సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 22, 2013

జీవన రాగం




సుప్రసిధ్ధ సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామమూర్తి రాసిన ఏకైన నవల "జీవనరాగం". వారి తొలి రచన. 1959లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో సీరియల్ గా ప్రచురితమైంది. తర్వాత 1970 లో పుస్తకరుపాన్ని దాల్చింది. నా దగ్గర ఉన్నది అప్పటి ప్రింట్. తర్వాత పున:ముద్రణ జరిగిందో లేదో తెలియదు. నాకు తెలుగు చదవడం వచ్చిన కొత్తల్లో ఇంట్లో చదవటానికి దొరికిన ప్రతి తెలుగు పుస్తకాన్ని వదలకుండా చదివేసేదాన్ని. అలా చిన్నప్పుడెప్పుడో చదివిన పుస్తకమిది. అప్పుడు వేటూరి ఎవరో కూడా తెలీదు నాకు. ఇవాళ వేటూరి వర్థంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని గురించి రాయాలనిపించింది.


ఈ పుస్తకం మొదటి పేజీల్లో "పల్లవి" పేరుతో వేటూరి ఈ రచనలో సహకరించిన మిత్రులు పెండ్యాల నాగేశ్వరరావుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. పుస్తకమ్లో తెలిపిన కొండజాతివారి ఆచారాలు, అలవాట్లను గురించి తెలిపినవారు, తనకి గురుతుల్యులైన మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఆ పక్కనే వేటూరి శ్రీ సాలూరి రాజేశ్వరరావు ప్రతిభను మెచ్చుతూ రాసిన ఒక కవిత(గేయం?) బావుంటుంది. క్రింద ఫోటోలో అది చదవవచ్చు..




"జీవన రాగం" కథ చాలా నాటకీయంగా, ఒక సినిమా కథలాగానే ఉంటుంది. పేరుప్రఖ్యాతలు బాగా సంపాదించిన ఒక ప్రఖ్యాత సంగీత దర్శకుడు రఘు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. విశ్రాంతి కోసం "నాగార్జున కొండ" దగ్గరకు వెళ్లవలసినదిగా స్నేహితురాలు రాగిణి సలహా మేరకు అక్కడకు బయల్దేరుతాడు. వెళ్ళే ముందు గాయని రాగిణి తన మనసు తెలుపగా, రఘు సంతోషంతో ఆమె ప్రేమనంగీకరిస్తాడు. ఆమె హృదయవీణపై తన అనురాగరాగాలను పలికిస్తాడతను. మీకై ఎదురుచూస్తానంటూ వీడ్కోలు చెప్తుంది రాగిణి.


నాగార్జున కొండపై విహార యాత్రికులకు వసతి కల్పించే ఒక సుందర ఆరామంలో ఒక కుటీరాన్ని అద్దెకు తీసుకుంటాడతను. వెంకన్న అనే వంటవాడిని పనిలో కుదుర్చుకుంటాడు. ఇక్కడ వేటూరి వర్ణించే నాగార్జున కొండ అందాలు వర్ణానాతీతం. ఒక్కసారిగా పరుగున వెళ్ళి ఆ రమణీయ ప్రదేశంలో సేదతీరాలనిపించేంతటి అందమైన వర్ణన అది. వేటూరి పెరిగినది ఆ ప్రాంతం చుట్టుపక్కల కాబట్టే అంత బాగా ఆ పరిసరాలను వర్ణించగలిగరేమో అనిపించింది నాకు.  నాగార్జునకొండకి చేరగానే అంతటి అందమైన ప్రశాంత వాతావరణం పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాగిణికి ఉత్తరం రాస్తాడతను. 



తర్వాత ఒక రోజు కోనలలో విహరిస్తుండగా ఒక పిట్టసవ్వడికి ఆకర్షితుడై వెతుకుతూ వెళ్ళి దారితప్పుతాడు. దారి వెతుక్కుంటూ వెళ్తున్న అతనికి ఒక కొండజాతి గుంపు ఎదురౌతుంది. దిగువన ఉన్న సెంద్రవంక కోనలో వాళ్ళదొక గూడెమని చెప్తారు వాళ్ళు. నెమ్మదిగా పరిచయం పెరిగి గూడానికి రాకపోకలు సాగిస్తుంటాడు రఘు. అక్కడ సుగాలి నాయకుడి కుమార్తె రజని అతని మనసులో అలజడి రేపుతుంది. రమ్యమైన రజని నాట్యానికి రఘు సంగీతం తోడౌతుంది. ఆమె రూపలావణ్యాలు, ఆమె సాంగత్యంలో తనను తానే మరిచిన రఘు రాగిణిని, ఆమె ప్రేమనూ కూడా మరుస్తాడు. ఆమె ఉత్తరాలకు జవాబులు కూడా సరిగ్గా రాయడు. రజని భౌతిక సౌందర్యంలో కొట్టుకుపోతున్న అతని మనసుని రాగిణి రాసిన ఆర్ద్రమైన ఉత్తరం కూడా కదిలించలేకపోతుంది. వెంకన్న జాబు వ్రాయగా రఘు పట్ల ఆదుర్దాతో ప్రక్కవాద్యం పద్మనాభాన్ని వెంటపెట్టుకుని రాగిణి అక్కడికి చెరుకుంటుంది.


రజని తలపులతో నిండిపోయిన రఘు ఏమౌతాడు? రజని ఏమౌతుంది? గూడెం నాయకుడు రఘు కళ్ళు ఎలా తెరిపించాడు? రఘుకి రాగిణి మళ్ళీ ఎలా చేరువౌతుంది? మొదలైన ప్రశ్నలకు మిగిలిన కథ సమాధానం చెప్తుంది. ఇది ఒక అతి మాములు కథే కానీ వేటూరి ఈ కథను మలిచిన తీరు, వాడిన భాష, ప్రకృతి వర్ణనా తెలుగు భాషకు సంబంధించి ఒక అపురూపమైన ఉదాహరణగా ఈ పుస్తకాన్ని నిలుపుతుంది. అసలు అంత చక్కని తెలుగు చదవటానికి ఎంత ఆనందం కలుగుతుందో! సినీ గేయరచయిత కాకపోయి ఉంటే, వేటూరి వల్ల స్వచ్ఛమైన తెలుగు పదాలతో కూడిన సాహిత్యసృజన జరిగి ఉండేదనిపిస్తుంది పుస్తకం చదివాకా.

నవలలో వేటూరి వాడిన కొన్ని హృద్యమైన పదాలు:

ఉత్తంగ పర్వత శ్రేణి, కాలాంభోధరాలు, శోభస్కరంగా, వియత్పురుషుని, అలౌకిక రస నిర్భరానందం, ఉద్విగ్నశోకావేశ స్ఫురణ, అంగుళీకిసలయంలా, అవనతముఖి, వినమితముఖి, శరత్కాలసితచంద్రికలు, సకృతి, ,గ్రీష్మాతపవహ్ని, కందళిస్తున్నది, హ్రస్వమైన, ఆనందతోరణం, ఉదాత్త లజ్జావివశత్వం, ప్రకృతిసహజ సంస్కారజ్యోతి, ఉద్విగ్నశోకావేశ స్ఫురణ, కొంకర్తవ్యతామూఢుడు, రాగ ప్రస్థారం, సితచంద్రికాహ్లాదరజన్నిటాల, జనమన:కేదారములు !



ఈ పుస్తకం గురించి గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.

7 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

నిజంగా ఈ రచనలో ఉన్న మంచి తెలుగుని మంచి వర్ణనలను చదవడానికే ఈ పుస్తకం చదవాలి ప్రతి ఒక్కరు.
కానీ మీరు ఉదాహరణగా ఇచ్చినవాటిలో దాదాపు అన్నీ సంస్కృతపదాలే. ఆ పదాల్ని మనం తెలుగులో అట్లాగే వాడుకోవచ్చు. వాడుకుంటున్నాము. బాగుంటాయి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

వేటూరి గారి సిరికాకొలను చిన్నది ఎంతో బాగుంటుంది. కథ కథనం అన్నీ.సంగీతపరమైన నాటకం అది.

Unknown said...

Trishna gaaru, Veturi gaari gurinchi teliyani paarshwam teliyajesinanduku chaala thanks. 14 samvastsarala vayasulo meghasandesham paata vinnappatnichi Vetooriki veeraabhimaninini. 5 samvastsarala kritam secretariat lo ayana darshanabhagyam kaligindi. Ite anyadha bhavinchantlite chinna savarana. meeru cheppina padalevi svacchmaina telugu padalu kavu. avannee samskritha janyale kadoo.

తృష్ణ said...

@లక్ష్మీదేవి: అవన్నీ చాలావరకూ సంస్కృతమన్నమాట.. అయినా ఎంత బాగున్నాయో ఆ పదాలు.. తెలియజేసినందుకు, వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారూ.
"సిరికాకొలను చిన్నది" నాటకం గురించి తెలుసండీ. వేటూరి వారి ప్రఖ్యాత రచన.

@నాగిరెడ్డి గారూ, పదాల ఆరిజన్ గురించి లక్ష్మీదేవి గారు కూడా చెప్పారండీ. గమ్మత్తుగా ఉన్నాయని టపాలో రాసాను. హెడ్డింగ్ మార్చానండి..:) వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Being Myself said...

తృష్ణ గారు.. రోజు రోజు కి తగ్గుతున్న తెలుగు భాష మీద అభిమానం తెప్పియ్యడానికి ఇలాంటి రచనలు చాల ముఖ్యం. ఇలాంటి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

@Being Myself:Thanks for the comment :)

Indira said...

ఇప్పుడే చూశాను మీ పోస్టు.వేటూరివారు ఒక నవల రాశారని నకు తెలీదు.చాలా ఆసక్తికరంగా వుంది.ఇప్పుడు మళ్ళీ చాలా పాత నవలలు రీప్రింట్ అవుతున్నాయి.ఇలాంటివి కూడా దొరికితే బాగుండు.థాంక్స్ ఫర్ షేరింగ్ తృష్ణా!