సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, April 15, 2011

శక్తివంచన లేకున్న వృధా అయిన 'శక్తి'


'Art for art's sake' అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడది art for the sake of competition అయిపోయింది. చక్కని ప్రతిభ ఉన్నప్పుడు దాన్ని సమంగా సద్వినియోగపరుచుకుంటే ఎంత బావుంటుంది? అర్ధంపర్ధం, తలా తోకా లేని కథా-కథనాల జోలికి పోయి ప్రతిభను వ్యర్ధం చేసుకుంటే ఉపయోగం ఏమిటి? కావల్సినంత సమయం, కావాల్సిన బడ్జెట్, సాంకేతిక నైపుణ్యం ఇన్ని చేతిలో ఉన్నా కూడా అంతా వృధాపోతూంటే చూస్తూండటం కూడా బాధకరమే. ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. కానీ ఎవరినో అనుకరించాలనో , అధిగమించాలనో ప్రయత్నించటం ఒక నటుడి స్థాయిని ఒక మెట్టు దించేస్తుందే తప్ప పెంచదు.

అసలు పోటీ ఎందుకు? ఎవరి సామర్ధ్యం వారిది. ఒక నటుడికి ఉన్న సామర్ధ్యాన్ని బట్టి అందుకు తగిన కథలు ఎన్నుకుని, ఆసక్తికరమైన కథనాన్ని తయారుచేసుకుంటే ఎదురుంటుందా? సులువైన విషయాన్ని ఎందుకు సినిమా తీసేవాళ్లు అర్ధం చేసుకోరు? పూర్వం గ్రాఫిక్స్, ఇంతటి సాంకేతిక నిపుణత ఉన్నాయా? విఠలాచార్య సినిమాలు అద్భుతంగా ఉండేవి కాదా? జనాలు ఇష్టపడి చూసేవారు కాదా? అప్పుడీ గ్రాఫిక్స్ గట్రా ఉండి ఉంటేనా హాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు తీసి ఉండేవారు మనవాళ్ళు. ఇప్పుడు తీయాలన్నా ఆనాటి దర్శకనిర్మాతలకున్న నేర్పూ, కౌశల్యం ఈనాడు కొరవడ్డాయి. ఉపయోగించుకోవటానికి తగినన్ని సాంకేతిక ఉపకరణాలున్నా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీయలేకపోవటం నిజంగా దురదృష్టకరం.

మొన్న ఒక పాత జానపద సినిమా చూస్తూంటే అనిపించింది ఎలాంటి గ్రాఫిక్స్, హంగామా లేకుండానే అతి మామూలు కథలతోనే అద్భుతాలు సృష్టించారు ఒకప్పటి మన తెలుగు సినీదర్శకులు. ఇప్పుడు మాత్రం కథలకేం కొరవ? ఓపిగ్గా వెతుక్కుంటే బోలెడు కథలు. పోనీ తీసుకున్న కథనే ఆసక్తివంతమైన రీతిలో తీయొచ్చు కదా? అదీ లేదు. గ్రాఫిక్స్ గొప్పగా వాడేయాలనో, లేదా మరొకరి కంటే ఘనంగా తీసేయాలనో తపన తప్పించి, కాస్త మనసుపెట్టి ఉన్న ఉపకరణాలను సఫలీకృతంగా ఉపయోగించుకుందామన్న ఇంగితం ఎందుకు కలగదో అర్ధం కాదు.

ఘోషంతా క్రితంవారాంతంలో ఒక కొత్త సినిమా చూసినప్పటినుండీ నా బుర్రలో తిరుగుతోంది. హీరో యువనటుల్లో మంచి ఎనర్జీ, సామర్ధ్యం ఉన్న నటుడని నా చిన్న బుర్రకు ఎందుకనో నమ్మకం. అబ్బాయి పాత సినిమాలు చూడ్డానికి భయమేసి ఏమీ చూడలేదు కానీ నాలుగు సినిమాల పూర్వం ఒక విజయవంతమైన హిట్ ఇచ్చినప్పటి నుంచీ ఇతగాడంటే కాస్తంత అభిమానం ఏర్పడిందనే చెప్పాలి. కాని తర్వాత నేను ఆశించిన ఎదుగుదల ఎంత మాత్రం అతని కెరీర్ లో కనబడలేదు. కొత్త సినిమాకు క్రితం వచ్చిన ఇతగాడి రెండు సినిమాలూ చూసి నేను అత్యంత నిరుత్సాహానికి లోనయ్యాను. అయ్యో మంచి శక్తి, సమర్ధత ఉన్న కుర్రవాడే..శ్రమంతా వృధాగా పోతోందే అని. అతని సినిమాల ఎన్నికలో లోపమో, తీసేవాళ్ల లోపమో, "ఇమేజ్" అనబడే ఒక మూసలో కూరుకుపోయిఉన్నాడో అతనికే తెలవాలి.

కొత్త సినిమా ప్రచారాన్ని చూసి ఇదయినా పడిపోతున్న అతని స్థాయిని నిలబెడుతుందేమో అని ఆశ పడ్డాను. అతను శక్తివంచన లేకుండానే నటించాడు. కానీ మిగతావే కాస్త అటుఇటు అయ్యాయి. ప్చ్... ఇదే దారిలో వేళ్తే తెలుగు ప్రేక్షకులు అతన్ని మర్చిపోవటానికి ఎక్కువ సమయం పట్టదు అనిపించింది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే జనాలు పోటీగా తీసారంటున్న చిత్రానికి దీటుగా నిలిచి ఉండేది సినిమా. పైగా సినిమాలో మళ్ళీ కాస్తంత బరువు పెరిగాడేమో అనిపించింది. మొహంలో కూడా మునుపటి కళ తగ్గింది. ప్రశాంతంగా లేదు. నాకులాగే అతని కొత్త సినిమాలు వరుసగా గమనించిన ఎవరికైనా తప్పక ఇలా అనిపిస్తుంది. సినిమాలో ఒకే ఒక పాట నాకు నచ్చింది. సంగీతసాహిత్యాలు, గ్రాఫిక్స్, హీరోయిన్...అన్నీ బాగున్నాయి. " మనసుపై చల్లావోయీ మంత్రాల సాంబ్రాణి.." అని భలే ప్రయోగం చేసారు రామజోగయ్యశాస్త్రిగారు. ఇంకొక పాట చూడ్డానికి బోర్ గా, సందర్భోచితంగా లేదు కానీ బీట్ బాగుంది.

ఇకముందైనా కుర్రాడిని సమంగా ఉపయోగించుకుని, అతని ప్రతిభకు తగ్గ సినిమాలు రావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను.


గమనిక: ఇది ఎవరినీ కించపరచలని రాసినది కాదు. సగటు ప్రేక్షకురాలిగా ఒక మంచి నటుడి శక్తి వృధా అవుతోందన్న ఆవేదన మాత్రమే.

Thursday, April 14, 2011

పయనం






నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో

నిదుర రాని చీకటిపొద్దులో
చక్కిలి జారే ఎన్ని నిట్టుర్పుచుక్కలో

అలుముకున్న గాఢనిద్రలో
ఎన్నియలలో ఎన్ని కలలో

రెప్పపాటులో దూరమయ్యే దీవెనలు
ఎడారిలో ఒయాసిస్సులు

గుండెను భారం చేసే దిగుళ్ళు
దాచినా దాగని వాస్తవాలు

ఆపినా ఆగని కన్నీళ్ళు
గట్టుదాటి పొంగే నదీతీరాలు

రెక్క విప్పుకుని నింగికెగసే చిరునవ్వులు
రూపు మారిన సీతకోకచిలుకలు

కలవరం లేని రేపటికోసం ఎదురుచూపు
నింగికెగసిన ఆశాసౌధం

నిరాశను అశాంతం చిదిమేసే మనోనిబ్బరం
ఇప్పుడే కళ్లుతెరిచిన పసికందు

ఎన్ని మలుపులు తిరిగినా దొరకదు గమ్యం
అందని జాబిలిలా

నిరంతరం భాషిస్తూనే ఉంటుంది అంతరాత్మ
ఘోషించే సాగరంలా

ఎన్ని నిరాశలు ఎదురైనా ఓడదు మనసు
అలుపెరుగని అలలా

నాకై నేను అన్వేషించుకునే పయనంలో
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటమిలో

Wednesday, April 13, 2011

"गमन" సినిమాలో పాటలు





ప్రసిధ్ధ సంగీత దర్శకులు "జైదేవ్" స్వరపరిచిన "గమన్" సినిమాలో రెండు పాటలు చాలా బాగుంటాయి. ఫారూఖ్ షేక్, స్మితా పాటిల్, జలాల్ ఆగా, గీతా సిధ్ధార్థ్ ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకు ముజఫ్ఫర్ అలీ గారు దర్శకలు, నిర్మాత. ఇది ఆయన మొదటి చిత్రం. ప్రఖ్యాతిగాంచిన "ఉమ్రావ్ జాన్" సినిమా కూడా ఈయన దర్శకత్వంలో వచ్చినదే.


1978 లో రిలీజైన ఈ సినిమాకు 1979లో రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లు వచ్చాయి. "జైదేవ్" గారికి ఉత్తమ సంగీతదర్శకులు అవార్డ్, "ఆప్ కీ యాద్ ఆతీ రహీ" పాటకు గానూ గాయని "ఛాయా గంగులీ" గారికి "బెస్ట్ ఫీమేల్ సింగర్" అవార్డ్ లభించాయి.


song: सीनॆ मॆं जलन
singer: suresh Wadkar
lyrics: Shahryar
Music: Jaidev





సాహిత్యం:

सीनॆ मॆं जलन आंखॊं मॆं तूफान सा क्यॊं हैं?
इस शहर मॆं हर शक्स परॆषान सा क्यॊं हैं?


दिल है तॊ धडक्नॆ का बहाना कॊयी ढूंढॆं
पथ्थर की तर हा बॆहीसा बॆजान सा क्यूं है?


तन्हाई की यॆ कैन सी मंजिल हैं रफीका
ता-हद्द-यॆ-नजर ऎक बयाबान सा क्यॊं है?


क्या कॊइ नयी बात नजर आती है हम मॆं
आईना हमॆं दॆख कॆ हैरान सा क्यूं है?

0000000000000000000000000000000000000000000000

song: आप की याद आती रही
singer: Chaaya Ganguly
lyrics: మఖ్దూం మొహియుద్దీన్
Music: Jaidev




సాహిత్యం:

आप की याद आती रही रात भर
चश-मॆ-नम मुस्कुराती रही रात भर


रात भर दर्द की शम्मा जल्ती रही
गंम की लौ थर्थराती रही रात भर


बांसुरी की सुरीमी सुहानी सदा
याद बन बन कॆ आती रही रात भर


याद कॆ चांद दिल में उतरतॆ रहॆ
चींदनी जग्मगाती रही रात भर


कॊई दीवाना गलियॊ मॆं फिरता रहा



000000000000000000000000000000

ఈ చిత్రం లోనిదే మరొక పాట -

song: अजीब सा नॆहा मुझ पर
singer: hariharan
lyrics: Shahryar
Music: Jaidev


कॊई आवाज आती रही रात भर

అమ్మ గుర్తొస్తుంది..

 
ఎండలో గొడుగు వేసుకుని డాబాపై ఒడియలు పెడుతుంటే
అమ్మతో ఒడియాలు పెట్టిన రోజు గుర్తొస్తుంది

భోజనాలయ్యాకా డైనింగ్ టేబుల్ సర్దుతున్నప్పుడు
"కాస్త కంచాలు తీసిపెటట్టచ్చు కదా, గిన్నెలు వంటింట్లో పెట్టవే"
అన్న అమ్మ కసుర్లు, ఒకోసరి బ్రతిమాలడo గుర్తుకొస్తుంది

కాస్త ఖర్చులటూఇటూ అయిన నెలలో
బజార్లో వెళ్తున్నప్పుడు
పాప అడిగిందేదైనా కొనలేనప్పుడూ
నేనడిగినప్పుడు డబ్బులివ్వలేదని
అమ్మని తిట్టుకున్న రోజులు జ్ఞాపకమొస్తాయి


వండిన కూర నచ్చలేదని పాప అలిగినప్పుడు
అమ్మ వంటకు పెట్టిన వంకలు జ్ఞాపకమొస్తాయి

కష్టపడి వండిన కూర పడేయలేక ఫ్రిజ్ లో పెట్టినప్పుడు
"అలా పెట్టకపోటే పడేయొచ్చు కదా"
అని అమ్మను వేళాకోళం చేసిన మాటలు గుర్తుకొస్తాయి

ఒంట్లో బాలేకపోయినా తప్పక పనిచేయాల్సొచ్చినప్పుడు
నన్ను ఒక్క పనీ చెయ్యనివ్వకుండా
అన్నీ తనే చేసుకున్న అమ్మ జ్ఞాపకమొస్తుంది

ఏదన్నా తేడా వచ్చినప్పుడు
నోరు మెదపలేకపోయినప్పుడు
చిన్నమాటకే అమ్మపై అరవటం జ్ఞాపకమొస్తుంది

కొన్ని చిక్కులు ఎదురైనప్పుడు..
అమ్మతో చెప్పలేకపోయినప్పుడు
శ్రీవారినీ ఇబ్బందిపెట్టలేననిపించినప్పుడు
స్నేహితులవద్ద లోకువవకూడదని పంచుకోలేనప్పుడు..
ఇలాంటప్పుడు అమ్మ ఎలా నెట్టుకువచ్చిందో అనిపిస్తుంది

మల్లెపూలు కడుతూంటే మాల విడిపోయినప్పుడు
ఎడచేత్తోనే చకచకా మాలకట్టేసే అమ్మ గుర్తుకొస్తుంది

అల్లరి చేసిందని పాపను కేకలేస్తూంటే
వాళ్ళనాన్న వెన్కేసుకొచ్చినప్పుడల్లా
నన్ను నాన్న వెన్కేసుకొస్తున్నారని
అమ్మ కోప్పడిన వైనం గుర్తుకొస్తుంది

ఆరేళ్ల కూతురిని చూసి
'అమ్మో ఎదిగిపోతోంది' అని నే బెంగపడినప్పుడు
పెళ్ళిడుకొచ్చిన నన్ను చూసినప్పుడల్లా
అమ్మ ఎంత బెంగపడేదో కదా అనిపిస్తుంది

ఇలా ఎన్నెన్నో సందర్భాల్లో
ఇంకెన్నో వందల సార్లు
అమ్మ గుర్తుకొస్తూనే ఉంటుంది
ఇంకా బాగా అర్ధం అవుతూనే ఉంటుంది..

Tuesday, April 12, 2011

నాకిష్టమైన రాముని పాటలు



ఎందుకంటే చెప్పలేను కానీ నాకు రాముడంటే చాలా ఇష్టం. ఇవాళ శ్రీరామనవమి కదా నాకిష్టమైన రాముని పాటలు పెడదామని చూస్తే ఎక్కడ మొదలెట్టాలో తెలీలేదు. భద్రాచల రామదాసు కీర్తనలు(ఇవి నాకు బోల్డు ఇష్టం) పెట్టాలా? త్యాగరాజ కీర్తనలు పెట్టాలా? లేదా నాకు నాకిష్టమైన రామునిపై ఉన్న సినిమా పాటలు పెట్టాలా? నాగయ్యగారి త్యాగయ్య పాటలు పెట్టాలా? లవకుశ లో పాటలు పెట్టాలా? ఆలోచన ఎంతకూ తెగలేదు...! ఆఖరికి సినిమా పాటలే పెట్టాలని నిర్ణయించుకున్నా. ఈ క్రింద ఉన్నవి సినిమాల్లో నాకు నచ్చిన రామునిపై పాటలు. ఆసక్తి ఉన్నవాళ్లు వినండి..చాలా అయిపోతాయని క్రింది పాటల్లో త్యాగయ్య లోవి(all songs), లవకుశ లోనివీ(రామన్న రాముడు,రామ సుగుణధామ , సందేహించకుమమ్మా, వినుడు వినుడు ,విరిసె చల్లని వెన్నెల) కలపటం లేదు.

1)మనసెరిగినవాడు _ పంతులమ్మ

2)శ్రీరామ నామాలు శతకోటి _ మీనా

3)నీ దయ రాదా _ పూజ

4)మరుగేలరా _ సప్తపది

5)ఊరికే కొలను నీరు _ సంపూర్ణ రామాయణం


6)రామయతండ్రి ఓ రామయ తండ్రి _ సంపూర్ణరామాయణం

7)నను బ్రోవమని _ రామదాసు(నాగయ్య)

8)అందాల రాముడు ఇందీవర శ్యాముడు _ ఉయ్యాల జంపాల

9) శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి - సీతారామ కల్యాణం

10)రామా కనవేమిరా _ స్వాతిముత్యం

11)సుధ్ధ బ్రహ్మ పరాత్పర రామా _ శ్రీరామదాసు

12)రామ రామ రామ _ శివమణి

13)రాయినైనా కాకపోతిని _ గోరంత దీపం. పాటలో దు:ఖమున్నా ఉపమానాలు బాగుంటాయి.

ఇంకా, పదములె చాలును _ బంగారు పంజరం, ఏమి రామ కథ శబరీ శబరీ _ భక్త శబరి.. ఈ రెండు పాటల లింక్స్ దొరకలేదు..:(

--------------------

చివరిగా, ఆహిర్ భైరవి రాగంలో ఉన్నికృష్ణన్ పాడిన "పిభరే రామరసం"

భద్రాచల కల్యాణంలో సీతారాముల "ఇంగ్లీష్" పేర్లు ??






టివీలో వస్తున్న భద్రాచల కల్యాణంలో సీతారాముల మెడలో వేసిన దండలపై ఇంగ్లీష్ లో "sita, rama" అన్న పేర్లు చూసి సిగ్గువేసింది.

అక్కడ కల్యాణానికి,రాష్ట్ర సాంస్కృతిక శాఖకు సంబంధించిన సభ్యులు, రాష్ట్ర తెలుగుభాషాభివృధ్ధి కోసం కృషిచేస్తున్న సభ్యులు మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొందరైనా ఖచ్చితంగా కల్యాణానికి విచ్చేసే ఉంటారు. కల్యాణానికి కావాల్సినవస్తువులు సమకూర్చుకుని, వాటిని మన సంస్కృతికి తగినట్టుగా సమకూరాయా లేదా అని ముందుగా సరిచూసుకోవాల్సిన బాధ్యత భద్రాచల దేవస్థాన అధికారిక మండలి వారిది.

ఇలా ఇంగ్లీషులో సీతారాముల పేర్లు దండలపై రాసినా, వేసినా ఎవరూ నిరసన ప్రకటించకపోవటం తెలుగు జాతి సిగ్గుపడాల్సిన విషయం.



Monday, April 11, 2011

కొన్ని కాపీ(తెలుగు) పాటలు - వాటి ఒరిజినల్ పాటలు


తెలుగు సామెతలు ఎంతో సందర్భోచితంగా భలేగా ఉంటాయి. 'తీగెలాగితే డొంకంతా కదిలిందని' ఎవరన్నారో కానీ భేషుగ్గా చెప్పారు. గోలీమార్ చిత్రం లోని "మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు" పాట గురించి సంగీతప్రియ బ్లాగ్లో టపా పెడదామని ఆ పాట గురించిన చిన్న వెతుకులాట చేసేసరికీ యూట్యూబ్ లో మరెన్నో తెలుగు కాపీ పాటలు వాటి ఒరిజినల్ ట్యూన్స్ బయట పడ్డాయి.

వీటిల్లో కొన్ని పాటల ఒరిజినల్స్ తెలుసు కానీ ఇన్ని ఒరిజినల్స్ ఉన్నాయని తెలీదు.
 యూట్యూబ్లో ఆ పాటలు పెట్టిన "03aparajita"గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీటిల్లో కొన్ని కాపీలని తెలుసు కానీ తెలియనివి చాలానే ఉన్నాయి. మీరూ ఓ చూపు వేసేయండిక్కడ:


"మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు.." పాట మాతృక




ఈ మధ్యన టివీలో "గోలీమార్" సినిమా వస్తుంటే చూసాను. రెండు పాటలు నచ్చాయి. మొదటిది "గుండెల్లో ఏదో సడి..".మ్యూజిక్ చాలా బాగుంది. స్టార్టింగ్లో గిటార్, ఇంటర్లూడ్ బిట్స్ ,సాహిత్యం అన్నీ కూడా బాగా కుదిరాయి కానీ కనీసం మేల్ వాయిస్ అయినా చక్రికి బదులు వేరెవరినైనా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది పాట అనిపిస్తుంది విన్నప్పుడల్లా. ఇక రెండో పాట "మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు". ఇది సినిమా చూస్తున్నప్పుడు వినగానే ఇదేదో కాపీ పాటండీ అన్నాను శ్రీవారితో. కానీ అసలు పాట ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ట్యూన్ ఒక్కటీ హమ్ చేస్తూ కూడా చాలా సార్లు ప్రయత్నించాను కానీ గుర్తు రాలేదు.




ఈ పాట డౌన్లోడ్ చెద్దామని లింక్ వెతుకుతూంటే యూట్యూబ్లో అసలు పాట దొరికింది. 1999 లో వచ్చిన "మన్"(అమీర్ ఖాన్, మనీషా కొయిరాలా) సినిమాలో "నషా ఏ ప్యార్ కా నషా" పాట. ఎప్పటి పాటో..బావుంటుంది విందాం మళ్ళీ... అని ఈ హిందీ పాట కోసం వెతుకుతూంటే అది కూడా కాపీ అని, అసలు మాతృక 1980ల్లోని Toto Cutugna పాట "L'Italiano" అని తెలిసింది. ఈ మూడూ కలిపి ఉన్న ఒక లింక్ దొరికింది. నాకులా తెలియనివాళ్ళు ఉంటే ఈ అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ పాటను చూసేయండి...(ఒరిజినల్ లోంచికాపీ, కాపీ లోంచి మరోటి కాబట్టి అలా రాసానన్నమాట..:))




తెలుగులో చక్రి స్వరపరిచిన ఈ పాటను యువగాయని గీతా మాధురి పాడారు.'ఉదిత్ నారాయణ్' హిందీలో పాడిన ఈ పాటకు 'సంజీవ్ దర్శన్' స్వరాలను అందించారు.




ఇక తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఈ పాటల వేటలో నాకు మరో గొప్ప కాపీ పాటల లింక్ దొరికింది. దాని   గురించి తృష్ణ బ్లాగ్లో చూడండి.

Saturday, April 9, 2011

Standing ovation and three cheers to "Anna hazare"



డభ్భై ఒకటేళ్ళ ఉద్యమకర్త ఇరవై ఏళ్ల యువకుడి కన్నా ఉత్సాహవంతుడు. శక్తివంతుడు. వారం రోజుల్లో నాయకుల గుండెల్లో గుబులు పుట్టించి, యావద్దేశాన్నీ తన నినాదానికి గొంతు కలిపేలా చెయ్యగలిగాడు. నా దృష్టిలో కండలు తిరిగిన సినీ హీరోల కన్నా వెయ్యిరెట్లు ఆరాధించయోగ్యమున్నవాడు. దేశం మొత్తాన్ని కదిలించిన సంఘ సంస్కర్త ఋణాన్ని విధంగా మనం తీర్చుకోగలం? అతనే నిలబడకుంటే లోక్పాల్ బిల్లు ఆమోదాన్ని పొందేదా?

ఎవరో ఒకరు ఇలా నిలబడితేనే వెనుక నుంచి మరో పదివేల చేతులు నిలబడతాయేమో...నేనూ వెనుక నిలబడే మందలో ఒక మేకనే..! ఇలాంటి ఎందరో అన్నా హజారేలు ప్రతి గ్రామానికీ ఒక్కడు ఉంటే మన దేశం నిజంగా స్వర్ణభారతమయిపోదూ..?!
"... into that heaven of freedom, my father, let my country awake."


నా మనసులో పొంగిపొర్లుతున్న ఆనందానికీ, దేశంలోని ఇవాళ్టి విజయోత్సాహానికీ కారకుడైన మహామనీషికి నా పాదాభివందనం. Standing ovation and three cheers to "Anna hazare".


అన్నా హజారే గురించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి: http://www.annahazare.org/