ఒక బస్సు ప్రయాణంలో ఒక చిన్న పాపకి ఓ నర్స్ ఒక తమాషా కథ చెప్తుంది. కాలాంతరంలో ఆ పాప పెద్దదై ఓ అందమైన అమ్మాయి అవుతుంది. ఉద్యోగ నిమిత్తం ఒక అందమైన ఊరు వెళ్తుంది. ఆ అందమైన ఊరిలో పాడుబడినట్లున్న పురాతన భవనాల, ఇళ్ళ గోడల మీద తాను చిన్నప్పుడు బస్సులో విన్న కథ చిత్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ చిత్రాలు గీసిన చిత్రకారుడిని వెతుక్కుంటూ ఆ అమ్మాయి అలా...అలా...వెళ్ళి వెళ్ళి....చివరికి సినిమా చివరాఖరు సీన్ లో ఆ చిత్రకారుడిని కలుసుకుంటుంది. ఆ కథకీ, ఆ చిత్రకారుడికీ, ఆ అమ్మాయికీ ఏమిటి సంబంధం? చిన్నప్పుడు తను బస్సులో విన్న కథ ఆ చిత్రకారుడికి ఎలా తెలుసు? తెలుసుకోవాలంటే Amazon Primeలో "Maara" సినిమా తెలుగు వర్షన్ చూడాల్సిందే :-)
ఇది ఒక మళయాళ చిత్రానికి తమిళ రీమేక్ అని గూగులమ్మ చెప్పింది. ఒక తమాషా కథని, అందమైన ఫోటోగ్రఫీని, అందమైన పెయింటింగ్స్ లా ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ని, అందమైన శ్రధ్ధా శ్రీనాథ్ ని, కాస్త ఓల్డ్ అయినా ఛార్మ్ తగ్గని - అందమైన నవ్వు తనకు మాత్రమే సొంతమైన మాధవన్ నీ, చూసి ఆనందించేయండి!! వినసొంపైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు అందం. ఈ సినిమా చూశాకా ఒకే విశేషణాన్ని ఇన్నిసార్లు ఎందుకు వాడానో అర్థమౌతుంది.
చిన్న మాట: ఈ సినిమా ఇప్పటికీ చందమామ కథలను, యేనిమేషన్ మూవీస్ ని ఇష్టపడే పెద్దవారికి మాత్రమే నచ్చుతుంది :)
నేను నేనుగా మిగిలి, నాకై నేను గడిపే క్షణాలు చాలా ఉండేవి. అలాంటి కొన్ని క్షణాలు ఉండేవి కదూ... అని ఇప్పుడుగుర్తు చేసుకోవాల్సిన రోజులు గడుపుతున్నాం. నేను, నాలాంటి వందల, వేల, లక్షల మహిళలు. ఈ దశాబ్దానికి ఆఖరి రోజు ఇవాళ. పన్నెండు దాటి ఇరవై నిమిషాలు అయ్యింది. ఇవాళ బలవంతాన పడుకోకుండా కూర్చుని కాసేపు ఏదన్నా రాయాలని చాలా మనసైంది. రాయాలని చాలాసార్లు అనిపిస్తుంది కానీ సమయం చిక్కదు. గతంలో ఇంట్లోని మిగతావారు పరుగులు పెడుతుంటే, వాళ్లకి కావాల్సినవి అందించి, ఇల్లు నిశ్శబ్దంగా మారాకా వార్తాపత్రికనో, నచ్చిన పుస్తకాన్నో చదువుతూ, బాల్కనీలో ప్రశాంతతని ఆస్వాదిస్తూ ఎన్నో క్షణాలు ఏకాంతంగా, ఆనందంగా గడిపిన రోజులు ఉండేవి. గత పదినెలలుగా ఆ ఏకాంతం, ఆ ప్రశాంతత కరువైపోయాయి. ఇంటి బాధ్యతలతో పాటూ, అదనంగా అందిన పనిమనిషి ఉద్యోగం జీవితాన్ని తలకిందులు చేసిందనే చెప్పాలి. అంట్లు తోమి తోమి చేతులు బండబారిపోయాయనే చెప్పాలేమో! మధ్యలో రెండునెలల పాటు ఇల్లు మార్పు, అటు ఇటు తిరుగుడు, చేస్తోన్న బండ చాకిరీతో పాటూ చేత్తో బట్టలు ఉతకాల్సి రావడం, లిఫ్ట్ లిఫ్ట్ పనిచెయ్యకపోవడం, మూడుపూటలా వంటింట్లో అదనపు డ్యూటీలు, పెరుగుతున్న వయసునీ, తరుగుతున్న ఆరోగ్యాన్నీ పదే పదే గుర్తుచేసుకునేలా చేశాయి. నష్టపోతున్నది సమయాన్నో, ఆరోగ్యాన్నో తెలీకుండా చేసేసింది ఈ 2020.
ఇంత చెత్త సంవత్సరాన్ని ఇన్నేళ్లల్లో చూడలేదు. ఇంటి మనుషులు ఇంట్లో కళ్ళెదుట ఉంటే ఆనందమే. కానీ పనిమనిషి, వంటమనిషి, చాకలి అందరి పదవులూ ఇల్లాలికి దక్కించిన ఈ సంవత్సరాన్ని తిట్టుకోని ఇల్లాలు ఉంటుందా? చేతులు కడిగి కడిగి అరిగిపోయాయి, సానిటైజర్లు వాడి వాడి పర్ఫ్యూమ్స్ కూడా వాడాలంటే వెగటు పుడుతున్నాయి, ఆన్లైన లో తెప్పించిన వస్తువులు, కూరగాయలు కడిగి, తుడిచి, ఆరబెట్టి, అలసి సొలసి వంటిల్లంటే విరక్తి కలగని మహిళ, "i need a break" అనుకోని మహిళా ఉంటుందా అసలు అనుకుంటూ ఉంటాను.
ఇక ఈ ఆన్లైన్ క్లాసులేమిటో.. నిద్దర్లు పోతూ, ఆవులిస్తూ, స్క్రీన్ మీద టీచరమ్మలూ,మాష్టార్లు వాళ్లపాటికి వాళ్ళు పాఠాలు చెప్పుకుంటూంటే, స్క్రీన్ మ్యూట్ చేసి తమ తని తాము చేసుకునే పిల్లలే ఎక్కువైన ఈ సంవత్సరంలో అందరు పిల్లల చదువులు అటకలెక్కాయని నొక్కి వక్కాణించాల్సిందే!! ఇంక అప్పుడప్పుడూ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు ఏమాత్రం జాగ్రత్తలు పాటించని ప్రజానీకాన్నీ, మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా పెళ్ళిళ్ళూ పేరంటాలూ చేసేసుకుంటున్న ధైర్యస్తులని, మరో పక్క అతి దీనావస్థలో ఉన్న చిన్నపాటి రోజువారీ వ్యాపారస్తులని, రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలనీ చూస్తూంటే దు:ఖం, బాధ, కోపం, అసహనం, నిస్సహాయత మొదలైన భావాలన్నీ కట్టకట్టుకుని బయటకు తన్నుకు వస్తున్నాయి. ఇలాంటి భావాలనే అనుకుంటా అదేదో సినిమాలో frustration..frustration అన్నారు. ఈ విపత్తు కాలంలో ఇటువంటి frustration అందరి కంటే ఎక్కువ మా ఇళ్ళాళ్ళమే భరించాము అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
పది రోజులకు ఒకసారైనా ఏదో పని పెట్టుకుని బయటకు వెళ్ళి రాకపోతే నాకు తోచదు. తలెత్తి ఆకాశాన్ని చూసి, స్వేచ్ఛగా గాలినీ పీల్చి ఎన్నాళ్ళైందసలు?! ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. అయిపోయిందనుకుంటుంటే మళ్ళీ భయపెడుతున్నారు. రాబోయే రోజులు ఇటువంటి frustration నిండిన క్షణాలనే ఇస్తాయని జోస్యాలు కూడా ఎక్కువగానే వింటున్నాం. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం కన్నా చెయ్యగలిగింది ఏముంది? నిజం చెప్పాలంటే ఇలా సింహావలోకనం చేసుకునే సమయం కూడా ఇన్ని నెలల తరువాత ఇవాళే దొరికింది. ఈ మహమ్మారి పుణ్యమా అని నా ఆఫీసు పనులు బాగా తగ్గిపోయినా, ఇంటి పనులు మాత్రం ఓవర్ టైం చెయ్యల్సినంత ఉంటున్నాయి. అందుకే ఇవాళ కాస్త నిద్రను త్యాగం చేసి అయినా ఈ దశాబ్దపు ఆఖరి రోజున నాలుగక్షరాలు రాయాలనిపించింది. ల్యాప్టాప్ దుమ్ము దులిపి, నాకై నేను మిగిలే ఈ క్షణాలను మిగుల్చుకోవాలని ఆశ కలిగింది.
రేపటి రోజు బాగుంటుందని ఆశగా ఎదురుచూడడం మనిషి నైజం. ఆశావాదుల దృక్పధం. ఇదే ఆశతో ఎదురుచూస్తాను...
కనీసం ఇంటి పనులకైనా స్వేచ్ఛగా బయటకు వెళ్లగలిగే రోజు కోసం..
ఇష్టంగా కొనుక్కున్న పుస్తకాల పేజీలు ఆత్రంగా తిప్పగలిగే రోజుల కోసం..
మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకునే రోజుల కోసం..
మాస్క్ లేకుండా రోడ్డుపై వెళ్తూ సూర్యోదయాలనూ, సూర్యాస్తమయాలనూ చూసే రోజు కోసం..
అంట్లు తోమక్కర్లేని రోజు కోసం..
మాస్కులు, సానిటైజర్ వాడక్కర్లేని రోజు కోసం..
రైలు కిటికీలోంచి వేగంగా వెళ్పోతున్న పచ్చని చెట్లని చూసే రోజు కోసం..
లిస్ట్ రాసుకున్న పుణ్య క్షేత్రాలను ఒక్కొక్కటిగా దర్శించే రోజుల కోసం..
He has left a vacuum that can never be filled by any other voice!! తెలుగు భాష మాత్రమే కాదు, సినీ సంగీతం బ్రతికి ఉన్నంతవరకూ బాలూ గళం ప్రజల మన్ననలు పొందుతూనే ఉంటుంది. ఆచంద్రార్కము, అమరం అనే పదాలకు బాలూ గళమే సరైన ఉదాహరణ అనిపిస్తోంది ఇవాళ.
తెలుగు పాట కాకపోయినా ఈ తమిళగీతం నాకు ఎంతో ఇష్టమైనది -
"నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించనివేళ
నే కూరుకుపోతున్న చేతకానితనపు వానాకాలపు బురద మధ్య
నీ పాట ఒక్కటే నిజంలాగ
నిర్మలమైన గాలిలాగ
నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ
ఇంటి ముందు జూకామల్లెతీగలో అల్లుకుని
లాంతరు వెలుతుర్లో క్రమ్ముకొని
నా గుండెల్లో చుట్టుకుని
గాలిలో ఆకాశంలో
నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని
నీరవంగా నిజంగా ఉంది
జాలీగా హాయిగా వినబడుతూ ఉంది"
గత రెండు రోజులుగా రేడియోలో రకరకాల ఛానల్స్ లో వినిపిస్తున్న బాలూ పాటలు వింటూంటే నాకు పదే పదే ఈ పైన రాసిన కవితా వాక్యాలు గుర్తుకువస్తున్నాయి. ఒకటా రెండా? ఇది, అది అని ఏ పాటను ప్రత్యేకించి చెప్పాలో తెలియటంలేదు. చిన్నప్పుడు రేడియోలో విన్న"సిరిమల్లె నీవే" నుంచీ ఇటీవలి ’శతమానం భవతి’ లోని "నిలువదే మది నిలువదే" పాట వరకూ ఉదహరించ వీలుకాని వేలకొద్దీ ఎన్నో గొప్ప పాటలు!! దేశం యావత్తూ మత్తెక్కినట్లు ఊగిపోయిన శిఖరాగ్రంలోని "శంకరాభరణం" పాటలు ఓ పక్కన పెడితే; "బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది" అని కాలేజీ పిల్లలందరూ పాడుకున్నా, "ఓలమ్మీ తిక్కరేగిందా" అని యువత ఉర్రూతలూగినా, "ప్రేమా ప్రేమా.." అంటూ ప్రేమికులు పాడుకున్నా, పదాలు ఉదహరించలేని కొన్ని ప్రత్యేకమైన శృంగారగీతాలు మత్తెక్కించినా, "ఆనాటి ఆ స్నేహమానందగీతం" అని నడివయస్సు వాళ్ళు పాడుకున్నా, "అంతర్యామీ అలసితి సొలసితి" అని వయసుమీరినవారు స్వగతాలుగా పాడుకున్నా, ఆ గొప్పతనం ఆ పాటల సాహిత్యానిది మాత్రమే కాదు, ఆ సాహిత్యాన్ని మన మనసుకు హత్తుకునేలా వినిపించిన బాలూగళానిది కూడా! రిక్షా నడిపే శ్రామికుడి మొదలు ఖరీదైన గదుల్లో రిలాక్సయ్యే ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరూ నిత్యం విని ఆస్వాదించే ఆ మధురగళం బాలూని అందరివాడిగా మార్చేసింది. He is not just a singer, He is Family! అదీ మన తెలుగువారింట మాత్రమే కాదు, తను పాడిన ప్రతి పాటనూ పలికేవారందరికీ బాలూ ఒక కుటుంబసభ్యుడు. అందుకే ఇవాళ తను లేని లోటు అందరినీ బాగా దిగులుపెడుతోంది.
’కరోనా తనని తీసుకుపోయింది ’, ’ఫలానావారిది తప్పు’ అంటూ ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నా, నాకు మాత్రం ఒక్కటే అనిపిస్తోంది - ఇవన్నీ just reasons. Death has to have a reason. It finds its way in any of the directions. "మృత్యుదేవత నేరం తన మీద పెట్టుకోదమ్మా.. ఏదో ఒక వ్యాధి రూపంలో వచ్చి, నేరాన్ని దాని పైకి నెట్టేస్తుంది" అంటూ ఉండేది మా తాతమ్మ. ఘనమైన, వైభవోపేతమైన కళాజీవితం, చివరలో ఓ నెల రోజుల అనారోగ్యం ఆయన destinyలో ఉన్నాయన్నమాట అనిపించింది.
ఆమధ్యన ఒకరు మీ ఫేవొరేట్ సింగర్ ఎవరు అని అడిగితే "హరిహరన్" అని చెప్పాను. మరి మీకు? అని అడిగితే, "ఇంకెవరూ.. బాలూ! నవరసాలనూ అంత బాగా పలికించగల మరో గళం నాకు కనబడదు" అన్నారు ఆవిడ. తర్వాత చాలా సేపు ఆలోచించాను - నిజమే కదా ఎప్పుడూ ఆ కోణంలోంచి చూడలేదు.. ఏ పాట విన్నా ఆ హీరోకో, ఆ సందర్భానికో అతికినట్టు పాడడం ఒక్క బాలూకే సొంతం. తన ప్రతి పాటా తను పాడినట్లు మరొకరు ఎప్పటికీ పాడలేరు అన్నది నూరుశాతం సత్యం. మనసు గదిలో ముందువరుసలో హరిహరన్ నిలబడినా, లోపల్లోపల నాకూ బాలూ అంటే ప్రేమ ఉంది అని అప్పుడు అనిపించింది. బహుశా అందుకేనేమో ఆ రోజు రాత్రి ఫోన్ అప్డేట్స్ లో కమల్ హాసన్ బాలూను చూసి వెళ్లారుట అన్న వార్త చదివినప్పటి నుండీ మనసులో ఏదో దిగులు, సన్నని బాధ నిదురపోనివ్వలేదు. వినకూడదనుకున్న వార్త వినాల్సివచ్చిన రెండు రోజుల తర్వాత ఇప్పటికి ఈ వాక్యాలు రాయగలుగుతున్నాను.
నాన్న స్నేహితుడైన మూర్తిబాబయ్య (సంగీత దర్శకుడు ఈ.ఎస్.మూర్తి) ఎస్.ఏ.రాజ్ కుమార్ దగ్గర పనిచెయ్యని క్రితం మొదట్లో కొన్నేళ్ళు బాలూ గారి దగ్గర కూడా ఉన్నారు. అందువల్ల వారి సాన్నిహిత్యం ఎంతో అపురూపమైనది. దూరంగా ఉండే మనలాంటివారికే ఇంత బాధ ఉంటే, కొన్నేళ్ల పాటు సన్నిహితంగా ఉండి, కలిసి పనిచేసినవారికి ఎంత బాధగా ఉంటుంది? నాన్న పలకరిస్తే, "జీవితంలో ఇంత శూన్యంగా ఎప్పుడూ లేదండీ" అన్నారట తను. బాలూ స్వగృహంలో వాళ్ళు కలిసినప్పుడు తీసుకున్న ఈ చిత్రాన్ని షేర్ చేసి, నేను వ్యాసంలో ప్రచురించడానికి అనుమతి ఇచ్చినందుకు బ్లాగ్ముఖంగా మూర్తిబాబయ్యకు ధన్యవాదాలు.
ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో నాన్న పనిచేసినప్పుడు, 1971లో బాలూగారిని నాన్న ఇంటర్వ్యూ చేసినప్పటి చిత్రం -
చిన్నప్పటి నుండీ ఎరిగి, మా తెలుగువాళ్ళు అని మనం గర్వంగా చెప్పుకునే మహామహులంతా ఒక్కొక్కరే మాయమైపోతున్నారు. వేటూరి, బాపూ, రమణ, బాలమురళీకృష్ణ, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం!! ఇలా మన తెలుగుభాషని జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెట్టినవారంతా వెళ్ళిపోతుంటే, ముందుముందు మన తెలుగుతనపు ఘనతని చరిత్రలోనే చదువుకోవాలేమో అనిపిస్తోంది :(
*** *** ***
బాలూ గురించి జానకమ్మ గారి ఆప్యాయమైన మాటలు -
-----------------------------------
** (వ్యాసంలోని కవితా వాక్యాలు దేవరకొండ బాల గంగాధర తిలక్ "అమృతం కురిసిన రాత్రి"లోని "నువ్వు లేవు నీ పాట ఉంది" కవిత నుండి)
మూడు రోజుల క్రితం amazon prime లో ఈ సినిమా చూశాం. బావుంది. రచన, దర్శకత్వం: సుజోయ్, సునిల్ ! మంచి సబ్జక్ట్ ఎన్నుకున్నారు. నిత్యం మన చుట్టూ చూస్తున్న అనేక జీవితాలను, వందల,వేల తల్లిదండ్రుల అగచాట్లను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు. డైలాగ్స్ చాలా బావున్నాయి. మరీ సీరియస్ గా కాకుండా lighter veinలో కథ నడిపించారు.
కొన్ని నచ్చిన అంశాలు:
* పెద్ద ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా, ఖాళీగా ఉండి, డిగ్రీకీ ఉద్యోగానికీ గ్యాప్ పెంచేసుకోకుండా చిన్నవైనా ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి.
* మన దేశం కోసం పనిచెయ్యాలి, మన వాళ్లకి ఉపయోగపడాలి, * స్టార్టప్స్ ని ఎంకరేజ్ చెయ్యాలి.
* మనం మోసే కలల బరువు మనదా? తల్లిదండ్రులదా? అసలు మన కలల వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి?
* కెరీర్ పరమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?
* ఎవరూ ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది?
* కలలు,కెరీర్ కన్నా, కని పెంచిన తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.
- ఇలా కొన్ని పనికివచ్చే ఉపయోగకరమైన విషయాలు చక్కగా యువతకి అర్థమయ్యేలా ఉన్నాయి.
హీరో సాయి రోనక్, హీరోయిన్ ప్రీతి అస్రానీ, హీరో స్నేహితుడిగా రాహుల్ రామకృష్ణ, అమ్రీకా సంస్కృతిలో ఇరుక్కుపోయిన పిల్లల తల్లిదండ్రులుగా తనికెళ్ల భరణి, సంగీత - అంతా చక్కగా నటించారు. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెలీదు కానీ మొత్తానికి ఒక చక్కని ఉపయోగకరమైన సినిమా వచ్చిందని ఆనందం కలిగింది. సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూసి ఆనందించండి.
చిన్నప్పుడు టీవీ తో ఉన్న గాఢమైన అనుబంధం వల్ల ఆనాటి నటీనటులు, ఆనాటి సీరియల్స్, ఆ జ్ఞాపకాలన్నీ ఎంతో మధురంగా అనిపిస్తాయి. ఆ అనుబంధం వల్లే ఆనటి నటీనటుల పట్ల కూడా అభిమానం నిలిచిపోయింది. హిందీ ఛానల్స్ మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఎందరో గొప్ప నటులు ఉండేవారు. వారిలో అతికొద్ది మందికే వెండితెరపై వెలిగే అవకాశం దక్కింది. వారందరిలోకీ ఒక విలక్షణ నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఒకరు ఇర్ఫాన్ ఖాన్! ఇర్ఫాన్ ఖాన్ పేరు వినగానే నాకు ఎప్పటికీ గుర్తుకు వచ్చేది "బనేగీ అప్నీ బాత్(Banegi Apni Baat)" అనే టివీ సీరియల్. Madhavan, shefali chaya, Irfhan khan మొదలైన నటులను నాకు పరిచయం చేసిన ఆ సీరియల్ ఎంతో బావుండేది. కథ, కథనం, నటీనటుల అద్భుతమైన అభినయం అన్నీ బావుండేవి. కాలేజీ రోజుల్లో అస్సలు మిస్సవకుండా చూసేవాళ్లం.. నేను, నా స్నేహితురాళ్ళూ. అప్పట్లో ఇర్ఫాన్ ని ఇంకా మరెన్నో సీరియల్స్ లో చూసేదాన్ని. నాకు బాగా గుర్తున్నవి - 'చంద్రకాంత', 'చాణక్య', 'శ్రీకాంత్', 'స్పర్ష్' సీరియల్స్. మంచి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకునేవాడు ఇర్ఫాన్. మంచి పాత్రలను ఎంత బాగా చేసేవాడో, నెగెటివ్ రోల్స్ లో కూడా అంతే బాగా నటించడం అతడి ప్రత్యేకత. అందుకేనేమో అంతమంది టీవీ ఆర్టిస్టుల్లో బాగా గుర్తుండిపోయాడు. సినిమాల్లో అవకాశాలు లేటుగా వచ్చినా అదృష్టవశాత్తూ మంచి memorable roles లభించాయి ఇతనికి. తను నటించిన సినిమాల్లో నేను చూసినవి చాలా తక్కువే. తపన్ సిన్హా తీసిన "ఏక్ డాక్టర్ కీ మౌత్", విశాల్ భరద్వాజ్ తీసిన "మక్బూల్", తెలుగులో విలన్ గా నటించిన "సైనికుడు", Salaam bombay, Slumdog millionaire, New york, New york, I love you, Life in a - Metro, Life of Pi, The lunch box, Piku మొదలైనవి గుర్తున్నాయి. అన్నింటిలోనూ Piku బాగా గుర్తుంది. ముఖ్యంగా చిత్రంలో వంద శాతం మార్కులు అమితాబ్ నటనకే అయినా, దీపిక తో పాటూ అంతే దీటుగా నటించిన ఇర్ఫాన్ పాత్ర కూడా గుర్తుండిపోయింది. తన కృషికీ, కష్టానికీ ఫలితంగా పద్మశ్రీ పురస్కారాన్ని సగర్వంగా అందుకోగలగడం ఒకవిధంగా చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ప్రతిభ ఉండి, ఎంతో కళాసేవ చేసిన ఎందరో మహానుభావులు, కళాకారులు ఆ పురస్కారాన్ని అందుకోకుండానే వెళ్పోయారు. ఇర్ఫాన్ ఇక లేడన్న వార్త చదవగానే బాధతో పాటూ ఒక నిట్టూర్పూ... ఇతని ఆయుష్షు సంగతి తెలిసేనేమో భగవంతుడు పిన్న వయసులోనే ఆ పురస్కారాన్ని ఇర్ఫాన్ కి అందించేశాడనిపించింది. హాస్పటల్ లో తన అభిమానుల కోసం రికార్డ్ చేసిన తన చివరి సందేశం గురించి చదివి మనసు ఎంతో ఆర్ద్రమైంది..! చివరి క్షాణాలని ఎదుర్కోవడానికి కూడా ఎంతో bravery ఉండాలి. అవే చివరి క్షణాలు అని తెలియకుండా వెళ్పోయేవారు దురదృష్టవంతులే కానీ అవే చివరి క్షణాలు అని తెలిసాకా చెప్పే మాటల్లో ఎంతో సత్యం దాగి ఉంటుంది. ఈమధ్యన near death experiences గురించి ఒక ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికరమైన విషయాలు విన్నాను. హ్మ్!! ఏదేమైనా ఇర్ఫాన్ ఆత్మకి శాంతి కలుగుగాక! ఈ సందర్భంలో H.W.long fellow పద్యంలోని నాలుగు వాక్యాలు ... "Lives of great men all remind us We can make our lives sublime, And, departing, leave behind us Footprints on the sands of time"
ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా తెలీకుండా కొన్ని అరుదైన చిత్రాలు విడుదలై అతి త్వరగా మయమైపోతూ ఉంటాయి. మన జీవన శైలి, గమ్యం ఏవైనా, ఆ సినిమా చూసిన ప్రతి వ్యక్తికీ స్ఫూర్తిని అందించి, ఒక నూతనోత్సాహాన్ని నింపే పనిని ఇటువంటి అరుదైన చిత్రాలు చేస్తూ ఉంటాయి. అటువంటి కోవకి చెందిన అరుదైన ప్రేరణాత్మక బయోపిక్ "మల్లేశం". తెలుగు సినిమా వెలుగుని తళుక్కుమని చూపెట్టే అతికొద్ది మెరుపుల్లాంటి సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుంది. పెళ్ళిచూపులు సినిమాలో "నా చావు నే చస్తా నీకెందుకు?" అనే డైలాగ్ తో ఫేమస్ అయిన నటుడు ప్రియదర్శిప్రతిభావంతుడైన కళాకారుడిగా తనను తాను నిరూపించుకున్న ఒక ప్రేరణాత్మక బయోపిక్ "మల్లేశం". 2017లో తాను తయారుచేసిన "లక్ష్మీ ఆసు చేనేత యంత్రం" ఆవిష్కారానికి గానూ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చింతకింది మల్లేశం జీవితకథ ఈ చిత్రానికి ఆధారం. చింతకింది మల్లేశం వృత్తిరీత్యా ఒక చేనేత కార్మికుడు. తెలంగాణా లోని నల్గొండ జిల్లాకు చెందిన షార్జిపేట గ్రామంలో సాంప్రదాయంగా వస్తున్న పోచంపల్లి పట్టుచీరల నేతపని చేసే కుటుంబం వారిది. చిన్ననాటి నుంచీ తన గ్రామంలో చేనేత పని చేసే కుటుంబాలలో మహిళలు పడే శ్రమనూ, ఇబ్బందులనూ చూస్తూ పెరుగుతాడు మల్లేశం. ముఖ్యంగా తన ఇంట్లో తల్లి పడే కష్టాన్ని దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్న ఆపిల్లాడికి ఒకటే తపన - తల్లిని సుఖపెట్టాలని; నేత పనిలో ఉన్న ఇబ్బందుల నుండి తల్లికీ, తన గ్రామంలోని ఇతర మహిళలకూ శ్రమను తగ్గించాలని! తమ ఇంట్లోని బలహీనమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆరవ తరగతితో మల్లేశం చదువు ఆపేయాల్సివస్తుంది. విషయం కనుక్కోవడానికి ఇంటికి వచ్చిన మాష్టారు ఒక డిక్షనరీ ఇచ్చారనీ, అది తనకెంతో ఉపయోగపడిందని సినిమా చివర్లో చూపించిన ఉపన్యాసంలో చెప్తాడు చింతకింది మల్లేశం. మషీన్ తయారుచెయ్యాలని సంకల్పం అయితే చేసుకుంటాడు కానీ సరైన(సాంకేతికపరమైన) చదువులేకపోవడం వల్ల అది ఎలా తయారుచెయ్యాలో తెలీక సతమతమౌతాడు మల్లేశం. కొన్నేళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ, కుటుంబానికి దూరంగా పట్నంలో ఉంటూ, చివరికి అనుకున్నది సాధిస్తాడు అతను. తయారు చేసిన మషీన్ కు తన తల్లి పేరు పెట్టి, అందరికీ చూపెడతాడు. ఒక జీవిత కథను సినిమాగా మలిచేప్పుడు ఎన్నో మార్పులు జరుగుతాయి. కానీ ఈ అసలు కథలో నిబిడీకృతమైన స్ఫూర్తిని ప్రేక్షకుల మనసుల దాకా తీసుకురావడంలో దర్శకుడు రాజ్ రాచకొండ సఫలీకృతమయ్యారు. నటి ఝాన్సీ తానొక మంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ నని మరోసారి నిరూపించుకుంది. కమెడియన్ గానే ఎక్కువగా పాపులర్ అయిన ప్రియదర్శి కూడా అవకాశం ఇస్తే ఎటువంటి పాత్రనైనా సులువుగా చెయ్యగలనని మల్లేశం పాత్రతో నిరూపించాడు. చక్కని పల్లె వాతావరణం, నటీనటుల సహజమైన నటన, ముఖ్యంగా వారి సహజమైన మేకప్, పల్లెల్లో జరుపుకునే పండుగలు, ఉత్సవాలు అన్నీ బాగా చూపెట్టారు. ఏ పాటలు పెట్టకపోతే కూడా ఇంకా సహజంగా ఉండేదేమో అనిపించింది కానీ ఈ జానపద గీతం బావుంది -
చింతకింది మల్లేశం inspirational TEDx speech:
ఈ చిత్రాన్ని Netflix లో చూడవచ్చు. ఇటువంటి మంచి చిత్రాలు మరిన్ని ఆన్లైన్ మాధ్యమాల్లో లభ్యమయ్యే ఏర్పాటు జరిగితే బావుంటుంది.
2018లో విడుదలైన "చిllలllసౌll " చిత్రం విడుదలైనప్పుడు, టైటిల్ తమాషాగా ఉందే చూద్దామనికునేలోగా, చాలా త్వరగా వెళ్పోయింది. గత ఏడాదిలో నాకు ఈ చిత్రం చూడడం కుదిరింది. చాలా బావుందని బంధుమిత్రులందరికీ వీలైతే చూడమని సజెస్ట్ చేశాను. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి ఇది మొదటి చిత్రమని తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. మొదటి సినిమా ఇంత పర్ఫెక్ట్ గానా అని. ఆ తర్వాత ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే కు గానూ జాతీయ బహుమతి లభించిందని చదివి చాలా ఆనందించాను. ’పెళ్ళిచూపులు ’ అనే తతంగం ఒక సమరంలాగ, జీవన్మరణ సమస్య లాగ సాగిన రోజుల్లో, ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్ళిచూపులకి కూర్చున్న ప్రతి అమ్మాయీ ఈ కథకు కనక్ట్ అవుతుంది. హీరోయిన్ గా నటించిన రుహానీ శర్మ ఎంతో బాగా తన పాత్రను ప్రెజెంట్ చేసింది. ఆమె పాత్రకు ప్రాణం పోసిన క్రెడిట్ మాత్రం ఆమెకు గాత్రదానం చేసిన చిన్మయి శ్రీపాదకి దక్కుతుంది. అసలా అమ్మాయి వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది. పాడే పాటకూ , చేప్పే డబ్బింగ్ కూ - రెండిటికీ ప్రాణం పోసేస్తుంది. గిఫ్టెడ్ వాయిస్ అనాలేమో! ఇంక కథలోకి వస్తే "ఐదేళ్ల వరకూ అసలు పెళ్ళే వద్దు" అంటున్న ఒక అబ్బాయిని పెళ్ళి చూపులకి ఒప్పిస్తారు అతడి అమ్మానాన్నా. పేరు అర్జున్. పెళ్ళిచూపులకి వెళ్లడం అర్జున్ కి ఇష్టం లేదు కాబట్టి ఓ సంబంధం చూసి, ఆ అమ్మాయిని వాళ్ల ఇంటికే రావడానికి ఒప్పించి, ఓ సాయంత్రం పూట - "ఆ అమ్మాయి వచ్చేస్తోంది రెడీగా ఉండు" అని కొడుక్కి చెప్పేసి, వాళ్ళు షికారుకి వెళ్పోతారు. అయోమయంగా మారిన ఆ అబ్బాయి వచ్చిన అమ్మాయితో సరిగ్గా మట్లాడడు. ఇష్టం లేకపోతే నన్నెందుకు పిలిచారు అని ఆ అమ్మాయి కోప్పడేస్తుంది. "ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి.." అని అనుకుంటూ ఆ మాట బయటకు అనేస్తుంది. అదేమిటని అబ్బాయి అడుగుతాడు. అప్పుడు తన కథ చెప్పుకొస్తుంది అంజలి(వచ్చిన పెళ్ళికూతురు). తన తల్లికి బైపోలార్ డిజాడర్ ఉందనీ, అందువల్ల ఇంతకు ముందు తప్పిపోయిన రెండు సంబంధాల గురించీ, ఇప్పుడు కూడా ఇలాంటి ఆక్వార్డ్ పెళ్ళిచూపులకి ఎందుకు ఒప్పుకున్నదీ చెప్తుంది. ఇద్దరికీ స్నేహం కుదిరి కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా ఆ అమ్మయి వెళ్పోతుంది. ఎందుకనో వెళ్ళాలనిపించి, వెనకాలే తలుపు తీసుకుని వచ్చిన ఆ అబ్బాయికి మెట్ల మీద గోడకి తల ఆనించి, బాధగా నిల్చున్న ఆ అమ్మాయి కనిపించి దగ్గరకు వెళ్తాడు. ఆ క్షణంలో విపరీతమైన బాధలో అతడి భుజానికి తల ఆనించి ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. మొత్తం సినిమాలోకెల్లా నాకు బాగా నచ్చిన సీన్ అది. కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఆబ్బాయిని తనకి దూరంగా ఉండమని, తన బాధలేవో తానే పడతానని చెప్పి వెళ్పోతుంది. కానీ మన కన్ఫ్యూజింగ్ పెళ్లికొడుకు వెనకాలే వెళ్తాడు. తర్వాత ఆ రాత్రంతా జరిగే కథే మిగిలిన చిత్రకథ ! చాలా స్ట్రాంగ్ గా portray చేసిన అంజలి కేరక్టర్ ఎంతో కాలం గుర్తుండిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి హీరోయినే కాదు హీరో కూడా అంజలే ! పెళ్ళికొడుకు పాత్రధారి సుశాంత్. నాగార్జున పోలికలు బాగానే కనిపించాయి. ఇంతకు ముందు సుశాంత్ సినిమాలేవీ చూడలేదు నేను. ఇలాగే కంటిన్యూ అయితే నటుడిగా నిలబడగలడు అనిపించింది. అంజలి తల్లిగా రోహిణిది కూడా గుర్తుండిపోయే పాత్ర. డి-గ్లామరస్ రోల్ ప్లే చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇంతకన్నా సినిమా గురించి ఏమీ రాయను. వీలైతే చూడమనే చెప్తాను. ట్రైలర్ :
చిత్రంలో ప్రశాంత్.ఆర్.విహారి సంగీతాన్ని సమకూర్చిన రెండు పాటలూ బావున్నాయి. రెండు పాటలలో నాకు నచ్చిన ఈ పాటకు సాహిత్యాన్ని అందించింది కిట్టూ విస్సాప్రగడ .
నీ పెదవంచున విరబూసిన చిరునవ్వులో ఏ కనులెన్నడూ గమనించని ముళ్ళున్నవో వర్షించే అదే నింగికీ, హర్షించే ఇదే నేలకీ మేఘంలా మదే భారమై, నడుమ నలిగి కుమిలి కరిగే సంకెళ్ళే విహంగాలకి వేస్తున్న విధానాలకి ఎదురేగే కథే నీది అని తెలిసి మనసు నిలవగలదా?
*** *** ***
మరో పాట "తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా..." కూడా బావుంది. ఆ సాహిత్యాన్ని అందించింది శ్రీ సాయి కిరణ్.
ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన చాలా ఇష్టమైన కొన్ని పనులు.. మధ్యలో వదిలేయడం చాలా కష్టమే. కానీ ఆ పనులు మన మార్గానికే ఆటంకమై, ముందడుగు పడనీయనప్పుడు, ఆగిపోవడమో, వేరే దారిని వెతుక్కోవడమో.. ఏదో ఒకటి చెయ్యాలి. నాలుగేళ్ల క్రితం అటువంటి ఆటంకంఏర్పడినప్పుడు.. ఇది నా సమయం కాదు అనుకుని మౌనంగా ఆగిపోయాను. నాకు ప్రాణ కన్నా ఎక్కువైన ఈ బ్లాగుని కూడా మూసేసాను. వెనక్కు తిరిగి చూసిందే లేదు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటైన పనే. ఈసారి భగవంతుడు నాకు మరో చక్కని మార్గాన్ని చూపెట్టాడు. ఆరేళ్ల బ్లాగ్ రాత వెతను మిగిల్చినా, మరో విధంగా ఉపయోగపడింది.. ఒక పనిలో ఒదగగలిగాను. ఇక తీరదనుకున్న ఒక చిరకాల కోరిక నెరవేరింది ! స్వల్పమే అయినా సొంత సంపాదన ఎంత ఆనందాన్ని ఇస్తుందో, వాటితో కావాలనుకున్న వస్తువులు కొనుక్కోవడం అంతకు మించిన తృప్తిని ఇస్తుంది. కానీ రాయాలనే బలమైన కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది. మనకి ఆనందాన్ని కలిగించి, మనసు పెట్టి చేసే ఏ పనినీ ఆపకూడదంటారు పెద్దలు. చేతనయినంతలో ఏ కోరికనూ మిగిలిపోనీయకూడదనే ఆలోచనతో నాలుగేళ్ళ తరువాత మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. కేవలం రాయడం మాత్రమే..! కామెంట్ బాక్స్ ని తొలగించడం కూడా చాలా తేలిగ్గా చేసిన పని. ఎప్పుడో చెయ్యాల్సినది.. ఇప్పటికైనా ఆలస్యంగా చేసాను. ఇవాళ ఇంకో పని చేసాను..నా 'సంగీతప్రియ ', 'సినిమా పేజీ' బ్లాగులను డిలీట్ చేసేసాను. అందులోని టపాలన్నీ ఈ బ్లాగ్ లోకి ఇంపోర్ట్ చేశాను. అప్పట్లో.. ఏడు నెలలు మోసిన బిడ్డను కోల్పోయినప్పుడు, ఆ బాధను మరవటానికి నాలుగు కొత్త బ్లాగులు కావాలని మొదలుపెట్టి, మరో ఆలోచన అనేది రాకుండా బ్లాగుల్లో తోచింది రాసుకుంటూ బాధను మరిచేదాన్ని! ఇవాళ నా చేతులతో నేనే ఆ బ్లాగులు డిలీట్ చేశాను. ఒకప్పుడైతే బాధపడేదాన్నే.. కానీ ఇప్పుడు చాలా బావుంది. తేలికగా ఉంది. ఓడిపోయాననిపించడం లేదు. అల్లిబిల్లిగా పెరిగిన మొక్కలను ప్రూనింగ్ చేసినట్లు ఉంది. చిన్న మొక్క నుండీ చెట్లు గా మారిన తోటలో మందారాలు, నందివర్ధనాలూ శుభ్రంగా ట్రిమ్ చేసినట్లు! కొమ్మలు కట్ చేసేప్పుడు చివుక్కుమనిపిస్తుంది, చేతులు రావసలు. కానీ కొత్త చిగుర్లు కనబడగానే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎందుకనో అనిపించింది..డిలీట్ చేసేసాను. అయినా చెట్టంత మనుషులే పుటుక్కున మాయమైపోతున్నారు... వాటితో పోలిస్తే ఇదెంతనీ!!
2018లో అనుకుంటా ఒకరోజు అనుకోకుండా ఈ సినిమా చూశాను. చాలా చిత్రమైన కథ. ఒక స్టార్ హోటల్లో intern స్టూడెంట్స్ కొందరు పనిచేస్తూ ఉంటారు. ఒకే గ్రూప్ కాబట్టి అందరూ కలివిడిగా, స్నేహంగా ఉంటారు. కానీ Dan అనే కుర్రాడు కొంచెం రెక్లెస్ గా, ఇర్రెగులర్ గా, ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. మిగతావారితో కూడా పేచీలు పడుతూ ఉంటాడు. గ్రూప్ లో ఒకరిద్దరు మిత్రులు మాత్రమే ఉంటారు. కొత్తగా వచ్చిన జూనియర్ ఒకమ్మాయి పారిజాతం పూలు ఏరుతూండగా చూస్తాడు. ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోరు కానీ ఒకర్ని ఒకరు గమనిస్తూ ఉంటారు. Dan స్నేహితురాలికి ఈ అమ్మాయి ఫ్రెండ్ అన్నమాట. ఆ అమ్మాయి పేరు షూలీ అయ్యర్. పారిజాతాలని "షూలీ" అంటారు. ఆ అమ్మాయికి ఆ పూలు ఇష్టం అని అదే పేరు పెడతారు ఇంట్లోవాళ్ళు. ఒకరోజు హోటల్ టేర్రేస్ మీద ఏదో పార్టీ జరుగుతుండగా ఆ కొత్తమ్మాయి పిట్టగోడని ఆనుకుందామని వెనక్కి జరిగి పొరపాటున పైనుంచి క్రిందకి పడిపోతుంది. చనిపోదు కానీ మేజర్ ఇంజరీస్ కారణంగా కోమాలోకి వెళ్పోతుంది. Dan రెండురోజుల తర్వాత డ్యూటీకి వచ్చాకా విషయం వింటాడు. ఆ పిల్ల పడిపోయే ముందు మాటాడిన ఆఖరి మాట "where is Dan?" అని తెలిసి ఆశ్చర్యపోతాడు. అప్పటిదాకా ఎంతో రెక్లెస్ గా ఉండే అతడు విచిత్రంగా ఎంతో మారిపోతాడు.. "నా గురించి అడిగిందా? నా గురించా..? " అని ఆలోచిస్తూ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. హాస్పటల్ బెడ్ మీద ఏ మాత్రం స్పృహ లేకుండా ఉన్న ఆ అమ్మాయిని చూసి కదిలిపోతాడు. "ఎందుకు నా గురించి అడిగావు?" అంటూ ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెడతాడు. నెమ్మదిగా రోజూ వచ్చి కాసేపు ఆ అమ్మాయి దగ్గర కూర్చుని మాట్లడుతూ ఉంటాడు. కోమా లో ఉన్న అమ్మాయికీ , అతడికీ చిత్రమైన బంధం ఏర్పడుతుంది. పెద్దగా పరిచయం కూడా లేని ఆ అమ్మాయి కోసం ఓ కుటుంభసభ్యుడిలా సహాయం చేయడం మొదలుపెడతాడు. ఉద్యోగం చేసే తల్లి మాత్రమే వారి కుటుంబానికి ఆధారం అని తెలుసుని, తన డ్యూటీలు ఎడ్జస్ట్ చేసుకుంటూ వారికి సాయం చేయడం మొదలుపెడతాడు. చిత్రంగా ఆ అమ్మాయితో అతడికి ఎంతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. బాధ్యతగా తన పనులు చేసుకుంటూ, ఎంతో శ్రధ్ధగా ఆ అమ్మాయిని చూసుకోవడం మొదలుపెడతాడు. అసలు లేస్తుందో లేదో తెలియని ఆ అమ్మాయి కోసం జీవితం వృధా చేసుకోవద్దని చాలామంది చెప్తారు. షూలీ తల్లి కూడా నచ్చ చెప్పి అతడిని పంపేస్తుంది. వేరే ఊరు వెళ్పోతాడు. ఆ అమ్మాయి కోమాలోంచి లేచిందని ఒకరోజు ఫోన్ వస్తే తిరిగి వస్తాడు. వీల్ చైర్ లో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చేదాకా తోడు ఉండి ఎంతో సహాయం చేస్తాడు. వారిద్దరి మధ్యా పెరిగిన bond, ఆ అబ్బాయి తపన చూసి తీరాల్సిందే! శారీరిక ఆకర్షణలకు అతీతమైన బంధం కూడా ఉంటుంది అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఈ కథ. కోమాలో ఉన్న పేషేంట్స్ తో మాట్లాడుతూ ఉంటే వారికి వినిపిస్తుంది. నెమ్మదిగా మార్పు కూడా వస్తుంది అనే కొన్ని వార్తాపత్రికల వ్యాసల ఆధారంగా ఈ కథ తయారైందిట. అయితే ఈ కథ క్లైమాక్స్ నాకు నచ్చలేదు :( i don't like tragedies..! దర్శకుడు Shoojit Sircar మంచి వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు తీస్తూంటాడు. Dan పాత్రలో వరుణ్ ధవన్ జీవించాడనే చెప్పాలి. ఈ కుర్రాడి సినిమాలు రెండు,మూడు చూశాను. బాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ నటుడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ఈ పాత్ర కోసం వరుణ్ కొన్నాళ్ళు ఒక స్టార్ హోటల్లో పనిచేశాడట కూడా! షూలీ పాత్రను బందిత అనే బ్రిటిష్ నటి పోషించింది. ఎక్కువ సినిమాలు చెయ్యలేదనుకుంటా. భారీ డవిలాగులు చెప్పేస్తూ నటించడం కన్నా ఏ డవిలాగులూ లేకుండా మంచానికి అతుక్కుపోయి, డిగ్లామరస్ రోల్ ప్లే చేయడం చాలా కష్టమైన పని. ఈ పిల్ల కళ్ళు చాలా బావున్నాయి. పేధ్ధవి! ట్రైలర్:
దక్షిణ భారత కర్ణాటక సంగీత విద్వాంసులలో చెప్పుకుని తీరాల్సిన కళాకారుడు టి.ఎం. కృష్ణ. గాయకుడే కాక మంచి రచయిత కూడా. కొన్నేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈయన గురించి నేను చదివింది హిందూ దినపత్రికలో. ఈయన పుస్తకం ఒకటి రిలీజ్ అయినప్పుడు పెద్ద ఇంటర్వ్యూ వేశారు పేపర్ లో. అది చదివి ఆసక్తి కలిగి ఈయన సంగీతామృతాన్ని వినడం జరిగింది. అది మొదలు నాకు అత్యంత ఇష్టమైన గాయకుల జాబితాలో చేరిపోయారు టి.ఎం. కృష్ణ. ఆసక్తి ఉన్నవారు ఈయన గురించిన మరిన్ని వివరాలు క్రింద లింక్స్ లో తెలుసుకోవచ్చు. https://en.wikipedia.org/wiki/T._M._Krishna https://tmkrishna.com/ టి.ఎం. కృష్ణ కాన్సర్ట్స్ లో అన్నింటికన్నా నాకు బాగా నచ్చినది ముత్తుస్వామి దీక్షితార్ రచన "రంగపుర విహారా.." ! ఈ కృతి వేరే ఎవరు పాడినదీ నాకు అంతగా రుచించదు. ఈయన పాడినది మాత్రం అసలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. వింటూంటే... ఏవో గంధర్వలోకాల్లో విహరిస్తున్నట్లు, అమృతం ఇలా ఎవరో చెవిలో పోస్తున్నట్లు, మనసంతా హాయిగా దూదిలా తేలికగా గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది నాకు. ఆసక్తి ఉన్నవారు వినండి -
సాహిత్యం: రచన : ముత్తుస్వామి దీక్షితార్ రాగం: బృందావనసారంగ