"ఏదన్నా వెహికిల్ మోడల్ చేసి పంపమని" పిల్లకి స్కూల్లో ప్రాజక్ట్ వర్క్ ఇచ్చారు. అసలు శలవుల్లో ఇచ్చిన ప్రాజక్ట్ వర్కులన్నీ పూర్తిచెయ్యమని తను అమ్మమ్మ ఇంటికి వెళ్ళేప్పుడు చెప్పి పంపితే సగమే పూర్తి చేసుకు వచ్చింది పిల్ల. అవన్నీ ఆదివారం రాత్రి, సోమవారం పొద్దున్న కూచుని అతికష్టం మీద పూర్తిచేసా. ఈ ఒక్కటీ నావల్ల కాదని ఈ వెహికిల్ ప్రాజెక్ట్ ని వదిలేసా. క్లాస్ లో కొందరు మోటార్ బైక్, సైకిల్ అలా చేసుకువచ్చారుట. "రేపే లాస్ట్ డే..ఎలాగన్నా చేసి తెమ్మన్నారు EVSసార్.. కార్డ్ బోర్డ్ తో చెయ్యాలి" అని నిన్న స్కూల్ నుండి వస్తూనే పిల్ల గొడవ. అంతకు ముందు రోజే అన్ని ప్రాజక్ట్స్ చేసిన మీదట "నావల్ల కాదు నన్నొదిలెయ్యి తల్లీ, మీ నాన్న వచ్చాకా చూసుకోండి" అనేసా నేను.
అయ్యగారు ఆఫీసు నుండి వచ్చాకా బేరం పెట్టింది పిల్ల. అలానే చేసేద్దాం అని అభయమిచ్చేసారు ఈయన. "ఇదిగో..పువ్వులు, ఆకులు అంటే చేస్తాను కానీ ఈ వెహికిల్స్ అవీ నాకు రావు నావల్ల కాదు. మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పేసా. నిన్న రాత్రి పిల్ల బజ్జున్నాకా ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లారు. కాసేపయ్యాకా పెద్ద పెద్ద థర్మొకోల్ షీట్లు, కార్డ్ బోర్డ్ తెచ్చారు. నెట్లో ఏవో వెతుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే "ఫార్ములా వన్" మోడల్స్ డెస్క్ టాప్ మీద పెట్టి చేసేద్దాం..రా.. అన్నారు. నాకు బోలెడు కోపం వచ్చింది. అసలు నేను చెయ్యనన్నా కదా,ఇప్పుడీ ఫార్ములా కార్లెవరు చేస్తారు? నావల్ల కాదు. ఏ సైకిలో చేసేయచ్చు కదా" అన్నాను. అందరిలా మనమూ చెయ్యటమేంటి వెరైటీ గా ఉంటుంది. హెల్ప్ చెయ్యి.." అన్నారు. నిజం చెప్పద్దూ.. ఆ మోడల్ కార్లు చూస్తే నాకూ సరదా వేసింది. ఈజీగా ఉన్న ఓ మోడల్ కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టి, ఆ ప్రకారం ఇద్దరం చిన్నపిల్లల్లా కూచుని ఆ మోడల్ చెయ్యటం మొదలెట్టాం. నాకు తృప్తి కలగలేదు కానీ ఏదో ఓ మాదిరిగా చేసాం. టైమ్ ఉంటే ఇంకా బాగా చేద్దుము అనుకున్నాం.
మొత్తం అయ్యాకా రంగు వేద్దాం అని వెతికితే అన్ని కలర్స్ ఉన్నాయి కానీ టైర్లకి కావాల్సిన బ్లాక్ కలర్ మాత్రం లేదు. ఫ్యాబ్రిక్ కలర్స్,పోస్టర్ కలర్స్ అన్ని వెతికాం, ఆఖరుకి పిల్ల వేసుకునే వాటర్ కలర్స్ లో కూడా బ్లాగ్ కలర్ అయిపోయింది. అప్పటికే రాత్రి ఒంటిగంట అయ్యింది ! ఇక పొద్దున్న ఆరున్నరకే ఏ షాపన్నా తెరుస్తారేమో అని బయల్దేరారు తను. మా ఏరియా నుంచి మార్కెట్ రోడ్డు చాలా దూరం. ఎనిమిదింటికే పాప ఆటో వచ్చేస్తుంది. పది నిమిషాల తక్కువ ఎనిమిదికి కలర్స్ బాక్స్ తీసుకొచ్చారు. అప్పుడు టైర్లకి గబగబా బ్లేక్ కలర్ వేసాను. కానీ ఎంత ఫ్యాన్ క్రింద పెట్టినా పది నిమిషాల్లో ఎక్కడ ఆర్తాయి? ఇంతలో ఆటో వచ్చేసింది. పిల్ల వెళ్పోయింది. "ఆటో స్కూల్ గేట్ దాకా వెళ్ళటానికి టైం పడుతుంది.. ఈలోపు ఆరబెట్టేస్తాను.. పట్టుకెళ్ళండి" అన్నా. ఆఫీసుకి లేటయిపోతుంది ఇప్పుడిక కుదరదు.రేపు పంపు..అంతే" అన్నారు. నాకు బోలెడు కోపం,బాధ,ఉక్రోషం అన్నీ వచ్చేసాయి. "రేపు పంపేదానికి నిన్న రాత్రంతా అంత కష్టపడటం ఎందుకు?పొద్దున్నే మీరు రంగుల కోసం ఊరంతా తిరగటం ఎందుకు? పైగా ఇవాళే లాస్ట్ డే అని వాళ్ల సార్ చెప్పరుట.. రేపటికి ఇస్తేఒప్పుకోరేమో... మనదంతా వృధా ప్రయాస అయిపోతుంది.." అని నేను గొడవ పెట్టాను. ఏమయినా ఆఫీసుకి వెళ్పోవాలి అని తను తయారైపోయారు. ఈ మోడల్ చెయ్యటం కోసం రాత్రంతా ఎంత కష్టపడ్డామో తలుచుకుంటే నాకు చాలా బాధ కలిగింది. మూడ్ అంతా దిగులుగా అయిపోయింది.
అంతలో నాకు తటాలున ఒక ఐడియా వచ్చింది. పట్టుకెళ్ళి క్లాసులో ఇమ్మని స్కూల్ఆటో అబ్బాయికి ఫోన్ చేస్తే..? అని. వెంఠనే చేసాం. ముందు కుదరదన్నాడు. తర్వాత డబ్బులిస్తాం రమ్మంటే సరేనన్నాడు. ఓ అరగంటలో వచ్చి పట్టుకెళ్ళాడు. ఈ హడావుడిలో పిల్లకి ఇవాళ హాఫ్డే అని మర్చిపోయి కేరేజ్ కూడా ఇచ్చేసాను నేను. (నెలలో లాస్ట్ వర్కింగ్ డే హాఫ్ డే వాళ్ళకి.) మధ్యాహ్నం బెల్లు కొడితే ఎవరో అనుకుని తలుపు తెరిస్తే పిల్ల ! అప్పుడు గుర్తుకొచ్చింది హాఫ్ డే సంగతి. ఇంతకీ సార్ ఏమన్నారు అనడిగితే "బావుందన్నారు. అందరి వెహ్కిల్ మోడల్స్ క్లాస్ లోనే గూట్లో పెట్టారు. నాది ఏక్టివిటీ రూమ్ లో పెట్టించమని పంపారు" అని చెప్పింది. ఇంకేముంది.. నా మొహంలో వంద చిచ్చుబుడ్లు, వెయ్యి మతాబలూ ఒక్కసారిగా వెలిగిపోయాయి. వెంఠనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పా. "వెరీ గుడ్ వెరీ గుడ్!" అన్నారు. లోపల్లోపల మాత్రం "బ్రతికానురా దేవుడా!" అనుకుని ఉంటారు..:-)