి, పక్కనే ఉన్న తువ్వాలుతో కళ్ళు తుడిచేసుకుని...వాటే మూవీ, వాటే డైరెక్టర్, వాటే స్టోరీ..అనేసుకుని, ఇంటి పనుల్లో పడిపోయాను. మధ్యాహ్నం మరోసారి టీవీ తిప్పుతూంటే ఒకానొక సినిమా కనబడింది. అంతకు ముందు నాలుగైదు సినిమాల్లో నటించినా గుర్తింపు పెద్దగా రాలేదు కానీ ఒక బ్లాక్బస్టర్ మూవీలో అమితంగా అందంగా కనిపించడం వల్ల అచానక్ సెన్సేషనల్ స్టార్ అయిపోయిన ఒక అమ్మడు నటించిన సిన్మా! ఇంతకాలం ఒక హీరో ఇద్దరు లేక ముగ్గురు వీరోవిన్లను చూడడానికి అలవాటు పడ్డ కళ్ళకి ఒక వీరోవిన్, ఇద్దరు హీరోలు కనబడేసరికీ వింతగా ఉంది చూద్దాం అని మొదలుపెట్టాను.
సినిమా గడుస్తున్న కొద్దీ అదేదో సినిమాలో అల్లు అర్జున్ లా "దేవుడా..," అని కొన్నిసార్లు రిపీటేడ్ గా అనుకోవాల్సి వచ్చింది!!!! పొద్దున్న నేను చూసిన సినిమా ఏమిటీ...ఆ కథ ఏమిటీ...భారతీయ సనాతన సాంప్రదాయానికి పెద్ద పీట వేసిన ఆ విలువలు ఏమిటీ...ఇప్పుడు నేను చూస్తున్న ఈ కథ ఏమిటి? దేవుడా! కలికాలం బాబూ కలికాలం అంటే ఇదే అనిపించింది. కథ కొంచెమైనా చెప్పకపోతే ఈ ఘోషకి అర్థం ఉండదు మరి.
ఒకానొక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడి, వెంట పడి, ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడు. కెరీర్ పరంగా ఆమెకు ఒక కల ఉంటుంది. దానికి సహాయపడతానన్న భర్తగారు పెళ్లవ్వగానే అదంతా మర్చిపోయి, తనను ఒక మామూలు హౌస్ వైఫ్ గా మాత్రమే చూడడం ఆఅమ్మాయికి నచ్చదు. ఒక రెండు, మూడు దెబ్బలాటల తర్వాత కట్టీఫ్ అనేసుకుని ఇద్దరూ విడిపోతారు! విడాకుల కాగితాలు కూడా ఇచ్చిపుచ్చేసుకుంటారు. అమ్మాయి వేరే ఊరుకి వెళ్పోతుంది. ఇక్కడి దాకా బానే ఉంది. ఇప్పుడు ఆ కొత్త ఊరిలో ఆమె పని చేసే చోట మరో అబ్బాయి పరిచయమవుతాడు. ఒకానొక రోజున అమ్మాయికి కొంచెం మందు ఎక్కువవుతుంది. మీరు చదివినది నిజమే. గతంలో సినిమా కథల్లో అబ్బాయికి మందు ఎక్కువ అయ్యి పిచ్చి పిచ్చి పనులు చేసినట్లు చూపెట్టేవారు. వెనుకటి కాలపు నలుపు తెలుపు సినిమాల్లో కథానాయకులు తండ్రుల ముందర సిగ్రెట్లు వంటివి కాల్చేవారు కాదు. వాళ్లని చూసి పారేసినట్లు చూపెట్టేవారు. మా కాలంలో సినిమాల్లో తండ్రులు, పిల్లలని పక్కన కూర్చోపెట్టుకుని గ్లాసులు అందిస్తూ ఉండడమే చూశాము. ఇప్పుడు కాలం మారింది. ఇక అమ్మాయిలు సైతం - సిగరెట్లు మాత్రమే కాక పబ్బుల్లో గ్లాసులు, ఏకంగా సీసాలు కూడా ఖాళీ చెయ్యడం వినోదంగా చూపిస్తున్నారు చాలా సినిమాల్లో. అదేమిటంటే ఈట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మోడ్రన్ లైఫ్ స్టైల్ అనేస్తున్నారు ఈజీగా! స్వేచ్ఛ పేరుతో మహిళలకు మంచికన్నా చెడే ఎక్కువగా ఎదురౌతున్న కాలం అని ఎవరూ గమనించట్లేదో ఏమో తెలీదు మరి :( నవతరం సినిమాల్లో మహిళలు నిండుగా బట్టలు వేసుకోవడం అనే కాన్సెప్ట్ నే మర్చిపోయారు.పైగా సినిమాల్లో చూసి బయట కూడా అలాంటి దుస్తులే ధరిస్తున్నారు. అదే కల్చర్ ని ఫాలో అవుతున్నారు చాలామంది విద్యార్థినులు. వెరీ పిటీఫుల్!
సరే ఇంతకీ ఈ చిత్రరాజం తాలుకు కథలోకి వచ్చేస్తే, కాస్త మందు ఎక్కువైన సదరు అందమైన వీరోవిను కొత్త వర్క్ ప్లేస్ లో స్నేహితుడైన అబ్బాయితో నైట్ స్టాండ్ చేస్తుంది. ఇదేమి కథరా అనుకునేలోగా కాసేపట్లో అక్కడికి "ఐ కాన్ట్ ఫర్గెట్ యూ" అనుకుంటూ విడాకులు ఇచ్చేసిన మొదటి భర్తగారు వస్తారు. ఆ తర్వాత జరిగిన కథను ఇక ఇక్కడ రాయలేను. "heteropaternal superfecundation" అనే ఒక అరుదైన, వింత కాంప్లికేషన్ ని వీరోవిన్ ప్రెగ్నెన్సీకి తగిలిస్తారు. సిన్మా చివరికి మాత్రం భార్యాభర్తల్ని కలిపేసి కథ సుఖాంతం చేసేసారు. అసలు ఇలాంటి కథ రాసి "సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు బాబూ?" అని సదరు కథా రచయితని అడగాలని అనిపించింది.
వీరోవిన్ కి పెళ్ళి అయ్యిందని తెలియగానే తన ప్రేమని పాతాళానికి తొక్కిపెట్టేసి, భార్యా భర్తల్ని కలిపేసి, జీవితాంతం వాళ్లకి గుళ్ళో పూజలు చేయించే హీరో ఉన్న పొద్దుటి సినిమా కథకి, ఈ మధ్యాహ్నం చూసిన చిత్ర విచిత్రపు సినిమా కథకీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా! అంత నచ్చకపోతే చూడడం మానేయచ్చు కానీ అసలీ కథకు ముగింపు ఏమి ఇచ్చాడా అని చివరివరకూ చూసాను. కాకపోతే రిమోటు నా చేతిలో ఉంది కాబట్టి కాస్త ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేస్తూ, చివరిగా మరోసారి .. దేవుడా అనుకుని టివీ కట్టేసాను.
ఈ సిన్మాలో ఒక పాట మాత్రం బాగా హిట్ అయ్యింది. మూడు,నాలుగేళ్ళ బుడతలు కూడా ఆ డాన్స్ స్టెప్స్ వేసేసి రీల్స్ చేయడం చూసాను కానీ అది ఈ సినిమాలోదని చూసినప్పుడు తెలిసింది.
చాలా రోజుల తర్వాత ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సినిమా చూసానన్న భావన కలిగింది. వెలుతురు
లేని ప్రపంచాన్ని అసలు ఊహించలేము. అలాంటి పరిస్థితే వస్తే మన మనస్థితి ఎలా ఉంటుంది
అనేది ఊహకందని విషయం. కానీ చీకటే తన ప్రపంచం అని తెలిసినా సరే దిగులు చెందకుండా,
"నువ్వు చెయ్యలేవు" అని ఎవరైనా సవాలు చేసిన పనిని చేసి చూపించడమే ధ్యేయంగా
మార్చుకున్న ఒక ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తి కథే "శ్రీకాంత్" సినిమా. అంధత్వం
శరీరానికి కాదు మనసుకి అనిపించక మానదు సినిమా చూస్తూంటే! నిరాశతో కృంగిన ప్రతి వ్యక్తికీ మార్గాన్ని చూపి, స్ఫూర్తినీ ఇచ్చే కథ ఇది. 'శ్రీకాంత్ బొల్లా' గారి యదార్థ జీవిత గాథ!
ఇదివరకూ differently abled
person మీద సినిమా తీస్తే వారు రకరకాల బాధలకు గురైయ్యాకా ఎవరో వచ్చి సహాయం చేస్తే
వాళ్ల జీవితం బాగుపడినట్లు ఉన్న కథలు ఎక్కువగా ఉండేవి. సినిమాలు బాగున్నా, అటువంటి
కథలు నిజాలే అయినా, ఆ ఫలానా వ్యక్తి పడిన కష్టాలు చూసి మనసంతా భారమయ్యేది. కానీ
మొదటిసారిగా ఒక differently abled person జీవితగాథ చాలా స్ఫూర్తిదాయకంగా,
ఉత్సాహభరితంగా అనిపించింది. చిత్రం మొదటి నుంచీ చివరిదాకా అదే ఉత్సాహభరితమైన ఫీల్
ని కొనసాగించాడు దర్శకుడు. బహుశా ఆయన దృష్టికోణం అదేనేమో. బావుంది.
రాజ్ కుమార్
రావ్ గురించి చెప్పేదేముంది..వంక పెట్టడానికి లేని నటనా కౌశలం అతనిది. ఆ పాత్రకు
ఉండే మేనరిజమ్స్, హావభావాలు అన్నీ చాలా బాగా వ్యక్తపరిచాడు. మెచ్చుకోదగ్గ నటన! రాజ్
కుమార్ నటించిన కొన్ని సినిమాలు - Kai po che, Queen, Hamari adhuri kahani,
Bareilly ki barfi, Newton, Stree, Hum do hamare do, Monica, O my
Darling..మొదలైనవి ఇదివరకు చూశాను. వాటిల్లో Newton చిత్రం నాకు చాలా నచ్చింది. ఇదే
కథను కొద్దిగా మార్చి ఆ మధ్య తెలుగులో "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే సినిమా
తీశారు కూడా. కానీ ఒరిజినల్ హిందీ సినిమాయే బావుంది నాకైతే. Monica, O my Darling
కూడా సస్పెన్స్, కామిడీ మిక్స్. సరదాగా ఉంటుంది.
ఇంతకీ శ్రీకాంత్ సినిమా కబుర్లలోకి
మళ్ళీ వచ్చేస్తే, జ్యోతిక కూడా తన దేవికా టీచర్పాత్రను బాగా పోషించింది. ఒక డైలాగ్ లో
చెప్పినట్లు శ్రీకాంత్ లాంటి వ్యక్తులు విజయాలను పొందాలంటే వారి చుట్టూ దేవికా
టీచర్, రవి, స్వాతి లాంటి పాజిటివిటీ నింపి, ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి. అలానే
శ్రీకాంత్ లో పట్టుదలను, కసిని పెంచే మహేశ్ లాంటి cruel చిన్ననాటి స్నేహితులు, హాస్టల్
లోంచి బయటకు తోసేసే వార్డెన్ లాంటి mean minded వ్యక్తులు కూడా ఉండాలి. శ్రీకాంత్ మాత్రమే కాదు
ఎవరికైనా సరే, జీవితంలో ప్రోత్సహించే చేతులతో పాటుగా.. కిందకు తోసేసే చేతులు కూడా.. తన చుట్టూ
ఉన్నప్పుడే తనలోని లోపాలను అధిగమించి ఒక వ్యక్తి పరిపూర్ణంగా వికసించగలుగుతాడు. ఇది
నా అభిప్రాయం.
సినిమా చూశాకా ఒకే ఒక బాధ కలిగింది.. ఈ శ్రీకాంత్ మన తెలుగువాడు కనుక
"మల్లేశం" తీసినట్లుగా ఎవరైనా తెలుగు సినిమా దర్శకుడు ఈ సినిమా తీసి ఉంటే ఇంకా
బవుండేది కదా.. అనిపించింది!
మన తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాన్ని తమ అక్షరాలతో, సినిమాలతో, పాటలతో, గాత్రాలతో వెలుగులద్ది, భాషను పదింతలు అందంగా మార్చి, వైభవాన్ని పెంచిన మహామహులందరూ గత కొన్నేళ్లుగా స్వర్గానికి నిచ్చెన వేసుకుని అక్కడే సమావేశమవుతూ వచ్చారు. అంతవరకూ బానేఉంది. కానీ వారి సాంగత్యాలు సంపూర్ణమవ్వలేదనో ఏమో, మిగిలిన అతి కొద్దిపాటి హేమాహేమీలను కూడా తమ వద్దకు పిలిపించుకుంటున్నారు. ఇటీవలి వాణి జయరాం గారి నిష్క్రమణ నుంచి తేరుకోక ముందే... నిన్న మొన్నటి శ్రీ రమణగారూ...! ఏమంత వయసైపోయిందని సార్ అంత తొందరపడ్డారు...ఇంకొన్నాళ్ళు ఉంటే మన భాషకు మరింత వైభవాన్ని పెంచేవారు కదా! తెలుగు భాషపై మీకున్న మమకారం, ప్రేమాభిమానాలు, దాని మనుగడ కోసమూ, వ్యాప్తి కోసమూ మీరు చేసిన కృషి.. ఎంతో హర్షనీయం.
బాపూ గారిని, రమణ గారినీ తలిచినప్పుడల్లా ఠక్కున వెంఠనే గుర్తొచ్చే మరొక వ్యక్తి శ్రీ రమణగారు. నాకు శ్రీరమణ గారంటే ఎంతో గౌరవం, చెప్పలేనంత అభిమానం! సాహిత్యపరంగా నాకు శ్రీ రమణగారు పరిచయం అయ్యింది వెండితెర నవలల ద్వారా. చిన్నప్పుడు మా ఇంట్లో బాపూగారి సినిమాల వెండితెర నవలలు ఉండేవి. ముత్యాల ముగ్గు, వంశ వృక్షం, రాధా కల్యాణం, గోరంత దీపం మొదలైన వెండితెర నవలలన్నింటికీ నవలీకరణ శ్రీ రమణ గారే చేశారు. ఒక్క బాపూగారి సినిమాలకు మాత్రమే ఇలా నవలీకరణ చేసారేమో ఆయన తెలీదు మరి. కానీ మళ్ళీ మళ్ళీ చదువుకునేలా ఎంతో ఆసక్తికరంగా ఉండేవి అందులోని డైలాగులూ, మాటలూ అవీ.
ఆయన రాసిన కాలమ్స్ పుస్తకరూపంలో వచ్చాకే చాలావరకూ చదివాను కానీ ఒక కథ మాత్రం విజయవాడలో ఉన్నప్పుడే చదివాను. ఆ ఒక్క కథకే మా ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోయాం! ఒకరోజు నాన్న ఆఫీసు నుంచి ఎవరో ఇచ్చారని A4సైజు పేపర్లలో ఉన్న ఒక కథ జిరాక్స్ చేయించి తెచ్చారు. అందరినీ కూర్చోపెట్టి చదివి వినిపించారు. సైలెంట్గా మొత్తం వినేసాం. ఎంత బావుందో..ఎంత బావుందో అనుకుంటూ. అదే "బంగారు మురుగు" కథ. కథలో బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రాలు -
* "నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"
* "మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం...పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం. ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం, నాకు తెలిసిందివే" బాగా గుర్తుండిపోయాయి.
అదో అద్భుతమైన కథ! "పచ్చటి గొడుగు పాతేసినట్లు ఉన్న బాదం చెట్టు" గురించి చదువుతూంటే కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు.. భాస్కరమ్మగారి ఇంట్లోఉండేప్పుడు మా దొడ్లో పొద్దున్నే కాకులు బాదంకాయలు పడేసి వెళ్తూ ఉండేవి. అమ్మ మాకు ఆ కాయలు కొట్టి బాదం పప్పులు పెట్టేది. పప్పు విరగకుండా బాదం కాయలు కొట్టుకోవడం బాగా ప్రాక్టీస్ అయ్యింది మా పిల్లలకు. ఇప్పుడు మా సొసైటీలో కూడా మేం వచ్చిన కొత్తల్లో ఎవరో వేసిన రెండు బాదం చెట్లు పెద్ద పెద్ద వృక్షాలై రోజూ బోలెడు కాయలు, ఆకులూ రాలుస్తూ ఉంటాయి. ఆ చెట్ల కోసం నేను రోజూ వాకింగ్ కి అటువైపే వెళ్తూ ఉంటాను. ఆ రకంగా నాకు బంగారు మురుగు కథ గుర్తుకు రాని రోజే లేదు.
కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చాకా నాన్న నవోదయాలో ఒక పుస్తకం కొని తెచ్చారు - "మిథునం". అందులో ’బంగారు మురుగు’ తో సహా ఏడెనిమిది కథలు ఉన్నాయి. అన్నింటిలోకీ చివరిదైన "మిథునం" కథ మరొక అద్భుతం. బాపూ గారి మిథునం దస్తూరీ తిలకంచాలు ఈ కథ గొప్పతనం కొలవడానికి. అదొక masterpiece అంతే!
మిథునం లోని జీవిత సత్యం -
"...దానికో లెఖ్ఖ ఉంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు.మనం పుట్టగానె..వీడికి ఇన్ని...దీనికి యిన్ని అని ఎంచి వాటికి వరసాగ్గా అంకెలు వేసేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు.వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో, ఇంకేముంది! మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి. ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢం"
అనామకంగా మిగిలిపోయే ఏభైలూ, వందలూ కథలు రాయక్కర్లేదు, ఏ రచయితకైనా ఇటువంటి ఒక్క కథ చాలు... జన్మ సార్థకం అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క కథా చాలు కథారచయితల జాబితాలో మొదటి అంకె దగ్గర శ్రీ రమణగారిని నిలబెట్టడానికి. ఈ రెండు కథలు నాకు ఎప్పటికీ అత్యంత ప్రీతిపాత్రమైన కథలు. భరణిగారు మిథునంసినిమా తీసినట్లు , బంగారు మురుగు ని కూడా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ గా అయినా తీస్తే బావుంటుంది.
నాన్న రేడియోలో రిటైర్ అయ్యి ఇన్నేళ్ళైనా, ఓపిక ఉన్నా లేకున్నా, వేరే ఏ పనిలో ఉన్నా కూడా, రోజూ క్రమం తప్పకుండా వందేమాతరం నుంచీ జైహింద్ దాకా రేడియో వినడం ఆయన ఇప్పటికీ ఇష్టంతో చేసే పని. ప్రొద్దుటి ప్రసారవిశేషాలలో విన్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని కేసెట్ లో రికార్డ్ చెయ్యడం, ఆ తర్వాత వాటిని సీడీ లోకో, పెన్ డ్రైవ్ లోకో మార్పించి అవి చదివిన వారికో, ఫలానా కార్యక్రమాన్ని సమర్పించినవారికో వాటిని అందించడం కూడా ఆయనకో హాబీ. అలా క్రితం ఏడాది శ్రీరమణగారివి కొన్ని టాక్స్ రేడియోలో ఓ సిరీస్ లో ప్రసారమయ్యాయి. ఎప్పటిలానే నాన్న వాటిని రికార్డ్ చేసారు. చేశాకా వాటిని సీడీగా మార్పించారు. అది అందించడానికి శ్రీ రమణగారికి ఫోన్ చేశారు. ఆయన ఎంతో బాగా మాట్లాడారుట. నాన్నకు ’చాలా సంతోషం, మీరు తెలుసు.. ’ అని చెప్పి, విజయవాడ రోజులు, కాళేశ్వర్రావు మార్కెట్లో కూరలు కొనుక్కోవడం నుంచీ ఎన్నో విజయవాడ జ్ఞాపకాలు నెమరువేసుకున్నారట. "సిడి తీసుకోవడానికి వస్తాను. అడ్రస్ చెప్పండి" అన్నారట. "అయ్యో భలేవారే. వద్దు. మీ అడ్రస్ చెప్పండి చాలు కొరియర్ చేస్తానని" అడిగి, నాన్న లోకల్ కొరియర్ లో ఆయనకు సిడి పంపించారు. అందాకా అందినట్లు ఆయనే ఫోన్ చేసి చెప్పారట కూడా. చాలా తక్కువ నిడివి గల ఆ రేడియో టాక్స్ బ్లాగ్ లో టపా రాస్తే అందులో పొందుపరచమని నాన్న మొన్న ఈ విషాద వార్త తెలిసిన రోజున అడిగారు. వాటిని తెప్పించుకున్నాను కానీ అతిపెద్ద బ్లాగ్ విరామం వల్ల ఆడియో ఫైల్ ను బ్లాగ్లో ఎలా పెట్టాలో మర్చిపోయాను. ఎలానో గూగిలించి, తెలుసుకుని ఇప్పుడు పెడుతున్నాను.
audio file 1
అనుకోకుండా నిన్న నాకు మరొక ఆణిముత్యం లాంటి వీడియో దొరికింది. గొల్లపూడిగారు శ్రీ రమణగారిని ఇంటర్వ్యూ చేసిన వీడియో. ఇందులో మిథునం కథ గురించి నేను రమణగారిని అడగాలి అనుకుంతూ ఉండే ప్రశ్నలు గొల్లపూడిగారే అడిగేసారు. అది కూడా చూడండి -
తెలుగు భాష మనుగడకు తోడ్పడిన ఇటువంటి భాషాభిమానులు చాలా చాలా అరుదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, దీని గురించి ఎవరు రాస్తారు? అనుకుంటే.. శ్రీ రమణగారు రాయగలరు. ఆయన ఉన్నారు అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మరి ఆయన గొప్పతనాన్ని గురించో, మరేదైనా ముఖ్య విషయాన్ని గురించో రాయడానికి ఎవరున్నారా అని వేళ్ల మీద లెఖ్ఖపెట్టుక్కునే పరిస్థితి! భవిష్యత్తుపై ఆశావహ దృక్ఫథంతో చూస్తూండడం తప్ప మనం చెయ్యగలిగినదేదీ లేదు. ఏదేమైనా శ్రీరమణగారు లేని లోటు పూడ్చలేనిది. Telugu people have lost a great Litterateur! ఆయనకు నా నమస్సుమాంజలి.
స్వర్గంలో మాత్రం దర్బారు నిండుకుంది!!
audio file 2
audio file 3
అనుకోకుండా నిన్న నాకు మరొక ఆణిముత్యం లాంటి వీడియో దొరికింది. గొల్లపూడిగారు శ్రీ రమణగారిని ఇంటర్వ్యూ చేసిన వీడియో. ఇందులో మిథునం కథ గురించి నేను రమణగారిని అడగాలి అనుకుంతూ ఉండే ప్రశ్నలు గొల్లపూడిగారే అడిగేసారు. అది కూడా చూడండి -
తెలుగు భాష మనుగడకు తోడ్పడిన ఇటువంటి భాషాభిమానులు చాలా చాలా అరుదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, దీని గురించి ఎవరు రాస్తారు? అనుకుంటే.. శ్రీ రమణగారు రాయగలరు.. ఆయన ఉన్నారు అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మరి ఆయన గొప్పతనాన్ని గురించో, మరేదైనా ముఖ్య విషయాన్ని గురించో రాయడానికి ఎవరున్నారా అని వేళ్ల మీద లెఖ్ఖపెట్టుక్కునే పరిస్థితి! ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తునే ఉంటుంది కాబట్టి భవిష్యత్తుపై ఆశావహ దృక్ఫథంతో చూస్తూండడమే. ఏదేమైనా శ్రీరమణగారు లేని లోటు పూడ్చలేనిది. Telugu people have lost a great Litterateur! ఆయనకు నా నమస్సుమాంజలి.
ఏమిటీ మౌనం? ఎప్పుడు మళ్ళీ రాస్తావు? అని ఎవరైనా స్నేహితులు అడిగినప్పుడల్లా మనసుకి చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు అడిగారు చాలా రీసెంట్ గా.
మాటల్లో చెప్పలేనంత ఆనందం...
ఇన్నాళ్లైనా ఇంకా రాయమని అడిగేవారు ఉన్నారన్న తృప్తి,
మళ్ళీ బ్లాగ్ వైపు చూసేలా చేస్తుంది!
ఇది నా ప్రపంచం.
నా అక్షరాలు నా ఉనికిని వెతుక్కుంటూ దిగంతాల వరకూ పయనించే ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ బ్లాగ్లోనే!
ఈ పయనం ఎన్నో అవాంతరాలను, ఆక్రందనలను, అవమానాలను, తట్టుకుని, దాటుకుని, ఇంకా సాగుతూనే ఉంది.
మౌనంలో కూడా పయనమే ఉంది.
అప్పుడప్పుడూ కొన్ని సమాధానాలు చెప్పాలనిపిస్తుంది..
రెండు, మూడు రోజులుగా పరస్పర విరుధ్ధమైన ద్వంద్వ భావాలు మనసులో ఒకేసారి పొటీపడుతున్నాయి.
"ఏదో ఒకటి రాయాలి.. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ప్రతి దృష్టికోణంలోనూ ఏదో ఒక వైరుధ్యం ఉంటుంది. ఎవరి భావాలువారివి కాబట్టి నా బ్లాగులో నా రాతలు నేను రాసుకోవాలి అనే నిరంతర తపన" ఒకవైపు!
" ఏదీ కూడా శాశ్వతం కానీ కనురెప్పపాటి జీవితంలో ఏం రాస్తే ఏమిటి? నేను రాయకపోతే వచ్చే అణుమాత్రం నష్టం కూడా లేనప్పుడు, ఏం రాసి ఏం ప్రయోజనం? అనే నిర్లిప్తత మరోవైపు!!
పాటలు పోగేసుకున్నాను, అక్షరాలను వెతుక్కున్నాను, మాటలు సమీకరించుకున్నాను, ఎంతో రాయాలనే తపన కూడా ఉంది కానీ పైన పేర్కొన్న ద్వంద్వ భావాలలో నన్ను రెండవదే ఎక్కువగా ప్రభావితంచేస్తోంది. ఒకానొక అనాస్థ దశలో ఎలాగైతే నిర్లిప్తంగా నాకత్యంత ప్రియమైన ఈ బ్లాగు మూసేసి ఏకాంతంలోకి వెళ్పోయానో, ఇప్పుడూ అదే అనాస్థ దశ. మూగగా, స్తబ్దంగా, భావాలను ముందుకు నడవనివ్వని ఒక నిస్తేజ స్థితి ఆవరించి ఉంది.
కాదు.. ఇది వైరాగ్యం కానే కాదు.. అంతకు మించిన ఏదో భావం!
ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలోని పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కలిగే నిర్లిప్త భావమేమో... బహుశా!!
కానీ నేను సమీకరించుకున్న పాటలతో, మాటలతో ఒక మహానుభావుడికి అంజలి ఘటించే ప్రయత్నం త్వరలో తప్పకుండా చేస్తాను.
ఇవాళ ఒక కొత్త సినిమా చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు -
సినిమా బానే ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే, మనకి కావాలి అనిపించేవి, ఇలా జరిగితే బాగుండు.. అనిపించేవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఏమీ జరగవు. అసలు అలాంటి ఒక ఊహజగత్తులో బ్రతకడమే ఎంత తప్పో తెలిసేసరికీ సగానికి పైగా జీవితం అయిపోతుంది. వెర్రిమొర్రి కథలతో సినిమాలు తీసేసి ప్రజలపై రుద్దేసి డబ్బు చేసుకోవడమే తప్ప ఇవి ప్రజల జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో అన్న ఆలోచన ఎవరికి ఉండదు. ఇది మా జీవనోపాథి అంటారు సినీమారాజులు. చూడడం చూడకపోవడం, మన తప్పొప్పులు మన బాధ్యత. కానీ రివైండ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా మొదలుపెట్టడానికి ఇది వీడియోనో, రిమోట్ కంట్రోలో కాదుగా... అసలు సిసలైన జీవితం!! ఒక్క రోజు, ఒక్క క్షణం పోయినా మళ్ళీ వెనక్కు రావు! వెనక్కి తెచ్చుకోలేము.
ఇంత చిన్న విషయం అర్థం కాదా మనుషులకి? అర్థం అయినా అర్థం కానట్టు బ్రతికేస్తారా? ఇన్నాళ్ళూ నువ్వూ చూశావు కదమ్మా నానారకాల సినిమాలూ...ఇప్పుడేమో బోధిచెట్టు క్రింద జ్ఞానోదయమైన బుధ్ధుడిలా పెద్ద చెప్పొచ్చావులే పో పోవమ్మా! జీవిత సత్యాలు అందరికీ తెలుసు. ఇది జగన్నాటకంలో భాగం. అంతే! అంటారు మేధావులు.
అయినా నా పిచ్చి కానీ ఎవరు చెప్తే ఎవరు వింటారు? నేను విన్నానా? ఎవరి జ్ఞానం వాళ్లకి రావాల్సిందే. అంతవరకూ మన జపం మనం చేసుకుంటూ చూస్తూ ఉండడమే :-)
2021... వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయాయి.. ఇవాళ్టి వినాయకచవితి కూడా స్దబ్దుగా గడిచిపోయింది ! ఈ కాలం ఇలా త్వరగా గడవడం మంచిదే కానీ మరీ ఇంత త్వరగానా .. అనిపిస్తోంది . ఏ హడావుడి లేకుండా పండుగ వెళ్పోయింది . ఏమో నాకైతే అలానే అనిపించింది . రోడ్డు మీద పత్రి అమ్మేవాళ్ళు కూడా ఇదివరకటిలా పది అడుగులకొకళ్ళు లేరు. మా వైపున పత్రి అమ్మకం ఉన్న ఒక్క చోటా కూడా ఇదివరకటిలా అన్ని రకరకాల ఆకులు అమ్మలేదు . జిల్లేడు ఆకులూ , తామరపూలు , తామర ఆకులూ , ఏవి లేవు . ఇదివరకూ చాలామంది నానారకాల ఆకులూ అమ్మేస్తున్నారు అని విసుక్కునేవాళ్ళం . అయినా వాళ్లకి ఆ ఒక్కరోజే ఉపాధి . ఎక్కడెక్కడికి వెళ్లి ఇవన్నీ తెస్తారో వీళ్ళు అని ఆశ్చర్యపోయేవాళ్ళం కూడా. మన జీవితాలలోకి ఈ మహమ్మారి ఎన్ని మార్పులు తెచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రోజువారీ ఉపాధి అవకాశాలు మాత్రం బొత్తిగా శూన్యం అయిపోయాయి . నిరుపేద జీవితాలపై మాత్రం ఇది చాలా బలమైన దెబ్బ అనే చెప్పాలి . ఈ గడ్డు కాలం సమసి , వారి జీవితాలు వికసించే రోజులు మళ్ళీ రావాలని ఆ వినాయకుడుని ప్రార్థిస్తున్నాను .
*** *** ***
పుస్తకం తెరిచి ఎన్నాళ్లైయిందో ! ఇంటి పనితోనో , ఆఫీసు పనితోనే రోజులు గడిచిపోతున్నాయి . OTT ల పుణ్యమా అని నానావిధ సినిమాలకేకొదవాలేదు. అవి పనులు చేసుకుంటూ కూడా చుసేయచ్చు . కానీ పుస్తకానికి ఏకాంతం , ఏకాగ్రత రెండూ కావాలి. ఎప్పుడైనా సమయం దొరికితే కాసేపు పడుకుందాం , రెస్ట్ తీసుకుందాం అన్న ఆలోచనే తప్ప చదువుదామనే ధ్యాసే ఉండడం లేదు .
ఇదివరకూ ఇంట్లో సామాను కూడా ఎటునుంచి ఇటు , ఇటు నుంచి అటూ అవలీలగా జరిపేసి సర్దేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక్కరోజు సర్దితే నాలుగురోజులు మరేపని చెయ్యలేని స్థితి . ఇది వయసు ప్రభావమా ? లేక పనిపనిషి లేకుండా గత రెండేళ్ల నుండీ చాకిరి చేసుకుంటున్న వత్తిడి ప్రభావమా ? అన్నది తేల్చుకోవడం కష్టమే!
*** ***. ***
ఈ టపాలో ప్రత్యేకత ఏమిటంటే నా కొత్త లాప్టాప్ లో ఇంకా సరైన సదుపాయాలు లేక డైరెక్ట్ గా బ్లాగ్ నుండే డ్రాఫ్ట్ లోoచి ఈ టపా రాస్తున్నాను. ఎలాగైనా ఇవాళ రాయాలనే సంకల్పంతో ! అక్షరాలు వెతుక్కుoటూ రాస్తుంటే బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తల్లో ఒక టపా రాయడానికి ఎన్ని కష్టాలు పడేదాన్నో, ఎన్ని తప్పులు వచ్చేవో గుర్తుకొస్తోంది.
నవ్వు వస్తోంది .... మళ్ళీ గతం తాలూకూ చెరగని చేదు గురుతులు కలవరపెడుతున్నాయి కూడా! కానీ ఒకటి మాత్రం నిజం - ఏది జరిగినా మన మంచికే అని నేను ఎప్పుడూ నమ్మే సూత్రం . ఈ బ్లాగు రాతలు నాకు కేవలం చేదు జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చినా , ఈ రాతలు నాకు తెలుగు టైపింగ్ నేర్పాయి . ఎలా రాయాలో , ఎంత రాయగలనో , ఏది రాయగలనో తెలిపాయి . నా జీవితకాలపు కలను నిజం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించింది ఈ బ్లాగ్ రాతలే! భగవంతుడు నాకు అన్ని విధాలా సహకరించాడనే చెప్పాలి. ఆ నిరాకార స్వరూపుడికి కృతజ్ఞతలు .
*** *** ***
చాలా కాలం నుంచి తెలిసిన కొందరి గురించి మనకి ఏర్పడిన అభిప్రాయాలను మార్చుకోవడం కష్టమే అయినా ఒకోసారి మార్చుకోవాల్సి వస్తుంది . ఇలాంటివాళ్ళు అనుకున్నాము ... కాదన్నమాట అని ఆశ్చర్యం వేసినా నిజరూపం తెలిసాకా అసలు కొందరితో మాట్లాడాలనే అనిపించదు . ఎదురైనా తప్పించుకు తిరుగుతాం.
*** *** ***
ఏకాంతాన్ని ఆస్వాదించడం మొదలైయ్యాకా మనుషులకు దూరంగా ఉండడమే ఆనందాన్ని ఇస్తోంది . మనసు మరింత ఏకాంతాన్ని కోరుకుంటుందే తప్ప మరో ఊసే గుర్తుకురాదు . భగవధ్యానం , ఆధ్యాత్మిక జీవితం , మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఇదివరకటి మామూలు పుస్తకాల వైపుకి దృష్టిని మరలనివ్వడమే లేదు . ఇందులో ఉన్న ప్రశాంతత మరెందులోను లేదు అన్న సత్యం ఆలస్యంగానైనా తెలిసిరావడం పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను. గత ఆరేళ్లలో ఆత్మోన్నతికి ఉపయోగపడే ఎన్నో మంచి మంచి పుస్తకాలు తెప్పించుకున్నాను. కొన్ని చదివాను .. ఆనందించాను. ఇంకా చాలా చదవాలి . అటువంటి ఏకాగ్రతనిచ్ఛే ఖాళీ సమయాన్ని ఇమ్మని భగవంతుడిని కోరుకుంటున్నాను .
కొందరు దేశ ప్రజల నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల చేతులారా కొని తెచ్చుకున్నదే ఈ ప్రస్తుత విషమ పరిస్థితి ! (ప్రభుత్వాలనో, మరెవరినో నిందించే కన్నా ముందర బాధ్యత గల దేశ పౌరులుగా మన బాధ్యతను మనం ఎంతవరకూ నిర్వర్తించాం అన్నది కూడా మనం అంతర్లోచన చేసుకోవాల్సిన విషయం.)
ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ విధులను ఎంతో సమర్థవంతంగా, శక్తికి మించి నిర్వర్తిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర హాస్పట్లల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు మొదలైనవారందరూ ఎంతో హర్షనీయులు. కానీ వారందరితో పాటూ మనం చేతులెత్తి నమస్కరించాల్సినవారు మరికొందరు ఉన్నారు. వారే ఆన్లైన్ వెబ్సైట్ల డెలివరీ కుర్రాళ్ళు! ఎంతో రిస్క్ తీసుకుంటూ వీధుల్లో , ఎండల్లో, ఎన్నెన్నో దూరాలు తిరిగి తిరిగి మనందరి ఆన్లైన్ ఆర్డర్లను మన తలుపు దగ్గరకు తెచ్చి అందిస్తున్న Genieలు వాళ్ళు.
ఇవాళ ప్రపంచమంతా మన చేతుల్లోని ఆరేడు అంగుళాల ఫోనులో ఇమిడిపోయింది. మహమ్మారి వైరస్ కారణంగా ఇవాళ ప్రపంచం వణికిపోతోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లద్దని పదే పదే అంతటా వినిపిస్తున్న మాట. తప్పనిసరి పనులు, ఆఫీసులు ఉన్న ప్రజలు ముసుగులు మొదలైన రక్షణా కవచాలు ధరించి యుధ్ధసైనికుల్లా తప్పక తిరుగుతున్నారు. కానీ ఇంట్లో ఉండి, ఇంట్లోంచి పనులు చేసుకుంటున్న ప్రజానీకం అందరమూ ఏ వస్తువు కావాలన్నా చేతిలోకి ఫోన్ తీసుకుని టిక్కు మని ఒక్క నొక్కు నొక్కుతున్నాము. గంటల్లోనో, ఒక రోజులో, రెండురోజుల్లోనో మనకి కావాల్సిన వస్తువు మన తలుపు దగ్గర వచ్చి పడుతోంది. మనం హాయిగా ఇంట్లోంచి ఆర్డర్ చేసుకుని తెప్పించుకుంటున్నాం కానీ అవి తెచ్చేవాళ్ళు ఎంత శ్రమ పడతారో అనిపిస్తుంది నాకు. వాళ్ళ శ్రమ మాత్రమే కాదు, మనం బయటకు వెళ్ళక్కర్లేకుండా మనకి కావాల్సినది మన చేతుల్లోకి వచ్చేయడం చాలా చిత్రమైన విషయంగా నాకు అనిపిస్తుంది. నా మటుకు నాకు ఆ డెలివరి కుర్రాళ్ళు అల్లావుద్దీన్ జీనీలాగ అనిపిస్తారు. కూరలు, పాలు,పళ్ళు, పుస్తకాలు, నిత్యావసరాలు. కిరాణా వస్తువులు...అసలు ఈ సామానుకి అంతేమిటి? ఇదివరకూ మనకి ఏదన్నా కావాలంటే వీధి వీధీ తిరిగి, కొన్ని వస్తువుల కోసం ఎంతో దూరం కూడా బస్సుల్లో ప్రయానించి వెళ్ళి తెచ్చుకున్న రోజ్కులు ఉన్నాయి. ఇవాళ అస్సలు ఏమాత్రం శ్రమ లేకుండా ఫోనులో మీట నొక్కిన తక్షణం ఆ ఫలానా వస్తువు మన చేతుల్లోకి వచ్చేస్తోంది. ఎవరికైనా ఏదైనా పంపాలన్నా కూడా చక్కగా ఆర్డర్ చేస్తే ఆ ఫలానావారికి అందించేస్తున్నారీ డెలివరీ కుర్రాళ్ళు. మనకీ ఆనందం, అవతలవారికీ ఆనందం. కావున చెప్పొచ్చేదేమిటంటే ఈ డెలివరీ బాయ్స్ మన పాలిట వరాలిచ్చే దేవతల్లాంటివారు.
ఈ సంవత్సర కాలంలో ఓలా, ఊబర్ వాళ్ల పేకేజీ సర్వీసుల ద్వారా నేను ఎన్నో సార్లు మావాళ్లకి నే వండిన పదార్ధాలు, తినుబండారాలు పేక్ చేసి పంపించాను. ఇంట్లోంచి కదలడానికి భయపడే పరిస్థితుల్లో, మనవాళ్లకి మనం స్వయంగా చేసిన పదార్ధాలు మనం వెళ్లలేకపోయినా ఎవరిద్వారానో అందివ్వగలగడం ఎంతో సంతోషకరమైన సంగతి. ఈ సర్వీస్ నిజంగా ఎంతో ఉపయోగకరమైనది. బిగ్ బాస్కెట్, అమ్మాజాన్(Amazonకి మేము పెట్టుకున్న ముద్దు పేరు), ఫ్లిప్కార్ట్, ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అమ్మే వెబ్సైట్స్...ఇలా ఎన్నో వెబ్సైట్ల ద్వారా ఒకటేమిటి నానావిధాల వస్తువులు ఇవాళ మన ముంగిట్లో వాలుతున్నాయి. ఆఖరికి మొక్కలకి నీళ్ళు పోసే వాటర్ పంప్ నాజల్ పోతే, అది కూడా నెట్లో ఒకచోట వెతికి బుక్ చేస్తే మర్నాడే ఇంటికి వచ్చింది! [కాకపోతే అది చిన్న సైజ్ అయి పర్పజ్ సర్వ్ అవ్వలేదు :( ]
గత ఏడాది లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న చాలామంది యువత ఈ డెలివరీ ఉద్యోగాలలో చేరారని వినికిడి. డిమాండ్ పెరిగిపోయి బుక్ చేసిన నాలుగు రోజులకి కానీ వస్తువులు రావట్లేదు. ఆన్లైన్ ఆర్డర్స్ వల్ల వాళ్లకి అంత పని ఉంటోంది. మంచిదే కదా. వాళ్లకీ ఉపాధి లభిస్తోంది. మన పర్పజ్ సర్వ్ అవుతోంది. రానున్న మరిన్ని నెలల పాటు మనకి వీళ్ల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు చల్లగా ఉండుగాక. ఇలాగే మనందరి అవసరాలనీ తీరుస్తూ ఈ మోడ్రన్ జీనీలు మనల్ని సంతోషపెట్టు గాక.
పేరు భలే ఉందే అని ఈ సినిమా పేరు చూసి ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాము. హైదరాబాద్ నగరంలో ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరు హీరోయిన్. పేరు భానుమతి. రామకృష్ణ అనే అబ్బాయి ఆమె దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. తెనాలి నుంచి వచ్చిన అతగాడు నెమ్మదస్తుడు, మంచివాడు. రీసెంట్ గా బ్రేకప్ అయిన బాధలో ఉన్న భానుమతికి ఈ అసిస్టెంట్ అబ్బాయి ఎలా దగ్గరయ్యాడు, ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ల మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఎలా వాళ్ళిద్దరూ ఒకటౌతారు అన్నది చిత్ర కథ.
మామూలు కథే కానీ కథని చాలా పోజిటివ్ గా, స్మూత్ గా, మనసుకి హత్తుకునే మంచి రొమాంటిక్ కామిడీ లా బాగా మలిచాడు దర్శకుడు Srikanth Nagothi. డైరెక్ట్ వెబ్ రిలీజ్ కే ప్లాన్ చేసి రాసుకున్న స్క్రిప్ట్ ఇది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడతను. నవీన్ చంద్ర, సలోనీ లూథ్రా ప్రధానపాత్రలు పోషించారు.
ఈమధ్యన కాస్త పెళ్ళి వయసుకే పెళ్ళిళ్ళు జరుగడం చూస్తున్నాం కానీ గడిచిన దశాబ్దంలో ఉద్యోగాలు, కెరీర్ ప్లాన్స్ అంటూ యువత చాలావరకూ లేట్ మేరేజెస్ బాటలోనే పయనిస్తూ వచ్చారు. గత దశాబ్దంలో పెళ్ళీళ్ళు జరిగిన చాలామంది వధువరులిద్దరి వయసులూ ముఫ్ఫై పైనే ఉండడం చాలాకాలంగా చూస్తున్నాం కాబట్టి చాలామంది యువతీయువకులు ఈ సినిమాకి ఈజీగా కనెక్ట్ అయిపోయే అవకాసం ఉంది. అమ్మాయి పెళ్ళి గురించి, లేట్ మేరేజ్ అవుతున్న అమ్మాయిల గురించి చెప్పే డైలాగ్ భలే నవ్వు తెప్పించింది. సినిమా అయిపోయాకా బావుంది, ఒక మంచి సినిమా చూశాం అనే భావన తప్పకుండా కలుగుతుంది. నాకు ఆ తల్లీ,కొడుకుల రిలేషన్ బాగా నచ్చింది.
చిత్రం టైటిల్ పై కోర్టువారి అభ్యంతరం చెప్పడం వల్ల సినిమా టైటిల్ లో హీరో,హీరోయిన్ల పేర్ల మధ్యలో "&" కలిపారుట. 2020 జూలైలో విడుదల అయిన ఈ చిత్రం "ఆహా యాప్(Aha app)" లో చూడవచ్చు. ఈ దర్శకుడు నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. మరొక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పారు.
ఒక బస్సు ప్రయాణంలో ఒక చిన్న పాపకి ఓ నర్స్ ఒక తమాషా కథ చెప్తుంది. కాలాంతరంలో ఆ పాప పెద్దదై ఓ అందమైన అమ్మాయి అవుతుంది. ఉద్యోగ నిమిత్తం ఒక అందమైన ఊరు వెళ్తుంది. ఆ అందమైన ఊరిలో పాడుబడినట్లున్న పురాతన భవనాల, ఇళ్ళ గోడల మీద తాను చిన్నప్పుడు బస్సులో విన్న కథ చిత్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ చిత్రాలు గీసిన చిత్రకారుడిని వెతుక్కుంటూ ఆ అమ్మాయి అలా...అలా...వెళ్ళి వెళ్ళి....చివరికి సినిమా చివరాఖరు సీన్ లో ఆ చిత్రకారుడిని కలుసుకుంటుంది. ఆ కథకీ, ఆ చిత్రకారుడికీ, ఆ అమ్మాయికీ ఏమిటి సంబంధం? చిన్నప్పుడు తను బస్సులో విన్న కథ ఆ చిత్రకారుడికి ఎలా తెలుసు? తెలుసుకోవాలంటే Amazon Primeలో "Maara" సినిమా తెలుగు వర్షన్ చూడాల్సిందే :-)
ఇది ఒక మళయాళ చిత్రానికి తమిళ రీమేక్ అని గూగులమ్మ చెప్పింది. ఒక తమాషా కథని, అందమైన ఫోటోగ్రఫీని, అందమైన పెయింటింగ్స్ లా ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ని, అందమైన శ్రధ్ధా శ్రీనాథ్ ని, కాస్త ఓల్డ్ అయినా ఛార్మ్ తగ్గని - అందమైన నవ్వు తనకు మాత్రమే సొంతమైన మాధవన్ నీ, చూసి ఆనందించేయండి!! వినసొంపైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు అందం. ఈ సినిమా చూశాకా ఒకే విశేషణాన్ని ఇన్నిసార్లు ఎందుకు వాడానో అర్థమౌతుంది.
చిన్న మాట: ఈ సినిమా ఇప్పటికీ చందమామ కథలను, యేనిమేషన్ మూవీస్ ని ఇష్టపడే పెద్దవారికి మాత్రమే నచ్చుతుంది :)