సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, September 13, 2011

ఆత్రేయ గారి "కనబడని చెయ్యేదో "



కమ్మని పాటలనీ, జీవిత సత్యాలనూ సులువైన మాటల్లో సినీగేయాల రూపంలో మనకు అందించిన మన ప్రియతమ సినీ గేయరచయిత ఆత్రేయ గారి పాటలతో ఛానల్స్ అన్నీ మారుమ్రోగుతున్నాయి. నాక్కూడా కొన్ని పాటలు గుర్తుచేసుకుందాం అనిపించింది. కోకొల్లలుగా ఉన్న వారి పాటల్లో ఎన్నని గుర్తుచేసుకునేది..?? మనసు పాటలు అందరికీ తెలిసినవే....
మనసు లేని బ్రతుకొక నరకం(సెక్రటరీ)
మనసు గతి ఇంతే(ప్రేమ్ నగర్)
మానూ మాకును కాను(మూగమనసులు)
ముద్ద బంతి పువ్వులో(మూగమనసులు)
మౌనమే నీ భాష(గుప్పెడు మనసు)
మనసొక మధుకలశం(నీరాజనం)
మొదలైనవన్నీ అద్భుతమైన పాటలే. ఈ పాటల్లోని ఏ వాక్యాలను....కోట్ చేసినా మరొక పాటను అవమానించినట్లే.

ఇక నాకు బాగా నచ్చే మరికొన్ని పాటల్లో "ఆడాళ్ళూ మీకు జోహార్లు" అనే సినిమాలో "ఆడాళ్ళూ మీకు జోహార్లు..ఓపిక ఒద్దిక మీ పేర్లు; మీరు ఒకరి కన్నా ఒకరు గొప్పోళ్ళు.." అనే పాట ఉంది. పాట చాలా బావుంటుంది. కొద్దిపాటి సన్నివేశాలు మినహా సినిమా కూడా బావుంటుంది. ఇది కాక అభినందన, మూగ మనసులు, మౌనగీతం, నీరాజనం, ఇది కథ కాదు, ఆకలిరాజ్యం, మరోచరిత్ర మొదలైన సినిమాల్లో ఆత్రేయ గారు రాసిన పాటలు అన్నీ ఈనాటికీ మనం వింటూనే ఉంటాం. "కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదానా..". ఇది శ్రీశ్రీ రాసారని చాలామంది అపోహపడేవారుట అప్పటి రోజుల్లో. ఇంకా చిరంజీవి "ఆరాధన" సినిమాలో "అరె ఏమైందీ" , "తీగెనై మల్లెలు పూసిన వేళ" రెండూ నాకు భలే ఇష్టం.

నాకు బాగా నచ్చే పాటలు మరికొన్ని..
* నీవు లేక వీణ( డాక్టర్ చక్రవర్తి)
* ఆనాటి ఆ స్నేహమానందగీతం (అనుబంధం)
* ఆకాశం ఏనాటిదో(నిరీక్షణ)
* ప్రియతమా నా హృదయమా(ప్రేమ)
* రేపంటి రూపం కంటి(మంచిచెడు)
* దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి(అంతులేని కథ)
* ఈ కోవెల నీకై వెలిసింది(అండమాన్ అమ్మాయి)
* జాబిల్లి కోసం ఆకాశమల్లే(మంచి మనసులు)
* కలువకు చంద్రుడు(చిల్లర దేవుళ్ళు)
* కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే(కోరికలే గుర్రాలైతే)
* లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు(కంచుకోట)
* నాలుగు కళ్ళు రెండైనాయి(ఆరాధన)
* నీ సుఖమే నే కోరుకున్న(మురళీకృష్ణ)
* నేనొక ప్రేమ పిపాసిని(ఇంద్రధనుస్సు)
* పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో(కోకిలమ్మ)
* వేళ చూడ వెన్నెలాయె(నాటకాల రాయుడు)


ఇవన్నీ ఒక ఎత్తైతే, 'తాశీల్దారు గారి అమ్మాయి(1971)' సినిమాలో కె.బి.కె.మోహన్ రాజు గారు పాడిన "కనబడని చెయ్యేదో " పాట కూడా సాహిత్యపరంగా చాలా బావుంటుంది. కె.వి. మహాదేవన్ సంగీతం చేసిన ఆ పాటను, మరికొన్ని మోహన్ రాజు గారి పాటలను క్రింద ఈ
లింక్ లో వినవచ్చు:

http://kbkmohanraju.com/songslist.asp?tab=Janaranjani1977#

సాహిత్యం:
కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం,కీలుబొమ్మలం
నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
ఆ కాళ్ళు లాగి నీ చేత తైతక్కలు ఆడిస్తుంది
((కనపడని...))

కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ ఉంటూనే ఆడుతాము నువ్వూ నేనూ బూటకం
తలచింది జరిగిందంటే నీతెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు
మననూ మనవాళ్ళనీ మాటల్లో అంటావు
నేనూ నేనన్న అహంతో తెంచుకుని పోతావు
((కనపడని...))

కర్మను నమ్మిన్వాళ్లెవరూ కలిమిని స్థిరమనుకోరూ
కళ్ళు మూసుకోరు
మనసు తెలిసినవాళ్ళేవరూ మమత చంపుకోరు
మనిషినొదులుకోరు
ఉన్నదాని విలువ తెలియనివారు పోగొట్టుకుని విలపిస్తారు
((కనపడని...))

మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది
కావాలని నిప్పుని తాకితే చెయ్యి కాలక మానదు
కాలినందుకు కర్మ అంటే గాయమేమో మానదు
((కనపడని...))

7 comments:

SHANKAR.S said...

మీకు రెండు థాంకులు తృష్ణగారూ. ఒకటి ఇంత మంచి పాటని పరిచయం చేసినందుకు. రెండోది మోహన్ రాజు గారిలాంటి గాయకుడి వెబ్ సైట్ లింక్ ఇచ్చి పండగ చేసుకునే అవకాశం కల్పించినందుకు. లలిత గీతాలు, రంగస్థల పద్యాలు, గజల్స్ అబ్బో ఒకటారెండా. సైట్ చాలా బావుందండీ.

ఇంక ఆత్రేయ గారి గురించి చెప్పేదేముంది? అలాంటోడు మళ్ళీ రాలేదంతే.!!

Unknown said...

మీరు చెప్పిన పాటలు విన్నప్పుడు ఆ భావానికి కళ్ళు చెమర్చుతాయి.అంత గొప్పగా అందంగా ఎలా రాయగలరు అని.మరోసారి ఆత్రేయగారిని తలచుకునే అవకాసం ఇచ్చారు ధన్యవాదాలు.

SRRao said...

తృష్ణ గారూ !
మంచి పాటల గురించి ప్రస్తావిస్తూ మరో మంచి పాటను సాహిత్యంతో సహా లింక్ ఇచ్చి ఆత్రేయకు మంచి నివాళి ఇచ్చారు. ధన్యవాదాలు.

ఒక చిన్న సవరణ. కలువకు చంద్రుడు పాట స్నేహం చిత్రంలోనిది కాదు. చిల్లరదేవుళ్లు చిత్రంలోనిది. గమనించగలరు.

Ennela said...

అన్నీ మంచి పాటలు..వీటిలో చాలా పాటలు నాకూ ఇష్టం..మీరు ఏం వ్రాసినా వెరయిటీగా ఉంటుంది సుమా!!!

తృష్ణ said...

@శంకర్.ఎస్: అవునండి. ఆ వెబ్సైట్ చాలా బావుంది . వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు .

@కల్లూరి శైలబాల: అంత గొప్పగా, ఫిలసాఫిక్ గా కూడానూ..! మీక్కూడా వ్యాఖ్య రాసినందుకు చాలా థాంక్సండీ.

@ఎస్.ఆర్. రావు :వారి పాటలను ఇలా తలుచుకోవటమే నివాళి..నిజం..నిజం.
హడావుడిలో పొరపాటు....కరెక్షన్ కు ధన్యవాదాలు.

@ఎన్నెల: ఏదో మీ అభిమానం..అంతేనండి...వ్యాఖ్య రాసినందుకు చాలా థాంక్సండీ.

Sreenivas Paruchuri said...

మోహనరాజుగారి వెబ్‌సైట్‌వివరాలిచ్చినందులకు బోలెడు Thanks! ఈ సంవత్సరం ప్రారంభంలో KBKగారబ్బాయి "రచ్చబండ" లిస్టులో ఒక నోట్ ‌పోస్ట్‌ చేసారు.
http://groups.yahoo.com/group/racchabanda/message/23090
ఎక్కువ పాటలు పెట్టలేదే అనుకున్నాను అప్పట్లో.

చాలా చాలా కాలం తరువాత "చూచే కొలది సుందరము" పాట విన్నాను. పదేళ్ళ క్రితం KBKగారి గురించి, ఈపాట గురించిన ఒక చర్చ:
http://groups.yahoo.com/group/ghantasala/message/289
http://groups.yahoo.com/group/ghantasala/message/291

Ah, AIR nostalgia!!

Thanks and Regards,
Sreenivas

hkpt said...

ఆత్రేయ గారు రాసిన వేల పాటల్లో కొన్ని ఉదాహరించడం కష్టం. నా చిన్నతనంలో చూసిన సినిమాల్లో గుర్తుండి పోయిన పాటల్లో "కనపడని చెయ్యి కాదు" ఒకటి. పాత సినిమాల్లోంచీ అత్రేయ అంటే నాకు గుర్తుండి పోయిన రెండు పాటలు - ఒకటి "కారులో షికారుకెళ్ళే (తోడికోడళ్ళు)", మరికటి "వాగ్దానం" సినిమాలో ఘంటసాల రేలంగికి నేపధ్యంలో పాడిన హరికధ "శ్రీ నగజా తనయం ..." ఆదిగా.

- తాడేపల్లి హరికృష్ణ