సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, April 28, 2011

దమ్మున్న సినిమానే !


సినిమాకు ఓ హీరో, ఓ హీరోయిన్ తప్పక ఉండితీరాల్సిన అవసరం లేదు. ఓ కథనో , ఓ సమస్యనో, నచ్చిన కాన్సెప్ట్ నో తీసుకుని, దానిని తెరపై ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్రీకరించగలిగితే చాలు. అది మంచి సినిమా అనిపించుకుంటుంది. అలాంటి సినిమాల్లో ఉండేవి కొన్ని ముఖ్య పాత్రలు మాత్రమే. వాళ్ళు మామూలు హీరో హీరోయిన్లలా ఉత్తమ లక్షణాలు కలిగి ఉండరు. మామూలు మనుషుల్లానే కాస్తో కాస్త కంటే ఎక్కువో బలహీనతలు కలిగి ఉంటారు. అటువంటి పాత్రల ద్వారా దర్శకుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తెరపై చూపగలుగుతాడు. కాకపోతే ఇలాంటి సినిమాలు (హీరో, హీరోయిన్ లేకుండా) తియ్యటానికి కాస్తంత ధైర్యం కావాలి.

గోవా లో బలమైన పట్టు ఉన్న ఒక డ్రగ్ డీలింగ్ ముఠాను పోలీసులు ఎలా అంతం చేయగలిగారు అన్న కథను సరళంగా తెరకెక్కించారు "Dum maaro dum" దర్శకులు రోహన్ సిప్పీ. ఎటువంటి అంతుపట్టని మిస్టరీ లేకున్నా, ప్రేక్షకులకు భయాందోళనలు కలగకున్నా, పూర్తిగా ఉత్కంఠభరితంగా లేకున్నా కూడా సినిమా చూసినవాళ్లతో 'బాగుంది' అనిపించగలగటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. తమ వంతు పాత్రల్ని సమర్ధవంతంగా పోషించగలిగిన ముఖ్య నటులకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. "ప్రీతమ్" అందించిన సంగీతం కూడా చిత్రవిజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇతని బాణిలన్నీ బాగుంటాయి. ఈ చిత్రంలో సునిధీ చౌహాన్ పాడిన పాట చాలా నచ్చేసింది నాకు. "జానా హై", "జియే క్యూం" కూడా బాగున్నాయి.

ఇక చిత్ర కథలోకి వచ్చేస్తే గోవా లో ఒక డ్రగ్స్ ముఠా. అమాయకులైన "లోరీ"(ప్రతీక్ బబ్బర్) లాంటి కుర్రాళ్ళు వాళ్ళ వ్యాపారంలో పావులు. డిజె జాకీ(రానా దగ్గుపాటి) ప్రేమికురాలైన జోయ్ (బిపాషా బసు) కూడా ఆ డ్రగ్స్ ముఠా నాయకుడు బిస్కుట్(ఆదిత్య పాంచోలి) గూటిలో చిక్కుకుపోయి ప్రేమికుడికి దూరం అయిపోతుంది. ఏ.సి.పి.విష్ణు కామత్ కు ఆ ముఠాను పట్టుకునే పనిలో ఉంటాడు. ఈ ముఖ్య పాత్రధారులందరికీ కూడా తమ తమ బలహీనతలు ఉంటాయి. అందువల్ల చిక్కుల్లో పడతారు వారంతా. ఓ కుట్రలో భాగమై పోలీసుల చేతికి చిక్కిన లోరీ చివరికి నిర్దోషిగా నిరూపించబడతాడా? జాకీ తన ప్రేమికురాలైన జోయ్ ని మళ్ళీ కలుసుకోగలుగుతాడా? బిస్కుట్ ఆటలు అడ్డుకోవటంలో ఏ.సి.పి.విష్ణు కామత్ సఫలమౌతాడా? అన్నది మిగిలిన కథ. ఉత్కంఠత లేకుండా ప్రేక్షకుని ఊహానుగుణంగా సాఫీగా సాగిపోయే ఈ చిత్రకథను సస్పెన్స్ థ్రిల్లర్ అనలేము. అలాగని డ్రామా అనీ అనలేము. కానీ కథనం, చిత్రీకరణ రెండు సినిమాకు బలాన్ని అందించాయి. చివరిదాకా బోర్ ఫీలవకుండా చేసాయి.

లోరీగా ప్రతీక్ బబ్బర్ నటనలో ఏ లోటూ కనబడదు. తల్లి స్మితా పాటిల్ నటనా కౌశల్యం అతని ప్రతి ఫ్రేం లోనూ కనబడుతూ ఉంటుంది. కానీ ఇతను ఇక ఇలాంటి కేరెక్టర్ రోల్స్ వదిలేసి ఏదైనా సీరియస్ సింగిల్ రోల్ లో నటిస్తే బాగుంటుంది. లేకపోతే ఇలా కేరెక్టర్ ఆర్టిస్ట్ ముద్ర వేసి పక్కన పెట్టేయగలరు మన సినీ పెద్దలు. "హమేషా", "యస్ బాస్" మొదలైన చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ వేసి మెప్పించిన ఆదిత్య పంచోలి "బిస్కుట్" పాత్రలో కూడా తనదైన ముద్ర వేసాడు.





" Tu " అనే పాప్ సాంగ్ తో ఒకప్పుడు హంగామా సృష్టించిన మోడల్ బిపాషా ఇవాళ ఒక అగ్ర నటి. చాలామంది కుర్రాళ్ళ ఆరాధ్య దేవత. నా దృష్టిలో ఈమె అందం, అభినయం రెండూ ఉన్న మరొక అదృష్టవంతురాలు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయాన్ని అందించింది. బిపాషా కళ్ళు చాలా ఎక్స్ప్రేసివ్ గా ఉంటాయి.

ఈ మధ్యన చెప్పుకోదగ్గ హిట్స్ లేని అభిషేక్ కు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించింది. అంతకు ముందు రోహన్ తీసిన రెండు సినిమాల్లో కూడా అతని మిత్రుడైన అభిషేక్ బచ్చన్ నటించాడు. Om jai jagadish, Yuva, bluff master, Guru, Dhoom series, Paa, Delhi-6 మొదలైనవి నాకు నచ్చిన అభిషేక్ సినిమాలు. ముఖ్యంగా "గురు"లో అతని నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. అంచలంచెలుగా పరిణితి చెందుతూ ఎదిగిన నటుడతను. పాత్రల్లో బాగా లీనమయ్యే గుణమున్న ఇతడు "Dum maaro dum" లో ఏ.సి.పి.విష్ణు కామత్ గా కనిపిస్తాడు. కానీ చివరిలో ఇతగాడిని ఎందుకు చంపేయాలి? పక్కవాడి మోసాన్ని కనిపెట్టి బ్రతికేసినట్లు చూపెట్టొచ్చు కదా అని నటుడిపైని అభిమానం ప్రశ్నించింది. "రానా" పాత్రను ఎలివేట్ చేయాలన్న ప్రయత్నమేమో మరి..!

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన తెలుగువాడైన రానా సంగతి. టిపికల్ తెలుగు హీరో లక్షణాలు ఏ మాత్రం కనబడని రానా ఈ హిందీ చిత్రంలో బాగా ఇమిడిపోయాడు. మొదటి సినిమాతోనే బిపాషాతో లింక్ కట్టేస్తు వచ్చిన వార్తలు ఇతని పవర్ఫుల్ ఇమేజ్ ను తెలుపుతాయి. ఎక్కువ పాత్ర లేకున్నా, ఇచ్చిన మేరకు సమర్ధవంతంగా మరిన్ని మంచి పాత్రలు లభిస్తే బాలీవుడ్ అతని మొదటి ఆస్థానంగా మారిపోవచ్చు. రాబోతున్న తెలుగు సినిమాతో అతని భవిష్యత్తుని మన ప్రేక్షకులు ఎలాగూ నిర్ణయిస్తారు..:)

చివరిగా సినిమాలో నాకస్సలు నచ్చని రిమిక్స్ పాట గురించి తప్పక చెప్పాలి. అసలూ...అసలూ...అసలూ...వాటి మానాన వాటిని వదిలేయ్యక పాత పాటల్ని రీమిక్స్ ఎందుకు చేస్తారు? తెలుగైనా, హిందీ అయినా రిమిక్స్ లంటే ఒరిజినల్స్ పాటలను ఖూనీ చెయ్యటమే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం ఎవడిక్కావాలి? "దమ్మారో దమ్.." అంటూ జీనత్ చేసిన చిన్నపాటి ఊపుకి యావద్దేశం ఓ ఊపు ఊగింది. ఇప్పటికీ అంతే. కానీ ఈ కొత్త రీమిక్స్ ను చూస్తూంటే అసహ్యం కలిగింది. "జుగుప్స" అంటారే అలాంటి భావన కలిగింది. ఏదైనా శృతిమించితే కలిగేది వికారమే. అందం, అభినయం ఉన్నా కూడా సరైన సినిమాల్లేక తెరమరుగైన హీరోయిన్ల జాబితాలోకి వచ్చేస్తుందేమో ఇక దీపిక. "ఓం శాంతి ఓం" లో ఈమెను చూసి వహీదాలాగ ఉంది పైకొస్తుందేమో అని ఆశపడ్డాను.

సినిమా మధ్యలో ఓచోట లోర్నా పాటలనుకుంటా వినిపిస్తాయి. ప్రఖ్యాత గోవన్ గాయని "లోర్నా" వాయిస్ చాలా ప్రత్యేకంగా ఉండి తను పాడిన పాటలు చాలా బాగుంటాయి. టైటిల్ సాంగ్ లో ప్రచారం చేసినంత దమ్ము లేకపోయినా పట్టుసడలని కథనంతో, పాత్రధారుల ఉత్సాహవంతమైన నటనతో నా దృష్టిలో దమ్మున్న సినిమానే అనిపించుకుంది "Dum maaro dum". ఓసారి చూసేయచ్చు.



Wednesday, April 27, 2011

nearly Perfect !!

కొత్త సినిమాను ఒక్కసారే భరించటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో చాలా రోజుల తరువాత ఓ కొత్త సినిమా మళ్ళీ చూద్దామనిపిస్తోంది. గత వారంలో చూసిన రెండు కొత్త సినిమాలు బాగున్నాయనిపించాయి. వాటిల్లో నాకు రెండవసారి చూడాలనిపిస్తున్నది nearly Perfect అనిపించిన "Mr.Perfect". నేనీ సినిమా చూడ్డానికి రెండు కారణాలు.
ఒకటి - బాగా నచ్చిన మూడు పాటలు.
రెండు - కాజల్.



అసలీ సినిమా పేరు Mr.Perfect కాకుండా Miss.Perfect అని పెడ్తే బాగా సరిపోయేదేమో. ఆ అమ్మాయి పాత్ర అలా ఉంది. "చందమా" సినిమా చూసినప్పుడే నాకు బోల్డంత నచ్చేసింది ఈ అమ్మాయి. తప్పకుండా పైకి వస్తుంది అనుకున్నా. ఆ సినిమాలో ఈ అమ్మాయిని చాలా అందంగా చూపించారు. ముక్కు కొంచెం వంకర అనిపించినా, ఈ అమ్మాయికి అదృష్టవశాత్తు కాలం కలసివచ్చి మంచి పాత్రలు లభించి త్వరగానే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ("అదృష్టవశాత్తు" అని ఎందుకు అన్నానంటే అభినయం, అందం అన్నీ ఉన్నా రావాల్సినంత పేరు రాక ఉనికి కోల్పోయిన వారెందరో ఉన్నారు.) చాలా వరకు అభినయానికి అవకాశం ఉన్న పాత్రలే రావటం కూడా కాజల్ కు కలిసివచ్చింది. కాస్తంత ఒళ్ళుగా ఉంటే ఇంకా అందంగా, పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఈ అమ్మాయి.

ఇక ఈ చిత్రం ఓ అద్భుతమైన సినిమా ఏమీ కాదు. మొదటి భాగం మధ్యలో స్లో అయినట్లు కూడా అనిపించింది. కొన్ని అనవసరమైన సీన్లు కూడా ఉన్నాయి. కానీ మంచి కాన్సెప్ట్, చక్కని కథనం, పాత్రల్ని మలిచిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు అయ్యాయి. ముఖ్యంగా కథలో మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం బాగుంది. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే కావాల్సినది అభిరుచులు కలవటమా? ఒకర్నొకరు అర్ధంచేసుకోవటమా? రాను రాను మనుషుల మధ్యన అనుబంధాలు ఎందుకు బలహీనపడుతున్నాయి? ఒక బంధం కలకాలం నిలవాలంటే ఏం చెయ్యాలి? మన ఆనందం గొప్పదా? పదిమందికి సంతోషం కలిగించటం గొప్పదా? మొదలైన ప్రశ్నలకు సంతృప్తికరంగా ప్రేక్షకులను సమాధానపెట్టగలిగారు దర్శకులు.

"ప్రేమ అంటే ఇద్దరు కలిసి ఒక మంచి కాఫీని తయారుచేసుకోవటం", "మనం కాస్త ఎడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన చుట్టు చాలామంది మిగిలిఉంటారు" "మన సంతోషం కన్నాఇతరులను ఆనందపెట్టడంలోనే ఎక్కువ తృప్తి లభిస్తుంది" "ప్రేమంటే ఎదుటిమనిషి కోసం జీవించటం" మొదలైన ఎన్నో డైలాగ్స్ మనసును తాకుతాయి. పెళ్ళి విషయంలో ఒకేలాగ ఆలోచించే ఇద్దరు మనుషులు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారన్నది కేవలం అపోహ. ఒకర్నొకరు అర్ధం చేసుకోగలిగితే భిన్న ధృవాలైన ఇద్దరు మనుషులు కూడా సంతోషంగా ఉండగలరు అన్నది సినిమా అందించిన సందేశం. ఏక్షన్, సస్పెన్స్, ఓవర్ ఎక్స్పోజింగ్, హింసలతో కాక ప్రేక్షకుల మనసులను సెంటిమెంట్ తో దోచారీ సినిమా కధకులు. క్లీన్ అండ్ నీట్ మూవీ అని కూడా అనొచ్చు. అందుకే nearly Perfect అనిపించింది.

ప్రభాస్ నటన, రూపం అన్నీ బాగుంటాయి కానీ పాపం ఇతనికి గ్లామర్ పాళ్ళు కాస్తంత తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో బాగా చేసాడు. అతని డైలాగ్ డెలివరీ బాగుంటుంది. కాస్తంత ఎక్కువ గ్లామరస్ గా ఉండి ఉంటే మహేష్ బాబుకి పోటీ అయిపోయేవాడనిపిస్తుంది నాకు. గతంలోని రకరకాల ఎక్స్పరిమెంటల్ రోల్స్ చూసిన తరువాత ఈ సినిమాతో ఇతన్ని కుటుంబ కథాచిత్రాలకే పరిమితం చేసేస్తారేమో ప్రేక్షకులు అని డౌట్ వచ్చింది. ప్రతీ హీరోనూ ఏదో ఒక ఇమేజ్ లో ఫిక్స్ చేసేయటం మనవాళ్ళకు అలవాటు కదా. ఆ "ఇమేజ్ చట్రం"లో ఇరుక్కుపోయి వైవిధ్యమైన పాత్రల్ని చెయ్యలేక, ఇమేజ్ లోంచి బయటకు రాలేక ఈ కాలపు యువహీరోలు అవస్థలు పడుతున్నారు పాపం. ఇతగాడికి ఆ అవస్థ రాకూడని నా అభిలాష.

ఈ సినిమాలో నాకు బాగాబాగా నచ్చిన సీన్ ఒకటుంది. రాత్రిపూట సిన్లో ఒక గుబురు చెట్టు, దాని పక్కనే ఉన్న బెంచ్ మీడ అటుతిరిగి హీరో కూర్చుని ఉంటాడు. చెట్టు మీదుగా పడుతున్న కొద్దిపాటి లైట్. రాత్రి పూట ఉండే నిశ్సబ్దం..! భలే నచ్చాయి నాకు. ఈ బెంచ్ ఉన్న సీన్ రెండుసార్లేమో సినిమాలో వస్తుంది. అర్జెంట్ గా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చోవాలి అనిపించింది. ఇండియా కాదేమో మరి..:(

ఇక రెండో హీరోయిన్(తాప్సీ) గురించి ఏమీ రాయకపోవటమే మంచిది. నేను ఎర్ర ఇంకుతో పెద్ద ఇంటూ మార్క్ పెట్టేసాను ఈ అమ్మాయికి. బ్రహ్మానందం పాత్ర కూడా నాకు అంతగా నచ్చలేదు. ఇక ఆయన అటువంటి పాత్రలు తగ్గించుకుంటే మంచిదేమో. మిగతా పెద్దలందరు తమ వంతు పాత్రల్ని ఇచ్చిన మేరకు సమర్ధవంతంగానే పోషించారు. ఎంత మేకప్ వేసినా విశ్వనాథ్ గారి వయస్సు బాగా తెలిసిపోతోంది. ఈ వయసులో ఎందుకో అంత కష్టపడటం అనిపించింది.


ఇక తులసి ఎందుకు ఇలా నటనకు ఆస్కారం లేని అమ్మ పాత్రలు చేస్తోందో తనకే తెలవాలి. ఒక కాలంలో సినిమాలో తులసి ఉందంటే సంబరంగా ఉండేది. మంచి నటిని ఇప్పుడిలా కాస్తైనా ప్రాధాన్యత లేని పాత్రల్లో చూస్తే బాధ వేస్తోంది. "శశిరేఖా పరిణయం"లో కూడా ఇలానే అనిపించింది. పైపెచ్చు పావలాకి అర్ధరూపాయి ఏక్షన్ చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తోంది.

ఇక చిత్రంలోని నేపథ్య సంగీతం కూడా సన్నివేశానుసారం బాగుంది. మొత్తం పాటల్లో నాకు మూడు పాటలు ముందు నుంచీ వినీ వినీ బాగా నచ్చేసాయి. "బదులు తోచని ప్రశ్నల తాకిడి" గురించి ఇదివరకే చెప్పేసాను. మరొకటి "లైట్ తీస్కో భాయ్ లైట్ తీస్కో..". కానీ నాకో సందేహం నిజంగా అన్ని విషయాలనూ అలా లైట్ తీసుకోగలమా? తీసుకున్నా ఇబ్బందే ! ఒక మూడోది సుమధుర గాయని శ్రేయ ఘోషాల్ పాడిన "చలిచలిగా అల్లింది..." పాట చాలా చాలా నచ్చేసింది నాకు.

నాకు నచ్చిన మరొక కొత్త సినిమా గురించి తదుపరి టపాలో..

Sunday, April 24, 2011

నా స్వామి

సత్యం
ధర్మం
ప్రేమ
శాంతి
అహింస
ఇది స్వామి చూపిన బాట.

* ప్రార్ధించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న.

* ద్వేషించేవారిని వారిని కూడా ప్రేమించు.

*నిన్నని మర్చిపో. రేపు గురించి చింతించకు. ఇవాళ ఒక్కటే నీ చేతిలో ఉన్నది. దాన్ని సద్వినియోగపరుచుకో.

*కష్టం వచ్చినప్పుడు నిలబడు. ఒటమికెన్నడు కృంగిపోకు.

*చేతనయినంత సాయం వీలైనంత మందికి చెయ్యి.

*సాయం చెయ్యలేకపోయినా పరవాలేదు ఎవరికీ కష్టం మాత్రం కలిగించకు.

*శత్రువుని సైతం క్షమించు. అంతకు మించిన గొప్ప పని లేదు.

ఇవి స్వామి నుంచి నేను గ్రహించుకున్న జీవిత సత్యాలు.
చెప్పుకుపోతే ఎన్నో....ఎన్నెన్నో...

మిగతావన్నీ నాకనవసరం.
ఎవరు అపహాస్యం చేసినా
ఎవరు చేయి వీడి వెళ్ళిపొయినా
ఎవరు నన్ను ద్వేషించినా
ఎవరు వేళాకోళం చేసినా
నేను నమ్మిన నా సాయి పలుకులను, స్వామి చూపిన బాటను వీడను.

ఒక మహాపురుషుడి గురించి చర్చలు జరిపి, వ్యాసాలు రాసేంత మేధస్సు నాకు లేదు.
ఆయన చెప్పిన మాటల వెంట నడవటం మాత్రమే తెలుసు.

ఆ పాదాలను తాకి నమస్కరించుకునే భాగ్యం నాకు దొరకటం నా అదృష్టం.
ఎదురుగా ఆయన నడిచి వెళ్తూండగా దగ్గరగా చూసిన నా జన్మ ధన్యం.

నా స్వామి ఎప్పుడూ నాతో ఉన్నారు. ఉంటారు. తప్పటడుగు వేయకుండా, జీవితాన్ని సార్ధక మార్గంలో నడిపించటానికి వెన్నంటి దారి చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడూ ఎప్పుడూ నా చివరి శ్వాస వరకూ.

My dearest Swami..here i humbly remain at your lotus feet !!

Saturday, April 23, 2011

తిలక్ గారి "నల్లజర్ల రోడ్డు"


నిన్న రాత్రి(21st) ఆకాశవాణి విజయవాడకేంద్రం నుండి 9.30p.mకి ప్రత్యేక త్రైమాసిక నాటకం ఒకటి ప్రసారం అయ్యింది. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి "నల్లజర్ల రోడ్డు" కథానికకు కందిమళ్ళ సాంబశివరావుగారు రేడియో అనుసరణ చేసారు. విజయవాడకేంద్రం సహాయ సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారిగారు ఈ నాటకాన్నినిర్వహించి, సమర్పించారు. నాటకం చాలా బాగుంది. కథను నాటకంగా మలచటం అంటే మరో సృష్టే. అది చాలా సమర్థవంతంగా చేసారు సాంబశివరావుగారు. 1964లో ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలో ప్రచురితమైన కథ ఇది.

విచిత్రం ఏమిటంటే తిలక్ గారి కథల పుస్తకంలో నేను చదవకుండా వదిలేసిన కథలలో ఇదీ ఒకటి. నిన్న నాటకం విన్నాకా మళ్ళీ "తిలక్ కథలు" పుస్తకం వెతుక్కుని, పొద్దున్నుంచీ ఖాళీ దొరికినప్పుడల్లా ఈ కథను, అదివరకు చదవని మిగతా కథలను చదివాను. ఈ కథను అయితే ఇందాకా రెండవసారి మళ్ళీ చదివాను. 1964లో రాసిన ఈ కథలో అంతకు మునుపు పాతికేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. కథ నాకు ఎంతగానో నచ్చింది. కథను చెప్పాలనిపించింది. కాస్తంత ప్రయత్నిస్తాను..

* * * * * * * * *

ఊరికి దూరంగా నల్లజర్ల అడవిలో ఒక తోట బంగ్లాలో "అవధాని" అనే ధనవంతుడైన ఆసామి తన చిన్ననాటి భయానక అనుభవాన్ని మిత్రులకు చెప్పటం మొదలుపెడతారు. కరంటు లేని ఆ చీకటి రాత్రిలో అవధాని చెప్పే కథను భయం భయంగా వింటూంటారు వారు.

తణుకులో టెన్నిస్ చాంపియన్ అయిన రామచంద్రం, కలప వ్యాపారి నాగభూషణం, పధ్ధెనిమిదేళ్ళ అతని మేనల్లుడు(కథ చెబుతున్న అవధాని) కలిసి ఏలూరు నుండి రాత్రి పదిగంటలు దాటాకా కారులో గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీదుగా తణుకు బయల్దేరతారు. తణుకు పదిహేను మైళ్ళ దూరంలో ఉందనగా నల్లజర్ల అడవి దగ్గర వాళ్ల కారు హటాత్తుగా ఆగిపోతుంది. సమయానికి కలక్టర్ గారింట్లో పెళ్ళికి వెళ్ళలేకపోతామేమో అన్న చిన్న అనుమానాన్ని అసలు అడవి దాటి బయటపడతామా అన్న ప్రాణభయం కప్పేస్తుంది. కాసేపటికి చీకట్లో ఆడవంతా భయంకరంగా కనబడుతుంది వాళ్లకు. చెట్ల గుబుర్ల మధ్య నుండి నేల జారుతున్న వెన్నెల కూడా భయపెట్టేట్లుగా ఉండటంతో భయం వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తుంది.

ఆ చీకట్లో కారు బాగుచేయటానికి దిగిన రామచంద్రాన్ని ఒక పాము కాటువేస్తుంది. గిలగిల్లాడుతూ మృత్యువుకు అతి చేరువౌతాడు అతడు. అర్ధరాత్రిపూట ఆ చీకటి అడవిలో పాము కాటుకు గురైన రామచంద్రాన్ని ఎం చేయాలో తెలియక బెదిరిపోయి భయంతో వణికిపోతూంటారు నాగభూషణం, అతని మేనల్లుడు.

ఇంతలో అటుగా వచ్చిన సిధ్ధయ్య అనే పాములవాడు వీరిపై జాలి తలచి తన పాకకు తీసుకువెళ్తాడు. కానీ రామచంద్రానికి మంత్రం వేసేప్పుడు కావాల్సిన వేరుముక్క లేదని నిరుత్సాహపడతాడు. వయసుమళ్ళిన మీదట తనకు చూపు ఆనటం లేదని లేకపోతే ఆ చీకట్లో వెళ్ళి వేరు తెచ్చేవాడినని చెప్తాడు. చివరి ఘడియల్లో ఉన్న రామచంద్రాన్ని అలా వదిలేయలేక వేరు కోసం తాను వెళ్తానని బయల్దేరుతుంది సిధ్ధయ్య కుమార్తె సూరీడు. ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం భయానకమైన అడవిలోకి..చీకట్లో ఒంటరిగా వెళ్తున్న గర్భవతైన కుమార్తెను ఆపలేక నిస్సహాయంగా చూస్తూండిపోతాడు సిధ్ధయ్య.

సూరీడు వెనకకు వస్తుందా? రామచంద్రం ప్రాణాలు దక్కుతాయా? వారు తిరిగి ప్రయాణమవ్వగలుగుతారా? చివరికి ఈ కథానిక ఎటువంటి అనూహ్యమైన మలుపు తిరుగుతుంది? అన్నది మిగిలిన కథ. కథానిక ముగింపు చాలా భారమైనది. మనుషుల్లో మానవత్వం ఏ మాత్రం మిగిలుందో, దానికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే కథ ఇది. ఉత్కంఠభరితమైన ఈ కథలో కథనం, కొన్ని వర్ణనలు, వాక్యాలు నిజంగా కట్టిపడేస్తాయి. కవిగానే కాక కథకులుగా కూడా తిలక్ గారు మనల్ని ఆకట్టేసుకుంటారు. సమాజానికీ, కట్టుబాట్లకూ లోబడకుండా తన ఇష్టానుసారంగా జీవనాన్ని సాగించే ధైర్యశాలిగా సూరీడు, ఆమెను సమర్ధించే తండ్రిగా సిధ్ధయ్య గుర్తుండిపోతారు.

కథలో నన్నాకట్టుకున్న కొన్ని వాక్యాలు:
* హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా, విరుధ్ధంగా బాగా డబ్బున్నవాడు.

*అతని భార్యనెక్కువ ప్రేమిస్తాడో, భార్యపేర అతని తండి రాసి ఇచ్చిన ముఫ్ఫైనాలుగెకరాలనూ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలక జిజ్ఞాసువులు చాలా మంది బాధపడేవారు పాపం.

* ఇటువంటి భోగట్టా నాకూ సరిగ్గా తెలియదు. మా ఆవిడకి తప్ప.

* ...ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుష్యులు, సమాజమూ తమ చుట్టూ గోడలను కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికేదో కీడు మూడిందని గోల పెడతారు..."

*..ఇప్పుడు రోడ్లు, టెలిగ్రాఫు తీగలు, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్ని, కౄరమృగాల్ని నాశనం చేశాయి. వాటితో పాటూ వీరవరులూ, స్వధర్మనిరతులూ కూడా మాయమైపోయారు.

* చావుకన్నా దాన్ని గురించిన భయం భరింపలేనిది.

* ఆ నిమిషంలో స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలూ అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయాన్ని కలిగించనంత వరకే. ప్రతి మనిషీ లోపల్లోపల ఒక పాము !

* రాత్రిపడిన బాధ, భయమూ పీడకలేమో అనిపించినట్టుంది......మామూలు పెద్దమనిషీ, శ్రీమంతుడూ, టెన్నిస్ ఛాంపియనూ అయిపోయాడు.

*** *** ***

కథ చదవటం అయిపోయాకా "ఏరు దాటాకా తెప్ప తగలేసినట్లు.." అన్న సామెత గుర్తుకువచ్చింది. పదిహేనొవ శతాబ్దంలో షేక్స్పియర్ రాసినా, ముఫ్ఫై ఐదేళ్ల క్రితం తిలక్ గారు రాసినా, ఇరవైయ్యోకటవ శతాబ్దంలో మరెవరు రాసినా మనుషుల స్వార్థ మనస్థత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయన్నమాట అని మరోసారి అనిపించింది.

Friday, April 22, 2011

'Earth Day' సందర్భంగా ఒక మంచి వ్యాసం

ఇవాళ apr.22nd 'Earth Day' . ఈ సందర్భంగా "పుడమితల్లికి రామయ్య పచ్చని పందిరి! " అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎడిషన్ 'నవ్య'లో వచ్చిన ఇవాళ్టి ఆర్టికల్ "ఇక్కడ" చదవండి.

రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య గురించి చదివి పచ్చదనాన్ని చూస్తే పులకించే ప్రతి మనసూ ఆనందిస్తుంది. ఇటువంటివారున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది. Hats off to this man !! ఇటువంటి గొప్ప 'మనీషి' గురించి రాసినవారికి వందనం.

Tuesday, April 19, 2011

rare album : "pancham unexplored "






Here is a rare album. ఈ సిడిలో ఆర్.డి.బర్మన్ (పంచెమ్ దా) కొన్ని సినిమాలకు స్వరపరిచిన కొన్ని themes ఉన్నాయి. R.D.Burman lovers can relish this album.



content details :

 

Monday, April 18, 2011

పాతాళభైరవి(1951)


ఇటీవలే షష్ఠిపూర్తి జరుపుకున్న జానపదచిత్రం "పాతాళభైరవి" సినిమా మళ్ళీ చూద్దామనిపించి నిన్ననే.. బహుశా పాతికేళ్ళ తరువాతేమో చూశాను. "కహో నా ప్యార్ హై" సినిమా చూసి హృతిక్ రోషన్ పై అమ్మాయిలంతా ఫిదా అయిపోయినట్లుగా అప్పట్లో ఈ సినిమా చూసిన అమ్మాయిలు ఖచ్చితంగా ఎన్.టీ.ఆర్ పై ఫిదా అయిఉంటారు అనిపించింది. హృతిక్ రోషన్ ఎక్కడ? ఎం.టీ.ఆర్ ఎక్కడ? అనకండి. నేను వాళ్ళిద్దరిలోని ‘charisma’ గురించి చెప్తున్నాను. "తోటరాముడు" తల విదిలించినప్పుడల్లా వెనక్కు వెళ్ళే ఆ రింగుల రింగుల జుట్టు, ఆ తీక్షణమైన చూపులు, "నిజం చెప్పమంటారా అబధ్ధం చెప్పమంటారా? " అన్నప్పుడల్లా అమాయకంగా తోచే ముఖము, పాత్రలో లీనమైపోయిన నటన.. అన్నింటికీ నేను కూడా తోటరాముడికి ఫిదా అయిపోయి "జై పాతాళభైరవి" అనేసా.


మిగిలిన వ్యాసం ఇక్కడ చూడండి.

Sunday, April 17, 2011

మరో కొత్త సినిమా బోధించిన పాఠలు !


కొత్త సినిమా బోధించిన పాఠలు :
* ప్రేమంటే ఏమిటి ? నిజమైన ప్రేమను గుర్తించాకా ఏంచెయ్యాలి?
* నిజమైన ప్రేమను గుర్తించాలి అంటే, ప్రేమంటే కనబడ్డ అమ్మయికల్లా లైను వేసి, ఆపైన పడేసిన అమ్మాయిల్లో ఎవరు బాఘా మనసుకి దగ్గరగా వస్తారో అని ఏళ్ల తరబడి గమనించుకుంటూ ఉండాలి.
* ఆ ప్రయత్నంలో ఎంత మంది అమ్మాయిలతో అయినా, ఎలాంటి అమ్మాయిలతో అయినా తిరగొచ్చు, ఏదైనా చేయచ్చు. మన పవిత్ర భారతదేశంలో అందరూ పవిత్రంగా భావించుకునే "పెళ్ళి" అయే టైముకి సదరు అబ్బాయిగానీ అమ్మాయి గానీ పవిత్రంగా ఉండాల్సిన పనే లేదు.
* ఆ పైన మనసుకి దగ్గరగా ఉన్న అమ్మాయిని గుర్తించాకా ఆ అమ్మాయికి పెళ్లయిపోయినా సరే వెతుక్కుంటూ వెళ్ళాలి.
* ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళాకా అవసరం లేనకపోయినా ఒక పెద్ద హడావుడి ఫైటింగ్ ఒకటి చేయాలి.
* ఆ తరువాత అమ్మయి ఎక్కడుందో కనుక్కుని ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి, పెళ్లవకముందు చెప్పాల్సిన డైలాగుని ఆలస్యంగా చెప్తున్నందుకు చింతిస్తూ డైలాగులు చెప్పేయాలి.
* సదరు అమ్మాయి కూడా పెళ్ళికొడుకుతో డిన్నర్లకూ వాటికీ వెళ్ళి, పెళ్ళికి ఒప్పుకుని పవిత్రంగా తాళి కట్టించుకున్నాకా, వెర్రిమొహం వేసుకుని చూస్తున్న భర్తగారికి టాటా చెప్పి వెళ్పోవచ్చు.
* ఇప్పటిదాకా నిశ్చితార్ధాలు, పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోయాయి సినిమాల్లో. ఇకపై అయిపోయిన పెళ్ళీళ్ళు కూడా రద్దు చేసుకోవచ్చు అని బాగా తెలియచెప్పారు.
* మనిషిలో కన్ఫ్యూజన్ లెవెల్స్ ఎంతవరకూ ఉండొచ్చు అన్న విషయాన్ని చాలా బాగా తెలియచెప్పారు.

అర్ధం కానిది:

* ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తాడు అన్న గాఠ్ఠి నమ్మకం గల సదరు అమ్మాయికి పెళ్ళికి ముందుగానే కాస్త జ్ఞానోదయం అయినా సరే పెళ్ళికి నిరాకరించకుండా ఎందుకు ఉండదో అర్ధం కాలేదు.
* ప్రేమించిన అమ్మాయిని చూడ్డం కోసం వీర ప్రేమికుడు ఒక చావు ఇంట్లో కూడా ప్రవేశించి అవతలవాళ్ళు ఏడుస్తూ ఉంటే అమ్మాయితో మాట్టాడ్డానికి ప్రయత్నించటం...
* ఒక ఫ్లాష్ బ్యాక్ కథలో పరికిణీ ఓణీలు వేసుకున్న ట్రెడిషనల్ అమ్మాయి "పోయింటెడ్ హీల్స్" ఎలా వేసుకుంటుంది ? కెమేరాలో అవి కనపడవనుకునేంత అమాయకులా సినిమావాళ్ళు?
* పాతతరం పేమ ఎలా ఉండేది? కొత్త తరంలో ప్రేమ ఎలా ఉంటోంది అని చూపించే వినూత్నప్రయత్నమే ఈ సినిమా తీసినవాళ్ల ముఖ్య ఉద్దేశం. ఈచిత్రానికి మూలమైన హిందీ సినిమా టైటిల్ కూడా అదే కదా. కానీ అదేమిటో నా మట్టిబుర్రకి ఈ సింపుల్ పాయింట్ అర్ధం కావట్లేదు.
* అంతా బానే ఉంది కానీ ఈ పెళ్ళి అయిన తరువాత పారిపోవటం అనే కాన్సెప్ట్ ఎంతకీ మింగుడు పడట్లేదు...may be iam very old fashioned to catch this great concept !!

నచ్చినవేవైనా ఉన్నాయా?

* నేపథ్య సంగీతం చాలా చాలా నచ్చింది నాకు. సన్నివేశానిసారంగా, భావానికి దగ్గరగా, మనసుకు హత్తుకునేట్లుంది.
* చివరిదాకా వాళ్లకు తెలీకపోయినా వాళ్ల మధ్యన కనబడిన ప్రేమ నచ్చింది.
* కొన్ని డైలాగులు బాగున్నాయి.

******    *****     ******

నా దృష్టిలో మంచి సినిమా ఎలా ఉండాలి?

* కొత్తదైనా పాతదైనా అప్పుడే అయిపోయిందా అనిపించాలి.
* హాస్యమైన, దు:ఖమైనా పాత్రల భావానుసారంగా మనమూ వాళ్ల అనుభూతిని పొందాలి.
* మధ్యలో కాస్తైనా బోర్ కొడుతోంది అనిపించకూడదు.
* తెర ఎత్తిన మొదలు దించేదాకా మరే ఇతర ఆలోచన రాకుండా ఉండాలి. మనల్ని మనం మర్చిపోవాలి.

అలాంటి మంచి సినిమా కోసం ఓ దేవుడా నేను ఎదురు చూస్తున్నాను.................

Saturday, April 16, 2011

మా బంగారుతల్లికి 4th rank !



పొద్దున్న స్కూలుకెళ్ళి రిపోర్ట్ కార్డ్ తెచ్చాం. వెళ్లగనే "your child got into the notice board this time" అన్నరు టీచర్ మాతో. గబగబా ఏ ర్యాంక్ వచ్చిందా అని చూసాం...4th rank ! marks 439/500 వచ్చాయి. నలభై మంది క్లాసుపిల్లల్లో ఆ మాత్రం ర్యాంక్ వచ్చిందంటే నాకు ఏనుగెక్కినంత ఆనందంగా ఉంది. మరోసారి నాలో "పుత్రికోత్సాహం" పొంగిపొర్లింది.

LKG లోనూ, UKGలోనూ గ్రేడ్స్ ఉండేవి. అప్పుడూ 'A+' వచ్చేది. ఫస్ట్ క్లాస్ నుంచీ ర్యాంక్ లు ఇస్తారు. ఇప్పటి ఫస్ట్ క్లాస్ కీ మేం చదువుకున్న ఫస్ట్ క్లాస్ కీ ఎంతో తేడా. అదేం సిలబస్సో..పిల్లలసలు చదవగలరా అనుకునేదాన్ని నేను. కానీ జనరేషన్ చాలా మారిపోయింది కాబట్టి అంతంత సిలబస్సులనీ కూడా ఇట్టే చదివేస్తున్నారీ కాలంపిల్లలు. ఈ ఏడాది మొదట్లో నేను ఓంట్లోబాలేక అమ్మ దగ్గర ఉండిపోవటంతో రెండు మూడు నెలలు దాని స్కూలు సరిగ్గా సాగలేదు. చాలా మిస్సయ్యింది. అవన్నీ మేమిద్దరం వీలైనప్పుడల్లా నేర్పిస్తూ, చదివిస్తూ వచ్చాము. అందులోనూ తెలుగు అక్షరాలూ, గుణింతాలూ అవీ బేసిక్స్ ఇప్పుడు సరిగ్గా రాకపోతే భాష సరిగ్గా రాకుండాపోతుందని మా భయం.

కానీ నువ్వు ఫలానా ర్యాంక్ తెచ్చుకోవాలి అని ఏనాడూ మేము దాన్ని ఫోర్స్ చెయ్యలేదు. ర్యాంకులూ, పోటీ అంటూ పిల్లల చిన్నతన్నాన్ని చిదిమేసి చదువుల్ని పిల్లల మీద రుద్దేయటం మా ఇద్దరికీ కూడా ఇష్టం లేదు. "మార్కుల గురించి ఆలోచించద్దు. పాఠం సరిగ్గా అర్ధం అయ్యిందా లేదా? అన్నది చూసుకో" అని చెప్పేవాళ్ళం దానికి. స్కూల్లో అన్నీ బట్టీ వేయించేస్తూ ఉంటారు. పైగా ఏదన్నా తప్పు చెబితే మా టీచర్ ఇలానే చెప్పారు అంటుంది. అందుకని మేము నోట్స్ లోని ప్రశ్నలు జవాబులు కాకుండా టెక్స్ట్ బుక్ లోని పాఠమే చదివించేవాళ్లం. అయితే pressurize చెయ్యకుండా, పరీక్షల భయం ఇప్పటినుంచీ దానిలో కలగకుండా జాగ్రత్త పడ్డాం. మొత్తానికి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఏనాడూ ఆశించలేదు.

ఇప్పుడు అందరు పిల్లలూ బాగా చదువుకుంటున్నారు, కళలు,ఆటలు అన్నింటిలోనూ ఏక్టివ్ గా ఉంటున్నారు. 4th rank is not a big thing... ఇదేమీ గొప్ప అని నేను రాయటం లేదు. కేవలం ఆనందాన్ని పంచుకోవటానికి రాస్తున్నాను. మా బంగారుతల్లి ఇలానే బాగా చదువుకుని ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటున్నాను. నా కలల్ని దాని మీద రుద్దాలని ఎప్పుడూ అనుకోను, కానీ తాను చూసే కలల్ని తను సాకారం చేసుకోగలగాలని ఆశపడతాను.

నాకు బాగా నచ్చిన "Airtel 3G ad"


New Airtel 3G ad STARE.wmv

"మేరా తిల్ తుమ్హారా చెక్ పోస్ట్ తో హై నహీ...ఆజ్ యహా కల్ వహా..." డైలాగ్ సూపరసలు.Good idea!

Friday, April 15, 2011

శక్తివంచన లేకున్న వృధా అయిన 'శక్తి'


'Art for art's sake' అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడది art for the sake of competition అయిపోయింది. చక్కని ప్రతిభ ఉన్నప్పుడు దాన్ని సమంగా సద్వినియోగపరుచుకుంటే ఎంత బావుంటుంది? అర్ధంపర్ధం, తలా తోకా లేని కథా-కథనాల జోలికి పోయి ప్రతిభను వ్యర్ధం చేసుకుంటే ఉపయోగం ఏమిటి? కావల్సినంత సమయం, కావాల్సిన బడ్జెట్, సాంకేతిక నైపుణ్యం ఇన్ని చేతిలో ఉన్నా కూడా అంతా వృధాపోతూంటే చూస్తూండటం కూడా బాధకరమే. ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. కానీ ఎవరినో అనుకరించాలనో , అధిగమించాలనో ప్రయత్నించటం ఒక నటుడి స్థాయిని ఒక మెట్టు దించేస్తుందే తప్ప పెంచదు.

అసలు పోటీ ఎందుకు? ఎవరి సామర్ధ్యం వారిది. ఒక నటుడికి ఉన్న సామర్ధ్యాన్ని బట్టి అందుకు తగిన కథలు ఎన్నుకుని, ఆసక్తికరమైన కథనాన్ని తయారుచేసుకుంటే ఎదురుంటుందా? సులువైన విషయాన్ని ఎందుకు సినిమా తీసేవాళ్లు అర్ధం చేసుకోరు? పూర్వం గ్రాఫిక్స్, ఇంతటి సాంకేతిక నిపుణత ఉన్నాయా? విఠలాచార్య సినిమాలు అద్భుతంగా ఉండేవి కాదా? జనాలు ఇష్టపడి చూసేవారు కాదా? అప్పుడీ గ్రాఫిక్స్ గట్రా ఉండి ఉంటేనా హాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు తీసి ఉండేవారు మనవాళ్ళు. ఇప్పుడు తీయాలన్నా ఆనాటి దర్శకనిర్మాతలకున్న నేర్పూ, కౌశల్యం ఈనాడు కొరవడ్డాయి. ఉపయోగించుకోవటానికి తగినన్ని సాంకేతిక ఉపకరణాలున్నా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీయలేకపోవటం నిజంగా దురదృష్టకరం.

మొన్న ఒక పాత జానపద సినిమా చూస్తూంటే అనిపించింది ఎలాంటి గ్రాఫిక్స్, హంగామా లేకుండానే అతి మామూలు కథలతోనే అద్భుతాలు సృష్టించారు ఒకప్పటి మన తెలుగు సినీదర్శకులు. ఇప్పుడు మాత్రం కథలకేం కొరవ? ఓపిగ్గా వెతుక్కుంటే బోలెడు కథలు. పోనీ తీసుకున్న కథనే ఆసక్తివంతమైన రీతిలో తీయొచ్చు కదా? అదీ లేదు. గ్రాఫిక్స్ గొప్పగా వాడేయాలనో, లేదా మరొకరి కంటే ఘనంగా తీసేయాలనో తపన తప్పించి, కాస్త మనసుపెట్టి ఉన్న ఉపకరణాలను సఫలీకృతంగా ఉపయోగించుకుందామన్న ఇంగితం ఎందుకు కలగదో అర్ధం కాదు.

ఘోషంతా క్రితంవారాంతంలో ఒక కొత్త సినిమా చూసినప్పటినుండీ నా బుర్రలో తిరుగుతోంది. హీరో యువనటుల్లో మంచి ఎనర్జీ, సామర్ధ్యం ఉన్న నటుడని నా చిన్న బుర్రకు ఎందుకనో నమ్మకం. అబ్బాయి పాత సినిమాలు చూడ్డానికి భయమేసి ఏమీ చూడలేదు కానీ నాలుగు సినిమాల పూర్వం ఒక విజయవంతమైన హిట్ ఇచ్చినప్పటి నుంచీ ఇతగాడంటే కాస్తంత అభిమానం ఏర్పడిందనే చెప్పాలి. కాని తర్వాత నేను ఆశించిన ఎదుగుదల ఎంత మాత్రం అతని కెరీర్ లో కనబడలేదు. కొత్త సినిమాకు క్రితం వచ్చిన ఇతగాడి రెండు సినిమాలూ చూసి నేను అత్యంత నిరుత్సాహానికి లోనయ్యాను. అయ్యో మంచి శక్తి, సమర్ధత ఉన్న కుర్రవాడే..శ్రమంతా వృధాగా పోతోందే అని. అతని సినిమాల ఎన్నికలో లోపమో, తీసేవాళ్ల లోపమో, "ఇమేజ్" అనబడే ఒక మూసలో కూరుకుపోయిఉన్నాడో అతనికే తెలవాలి.

కొత్త సినిమా ప్రచారాన్ని చూసి ఇదయినా పడిపోతున్న అతని స్థాయిని నిలబెడుతుందేమో అని ఆశ పడ్డాను. అతను శక్తివంచన లేకుండానే నటించాడు. కానీ మిగతావే కాస్త అటుఇటు అయ్యాయి. ప్చ్... ఇదే దారిలో వేళ్తే తెలుగు ప్రేక్షకులు అతన్ని మర్చిపోవటానికి ఎక్కువ సమయం పట్టదు అనిపించింది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే జనాలు పోటీగా తీసారంటున్న చిత్రానికి దీటుగా నిలిచి ఉండేది సినిమా. పైగా సినిమాలో మళ్ళీ కాస్తంత బరువు పెరిగాడేమో అనిపించింది. మొహంలో కూడా మునుపటి కళ తగ్గింది. ప్రశాంతంగా లేదు. నాకులాగే అతని కొత్త సినిమాలు వరుసగా గమనించిన ఎవరికైనా తప్పక ఇలా అనిపిస్తుంది. సినిమాలో ఒకే ఒక పాట నాకు నచ్చింది. సంగీతసాహిత్యాలు, గ్రాఫిక్స్, హీరోయిన్...అన్నీ బాగున్నాయి. " మనసుపై చల్లావోయీ మంత్రాల సాంబ్రాణి.." అని భలే ప్రయోగం చేసారు రామజోగయ్యశాస్త్రిగారు. ఇంకొక పాట చూడ్డానికి బోర్ గా, సందర్భోచితంగా లేదు కానీ బీట్ బాగుంది.

ఇకముందైనా కుర్రాడిని సమంగా ఉపయోగించుకుని, అతని ప్రతిభకు తగ్గ సినిమాలు రావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను.


గమనిక: ఇది ఎవరినీ కించపరచలని రాసినది కాదు. సగటు ప్రేక్షకురాలిగా ఒక మంచి నటుడి శక్తి వృధా అవుతోందన్న ఆవేదన మాత్రమే.

Thursday, April 14, 2011

పయనం






నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో

నిదుర రాని చీకటిపొద్దులో
చక్కిలి జారే ఎన్ని నిట్టుర్పుచుక్కలో

అలుముకున్న గాఢనిద్రలో
ఎన్నియలలో ఎన్ని కలలో

రెప్పపాటులో దూరమయ్యే దీవెనలు
ఎడారిలో ఒయాసిస్సులు

గుండెను భారం చేసే దిగుళ్ళు
దాచినా దాగని వాస్తవాలు

ఆపినా ఆగని కన్నీళ్ళు
గట్టుదాటి పొంగే నదీతీరాలు

రెక్క విప్పుకుని నింగికెగసే చిరునవ్వులు
రూపు మారిన సీతకోకచిలుకలు

కలవరం లేని రేపటికోసం ఎదురుచూపు
నింగికెగసిన ఆశాసౌధం

నిరాశను అశాంతం చిదిమేసే మనోనిబ్బరం
ఇప్పుడే కళ్లుతెరిచిన పసికందు

ఎన్ని మలుపులు తిరిగినా దొరకదు గమ్యం
అందని జాబిలిలా

నిరంతరం భాషిస్తూనే ఉంటుంది అంతరాత్మ
ఘోషించే సాగరంలా

ఎన్ని నిరాశలు ఎదురైనా ఓడదు మనసు
అలుపెరుగని అలలా

నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో

Wednesday, April 13, 2011

"गमन" సినిమాలో పాటలు





ప్రసిధ్ధ సంగీత దర్శకులు "జైదేవ్" స్వరపరిచిన "గమన్" సినిమాలో రెండు పాటలు చాలా బాగుంటాయి. ఫారూఖ్ షేక్, స్మితా పాటిల్, జలాల్ ఆగా, గీతా సిధ్ధార్థ్ ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకు ముజఫ్ఫర్ అలీ గారు దర్శకలు, నిర్మాత. ఇది ఆయన మొదటి చిత్రం. ప్రఖ్యాతిగాంచిన "ఉమ్రావ్ జాన్" సినిమా కూడా ఈయన దర్శకత్వంలో వచ్చినదే.


1978 లో రిలీజైన ఈ సినిమాకు 1979లో రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లు వచ్చాయి. "జైదేవ్" గారికి ఉత్తమ సంగీతదర్శకులు అవార్డ్, "ఆప్ కీ యాద్ ఆతీ రహీ" పాటకు గానూ గాయని "ఛాయా గంగులీ" గారికి "బెస్ట్ ఫీమేల్ సింగర్" అవార్డ్ లభించాయి.


song: सीनॆ मॆं जलन
singer: suresh Wadkar
lyrics: Shahryar
Music: Jaidev





సాహిత్యం:

सीनॆ मॆं जलन आंखॊं मॆं तूफान सा क्यॊं हैं?
इस शहर मॆं हर शक्स परॆषान सा क्यॊं हैं?


दिल है तॊ धडक्नॆ का बहाना कॊयी ढूंढॆं
पथ्थर की तर हा बॆहीसा बॆजान सा क्यूं है?


तन्हाई की यॆ कैन सी मंजिल हैं रफीका
ता-हद्द-यॆ-नजर ऎक बयाबान सा क्यॊं है?


क्या कॊइ नयी बात नजर आती है हम मॆं
आईना हमॆं दॆख कॆ हैरान सा क्यूं है?

0000000000000000000000000000000000000000000000

song: आप की याद आती रही
singer: Chaaya Ganguly
lyrics: మఖ్దూం మొహియుద్దీన్
Music: Jaidev




సాహిత్యం:

आप की याद आती रही रात भर
चश-मॆ-नम मुस्कुराती रही रात भर


रात भर दर्द की शम्मा जल्ती रही
गंम की लौ थर्थराती रही रात भर


बांसुरी की सुरीमी सुहानी सदा
याद बन बन कॆ आती रही रात भर


याद कॆ चांद दिल में उतरतॆ रहॆ
चींदनी जग्मगाती रही रात भर


कॊई दीवाना गलियॊ मॆं फिरता रहा



000000000000000000000000000000

ఈ చిత్రం లోనిదే మరొక పాట -

song: अजीब सा नॆहा मुझ पर
singer: hariharan
lyrics: Shahryar
Music: Jaidev


कॊई आवाज आती रही रात भर

అమ్మ గుర్తొస్తుంది..

 
ఎండలో గొడుగు వేసుకుని డాబాపై ఒడియలు పెడుతుంటే
అమ్మతో ఒడియాలు పెట్టిన రోజు గుర్తొస్తుంది

భోజనాలయ్యాకా డైనింగ్ టేబుల్ సర్దుతున్నప్పుడు
"కాస్త కంచాలు తీసిపెటట్టచ్చు కదా, గిన్నెలు వంటింట్లో పెట్టవే"
అన్న అమ్మ కసుర్లు, ఒకోసరి బ్రతిమాలడo గుర్తుకొస్తుంది

కాస్త ఖర్చులటూఇటూ అయిన నెలలో
బజార్లో వెళ్తున్నప్పుడు
పాప అడిగిందేదైనా కొనలేనప్పుడూ
నేనడిగినప్పుడు డబ్బులివ్వలేదని
అమ్మని తిట్టుకున్న రోజులు జ్ఞాపకమొస్తాయి


వండిన కూర నచ్చలేదని పాప అలిగినప్పుడు
అమ్మ వంటకు పెట్టిన వంకలు జ్ఞాపకమొస్తాయి

కష్టపడి వండిన కూర పడేయలేక ఫ్రిజ్ లో పెట్టినప్పుడు
"అలా పెట్టకపోటే పడేయొచ్చు కదా"
అని అమ్మను వేళాకోళం చేసిన మాటలు గుర్తుకొస్తాయి

ఒంట్లో బాలేకపోయినా తప్పక పనిచేయాల్సొచ్చినప్పుడు
నన్ను ఒక్క పనీ చెయ్యనివ్వకుండా
అన్నీ తనే చేసుకున్న అమ్మ జ్ఞాపకమొస్తుంది

ఏదన్నా తేడా వచ్చినప్పుడు
నోరు మెదపలేకపోయినప్పుడు
చిన్నమాటకే అమ్మపై అరవటం జ్ఞాపకమొస్తుంది

కొన్ని చిక్కులు ఎదురైనప్పుడు..
అమ్మతో చెప్పలేకపోయినప్పుడు
శ్రీవారినీ ఇబ్బందిపెట్టలేననిపించినప్పుడు
స్నేహితులవద్ద లోకువవకూడదని పంచుకోలేనప్పుడు..
ఇలాంటప్పుడు అమ్మ ఎలా నెట్టుకువచ్చిందో అనిపిస్తుంది

మల్లెపూలు కడుతూంటే మాల విడిపోయినప్పుడు
ఎడచేత్తోనే చకచకా మాలకట్టేసే అమ్మ గుర్తుకొస్తుంది

అల్లరి చేసిందని పాపను కేకలేస్తూంటే
వాళ్ళనాన్న వెన్కేసుకొచ్చినప్పుడల్లా
నన్ను నాన్న వెన్కేసుకొస్తున్నారని
అమ్మ కోప్పడిన వైనం గుర్తుకొస్తుంది

ఆరేళ్ల కూతురిని చూసి
'అమ్మో ఎదిగిపోతోంది' అని నే బెంగపడినప్పుడు
పెళ్ళిడుకొచ్చిన నన్ను చూసినప్పుడల్లా
అమ్మ ఎంత బెంగపడేదో కదా అనిపిస్తుంది

ఇలా ఎన్నెన్నో సందర్భాల్లో
ఇంకెన్నో వందల సార్లు
అమ్మ గుర్తుకొస్తూనే ఉంటుంది
ఇంకా బాగా అర్ధం అవుతూనే ఉంటుంది..