Saturday, October 26, 2024

లేనేలేదు మన్నింపు !

 

ప్రారబ్ధమో, కర్మో, నిష్కపటమో, తెలియనితనమో.. 

దుస్సంగతో, దురాగతమో, పొరపాటో, వెన్నుపోటో.. 

కారణమేదైనా, పెట్టే పేరులో ఏముంది గానీ.. 

నష్టమెంతో కష్టమైంది, లోతెరగని గాయమైంది!


నేరం ఒప్పకపోయినా, కన్నీరు ఇంకిపోయినా,

మౌనమే ఆయుధమై పోరాటం ఒంటరిదయినా,

వెలుగు మరుగై వెతలు మిగిలినా,

నిక్కమెన్నటికైనా ఉదయించేనా?


ఇక పయనమాగినా, శ్వాస ఆగినా,

తీర్పు ఎవరిపరమైనా, తోడెవరూ నిలవకున్నా,

ఏ జ్ఞానమెంతపెరిగినా.. లేనేలేదు మన్నింపు !

మనమున లేనేలేదు మన్నింపు!!


Friday, July 19, 2024

చీకట్లను వెలుతురుగా మార్చుకున్న - SRIKANTH





చాలా రోజుల తర్వాత ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సినిమా చూసానన్న భావన కలిగింది. వెలుతురు లేని ప్రపంచాన్ని అసలు ఊహించలేము. అలాంటి పరిస్థితే వస్తే మన మనస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహకందని విషయం. కానీ చీకటే తన ప్రపంచం అని తెలిసినా సరే దిగులు చెందకుండా, "నువ్వు చెయ్యలేవు" అని ఎవరైనా సవాలు చేసిన పనిని చేసి చూపించడమే ధ్యేయంగా మార్చుకున్న ఒక ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తి కథే "శ్రీకాంత్" సినిమా. అంధత్వం శరీరానికి కాదు మనసుకి అనిపించక మానదు సినిమా చూస్తూంటే! నిరాశతో కృంగిన ప్రతి వ్యక్తికీ మార్గాన్ని చూపి, స్ఫూర్తినీ ఇచ్చే కథ ఇది. 'శ్రీకాంత్ బొల్లా' గారి యదార్థ జీవిత గాథ!


ఇదివరకూ differently abled person మీద సినిమా తీస్తే వారు రకరకాల బాధలకు గురైయ్యాకా ఎవరో వచ్చి సహాయం చేస్తే వాళ్ల జీవితం బాగుపడినట్లు ఉన్న కథలు ఎక్కువగా ఉండేవి. సినిమాలు బాగున్నా, అటువంటి కథలు నిజాలే అయినా, ఆ ఫలానా వ్యక్తి పడిన కష్టాలు చూసి మనసంతా భారమయ్యేది. కానీ మొదటిసారిగా ఒక differently abled person జీవితగాథ చాలా స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహభరితంగా అనిపించింది. చిత్రం మొదటి నుంచీ చివరిదాకా అదే ఉత్సాహభరితమైన ఫీల్ ని కొనసాగించాడు దర్శకుడు. బహుశా ఆయన దృష్టికోణం అదేనేమో. బావుంది. 



రాజ్ కుమార్ రావ్ గురించి చెప్పేదేముంది..వంక పెట్టడానికి లేని నటనా కౌశలం అతనిది. ఆ పాత్రకు ఉండే మేనరిజమ్స్, హావభావాలు అన్నీ చాలా బాగా వ్యక్తపరిచాడు. మెచ్చుకోదగ్గ నటన! రాజ్ కుమార్ నటించిన కొన్ని సినిమాలు - Kai po che, Queen, Hamari adhuri kahani, Bareilly ki barfi, Newton, Stree, Hum do hamare do, Monica, O my Darling..మొదలైనవి ఇదివరకు చూశాను. వాటిల్లో Newton చిత్రం నాకు చాలా నచ్చింది. ఇదే కథను కొద్దిగా మార్చి ఆ మధ్య తెలుగులో "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే సినిమా తీశారు కూడా. కానీ ఒరిజినల్ హిందీ సినిమాయే బావుంది నాకైతే. Monica, O my Darling కూడా సస్పెన్స్, కామిడీ మిక్స్. సరదాగా ఉంటుంది. 


ఇంతకీ శ్రీకాంత్ సినిమా కబుర్లలోకి మళ్ళీ వచ్చేస్తే, జ్యోతిక కూడా తన దేవికా టీచర్ పాత్రను బాగా పోషించింది. ఒక డైలాగ్ లో చెప్పినట్లు శ్రీకాంత్ లాంటి వ్యక్తులు విజయాలను పొందాలంటే వారి చుట్టూ దేవికా టీచర్, రవి, స్వాతి లాంటి పాజిటివిటీ నింపి, ప్రోత్సహించే వ్యక్తులు ఉండాలి. అలానే శ్రీకాంత్ లో పట్టుదలను, కసిని పెంచే మహేశ్ లాంటి cruel చిన్ననాటి స్నేహితులు, హాస్టల్ లోంచి బయటకు తోసేసే వార్డెన్ లాంటి mean minded వ్యక్తులు కూడా ఉండాలి. శ్రీకాంత్ మాత్రమే కాదు ఎవరికైనా సరే, జీవితంలో ప్రోత్సహించే చేతులతో పాటుగా.. కిందకు తోసేసే చేతులు కూడా.. తన చుట్టూ ఉన్నప్పుడే తనలోని లోపాలను అధిగమించి ఒక వ్యక్తి పరిపూర్ణంగా వికసించగలుగుతాడు. ఇది నా అభిప్రాయం. 


సినిమా చూశాకా ఒకే ఒక బాధ కలిగింది.. ఈ శ్రీకాంత్ మన తెలుగువాడు కనుక "మల్లేశం" తీసినట్లుగా ఎవరైనా తెలుగు సినిమా దర్శకుడు ఈ సినిమా తీసి ఉంటే ఇంకా బవుండేది కదా.. అనిపించింది!



Monday, July 24, 2023

A Great Litterateur.. శ్రీ రమణగారు!



మన తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాన్ని తమ అక్షరాలతో, సినిమాలతో, పాటలతో, గాత్రాలతో వెలుగులద్ది, భాషను పదింతలు అందంగా మార్చి, వైభవాన్ని పెంచిన మహామహులందరూ గత కొన్నేళ్లుగా స్వర్గానికి నిచ్చెన వేసుకుని అక్కడే సమావేశమవుతూ వచ్చారు. అంతవరకూ బానేఉంది. కానీ వారి సాంగత్యాలు సంపూర్ణమవ్వలేదనో ఏమో, మిగిలిన అతి కొద్దిపాటి హేమాహేమీలను కూడా తమ వద్దకు పిలిపించుకుంటున్నారు. ఇటీవలి వాణి జయరాం గారి నిష్క్రమణ నుంచి తేరుకోక ముందే... నిన్న మొన్నటి శ్రీ రమణగారూ...! ఏమంత వయసైపోయిందని సార్ అంత తొందరపడ్డారు...ఇంకొన్నాళ్ళు ఉంటే మన భాషకు మరింత వైభవాన్ని పెంచేవారు కదా! తెలుగు భాషపై మీకున్న మమకారం, ప్రేమాభిమానాలు, దాని మనుగడ కోసమూ, వ్యాప్తి కోసమూ మీరు చేసిన కృషి.. ఎంతో హర్షనీయం. 

                                

బాపూ గారిని, రమణ గారినీ తలిచినప్పుడల్లా ఠక్కున వెంఠనే గుర్తొచ్చే మరొక వ్యక్తి శ్రీ రమణగారు. నాకు శ్రీరమణ గారంటే ఎంతో గౌరవం, చెప్పలేనంత అభిమానం! సాహిత్యపరంగా నాకు శ్రీ రమణగారు పరిచయం అయ్యింది వెండితెర నవలల ద్వారా. చిన్నప్పుడు మా ఇంట్లో బాపూగారి సినిమాల వెండితెర నవలలు ఉండేవి. ముత్యాల ముగ్గు, వంశ వృక్షం, రాధా కల్యాణం, గోరంత దీపం మొదలైన  వెండితెర నవలలన్నింటికీ నవలీకరణ శ్రీ రమణ గారే చేశారు. ఒక్క బాపూగారి సినిమాలకు మాత్రమే ఇలా నవలీకరణ చేసారేమో ఆయన తెలీదు మరి. కానీ మళ్ళీ మళ్ళీ చదువుకునేలా ఎంతో ఆసక్తికరంగా ఉండేవి అందులోని డైలాగులూ, మాటలూ అవీ.

                                   

ఆయన రాసిన కాలమ్స్ పుస్తకరూపంలో వచ్చాకే చాలావరకూ చదివాను కానీ ఒక  కథ మాత్రం విజయవాడలో ఉన్నప్పుడే చదివాను. ఆ ఒక్క కథకే మా ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోయాం! ఒకరోజు నాన్న ఆఫీసు నుంచి ఎవరో ఇచ్చారని A4సైజు పేపర్లలో ఉన్న ఒక కథ జిరాక్స్ చేయించి తెచ్చారు. అందరినీ కూర్చోపెట్టి చదివి వినిపించారు. సైలెంట్గా మొత్తం వినేసాం. ఎంత బావుందో..ఎంత బావుందో అనుకుంటూ. అదే "బంగారు మురుగు" కథ. కథలో బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రాలు -

* "నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం" 

* "మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం...పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం. ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం, నాకు తెలిసిందివే" బాగా గుర్తుండిపోయాయి. 

అదో అద్భుతమైన కథ! "పచ్చటి గొడుగు పాతేసినట్లు ఉన్న బాదం చెట్టు" గురించి చదువుతూంటే కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు.. భాస్కరమ్మగారి ఇంట్లో  ఉండేప్పుడు మా దొడ్లో పొద్దున్నే కాకులు బాదంకాయలు పడేసి వెళ్తూ ఉండేవి. అమ్మ మాకు ఆ కాయలు కొట్టి బాదం పప్పులు పెట్టేది. పప్పు విరగకుండా బాదం కాయలు కొట్టుకోవడం బాగా ప్రాక్టీస్ అయ్యింది మా పిల్లలకు. ఇప్పుడు మా సొసైటీలో కూడా మేం వచ్చిన కొత్తల్లో ఎవరో వేసిన రెండు బాదం చెట్లు పెద్ద పెద్ద వృక్షాలై రోజూ బోలెడు కాయలు, ఆకులూ రాలుస్తూ ఉంటాయి. ఆ చెట్ల కోసం నేను రోజూ వాకింగ్ కి అటువైపే వెళ్తూ ఉంటాను. ఆ రకంగా నాకు బంగారు మురుగు కథ గుర్తుకు రాని రోజే లేదు.


కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చాకా నాన్న నవోదయాలో ఒక పుస్తకం కొని తెచ్చారు - "మిథునం". అందులో ’బంగారు మురుగు’ తో సహా ఏడెనిమిది కథలు ఉన్నాయి. అన్నింటిలోకీ చివరిదైన "మిథునం" కథ మరొక అద్భుతం. బాపూ గారి మిథునం దస్తూరీ తిలకం  చాలు ఈ కథ గొప్పతనం కొలవడానికి. అదొక masterpiece అంతే! 

మిథునం లోని జీవిత సత్యం -

"...దానికో లెఖ్ఖ ఉంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు.మనం పుట్టగానె..వీడికి ఇన్ని...దీనికి యిన్ని అని ఎంచి వాటికి వరసాగ్గా అంకెలు వేసేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు.వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో, ఇంకేముంది! మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి. ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢం"

అనామకంగా మిగిలిపోయే ఏభైలూ, వందలూ కథలు రాయక్కర్లేదు, ఏ రచయితకైనా ఇటువంటి ఒక్క కథ చాలు... జన్మ సార్థకం అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క కథా చాలు కథారచయితల జాబితాలో మొదటి అంకె దగ్గర శ్రీ రమణగారిని నిలబెట్టడానికి. ఈ రెండు కథలు నాకు ఎప్పటికీ అత్యంత ప్రీతిపాత్రమైన కథలు. భరణిగారు మిథునం సినిమా తీసినట్లు , బంగారు మురుగు ని కూడా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ గా అయినా తీస్తే బావుంటుంది.


నాన్న రేడియోలో రిటైర్ అయ్యి ఇన్నేళ్ళైనా, ఓపిక ఉన్నా లేకున్నా, వేరే ఏ పనిలో ఉన్నా కూడా, రోజూ క్రమం తప్పకుండా వందేమాతరం నుంచీ జైహింద్ దాకా రేడియో వినడం ఆయన ఇప్పటికీ  ఇష్టంతో చేసే పని. ప్రొద్దుటి ప్రసారవిశేషాలలో విన్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని కేసెట్ లో రికార్డ్ చెయ్యడం, ఆ తర్వాత వాటిని సీడీ లోకో, పెన్ డ్రైవ్ లోకో మార్పించి అవి చదివిన వారికో, ఫలానా కార్యక్రమాన్ని సమర్పించినవారికో వాటిని అందించడం కూడా ఆయనకో హాబీ. అలా క్రితం ఏడాది శ్రీరమణగారివి కొన్ని టాక్స్ రేడియోలో ఓ సిరీస్ లో ప్రసారమయ్యాయి. ఎప్పటిలానే నాన్న వాటిని రికార్డ్ చేసారు. చేశాకా వాటిని సీడీగా మార్పించారు. అది అందించడానికి శ్రీ రమణగారికి ఫోన్ చేశారు. ఆయన ఎంతో బాగా మాట్లాడారుట. నాన్నకు ’చాలా సంతోషం, మీరు తెలుసు.. ’ అని చెప్పి, విజయవాడ రోజులు, కాళేశ్వర్రావు మార్కెట్లో కూరలు కొనుక్కోవడం నుంచీ ఎన్నో విజయవాడ జ్ఞాపకాలు నెమరువేసుకున్నారట.  "సిడి తీసుకోవడానికి వస్తాను. అడ్రస్ చెప్పండి" అన్నారట. "అయ్యో భలేవారే. వద్దు. మీ అడ్రస్ చెప్పండి చాలు కొరియర్ చేస్తానని" అడిగి, నాన్న లోకల్ కొరియర్ లో ఆయనకు సిడి పంపించారు. అందాకా అందినట్లు ఆయనే ఫోన్ చేసి చెప్పారట కూడా. చాలా తక్కువ నిడివి గల ఆ రేడియో టాక్స్ బ్లాగ్ లో టపా రాస్తే అందులో పొందుపరచమని నాన్న మొన్న ఈ విషాద వార్త తెలిసిన రోజున అడిగారు. వాటిని తెప్పించుకున్నాను కానీ అతిపెద్ద బ్లాగ్ విరామం వల్ల ఆడియో ఫైల్ ను బ్లాగ్లో ఎలా పెట్టాలో మర్చిపోయాను. ఎలానో గూగిలించి, తెలుసుకుని ఇప్పుడు పెడుతున్నాను.


audio file 1


audio file 2





audio file 3





అనుకోకుండా నిన్న నాకు మరొక ఆణిముత్యం లాంటి వీడియో దొరికింది. గొల్లపూడిగారు శ్రీ రమణగారిని ఇంటర్వ్యూ చేసిన వీడియో. ఇందులో మిథునం కథ గురించి నేను రమణగారిని అడగాలి అనుకుంతూ ఉండే ప్రశ్నలు గొల్లపూడిగారే అడిగేసారు. అది కూడా చూడండి -




తెలుగు భాష మనుగడకు తోడ్పడిన ఇటువంటి భాషాభిమానులు చాలా చాలా అరుదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో, దీని గురించి ఎవరు రాస్తారు? అనుకుంటే.. శ్రీ రమణగారు రాయగలరు.. ఆయన ఉన్నారు అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మరి ఆయన గొప్పతనాన్ని గురించో, మరేదైనా ముఖ్య విషయాన్ని గురించో రాయడానికి ఎవరున్నారా అని వేళ్ల మీద లెఖ్ఖపెట్టుక్కునే పరిస్థితి! ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తునే ఉంటుంది కాబట్టి భవిష్యత్తుపై ఆశావహ దృక్ఫథంతో  చూస్తూండడమే. ఏదేమైనా శ్రీరమణగారు లేని లోటు పూడ్చలేనిది. Telugu people have lost a great Litterateur! ఆయనకు నా నమస్సుమాంజలి.
స్వర్గంలో మాత్రం దర్బారు నిండుగా ఉందిప్పుడు!!


Wednesday, July 12, 2023

మౌనం?




ఏమిటీ మౌనం? ఎప్పుడు మళ్ళీ రాస్తావు? అని ఎవరైనా స్నేహితులు అడిగినప్పుడల్లా మనసుకి చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు అడిగారు చాలా రీసెంట్ గా.

మాటల్లో చెప్పలేనంత ఆనందం... 

ఇన్నాళ్లైనా ఇంకా రాయమని అడిగేవారు ఉన్నారన్న తృప్తి,

మళ్ళీ బ్లాగ్ వైపు చూసేలా చేస్తుంది!

ఇది నా ప్రపంచం. 

నా అక్షరాలు నా ఉనికిని వెతుక్కుంటూ దిగంతాల వరకూ పయనించే ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ బ్లాగ్లోనే!

ఈ పయనం ఎన్నో అవాంతరాలను, ఆక్రందనలను, అవమానాలను,  తట్టుకుని, దాటుకుని, ఇంకా సాగుతూనే ఉంది.

మౌనంలో కూడా పయనమే ఉంది.

అప్పుడప్పుడూ కొన్ని సమాధానాలు చెప్పాలనిపిస్తుంది..

కానీ మౌనం అన్నింటినీ మించిన గొప్ప సమాధానం కదా!  

నామటుకు నాకు -

అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఇదే సత్యం.

మౌనమే ప్రశ్న.

మౌనమే జవాబు.

మౌనమే ప్రశాంతత.

మౌనమే జ్ఞానం.

ఇంతకు మించి వేరేమీ లేదు.

చివరకు మిగిలేది అంతకన్నా ఏదీ లేదు.


Saturday, December 4, 2021

మనోభావాలు

 


రెండు, మూడు రోజులుగా పరస్పర విరుధ్ధమైన ద్వంద్వ  భావాలు  మనసులో ఒకేసారి పొటీపడుతున్నాయి.

"ఏదో ఒకటి రాయాలి.. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ప్రతి దృష్టికోణంలోనూ ఏదో ఒక వైరుధ్యం ఉంటుంది. ఎవరి భావాలువారివి కాబట్టి నా బ్లాగులో నా రాతలు నేను రాసుకోవాలి అనే నిరంతర తపన" ఒకవైపు!

" ఏదీ కూడా శాశ్వతం కానీ కనురెప్పపాటి జీవితంలో ఏం రాస్తే ఏమిటి? నేను రాయకపోతే వచ్చే అణుమాత్రం నష్టం కూడా లేనప్పుడు, ఏం రాసి ఏం ప్రయోజనం? అనే నిర్లిప్తత మరోవైపు!!


పాటలు పోగేసుకున్నాను, అక్షరాలను వెతుక్కున్నాను, మాటలు సమీకరించుకున్నాను, ఎంతో రాయాలనే తపన కూడా ఉంది కానీ పైన పేర్కొన్న ద్వంద్వ భావాలలో నన్ను రెండవదే ఎక్కువగా ప్రభావితంచేస్తోంది. ఒకానొక అనాస్థ దశలో ఎలాగైతే నిర్లిప్తంగా నాకత్యంత ప్రియమైన ఈ బ్లాగు మూసేసి ఏకాంతంలోకి వెళ్పోయానో, ఇప్పుడూ అదే అనాస్థ దశ. మూగగా, స్తబ్దంగా, భావాలను ముందుకు నడవనివ్వని ఒక నిస్తేజ స్థితి ఆవరించి ఉంది.

కాదు.. ఇది వైరాగ్యం కానే కాదు.. అంతకు మించిన ఏదో భావం!

ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మలోని పరమార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కలిగే నిర్లిప్త భావమేమో... బహుశా!!


కానీ నేను సమీకరించుకున్న పాటలతో, మాటలతో ఒక మహానుభావుడికి అంజలి ఘటించే ప్రయత్నం త్వరలో తప్పకుండా చేస్తాను.


Saturday, September 11, 2021

OTT Entertainment : 1


ఇవాళ ఒక కొత్త సినిమా చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు -

సినిమా బానే ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే, మనకి కావాలి అనిపించేవి, ఇలా జరిగితే బాగుండు.. అనిపించేవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఏమీ జరగవు. అసలు అలాంటి ఒక ఊహజగత్తులో బ్రతకడమే ఎంత తప్పో తెలిసేసరికీ సగానికి పైగా జీవితం అయిపోతుంది. వెర్రిమొర్రి కథలతో సినిమాలు తీసేసి ప్రజలపై రుద్దేసి డబ్బు చేసుకోవడమే తప్ప ఇవి ప్రజల జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో అన్న ఆలోచన ఎవరికి ఉండదు. ఇది మా జీవనోపాథి అంటారు సినీమారాజులు. చూడడం చూడకపోవడం, మన తప్పొప్పులు  మన బాధ్యత. కానీ రివైండ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా మొదలుపెట్టడానికి ఇది వీడియోనో, రిమోట్ కంట్రోలో కాదుగా... అసలు సిసలైన జీవితం!! ఒక్క రోజు, ఒక్క క్షణం పోయినా మళ్ళీ వెనక్కు రావు! వెనక్కి తెచ్చుకోలేము. 


ఇంత చిన్న విషయం అర్థం కాదా మనుషులకి? అర్థం అయినా అర్థం కానట్టు బ్రతికేస్తారా? ఇన్నాళ్ళూ నువ్వూ చూశావు కదమ్మా నానారకాల సినిమాలూ...ఇప్పుడేమో బోధిచెట్టు క్రింద జ్ఞానోదయమైన బుధ్ధుడిలా పెద్ద చెప్పొచ్చావులే పో పోవమ్మా! జీవిత సత్యాలు అందరికీ తెలుసు. ఇది జగన్నాటకంలో భాగం. అంతే! అంటారు మేధావులు. 


అయినా నా పిచ్చి కానీ ఎవరు చెప్తే ఎవరు వింటారు? నేను విన్నానా? ఎవరి జ్ఞానం వాళ్లకి రావాల్సిందే. అంతవరకూ మన జపం మనం చేసుకుంటూ చూస్తూ ఉండడమే :-) 

Friday, September 10, 2021

random thoughts...



2021... వచ్చి  ఎనిమిది నెలలు గడిచిపోయాయి.. ఇవాళ్టి వినాయకచవితి కూడా స్దబ్దుగా గడిచిపోయింది ! ఈ కాలం ఇలా త్వరగా గడవడం  మంచిదే కానీ మరీ ఇంత త్వరగానా .. అనిపిస్తోంది . ఏ హడావుడి లేకుండా పండుగ వెళ్పోయింది .  ఏమో నాకైతే అలానే అనిపించింది .  రోడ్డు మీద పత్రి  అమ్మేవాళ్ళు కూడా ఇదివరకటిలా పది అడుగులకొకళ్ళు లేరు. మా వైపున పత్రి అమ్మకం ఉన్న ఒక్క చోటా కూడా ఇదివరకటిలా అన్ని రకరకాల ఆకులు అమ్మలేదు .  జిల్లేడు ఆకులూ , తామరపూలు , తామర ఆకులూ , ఏవి లేవు .  ఇదివరకూ చాలామంది నానారకాల ఆకులూ అమ్మేస్తున్నారు అని విసుక్కునేవాళ్ళం .  అయినా వాళ్లకి ఆ ఒక్కరోజే ఉపాధి .  ఎక్కడెక్కడికి  వెళ్లి ఇవన్నీ తెస్తారో వీళ్ళు  అని ఆశ్చర్యపోయేవాళ్ళం కూడా. మన జీవితాలలోకి  ఈ మహమ్మారి ఎన్ని మార్పులు తెచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ రోజువారీ ఉపాధి అవకాశాలు మాత్రం బొత్తిగా శూన్యం అయిపోయాయి .  నిరుపేద జీవితాలపై మాత్రం ఇది చాలా బలమైన దెబ్బ అనే చెప్పాలి . ఈ గడ్డు కాలం సమసి , వారి జీవితాలు వికసించే రోజులు మళ్ళీ రావాలని ఆ వినాయకుడుని ప్రార్థిస్తున్నాను . 


***           ***             ***


పుస్తకం  తెరిచి ఎన్నాళ్లైయిందో ! ఇంటి పనితోనో , ఆఫీసు పనితోనే రోజులు గడిచిపోతున్నాయి .  OTT ల పుణ్యమా అని నానావిధ సినిమాలకేకొదవాలేదు. అవి పనులు చేసుకుంటూ  కూడా చుసేయచ్చు .  కానీ పుస్తకానికి ఏకాంతం , ఏకాగ్రత రెండూ కావాలి.   ఎప్పుడైనా సమయం  దొరికితే కాసేపు పడుకుందాం , రెస్ట్ తీసుకుందాం అన్న ఆలోచనే తప్ప  చదువుదామనే ధ్యాసే ఉండడం  లేదు .  

ఇదివరకూ  ఇంట్లో సామాను కూడా ఎటునుంచి ఇటు , ఇటు నుంచి అటూ అవలీలగా జరిపేసి సర్దేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక్కరోజు సర్దితే నాలుగురోజులు మరేపని చెయ్యలేని స్థితి .  ఇది వయసు ప్రభావమా ? లేక పనిపనిషి లేకుండా గత రెండేళ్ల నుండీ చాకిరి చేసుకుంటున్న వత్తిడి ప్రభావమా ? అన్నది తేల్చుకోవడం కష్టమే!


***      ***.    ***


ఈ టపాలో  ప్రత్యేకత ఏమిటంటే నా కొత్త లాప్టాప్ లో  ఇంకా సరైన సదుపాయాలు లేక డైరెక్ట్ గా బ్లాగ్ నుండే డ్రాఫ్ట్ లోoచి ఈ టపా రాస్తున్నాను. ఎలాగైనా ఇవాళ రాయాలనే సంకల్పంతో ! అక్షరాలు వెతుక్కుoటూ రాస్తుంటే బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తల్లో  ఒక టపా రాయడానికి ఎన్ని కష్టాలు పడేదాన్నో, ఎన్ని తప్పులు వచ్చేవో గుర్తుకొస్తోంది. 

నవ్వు వస్తోంది .... మళ్ళీ  గతం తాలూకూ చెరగని చేదు గురుతులు కలవరపెడుతున్నాయి కూడా! కానీ ఒకటి మాత్రం నిజం - ఏది జరిగినా మన మంచికే అని నేను ఎప్పుడూ నమ్మే సూత్రం . ఈ బ్లాగు రాతలు నాకు కేవలం చేదు  జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చినా , ఈ రాతలు నాకు తెలుగు టైపింగ్ నేర్పాయి .  ఎలా రాయాలో ,  ఎంత రాయగలనో , ఏది రాయగలనో తెలిపాయి .  నా జీవితకాలపు  కలను నిజం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించింది ఈ బ్లాగ్ రాతలే! భగవంతుడు నాకు అన్ని విధాలా సహకరించాడనే చెప్పాలి.  ఆ నిరాకార స్వరూపుడికి కృతజ్ఞతలు . 


***     ***    ***


చాలా కాలం నుంచి తెలిసిన కొందరి గురించి మనకి ఏర్పడిన అభిప్రాయాలను మార్చుకోవడం కష్టమే  అయినా ఒకోసారి మార్చుకోవాల్సి వస్తుంది .  ఇలాంటివాళ్ళు  అనుకున్నాము ... కాదన్నమాట  అని ఆశ్చర్యం వేసినా నిజరూపం తెలిసాకా అసలు కొందరితో మాట్లాడాలనే అనిపించదు .  ఎదురైనా తప్పించుకు తిరుగుతాం. 


***     ***      ***


ఏకాంతాన్ని  ఆస్వాదించడం మొదలైయ్యాకా మనుషులకు దూరంగా ఉండడమే ఆనందాన్ని ఇస్తోంది .  మనసు మరింత ఏకాంతాన్ని కోరుకుంటుందే తప్ప మరో ఊసే గుర్తుకురాదు .  భగవధ్యానం , ఆధ్యాత్మిక జీవితం , మరిన్ని  ఆధ్యాత్మికమైన  విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి  ఇదివరకటి మామూలు పుస్తకాల వైపుకి దృష్టిని మరలనివ్వడమే లేదు .  ఇందులో ఉన్న ప్రశాంతత మరెందులోను లేదు అన్న సత్యం ఆలస్యంగానైనా తెలిసిరావడం పూర్వజన్మ సుకృతమే  అనుకుంటాను. గత ఆరేళ్లలో  ఆత్మోన్నతికి ఉపయోగపడే  ఎన్నో మంచి మంచి పుస్తకాలు తెప్పించుకున్నాను. కొన్ని చదివాను .. ఆనందించాను. ఇంకా చాలా చదవాలి .  అటువంటి  ఏకాగ్రతనిచ్ఛే ఖాళీ సమయాన్ని ఇమ్మని భగవంతుడిని కోరుకుంటున్నాను . 










Saturday, May 15, 2021

శాంతిః శాంతిః శాంతిః

 



చెట్టంత మనుషులు.. 

బాగా తెలిసిన ఎందరో మనుషులు..

మొన్న ఒక వార్త, నిన్న ఒక వార్త... 

ఇలా ఎన్నెన్నో వింటూంటే దిగులుమేఘాలు కమ్మేస్తున్నాయి..

తెలిసినవాళ్లందరినీ పేరుపేరునా ఎలా ఉన్నారండీ అని పలకరించాలనిపిస్తోంది. 

కానీ ఎవరిని పలకరిస్తే ఏ వార్త వినాల్సివస్తుందో అని భయంగా కూడా ఉంది.

నిన్నటిదాకా ఆరోగ్యంగా, ఆనందంగా మన మధ్య తిరిగినవారు...

ఇవాళ మాయమైపోతున్నారు..

ఎంతటి మహమ్మరి ఇది..

జాతీయ విపత్తు కాదు ఇంకేదో పేరు పెట్టాలి దీనికి..

ఊహూ...ఏ మాట సరిపోవట్లేదు..

అక్షరాలు కుదరట్లేదు...:((

ఇంత అన్యాయమా...అయ్యో.. అని మాత్రం దు:ఖం కలుగుతోంది!!!

ప్చ్!!!

శాంతించు భూమాతా... ఎందరిని నీలో కలిపేసుకుంటే నీ కోపం తీరుతుంది?

శాంతిః శాంతిః శాంతిః


 द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः
पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।
वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥
 शान्तिः शान्तिः शान्तिः ॥


యజుర్వేదంలోని ఈ శాంతి మంత్రార్ధాన్ని క్రింద లింక్ లో చూడచ్చు -

https://www.siddhayoga.org/shanti-mantras/om-dyauh-shanti



Saturday, May 8, 2021

మోడ్రన్ Genieలు !


కొందరు దేశ ప్రజల నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల చేతులారా కొని తెచ్చుకున్నదే ఈ ప్రస్తుత విషమ పరిస్థితి ! (ప్రభుత్వాలనో, మరెవరినో నిందించే కన్నా ముందర బాధ్యత గల దేశ పౌరులుగా మన బాధ్యతను మనం ఎంతవరకూ నిర్వర్తించాం అన్నది కూడా మనం అంతర్లోచన చేసుకోవాల్సిన విషయం.)

ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ విధులను ఎంతో సమర్థవంతంగా, శక్తికి మించి నిర్వర్తిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర హాస్పట్లల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు మొదలైనవారందరూ ఎంతో హర్షనీయులు. కానీ వారందరితో పాటూ మనం చేతులెత్తి నమస్కరించాల్సినవారు మరికొందరు ఉన్నారు. వారే ఆన్లైన్ వెబ్సైట్ల డెలివరీ కుర్రాళ్ళు! ఎంతో రిస్క్ తీసుకుంటూ వీధుల్లో , ఎండల్లో, ఎన్నెన్నో దూరాలు తిరిగి తిరిగి మనందరి ఆన్లైన్ ఆర్డర్లను మన తలుపు దగ్గరకు తెచ్చి అందిస్తున్న Genieలు వాళ్ళు.


ఇవాళ ప్రపంచమంతా మన చేతుల్లోని ఆరేడు అంగుళాల ఫోనులో ఇమిడిపోయింది. మహమ్మారి వైరస్ కారణంగా ఇవాళ ప్రపంచం వణికిపోతోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లద్దని పదే పదే అంతటా వినిపిస్తున్న మాట. తప్పనిసరి పనులు, ఆఫీసులు ఉన్న ప్రజలు ముసుగులు మొదలైన రక్షణా కవచాలు ధరించి యుధ్ధసైనికుల్లా తప్పక తిరుగుతున్నారు. కానీ ఇంట్లో ఉండి, ఇంట్లోంచి పనులు చేసుకుంటున్న ప్రజానీకం అందరమూ ఏ వస్తువు కావాలన్నా చేతిలోకి ఫోన్ తీసుకుని టిక్కు మని ఒక్క నొక్కు నొక్కుతున్నాము. గంటల్లోనో, ఒక రోజులో, రెండురోజుల్లోనో మనకి కావాల్సిన వస్తువు మన తలుపు దగ్గర వచ్చి పడుతోంది. మనం హాయిగా ఇంట్లోంచి ఆర్డర్ చేసుకుని తెప్పించుకుంటున్నాం కానీ అవి తెచ్చేవాళ్ళు ఎంత శ్రమ పడతారో అనిపిస్తుంది నాకు. వాళ్ళ శ్రమ మాత్రమే కాదు, మనం బయటకు వెళ్ళక్కర్లేకుండా మనకి కావాల్సినది మన చేతుల్లోకి వచ్చేయడం చాలా చిత్రమైన విషయంగా నాకు అనిపిస్తుంది. నా మటుకు నాకు ఆ డెలివరి కుర్రాళ్ళు అల్లావుద్దీన్ జీనీలాగ అనిపిస్తారు. కూరలు, పాలు,పళ్ళు, పుస్తకాలు, నిత్యావసరాలు. కిరాణా వస్తువులు...అసలు ఈ సామానుకి అంతేమిటి? ఇదివరకూ మనకి ఏదన్నా కావాలంటే వీధి వీధీ తిరిగి, కొన్ని వస్తువుల కోసం ఎంతో దూరం కూడా బస్సుల్లో ప్రయానించి వెళ్ళి తెచ్చుకున్న రోజ్కులు ఉన్నాయి. ఇవాళ అస్సలు ఏమాత్రం శ్రమ లేకుండా ఫోనులో మీట నొక్కిన తక్షణం ఆ ఫలానా వస్తువు మన చేతుల్లోకి వచ్చేస్తోంది. ఎవరికైనా ఏదైనా పంపాలన్నా కూడా చక్కగా ఆర్డర్ చేస్తే ఆ ఫలానావారికి అందించేస్తున్నారీ డెలివరీ కుర్రాళ్ళు. మనకీ ఆనందం, అవతలవారికీ ఆనందం. కావున  చెప్పొచ్చేదేమిటంటే ఈ డెలివరీ బాయ్స్ మన పాలిట వరాలిచ్చే దేవతల్లాంటివారు. 


ఈ సంవత్సర కాలంలో ఓలా, ఊబర్ వాళ్ల పేకేజీ సర్వీసుల ద్వారా నేను ఎన్నో సార్లు మావాళ్లకి నే వండిన పదార్ధాలు, తినుబండారాలు పేక్ చేసి పంపించాను. ఇంట్లోంచి కదలడానికి భయపడే పరిస్థితుల్లో, మనవాళ్లకి మనం స్వయంగా చేసిన పదార్ధాలు మనం వెళ్లలేకపోయినా ఎవరిద్వారానో అందివ్వగలగడం ఎంతో సంతోషకరమైన సంగతి. ఈ సర్వీస్ నిజంగా ఎంతో ఉపయోగకరమైనది. బిగ్ బాస్కెట్, అమ్మాజాన్(Amazonకి మేము పెట్టుకున్న ముద్దు పేరు), ఫ్లిప్కార్ట్, ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అమ్మే వెబ్సైట్స్...ఇలా ఎన్నో వెబ్సైట్ల ద్వారా ఒకటేమిటి నానావిధాల వస్తువులు ఇవాళ మన ముంగిట్లో వాలుతున్నాయి. ఆఖరికి మొక్కలకి నీళ్ళు పోసే వాటర్ పంప్ నాజల్ పోతే, అది కూడా నెట్లో ఒకచోట వెతికి బుక్ చేస్తే మర్నాడే ఇంటికి వచ్చింది! [కాకపోతే అది చిన్న సైజ్ అయి పర్పజ్ సర్వ్ అవ్వలేదు :( ] 


గత ఏడాది లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న చాలామంది యువత ఈ డెలివరీ ఉద్యోగాలలో చేరారని వినికిడి. డిమాండ్ పెరిగిపోయి బుక్ చేసిన నాలుగు రోజులకి కానీ వస్తువులు రావట్లేదు. ఆన్లైన్ ఆర్డర్స్ వల్ల వాళ్లకి అంత పని ఉంటోంది. మంచిదే కదా. వాళ్లకీ ఉపాధి లభిస్తోంది. మన పర్పజ్ సర్వ్ అవుతోంది. రానున్న మరిన్ని నెలల పాటు మనకి వీళ్ల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు చల్లగా ఉండుగాక. ఇలాగే మనందరి అవసరాలనీ తీరుస్తూ ఈ మోడ్రన్ జీనీలు మనల్ని సంతోషపెట్టు గాక.

సర్వేజనాః సుఖినోభవంతు.


Thursday, January 21, 2021

భానుమతి & రామకృష్ణ - ఒక సరదా సినిమా

 
         

పేరు భలే ఉందే అని ఈ సినిమా పేరు చూసి ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాము. హైదరాబాద్ నగరంలో ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరు హీరోయిన్. పేరు భానుమతి. రామకృష్ణ అనే అబ్బాయి ఆమె దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. తెనాలి నుంచి వచ్చిన అతగాడు నెమ్మదస్తుడు, మంచివాడు. రీసెంట్ గా బ్రేకప్ అయిన బాధలో ఉన్న భానుమతికి ఈ అసిస్టెంట్ అబ్బాయి ఎలా దగ్గరయ్యాడు, ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి  వాళ్ల మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఎలా వాళ్ళిద్దరూ ఒకటౌతారు అన్నది చిత్ర కథ.

మామూలు కథే కానీ కథని చాలా పోజిటివ్ గా, స్మూత్ గా, మనసుకి హత్తుకునే మంచి రొమాంటిక్ కామిడీ లా బాగా మలిచాడు దర్శకుడు Srikanth Nagothi. డైరెక్ట్ వెబ్ రిలీజ్ కే ప్లాన్ చేసి రాసుకున్న స్క్రిప్ట్ ఇది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడతను. నవీన్ చంద్ర, సలోనీ లూథ్రా ప్రధానపాత్రలు పోషించారు.


ఈమధ్యన కాస్త పెళ్ళి వయసుకే పెళ్ళిళ్ళు జరుగడం చూస్తున్నాం కానీ గడిచిన దశాబ్దంలో ఉద్యోగాలు, కెరీర్ ప్లాన్స్ అంటూ యువత చాలావరకూ లేట్ మేరేజెస్ బాటలోనే పయనిస్తూ వచ్చారు. గత దశాబ్దంలో పెళ్ళీళ్ళు జరిగిన చాలామంది వధువరులిద్దరి వయసులూ ముఫ్ఫై పైనే ఉండడం చాలాకాలంగా చూస్తున్నాం కాబట్టి చాలామంది యువతీయువకులు ఈ సినిమాకి ఈజీగా కనెక్ట్ అయిపోయే అవకాసం ఉంది. అమ్మాయి పెళ్ళి గురించి, లేట్ మేరేజ్ అవుతున్న అమ్మాయిల గురించి చెప్పే డైలాగ్ భలే నవ్వు తెప్పించింది. సినిమా అయిపోయాకా బావుంది, ఒక మంచి సినిమా చూశాం అనే భావన తప్పకుండా కలుగుతుంది. నాకు ఆ తల్లీ,కొడుకుల రిలేషన్  బాగా నచ్చింది.



చిత్రం టైటిల్ పై కోర్టువారి అభ్యంతరం చెప్పడం వల్ల సినిమా టైటిల్ లో హీరో,హీరోయిన్ల పేర్ల మధ్యలో "&" కలిపారుట.  2020 జూలైలో విడుదల అయిన ఈ చిత్రం "ఆహా యాప్(Aha app)" లో చూడవచ్చు. ఈ దర్శకుడు నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. మరొక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పారు.


movie Trailer -