సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, April 15, 2011

శక్తివంచన లేకున్న వృధా అయిన 'శక్తి'


'Art for art's sake' అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడది art for the sake of competition అయిపోయింది. చక్కని ప్రతిభ ఉన్నప్పుడు దాన్ని సమంగా సద్వినియోగపరుచుకుంటే ఎంత బావుంటుంది? అర్ధంపర్ధం, తలా తోకా లేని కథా-కథనాల జోలికి పోయి ప్రతిభను వ్యర్ధం చేసుకుంటే ఉపయోగం ఏమిటి? కావల్సినంత సమయం, కావాల్సిన బడ్జెట్, సాంకేతిక నైపుణ్యం ఇన్ని చేతిలో ఉన్నా కూడా అంతా వృధాపోతూంటే చూస్తూండటం కూడా బాధకరమే. ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. కానీ ఎవరినో అనుకరించాలనో , అధిగమించాలనో ప్రయత్నించటం ఒక నటుడి స్థాయిని ఒక మెట్టు దించేస్తుందే తప్ప పెంచదు.

అసలు పోటీ ఎందుకు? ఎవరి సామర్ధ్యం వారిది. ఒక నటుడికి ఉన్న సామర్ధ్యాన్ని బట్టి అందుకు తగిన కథలు ఎన్నుకుని, ఆసక్తికరమైన కథనాన్ని తయారుచేసుకుంటే ఎదురుంటుందా? సులువైన విషయాన్ని ఎందుకు సినిమా తీసేవాళ్లు అర్ధం చేసుకోరు? పూర్వం గ్రాఫిక్స్, ఇంతటి సాంకేతిక నిపుణత ఉన్నాయా? విఠలాచార్య సినిమాలు అద్భుతంగా ఉండేవి కాదా? జనాలు ఇష్టపడి చూసేవారు కాదా? అప్పుడీ గ్రాఫిక్స్ గట్రా ఉండి ఉంటేనా హాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు తీసి ఉండేవారు మనవాళ్ళు. ఇప్పుడు తీయాలన్నా ఆనాటి దర్శకనిర్మాతలకున్న నేర్పూ, కౌశల్యం ఈనాడు కొరవడ్డాయి. ఉపయోగించుకోవటానికి తగినన్ని సాంకేతిక ఉపకరణాలున్నా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీయలేకపోవటం నిజంగా దురదృష్టకరం.

మొన్న ఒక పాత జానపద సినిమా చూస్తూంటే అనిపించింది ఎలాంటి గ్రాఫిక్స్, హంగామా లేకుండానే అతి మామూలు కథలతోనే అద్భుతాలు సృష్టించారు ఒకప్పటి మన తెలుగు సినీదర్శకులు. ఇప్పుడు మాత్రం కథలకేం కొరవ? ఓపిగ్గా వెతుక్కుంటే బోలెడు కథలు. పోనీ తీసుకున్న కథనే ఆసక్తివంతమైన రీతిలో తీయొచ్చు కదా? అదీ లేదు. గ్రాఫిక్స్ గొప్పగా వాడేయాలనో, లేదా మరొకరి కంటే ఘనంగా తీసేయాలనో తపన తప్పించి, కాస్త మనసుపెట్టి ఉన్న ఉపకరణాలను సఫలీకృతంగా ఉపయోగించుకుందామన్న ఇంగితం ఎందుకు కలగదో అర్ధం కాదు.

ఘోషంతా క్రితంవారాంతంలో ఒక కొత్త సినిమా చూసినప్పటినుండీ నా బుర్రలో తిరుగుతోంది. హీరో యువనటుల్లో మంచి ఎనర్జీ, సామర్ధ్యం ఉన్న నటుడని నా చిన్న బుర్రకు ఎందుకనో నమ్మకం. అబ్బాయి పాత సినిమాలు చూడ్డానికి భయమేసి ఏమీ చూడలేదు కానీ నాలుగు సినిమాల పూర్వం ఒక విజయవంతమైన హిట్ ఇచ్చినప్పటి నుంచీ ఇతగాడంటే కాస్తంత అభిమానం ఏర్పడిందనే చెప్పాలి. కాని తర్వాత నేను ఆశించిన ఎదుగుదల ఎంత మాత్రం అతని కెరీర్ లో కనబడలేదు. కొత్త సినిమాకు క్రితం వచ్చిన ఇతగాడి రెండు సినిమాలూ చూసి నేను అత్యంత నిరుత్సాహానికి లోనయ్యాను. అయ్యో మంచి శక్తి, సమర్ధత ఉన్న కుర్రవాడే..శ్రమంతా వృధాగా పోతోందే అని. అతని సినిమాల ఎన్నికలో లోపమో, తీసేవాళ్ల లోపమో, "ఇమేజ్" అనబడే ఒక మూసలో కూరుకుపోయిఉన్నాడో అతనికే తెలవాలి.

కొత్త సినిమా ప్రచారాన్ని చూసి ఇదయినా పడిపోతున్న అతని స్థాయిని నిలబెడుతుందేమో అని ఆశ పడ్డాను. అతను శక్తివంచన లేకుండానే నటించాడు. కానీ మిగతావే కాస్త అటుఇటు అయ్యాయి. ప్చ్... ఇదే దారిలో వేళ్తే తెలుగు ప్రేక్షకులు అతన్ని మర్చిపోవటానికి ఎక్కువ సమయం పట్టదు అనిపించింది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే జనాలు పోటీగా తీసారంటున్న చిత్రానికి దీటుగా నిలిచి ఉండేది సినిమా. పైగా సినిమాలో మళ్ళీ కాస్తంత బరువు పెరిగాడేమో అనిపించింది. మొహంలో కూడా మునుపటి కళ తగ్గింది. ప్రశాంతంగా లేదు. నాకులాగే అతని కొత్త సినిమాలు వరుసగా గమనించిన ఎవరికైనా తప్పక ఇలా అనిపిస్తుంది. సినిమాలో ఒకే ఒక పాట నాకు నచ్చింది. సంగీతసాహిత్యాలు, గ్రాఫిక్స్, హీరోయిన్...అన్నీ బాగున్నాయి. " మనసుపై చల్లావోయీ మంత్రాల సాంబ్రాణి.." అని భలే ప్రయోగం చేసారు రామజోగయ్యశాస్త్రిగారు. ఇంకొక పాట చూడ్డానికి బోర్ గా, సందర్భోచితంగా లేదు కానీ బీట్ బాగుంది.

ఇకముందైనా కుర్రాడిని సమంగా ఉపయోగించుకుని, అతని ప్రతిభకు తగ్గ సినిమాలు రావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను.


గమనిక: ఇది ఎవరినీ కించపరచలని రాసినది కాదు. సగటు ప్రేక్షకురాలిగా ఒక మంచి నటుడి శక్తి వృధా అవుతోందన్న ఆవేదన మాత్రమే.

4 comments:

గిరీష్ said...

బాచెప్పారు..
అనవసరమైన ఖర్చు..
కాని హీరో గారు బానే చేసారు.. దర్శకత్వ భాధ్యత వహించిన వారిని అనాలి. అసలు నిర్మాతలు ఎలా ఒప్పుకుంటున్నారో అతని దర్శకత్వానికి, అన్నీ సన్నివేశాలు పాత సినేమాల నుంచి..
ఆ పాట నిజంగా సూపర్..

మధురవాణి said...

నాక్కూడా ఆ ఒక్క పాట బాగా నచ్చింది ఆడియోలో.. సినిమా ఎలాగూ చూడననుకోండి.. :P

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఇప్పుడున్న దర్శకుల్లో సోషియోఫాంటసీ తీసేంత సీన్ ఎవరికీ లేదు. సింగీతం శ్రీనివాసరావుతోనే అది అయిపోయింది. మంచికథని చెడగొట్టారు అనిపించింది.కొన్నిసీన్లలో గ్రాఫిక్స్ ఆనవసరమైనా (గంగాజలం పోసేటప్పుడు లాంటివి) ప్ట్టేశారు. అమ్మోౠ సినిమాలాగా గ్రాఫిక్స్ అంటే సగటుప్రేక్షకుడూ నోరుతెరుచుకుని చూసే రోజులు పోయాయని తెలీదనుకుంటా. కథనం చాలా వీకయ్యింది. బాగాకుదురుతున్నప్పుడు సడన్గా జారిపోతూ వచ్చింది.

తృష్ణ said...

@గిరీష్:
@మధురవాణి:
ధన్యవాదాలు.

@చైతన్య: ఆవేశంలో సింగీతంగారిని మర్చిపోయాను :( సరిగ్గా చెప్పావు. చాలా మొదట్లో నేను సింగీతంగారి "కరాజు కథలు" గురించి రాసినప్పుడూ నువ్వు సింగీతం గారి సినీజీవితవిశేషాల గురించి రాసిన టపా గుర్తువచ్చింది...:)
ధన్యవాదాలు.