మన స్నేహితుల్లో కొందరు మిత్రులు మనకు దగ్గరగానే ఉన్నా మనం వాళ్ళను నిర్లక్ష్యం చేస్తాము. పెద్దగా పట్టించుకోము. కాలం గడుస్తున్న కొద్దీ ఎవరిది వీడిపోయే అల్ప స్నేహమో, ఎవరిది చివరిదాకా వెన్నంటి నిలిచే నీడో అర్ధం అవుతుంది. అదృష్టం ఉంటే వాళ్ళు ఇంకా దగ్గరలోనే నిలబడిఉంటారు. అలా నేనూ చాలా ఆలస్యంగా గుర్తించిన ఒక మంచి స్నేహితురాలి గురించి ఈ టపా.
తన పేరు "జయ". నా కాలేజ్ మేట్. నా జూనియర్. రోజూ కాలేజీకి వెళ్ళే సిటీ బస్సులో మొదలైన మా పరిచయం స్నేహంగా మారటానికి మూడేళ్ళు పట్టింది. గాఢంగా మారటానికి ఇంకొన్నేళ్ళు పట్టింది. మొదట్లో తను నా జూనియర్ అన్న చిన్నచూపు... మిగతా స్నేహితులపట్ల ఎక్కువ శ్రధ్ధ ఉండేవి. కాలేజీ బస్ రూట్ లో నాకన్నా నాలుగు స్టాప్ ల ముందర 'వాళ్ళు ముగ్గురూ' ఎక్కేవారు. ఒకరు నా క్లాస్మేట్, నా ప్రాణ స్నేహితురాలు. మిగత ఇద్దరూ మా జూనియర్స్. వాళ్ళు ముగ్గురికీ ఎంతో దోస్తీ ఉండేది. నెమ్మదిగా నా స్నేహితురాలి వల్ల వాళ్ళిద్దరూ నాకు పరిచయం అయ్యారు. నలుగురం కాలేజీలో కలిసి తిరిగేవాళ్ళం. కలిసి లంచ్ తినేవాళ్ళం. సినిమాలకి, ఒకరిళ్ళకి ఒకరం వెళ్ళేవాళ్ళం.
ఒకసారి "జయ" ఇంటికి వళ్ళినప్పుడు తెలిసింది... వాళ్ళ అమ్మగారిదీ రాజమండ్రి అనీ, వాళ్ళ అమ్మగారు, మా పెద్దమ్మ క్లాస్మేట్స్ అనీ, వాళ్ళ మేనమామ నాన్న కొలీగ్ "భట్టుమావయ్యగారు" అని. పెద్దల పేర్లూ, కుటుంబాలూ తెలిసినవే అవ్వటం భలే ఆశ్చర్యం. అప్పటినుండీ మా స్నేహం కాస్త పెరిగింది. మా డిగ్రీ అయ్యాకా నా ప్రాణ స్నేహితురాలు వేరే యూనివర్సిటీలో చేరింది. వాళ్ళ డిగ్రీ అయ్యాకా, జయ ప్రాణ స్నేహితురాలు పెళ్ళయి వేరే దేశం వెళ్ళిపోయింది. జయ కూడా తిరుపతిలో ఎం.ఏ లో చేరింది. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. తను పీజీ అయ్యాకా B.Ed చేసింది. మళ్ళీ విజయవాడ వచ్చి ఓ కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మళ్ళీ రాకపోకలతో స్నేహం పెరిగింది.
సన్నిహిత స్నేహితులు అందరికీ ఉంటారు. అయితే; ఎంత సన్నిహితంగా ఉన్నా, చనువుగా ఒక మాట అనలేని మొహమాటపు స్నేహాలే ఎక్కువ ఉంటూంటాయి. ఎంత స్నేహితులైనా సరే మనల్ని తిడితే అది మనపై ఉన్న అభిమానం వల్ల ఏర్పడిన చనువుతో అన్నారని అర్ధం చేసుకునేవాళ్ళేంతమంది ఉంటారు? జయను మొదట్లో నేనూ అలానే అర్ధం చేసుకోలేకపోయా. ఒకరోజు ఫోనులో మట్లాడుతుంటే జయ ఎందుకో నన్ను బాగా తిట్టింది. నాకు బాగా కోపం వచ్చింది. "మా ఇంట్లో కూడా నన్నెప్పుడూ ఇలా ఎవరూ తిట్టరు. ఇలా మాట్లాడితే నాకు నచ్చదు...అలాఅయితే నాతో మాట్లాడద్దు" అని ఠక్కున ఫోన్ పెట్టేసాను. ఇంకెప్పుడూ తనతో మాట్లాడకూడదు అనుకున్నాను. సరిగ్గా ఒక వారం తరువాత జయ మళ్ళీ ఫోన్ చేసింది. "ఏమ్మా కోపం తగ్గిందా? మాట్లాడతావా నాతో..?" అంటూ అనునయంగా మాట్లాడింది. నేను కొంచెం మెత్తబడినా పొడిపొడిగానే మాట్టడా. కానీ నా నిరసనను పట్టించుకోకుండా తను ఫ్రీగా మట్లాడినందుకు లోపల్లోపల సంతోషపడ్డాను. ఆ తరువాత తన కో లెక్చరర్ ఒకావిడ ద్వారా తనకు పెళ్ళి సంబంధం రావటం, పెళ్ళి అవగానే తను బొంబాయి వెళ్ళిపోవటం త్వరగా జరిగిపోయాయి. అక్కడే ఇంగ్లీష్ లెక్చరర్ గా చెరింది. అప్పుడప్పుడు ఉత్తరలు రాసుకునేవాళ్ళం.
నా పెళ్ళైన కొన్నాళ్ళకు మేము బొంబాయి వెళ్లటంతో మళ్ళీ మా స్నేహం మొగ్గలు తొడిగింది. ఈసారి మాది టీనేజీ స్నేహం కాదు. జీవితాన్ని అర్ధం చేసుకున్న ఇద్దరు మనుషుల స్నేహం. సంసారంలో ఒడిదొడుకులను చవిచూసిన ఇద్దరు స్త్రీల స్నేహం..! పరిచయమైన అన్నేళ్ళకు జయలోని నిజమైన స్నేహితురాలిని నేను అర్ధం చేసుకోగలిగాను. ఇక ఎప్పుడూ మాకు మాట పట్టింపూ రాలేదు..మేము దూరమైంది లేదు. నాలాంటి పిరికి మనిషిని ఒక లోకల్ ట్రైన్, రెండు బస్సులు మారి "thane"లో వాళ్ళ ఇంటికీ; ఒంటరిగా లోకల్ ట్రైన్స్ లో అంధేరీ, దాదర్, గేట్ వే ఆఫ్ ఇండియా మొదలైన ప్రాంతాలకు వెళ్ళగలిగానంటే అది జయ నేర్పిన ధైర్యమే. మేం బొంబాయిలో ఉన్నన్నాళ్ళూ జయ ఇంకా సన్నిహితమైపోయింది. చదువులో జూనియర్ అయినా, సంసారంలో సీనియర్ కావటం వల్ల ఎన్నో సలహాలూ, సూచనలూ ఇప్పటికీ ఇస్తూంటుంది. మేం బొంబాయి వదిలి వచ్చాకా ఇక మాకు ఉత్తరాలు లేవు. ప్రతి వారాంతం లోనూ ఫోనులే. ఇద్దరు పిల్లలు, ఉద్యోగం... ఉరుకులు పరుగుల బొంబాయి జీవితంలో వారంపదిరోజులకోసారన్నా నాకోసం తప్పక సమయం కేటాయిస్తుందని నాకు గర్వం.
ఆ మధ్యన నా ఆరోగ్యం బాలేనప్పుడు జనాల పలకరింపులు పరామర్శలూ వినలేక నేను చాలా రోజులు ఎవరి ఫోన్లు ఎత్తలేదు. జయ ఫోన్ కూడా రెండు మూడు సార్లు తియ్యలేదు. ఒకరోజు తనే మళ్ళీ చేసింది. మామూలు కబుర్లు మాట్లాడుతోంది. నేను ఏదో చెప్పబోయను. తను అంది..."ఏం చెప్పద్దు. అయిపోయిన విషయమే ఎత్తద్దు. మిగతా విషయాలు మాట్లాడు..." అంది. ఏం చెప్పాలో అని సతమతమౌతున్న నాకు తేలిగ్గా అనిపించింది. అంతవరకూ ఫోన్ చేసిన ప్రతివాళ్ళు జరిగిన విషయం తెలుసుకోవాలని ఆరాటపడ్డారు తప్ప అది తలుచుకోవటం వల్ల నేను పడే వేదనను అర్ధం చేసుకోలేకపోయారు. మనల్ని సరిగ్గా అర్ధం చేసుకున్న స్నేహితులు మాత్రమే ఎన్ని కాలాలు మారినా మన పక్కన తోడై నిలబడతారు అనటానికి జయలాంటి స్నేహితులే ఉదాహరణ.
తన గురించి ఒక్కటే నాకు కంప్లైంట్. ఎంతచెప్పినా మైల్స్ రాయటం నేర్చుకోదు. అసలు కంప్యూటర్ అంటే ఆసక్తే లేదు. నిన్న రాత్రి భట్టుమావయ్యగారి మీద రాసిన పోస్ట్ తనతో నెట్లో ఓపెన్ చేయించేసరికీ జుట్టు పీక్కున్నంత పనైంది. నా స్నేహితుల్లో నా బ్లాగ్ ఇప్పటిదాకా చూడనిది తనొక్కర్తే. నెట్ ఆపరేట్ చేయటం నేర్చుకొమ్మని బాగా తిట్టాను. ఇప్పుడు ఏ ఇగోలూ లేకుండా ఒకరినొకరం నిర్మొహమాటంగా తిట్టుకునేంత స్వేచ్ఛ మా స్నేహానిది. మా స్నేహానికిప్పుడు ఇరవైఏళ్ళు. జయకు నేనేమిటో తెలుసు. నాకు తన స్వచ్ఛమైన మనసు తెలుసు. అందుకే జయ నాకు సన్నిహితురాలు....ఎప్పటికీ.
7 comments:
ee post choopinchadaaniki meeru entha juttu peekkovaalo, evaridanna peekalo choodandi.
zindaabad to your friendship.
తృష్ణ గారూ మీరు అదృష్టవంతులు.
కాలానికి నిలబడగల స్నేహాలు చాలా తక్కువ వుంటాయి.నీ స్నేహితులెవరో చెప్పు,నీ గురించి నేను చెపుతాను అనే మాట ఎంత నిజం.ఇలాగే మనం ఒక్కోసారి మన దగ్గరున్నవార్నే గుర్తించలేం.మీ టపా చదువుతుంటే కాలేజ్ రోజులు గుర్తొచ్చి చాలా ఆనందమేసింది.
కలకాలం మీ ఇరువురి స్నేహం ఇలాగే వర్ధిల్లాలి. ఇరువురి స్నేహితుల మధ్య ఉండాల్సిన అవగాహన పుష్కలంగా లభించాక.. ఆ స్నేహాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయరు. ఒకవేళ నిర్లక్ష్యం నెలకొన్నా రెండవ వారు వదలరు కదా!. మీ స్నేహం చాలా చాలా బాగుందండీ!!! .
మీ స్నేహం భలే ముచ్చటగా ఉంది! ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటూ................
స్నేహబంధము
ఎంత మధురము
నిలవాలి కలకాలము.
బావున్నాయండీ మీ జయ కబుర్లు...తను ముగ్గురమ్మాయిల్లో రెండో అమ్మాయని మాత్రం తెలుసు...చిన్నప్పుడు చూశా గానీ నేను వాళ్ళకన్నా చాలా చిన్న అవ్వటంతో పెద్దగా గుర్తు లేదు...వాళ్ళమ్మగారు బాగానే తెలుసు తరచూ పెళ్ళిళ్ళల్లో కలిసేవారు..మా అమ్మగారూ వాళ్ళమ్మగారూ చాలా close...
నెమ్మదిగా ఏర్పడ్డ స్నేహాలే చిరకాలం నిలుస్తాయన్నది నా గట్టి నమ్మకం. మీ టపా చదువుతుంటే కూడా అదే అనిపించింది.
Post a Comment