సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 2, 2010

పాత పత్రికలూ...మధుర స్మృతులు!

నేను ఊహ తెలిసేసరికీ ఇద్దరు తాతయ్యలనీ ఎరుగను. అందువల్ల నా పాపకు పెద్దల ముద్దుమురిపాలు వీలయినంత అందించాలనేది నా ఆశయం. మా మామగారు కూడా రెండేళ్ళ క్రితం కాలం చేయటంతో మా ఇంట్ళో దాని కాలక్షేపం ఒక్క "నానమ్మ"తోనే. పాపకు అమ్మమ్మ,తాతయ్యల ప్రేమను కూడా అందించాలనే కోరికతో ఈ ఊరు వచ్చినప్పటి నుంచీ స్కూలు సెలవులు ఉన్నప్పుడల్లా, వారం పదిరోజులకోసారైనా, ఓపిక ఉన్నా లేకపోయినా పాపను అమ్మావాళ్ళింటికి తీసుకువెళ్తూ ఉంటాను. కానీ ఈసారి దాదాపు నెల తరువాత ఇంటికి వచ్చాను. ఈసారి ఇంట్లోని పాత పుస్తకాలన్నీ ఓసారి చూడాలనిపించింది. ఎన్నిసార్లు వచ్చినా చదవటం అయిపోనన్ని పుస్తకాలు, వినటం అయిపోనన్ని కేసెట్లు మా ఇంట్లో. నా బాల్యం, సగం జీవితం ఈ పుస్తకాల మధ్యన, కేసెట్ల మధ్యనే గడిచిపోయింది. వాట్ని చూస్తే నా ప్రాణం లేచి వచ్చినట్లు, మళ్ళీ నాలో కొత్త జీవం ప్రవేశించినంత ఆనందం కలుగుతుంది. పాత పుస్తకాలంటే కధలూ,నవలలు...ఇతర పుస్తకాలూ కాదు. పాత పత్రికల తాలుకూ బైండింగ్స్.

మా చిన్నప్పుడు ఇంట్లో చాలా పత్రికలు తెప్పించేవారు. పూర్తి సినిమా కబుర్లతో ఉండే "విజయచిత్ర", "వనిత", "ఆంధ్ర సచిత్ర వార పత్రిక", "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ", "రీడర్స్ డైజస్ట్", 'స్పేన్"...అప్పుడప్పుడు సితార మొదలైన పొడుగాటి సినీ పత్రికలు...ఇలా రకరకాల పత్రికలు ఇంట్లో ఉండేవి. మా పిల్లల కోసం "ట్వింకిల్","బాలజ్యోతి", బాలమిత్ర", "చందమామ","అమర చిత్ర కధలు" మొదలైనవి కూడా తెచ్చేవారు నాన్న. నాకు తెలుగు చదవటం బాగా వచ్చాకా అప్పట్లో పావలాకు అద్దెకు ఇచ్చే "పగడాల పడవ","రాకాసి లోయ" లాంటి చిన్న కధల బుల్లి పుస్తకాలూ, మిగతా పిల్లల పుస్తకాలతో పాటూ అవీ ఇవీ అని లేకుండా నవలలూ,పత్రికలు కూడా చదివేస్తున్నానని అమ్మ నన్ను కంట్రోల్ చేయటానికి చాలా జాగ్రత్తలు తీసుకునేది. కానీ అమ్మ మధ్యాహ్నం నిద్రోయినప్పుడూ, శెలవు దినాల్లోనూ అమ్మకు కనబడకుండా నా చదువు కొనసాగుతూ ఉండేది.


మా అప్పటి ఇంట్లో ఒక చిన్న గదిలో బాగా ఎత్తుమీద ఒక కిటికీ ఉండేది. దానికో బుల్లి అరుగు కూడా ఉండేది. అందులోకి ఎక్కి ఎవరికీ కనపడకుండా పత్రికలన్నీ చదివేస్తూ ఉండేదాన్ని. అది కనిపెట్టిన అమ్మ నా క్షేమాన్ని కాంక్షించి అసలు వార పత్రికలు కొనటమే మానేసింది. కానీ అప్పటిదాకా తెప్పించిన పత్రికల్లోని మంచి కధలనూ, సీరియల్స్ నూ, ఇతర విషయాలనూ కొన్నింటిని కట్టింగ్స్ చేసి జాగ్రత్తగా బైండింగ్ చేయించి దాచింది. పిల్లల పుస్తకాలన్నీ కూడా భద్రంగా దాచి బైండింగ్స్ చేయించింది అమ్మ. అవన్ని నా టెంత్ క్లాస్ అయ్యాకా శెలవుల్లో,నేను కాలేజీలోకి వచ్చాకా చదవనిచ్చేది. అప్పుడు మొదలు సమయం దొరికినప్పుడల్లా ఆ బైండింగ్స్ ను ఎన్నిసార్లు చదివానో...

ఇంతకీ ఆ బైండింగ్స్ లో ఏమున్నాయంటే పురాణం సీతగారి "ఇల్లాలి ముచ్చట్లు" , మాలతీ చందూర్ గారి "ప్రమదావనం" తాలూకూ కట్టింగ్స్ ఒక బైండ్; "వనిత"లోని కధలు, సీరియల్స్ ఒక బైండ్, "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లోని కొన్ని సీరియల్స్ ఒక బైండ్, "విజయచిత్ర" పత్రికల్లోని కట్టింగ్స్ సంవత్సరం వారీగా ఒక పదేళ్ళపైగా ఉన్న కొన్ని బైండ్స్, "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ"లో ప్రచురించిన మంచి మంచి ఫొటొగ్రాఫ్స్ తో
ఒక బుక్కు, అన్నిరకాల పత్రికల్లోంచీ సేకరించిన కొన్ని మంచి కధలతో ఒక బైండ్, ఇవికాక మేం పిల్లలం ఇప్పటికీ నాకంటే నాకని దెబ్బలాడుకునే "చందమామా" "బాలజ్యోతి" "ట్వింకిల్" "అమర చిత్ర కధలు" మొదలైనవాటి బైండింగ్స్...ఇంక్లా పైంటింగ్స్, వంటా-వార్పూ, సలహాలు,సూచనలు....ఇలా రాసుకుపోతే రెండు టపాలకు సరిపోయేన్ని నిధి నిక్షేపాలను మా అమ్మ పదిలపరిచింది.

ఇవాళ పొద్దున్నే వాటిని తిరగేసి , చదవటానికి కొన్నింటిని తీసుకున్నా. ఇవన్నీ నేను ఇదివరలో చాలా సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనే ఉంటాయి. అంత మంచి కధలూ, విశేషాలూ అవన్నీ. ఇన్నాళ్ళ తరువాత వాటిని చూసాకా వాటి గురించి బ్లాగులో రాయాలని మనసైంది....ఈ టపా తయారైంది..!!

20 comments:

శ్రీలలిత said...

అయితే మీ దగ్గర సంపద చాలా ఉందన్నమాట.. మరింకేం... అవన్నీ మళ్ళీ ఇప్పుడు కావాలంటే దొరుకుతాయా? మీ అమ్మగారి సాహిత్యాభిలాషకి నా జోహార్లు..

కొత్త పాళీ said...

nice.
welcome back.

సుభద్ర said...

vivaramgaaa rayyamDi..mEmu chaduvukuntam..

భావన said...

పుస్తకాలతో అనుభందం ఎంత తలచినా తరిగేది కాదు కదా. నా దగ్గర పాత ’ఇల్లాలి ముచ్చట్లు’ పురాణం గారిది, నామిని ’పచ్చ నాకు సాక్షి గా’ మొదటి ఎడిషన్ పుస్తకం వుంది, పుస్తకం రంగు కూడా మారిపోయింది కాని ఆ పుస్తకాలు చూసుకుంటే ఎంత అపురూపం గా వుంటాయో.. చలం గారి ప్రేమ లేఖలు పుస్తకం ఐతే చిరిగి పోయి మాసి పోయి లైను లు కొట్టేసి సొంత వ్యాఖ్యానాలు రాసేసి (నావే కాదు స్నేహితులు కూడ రాసేసే వారు).. ఆ పుస్తకం ను చూస్తే నా బాల్య స్నేహితురాలిని చూసినట్లు వుంటుంది. ప్చ్... ఆ అనుభందమే వేరు కదా.. మంచి కధ ఒకటి రాయండి మరి ఆ బైండుల లో నుంచి. ఆరోగ్యం బాగుందని ఆశిస్తాను.

SRRao said...

తృష్ణ గారూ !
పుస్తకాలు మంచి నేస్తాలు. మీ నాన్నగారి లాగే నాకు కూడా పత్రికలు కొనడం, మీ అమ్మగారిలాగా నచ్చిన వాటిని భద్రపరుచుకోవడం అలవాటు. అయితే విజయచిత్రలు మాత్రం ఎవరికో ఇచ్చి పోగొట్టుకున్నాను. ఎంత తవ్వినా తరగని గని.

మరువం ఉష said...

పుస్తకాలు మంచి జ్ఞాపకమే కదా ఎవరికానా, తృష్ణ? "యువ" వచ్చేది కాదా.. మాకు టెంత్ అయ్యాకనే వారపత్రికలకి ప్రమోషన్, అంతవరకు చదివిన బాలల కథలింకా చాలా వరకు గుర్తే... నాకు "చిట్టి రాజు - గూని గుర్రం" భలే ఇష్టం.

ఇకపై అన్నీ చదివి సారాంశాలు వ్రాస్తారా మరి?

తృష్ణ said...

శ్రీలలితగారూ, నిజమేనండీ ఇప్పుడు కావాలన్నా అవన్నీ దొరకవు...అయితె అవన్ని అమ్మ దగ్గర నుంచి ఎలా జాతీయం చెయాలా అన్నది ఆలొచన..:)

కొత్తపాళీగారూ, నేను వారానికోక టపా ఎలాగో అలా రాస్తున్నానండీ...రాయతానికి ఏ మాత్రం కుదిరినా రాయకుండా ఉందలేకపోవటం నా బలహీనత..:)
ఈ టపాకు ముందు రాసిన రెండు,మూడు టపాలు వీలుంటే చూడండి..

తృష్ణ said...

సుభద్రగారూ, పెద్ద బాధ్యతనే పెట్టేసారు..చదువుకుని మళ్ళీ అవన్ని గుర్తు చేసుకుని సంబరపడటం దాకా పర్వాలేదు...టపాల్లోకెక్కించాలంటే కొంచెం పెద్ద పనే..:) వీలైతే తప్పక రాస్తాను కొన్నైనా...

తృష్ణ said...

భావనగారూ, పాత పుస్తకాలతో అందులోనూ మళ్ళీ మళ్ళీ మనం చదువుకునే కొన్ని పుస్తకాలతొ మనకుండే అనుబంధం చదివేవాళ్ళకే అర్ధం అవుతుంది..."పుస్తకం మంచి మిత్రునితో సమానం" అని ఊరికే అన్నారా మరి...
ఇక ఆరోగ్యం గురించి...కాస్త ఓపిక ఉన్నా రాయటం మానను..ఎలాగో అలా రాసేస్తాను...ఎవరెన్ని తిట్టినా మన చెవికెక్కదుగా...దేనిదారి దానిదే :)

తృష్ణ said...

రావుగారూ, విజయచిత్రలు పొగొట్టుకున్నారా..అయ్యో...ఇప్పటి పత్రికల్లోని సినిమా వార్తల్లా కాక ఎంతో బాగుందేవి ఆ సినిమా కబుర్లు.
నేను వ్యాఖ్య రాయలేకపోతున్నానన్న విషయాన్ని అర్ధం చేసుకుని, నా ప్రతి టపాకూ మీ ప్రోత్సాహాన్నందిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.

ఉషగారు,బహుకాల దర్శనం ఆనందదాయకం...! చిన్నప్పుడు కొద్దిపాటి పత్రికలు,పుస్తకాలూ చదివినా పూర్తి స్థాయిలో పుస్తకాలు చదవటానికి పర్మిషన్ పదవ తరగతి తరువాతె..!
"చిట్టిరాజు-గూనిగుర్రం" కధ చదివిన గుర్తు నాక్కూడా.ఇంట్లో ఎక్కడో ఉందేమో కూడా...
పాత పత్రికల కధలు అవీ మళ్ళీ చదివి కొన్నైనా రాయాలని ఉంది మరి..ఓపికను బట్టి చేస్తానండీ...!

పరిమళం said...

ఐతే మాకిక కొత్త విశేషాలతో టపాల పండుగే అన్నమాట ! కాస్త కష్టమైనా మీరు రాస్తారు ఎందుకంటే అనుభూతిని పంచుకోవడం అలవాటుగా మారితే అది అందమైన వ్యసనం మరి :)

హరే కృష్ణ said...

నమస్తే తృష్ణ గారు,బావున్నారా
మీరు కూడా gap తీసుకున్నారా posts ki
ఇంటికి వెళ్ళగానే ఇంచుమించు నాది కూడాఇదే పరిస్ఠితి
బాలమిత్ర దగ్గర నుంచి బాలయ్య వరకు కనిపించింది అంతా చదివేయాల్సిందే..

మీ పోస్ట్ తో మా ఇంటిని గుర్తుకు తెప్పించేసారు

వేణూశ్రీకాంత్ said...

అసలైన నిధి ఇదే కదా :-) బాగుంది తృష్ణ గారు.

Lakshmi Raghava said...

meekosam vedikanu challa....60 yelladanni kada anni gurthudavu....trishnaventa ye blog ani publish chesa...yevaru reply ivvaledu....itivala tammudu maraNisthe naa feelings meeto cheppalani ...panchukovalani anukunna...
lakshmi

తృష్ణ said...

లక్ష్మిగారూ మీకు నా బ్లాగ్ నచ్చినందుకు చాలా ఆనందమైంది. ధన్యవాదాలు. ప్రకటన ఇవ్వటం... అర్ధంకాలేదండీ...

తృష్ణ said...

పరిమళంగారూ, మరి రోజూ వచ్చి చదువుకోండి..రాస్తున్నాను...:)

హరే కృష్ణ గారు, బహుకాల దర్శనం..! మధ్య మధ్య విరామం తిసుకోక తప్పని పరిస్థితి అండీ..

వేణూ శ్రీకాంత్ గారూ, ధన్యవాదాలు.

Lakshmi Raghava said...

meekosam vedikanu challa....60 yelladanni kada anni gurthudavu....trishnaventa ye blog ani publish chesa...yevaru reply ivvaledu....itivala tammudu maraNisthe naa feelings meeto cheppalani ...panchukovalani anukunna...
lakshmi

Lakshmi Raghava said...

తమ్ముడు మరణించిన తరుణంలోమనసు బాధతో మూల్గుతుంటే,88 యెళ్ళ అమ్మ పుత్రశొకంతో ,దేవుడిని నిందిస్తూ వుంటే,మన ప్రారభ్ధ కర్మ అని చెప్పలేక,మరణం ఇదీ అని స్పస్టతలేని తమ్ముడి పిల్లలను చూసి వారిముందు కన్నీరు కార్చలేక,అతన్ని మరువలేని స్థితిలో, పరిస్థితిని జీర్ణించుకొలెక,మస్థిష్కాన్ని మభ్యపెడుతూ ,బాధని మరుగున పెడుతూ,మామూలుగా వుండాలని చెసే ప్రయతనం ఒక నరకం....మరణం గురించి అనుభవం ఇలా రాసేల చేసింది.....
Posted by Lakshmi

తృష్ణ said...

లక్ష్మి గారూ, మీవంటి పెద్దలకు చెప్పేంత వయసు,అనుభవం నాకు లేవు. కానీ నాకు తొచిన నాలుగు మాటలను చెబుతాను...పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదని అందరకూ తెలుసున్నదె అయినా కుటుంబ సభ్యుల మరణం మనలను ఎంతో కృంగదీస్తుంది. బాధను మర్చిపొండి అని చెప్పటం చాలా తేలిక, కానీ దానిని మరుపుకు తేవటం చాలా కష్టం. అది అనుభవించే మనసులకే అర్ధం అవుతుంది.

కాలమే అన్నిటికీ సమాధానం చెప్పగలదు...ధైర్యంగా ఉండండి. భగవంతునిపై భారం పెట్టండి.ఆ సర్వాంతర్యామి అన్నింటినీ సర్దుబాటు చేస్తాడు.

రాధిక(నాని ) said...

మా అమ్మ కూడా ఇలాగే వెన్నెల్లో ఆడపిల్ల,చంటబ్బాయ్ ఇలా వీక్లీలలో వచ్చే సీరియల్స్ చాలా బైండింగ్స్ చేయించింది .ఇప్పటికీ అవన్నీ బద్రంగాదాచింది. మేము వెళ్లింప్పుడెప్పుడైనా బోర్ కొడుతూన్నప్పుడు వాటిని (చాలా సార్లు చదివినవైనా )చదువుతూంటాము.