ఇన్వెన్షన్ కీ డిస్కవరీకీ తేడా తెలిసేది కాదు నాకు చిన్నప్పుడు. అప్పుడు నాన్న చెప్పారు "ఏదైన కొత్త విషయాన్ని కనిపెడితే "ఇన్వెన్షన్", ఆల్రెడీ ఉన్నదాన్నే కొత్తగా కనుక్కుంటే "డిస్కవరీ" అని. అలాగ ఈ మధ్యన నేను డిస్కవర్ చేసిన బ్లాగులు కొన్నింటి గురించి ఈ టపాలో రాయాలని. అసలీ సింహావలోకనం-2 ఏమిటంటే, రేడియోలో ప్రతి డిసెంబర్ 31st కీ "సింహావలోకనం" అనే కార్యక్రమం వస్తూ ఉంటుంది. ఆ సంవత్సరంలో ప్రసారమైన అన్నికార్యక్రమాల బిట్స్, విశేషాలు ఉంటాయి అందులో. క్రితం ఏడాది అలాంటి ఒక టపా రాయాలనే ఆలోచన బుర్రని దొలిచింది. ఆ టపా "ఇక్కడ" చూడవచ్చు. ఆ పోస్ట్ లో నేను అప్పట్లో చూసిన బ్లాగుల్లో నాకు నచ్చిన టపాలు కొన్ని ఏరి కూర్చాను.
కానీ ఈ సారి సగం ఏడాది దాకా అసలు నా బ్లాగు నేనే సరిగ్గా రాయలేదు. మూడు కొత్తవి తెరిచి, వాటిల్లోనూ అనుకున్నవి రాయలేకపోతున్నాను. ఇక బ్లాగులు చదవటం, వ్యాఖ్యానించటం కూడా చాలా తక్కువైపోయింది. సగం మంది బ్లాగ్మిత్రులు నన్ను మర్చిపోయారు. అడపాదడపా టపాల్రాసినా వ్యాఖ్యలు రావటం కూడా తగ్గిపోయాయి. అందుకని అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడల్లా బ్లాగ్లోకంలో విహరించటం మొదలుపెట్టాను. అప్పుడు పాత బ్లాగ్మిత్రులు చాలామంది టపాలు రాయటం తగ్గించేసారని అర్ధమైంది. బ్లాగుల నాణ్యత తగ్గిపోతోందని కూడా చాలామంది అనుకుంటున్నారని తెలిసింది.
అయ్యో, తెలుగు బ్లాగుల పరిస్థితి ఇదా? అని బాధపడుతూ బ్లాగ్విహారాలు చేస్తున్న ఇటీవల సమయంలో కొత్త బ్లాగులు డిస్కవర్ చేసాను...అంటే నేను అదివరకూ చూడనివన్నమట. నాకు బాగా నచ్చాయి. బ్లాగ్లోక సాహిత్యానికి మంచి రోజులు ఉన్నాయి అనిపించింది. వీటిని మించిన మంచి బ్లాగులు ఉండి ఉండవచ్చు. కానీ నా పరిధిలో, నా విహరణలో కనబడ్డ బ్లాగులు ఇవి. బ్లాగులను పరిచయం చేసేంత ప్రాముఖ్యం నా బ్లాగుకీ, నాకూ లేకపోయినా, ఈ బ్లాగులను గురించి ఓ నాలుకు వాక్యాలు రాయాలనిపించింది.
ముందుగా అందరికీ తెలిసినదే కానీ నేను ఆలస్యంగా చూసిన మంచి బ్లాగ్..."నీలాంబరి ". నా "సినిమా పేజీ" బ్లాగ్‌లో శారదగారు రాసిన కామెంట్ వల్ల ఆ బ్లాగ్ తెలిసింది. వీరు చాలా కాలం నుంచీ బ్లాగుతున్నారని ఖజానా చూస్తే తెలిసింది. ఎన్నో జ్ఞాపకాలు, బోలెడు పుస్తకాలు, సంగీతం, సాహిత్యం..ఎన్ని కబుర్లో...చదివిన ప్రతి టపా ఈ బ్లాగర్ పట్ల అభిమానం పెంచేసింది.
"అంచేత నేను చెప్పొచ్చేదేంటంతే!!!!!!" అంటూ చెప్పుకుపోయే ఈయన ఈ బ్లాగ్ మొదలు పెట్టింది చాలా కాలం క్రితమైనా టపాలు చాలా తక్కువగా రాస్తూంటారు. "SHANKY" పేరుతో బ్లాగే ఈయన రాసే పేరడీలు భలే చమత్కారంగా ఉంటాయి. ఆసక్తికరమైన ఈ బ్లాగ్‌లోని చాలా టపాలను నేనింకా చదవాల్సి ఉంది. మర్క్ చేసుకుని మరీ చదవాల్సినంత మంచి బ్లాగ్ ఇది.
అనుకోకుండా నకు కనబడ్డ బ్లాగ్ "కలం కలలు(పాత బ్లాగ్)" ఈ బ్లాగుని మూసివేస్తున్నాను...అంటూ ఫణీంద్ర అనే ఆయన రాసిన టపా ముందర కనబడుతుంది. చాలా మంది బ్లాగ్మిత్రులు రాసిన వ్యాఖ్యలు కూడా కనబడతాయి. ఎందుకు మూసేసారో తెలీదు కానీ పుస్తకాలూ,సాహిత్యం అంటూ ఎన్నో మంచి విషయాలను రాసిన ఈయన మళ్ళీ బ్లాగ్ తెరిస్తే బాగుండును అనిపిస్తుంది ఆ టపాలను చదువుతూంటే.
కొన్ని బ్లాగులు చదవాలంటే సాహిత్యం పట్ల కాసింత అవగాహన, భాషపై పట్టు ఉండాలి. అలాంటి ఒక బ్లాగ్ "కలం కలలు" పైన మెన్షన్ చేసిన బ్లాగ్ పేరూ, ఈ బ్లాగ్ పేరూ ఒకటే. మరి రెండీటికీ లింక్ ఉండా లేదా అన్నది వాళ్ళని అడగి తెలుసుకోవాల్సినదే. మేంఇద్దరం రాస్తున్నం అంటూ "మెహెర్, సంహిత" కలిసి రాసే ఈ బ్లాగ్ నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది. సంహితగారు రాసే కవితలు ఎంతో భావయుక్తంగా చక్కని పదాల కూర్పుతో చదువుతూంటే తొలకరి జల్లుని, సంపెంగల సుగంధాన్ని గుర్తుకుస్తాయి. అంత మంచి కవితలవి. ఇక ఈ బ్లాగ్‌లో రాసే మిగతా సాహిత్యపు కబుర్లు కూడా సాహిత్యాభిమానులను ఆకర్షించేవిగానే ఉంటాయి.
"MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం" రెండు రోజుల క్రితం చూసిన బ్లాగ్ ఇది. బ్లాగ్ పేరు విచిత్రంగా అనిపించి చూద్దామని వెళ్ళా. చిత్తూరు గ్రీమ్స్ పేట్ మునిసిపల్ హై స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు తమ సహాధ్యాయులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉండేందుకు ఈ సైట్ నిర్మింపబడినది. అని రాసారు. చిన్నప్పటి గ్రూప్ ఫోటోలూ, కబుర్లూ చూసి వాళ్ళ నెట్వర్కకింగ్ ఐడియాకు సలాం చేసేసా. ఈ బ్లాగ్‌లో చిన్ననాటి ముచ్చట్లే కాక పాటలూ, సినిమాల తాలూకూ కబుర్లు కూడా ఉన్నాయి. ఈ బ్లాగ్‌లోని గ్రూప్ ఫోటోస్ అవీ చూసి నేను కూడా నా స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకున్న...ఆ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో...ఆటోగ్రాఫ్ బుక్ తీసి ఆ ఎడ్రస్సులకి ఉత్తరాలు రాస్తే జవాబులు వస్తాయా? అనిపించింది. అప్పట్లో ఫోన్లు కూడా అందరికీ ఉండేవి కాదు మరి. అడ్రసులే ఆధారం.
ఇక "ఇందు" గారి చేస్తున్న "వెన్నెలసంతకం" గురించి నేను కొత్తగా ఏం చెప్పేది? ఈవిడ తోటలోని సీతాకోకచిలుకలు బాగున్నాయి నా తోటలోకి కూడా పంపించమని అడిగాను...ఎప్పటికి పంపుతారో...! ఈ బ్లాగ్ రచయిత్రి కథలు కూడా చాలా బాగా రాయగలరు అని మొదటి కథతోనే నిరూపించేసుకున్నారు.
బ్లాగ్ మొదలెట్టింది క్రితం ఏడాది. రాసినవి ఆరో ఏడో టపాలు. "ఈ పేరు నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు" అని గోల పెట్టిన "శివరంజని"గారి పేరు మాత్రం బ్లాగ్లోకంలో మారుమ్రోగిపోతోంది.
ఇది మౌనరాగం కాదంటూ "మనసుపలికే" అపర్ణగారు ఆలపించే మధురమైన రాగాలు బ్లాగ్లోకమంతటా వినిపించేస్తున్నాయి. మా గోదావరి అమ్మాయిలు ఎక్కువైపోతున్నారే అని నేను సంబర పడిన బ్లాగ్ ఇది. ఇటీవలే ఈ బ్లాగ్‌లో పెట్టిన పాపికొండల ట్రిప్ ఫోటోలు అమాంతం గోదావరి దగ్గరకెళ్ళిపోయి ఆ సోయగాల్ని చూడాలనిపించేలా ఉన్నాయి.
"ఎన్నెల రామాయణం" అని మాలికలో చూసి అటువెళ్ళిన నేను ఆ వెన్నెల చల్లదనం చూసి మైమరచిపోయాను. అంత బాగుంటుంది ఆ చందమామ ఫోటో. టపాలు ఎక్కువ లేకపోయినా ఈ "ఎన్నెల" ఎందుకో మరి నా మనసు దోచేసింది. "వెన్నెల" పేరులో ఉన్న మేజిక్ అది. తెలంగాణా స్లాంగ్ లో ఈవిడ రాసిన ఎన్నెల రామయణం ఎంత చదువుదామని ఆత్రుత పడ్డా ఆ భాషరాక పట్టుమని నాలుగు లైనులైనా చదవలేకపోయాను..:( ఆ టపాలకు వచ్చిన వ్యాఖ్యలు ప్రశంసల వెన్నెలలు వెదజల్లాయి. ఈవిడ మరిన్ని మంచి మంచి టపాలు రాసి చిరునవ్వుల ఎన్నెలలు కురిపించాలని మనవి.
ఈ పల్లవులు కనుక్కోగలరా అని ఈ బ్లాగర్ విసురుతున్న సవాళ్ళు ఎన్నో పాత పాటలనూ, అంతే మంచి జ్ఞాపకాలనూ గుర్తుకు తెస్తున్నాయి. పాటలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చే బ్లాగ్ ఇది. జ్ఞాపకాల గులాబీల పరిమళాలు అంటూ " మెహక్ " గుర్తుచేసే పాటలు అన్నీ మధురమైనవే.
గోదారి సుధీర గారి "పాపాయ్" నేనీమధ్యన చూసిన బ్లాగుల్లో ఒకటి. ఖలీల్ జిబ్రాన్ మాటలతో స్వాగతం చెప్పే ఈ బ్లాగ్‌లో బెంగాలీ సాహిత్యంతో పరిచయమున్న ప్రతివారికీ ఇష్టమయ్యే "శరత్" ఇల్లు, ఇంకా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఉండే ప్రదేశం తాలూకూ కబుర్లు, కొన్ని కథలతో ఆసక్తికరమైన బ్లాగ్ ఇది.
టపాలు తక్కువగా ఉన్నా మంచి అభిరుచి ఉందే అనిపించే బ్లాగ్ "కలభాషిణి" . ఈ బ్లాగ్‌లో టపాలు చదివితే ఆ సంగతి అర్ధమౌతుంది.
జూన్ నుంచీ మొదలైన "శ్రీసుగన్ ధ్" బ్లాగ్‌లో కూడా ఆరేడు టపాలకు మించి లేవు. కానీ వీరు టపాలు ఎక్కువ రాస్తే బాగుంటుంది అనిపించేలా ఉన్నాయి 'కేకే'గారి టపాలు.
*****************************
చిగురించే కొత్త ఆశలతో
పెదవుల నవ్వుల హరివిల్లులతో
గెలుపుబాటనే పయనంతో
మధుర క్షణాల జ్ఞాపకాలతో
మీ మరొక సంవత్సరం
నిండాలని మనసారా కోరుతూ
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తృష్ణ.