సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, October 24, 2013

వాన..





వాన.. వాన.. వాన..
నిన్నట్నుండీ
కురుస్తూనే ఉంది..

తడుపుతోంది..
పుడమినీ.. దేహాన్నీ.. మనసునీ..
కడుగుతోంది..
అరుగునీ.. అడుగులనీ.. ఆలోచనల్నీ..
ఊపుతోంది..
కొమ్మలనీ.. పూలనీ.. కలలనీ..
చలిస్తోంది..
నిశ్శబ్దాన్నీ.. మాపునీ.. నన్నూ..

వాన..వాన.. వాన..
ఇంకా
కురుస్తూనే ఉంది..



Monday, October 21, 2013

"అట్లతద్దోయ్ ఆరట్లోయ్ .."





మరేమో ఇవాళ అట్లతద్ది కదా.. పొద్దున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ "మునుపు రేడియోలో అట్లతద్ది పాటలు వేసేవారు 'జనరంజని'లో అయినా... ఇవాళ ఒక్క పాటా వెయ్యలేదే.." అంది. సరే నే వినిపిస్తానుండు అని నెట్లో వెతికి ఫోన్లోనే రెండు పాటలు వినిపించా.. అమ్మ సంతోషపడింది. సరే ఆ పాటలు బ్లాగ్లో పెడితే అమ్మాలాగా అట్లతద్ది పాటలు వినాలనుకునేవారెవరన్నా వింటారు కదా.. అని అవుడియా వచ్చింది. అదన్నమాట..:)


నేను అట్లతద్ది నోములాంటివి ఏమీ నోచలేదు కానీ అమ్మ ప్రతి ఏడూ గోరింటాకు పెట్టేది. అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఎంత సరదాగా అట్లతద్ది చేసుకునేవారో చెప్పేది. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అని ఫ్రెండ్స్ అందరూ అరుచుకుంటూ వెళ్ళి ఉయ్యాలలూ అవీ ఉగడం, అమ్మమ్మ అట్లు చేయడం మొదలైన కబుర్లు ప్రతి ఏడూ అప్పుడే వింటున్నట్లు మళ్ళీ కొత్తగా వినేవాళ్లం!
అట్లతద్ది నోము కథ లింక్ దొరికింది..చూడండి:
http://www.teluguone.com/devotional/content/atla-taddi-nomu-113-1441.html 


పాత సినిమాల్లో అట్లతద్ది పాటలు కాసిని ఉన్నాయి గానీ నాకు మూడ్నాలుగే దొరికాయి.. అవే పెడుతున్నాను..

 
1) రక్త సింధూరం చిత్రంలో పాట "అల్లిబిల్లి పిల్లల్లారా ఇల్లా రండి మీరు.. ఇలా రండి అట్లాతద్ది కన్నెనోము నోచాలండి.. నేడే నోచాలండి.." సుశీల బృందం పాడారు..ఆరుద్ర రచన ..

2) పవిత్రబంధం చిత్రంలో ఓ పాట ఉంది.. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచేతద్ది వేడుకమీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే జీవితమే పూచునే.." అని!


3) "అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అంటూ పాడిపంటలు సినిమాలో మరో పాట ఉంది కాని అది ఓ పట్నం అమ్మాయిని ఉడికిస్తూ పాడే పాట. అందుకని అట్లతద్ది కన్నా ఎక్కువ తెలుగుతనం ఉట్టిపడేలా ఎలా ఉండాలో చెప్పేపాట ఇది.
పాట ఇక్కడ వినండి:
 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3112 



4) బొబ్బిలి యుధ్ధం లో "ముత్యాల చెమ్మచెక్క.." పాట అట్లతద్ది పాట అవునో కాదో గుర్తులేదు కానీ అందులో "ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె.." అనే వాక్యం ఉంటుంది.. కాబట్టి బాగుంటుందని ఆ పాటని కూడా జతచేస్తున్నానిక్కడ :)

Tuesday, October 15, 2013

పన్నెండేళ్ల ప్రాయం..వెన్నెల్లాంటి హృదయం..



Fmలో తెలియని పాటలు విన్నప్పుడల్లా నెట్లో వెతకటం నాకు ఎప్పుడూ ఉన్న అలవాటే! ఇవాళా ఓ మంచి పాట విన్నా.. . గూగులమ్మనడిగితే ఆ పాట "బావ" సినిమాలోదని, సాహిత్యం "అనంత్ శ్రీరామ్" దని చెప్పింది. 
పాట వినటాడికి "స్నేహం" చిత్రంలోని 'ఎగరేసిన గాలిపటాలు.. ' సాహిత్యం లాగనే ఉంది. 

పాట మీరూ వినేయండి.. తెలియకపోతే కొత్తగా.. తెలిస్తే మరోసారి నాతో పాటూ... 

'

Thursday, October 10, 2013

మట్టిమనిషి





"పుట్టినవాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయేవాళ్ళేరా! అసలు మనం పుట్టింది ఏడవటానికంటరా? బతకటానికిరా! బతకటానికి. బతికినన్నాళ్ళూ మగసిరిగా బతకాలి! ఒకళ్ళను దేహీ అంటూ అడక్కూడదు. అడ్డం వచ్చిన వాటిని నరుక్కుంటూ వెళ్ళాలి! చేతగాని వాడే ఏడుస్తాడు. చేతుల్లో సత్తువ ఉన్న వాడెవ్వడూ ఏడవకూడదు. సంతోషంగా బతకాలి! మనిషికి సంతోషం ఎక్కడుందంటావా? కష్టపడి పని చెయ్యడంలో ఉంది. చెమటోడ్చి భూమి దున్నటంలో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావటంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లో కొచ్చినప్పుడు ఉండే ఆనందంలాంటిది ఈ భూమ్మీదే మరొకటి లేదురా బాబూ!"
అంటాడు సాంబయ్య మనవడితో! ఎంత చక్కని ఫిలాసఫీ! 

ఇది సాంబయ్య తనకు తానుగా గ్రహించుకున్న జీవనసారం. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి, మట్టినే నమ్ముకు బ్రతికిన ఓ 'మట్టిమనిషి' నేర్చుకున్న జీవన వేదాంతం. 


'సాంబయ్య' డా.వాసిరెడ్డి సీతాదేవి రచించిన "మట్టిమనిషి" నవల లో ప్రధాన పాత్రధారి(Protagonist). కథంతా అతని చుట్టూతానే అల్లుకుని ఉంటుంది. 'ఆంధ్రప్రభ' దినపత్రిక, ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురణ పొందిన ఈ నవల విశేషంగా పాఠకుల ఆదరణ పొందింది. 1972 లో పుస్తక రూపంలో వచ్చిన తరువాత మరో రెండుసార్లు పునర్ముద్రితమైంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ నవల పురస్కారాన్ని అందుకుంది. నేషన్ బుక్ ట్రస్ట్ వారు పధ్నాలుగు భాషల్లోకి అనువదించారు ఈ పుస్తకాన్ని. ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు ఫైనల్ ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా కూడా నిర్ణయించారు. ఇంతటి విశేష ప్రాముఖ్యత పొందిన ఈ సామాజిక నవలలో అప్పటి సమకాలీన సమాజంలోని దురన్యాయాలను, అప్పటికే పతనమవుతున్న భూస్వామ్య వ్యవస్థ లోటుపాట్లను కళ్లముందుంచారు సీతాదేవిగారు. తెలుగు నవలాసాహిత్యంలో ఎన్నదగిన పది ఉత్తమ నవలల్లో ఈ నవల కూడా చోటుచేసుకుని ఉంటుందని పుస్తకం పూర్తయ్యాకా నాకనిపించింది. 




 

సీతాదేవి గారి రచనా శైలి, సామాన్య రైతు జీవితాన్ని ఆవిష్కరించిన తీరు, పాత్రల చిత్రణ, నిశితమైన మనస్తత్వ చిత్రణ అన్ని ఎంతో వాస్తవికంగా, వివేచనాత్మకంగా ఉన్నయి. ఒకవైపు ప్రభుత్వోద్యోగం చేస్తునే సీతాదేవి గారు నవలలు, కథా సంపుటాలూ, వ్యాస సంకలనాలు, పిల్లల కథా సంపుటాలు, అనువాదాలు రాసారంటే నిజంగా అభినందనీయులు. ఆవిడ పలు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్న వివరాలు, వాటి పేర్లు నవల వెనుకవైపు రాసారు.


సుమారు ఏడాదిన్నర క్రితం కొన్న ఈ పుస్తకాన్ని మొన్న ఓ వంద పేజీలు చదివాకా తప్పనిసరిగా మూసేయాల్సి వచ్చింది. మిగిలిన మూడొండల పేజీలూ నిన్న ఏకబిగిన మూడుగంటల్లో పూర్తిచేసానంటే క్రెడిట్ అంతా నా కళ్ళను పరిగెత్తించిన ఆ రచనా శైలిదే! ఇంతకు ముందు ఆవిడ పుస్తకాలేమీ చదవలేదు కానీ ఈ ఒక్క పుస్తకం మాత్రం నన్నెంతో ఆకట్టుకుంది. అసలు నిన్న రాత్రంతా కలత నిద్రలో సాంబయ్య, కనకయ్య, రామనాథబాబు, రవి, వరూధిని...అలా కదులుతూనే ఉన్నారు కళ్లముందు! ఎంతగానో కదిలించేసింది నన్నీ కథ..! విశృంఖల ప్రవర్తనతో జీవితాన్ని నాశనం చేసుకున్న వరూధిని చావుపై కూడా జాలి పుట్టించేంతటి పట్టు ఉన్న కథనం. కొన్ని పుస్తకాలింతే.. మనసునీ, ఆలోచనల్నీ తమ వశం చేసేసుకుంటాయి.


మూడు తరాల జీవితాలలో వివిధ పరిణామాలను సమర్థవంతంగా, ఎంతో దృశ్యాత్మకంగా అక్షరీకరించారు సీతాదేవి గారు. ప్రతి సన్నివేశం ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు కాక, మనోఫలకంపై ఒక దృశ్యాన్ని చూపెడుతూ ఉంటుంది పాఠకుడికి. ఉత్తరాది నుండి కట్టుబట్టలతో ఆ ఊళ్ళోకి వచ్చిన వెంకయ్య, మోతుబరి రైతు వీరభద్రయ్య దగ్గర పాలేరుగా కుదిరి, కష్టపడి కౌలు వ్యవసాయం చేసి, పదేళ్ళలో రెండెకరాల పొలం కొనే స్థాయికి ఎదుగుతాడు. కొడుకు సాంబయ్యకు దుర్గమ్మనిచ్చి పెళ్ళి చేస్తాడు. చమటోడ్చి సంపాదించిన ఐదెకరాల పొలాన్ని కొడుకుకి మిగిల్చి వెంకయ్య చనిపోతాడు. కొడుకు పుట్టేనాటికి సాంబయ్య ఏడెకరాల మాగాణి, మూడెకరాల మెట్ట ఉన్న చిన్నకారు రైతు. బడికి కాక, కొడుకు వెంకటపతిని తనతో పాటుగా పొలానికి తీసుకెళ్లటానికే నిర్ణయించుకుంటాడు సాంబయ్య. వెంకటపతి పెళ్ళిడుకొచ్చేసరికీ  ఎనభై ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, సుమారు పాతికవేల కవిలె, దొడ్లూ దోవలు, కొత్తగా కట్టిన డాబాఇల్లు గల షావుకారవుతాడు
సాంబయ్య. ఊళ్ళో అతని పరపతి పెరుగుతుంది. అదృష్టం అందలం ఎక్కిస్తే బుధ్ధి బురదలోకి లాగిందన్నట్లు ఒక చిత్రమైన కోరిక పుడుతుంది సాంబయ్యకి. తన తండ్రి పాలేరుగా చేసిన వీరభద్రయ్య కొడుకు బలరామయ్య తో వియ్యమొందాలని! ఆస్తి హరించుకుపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్న బలరామయ్య గత్యంతరం లేక ఆఖరి కుమార్తె వరూధినిని వెంకటపతికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ వ్యవహారమంతటికీ ముఖ్యకర్త, మధ్యవర్తి గుంటనక్కలాంటి కనకయ్య!


 రైతులకూ పెట్టుబడిదారులకూ మధ్యవర్తిగా ఉంటూ, ఊరువాళ్ల దయాధర్మాలతో సంసారం నడుపుతూ, చిన్నచిన్న పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించి, ఏదో ఒక దోవన లాభాలార్జించి భూస్వామిగా మారిన ఊసరవెల్లి కనకయ్య. ఒకనాడు బక్కపలచగా,తొండిలేక ఆవురావురుమన్న కనకయ్య కాలువగట్టు క్రింద పదెకరాల పొలం, తాను రైతుల ధాన్యం అమ్మించిన మిల్లులోనే పావలా వాటాదారు అవుతాడు. నాలుగువేలతో ఇల్లు బాగుచేసుకుని మేడ కడతాడు. మోసాలతో ధనార్జన చేసి కొడుకునీ,అల్లుడ్నీ లాయర్లను చేస్తాడు. అక్రమార్జనతో బలరామయ్య మేడను కూడా కొని, చివరికి ఆ ఊరి సమితి ప్రెసిడెంట్ కూడా అవుతాడు. సమకాలీన వ్యవస్థలోని లోటుపాట్లకు ప్రతీక అతని పాత్ర.




పట్నవాసపు మోజుతో పల్లె వదిలిన సాంబయ్య కోడలు వరూధిని వెనకాల పెళ్లాం చాటు మొగుడిగా మారిన వెంకటపతి తండ్రిని వదిలేస్తాడు. తన మొండితనం వల్ల, అజాగ్రత్త వల్ల, అదుపులేని నడవడి వల్లా, జీవితాన్ని అభాసుపాలు చేసుకుంటుంది వరూధిని. కనకయ్య వంటి గుంటనక్కల వల్ల, రామనాధబాబు
వంటి మోసకారులవల్ల, వెంకటపతి చేతకానితనం వల్లా, సాంబయ్య చెమట చిందించి సంపాదించిన ఆస్తంతా కర్పూరంలా హరించుకుపోతుంది. ఓ దిబ్బ మీద పూరిపాకలో ఒంటరిగా మిగులుతాడు సాంబయ్య! 


భార్య హఠాన్మరణం తరువాత తండ్రికి మొహం చూపలేని వెంకటపతి కాన్వెంట్ లో చదువుతున్న తన కొడుకుని ఊరిపొలిమేరల్లో తాత వద్దకు వెళ్లమని వదిలి వేళ్పోతాడు. అదంతా ఎలా జరిగింది? అంత ఆస్తి ఎలా హరించుకుపోయింది? వరూధిని ఎలా మరణించింది? తన ఆస్థిని సర్వనాశనం చేసిన కొడుకు వారసుడైన తన మనవడు రవిని సాంబయ్య చేరదీస్తాడా? చివరికి ఏమవుతుంది? మొదలైన ప్రశ్నలకి సమాధానలు తెలుసుకోవాలంటే నవల చదవాల్సిందే మరి :)


పట్నానికి తీసుకెళ్ళి భార్య ప్రాణాలు కాపాడలేని పరమ పిసినారిగా సాంబయ్య పాత్రను చిత్రీకరించినప్పటికీ, ఎందుకో అతనిపై ద్వేషం, కోపం కలగవు. మట్టిని నమ్ముకున్న అతడి ఆత్మవిశ్వాసానికీ, వృధ్ధాప్యంలో కూడా ఓటమి అంగీకరించని అతని పట్టుదలకూ అతడ్ని మెచ్చకుండా ఉండలేము. ఓ సందర్భంలో "హౌ కౄయల్ యు ఆర్? తాతయ్యా!" అంటాడు మనవడు. అందుకు సమాధానం చెప్తూ, "దున్నుతూ దున్నుతూ కాడి మెడమీద వేసుకుని పోయిండిరా! దాని ఋణం అది తీర్చుకుని హాయిగా కన్నుమూసింది. అదృష్టం అంటే దాందేరా! మనుషులకు కూడా రాదురా ఆ అదృష్టం!" అంటాడు. ఎంతటి జీవనసత్యం దాగిఉందో ఆ మాటల్లో! 

మరోసారి - "తాతయ్యా నీకు చదువు రాదుగదా! ఇదంతా నువ్వెట్టా నేర్చుకున్నావ్?" అనడుగుతాడు మనవడు.. అప్పుడు..
"ఈ నేల నా పలక. నాగలే నా బలపం. పొలమే నా బడి! భూమ్మీద దిద్దాను. రోజుకి ఒక్కొక్కమాట ఈ భూమే నేర్పింది నాకు. నా తల్లీ,దైవం, గురువూ ఈ భూమేరా రవీ! ఇప్పుడు చెప్పరా మనవడా? నీ బడి గొప్పదో నా బడి గొప్పదో? నీచదువెక్కువో నా చదువెక్కువో?" అంటాడు సాంబయ్య! 

ఇతను కదూ జ్ఞాని !
చివర్లో మరోసారి  "ఈ నేలా, ఈ గాలీ, ఈ ఆకాశం చమటోడ్చేవాడి సొత్తురా! అందలమెక్కినోడిది కాదురా!" అంటాడు అతను.
నవలాసారం కూడా ఇదే!


ఇలా నాకనిపించడం యాదృచ్ఛికమో, ప్రేరణో ఉందోలేదో తెలీదు కానీ నాకీ నవల చదువుతూంటే రెండు  ఆంగ్ల నవలలు గుర్తుకు వచ్చాయి. ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి, నోబుల్ పురస్కార గ్రహీత 'Pearl Buck' రాసిన 'The Good Earth', Thomas Hardy నవల 'The Mayor of casterbridge'. 'The Good Earth'లో protaganist 'wang lung';  '
The Mayor of casterbridge' లో protaganist  'Henchard'. ఈ మూడు నవలల్లోనూ protaganist  ది ఒకటే దుస్థితి.. రెక్కల కష్టం వల్లనే సామాన్యుడి నుండి ధనికుడిగా ఎదగడం, ఆ తర్వాత మళ్ళీ ఏదో కారణాన పతనమైపోయి మళ్ళీ సామాన్యుడైపోవడం. కథ, కారణాలు మాత్రమే వేరు వేరు. ఒకవేళ ఎక్కడైనా వీటి ప్రేరణ ఉండిఉన్నా కూడా "మట్టి మనిషి"కి స్వాతంత్ర్యంగా నిలబడి ఒక గొప్ప నవల అనిపించుకోదగ్గ లక్షణాలన్నీ ఉన్నాయి. సాహిత్యాన్ని అభిమానించే ప్రతి పాఠకుడూ తప్పక చదవవలసిన నవల ఇది!

Thursday, October 3, 2013

కొత్త సిరీస్ - "పాట వెంట పయనం..."



మధురమైన మన పాత తెలుగు పాటల గురించిన ఒక సిరీస్ "సారంగ" సాహిత్య వారపత్రికలో ఇవాళ నుండీ మొదలైంది. పేరు - "పాట వెంట పయనం..."

“బతుకంతా పాటలాగ సాగాలి” అని పాడుకున్నారొక కవి! పాట అంటే కేవలం సంగీతమే కాదు, అందమయిన సాహిత్యం!  ప్రతి పాటకూ ఓ ప్రత్యేకమైన పదనేపథ్యం ఉంటుంది. ఏదో ఒక విషయం పైన  రాయబడిన బోలెడు. నవ్వు, పువ్వు, వెన్నెల, జీవితం.. ఇలానన్నమాట. అలాంటి కొన్ని నేపథ్యాలను ఎన్నుకుని, ప్రతి వ్యాసంలో ఆ నేపథ్యం తాలుకూ పాటలను గుర్తుకు తెచ్చి, వినిపించే ప్రయత్నం చేయబోతోంది “పాట వెంట పయనం…”

మరి నాతోబాటూ పాట వెంట పయనానికి మీరూ రండి...

http://www.saarangabooks.com/magazine/2013/10/02/%E0%B0%AA%E0%B1%82%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B8%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%95%E0%B1%80/

Tuesday, October 1, 2013

చలువపందిరి : यारा सीली सीली..




 "The Hungry stones” అని విశ్వకవి రవీంద్రుడు రచించిన ప్రఖ్యాత కథ ఒకటి ఉంది. ఆ కథను టాగూర్ వందేళ్ళ జయంతి ఉత్సవాల సందర్భంలో ప్రముఖ బెంగాలి దర్శకుడు తపన్ సిన్హా “Khudito Pashan” అనే పేరుతో సినిమాగా తీసారు. చిత్రానికి జాతీయపురస్కారం లభించింది. మరో ముఫ్ఫై ఏళ్ల తరువాత ఈ కథ ఆధారంగానే గేయరచయిత గుల్జార్ “Lekin..” పేరుతో ఓ సినిమా తీసారు. ఈ చిత్రానికి కూడా జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రంలోని “యారా సీలీ సీలీ” అనే పాట గురించి ఈసారి చెప్పబోతున్నా..! 


ఇంతటి భావగర్భితమైన పాటలో చిత్ర కథ కూడా మిళితమై ఉంది కాబట్టి ఈసారి పాటకు 'వాక్యార్థం' రాయడం లేదు. రాసినా అర్థమంతా మారిపోతుంది కూడా! కాబట్టి 'స్వేచ్ఛానువాదం' మాత్రమే ప్రయత్నించాను. 

పూర్తి వ్యాసాన్ని క్రింద లింక్ లో చూడవచ్చు: 
http://vaakili.com/patrika/?p=3934 



Thursday, September 26, 2013

చెలిమితో కాసేపు...


ఎందుకు పరిగెడుతున్నామో తెలియకుండా, ఎలా పరిగెడుతున్నామో తెలియకుండా, పరిగెత్తి పరిగెత్తి ఏం సాధించామో కూడా తెలియకుండా... మనందరం కాలం వెంట ఏళ్ల తరబడి పరిగెడుతూనే ఉంటాం. పొద్దున్నే లేవకపోతే ఎలా? త్వరగా తయారవ్వకపోతే ఎలా? వంటవ్వకపోతే ఎలా? బస్సు రాకపోతే ఎలా? ఆఫీసుకి లేటైతే ఎలా? ఆఫీసులో పని ఎక్కువైతే ఎలా? పిల్లలడిగినవి తేకపోతే ఎలా? శెలవు దొరక్కపోతే ఎలా? జీతం రాకపోతే ఎలా?
అబ్బా... ఎన్ని ప్రశ్నలో కదా.. 


వీటన్నింటికీ సమాధానాలు వెతుక్కునే సమయం కూడా ఒకోనాడు మనకి ఉండదు! అలా పరిగెత్తుతున్నాం అందరం రేపవళ్ల వెంట.. రోజుల వెంట.. నెలల వెంట.. సంవత్సరాల వెంట! ఫలానా ఫలానా పనులు చెయ్యాలి అని లిస్ట్ రాసుకుంటాం. కానీ లిస్ట్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం లేదా ఆ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. ఒకటో రెండో శెలవు రోజులు వస్తాయి మధ్య మధ్యలో.. అపుడు బడలికగా ఒత్తిగిల్లడానికో, ఆలస్యంగా లేవడానికో సరిపోతాయా శెలవుదినాలు. చూస్తూండగానే ఐదు, పది, ఇరవై అని ఏళ్ళు గడిచిపోతాయి ఇలానే...



మరి ఈ పరుగుపందాల్లో కాస్త ఊరట, కాస్త విశ్రాంతి, కాస్త ఆనందం ఎలా వెతుక్కోవాలి? మనలోకి కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపుకోవాలి? మన హాబీలను వదలకుండా.. అన్నది ఒక మార్గం. సంగీతం, సినిమా, దైవ చింతన, చిత్రలేఖనం, పుస్తక పఠనం, సంఘ సేవ, స్నేహితులతో గడపడం ఇలా ఏది చేస్తే ఉల్లాసంగా ఉంటుందో అది చెయ్యడానికి చాలామందిమి ప్రయత్నం చేస్తూంటాం. ఇవన్నీ కాక నిన్న ఒక పని చేసా నేను. చిన్ననాటి స్నేహితురాలితో కాసేపు..కాదు కాదు బోళ్డు సేపు మాట్లాడా! ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. స్కూల్లో చదువుకునేప్పటి నేస్తం. ఇన్నాళ్ళూ అలా కాపాడుకుంటూ వచ్చాం మా స్నేహాన్ని ఇద్దరమూ. పూనా దగ్గర్లో ఉంటున్నారు వాళ్ళిప్పుడు. మేం కలిసి కూడా ఐదేళ్ళు దాటుతోంది. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో కూడా తెలీదు. తనకి జాబ్ తో మెయిల్స్ రాయడానికి కూడా ఖాళీ ఉండదు. ఎప్పుడైనా వీలయినప్పుడు ఫోన్లోనే మాట్టాడుకుంటాం.


 

నిన్న అలా ఇద్దరం చిన్నప్పటి కబుర్లు, ఆ రోజులన్నీ తలుచుకుంటూ, అలా మాట్టాడుకుంటే ఎంతో ఊరటగా అనిపించిందో! ఈ హడావుడి పరుగుల్లో పడి ఏదో కోల్పోతున్నామేమో అనిపించే వెలితేదో తీరినట్లు! "నాకయితే నిన్ననే జరిగాయేమో అన్నంత ఫ్రెష్ గా ఉన్నాయి ఆ జ్ఞాపకాలు.." అని తను, "అవును కదా.. ఇన్నేళ్ళేలా గడిచిపోయాయే.." అని ఆరోగ్యాల గురించీ, ఇంటివిషయాలు, స్నేహితుల గురించి, పిల్లల గురించీ.. ఇలా చాలా విషయాల గురించీ నేనూ తనూ... ఊసులడుకున్నాం.  కాసేపు నే మాట్టాడాకా, ఉండు నే చేస్తా అని తను ఫోన్ చేసింది. ఇంకాసేపు..ఇంకాసేపు అలా ఓ గంట దాకా కబుర్లు చెప్పుకున్నాకా గానీ మా కరువు తీరలేదు. లక్కీగా ఆ సమయంలో ఏ మిస్డ్ కాల్ రాలేదు, ఎవ్వరూ కాలింగ్ బెల్లు కొట్టలేదు :-)

 

ఫోన్ పెట్టేసాకా అనిపించింది.. హాబీలను కాపాడుకోవడమే కాదు చిన్ననాటి స్నేహాలను కూడా కాపాడుకుంటే ఇలా రిఫ్రెష్ అయిపోవచ్చు అని. మరి మీరు కూడా త్వరగా మీ చిన్ననాటి చెలిమితో కాసేపు కబుర్లాడేసి రిఫ్రెష్ అయిపోతారుగా...

Tuesday, September 17, 2013

jaya hey - CD కబుర్లు




ఆమధ్యన Landmark book store లో ఓల్డ్ సీడీల మీద డిస్కౌంట్ చూసి రెండు మార్లు Landmark ప్రదక్షిణ చేసి కొన్ని రత్నమాణిక్యాలు చేజిక్కించుకున్నాను. వాటిల్లో ఒకటి "జయ హే " అనే ఆల్బమ్. చూడగానే అనిపించింది భలే దొరికింది అని. కొని పదిరోజులు దాటిపోయాకా ఇవాళ పొద్దున్న విన్నాను. ఇప్పటిదాకా వింటూనే ఉన్నాను..! precious collection! ఈ సీడీని రవీంద్రుడి 150వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా విడుదల 2011లో చేసారు.
ఈ సీడీ తాలూకూ వివరాలు ఇక్కడ చూడవచ్చు:
https://www.facebook.com/pages/Jaya-Hey/240386599417500 




ఇందులోని ప్రత్యేకత ఏంటంటే, ఆయన రచించిన మన జాతీయగీతం తాలూకూ మొత్తం ఐదు చరణాలనూ మనదేశంలో ప్రఖ్యాతి గాంచిన 39 మంది గాయక గాయణీమణులతో పాడించారు. (మనం మామూలుగా పాడుకునే జాతీయగీతంలో మొదటి చరణం ఒక్కటే పాడతాం మనం.) క్రింద యూట్యూబ్ లింక్ లో ఉన్నది అదే.. మన జాతీయగీతం మొత్తం ఐదు చరణాలతో! అందరు గొప్పగొప్ప కళాకారులను ఒక్కసారి చూసేసరికీ మనసు పులకించిపోయింది. మీరూ చూడండి..


   


 ఇది కాక ఇంకా టాగూర్ రచనలు కొన్నింటిని బెంగాలీలో పాడించి, మధ్య మధ్య ఆంగ్లంలో అనువాదం కూడా చెప్పారు. సంతూర్, గిటార్, పియానో, సితార్, తంబురా మొదలైన సంగీతవాయిద్యాలతో ఎంతో సాంత్వనగా అనిపించింది వింటుంటే. భాష అర్థం కాకపోయినా వినడానికి హాయిగా ఉన్నాయా పాటలు. పాట వెంట వినిపించిన అనువాదం కూడా అందంగా చేసారు. మొత్తం పన్నెండు ట్రాక్స్ నీ క్రింద లింక్ లో వినచ్చు: 
http://gaana.com/music-album/jaya-hey-49524


పదవ ట్రాక్ నాకు బాగా నచ్చేసి చాలా సార్లు విన్నాను. నెట్లో వీటికి అర్థాలు వెతుకుతుంటే ఇవి రెండు వేరు వేరు సాహిత్యాలని తెలిసింది. ఏం చేసారంటే, "అజు సఖి ముహు ముహు" అనే సాహిత్యాన్ని పాడిస్తూ, మధ్యలో "భాలోబెసె జోడి సుఖ్ నాహీ" అనే సాహిత్య అనువాదాన్ని చెప్పించారు. అలా ఎందుకు చేసారో తెలీదు కానీ నాకు అవి రెండూ కూడా చాలా నచ్చేసాయి. టాగూర్ కి మనసులోనే మరోసారి అంజలి ఘటించాను.

"aju sakhi muhu muhu" అసలు సాహిత్యం - 

আজু সখি , মুহু মুহু
গাহে পিক কুহু কুহু ,
কুঞ্জবনে দুঁহু দুঁহু
      দোঁহার পানে চায় ।
যুবনমদবিলসিত
পুলকে হিয়া উলসিত ,
অবশ তনু অলসিত
      মূরছি জনু যায় ।
আজু মধু চাঁদনী
প্রাণউনমাদনী ,
শিথিল সব বাঁধনী ,
      শিথিল ভই লাজ ।
বচন মৃদু মরমর,
কাঁপে রিঝ থরথর ,
শিহরে তনু জরজর
      কুসুমবনমাঝ ।
মলয় মৃদু কলয়িছে ,
চরণ নহি চলয়িছে ,
বচন মুহু খলয়িছে ,
      অঞ্চল লুটায় ।
আধফুট শতদল
বায়ুভরে টলমল
আঁখি জনু ঢলঢল
      চাহিতে নাহি চায় ।
অলকে ফুল কাঁপয়ি
কপোলে পড়ে ঝাঁপয়ি ,
মধু-অনলে তাপয়ি ,
      খসয়ি পড়ু পায় ।
ঝরই শিরে ফুলদল ,
যমুনা বহে কলকল ,
হাসে শশি ঢলঢল —
      ভানু মরি যায় ।

అర్థం ఇక్కడ చదవుకోండి.


***

తర్వాత రెండవది: "Bhalobese Jodi Sukh Nahi

ভালোবেসে যদি সুখ নাহি
তবে কেন-
তবে কেন মিছে ভালোবাসা ।
মন দিয়ে মন পেতে চাহি ।
ওগো, কেন-
ওগো, কেন মিছে এ দুরাশা ।।
হৃদয়ে জ্বালায়ে বাসনার শিখা,
নয়নে সাজায়ে মায়ামরীচিকা,
শুধু ঘুরে মরি মরুভূমে ।
ওগো, কেন-
ওগো, কেন মিছে এ পিপাসা ।।
আপনি যে আছে আপনার কাছে
নিখিল জগতে কী অভাব আছে ।
আছে মন্দ সমীরণ, পুষ্পবিভুষণ,
কোকিলকুজিত কুঞ্জ ।
বিশ্বচরাচর লুপ্ত হয়ে যায়,
একি ঘোর প্রেম অন্ধ রাহুপ্রায়
জীবন যৌবন গ্রাসে ।
তবে কেন-
তবে কেন মিছে এ কুয়াশা ।।

 ప్రేమ వల్ల కలిగే హృదయభారాన్నీ, వేదనను కూడా ఇంత అందంగా చెప్పడం ఒక్క టాగూర్ కే చెల్లిందేమో అనిపించింది వింటుంటే..
సీడీలో వినిపించిన ఆంగ్ల అనువాదం ఉన్నదున్నట్లు ఇక్కడ రాస్తున్నా..

IF there is nothing but pain in loving
Then why is this love?
What folly is this to claim her heart
Because you have offered her your own!
With the desire scorching your blood
And madness glowing in your eyes
Why is this mirage in a desert?

He craves for nothing in the world
Who is in possession of himself;
The sweet air of the spring time is his,
The flowers, the bird songs;
But love comes like a hungry shadow
destroying the whole world,
Then why seek this mist that darkens life?


Amour Aju Sakhi Muhu Muhu 
singer: suresh wadkar



Saturday, September 14, 2013

ఓ చిన్న స్కెచ్..


ఓ చిన్న స్కెచ్.. చాలా రోజులకి..

Woman with Tambura



Monday, September 2, 2013

చలువపందిరి: “కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్”




శైలేంద్ర, శంకర్-జైకిషన్, రాజ్ కపూర్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో అద్భుతమైన పాటలూ, సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఒక చిత్రం “अनाड़ी (1959)”. అనారీ సినిమాలో మొత్తం ఏడు పాటలు. ఇందులో “బన్ కే పంఛీ గాయే ప్యార్ కా తరానా” పాట తప్ప మిగిలినవన్నీ శైలేంద్ర రాసినవే. ‘దిల్ కీ నజర్ సే’, ‘వో చాంద్ ఖిలా వో తారే హసే’, ‘బన్ కే పంఛీ’ (ఈ పాట ఒక్కటి 'హస్రత్ జైపురి' రాసారు), ‘తేరా జానా’, ’1956, 1957, 1958..’, ‘సబ్ కుచ్ సీఖా హమ్నే’, ‘కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్..’ అన్నీ వేటికవే అన్నట్లుంటాయి. “సబ్ కుచ్ సీఖా హమ్నే నా సీఖీ హోషియారీ” పాటకి సాహిత్యానికి శైలేంద్రకూ, పాడినందుకు ముఖేష్ కూ రెండు ఫిలిం ఫేర్ అవార్డ్ లు వచ్చాయి. ఈ ఏడు పాటల్లో “కిసీ కి ముస్కురాహటోం పే హొ నిసార్” పాటను గురించే ప్రస్తుతం నే చెప్పబోయేది..

ఈ పాట గురించిన మిగతా కబుర్లు ఇక్కడ:
http://vaakili.com/patrika/?p=3779


Wednesday, August 28, 2013

కృష్ణం వందేజగద్గురుమ్




వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకి పరమానందం కృష్ణం వందేజగద్గురుమ్ ll

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం కృష్ణం వందేజగద్గురమ్ ll








Tuesday, August 27, 2013

తెల్ల మందారం..







కొద్దిపాటి గులాబీరంగు కలిసిన తెల్ల మందారం..  
దశలవారీగా ఇలా విచ్చింది:-)













దేవుడికి పెట్టి తీసేసాకా, మర్నాటికి కూడా ఇంకా వాడలేదని 
ఇలా నీళ్లల్లో వేసా :-)

Wednesday, August 21, 2013

'మరువ’పు పరిమళాలకి ఆప్తవాక్కులు...


పుస్తకావిష్కరణకు వెళ్ళలేకపోయినా కాపీ పంపే ఏర్పాటు చేసి, నాకీ సదవకాశాన్ని ఇచ్చిన  స్నేహమాధురి ఉషగారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..



అనుభూతులు అందరికీ ఉంటాయి. వాటికి అక్షరరూపాన్ని ఇవ్వటం కొందరికి సాధ్యమే కానీ ఆ అక్షరాలకు కవితారూపాన్నివ్వటం మాత్రం అతికొద్దిమందికే సుసాధ్యమౌతుంది. అందుకు భాష మీద పట్టు, భావావేశాలను అందమైన పదగుళికలుగా మార్చగల నేర్పూ అవసరం. ఉషగారి కవితలు చూసి అందమైన కవితాకదంబాలను నేర్పుగా అల్లగల అక్షర గ్రంధాలయమేదో ఈవిడ చేతుల్లోనో, వ్రేళ్ళలోనో ఉందేమో అనుకునేదాన్ని. జీవన రహస్యాలని కాచి వడబోసారేమో అని కూడా అనిపిస్తుంది ఉషగారి కవితలు చదివినప్పుడల్లా! తాత్విక చింతన, జీవితం పట్ల ప్రేమ, సున్నితమైన హృదయం, ప్రకృతారాధన, పుత్రవాత్సల్యం, మాతృభూమి పట్ల మమకారం.. అన్నింటినీ మించి తెలుగు భాష పట్ల అభిమానం కనిపిస్తాయి ఉషగారి రచనల్లో. వీటన్నింటికీ కవిత్వంలో తనకు గల అభినివేశాన్ని రంగరించి ఆమె అందించిన కవితాకదంబమాలల్ని రోజులు, నెలలు తరబడి ఆస్వాదించే అవకాశం బ్లాగ్లోకం ద్వారా మా మిత్రులందరికీ లభించింది. "మరువం" బ్లాగ్ ద్వారా తాను అందించిన ఈ కవితాసుమాలతో మరోసారి ఇలా మిత్రులందరికీ కనువిందు చేయాలని సంకల్పించటం ముదావహం.


అనుభవం నేర్పిన పాఠాలను మరువకుండా, బ్రతుకుబాటకు వాటిని నిచ్చెనగా చేసి విజయాలను అందుకున్న విజేత ఈమె. "లెక్కలు", "నిక్షిప్త నిధి", "బహుదూరపు బాటసారి", "జీవితం" మొదలైన కవితలు తన అనుభవసారాన్ని తెలుపుతాయి. "గమనాల గమకం", "గోడ మీద నీడలు", "కల కాలం", "శృతిలయలు", "నిను చేరక నేనుండలేను", "ఏకాకి", "నిర్వచనం", "గాయం" మొదలైన కవితలు అంతరాంతరాల్లోని అంతర్మధనానికి, తాత్విక దృష్టికోణానికీ ప్రతీకలు. "అక్షరమా నీకు వందనం" అని వాగ్దేవికి అక్షరాంజలి ఘటించి, "మహాశ్వేతం" అంటూ శ్వేతవర్ణాన్ని రారాణిని చేసి, "మంచుపూల పేరంటాన్ని" కళ్ళకు కట్టి, "పిచ్చుక"తో "ఆనందహేల" నందించిన కవితావాణి మా ఉషారాణి. "శీర్షిక పెట్టాలనిపించకపోయినా", "వలపుల వానచికులు" చిలకరించినా, "కవి హృదయాన్ని" ఆవిష్కరించినా ఈమెకే సాధ్యం అని తప్పక అనిపిస్తాయి ఆమె అక్షరాలు !


ఉషగారి కవిత్వంలో నచ్చనిదేదంటే చెప్పటం కష్టమే అయినా కవితాశీర్షికలు కొన్నింటికి వేరే పేరు ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది నాకు. రాయగలిగే అవకాశం, శక్తి ఉన్నంతవరకూ తను రాస్తూ ఉండాలని నా కోరిక.
అందరికీ సౌలభ్యం కాని ప్రతిభాపాటవాల్ని చేతిలో దాచుకోవటమే కాక తన బ్లాగ్ ను కూడా దాచేయటమే నాకు ఈవిడలో అస్సలు నచ్చని సంగతి! కవిత్వాన్ని చదివి ఆస్వాదించటమే తప్ప విశ్లేషించి, విమర్శించేంతటి జ్ఞానం లేకపోయినా ఈ నాలుగుమాటలు రాసే అవకాశాన్ని సహృదయతతో అందించిన స్నేహశీలి ఉషగారికి నా కృతజ్ఞతాభినందనలు.

- తృష్ణ.

Monday, August 12, 2013

తప్పెవరిది?


మొన్న ఒకతని గురించి తెలిసింది. అలా చేయటానికి అతనికేం హక్కు ఉంది? అని మనసు పదే పదే ప్రశ్నిస్తోంది..


ముఫ్ఫైఏళ్ళు కూడా నిండని ఒక కుర్రాడు. ఇంట్లో అతను ఆడింది ఆట పాడింది పాట. ఉద్యోగాలు వద్దని ఓ వృత్తి చేపట్టాడు. అంతవరకూ బానే ఉంది. రకరకాల స్నేహాలు చేసాడు. వెళ్ళేది సరైన మార్గం కాదని అతన్నెవారూ వారించలేదు. పిల్లని వెతికి పెళ్ళి మాత్రం చేసారు. ఇప్పుడు ఏడాది నిండని చిన్నబాబు కూడా ఉన్నాడు.


కుటుంబం ఏర్పడ్డాకా భార్యాబిడ్డల శ్రేయస్సు గురించి ఆలోచించాలి కదా! తన అల్లరిపనులు భార్యాపిల్లల్ని ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తాయో అన్న ఆలోచన ఉండాలి కదా? కానీ అతనికి ఆ ధ్యాసే లేదు. బాధ్యతలేని పనులకు అంతే లేదు. అతని నిర్లక్యం వాల్ల ఇంతకు ముందు అతనికి రెండుసార్లు ఏక్సిడెంట్లు అయ్యాయి. వారమేసి రోజులు ఐసియులో ఉండి బయట పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మొన్నటికి నిన్నటి రోజున అంటే రెండురోజుల క్రితం రాత్రిపూట బైక్ మీద ఎక్కడికో వెళ్ళివస్తూ ఓ హైవే మీద మళ్ళీ ఏక్సిడెంట్ అయ్యిందిట. వెనుక ఉన్న అతనికి కాలు,చెయ్యి విరిగాయిట. ముందర ఉన్న ఈ కుర్రాడికి చెయ్యి ఫ్రాక్చర్, తలలో బలమైన గాయాలు. అసలు ఏక్సిడెంట్ ఎలా అయ్యిందో తెలీదు. ఏ చెట్టుకో గుద్దుకున్న దాఖలాలు లేవుట. మత్తులో ఉన్నారేమో అని అనుమానం. ఎప్పటికి చూసారో, ఎవరు చేర్చారో తెలీదు ఒక పెద్ద హాస్పటల్లో చేర్చారు. ఒకరోజంతా కోమాలో ఉన్నాడు. తర్వాత తలకీ, చేతికి సర్జరీలు చేసారుట. రెండుమూడు రోజులైతే కానీ ఏమీ చెప్పలేమంటున్నారుట డాక్టర్లు. తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య, తోబుట్టువులు, స్నేహితులు అంతా హాస్పటల్లో అయోమయంగా పరుగులు! నీళ్ళలా ఖర్చవుతున్న డబ్బు! ఆశ ఉందో లేదో తెలిసినా హాస్పటళ్ళవాళ్ళు చెప్పరు కదా!!


ఇందరి ఆందోళనకు కారణం ఎవరు? అతన్ని అదుపులో పెట్టుకోని తల్లిదండ్రులదా? వాళ్ళిచ్చిన స్వేచ్ఛని సమంగా వాడుకోలేని అతనిదా? తప్పని తెలిసీ చిక్కుల్లో పడేవారు క్షమించదగ్గవారేనా? తప్పు ఎవరిదైనా ఇప్పుడు ఏడాది నిండని బాబు, ముఫ్ఫైఏళ్ళైనా నిండని భార్య, ఆమె తల్లిదండ్రులు ఎంత అయోమయంలో ఉంటారు? అసలు మొత్తం బంధువర్గాన్ని ఇబ్బంది పెట్టే హక్కు అతనికి ఉందా? అయ్యో పాపం అనుకోవటానికి ఇదేమీ పొరపాటున జరిగిన ప్రమాదం కాదుగా! ఇంతకు ముందు రెండుసార్లు ఇలానే అయ్యిందిగా! కానీ ఈసారి ఇంకాస్త సీరియస్ ప్రమాదం.. తనచుట్టూ ఉన్నవాళ్ళకే కాదు అతనికీ అవధే కదా! ఏమో.. ఏమౌతుందో తెలీదు.. కానీ ఆ పసివాడి కోసమన్నా అతను కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.


హైవే ఖాళీగా ఉందికదా అని స్పీడ్ డ్రైవింగ్ చేసేసేవారు ఇప్పటికన్నా కాస్త కంట్రోల్లో ఉంటే బాగుండు..
డ్రైవింగ్ చేసేప్పుడు మత్తులో లేకుండా ఉంటే బాగుండు...
భార్యాపిల్లలున్నవాళ్ళు ఏదైన సాహసమో, మన్మానీ యో చేసే ముందర నాకేదన్నా అయితే నావాళ్ళేమవుతారు? అని ప్రశ్నించుకుంటే బాగుండు...


Wednesday, August 7, 2013

రవీంద్రగీతం: "హింసోన్మత్తమ్ము పృథ్వి.."



రజనిగారిచే తెలుగులోకి అనువదించబడిన రవీంద్రగీతాలను గురించి గతంలో రాసాను. ఆ టపా లింక్: 
http://samgeetapriyaa.blogspot.in/2012/05/blog-post_10.html

ఇవాళ రవీంద్రుడి వర్థంతి సందర్భంగా మరొక అనువాదగీతాన్ని వినిపిద్దామని. ఇది కూడా రజనీకాంతరావు గారు అనువదించినదే. "హింసోన్మత్తమ్ము పృథ్వి.."(hingshey unmatto) అని పాట. ఈ పాట రాసిన కాలంలో ప్రపంచంలోని శోకానికీ, హింసకీ, దుర్మార్గాలకీ చింతిస్తూ, జగతికి శాంతిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ టాగూర్ ఈ పాటను రాసారు. ఈ గీతం విన్నప్పుడల్లా నాకు ఏమనిపిస్తుందంటే అప్పటి హింసకూ, ఘోరాలకు ఆయన అంతగా తల్లడిల్లపోయారే; అసలు అయన ఇప్పటి ఘోరాలను, కలికాల ప్రకోపాలనూ, హింసా ప్రవృత్తులను చూస్తే అసలు ఎలా స్పందించి ఉండేవారా..? అన్న ప్రశ్న కలుగుతుంది. 


తెలుగులో ఈ గీతం: 

 

ఈ గీతాన్ని ఆడియో ఇక్కడ వినవచ్చు: 
http://www.dhingana.com/hingsay-unmatto-prithibi-song-rabindranath-tagore-songs-by-debabrata-biswas-bengali-34bd131


ఈ రవీంద్రగీతానికి నృత్యరూపం:



mesmerizing 'Rekha Bharadwaj' !





కొన్ని పాటలు వినగానే ఎంతో నచ్చేస్తాయి. పాటలో మనకి నచ్చినది పాడిన విధానమా, సాహిత్యమా, సంగీతమా అన్నది పట్టించుకోకుండానే ఆ నచ్చిన పాటల్ని మళ్ళీ మళ్ళీ వినేస్తూ ఉంటాము. అలా నాకు నచ్చి ఎక్కువగా నే విన్న కొన్ని హిందీ పాటలు .. 'మాన్సూన్ వెడ్డింగ్' లో గేందా ఫూల్, 'యే జవాని హై దివాని'లో కబీరా, 'బర్ఫీ 'లో ఫిర్ లే ఆయా, 'సాత్ ఖూన్ మాఫ్' లో డార్లింగ్, 'Ishqa Ishqa' album లోని తెరే ఇష్క్ మే, 'డి డే' లో ఎక్ ఘడి... వీటన్నింటిలో డి డే లో ఎక్ ఘడి ఈమధ్య బాగా వింటుంటే ఈ పాటలన్నింటిలో నాకు బాగా నచ్చినదేమిటో తెలిసింది.. అది "రేఖా భరద్వాజ్" స్వరం. 


వినే కొద్ది వినాలనేలా, తియ్యగా, అందంగా, కాస్తంత హస్కీగా, సుతారంగా, రాగయుక్తంగా, కాస్త హిందుస్తానీ శాస్త్రీయసంగీతపు రంగుపులుముకున్న ఆమె గొంతు నన్ను బాగా కట్టిపడేసింది. ఒక్కమాటలో మెస్మరైజింగ్ అనచ్చు! గుల్జార్ స్వయంగా ఆమె ఆల్బంకు లిరిక్స్ రాస్తానని చెప్పరంటే ఎంత ఇంప్రెస్ అయిఉంటారో ఆమె గాత్రానికి అనిపించింది. గత వారం రోజులుగా నెట్లో రేఖ పాడిన పాటలన్నీ వెతుక్కుని వెతుక్కుని వింటున్నా! ఓహో ఇదివరకు నాకు నచ్చిన పాటలన్నీ ఈవిడ వాయిస్ వల్ల అంతగా నచ్చాయన్నమాట అనుకుంటున్నా! రేఖ భరద్వాజ్ ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత, సినీదర్శకుడు విశాల్ భరద్వాజ్ భార్య అని వికీలో  చదివి ఇంకా ఆనందించా! "మాచిస్" పాటలు విన్నప్పటి నుండీ విశాల్ నా ఫేవొరేట్ మ్యూజిషియన్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అతని పాటలు బాగా నచ్చుతాయి నాకు. ఆ ఒక్క సిన్మా పాటలు చాలు తన టాలెంట్ తెలియటానికి. అందులో "పానీ పానీ రే" I, "ఛోడ్ ఆయే హమ్ వో గలియా.."  రెండూ నాకెంతో ప్రియమైన పాటలు. భార్యభార్తల్లో ఒకరు ఒక గాయని, ఒకరు స్వరకర్త. ఎంత చక్కని కాంబోనో :) 


హిందీలో రేఖ పాడినవి చాలా తక్కువ పాటలు. వాటిల్లో తొంభై శాతం భర్త విశాల్ స్వరపరిచిన పాటలే అయినా చాలావరకూ మంచి పాటలు ఎంపిక చేసుకుందనే చెప్పాలి. తన వాయిస్ వినగానే శాస్త్రియ సంగీతంలో బాగా శిక్షణ ఉన్నట్లు తెలిసిపోతుంది. మ్యూజిక్ స్టూడెంట్ ట మరి ! అన్ని రకాల పాటలకు కాక కొన్ని ప్రత్యేకమైన పాటలకే తన వాయిస్ బాగా సూట్ అవుతుంది. అలాంటివే ఆమె పాడింది కూడా. "ఇష్కియా" లో పాటకు బెస్ట్ ఫీమేల్ సింగర్ ఫిల్మ్ ఫేర్ ను కూడా అందుకుంది. రేఖ ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలనీ, గొప్ప గాయనిగా పేరు పొందాలని కోరుకుంటున్నాను.. 


హిందుస్తానీ సంగీతం నచ్చేవాళ్ళకు రేఖ వాయిస్ నచ్చుతుంది. నాకులా ఇష్టంగా వినేవాళ్ళెవరైనా ఉంటారని రేఖా భరద్వాజ్ పాడిన కొన్ని పాటల లింక్స్ క్రింద ఇస్తున్నాను: 

ఈ పాట ఎంత రమ్యంగా ఉందో వినండి... 
1) Ab Mujhe Koi - Ishqiya - Vishal Bhardwaj 

 


2) Ek Woh Din Bhi - Chachi 420 - Vishal Bhardwaj 
http://www.youtube.com/watch?v=WdRrO19p5_0 


3) Ye Kaisi Chaap Jahan Tum Le Chalo Vishal Bhardwaj 
http://www.youtube.com/watch?v=-6YOmSxiq4E 


4) Rone Do Maqbool - Vishal - Bhardwaj 
http://www.youtube.com/watch?v=38GwCykLckE 


5) Laakad - Omkara - Vishal Bhardwaj 
http://www.youtube.com/watch?v=Zl_cIeqJxJg 


6) Sadiyon Ki Pyaas  - Red Swastik - Shammir Tandon
http://player.raag.fm/player/?browser=flash&pick[]=191951


7) jaan veh   -  Haal–e–dil  -  Vishal Bhardwaj
 http://www.youtube.com/watch?v=wze4xOsO7JY 


 8) Kabira - Yeh Jawaani Hai Deewani - Pritam 
http://www.youtube.com/watch?v=m7poxLIFrVk 


9) Ranjha Ranjha - Raavan  - A.R.Rahman
 http://www.youtube.com/watch?v=-SwraHOtsLU 


 10) Namak Ishq Ka Omkara Vishal Bhardwaj
 http://www.youtube.com/watch?v=BVJ-tJ34bzQ 


 11) tere bin nayi lagda 
 http://www.youtube.com/watch?v=H4T6QSSpD-k 


12) Darling - 7 Khoon Maaf  - Vishal 
http://www.youtube.com/watch?v=kZCAb5XXn6s 


14) Kabira Yeh Jawaani Hai Deewani Pritam
 http://www.youtube.com/watch?v=m7poxLIFrVk 


15) wakt ne jo beej boya - Sadiyaan - adnan sami
http://www.youtube.com/watch?v=89ccypfyG2Y


గుల్జార్ ,విశాల్,రేఖ ల మ్యుజికల్ ఆల్బమ్ "ఇష్కా ఇష్కా" లో గుల్జార్ రాసిన పాటలన్నీ బాగుంటాయి. 
అందులోవి: 
16) tere ishq mein Ishqa Ishqa album 
http://www.youtube.com/watch?v=yhAl-29SBQ8 

17) raat ki jogan Ishqa Ishqa album 
http://www.youtube.com/watch?v=Y9ruX1Nu2m8 


18) Badi Dheere Jali  - Ishqiya - Vishal Bhardwaj

   


19) Phir Le Aaya Dil Barfi Pritam




 20) D-Day - Ek ghadi - Shankar-Ehsaan-loy 



21) Behne do - Shala - Alokananda dasgupta

Thursday, August 1, 2013

చలువపందిరి : रिमझिम गिरॆ सावन





వర్షాకాలంలో ఓ మంచి వానపాటను తలుచుకోకుంటే ఎలా?! వాన పాటలు అనగానే బోలెడు గుర్తుకొచ్చేసాయి.. 
ऒ सजना बरखा बहार आई, 
भीगी भीगी रातॊं मॆं, 
ऎ रात भीजी भीगी, 
प्यार हुआ इकरार हुआ हैं, 
सावन कॆ झूलॆ पडॆ हैं..तुम चलॆ आओ, 
आहा रिमझिम कॆ यॆ प्यारॆ प्यारॆ गीत लियॆ, 
रिमझिम कॆ तरानॆ लॆकॆ आई बरसात, 
रिम झिम रिमझिम रुमझुम रुमझुम, 
रिमझिम गिरॆ सावन, 
ऒ घटा सावरी, 
आज रपट जायॆ तो.., 
एक लड्की भीगी भागी सी… 
ఇలా బోలెడు వాన పాటలు..!
'చలువపందిరి'కి ఏది రాద్దామా అనుకుంటుంటే, “रिमझिम गिरॆ सावन” పాట నన్ను పట్టుకు వదల్లేదు. ‘సరే సరే.. ఈసారి నీ గురించే రాస్తాలే’ అని ఆ పాటకి మాటిచ్చేసా. 

 ఈ పాట గురించిన కబుర్లు వాకిలి పత్రికలో : 
http://vaakili.com/patrika/?p=3542 


పాట ఇక్కడ చూసేయండి..

 .

Monday, July 29, 2013

రహస్య గూఢచారులకు నివాళి - D-Day



 Yes, its a tribute to all our secret agents who risk their lives for the sake of our country. Their sacrifices are worthy, but the saddest part is that they die unknown. మనకు తెలిసి దేశం కోసం పోరాడేది దేశ సైనికులైతే, తెలియకుండా దేశాన్ని రక్షించే రహస్య గూఢచారులు ఎందరో ఉంటారు. చాలామంది చేసే త్యాగాలు ప్రజలకు తెలియకుండానే ఉండిపోతాయి. దేశ రక్షణ కోసం తమ జీవితాలను పణంగా పెట్టే అటువంటి గుర్తు తెలియని వీరుల కోసం ఒక్కసారి తప్పక చూడాలి అనిపించే సినిమా D-Day! 


కజిన్స్ అందరూ కలవాలని ప్లాన్ చేసుకుని ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసారు. శనివారం రాత్రి షో, అదీ సీరియస్ మూవీ అనేసరికీ నాకు కొంచెం బోర్ గా అనిపించింది. కానీ అందరిని కలవాలనే ఉద్దేశంతో ఓకే చెప్పేసి బయల్దేరాం. హాఫ్ హర్టెడ్ గా సిన్మా హాల్లో కూచున్న నేను మూవీ మొదలైన పదినిమిషాల్లో బాగా లీనమైపోయాను. ఆసక్తికరమైన కథనంతో, చక్కని ఏక్షన్ సన్నివేశాలతో, చివరిదాకా ఉత్కంఠం రేపుతూ సాగింది సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. 


'నిఖిల్ అద్వానీ' దర్శకత్వం వహించిన ఐదు(?) సినిమాల్లో నేను 'Kal ho naho', 'salaam-e-ishq'.. రెండే చూసాను. ఆ రెండుంటికన్నా ఎన్నో రెట్ల పరిపక్వత కనపడింది ఈ సినిమాలో. చిన్నప్పటి దూరదర్శన్ సిరియల్స్ రోజుల్నుండీ ఇర్ఫాన్ ఖాన్ మంచినటుడన్న అభిప్రాయం. సినిమాల్లోకొచ్చాకా అతని ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది అనుకుంటుంటాను నేను. నటినటులందరూ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. నలుగురు సీక్రెట్ ఏజంట్లుగా ఇర్ఫాన్, అర్జున్ రాంపాల్, హ్యూమా ఖురేషీ, కొత్త నటుడు సందీప్ కులకర్ణీ; గోల్డ్ మాన్ 'ఇక్బాల్ సేఠ్' గా రిషి కపూర్, ఇర్ఫాన్ వైఫ్ గా వేసిన అమ్మాయి అందరూ కూడా పోటీపడి నటించారా అనిపించింది. ముఖ్యంగా అర్జున్ రామ్ పాల్ చాలా బాగా చేసాడు. ఇర్ఫాన్ ఖాన్ ఫ్యామిలితో ఉండే సీన్స్ ఇమోషనల్ గా ఉన్నాయి.


ఊహించని మలుపులు తిరుగుతూ కథనం సాగిన తీరు బాగుంది. ఉద్వేగానికి లోనైనా చివరిసమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు వాలీ ఖాన్(ఇర్ఫాన్ ఫాన్). క్లైమాక్స్ లో ఇక్బాల్ ఖాన్(రిషి కపూర్), రుద్ర్ (అర్జున్ రామ్ పాల్) ఇద్దరూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.. ఆలోచింపజేస్తాయి. నాజర్ బాగా చేసాడు, కష్టపడి తన డైలాగ్స్ తనే చెప్పుకున్నాడు కానీ అతని హిందీ ఏక్సెంట్ పూర్ గా ఉంది. డబ్బింగ్ చెప్పించాల్సింది లేదా అతనొక సౌత్ ఇండియన్ ఆఫీసర్ అని చూపించాల్సింది. శృతి హాసన్ రోల్ చిన్నదే అయినా బాగా చేసింది. అయితే కథకు ఏ మాత్రం ఉపయోగపడని ఆ పాత్ర అనవసరమేమో అనిపించింది. ఇక సినిమాలో ఉన్న మరో మెరుపు 'రాజ్ పాల్ యాదవ్'. కమిడియన్ గా పేరుపొందిన రాజ్ పాల్ తన నటనాకౌశలాన్ని mein meri patni aur woh ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో "దమాదమ్ మస్త్ కలందర్" పాడే ఉత్సాహావంతమైన గాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తాడు. 


'శంకర్-ఎహ్సాన్-లాయ్' అందించిన నేపధ్యసంగీతం బాగుంది. సీరియస్ మూవీలో పాటలు ఎందుకసలు అనిపించింది. "అల్విదా" పాట సాహిత్యం బాగుంది కానీ శృతి మరణవిధానాన్ని తెలిపే నేపథ్యంలో ఆ పాట పెట్టడం నాకైతే నచ్చలేదు. సంగీత దర్శకుడు 'విశాల్ భరద్వాజ్' భార్య 'రేఖ భరద్వాజ్' పాడిన "ఏక్ ఘడీ" పాట నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది. ఆ రెండు పాటల లింక్స్ క్రింద ఇస్తున్నాను... 

 alvida 

ek ghadi 


'D-Day' tralier:

 


Friday, July 26, 2013

నాగార్జున కొండ - ఎత్తిపోతల జలపాతం



నాగార్జున సాగర్ వెళ్ళొచ్చి దాదాపు నెల అయిపోతోంది. ఇప్పటికన్నా బ్లాగ్ లో రాసుకోపోతే మర్చిపోతాను కూడా! జూన్ నెలాఖరులో వరంగల్ ట్రిప్ కన్న ముందరే సాగర్ వెళ్ళాము. వేటూరి గారి "జీవన రాగం" లో నాగార్జున కొండ వర్ణన చదివినప్పటి నుండీ అక్కడికి వెళ్ళాలని నా కోరిక. ఒకానొకరోజు పొద్దున్న ఎనిమిదింటికి బస్సు ఎక్కాం. మంచి డీలక్స్ బస్స్ దొరికింది. ఓ రెండు సిన్మాలు కూడా చూసాం. ఇప్పుడు ఆర్.టి.సి. బస్సులో శాటిలైట్ మూవీసేట. సరే, పన్నెండింటికి నాగార్జునసాగర్ చేరాం. బస్సు దిగాకా, చుట్టుపక్కల తిరగటానికి ఓ ఆటో మాట్లాడుకున్నాం. నాగార్జున కొండ కి వెళ్ళే మోటర్ బోటు రోజుకి రెండు ట్రిప్లు వేస్తుందిట. మధ్యాహ్నం రెండింటికి వేసేది లాస్ట్ ట్రిప్ ట. మేం చేరేసరికీ పన్నెండయ్యింది కాబట్టి భోజనం చేసి ముందు నాగార్జున కొండ కి వెళ్ళే రెండింటి బోటు ఎక్కుదామనుకున్నాం. దారిలోనే నాగార్జున డామ్ చూసేసాం. అప్పటికింకా వర్షాలు ఎక్కువగా పడట్లేదు కనుక రిజర్వాయిర్ లో నీళ్ళు లేవు.






బోట్ ఎక్కే ప్రదేశం దగ్గరే ఏ.పి.టూరిజం ఆఫీసు,గెస్ట్ హౌస్ ఉన్నాయి. ముందు కాస్త టిఫిన్ తినేసి టికెట్ కొనటానికి నుంచున్నాం. వీకెండ్స్ లొ బిజీగా ఉండే ఈ ప్రాంతానికి జనం లేకపోతే అప్పుడప్పుడు ట్రిప్ కాన్సిల్ చేస్తుంటారుట. జనాన్ని చూసే ట్కెట్లివ్వడం మొదలుపెడతారు కాబోలు. రెండున్నరకేమో టికెట్ళుచ్చారు కానీ బోట్ మూడింటికి గానీ రాలేదు. ఈలోపూ అక్కడే ఉన్న బెంచీల మీద కృష్ణమ్మని, నీలాకాశాన్ని, తెల్లని మబ్బుల్నీ చూస్తూ కూచున్నాం. మూడేళ్ళ తర్వతేమో కృష్ణమ్మని దగ్గరగా చూడ్డం.. ఆ నోళ్లని అలా చూస్తూంటే ఏదో కొత్త ప్రాణం నాలో ప్రవేశించినట్లు అనిపించింది. నాకు గోదారమ్మ దేవకి,  కృష్ణమ్మ యశోద మరి ! నల్లని నీళ్ళు..చూట్టూరా కొండలు.. ఎండవేళైనా ప్రశాంతంగా ఉంది అక్కడ. మూడింటికి మోటార్ బోటు వచ్చింది. పాపికొండలు బోట్ ట్రిప్ లాగానే ఈ నాగార్జున కొండ బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్పీకర్లు,పాటలు మొదలైన హంగామా కూడా లేదు. బోటు, నీళ్ళు, గాలి హోరు, దురంగా కనబడే కొండలు, వాటిపై పచ్చదనం, ఆకాశం, మనం అంతే.






 బోటు స్టార్ట్ అయిన కాసేపటికి మా పక్కగా ఎగురుతున్న ఓ పక్షిని చూసి చాలా సరదాపడ్డాం. చూడ్డానికి గోరింకలాగ ఉంది. తెల్లని పక్షి, నల్లని తల, పొడుగాటి పసుపచ్చ ముక్కు. కానీ ఒడ్డుకి దూరంగా ఈ నీళ్ళలో అంత కష్టపడి ఎందుకు వస్తోందో తెలీలా. నీళ్ల దగ్గరగా రావడం మళ్ళీ పైకెగిరిపోవడం. తమాషా అనిపించింది. కాసేపటికి మరో నాలుగు పక్షులు కనబడ్డాయి ఇలానే ఎగురుతూ.. వాటికి ఫోటోలు తీస్తూ అలా కాసేపు గడిచాకా అవి నోళ్లు తెరుచుకు ఎగరడం గమనించాను. అప్పుడు అర్థమైంది అవి చేపల కోసం వస్తున్నాయని. నోరు తెరుచుకుని నీళ్ళ దగ్గరగా వచ్చి ఠక్కున చేపను పట్టుకుని వెళ్పోతున్నాయి. వాలటానికి ఏమీ లేని నీటి మధ్యకు వచ్చి వెతికి వెతికి అలా చేపను పట్టడం ఎంత కష్టమో అసలు..! అలా వాటిని చూస్తూండగానే నాగార్జున కొండ దగ్గర పడింది. టైం నాలుగైంది. కృష్ణానది మధ్యలో ఉన్న ఆ చిన్నద్వీపం లో ఏముందో చూడాలని మనసు తొందరపడింది.


నాగార్జునకొండ:

ఈ నాగార్జున కొండ ప్రాంతంలోనే "మహాయాన బుధ్ధిజ"మనే బౌధ్ధమత శాఖ పుట్టి పెరిగిందట. కనిష్కుల పాలనలో మహాయానబౌధ్ధమతానికి బాగా ఆదరణ ఉండేదిట.  తర్వాత ప్రముఖ బౌధ్ధాచార్యుడు 'ఆచార్య నాగార్జున' పర్యవేక్షణాలో ఈ మతం బాగా ప్రచారాన్ని పొందిందని, పూర్వం 'శ్రీపర్వత'మని పిలిచే ఈ కొండ ప్రాంతంలోనే ఆచార్యుడు నివసించారు కాబట్టి ఆయన పేరుపైనే ఈ ప్రాంతాన్ని నాగార్జున కొండ అనే పిలుస్తారు. ఈయన శాతవాహనుల కాలం వారని అంటారు. బౌధ్ధమతం బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో చాలా బౌధ్ధారామాలు ఉండేవిట. కాలక్రమంలో ఆ నిర్మాణాలన్నీ కృష్ణమ్మఒడిలో చేరిపోగా కొన్ని కట్టడాలనూ, వస్తువులనూ పురావస్తు శాఖవారు త్రవ్వకాల ద్వారా వెలికి తీసి ఈ నాగార్జున కొండ మీద మ్యూజియంలో భద్రపరిచారు.


పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న అందమైన ఉద్యానవనం దాటి వెళ్తే లోపల మ్యూజియం ఉంది. రాతి యుగానికీ, కనిష్కులకాలానికీ ,శాతవాహనుల కాలానికి చెందిన కట్టడాల నమూనాలూ, శిల శాసనాలు, విగ్రహాలు, బౌధ్ధ నిర్మాణాలు, శకలాలు మొదలైనవి అక్కడ ఉన్నాయి. ఎప్పటివో కదా..చాలా వరకు విగ్రహాలు శిధిలమైపోయి ఉన్నాయి:( ఎంతో శ్రమ కూర్చి ఆ శిధిలాలన్నీ అక్కడికి చేరవేసినట్లు తెలుస్తోంది. లోపల కొందరు విద్యార్థులు అక్కడ కూచుని ఏవో వివరలు రాసుకుంటున్నారు కూడా. గబ గబా మ్యూజియం చూసేసి చుట్టూరా ఉన్న ఉద్యానవనం కూడా చూద్దామని బయల్దేరాం. ఓ పక్కగా మూలకి క్యాంటీన్ ఉంది. అక్కడ నుంచి కృష్ణానది వ్యూ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. సూర్య కిరణాలూ, మబ్బుల వెలుగునీడలతో మిలమిలా మెరుస్తున్న నీళ్ళు, చుట్టూరా గీత గీసినట్లు ఒకే హైట్ లో ఉన్న కొండలు.. మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న బెంచి మీద చాలా సేపు కూర్చుండిపోయాం.




 ఆ తర్వాత దిగువన కనబడుతున్న స్నానాలరేవు కి చేరాం. రాజుల కాలంనాటి ఆ కట్టడాలు పాడవకుండా పైన కాస్తంత ఫినిషింగ్ వర్క్ చేసి ఉంచారు మెట్లని. చాలా బాగుంది ఆ కట్టడం. అక్కడ దిగువగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళపై కూర్చుని కృష్ణమ్మనీ, ఆకాశాన్నీ, వెండిమబ్బులనీ చూస్తుంటే ఎంతసేపైనా గడిపేయచ్చనిపించింది. తిరిగి వెళ్ళేప్పుడు మాతో పాటూ మ్యూజియం సిబ్బంది కూడా వచ్చేసారు. రాత్రికి అక్కడ ఇద్దరు గార్డులు ఉంటారుట అంతే. మరి వానా వరదా వస్తే మీరంతా ఇక్కడికి ఎలా వస్తారు  అని సిబ్బందిని అడిగాం.  ఉద్యోగాలు కదా వీలయినంతవరకూ మానకుండా అలానే వస్తాం.. అన్నారు వాళ్ళు. ఐదున్నరకి బయల్దేరితే ఆరున్నరకి మళ్ళీ ఒడ్డు చేరాం.


ఎత్తిపోతల జలపాతం:


ఎలాగైనా ఈ ట్రిప్ లో ఎత్తిపోతల జలపాతం దగ్గరకు వెళ్ళాలని. బోట్ లేటుగా ప్రయాణమైనందున అన్నీ లేటయిపోయాయి. సాగర్ దగ్గర్లో ఉన్న "అనుపు" అనే ప్రదేశాన్ని కూడా చూడాలని కోరిక. కానీ చీకటి పడుతోందని ముందు ఎత్తిపొతల బయల్దేరాం. మాకు దొరికిన ఆటో అతను కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. అరగంటలో ఎత్తిపోతల జలపాతం వద్దకు చేరాం. ఖాళీగా ఉంది ప్రదేశం. కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ప్రతి కోతీ విచిత్రంగా పిల్లకోతుల్ని వీపుపైనో, పొట్టక్రిందో అంటిపెట్టుకుని నడుస్తున్నాయి. చంద్రవంక కొండల్లో నుండి ఈ జలపాతం ప్రవహిస్తూ వచ్చి, ఇక్కడి నుంచి కిందకు జారి కృష్ణానదిలో కలుస్తుందిట. మేం వెళ్ళేసరికీ సరిగ్గా సూర్యాస్తమయం అయ్యి చీకట్లు ముసురుతున్నాయి. గలగల మనే నీటి చప్పుడు.. జలపాతం దగ్గరపడేకొద్దీ హోరు ఎక్కువైంది. తెల్లని నీళ్ళు అలా పైనుండి జలజల పడుతుంటే భలేగా అనిపిచింది. కొద్దిగా పక్కగా మరొక చిన్న జలపాతం ఉంది. అసలు జలపాతాలే చాలా అద్భుతమైన దృశ్యాలు. ఇంతకు మునుపు చిన్న చిన్న జలపాతాలని చూశాను. అన్నింటికన్నా ఇదే పెద్దది. ఇప్పుడు అనుమతివ్వట్లేదుట గానీ ఇదివరకూ క్రిందకు వెళ్లనిచ్చేవారుట.



అక్కడ కొద్ది దురంలో దత్తాత్రేయుడి గుడి ఉంది. క్రిందకు బాగా నడవాలి. మీకు ఆలస్యమైపోతుంది పైగా చీకట్లో పాముపుట్ర ఉంటాయి. వద్దన్నాడు ఆతోఅతను. సర్లేమ్మని ఇక బస్టాండ్ కు బయల్దేరాం. మధ్యలో సత్యనారాయణస్వామి గుడి ఉంది. అక్కడ ఆగి స్వామిని దర్శించుకుని, బస్టాండ్ చేరేసరికీ ఎనిమిదవుతోంది. పొద్దున్న వచ్చేప్పుడు దొరికినట్లు డీలక్స్ బస్ దొరుకుతుందేమో అని ఎదురుచూస్తు కూర్చున్నాం. మధ్యలో రెండు మామూలు బస్సులు వచ్చాయి కానీ మేం ఎక్కలేదు. ఖాళీ అయిపోతున్నా ఆ ప్రాంతంలో కూర్చోటానిక్కూడా భయమేసింది నాకు. తొమ్మిదిన్నర దాటి పదవుతూండగా వచ్చింది డీలక్స్ బస్సు. ఊరు చేరేసరికీ ఒంటిగంట. అక్కడ్నుంచీ ఎం.బి.ఎస్ వచ్చేసరికి రెండు. మధ్యలో రెండు మూడు పోలీస్ స్టేషన్లు వస్తాయి.. భయం లేదని తను చెప్తున్నా, పార్క్ చేసిన బండి తీసుకుని ఇంటికి వెళ్తుంటే భలే భయమేసింది నాకు. దారి పొడుగునా క్షణక్షణంలో శ్రీదేవిలా దేవుడా దేవుడా.. అనుకుంటూ కూర్చున్నా:) ట్రాఫిక్ లేకపోవడం వల్ల మామూలుగా గంటపట్టే రూట్ లో అరగంటకే ఇల్లు చేరాం! 'అనుపు', ఎత్తిపోతల దగ్గరున్న 'దత్తాత్రేయస్వామి గుడి' చూట్టానికి మళ్ళీ వెళ్ళాలి.. ఎప్పటికవుతుందో...!!


ఈ ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడచ్చు: