సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 15, 2013

కథ నేపథ్యం - 1



కొన్ని కథలు చదివినప్పుడు, రచయిత ఈ కథను ఎందుకు రాయాలనుకున్నారో, ఏ సందర్భంలో ఇలాంటి ఆలోచన వచ్చిందో, ఎందుకని ఇలా రాసారో అన్న ప్రశ్నలు కలుగుతాయి మనకు. అలాంటి కొన్ని ప్రశ్నలకు మనకు "కథ నేపథ్యం" పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి. కొన్నేళ్ల క్రితం 'ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రిక'లో చాలామంది రచయితలతో వారి కథల నేపథ్యాలను ప్రచురించారు. వాటికి మొత్తానికి మరికొన్ని కథా నేపథ్యాలు రచయితలతో రాయించి అవి అచ్చు వేసేసింది తానా ప్రచురణల సంఘం. అయితే అవి మొత్తం చాలా పేజీలు ఉండడం వల్ల రెండు భాగాలుగా ప్రచురించాలనుకున్నారుట. 25 కథలతో మొదటి భాగం 2013 జనవరిలో విడుదల చేసారు. ఈ పుస్తకానికి సంపాదకులు ఆర్. ఎమ్. ఉమామహేశ్వరరావు గారు, డా.జంపాల చౌదరి గారు, వాసిరెడ్డి నవీన్ గారు. ఔత్సాహిక రచయితలకు ఈ కథా నేపథ్యాలు ఉపయోగపడగలవని సంపాదకుల అభిప్రాయం.



కథ వెనుక కథను తెలిపే ఈ కథా నేపథ్యాలను చదువుతుంటే ఆయా కథల పట్ల మనకున్న దృక్కోణం మారుతుంది. ఇలా కథ వెనుక ఉన్న రచయిత ఉద్దేశాన్నో ,ఆలోచననో, అనుభూతినో తెలుసుకోవటం ఆసక్తికరమైన విషయం. మామూలుగా కథ చదివిన దాని కన్నా ఇలా కథానేపథ్యాన్ని తెలుసుకున్నాకా ఆ కథ మరింత అర్థమౌతోందనిపిస్తుంది. కొన్ని కథలకూ వాటి వెనుక కథకూ పెద్దగా సంబంధమేమీ కనబడదు కానీ ఇంత చిన్న ఆలోచన లోంచి ఈ కథ పుట్టిందా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది.



వైవిధ్యమైన పాతిక కథలున్న ఈ పుస్తకంలో తమ కథానేపథ్యాలను తెలిపిన కథకుల పేర్లు క్రింద ఫోటోలో చూడవచ్చు:

 


సతి: అబ్బూరి చాయాదేవి కథ "సతి" తో మొదలౌతుందీ పుస్తకం. ప్రఖ్యాత కథకులుగా ఎదిగిన ఒక జంట కథ ఇది. "బీనాదేవి" పేరుతో రచనలు చేసిన దంపతుల్లో ఒకరైన బి.నరసింగరావుగారి మరణం తర్వాత జరిగిన సంతాప సభలూ, పరిస్థితులు "సతి" కథకు నేపథ్యం అని ఛాయాదేవి చెప్తారు. ఈ కథలో తాను పురుషాహంకారం నీడని నిరసించానని చెప్తారు.


చీకటి: బాతుల వేటకై బయల్దేరిన ఇద్దరు అపరిచితుల కలయిక, విరుధ్ధమైన వారి జీవననేపథ్యాలు, విభిన్న మనస్తత్వాలూ తెలిపే అల్లం శేషగిరిరావు కథానిక "చీకటి". ఈ కథ చదువుతుంటే ఎందుకో వంశీ మన్యంరాణి గుర్తుకొచ్చింది. కథలో డిబిరి గాడి జీవనగాధ విన్నప్పుడు జీవితం ఇంత దుర్భరంగా, హృదయవిదారకంగా కూడా ఉంటుందా.. అని విభ్రాంతి చెందుతాము. అతడి అవతారం గురించిన వర్ణన, అతడు ఎదుర్కొన్న సమస్యలు, పడిన బాధలూ వింటున్న వర్మ తో పాటు మన రోమాలూ నిక్కబొడుచుకుంటాయి. రచయిత ఏజన్సి ప్రాంతంలో పనిచేసినప్పుడు ఒక రిటైర్డ్ పెద్దాయన చెప్పిన విషయాల ఆధారంగా ఈ కథ రాసారుట. దానికి మూలం కూడా అతను చెప్పిన ఒక చిన్న సంఘటన. ఒకసారి ఉరిశిక్ష పడిన ఒక గిరిజన ఖైదీ తన కొడుకు తన కోసం వస్తాడనీ, ఆకలితో వచ్చే అతనికి పూరీకూర పెట్టమని, అదే అతన ఆఖరి కోరిక అనీ జైలర్ కు చెప్పాడుట. ఈ చిన్న సంఘటన ఆధారంతో ఈ కథ అల్లాననీ కథానేపథ్యంలో శేషగిరిరావు చెప్తారు. చదివిన చాలాసేపటి వరకూ మనల్ని ఆలోచనల్లో ముంచివేసే ఆర్ద్రమైన కథ "చీకటి".


సర్కస్ డేరా: ఊళ్ళోకి సర్కస్ రావటం, పబ్లిసిటి కోసం తిప్పే మోటారువేన్, సర్కస్ డేరాలూ, చుట్టూతా డబ్బారేకు అంచులు, ఏనుగులు, గుర్రాలు, పులులు, మనుషులూ... ఇవన్నింటితో చిన్నప్పుడు చూసిన సర్కస్ గుర్తుకు తెస్తారు ఈ కథలో మధురాంతకం రాజారాం. నాగులు దాబ్బులు తీసుకుపోయాడని రఘుపతి చింతిస్తూంటే, ఎందుకు నమ్మారని ఆరా తీసిన మనుషులే తీరా నాగులు చిల్లర డబ్బులతో తిరిగి వచ్చేసరికీ మాట మార్చేసి ఇంతోటి దానికే ఇంత హంగామానా అని వెటకారాలాడతారు. ఈ సంఘటన రెండునాల్కలతో మాట్లాడే సమాజానికి ప్రతీక. సర్కస్ లో ఆటగాళ్లాడే ఏ ఆటకీ పెద్దగా ఆశ్చర్యపడని నాగులు జీవన పోరాటానికి ప్రత్యక్ష్యసాక్షి. బ్రతుకువెళ్లదీయటం కోసం నిత్యం ఎన్నోపాట్లు పడుతూ ప్రమాదాల అంచున ప్రయాణించేవాడికి సర్కస్ ఫీట్లు ఉత్సుకతనూ, కుతూహలాన్నీ ఎలా కలిగిస్తాయి?
ఈ కథలో వాస్తవానికి కొంత కల్పన జోడించినట్లు నేపథ్యంలో చెప్తారు రాజారాం.


వారాల పిల్లాడు: అసాంతం గబగబా చదివించిన ఈ కథ నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. నాయినమ్మ చనిపోయినట్లు తెలీక ఆవిడని అందరూ ఏం చేసేస్తున్నారో అని బెంబేలెత్తిపోయే ఎనిమిదేళ్ల నారాయణ అమాయకత్వం మన పసితనాన్ని గుర్తుకు తెస్తుంది. వాళ్ళింట్లో వారాలు చేసుకుని చదువుకునే నరసింహ్వం ని చూసి తను కూడా వారాలు చేసుకుని చదువుకోవాలనుకునే నారాయణ అమాయకత్వానికి మరింత ముచ్చటపడేలోపే ఓళ్ళు బళ్ళవుతాయన్నట్లుగా వారి కుటుంబపరిస్థితి తలకిందులైపోతుంది. నిజంగా తల్లిని  వదిలి పొరుగూరెళ్ళి వారాలు చేసుకుంటూ చదువుకోవాల్సిన అతని పరిస్థితి, అతని ఆకలి బాధా జాలిగొలుపుతాయి. ముగింపు ఇంకా వేదన కలిగిస్తుంది. ఈ కథా నేపథ్యంలో ఇందులో ఉన్నది తన జీవన నేపథ్యమేననీ, తమ కుటుంబం దుర్దశలో ఉన్నప్పుడు తమను మేనమామలూ, తల్లి చేసిన అన్నదానాలు ఆదుకున్నాయని పరిస్థితులు చక్కబడ్డాయనీ, తమ తిరగబడ్డ పరిస్థితులను, కథా రచన కాలంలో తాను తిరిగిన కొన్ని ప్రాంతాల్లో చూసిన భీబత్సమైన చారిత్రక దృశ్యాల ఆధారంతో ఈ కథ రాసాననీ చెప్తారు రచయిత మునిపల్లెరాజు. కానీ ఈ కథ విషాదాంతమే నన్ను బాగా కదిలించివేసింది.


ధనలక్ష్మి: బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లకు కూడా పాఠాలు చెప్పగల నేర్పు ఉన్న వ్యాపారస్తురాలు కథ శ్రీరమణ గారి "ధనలక్ష్మి". వ్యాపారాభివృధ్ధికి తను తెలివితో చేసిన ఆలోచనలను, కాపురం బాగుండాలని భర్త రామాంజనేలు కి ఆపాదించి, అందరూ అతడిని మెచ్చేలా చేస్తుంది ధనలక్ష్మి. కథలో చివరిదాకా అదే నేర్పుతో నెట్టుకొచ్చి, నెగ్గుతుంది ఆమె. ఈ కథలో పాత్రలు తన క్లాస్మేట్స్ అనీ, వాళ్ల కథే ఈ కథకు నేపధ్యమనీ చెప్తారు శ్రీరమణ. అయితే, ఈ విజయగాథలో తన ఆత్మన్యూనతను ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న తన మిత్రుడిదే గొప్ప పాత్ర అంటారు ఆయన.


ఇటువంటి మరికొన్ని వైవిధ్యభరితమైన కథలనూ, వాటి కథా నేపథ్యాలను "కథ నేపథ్యం - 1" పుస్తకంలో చదవవచ్చు.



3 comments:

A Homemaker's Utopia said...

చాలా బాగా రాశారు తృష్ణ గారు..నాకు తెలీని ఎన్నో పుస్తకాలను మీ పరిచయాల్లో తెలుసుకుంటున్నాను..Thanks for the wonderful post :-)

తృష్ణ said...

@nagini: ఈ మధ్యన చాలా చదివటం కుదిరింది. వాటిల్లో కొన్నే రాయగలుగుతున్నాను..
thank you..:)

Ennela said...

తెలియని కథల్ని తెలిపినందుకు ధ్యన్యవాదాలు తృష్ణా