ఇలా ఉండేది |
ఇలా అయిపోయింది :( |
మేము ఉంటున్న ప్రాంతానికి వచ్చిన కొత్తల్లో పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళినప్పుడు చుట్టూరా ఉన్న పచ్చదనాన్ని చూసి చాలా సంబరపడిపోతూ ఉండేదాన్ని. అందులోనూ వర్షాకాలమేమో మరీ అందంగా ఉండేది. పల్లెటూరి వాతావరణం fresh air అని చాలా ఆనందించాము. పొలాలకు, చెట్లకూ ఫోటోలు అవీ తీసి మురిసిపోయేదాన్ని. ఆనందించినంత సేపు పట్టలేదు.. నెమ్మదిగా పచ్చదనమంతా మాయమైపోవడం మొదలైంది.
నిన్న మొన్నటిదాకా అలరించిన కాకర పాదులూ, బీర పాదులూ కాపు అయ్యాకా తీసేస్తే కొత్త పంట వేస్తున్నారు కాబోలనుకున్నాం. కానీ పాదులు పాకే స్థంభాలు కూడా పెకలించి వేస్తూంటే అర్థమైంది ఇక ఆ వైపున పచ్చదనం కనబడదని. ఇప్పటికే సందు చివర మూడంతస్థుల బిల్డింగ్ ఒకటి సగానికి పైగా పూర్తయిపోయింది. మరో వైపు ఖాళీగా ఉండే స్థలంలో రెండు డూప్లెక్సులు మొలిచాయి. దాని వెనుకగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా ఏవో తవ్వకాలు జరుగుతున్నాయి.
నేను వాకింగ్ కి వచ్చే దారిలో చివరకు ఉండే పొలాలు మాయమైపోయాయి. అక్కడ పొలాలకు కాపలాగా ఉండే పనివాళ్ల గుడిసెలు , చుట్టూరా ఉండే చెట్లు మాయమైపోయాయి. గుడ్డ ఉయ్యాల వేసుకుని ఊగే పసిపిల్లలను, చలిమంట కాచుకునే పిల్లలను చూట్టం నాకు భళే సరదాగా ఉండేది. అలా నడుచుకు వెళ్తూంటే చెయ్యి ఊపేవారా పిల్లలు. ఫోటోలు తీసుకుంటుంటే ఇంకోటి తియ్యరా? అని అడిగేవారు. ఆ గుడిసెల్లోని వాళ్లంతా ఏమైపోయారో..ఎక్కడికి వెళ్పోయారో..! మొదలంటా నరికిన చింతచెట్టు మొదట్లో మళ్ళీ వచ్చిన పచ్చని లేతచిగుర్లు చూసి ఆనందించేలోపే అది కూడా పూర్తిగా తవ్విపారేసారు. పెద్ద పెద్ద వేపచెట్లు.. అన్నీ కొట్టి పరేసారు. ఒకో చేట్టు ఎంత చల్లదనాన్నీ, నీడనీ ఇచ్చేదో. ఏం కడతారో ఏమో!!
క్రింద ఫోటోల్లోవేవీ ఇవేవీ లేవిప్పుడు :(
మనుషులకి ఊళ్ళు సరిపోక ఊరి బయటకు వచ్చేస్తున్నారు అనుకుంటే, ఆ ఊరి బయట కూడా జనాలకు సరిపోవట్లేదు. ఇంకా ఇంకా చెట్లు నరుక్కుంటూ, పచ్చదనాన్ని విధ్వంసం చేసుకుంటూ పక్క ఊరిదాకా పాకేస్తాడేమో మనిషి ! ఇన్నాళ్ళూ మెయిన్ రోడ్ నుండీ మా గేట్ దాకా ఉండే మట్టి రోడ్డులో చాలా ఇబ్బంది పడ్డాం.. నెల క్రితం ఓ రోజు తెల్లారేసరికీ కనబడ్డ అందమైన నల్లని తారు రోడ్డుని చూసి కష్టాలు గట్టెక్కాయని సంతోషించాం కానీ మొదలవబోతున్న కొత్త భవంతులు చూశాకా రోడ్డెందుకు వేయించారో అర్థమైంది !
ఒక చిన్న ఆనందం ఏంటంటే ఈ కట్టడాలన్నీ మా ఇంటికి ఒక వైపునే జరుగుతున్నాయి. మరో వైపున ఉండే వరిపైరు కోతలు మొన్ననే పూర్తయ్యాయి.
3 comments:
Nearing 1.3 billion population means this:-)
And then increasing quest for luxuries
అయ్యో.. ఆ పచ్చదనమంతా మాయమైపోతుందంటే బాధగ ఉందండి..:(
@krishna palakollu: hmm..may be..:(
@dhatri:అంతా కాదులెండి.. కొంతే! సగమన్నా మిగిలుంది.. అదే కాస్త ఉపశమన..
Post a Comment