సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, February 9, 2012

కాలజాలం




ఒక ఇంట్లో మనుషులమే మనసారా.. తృప్తిగా మాట్లాడుకుని వారాలు,నెలలు అవుతున్న యాంత్రిక యుగం ఇది. పొద్దున్న లేస్తే రోజెలా గడుస్తోందో తెలియనంతగా ఉరుకులు పరుగులు. చేరాల్సిన గమ్యాలు.. చేరుకోలేని గమ్యాలు.. బదులు చెప్పాల్సిన జవాబులు.. ఇంకా ఎన్నో నిన్నల్లోనే మిగిలిపోతున్నాయి..! మనకి మనమే సమయం కేటాయించుకోలేక సతమతమయ్యే హడావుడి జీవితంలో ఇంక బంధువులను కలిసే అవకాశాలు వచ్చినా సమయాభావం వల్ల వాటిని చేజార్చుకోవాల్సి వచ్చేస్తోంది. మనమే కాక మన పిల్లలకూ బంధుత్వాల్లోని మాధుర్యాన్ని అందించలేని నిస్సహాయ స్థితి మనది. ఒకే ఊళ్ళో ఉన్నా, అభిమానాలూ, అప్యాయతలు ఉన్నా కూడా smsలతోనూ, ఫోన్ కాల్స్ తోను సరిపెట్టేసుకోవాల్సివస్తున్న కాలజాలం ఇది.


చిన్నప్పుడు అందరు బంధువుల ఆహ్వానాలకీ, పెళ్ళిళ్ళకీ తప్పకుండా ఎలా హాజరయ్యేవాళ్ళమా అని నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆహ్వానాలనేమిటీ ప్రతి వేసవి సెలవుల్లోనూ పిన్నిలు,పెద్దమ్మలూ, మావయ్యలు ,బాబయ్యలు ఎందరి ఇళ్ళకు వెళ్ళేవాళ్లం... చల్లని వెన్నెల్లో ఆరుబయటో, డాబా మీదో అందరం కూచుని కబుర్లు చెప్పుకున్న మధురమైన క్షణాలు ఇప్పుడేవి..? పిల్లలందరం గంతులు వేస్తూ, ఆటలాడుతూ, ఉడికించుకుంటూ, అటు ఇటూ పరిగెడుతూనే పెద్దలందించే పెద్ద పెద్ద ఆవకాయ ముద్దలు గుటుక్కున మింగుతూ కేరింతలు కొట్టిన మన అపురూపమైన జ్ఞాపకాలను మన పిల్లలక్కూడా మనం ఇవ్వగలుగుతున్నామా..? ఊళ్ళోకి ఇద్దరుమావయ్యలు వచ్చరని తెలిసి మళ్ళి ఎప్పటికి కలుస్తామో.. అని ఉన్నపళంగా అరవైకిలోమీటర్లు హడావుడిగా పరుగులు పెట్టి..వాళ్లను కలిసి వచ్చాకా నాకు కలిగిన ప్రశ్నలు ఇవి.


మా నలుగురు మేనమామల్లో ఇప్పుడు ఉన్నది వారిద్దరే. అనుకోకూండా ఊళ్ళోకి వచ్చారు. అరడజనుమంది దాకా కజిన్స్ ఉన్నాం ఉళ్ళో. పెద్దవాళ్ళు ఎన్ని చోట్లకని తిరుగుతారు? అందుకని ఒకరి ఇంట్లో వాళ్ళు అక్కాచెల్లెళ్ళు,అన్నదమ్ములు కలిసారు. మేమూ వీలయినవాళ్ళం వెళ్ళాం. నేనయితే అందరినీ కలిసి రెండేళ్ళు అవుతోంది. మా అన్నయ్యను కూడా దాదాపు రెండు నెలలకు ఇవాళ చూశాను. వాడు ఆఫీసుకి వెళ్పోతూంటే..ఒక్క క్షణం. ఇంత యాంత్రికమైపోయిందే జీవితం అని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి !! పతి ఏడాదీ బంధువులందరం ఒక్కసారన్నాఎక్కడోఅక్కడ కలిసే రోజుల నుంచి.. అందరి పెళ్ళిళ్లకూ అందరం తప్పనిసరిగా ఒకచోట చేరే రోజుల నుంచీ.. ఒకే ఊళ్ళో ఉన్నా నెలలతరబడి బంధువులెవ్వరిని ఎవ్వరం కలవటానికి వీలులేని పరిస్థితికి చేరాం. ఒక్కొక్కరం ఒక్కో మూల.. పాతిక ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో ఎవరి సంసారసగరంలో వాళ్ళు ఈదులాడుకుంటుంటే  ఇంకేం కలుస్తాం?


రెండేళ్ళ తరువాత మావయ్యలనీ, అత్తల్నీ, పిన్ని,బాబయ్యా.. అందరిని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇంతలో వీళ్ళింత పెద్దవారయిపోయారు? ఇలా వార్ధక్యపు చాయలు వచ్చేసాయి? అని. చిన్నప్పటి నుంచీ చూస్తున్నవాళ్లలో ఆ వయసు తెచ్చిన మార్పుని ఎందుకో మనసు అంగీకరించలేకపోతోంది. బహుశా అద్దం ముందర క్షణం నించుని మనలో వయసు తెస్తున్న మార్పుని పరిశీలించుకుంటే మనకి మనమే నచ్చమేమో ! కానీ ఈ మధ్యకాలంలో బంధువులను కలిసే చాలా అవకాశాలు మిస్సయ్యకా ఇవాళ అందరినీ చూస్తే ఎంతో ఆనందం కలిగింది. ఒక జంటతో స్టేషన్ దాకా వెళ్ళి రైలు ఎక్కించి తృప్తిగా ఇల్లు చేరాను. రక్త సంబంధంలోని తీపి ఇలాగే ఉంటుందేమో !!


12 comments:

హరే కృష్ణ said...

చాలా కరెక్ట్ గా రాసారక్కా!



I don't care how poor a man is; if he has family, he's rich అని ఊరికే అనలేదు

రాజ్ కుమార్ said...

hmm... ఆ రోజులు మళ్ళీ రావేమోనండీ.. ;(
అమ్మా, నాన్నలని ఐదు నెలలకి ఒకసారి మాత్రమే చూడగలుగుతున్నాను. ఇక మావయ్యలు, అత్తయ్యలు, పిన్నులూ, బాబాయ్ లూ ఎప్పుడెవరిని చూస్తామో తెలీదు.. ;( ;( మా చిన్నప్పుడూ మావయ్యలు నన్ను ఎంత గారాబం గా చూసుకునేవారో.. వాళ్ల పిల్లలకి నేనెవరో తెలీదు. ;( ;( వాళ్ళ పూర్తి పేర్లు నాకు తెలీదు. ఏడవాలో నవ్వాలో తెలియలేదు నాకు మొన్నటిసారి ఇంటికెళ్ళినప్పుడు.. ;(
ప్చ్..

SHANKAR.S said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం తృష్ణ గారూ. "బిజీ లైఫ్" అంటాం కానీ ఆ పేరుతొ అందరూ ఉన్న అనాధల్లా బ్రతికేస్తున్నాం అనిపోస్తోంది. నా వరకు నేను
హైద్ లో ఉన్న మా మేనమామ ఇంటికి వెళ్ళే దాదాపు ఏడాది అవుతోంది. ఒక్కోసారి జీవితం ఎంత మెకానికల్ గా గడిపేస్తున్నామా అనిపిస్తుంది.

"చిన్నప్పటి నుంచీ చూస్తున్నవాళ్లలో ఆ వయసు తెచ్చిన మార్పుని ఎందుకో మనసు అంగీకరించలేకపోతోంది. బహుశా అద్దం ముందర క్షణం నించుని మనలో వయసు తెస్తున్న మార్పుని పరిశీలించుకుంటే మనకి మనమే నచ్చమేమో !"

హ్మ్...నిజమేనండీ.

రేపు ఇరవై మూడున అన్నీ కలిసొస్తే దాదాపు నాలుగేళ్ల తర్వాత కజిన్ పెళ్లి కోసం కాకినాడ వెళ్ళబోతున్నా. ఒకే సారి అటు బంధువులు, ఇటు ఊరు- కాలం తెచ్చిన మార్పులు చూసే అవకాశం. ఒక్కో రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఏదో తెలియని ఉద్వేగం!!

sphurita mylavarapu said...

ఓణీల్లో చూసిన పిన్ని...ఆ మధ్య ఫోను చేసినప్పుడు ఇంకా మీ పిన్ని young అనుకుంటున్నావా...కళ్ళజోడు పెట్టుకుంటే గానీ కనపడదు...వుండు కళ్ళజోడు తెహ్చుకుని వస్తా నీ బ్లాగు చదవటానికి అంటే ఒక్కసారి మనసు చివుక్కు మంది...అద్దం ముందు నించుంటే మనలో వయసు తెచ్చే మార్పులు మనకే నచ్చవేమో...నిజంగానే నచ్చవండీ...అందుకే అద్దం ముందు నించునే తీరిక కూడా లేకుండా పరిగెడుతున్నాం...:)

Surabhi said...

Trishna gaaru,
I totally understand and I'am with you. My situation is I'am very far in pravaasam and miss everyone. reading your post i feel so emotional not able to stop the tears. I really do miss everyone and every single moment back in home.

surabhi

Anonymous said...

మేమయితే పెళ్ళిళ్ళు లాటి ముఖ్యమైన ఈవెంట్స్ కూడా మిస్సవుతున్నాం !! :(
మీ టపా నన్ను చాలా హోం సిక్ గా చేసింది!
శారద

మనసు పలికే said...

టపా చదువుతూ, పేరుకి నా డెస్క్ దగ్గర కూర్చున్నాననే కానీ, చిన్నతనానికి వెళ్లిపోయాను ఒక్కసారిగా.
చేతిలో ఎంత సమయం ఉండేదో.. ఎవరి పెళ్లైనా సరే, కనీసం వారం ముందు ఉండాలి పెళ్లింట్లో, స్కూల్ ఎగ్గొట్టి. అక్కడ ఇల్లు అలకడం దగ్గర్నుండి, ప్రతి పెళ్లి పనిలోనూ ఒక చెయ్యేస్తే గానీ మనశ్శాంతి ఉండదు, ఎవరు ఎంత వద్దంటున్నా. ప్రతి పండగని పుట్టినరోజంత సంబరంగా, పుట్టినరోజుని ఇష్టమైన పండగంత సంబరంగా జరుపుకునే రోజుల్ని దూరం చేసింది ఎవరు అంటే సమాధానం ఏం దొరుకుతుంది?? ఆటలు పాటలు నవ్వులు ఏడుపులు అన్నీ కాలంతో పాటు పెద్దరికాన్ని సంతరించుకున్నట్టున్నాయి..

వేణూశ్రీకాంత్ said...

బాగా రాశారు..

జ్యోతిర్మయి said...

'విధి వంచితులు' పదం కొంచెం భారంగా ఉన్నా ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా అది గుర్తొస్తూ ఉంటుంది.

Indira said...

డియర్ తృష్ణా,ఎంత విచిత్రం!!కాకతాళీయంగా మా తమ్ముళ్ళకి నాకు ఇవ్వాళ ఇదే విషయం మీద చర్చ జరిగింది.మనుషులు రొజు రోజుకి మరీ యాంత్రికంగా ఎవరి ప్రపంచంలో వారు బ్రతుకుతున్నారు.కానీ అప్పుడప్పుడు దినపత్రికల్లో కళాశాలల,విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్ధుల కలయికల వార్తలు,కుటుంబాలలో కజిన్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్లు యేర్పాటు చేసుకోవడం చూస్తుంటే,పరిస్థితి మళ్ళీ కొంచెం అశావహంగానే కనిపిస్తోంది.

తృష్ణ said...

@hare krishna,
@raj,
@shankar,
@sphoorita,
Thank you for the visit and valuable comments.

తృష్ణ said...

@surabhi,
@sarada,
@venu,
@aparna,
@jyotirmayi,
@indira,
Thank you for the visit and valuable comments.