ఎప్పుడెప్పుడా అని ప్రతి ఏడూ ఎదురు చూసే రోజు నిన్న వచ్చింది. ఊళ్ళో హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ మొదలయ్యింది. ప్రతి జనవరి చివరి వారంలో మూడు నాలుగుగురోజులు నగరంలో జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పూలమొక్కలు, కాయగూరలు, రకరకాల చెట్లూ, బోన్సాయ్ మొక్కలూ, ఎరువులూ, మొక్కల కుండీలు, వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు మొదలైనవి ప్రదర్శనకూ, అమ్మకానికి పెడతారు. ఎప్పుడు మొదలుపెట్టారో తెలీదు కానీ నేను మొదటిసారి తొమ్మిది,పదేళ్ల క్రితం అనుకుంటా Hitex Exhibition Centre లో ఈ హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ చూసాను. అప్పుడు కేవలం మొక్కలు మాత్రమే ప్రదర్శనకూ, అమ్మకానికి ఉండేవి.
పువ్వులు..పువ్వులు..పువ్వులు...
రంగురంగుల పువ్వులు.. గులాబీలు..చామంతులు...మందారాలు...
రకరకాల ఆకులు... చుట్టూరా పచ్చదనం...
రకరకాల cactus లు, crotons, రంగురంగుల orchids..మత్తెక్కించే లిల్లీ పూలూ...
ఇంకా...గుబులంతా పోగొట్టి కబుర్లాడేవి..
నవ్వులు పూయించేవీ.. ఆహా అనిపించేవీ...
మైమరపించే పువ్వులు...అన్నీ చూసి మైమరచిపోయాను..!!
ఇప్పుడు మూడేళ్ళనుంచీ మిస్సవకుండా ఈ ప్రదర్శనకు వెళ్తున్నాను. ప్రదర్శన లోనూ చాలా మార్పులు వచ్చేసాయి. తినుబండారాల స్టాల్, ఓ పుస్తకాల స్టాల్, ఓ ఐస్క్రీం స్టాల్.. ఇలా కొత్త కొత్తవి ఇందులో కలిసాయి. ఇంకా నయం natural flower colours తో డిజైన్ చేసిన బట్టలు అంటూ ఓ బట్టల కొట్టు కూడా పెట్టారు కాదు అనుకున్నా..! ఈసారి ప్రదర్శన కన్నా నిరుడు ఇంకాస్త బావుంది అనిపించింది. "ఫ్లవర్ ఎరేంజ్మెంట్" కి ప్రత్యేకం ఓ స్టాల్ ఉండేది. ఈసారి ఉండి కానీ చాలా చిన్నది. నాలుగైదు రకాలకన్నా ఎక్కువ లేవు. పైగా అన్నీ రొటీన్ గా ఉన్నాయి. ఏదేమైనా చుట్టూరా రకరకాల పువ్వులు, పచ్చదనం కాస్తంత ఉన్నా మనసుకు ఆహ్లాదం, చికాకుల్లోంచి కాస్తంత మైమరుపు పుష్కలంగా దొరుకుతాయి. అలా చూసుకుంటే ఈసారి కూడా ఆ ఆనందం నాకు దక్కింది.
క్రితం ఏడాది ఇలాంటి ఆర్టిఫీషియల్ పువ్వుల ఫోటోలు ఇక్కడ పెట్టాను.
ప్రదర్శనలొ నాకు అస్సలు నచ్చనిది ఈ పూల మొక్కలను మోసే కూలీలు. ఆడవాళ్ళు కూడా బుట్ట కావాలా అని తిరుగుతు ఉంటారు పాపం. జనాలు శుబ్భరంగా మొక్కలు కొనేసుకుని ప్రదర్శన అంతా ఇలా వెనక్కాల తలలపై మొక్కలు మోసే కూలీలతొ తిరగటం నాకెందుకో నచ్చదు...పాపం అనిపిస్తుంది.
అన్నింటికన్నా నచ్చిన మొక్క ఇది. క్రితం సారి ప్రదర్శనలోఇదే పేద్ద చెట్టు పెట్టారు .
ఈ Expo లో జనాలను ఆకర్షిస్తున్న మరొక స్టాల్ "అరోవా" అనే హెర్బల్ టీ స్టాల్. ఈ హెర్బల్ టీ బాలాజీ ఆయుర్వేదిక్ ఫార్మసీ వాళ్లదిట. పాలు,పంచదార ,కెఫిన్,టీ ఆకులు లేకుండా కేవలం సొంఠి, మిరియాలు, పిప్పలి, జీరక, ధనియాలు,లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, వాము, కుంకుమపువ్వు మొదలైనవాటితో ఈ హెర్బల్ టీ తయారు చేసారుట. నిమ్మరసం, తేనె కలిపి వేడి వేడిగా స్టాల్ వాళ్లు ఇచ్చిన ఈ టీ(Rs.5/-) నాక్కుడా బాగా నచ్చింది.
ఇంతకీ ఏమీ కొననేలేదు నిన్న. మళ్ళీ వెళ్ళాలి కొనటానికి...!!
క్రితం ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ ఫోటోలు: