సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Showing posts with label సినిమా పేజీ. Show all posts
Showing posts with label సినిమా పేజీ. Show all posts

Tuesday, April 30, 2013

బాలరాజు కథ(1970)




1970 లో బాపూ దర్శకత్వంలో వచ్చిన సినిమా "బాలరాజు కథ". 1971లో ఉత్తమ జాతీయ
తెలుగు చిత్రం పురస్కారాన్ని అందుకుంది. 'ఏ.పి.నాగరాజన్' గారి కథకు, 'ముళ్ళపూడి' మాటలు రాసారు. ఈ సినిమా బాలల చిత్రమనిపించినా, పెద్దవారిని కూడా ఆకట్టుకునే చిత్రమిది. ఇప్పటి పిల్లలకూ చూపిస్తే కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తారీ సినిమాని అనిపిస్తుంది చూసినప్పుడల్లా. 


బాలరాజుగా మాష్టర్ ప్రభాకర్, అతని చిట్టిచెల్లిగా బేబీ సుమతి ఉత్సాహవంతంగా నటించారు. మిగతా పాత్రల్లో నాగభూషణం, అల్లు రామలింగయ్య, సూర్యాకాంతం, మిక్కిలినేని, హేమలత, ధూళిపాళ, పుష్పకుమారి మొదలైనవారు నటించారు. ఏనిమేషన్ తో రూపొందించిన సినిమా టైటిల్స్ ఓ ప్రత్యేక ఆకర్షణ. పిల్లల సినిమా కాబట్టి లా తీసారేమో కానీ మొత్తం సినిమా కథంతా క్లుప్తంగా ఈ టైటిల్స్ లోనే మనకు చూపెడతారు బాపూ.



చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని హాలుకు తీసుకువెళ్ళి చూపించిన నలుపు తెలుపు చిత్రాల్లో పాటలతో సహా బాగా గుర్తుండిపోయిన చిత్రం ఇది. ఆరుద్ర, కొసరాజు రాసిన పాటలకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ అనవచ్చు. మొత్తం ఆరు పాటలూ ఎంతో పాపులర్ అయ్యాయి. అన్ని పాటలు వినడానికీ, చూడటానికీ కూడా భలే సరదాగా ఉంటాయి.

* మహా బలిపురం మహా బలిపురం మహా బలిపురం...
* అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయద్దు..(క్రింద సినిమా లింక్లో 1:53:14
వద్ద ఈపాట  చూడవచ్చు)
* హిప్పి హిప్పీ హిప్పీ హిప్పీ ఆడపిల్లలు
* ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు
* చూడు చూడు తమాషా భలే తమాషా
* చెప్పు చెప్పు భాయ్

వీటిల్లో మొదటి రెండూ నాకు బాగా నచ్చుతాయి. మొదటి పాట యూట్యుబ్ లో దొరికింది. చూడండి..


* మహా బలిపురం మహా బలిపురం మహా బలిపురం...


  


కథలోకి వస్తే, బాలరాజు అనే కుర్రవాడు "మహా బలిపురం "లో టురిస్ట్ గైడ్ లా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అనారోగ్యంతో తల్లి చనిపోతే మిగిలిన ఒకేఒక తోడైన చెల్లెల్లితో మేనమామ ఇంట్లో ఉంటుంటాడు. మేనమామ కుటుంబానికి కూడా అతని సంపాదనే ఆధారం. మావయ్య పిల్లలు ముగ్గురు, వీళ్ళిద్దరూ.. మొత్తం అయిదుగురూ అన్యోన్యంగా ఉంటుంటారు. బాలరాజు ఉత్సాహం, తెలివితేటలు, చురుకుదనం ఊరు చూట్టానికి వచ్చిన టూరిస్టులందరినీ ఆకట్టుకుంటుంటాయి. 


ఒకరోజు ఒక ధనిక వ్యాపారవేత్త భార్యతో మహాబలిపురం వస్తాడు. సంతానం లేని ఆ జంట బాలరాజునీ, అతని చెల్లినీ చూసి ముచ్చటపడి వెంట తీశుకువెళ్ళి దత్తత చేసుకోవాలనుకుంటారు. రాజు మేనమామ ధనికుడితో బేరం కూడా కుదుర్చుకుంటాడు. కానీ అనుకోకుండా ఒక అవాంతరం ఎదురౌతుంది.


ధనికుడి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని,నష్టం వచ్చిందని తెలిసి పిల్లల అదృష్టంపై అతనికి అనుమానం వ్యక్తపరుస్తాడు. దంపతుల వాగ్వివాదం విన్న బాలరాజు చెల్లెలితో కలిసి వాళ్ల గెస్ట్ హౌస్ నుండి వెళ్పోతాడు కానీ తాము దురదృష్టవంతులమన్న మాట ఆ పిల్లవాడి మనసుని గాయపరుస్తుంది. చిత్రం మొదట్లో గురువుగారు చెప్పిన
'సప్త సూత్ర శాస్త్రం'లో మొదటి వాక్యం నిజమైందని అనుకుంటాడు బాలరాజు.



'సప్త సూత్ర శాస్త్రం' అంటే ఏడు నీతులు. ఈ ఏడు నీతులూ ఇటీవలే బయటపడ్డాయి.  ఇవన్నీ ఎప్పుడో అప్పుడు అందరికీ జీవితంలో అనుభవమౌతాయి అని ఇలా రాతిపై చెక్కించి ఉంచాను అని చెప్తాడు గురువుగారు. అవేమిటంటే -

* ఆశ కొలదిగ పెరుగు అవనిలో నిరాశ (ఎంత ఎక్కువ ఆశ పడితే అంత ఎక్కువగా నిరాశ కలిగి బాధ పడతావు)
* ఒక్క వేలు జూపి ఒరులను నిందించ, వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు(ఒకరి తప్పును ఎత్తిచూపేముందు నీ తప్పులు మూడుంటాయని తెలుసుకో)
* తెలుపు క్షీరము కాదు నలుపు నీరము కాదు.( తెల్లనివన్ని పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళు కాదు)
* చెడ్డవారలకెపుడు చేదోడు కావలదు. (చెడ్డవారికి సహకరించకూడదు)
* అలయు మీరిన వేళ అమృతము విషమగును.(మితిమీరిపోతే ఎంత ఇష్టమైనదైనా వెగటౌతుంది)
* తాడు పామవగలదు, పాము తాడవగలదు (తొందర పడి దేన్ని నమ్మకూడదు)
* కలసివచ్చిననాడు కడుపేద రాజగును.



రకరకాల సంఘటనల ద్వారా ఈ ఏడు సూత్రాలూ బాలరాజుకి ఏ విధంగా అనుభవంలోకి వచ్చాయి? చివరికి బాలరాజు కథ ఏమైంది? అన్నది మిగిలిన సినిమా. ఈ పిల్లవడు ఎవరో గానీ మహా చురుకుగా ఉన్నాడు. సినిమాలో టూరిస్ట్ లకే కాదు ప్రేక్షకులకు కూడా నచ్చేలాగ ! పూర్వంలో వచ్చిన ప్రతి నలుపు-తెలుపు సినిమా చక్కని సందేశాన్ని ఇచ్చేది. ఫలానా సినిమా చూశాం అంటే ఏదో ఒక నీతి, లేక సత్యాన్ని తెలుసుకున్నం అని అనిపించేది. చూసిన ప్రతి ఒక్కరికీ అలా అనిపించే చిత్రమే ఈ బాపు రమణల "బాలరాజు కథ". అన్ని ప్రముఖ వీడియో కేసెట్ షాపుల్లోనూ ఈ సీడి లభ్యమౌతోంది.





పూర్తి సినిమా క్రింద ఉన్న యూట్యుబ్ లింక్ లో చూడవచ్చు: 
http://www.youtube.com/v/rdr5XxQLyKA?hl

Saturday, April 6, 2013

వ్యంగ్యాత్మక హాస్యం - JOLLY LLB





ప్రేక్షకులకి రెండో ఆలోచనను రానివ్వకుండా చివరిదాకా వాళ్ల ఆసక్తిని పట్టి ఉంచగలిగిన ప్రతి సినిమా మంచి సినిమానే! అలాంటి మంచి సినిమా ఒకటి ఇవాళ చూసాం. దర్శకుడిగా మారిన ఒకప్పటి జర్నలిస్ట్ 'సుభాష్ కపూర్' తీసిన "JOLLY LLB". ఇది అతని మూడవ సినిమా. కథ, దర్శకత్వం రెండూ సుభాష్ కపూర్ వే. ఎక్కువ భాగం కోర్ట్ లోనే నడిచే ఈ సినిమాను కోర్ట్ రూం కామెడీ అనవచ్చు. ఈ చిత్రం హాస్యప్రధానమైనదే కానీ ఆ హాస్యం ముసుగుతో వ్యవస్థలోని లోటుపాట్లను, పేదల పట్ల ధనిక వర్గాల దాష్టీకం మొదలైవవాటిని ఎత్తిచూపే వ్యంగ్యాత్మక చిత్రం ఇది. 

అర్షాద్ వర్సి, బొమన్ ఇరానీ, సౌరభ్ షుక్లా ముగ్గురూ కూడా అత్యుత్తమ నటన చూపెట్టారు. ముఖ్యంగా జడ్జీ పాత్రలో సౌరభ్ షుక్లా నాకు భలేగా నచ్చాడు. అర్షాద్ వర్సి "జాలీ" పాత్రలో ఇమిడిపోయినా, ఇటువంటి పాత్ర కాస్తంత ముందుగా వచ్చిఉంటే బావుండేదేమో అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ అమృతా రావు అసలే సన్నమేమో, ఆమె పక్కన మరీ పెద్దగా కనిపించాడు. చక్కనినటి అయిన అమృత కి పెద్ద పాత్ర ఏమి లేదు :( బొమన్ ఇరాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఎటువంటి పాత్రలో అయినా ఇమిడిపోయే చక్కని నటుడు.


కథలోకి వస్తే జగ్దీష్ త్యాగీ(అర్షాద్ వర్సి) ఒక చిన్నపాటి లాయర్. అతని ప్రేమికురాలు స్కూల్ టీచర్ సంధ్య. ప్రఖ్యాత లాయర్ అవ్వాలన్నది అతని కలను నిజం చేసుకోవటం కోసం అతను ఢిల్లీ చేరతాడు. అక్కడ ఇంచుమించుగా మూసేసిన ఒక రోడ్ ఏక్సిడేంట్ కేసును తిరగతోడతాడు. మద్యం మత్తులో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఆరుగురు శ్రమజీవులపై కారు ఎక్కించిన ఒక డబ్బు, పలుకుబడి ఉన్న కుర్రవడిపై కేసు అది. ఆ కేసుపై PIL(public-interest litigation ) వేసి మళ్ళీ తెరిపిస్తాడు జగ్దీష్. ధనికవర్గం కుర్రాడి తరఫున దేశంలో అత్యంత పేరుప్రఖ్యాతలున్న లాయర్ తేజేందర్ రాజ్పాల్(బొమన్ ఇరాని) వాదిస్తుంటాడు. గెలవటానికి ఎటువంటి ఆధారం, ఆస్కారం రెండూ లేని ఈ కేసు తాలూకూ చిక్కుముడులన్నీ జగ్దీష్ త్యాగీ ఎలా విడతీసాడన్నది మిగిలిన సినిమా. 


ఇప్పుడేమి చేస్తాడా అనిపించేంత పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదురవవు జగ్దీష్ కి. కానీ చక్కని స్క్రీన్ ప్లే, ఆలోచింపజేసే సంభాషణలు ఈ చిత్రంలో ముఖ్యమైన అంశాలు. ఒకటి రెండు అనవసరమైన పాటలు తప్ప ఎక్కడా విసుగు రాకుండా, ఆసక్తికరంగా మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తుంది కథ. కోర్ట్ సన్నివేశాలూ అందులో వాదోపవాదాలు ఎలా ఉంటాయి, డబ్బుకలవారిదే రాజ్యంగా మరిన వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి, కొన్ని పోలీస్ నియామకాలు ఎలా జరుగుతాయి మొదలైన సంగతులు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూసి తీరాలి. 


కృష్ణ సంగీత దర్శకత్వంలో సినిమాలో ఒక పాటను బప్పీ లహరి పాడారు. 
http://www.youtube.com/watch?v=n_hlvIp8cds 

మోహిత్ చౌహాన్, శ్రేయా ఘోషాల్ పాడిన మరో సరదా పాట కాస్తంత ఇక్కడ:
   


ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ: 
   


Friday, March 8, 2013

ఆడవాళ్ళూ మీకు జోహార్లు(1981)





బాలచందర్ తీసిన "ఆడవాళ్ళూ మీకు జోహార్లు(1981)" ఓసారెప్పుడో టివీలో చూసాను. ఆసక్తికరంగా మొదలుపెట్టి ఉత్కంఠంతో చివరికి ఏమౌతుంది.. అని చివరిదాకా చూస్తే.. చివరికి తన సహజ ధోరణిలో మనసుని భారం చేసేస్తారు బాలచందర్ :( నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో బాలచందర్ ఒకరు. ఆయన తీసినవి దాదాపు అన్ని సినిమాలు చూసాను. ఈ క్లైమాక్స్ విషయంలోనే నాకు ఆయనతో పేచీ :) సినిమా అంతా చక్కగా తీసి క్లైమాక్స్ చెడగొట్టడమో లేదా దు:ఖ్ఖాంతం చెయ్యటమో బాలచందర్ కు ఉన్న మహా చెడ్డ అలవాటు.


ఈ సినిమా కథలో నాకు బాగా నచ్చినది దర్శకుడు స్త్రీ కి ఇచ్చిన విలువ. మగవాడి పతనం వెనుకే కాదు విజయం వెనుక కూడా స్త్రీ పాత్ర ఉంటుంది. రాక్షసుడు లాంటి మనిషిని కూడా ఉన్నతుడిలా తీర్చిదిద్దగల ఓర్పూ, నేర్పు స్త్రీకి ఉన్నాయి అని చెప్తుంది ఈ కథ. నర్సింహ మృగంలా మారటానికి కారణం అతని తల్లి. మళ్ళీ అతను మనిషిగా మారటానికీ, అతని జీవితాన్ని అనురాగంతో నింపటానికీ ఇద్దరు స్త్రీలు కారణం. ఈ సినిమా కూడా ఎంతో చక్కగా ఉంటుంది సగానికి పైగా. జయసుధ నటన నిజంగా ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో ఉన్న మిగతా నటిమణులంత గ్లామరస్ గా లేకపోయినా, సహజ నటిగా, చాలావరకు చీరకట్టులోనే కనిపిస్తూ, ఆనాటి నటీమణుల్లో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అది తాను ఎంచుకున్న పాత్రల ద్వారా నిరూపించుకుంది ఆమె. ఈ చిత్రంలో నర్సింహులు లాంటి కిరాతకుడ్ని ఉన్నతుడిగా తీర్చిదిద్దిన రాణి పాత్రకు జయసుధ ప్రాణం పోసిందని చెప్పాలి. నాకెంతో ఉన్నతంగా కనబడుతుందా పాత్ర. చదువురాని 'దబ్బపండు' పాత్ర కూడా ఎంతో ఉదాత్తంగా ఉంటుంది.


కృష్ణంరాజు సినిమాలు చాలా తక్కువ చూసానేమో.. ఇందులో అతని నటన నన్నాశ్చర్యపరిచింది. ఎంతో చిన్న చిన్న హావభావాలను కూడా సమర్థవంతంగా అభినయిస్తాడతను. కౄర స్వభావం లోంచి చదువుకున్న వివేకవంతుడిగా అతను పాత్రలో నటనలో తీసుకువచ్చిన మార్పులు మనల్ని మెప్పిస్తాయి. రాణి చెప్పే "ఆరడుగుల విగ్రహానికి ఆవగింజంతైనా నిగ్రహం లేదు", "నువ్విలా చూస్తే నే నీరుగారిపోతా" అన్న నర్సింహ డైలాగులు; సారాకొట్టు దబ్బపండు పాత్రలో వై.విజయ,  "క" భాష మాట్లాడే చలాకి పిల్లగా సరిత పాత్రలు కూడా గుర్తుండిపోతాయి.  

"ఎవరికి ఎవరూ సొంతం కాదు. ఇద్దరిదీ ఇచ్చిపుచ్చుకునే బేరం.. అంతే " అనే 'దబ్బపండు' పాత్ర వై.విజయకు లభించిన నటనకు ఆస్కారం ఉన్న అతి తక్కువ పాత్రల్లో  ఒకటి. ఇప్పటి మోడ్రన్ 'లివ్ఇన్ రిలేషన్ షిప్' ను నర్సింహులు-దబ్బపండుల సహజీవనం ద్వారా అప్పట్లోనే చూపెట్టాడు దర్శకుడు.


చివరి పదినిమిషాలు కథ మాత్రం చెత్తగా అయిపోయిందనిపిస్తుంది. రాణి పాత్రను చంపివెయ్యటం నాకస్సలు నచ్చలేదు. తగినంత కారణమూ కనిపించదు. మంటల్లో ఉన్న ఇద్దరు మనుషులని రక్షించిన డైరెక్టరు మరో మనిషిని కూడా రక్షించచ్చు కదా..అనవసరంగా చంపేసారు. ఆ రెండో ఆడమనిషితో హత్య చేయించేసి ఆమెనూ జైలు పాలు చేసేస్తారు డైరెక్టర్ గారు ! 

ఈ సినిమాను యూట్యుబ్ లో క్రింద లింక్ లో చూడవచ్చు:
http://www.youtube.com/watch?v=tUULiZT3AbI

ఇందులో ఒక పాట ఉంటుంది.. "ఆడవాళ్ళూ మీకు జోహార్లు " అని. నాకు చాలా నచ్చే పాటల్లో ఒకటి. ఆత్రేయ మాత్రమే రాయగలరు అలాంటి సాహిత్యం. పైన యూ ట్యూబ్ సినిమా లింక్లో "1:48:27" దగ్గర పాట మొదలౌతుంది. బాలు పాడిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటన్నది నా అభిప్రాయం.


సాహిత్యం: ఆత్రేయ
సంగీతం : కె.వి.మహాదేవన్
పాడినది : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం:

ఆడాళ్ళూ మీకు జోహార్లు 
ఓపిక ఒద్దిక మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళూ
((ఆడాళ్ళూ))

ఒకరు దబ్బపండు, ఒకరు పనసపండు
ఒకరిది కనబడే పచ్చదనం
ఒకరిది కానరాని తీయదనం((ఒకరు..))
ఇద్దరి మంచితనం నాకు ఇస్తుంది చల్లదనం
ఇది తలుచుకుంటే మతి పోతుందీ దినం
((ఆడాళ్ళూ))

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం, మనిషి చేయడం
మనసు నిదరలేపడం, మమత నింపడం((గోరంత))
ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మర్చుకోవడం
ఇదే పనా మీకు..? ఊ..? ఇందుకే పుట్టారా?
((ఆడాళ్ళూ))


Sunday, January 6, 2013

జంటగా చూసితీరాల్సిన "మిథునం" !





పదిహేనేళ్ళ క్రితం రాయబడిన ఒక కథ.. కథాజగత్తునే ఒక్క ఊపు ఊపింది. ఎంతోమంది సాహితీప్రియుల ఆత్మీయతనీ, ఆదరణనీ, అభిమానాన్ని సంపాదించుకుంది. నాటక రూపంలో రేడియోలోనూ, రంగస్థలం పైనా చోటు సంపాదించుకుంది. ఆంగ్లానువాదం అయి మళయాళ చలనచిత్రంగా  కూడా రూపుదిద్దుకుంది. బాపూ అందమైన చేతివ్రాతలో దస్తూరీ తిలకమై నిలిచింది. ఎందరో సాహితీమిత్రుల శుభకార్యాల్లో, శుభ సందర్భాల్లో వారివారి బంధుమిత్రులకు అందించే అపురూపమైన కానుకైపోయింది కూడా. అటువంటి బహుళప్రాచుర్యం పొందిన కథను తెరపైకెక్కించే ప్రయోగం చేసారు శ్రీ తనికెళ్ల భరణి గారు. 


ఒక భాష నుండి మరో భాషకు చేసే సాహిత్యానువాదాన్ని అనువాదం అనరు.. "ప్రతిసృష్టి" అంటారు. అసలు రచనలోని సారన్ని మార్చకుండానే తనదైన శైలిలో ఎంతో నేర్పుతో అనువదిస్తాడు అనువాదకుడు. అందువల్ల అది "ప్రతిసృష్టి" అవుతుంది. ఆ విధంగా "మిథునం" సినిమా కూడా భరణి గారి ప్రతిసృష్టి అని చెప్పాలి. కాలానుగుణంగా ఉండటానికి శ్రీరమణ గారి కథ కు కాసిన్ని మార్పులు చేసినా కూడా అసలు కథలోని సారానికి ఏమాత్రం లోటు రానీయలేదు ఆయన. జీవితపు బరువు బాధ్యతలు దింపుకున్న ఓ వృధ్ధ జంట, పల్లెటూరిలోని తమ సొంత ఇంటిలో చివరి రోజులు గడపటం ప్రధాన సారాంశం. వాళ్ల వానప్రస్థం అన్నమాట. ఒక జంట అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో అక్షరరూపంలో చూపెట్టారు శ్రీరమణ గారు. అది దృశ్యరూపంలో ఇంకెంత బావుంటుందో కన్నులపండుగగా చూపెట్టారు భరణి గారు.



ఈ కథను సినిమాగా తీస్తున్నారనగానే నన్ను భయపెట్టినవి రెండే విషయాలు. ఒకటి నటీనటులు, రెండోది ఇల్లు. ఆ పాత్రలు ఎవరు చేస్తారో..ఎలా చేస్తారో అనీ;  అసలలాంటి తోట, పెరడు ఉన్న ఇల్లు దొరుకుతుందా అనీనూ! కానీ బాలూ, లక్ష్మి ఇద్దరూ కూడా తమ పరిధుల్లో ఎక్కడా కూడా వారి నిజరూపాల్లో కనబడక, కథలోలాగ ఎనభైల వయసులో లేకపోయినా, కేవలం అప్పదాసు,బుచ్చిలక్ష్మి లాగానే కనబడటం దర్శకుడి ప్రతిభే ! ఇంక అలాంటి తోట, పెరడు, చెట్లు, పాదులు అన్నీ ఉన్న ఇల్లెక్కడ దొరుకుతుందా అని బెంగపెట్టుకున్నాను నేను. అలాంటిది శ్రీకాకుళంలో దొరికిందిట.. ప్రొడ్యూసర్ ఇల్లేనట అని తెలిసి ఆనందించినదాని కంటే సినిమాలో ఆ ఇల్లు చూశాకా ఇంకా ఎక్కువ సంబరపడ్డాను. "ఆ ఇంట్లో నా కూతురి పెళ్ళి చేసాను. సినిమాకి డబ్బులు రాకపోతే ఇంకో కూతురు పెళ్ళి చేసాననుకుంటాను.." అన్నారట ప్రొడ్యూసర్. అలాంటి పెరడు, చెట్లు, ఇల్లే ఉంటే అప్పదాసేమిటి, ప్రపంచాన్ని వదిలేసి నేనే అక్కడ ఉండిపోతాను..:) ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించినా అటువంటి ప్రశాంతమైన జీవితం గడపగలమా?





సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరోటుంది.. ఫోటోగ్రఫీ. భరణి గారి అన్నగారి కుమారుడే ఫోటోగ్రఫీ చేసాడుట. యూనిట్ అంతా కూడా అంతకు ముందు భరణితో పనిచేసిఉన్నవారవటం తనకు ఉపయోగపడిందని ఓ ఇంటర్వ్యులో భరణి చెప్పారు. మొదటి చిత్రమే ప్రయోగాత్మకంగా, రెండే పాత్రలతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించగలగటం ఎంతో సాహసం. దర్శకత్వంలో కొద్దిపాటి లోటుపట్లు కనబడినా చెప్పదలిచిన విషయాన్ని సమర్థవంతంగానే తెలియజేసారు భరణి. సినిమాలో నాకు బాగా నచ్చినది రేడియో ! పొద్దున్న 'శుభోదయం' నుంచీ రాత్రి 'జైహింద్' అనేదాకా రేడియో కార్యక్రమాల టైం ప్రకారం తమ పనులు కూడా చేసుకునేవాళ్ళు అదివరకూ రేడియో శ్రోతలు. మళ్ళీ ఆ సిగ్నేచర్ ట్యూన్స్ వింటుంటే పాతరోజులు గుర్తుకువచ్చాయి..


అమెరికా పిల్లల కబుర్లు వచ్చినప్పుడు హాలులో నవ్వులు, చివర్లో నిట్టూర్పులూ, ముక్కు చీదిన బరబరలు.. ప్రేక్షకులు ఎంతగా లినమయ్యారో చెప్పాయి. మేం కూడా సినిమా అయ్యాకా కాసేపు అలా కూచుండిపోయాం. బయటకు వచ్చాక కూడా చాలా సేపు మట్లాడుకోలేకపోయాం..! మనసు భారం చేసేసావయ్యా భరణీ అని బాధగా మూల్గినా, అదే సత్యం కదా అని గ్రహించుకుని.. నెమ్మదిగా తేరుకున్నాను. అయితే హాలులో నెంబరింగ్ లేకపోవటం, అతితక్కువ హాల్సు లో విడుదల చేయటం, శనివారం అయినా హాలు నిండకపోవటం కలుక్కుమనిపించాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి ఎదుగుతారో.. ఎప్పటికి చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుందో.. అన్న ప్రశ్నలు ఇంకా వెంటాడుతున్నాయి నన్ను. 



మూలకథలో లేని మార్పులు చేసినా కూడా వృధ్ధజంట అన్యోన్యత, చిలిపి తగదాలు, పరస్పరాఅనురాగం చూసి నేటి తరం జంటలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది సినిమాలో అనుకున్నా.. అందుకే నాకనిపించింది ఏమిటంటే ప్రతి జంటా జంటగా చూసితీరాల్సిన చిత్రం "మిథునం" అని !





Thursday, November 1, 2012

"సూర్యుడి ఏడో గుర్రం" (सूरज का सातवाँ घोड़ा)






చిన్నప్పుడు దూరదర్శన్ లో వేసే సినిమాలన్నీ వదలకుండా చూసేవాళ్ళం. వాటిల్లో చాలా బాగున్న సినిమాలు కొన్ని గుర్తుండిపోయాయి. పుస్తకాల షాపులో "సూర్యుడి ఏడో గుర్రం" పుస్తకం చూడగానే నాకు చిన్నప్పుడు చూసిన "सूरज का सातवाँ घोड़ा" గుర్తుకు వచ్చింది.  ఆ సినిమాకు గానూ ఉత్తమనటుడి పురస్కారాన్ని అందుకున్న 'రజత్ కపూర్' గుర్తుకువచ్చాడు. జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని కూడా అందుకుందీ సినిమా. చిన్నప్పుడు శ్యామ్ బెనెగల్ తీసిన సినిమాగా మాత్రమే ఇది పరిచయం. నవల గురించి ఏమీ తెలీదు. ఈ తెలుగుఅనువాదం ఆ సినిమాదే అని తెలిసి ఎగిరి గంతు వేసాను. "వేమూరి ఆంజనేయశర్మ" గారు అనువదించిన ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ. ఇప్పుడు నవల కొని చదవగానే సినిమా చూద్దామనిపించి నెట్లో వెతికితే యూట్యూబ్ లో సినిమా దొరికింది. సినిమా చూసాకా నవల ఇంకా బాగ అర్థం అయ్యింది. తెరపై దృశ్యరూపం నవల కన్నా అందంగా ఉండగలదని ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమాకు రెండు ప్రాణాలు. ఒకటి శ్యాం బెనెగల్ దర్శకత్వం, రెండోది వన్రాజ్ భాటియా నేపథ్యసంగీతం. ముందు నవల గురించి చెప్తాను..


"ధర్మవీర్ భారతి". ఈ పేరు వింటేనే ఏదో ఉత్తేజం కలుగుతుంది. తను సాహిత్యానికి చేసిన సేవలకు ప్రభుత్వం నుండి "పద్మశ్రీ" బిరుదు పొందిన ప్రముఖ హిందీ కవి, రచయిత, నాటక కర్త, సామ్యవాది ధర్మవీర్ భారతి. "ధర్మయుగ్" అనే పత్రిక సంపాదకుడిగా కూడా పనిచేసారు. నాటక కర్తగా "సంగీత నాటక అకాడమీ" పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన మొదటి నవల "గునాహోం కా దేవతా" గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత రాసిన నవలే "సూఅజ్ కా సాత్వా ఘోడా". ఈయన 1952 లో, అంటే దాదాపు అరవై ఏళ్ల క్రితం వైవిధ్యభరితమైన శైలితో ఇంత చక్కని ప్రయోగాత్మకమైన నవల రాసారంటే ఆశ్చర్యం కలిగింది. అసలింత చిన్న నవలలో ఎంత గొప్ప ఆంతర్యాన్ని ఎలా కుదించారో! అప్పట్లో ఈ నవల హిందీ నవలాసాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించి ఉండాలి.


కథనానికి విభిన్నమైన శైలి వాడారు ధర్మవీర్ గారు. ఆంగ్ల సాహిత్యంలో దీనిని "మెటాఫిక్షన్" అంటారు. ఒకరకంగా ఇది పంచతంత్రం కథలు, విక్రమార్కుడి కథలు మొదలైన కథల శైలి అన్నమాట. అంటే ఒకే కథలో మరికొన్ని కథలు ఉంటాయి. అయితే ఈ నవలలో చిత్రం ఏంటంటే ఈ కథలన్నీ మళ్ళీ ఒకే కథలో కలుస్తాయి. కథకుడు మనకు చెప్పే ఒక కథలో "మాణిక్ ముల్లా" అనే పాత్ర చెప్పే మరిన్ని కథలుంటాయి. విడివిడిగా చెప్పినా ఇవన్నీ అంతర్లీనంగా ఒకే దారంతో ముడిపడిఉంటాయి. నవల చివరికొచ్చేసరికీ మనకి ఒక కథలోంచి మరోకథలోకి ఎలా లంకె ఏర్పడిందో తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. అవే కథలను మనం ఇతర పాత్రల దృష్టితో చూస్తూంటే, తద్వారా వివిథపాత్రల స్వభావాలు మారిపోవటం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ కథలన్నీ మాణిక్ ముల్లా జీవితంలో అతనికి ఎదురైన ముగ్గురు స్త్రీల చుట్టూ తిరుగుతాయి. వీటన్నింటి నేపథ్యం "ప్రేమ" అని మాణిక్ ముల్లా చెప్తాడు కానీ వాటి వెనుక ఉన్న దిగువ మధ్యతరగతి జీవితాలలోని సంఘర్షణ,నిస్పృహ, దు:ఖమయ వేదన మనల్ని కల్లోలపరుస్తాయి. ఈ కథల వల్ల మనిషి మనస్థత్వాన్ని విభిన్నకోణాల్లోంచి చూసే అవకాశం కూడా మనకు కలుగుతుంది.


నవలలో కొన్నిచోట్ల శరత్ "దేవదాసు" గురించిన ప్రస్తావన తెస్తాడు రచయిత. ఆ ప్రస్తావనల ద్వారా అప్పటిదాకా సాహిత్యంలో చిత్రించబడిన భగ్నప్రేమికుడి స్వరూపం తప్పనీ, సాకారమైనా, విఫలమైనా నిజమైన ప్రేమ మనిషి వికాసానికి తోడ్పడుతుందనే ఉద్దేశాన్ని తెలుపుతాడు. "ఇది ప్రేమ కాదు ఇది ప్రేమ కాదు అని అని ప్రేమను గురించి వ్యాఖ్యానిస్తూనే జీవితంలో ప్రేమకు గల స్థానాన్ని నిరూపించటమే ఈ కథల ఉద్దేశం. ఏ ప్రేమ సాంఘిక వికాసానికి తోడ్పడదో అది నిరర్థకం".  "ప్రేమను గురించి కథల్లో, కవితల్లో, పత్రికల్లో ప్రచురించబడేదంతా శుధ్ధ అసత్యం. ప్రేమ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి."  అంటాడు ప్రధాన పాత్రధారి మాణిక్ ముల్లా.


మాణిక్ ముల్లా మాటల్లో ప్రేమకు తన నిర్వచనం చెప్తాడు రచయిత. "ప్రేమించాలి. కానీ ఆ ప్రేమ సంకుచితంగా ఉండకూడదు. దాని వల్ల సంఘానికి మేలు కూడా జరగాలి. కానీ ప్రేమ ఆర్థిక సంబంధాలవల్ల అనుశాసితమౌతుంది." అంటాడు.  మళ్ళీ మరోచోట నిజమైన ప్రేమ ఎటువంటిదో చెప్తూ " ప్రేమ ఆత్మ లోతుల్లో నిద్రించిన సౌందర్యాన్ని మేల్కొలుపుతుంది. మానవునిలో విచిత్రమైన పవిత్రతనూ, నైతిక నిష్ఠనూ, వెలుతుర్నీ నింపుతుంది....కానీ సంప్రదాయం, సాంఘిక పరిస్థితులూ వగైరాల వల్ల ఆ ప్రేమను సరైన రూపంలో దర్శించలేకపోతున్నాం. సంఘర్షణ చెయ్యలేక నిస్సహాయత, పిరికితనమనే బంగారు నీరు పోసి దానిని మెరిసేట్టు చేయటానికి ప్రయత్నిస్తున్నాము. కల్పనా జగత్తులో మెదిలిన భావాలలో ఇంద్రధనస్సులూ, పూవులు, స్వప్నాలూ ఉంటాయి గానీ సాహసం, పురుషార్థం ఉండవు. ఆ స్వప్నాలను యదార్థమైన సాంఘిక జీవితంలోకి దింపాలి. సాంఘిక జీవితపు పునాదులూ ఎరువూ లేని భావన నిలువలేదు. ఎండిపోతుంది." అంటాడు.


కథాక్రమానికి  మాణిక్ ముల్లా ఇచ్చే వివరణ:

ఏడు రోజులపాటు మాణిక్ ముల్లా చెప్పే కథాక్రమం నడుస్తుంది. అతని మాటల్లోనే చెప్పాలంటే - అవి సూర్యుడి ఏడు గుర్రాలకు ప్రతీకలు. అయితే ఇవి ఒట్టి ప్రేమ కథలు కాదు. నిమ్న మధ్యతరగతి జీవనచిత్రాలు. మధ్యతరగతి జీవితాల్లో ప్రేమ కంటే ఆర్థిక సంఘర్షణ, నైతికమైన విశృంఖల విహారం వ్యాపించి ఉన్నాయి. అందువల్లనే అనాచారం, నిరాశ, చీకటి మధ్యతరగతి జీవితాల్లో నిండిపోయాయి. ఏడు గుర్రాలు సూర్యుని రథాన్ని ఏ విధంగా ముందుకు లాక్కు పోతున్నాయో అదే విధంగా విశ్వాసము,సాహసము,సత్య నిష్థ మొదలైనవి ఆత్మను ముందుకు లాక్కుని పోతున్నవి. కానీ ఈ అనైతిక భ్రష్టమైన జీవితపు సందుల్లో నుండి నడవటం వల్ల రథం శిధిలమైపోయింది. అయినా ఈ సూర్యుని రథం ముందుకు పోవలసిందే. ఆరుగుర్రాలు గాయపడినా ఏదో గుర్రం మాత్రం మిగిలే ఉంది. అదే భవిష్యత్తును సూచించే గుర్రం. తన్నా, జమున, సత్తి..ఈ ముగ్గురికీ కలిగిన ఏ పాపమెరుగని పిల్లలే ఆ ఏడో గుర్రానికి ప్రతీకలు. ఆ బిడ్డల జీవనాలు సుఖమయం కావాలి. వాళ్ల జీవితాల్లో వెలుతురు, అమృతం నిండాలి. ఆ ఏడో గుర్రం మన కనురెప్పల్లోకి స్వప్నాలను పంపిస్తుంది. మనం దోవ బాగు చేస్తే ఆ దోవన ఆ గుర్రం పయనిస్తుంది. అ గుర్రం మీద మనకు సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి అంటాడు మాణీక్ ముల్లా.
ఈ విషయాలన్నీ గుర్తుంచుకునే తను చెప్పే కథా క్రమానికి సూర్యుని ఏదో గుర్రం అని నామకరణం చేసాడు మాణిక్ ముల్లా" అంటాడు కథకుడు.


ఇంతకు మించి కథ గురించి చెప్తే ఉత్సాహం తగ్గిపోతుంది. అరవైఏళ్ల తరువాత చదివినా కూడా సమకాలీనంగా అనిపించటంమే ఈ రచనలోని గొప్పతనం. సినిమాచూసాకా ఈ నవలను ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా మార్చిన శ్యామ్ బెనెగల్ ను ప్రశంసించకుండా ఉండలేము. రచయిత శైలి ఏమాత్రం పాడవకుండా, పాత్రల మనోభావాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చిత్రికరణ జరిగింది. నటీనటులందరూ డీడీ సీరియల్స్ లో మనం చిన్నప్పుడు చూసినవాళ్ళే అవటం వల్ల పాత్రలన్నీ పరిచితమైనవే అనిపిస్తాయి. ముఖ్యంగా రజత్ కపూర్ నటన, వాయిస్ రెండూ చాలా బావుంటాయి. చిత్రం చివరలో అతను చెప్పే ఒక చిన్న కవిత చాలా బావుంది..

"मैं क्या जिया
मुझकॊ तो जिंदगी नॆ जिया
बुंद बुंद कर पिया..
पीकर..पथ पर खाली छॊड दिया "



యూట్యూబ్ లో ఈ చిత్రం తాలూకూ రెండు భాగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.




చిత్రం మొదటిభాగం:
http://www.youtube.com/watch?v=OAj4C4lYmms

చిత్రం రెండవ భాగం:
http://www.youtube.com/watch?v=4Kun9KGul9s&feature=relmfu



Monday, October 8, 2012

అమ్మ విలువను గుర్తుచేసిన "English Vinglish"


"मुझॆ प्यार की कमी नही हैं..कमी है तॊ सिर्फ थॊडी इज्जत की..." అంటుంది శశి. ఈ సినిమాలోని female protagonist ! మొత్తం సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. ఈ ఒక్క పాయింట్ మీదే మొత్తం సినిమా నిలబడి ఉంటుంది. అదే ప్రేక్షకుల మనసులకూ సినిమాకూ వారధి కూడా. Toronto Film Festival లో ఈ చిత్రం ప్రీమియర్ చేయబడినప్పుడు, చివర్లో "standing ovation" ఇచ్చారుట అక్కడి ప్రేక్షకులు. అంతటి మర్యాదను పొందే పూర్తి అర్హతలున్న సినిమా ఇది.


సినిమా చూస్తున్నంత సేపూ కథ తో పాటూ మనమూ కనక్ట్ అయి చూసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అలా ప్రతి ఒక్కరూ సినిమాలోని పాత్రలతో(శశి లో, ఆమె భర్త లో, కూతురిలో) తమను తాము identify చేసుకునే సినిమా "English Vinglish". తొంభై శాతం ప్రతి భారతీయ కుటుంబం లోనూ జరిగిన, జరుగుతున్న కథే ఈ సినిమాలోనూ కనబడుతుంది. ఇల్లాలిని లోకువగా చూడటం. ఇంటెడు చాకిరీ చేసి, అందరు అవసరాలను చూసే అమ్మని కొందరు పిల్లలు లక్ష్యపెట్టరు. ఇంటినీ, కుటుంబాన్ని తీర్చిదిద్దే భార్యను కొందరు లోకువ కట్టేస్తారు. సినిమాలో "శశి"కి ఇంగ్లీషు రాదని భర్త, కూతురు హేళన చేసి లోకువ కట్టేస్తూంటారు. కానీ కొన్ని ఇళ్ళల్లో ఇంగీషు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో ఇల్లాల్ని లోకువ కట్టేస్తూ ఉంటారు. శశి అన్నట్లు చాలా చోట్ల ప్రేమ ఉంటుంది కానీ గౌరవమే ఉండదు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని తెరపైకి ఎక్కించడానికి కారణం తన తల్లి అంటారు దర్శకురాలు "గౌరి షిండే"(ఈవిడ "చీనీ కమ్", "పా" దర్శకుడు బాల్కీ భార్య).

"I made this film to say sorry to my mother." అంటున్న గౌరి ఇంటర్వ్యూ క్రింద లింక్ లో.
http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/I-am-a-better-director-than-Balki-Gauri-Shinde/articleshow/16697950.cms


నేను కూడా బ్లాగ్ మొదలెట్టిన కొత్తల్లో మా అమ్మ గురించి  ఓ టపా  రాసాను! ఎందుకంటే నాకు అమ్మ విలువ పెళ్ళయ్యాకా కానీ తెలీలే. అసలు పెళ్ళాయ్యాకా కానీ ఏ అమ్మాయికీ అమ్మ పూర్తిగా అర్ధం కాదేమో అనుకుంటాను నేను. ఎన్నో సందర్భాలో "అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా"  అమ్మ పట్ల నాకు గౌరవం పెరిగిపోయేది. మనకు తెలీకుండానే మనం అమ్మని ఎన్ని వందలసార్లు బాధపెట్టి ఉంటామో అనుభవం లోకి వచ్చాకా కానీ తెలీదు. ఎందుకంటే మనం కసిరినా, కోప్పడినా,తిట్టినా, అరిచినా, మాట్లడకుండా ఉన్నా... మనల్ని భరించేది అమ్మ ఒక్కతే!!

ఈ కొత్త దర్శకురాలి మీద ఆశలు పెట్టుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తుందీ సినిమా. ప్రతి పాత్ర తమ తమ పరిమితుల్లో ఉండి, ఎవర్నీ ఎవరూ డామినేట్ చేయకుండా  తమతమ పాత్రల్లో(చిన్నవైనా) ఒదిగిపోయారు నటులందరూ. Female protagonist గా శ్రీదేవి డామినేట్ చేసేస్తోంది అని ఒక్కచోట కూడా అనిపించదు. చక్కని కథనంతో, ఆకట్టుకునే డైలాగ్స్ తో, మనసును హత్తుకునే సన్నివేశాలతో మనల్ని బాగా ఆకట్టుకుంటుందీ సినిమా. మనుషుల్లో వస్తున్న మర్పుని గమనించి అందుకు తగ్గట్టుగా సినిమాలు వస్తున్నాయి. బరువైన థీం ని లైట్ గా చూపించటం కొత్త పంథా ఏమో మరి. "బర్ఫీ" అలానే ఉంది. ఇప్పుడు ఇదీ అలానే తీసారు. చాలాచోట్ల మానసు భారంగా అయిపోయినా, వెంఠనే నెక్స్ట్ ఫ్రేమ్ లో మన మూడ్ లైట్ అయిపోతుంది. సినిమా అయ్యాకా ప్రతిభావంతురాలైన ఈ దర్శకురాల్ని అభినందించకుండా ఉండలేం మనం.



 శ్రీదేవి కట్టిన సాదాసీదా కాటన్ చీరలు చాలా బాగున్నాయి.
ఈ సినిమాకి ప్రాణం శ్రీదేవి నటన అన్న సంగతి సినిమా మొదటిభాగంలోనే మనకి అర్ధమైపోతుంది. నటనకు పూర్తి అవకాశం ఉన్న అంతటి శక్తివంతమైన protagonist పాత్ర దొరకటం శ్రీదేవి అదృష్టం అనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలోనూ, అన్ని రకాల హావభావాలనూ అద్భుతంగా కనబరిచి తన సత్తాను మరోసారి చాటుకుంది శ్రీదేవి. మాధురీ దీక్షిత్ లాగ, కరిష్మా కపూర్ లాగ పేలవమైన సినిమాల్లో కాక పదిహేనేళ్ల తర్వాత వెండితెరపై ఇటువంటి విజయవంతమైన సినిమాతో కనబడటం మంచి విషయం. కానీ రంగుల ప్రపంచపు ప్రలోభాల్లో పడి మళ్ళీ ఓ ఆంటిలానో, అక్కగానో, తల్లిగానో స్థిరపడకుండా ఇకపై తెలివైన పాత్రల్ని ఎంచుకుంటుందా లేదా అన్నది బేతాళ ప్రశ్నే..!

అయితే శ్రీదేవిని ఒక కొత్త నటిలా నేను చూడగలిగాను తప్ప ఆమెలో పాత శ్రీదేవిని ఒక్క క్షణం కూడా పోల్చలేకపోయాను . somehow i felt pitiful to see a skinny sridevi. అందమైన పెద్ద పెద్ద కళ్ళు తప్ప ఇంకేం బాలేదనిపించింది. ఏభైలకి దగ్గర పడుతున్న ఏ స్త్రీ అయినా, శరీరాకృతి కోసం ఎంత శ్రమించినా.. జీవనసంఘర్షణ తాలూకూ ఆనవాళ్ళని దాచిపెట్టలేదేమో!!! ఏదేమైనా Beauty has to wither some day..కదా...అనుకున్నా!



సినిమాలో నాకు నచ్చిన కొన్ని సంగతులు:

* సినిమా మొదట్లో అందరికీ అన్నీ సమకూరుస్తూ తన కోసం కలుపుకున్న కాఫీ తాగుతు పేపర్ కూడా చదువుకునే తీరిక దొరకదు శశికి. పిల్లాడితో ఆమె సమయం గడపటం, వాళ్ల మధ్యన అనుబంధం లాంటి చిన్న చిన్న డీటైల్స్ చూపించటం బాగుంది. మళ్ళీ భర్త అమెరికా వచ్చిన మర్నాడు అతను కాఫీ అనగానే చదువుతున్న పేపర్ ఆపేసి కాఫీ కోసం వెళ్తుంది శశి. చివరలో "వీళ్ళు నా ముఖ్యమైన స్నేహితులు" అని శశి చూపిస్తే "నీక్కూడా స్నేహితులా " అన్నట్లు చూసే చూపు..  అలాంటి మరి రెండు సన్నివేశాల ద్వారా టిపికల్ భర్తల స్వభావాన్ని బాగా చూపించారు.

* శశి వెళ్ళే ఇంగ్లీష్ క్లాస్ లో స్టూడెంట్స్ బాగున్నారు. ప్రపంచంలో ఎన్నిరకాలవాళ్ళున్నారో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వెళ్ళేవాళ్ళు అనిపించింది.


*శశిని ఇష్టపడే ఫ్రెంచ్ దేశీయుడు క్లాస్ లో నిర్భయంగా తన భావాలను చెప్పటం బావుంది. అతనిలోని నిజాయితీ ఆ పాత్రకు నిండుతనాన్ని ఇచ్చింది.

* క్లాసులు అయ్యేకొద్దీ భాష నేర్చుకుంటున్న వాళ్లలో ధైర్యం, వాళ్ళ నడకలో పెరిగే కాన్ఫిడెన్స్ బాగా చూపెట్టారు.



* "మగవాడు వంట చేస్తే కళ అంటారు.. అదే ఆడది చేస్తే అది తన బాధ్యత అంతే అంటారు.." అనే డైలాగ్ ; అలానే "పిల్లలకు తల్లిదండ్రుల లోటుపాట్లను ఎత్తిచూపి వేళాకోళం చేసే హక్కు ఎక్కడుంది?" అని శశి ఆవేదన పడే సన్నివేశం కళ్ళు తడిచేస్తుంది.

* శశి తన కుటుంబం నుండి గౌరవాన్ని కోరుకుంటోంది అని చెప్పటం కోసం తగినన్ని కారణాలు చూపించారే తప్ప భర్తను గానీ పిల్లని గానీ తక్కువగా చూపెట్టలేదు. అలా వాళ్ళ పాత్రలను మర్యాదపూర్వకంగా నిలబెట్టి ఉంచటం బావుంది.

*సినిమా చివరలో నూతన వధూవరులకు శశి చెప్పే వాక్యాలు చాలా బాగున్నాయి. అవి భార్యాభర్తలకే కాదు స్నేహితులకీ, మరే బంధమైనా నిలబడటానికి ఉపయోగపడేలా ఉన్నాయి.



కథ పెద్దగా లేకపోవటం వల్ల సినిమా కొన్ని సన్నివేశాల్లో సాగదీస్తున్నట్లు స్లోగా నడిచింది. అయినాకూడా ఎక్కడా బోర్ కొట్టలేదు. కుటుంబం మొత్తం వెళ్ళి హాయిగా చూసిరావచ్చు. ప్రేమించటంతో పాటూ అమ్మను,భార్యనూ గౌరవిస్తూ కూడా ఉండాలి అనే సంగతి ఓసారి గుర్తుచేసుకుని కూడా రావచ్చు.




Monday, September 24, 2012

శ్రావ్యమైన గజల్ "బర్ఫీ"





మంచి గజల్ వినటానికి శ్రావ్యంగా ఉంటుంది. కానీ ప్రతి గజల్ సాహిత్యంలోనూ అంతర్లీనంగా ఒక వేదన దాగి ఉంటుంది. అయినా కూడా ఏదైనా మంచి శ్రావ్యమైన గజల్ విన్నంత సేపూ హాయిగా ఎక్కడెక్కడో తేలిపోతాము. అచ్చం అలాంటి భావనే "బర్ఫీ " సినిమా చూస్తున్నంతసేపూ నాకు కలిగింది.
శ్రావ్యమైన గజల్ లా..
 ఐస్క్రీం అంత చల్లగా
వెన్నలాగ స్వచ్ఛంగా తెల్లగా
పట్టులాగ మృదువుగా
నెయ్యి అంత కమ్మగా 
చాక్లేట్ లాగ తియ్యగా..
ఉంది సినిమా.

హాయిగా తమదైన లోకంలో తిరగాడే బర్ఫీ,ఝిల్మిల్,శ్రుతి లతో పాటూ వెనక వెనకే తిరుగుతూ, బర్ఫీ చేసే చిలిపి పనులను చూస్తూ నవ్వుకుంటూ గడిపేసా నేనూ. ఒక భారమైన కథను ఎంతో హృద్యంగా, మన మనసులు బరువెక్కకుండా కథనానికి హాస్యపు రంగు వేసి lighter vein లో చూపించటం ఈ దర్శకుడిలోని అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనం. ఇలాంటి సబ్జెక్ట్ తో కోషిష్, ఖామోషీ, బ్లాక్ మొదలైన సినిమాలు వచ్చినా, మనకు నచ్చినా ఆ సినిమాలు చూస్తే మనసులు మరింత భారం అవుతాయి తప్ప తేలికవ్వవు. బర్ఫీ సినిమా చూస్తే మాత్రం కళ్ళు చెమ్మగిల్లినా మనసు తేలికౌతుంది. రెగులర్ ఫార్ములాసినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ వైవిధ్యమైన సినిమాలు నచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక అందమైన అనుభూతితో, ఆనందంతో హాల్ లోంచి బయటకు వస్తారు.


 అనురాగ్ తీసిన సినిమాల్లో "Kites"  నన్ను చాలా disappoint చేసినా "Life in a... Metro", "Gangster" రెండూ కూడా నాకు బాగా నచ్చాయి. Gangster చూసిన కొన్నిరోజులపాటు అసలు నేను అదే సినిమా గురించి ఆలోచించాను. ఇతని గురించిన మరిన్ని వివరాల కోసం వికీ లోకి వెళ్లిన నేను అనురాగ్ ఆరోగ్యం గురించిన విషయాలు చదివి షాక్ అయ్యాను..! great guy..


And apart from all the other things in the film, Ranbir is amazing ! షమ్మీకపూర్ చిలిపితనాన్ని,అల్లరిని; రాజ్ కపూర్ నటననూ; శశికపూర్, రిషి కపూర్ నీతూసింగ్ ల అందం,హావభావాలు అన్నీ తనలో కలిపేసుకున్న ఈ ప్రతిభావంతుడైన కుర్రాడికి ఉజ్వలమైన భవిష్యత్తు తప్పక ఉందని మరోసారి గట్టిగా అనిపించింది. మొదటి సినిమా(Saawariya) ఫ్లాప్ అయినా అందులో కూడా పరిణితి ఉన్న నటుడిలానే కనిపించాడీ కుర్రాడు. "Rockstar" అయితే పూర్తిగా ఇతని సినిమానే. ఇక బర్ఫీ లో మూగ,చెవిటి కుర్రాడిలాక ఇతను కనబరిచిన నటన అత్యుత్తమం అనే చెప్పాలి. Silence speaks volumes అన్నట్లుగానే కేవలం facial expressions తోనే ఒక పేరాగ్రాఫ్ డైలాగ్ ఇవ్వగలిగిన ఇంప్రెషన్ ని ఇతను ప్రేక్షకుల్లో కలిగించాడు. 





 

పొగరు నిండిన కళ్ళతో నాకస్సలు నచ్చేది కాదు ప్రియాంక. అలాంటిది "What's Your Raashee?" లో పన్నెండు పాత్రల్లో జీవం నింపి నన్ను ఆశ్చర్యపరిచింది. "Fashion" లో మోడల్ గా నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆమె "Don 2" లో ఏక్షన్ హీరోయిన్ గా అందరినీ(నన్నూ) ఆకట్టుకుంది. ఇక "బర్ఫీ"లో ఒక డీగ్లామరైజ్డ్ పాత్రలో ఆమె నటనకు huge applause ఇవ్వాలనిపించింది. అందం,నటన,గ్లామర్ మూడూ ఉన్న చోట మరి ఆ మాత్రం గర్వం,పొగరు ఉండవా అనుకున్నా..!”వసంతకోకిల ’ సినిమాలో శ్రీదేవి పాత్ర కన్నా కష్టమైనది, ఎక్కువ లోతైనది బర్ఫీలో ’ఝిల్మిల్ ’ పాత్ర.. అటువంటి చాలెంజింగ్ పాత్రలో ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేకుండా ఒదిగిపోయింది ప్రియాంక.


చాలీచాలని బట్టలతో, హీరోతో డాన్సులు మాత్రం చేసే టిపికల్ తెలుగు హీరోయిన్ లాగ, ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రల్లో మాత్రమే ఇన్నాళ్ళు చూసిన ఇలియానా ను బర్ఫీలో ఒక బరువైన పాత్రలో చూడటం ఓ పేద్ద సర్ప్రైజ్ నాకు. నటీనటుల నుండి ఎలాంటి నటన రాబట్టుకోవాలో తెలిసిన దర్శకులు ఉండటం కూడా చాలా ముఖ్యమని మరోసారి ఇలియానా ఋజువు చేసింది. ఎర్రని బొట్టు, కళ్లనిండా కాటుక ఆ అమ్మాయి మొహానికి ఎంత అందాన్ని ఇచ్చిందో! కాటుక నిండిన ఆ పెద్ద పెద్ద కళ్ళని చూస్తే బాపూ ఈ అమ్మయితో ఓ సినిమా తీసేస్తాడేమో అనిపించింది. బస్సులో బర్ఫీ,ఝిల్మిల్ ల మధ్యన కూచున్నప్పుడు తన మొహంలో చూపిన భావాలు, బర్ఫీ మనసులో ఝిల్మిల్ ఉందని అర్ధమైనప్పుడు ఆమె కళ్ళతో కనబరిచే భావాలు నిజంగా ప్రశంసాపూర్వకంగా ఉన్నాయి.

 

గుర్తుండిపోయే కొన్ని సన్నివేశాల గురించి: 

చిన్నదైనా రూపా గంగూలీ(టివీ మహాభారత్ సీరియల్లో ద్రౌపది) పాత్ర గుర్తుండిపోతుంది. ఆమె కూతురికి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పే సన్నివేశం; బర్ఫీ మొదటిసారి శృతిని చూసే సన్నివేశం; శృతి ని పెళ్ళాడతానని అడగటానికి వచ్చి మళ్ళి తనంతట తానే వెళ్పోతూ ఆమెకు తాను తగనని బర్ఫి చెప్పే సన్నివేశం; బర్ఫీ ఝిల్మిల్ కోసం వచ్చి నిరాశతో వెనుతిరిగినప్పుడు ఝిల్మిల్ పిలుస్తోందని శృతి చెప్పే సన్నివేశం; ఝిల్మిల్ 'ముస్కాన్' తాతగారి వేలు వదిలాకా మళ్ళీ బర్ఫీ వేలు పట్టుకునే సన్నివేశం; చివరలో బర్ఫీ పక్కన ఝిల్మిల్ ఒదిగి పడుకునే సన్నివేశం.. మొదలైన కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ గుర్తుండిపోతాయి. నాకు బాగా నచ్చింది బర్ఫీ తనకు ముఖ్యమని నమ్మిన మిత్రులందరినీ ల్యాంప్ పోస్ట్ దగ్గర పరీక్షించే సన్నివేశం. శృతి కూడా బర్ఫీ వేలు వదిలి ఆమడ దూరం పరిగెడుతుంది కానీ ఝిల్మిల్ అలానే నించుంటుంది. నిజంగా కళ్ళు చెమర్చాయి ఆ సన్నివేశంలో నాకు. స్వచ్ఛమైన ప్రేమకీ, స్నేహానికీ నిదర్శనం ఈ సన్నివేశం. మిన్ను విరిగి మీదపడ్డా మనల్ని వదిలివెళ్లని ఒక్క స్నేహం ఉన్నా చాలు కదా జీవితానికి అనిపించింది!! సినిమా చివరలో శృతి చెప్పే మాటలు కూడా అవే కదా. "నాది షరతులతో నిండిన పిరికి ప్రేమ... వాళ్ల ప్రేమ స్వచ్ఛమైనది.. నిబంధనారహితమైనది(Unconditional)...అందుకే వాళ్ల ప్రేమ గెలిచింది..." అంటుంది. 


 డైలాగులు ఎక్కువగా లేని ఈ సినిమాకి నేపధ్యసంగీతమే ప్రాణం. ప్రతి ఫ్రేం లోనూ కూడా వెనుక నుంచి వినబడే నేపథ్యసంగీతం మనసును ఆకట్టుకుంటుంది. ప్రీతమ్(సంగీత దర్శకుడు),అనురాగ్ ల జోడీ ఇంతకు ముందులాగనే బాగా కుదిరింది. "గేంగ్ స్టర్" కూడా ప్రీతమ్ గుర్తుండిపోయే సంగీతాన్ని అందించాడు. ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే అసలు స్టన్నింగ్ విజువల్స్ అన్నమాట. వెంఠనే డార్జలింగ్ కి వెళ్పోవాలి అన్నంత అందమైన లొకేషన్స్ చూపెట్టారు. కథ ఎలాంటిదైన ప్రేక్షకుల్లో ఉత్సాహం,ఆతృత తగ్గకుండా ఉండేలాంటి కథనం ఉంటేనే సినిమా ఆకట్టుకుంటుంది. దర్శకుడివే కథ,స్క్రీన్ ప్లే కూడా. అందువల్ల మూడు విభాగాల్లోనూ కూడా అనురాగ్ సమతుల్యం చూపెడుతూ వచ్చాడు. మొత్తమ్మీద ఇది ఒక్కరి సినిమా కాదు.. పూర్తి టీమ్ వర్క్ ఈ సినిమా విజయానికి కారణం. 


బర్ఫీ ఆస్కార్స్ కి నామినేట్ అయ్యిందని తెలిసాకా, ఆస్కార్ వచ్చినా రాకపోయినా ఈ దర్శకుడి ఆరోగ్యం బాగుండి, ఇతను మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని మనసారా కోరుకున్నా!


Saturday, September 15, 2012

Is life beautiful?


Is life beautiful?

yes Of course...! But if it comes to the telugu film.."Life is beautiful"..i felt.. some colours are really missing ! అందుకే ఆ జీవితం నాకు పెద్దగా అందంగా కనబడలేదు:(

మళ్లీ మరోసారి స్టుడెంట్స్ ..కాలేజ్ లైఫ్ చుట్టూ మనల్ని తిప్పే ఈ కథకు కాసింత ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా జతఅయ్యింది. కొత్త పిల్లలు(నటులు) తమవంతు కృషిని, శ్రమను తెరపై చూపెట్టగలిగారు కానీ ఎందుకో నాకు సినిమాలో ఏదో మిస్సయింది అనిపించింది నాకు. చాలారోజులకు అమల ను చూద్దాం అని ఉత్సాహపడిన నాకు తన పాత్ర ఎక్కువలేకపోవటం నిరుత్సాహాన్ని కలిగించింది. బహుశా నేను సినిమా నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానేమో అనిపించింది.

శేఖర్ కమ్ముల మొదటి సినిమాను చూడలేదు కానీ 'ఆనంద్', 'గోదావరి', 'హేపిడేస్' మూడు బాగా నచ్చాయి నాకు. ఆవకాయ్ బిర్యాని, లీడర్ పర్వాలేదు అనుకున్నా. ఇక ఈసారి అమల, కొత్త నటులు, రెఫ్రెషింగ్ థీమ్,కాన్సెప్ట్ కూడా బాగుంది....ఇవన్నీ విని,చదివి ఎక్కువే ఆశ పడిపోయాను. mother sentiment, చిన్న పాప నటన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో పాప మాటలు బాగున్నాయి. కంట తడి తెప్పించాయి..! కానీ సంగీతం కూడా శేఖర్ పాత సినిమాల ధోరణిలోనే కాస్త డల్ గా అనిపించింది.

ఇక నాకు అస్సలు నచ్చని విషయం చిన్నపిల్లలా ప్రేమ వ్యవహారాలూ. పదహారు,పదిహేడు వయసు పిల్లలతో తీసే ప్రేమ సినిమాలు అంటే నాకు భలే కోపం అసలు. ఎందుకని ఇలా ? చివరికి ఏం నీతి చెప్తే ఏమిటి? సినిమా అంతా చూపిస్తున్నారా లేదా? మన ఇంట్లో మనం మన ఇళ్ళల్లో అ వయసులో అలాంటి వ్యవహారాల్లోకి దిగితే సహించగలమా? ఎంసెట్ కి ప్రిపెరయ్యే పిల్లలు, డిగ్రి చదివే పిల్లలు.. కాలం అలానే ఉంది ప్రపంచాన్ని చూసి మాట్లాడు తల్లీ అనొచ్చు ఎవరన్నా! కానీ ఎందుకో నాకైతే చిన్న పిల్లలతో అలా సినిమాల్లో ప్రేమ,దోమ చూపిస్తే నచ్చదు. అసలు 'శ్రియ' లాంటి సీనియర్ నటిని ఆ చిన్న పిల్లాడి పక్కన చూస్తేనే నాకు వికారం వచ్చింది. 'u too brutus?' అన్నట్లు 'u too sekhar?' అని అడగాలనిపించింది. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన జంధ్యాల చదువుకునే పిల్లలతో తీసిన సినిమాలనే నేను విమర్శించేదాన్ని. ఏదో కొత్త రకంగా తీస్తున్నాడని, తెలుగు తెరకు మరో విభిన్న దర్శకుడు దొరికాడేమో అని సరదాపడ్డాను. ప్చ్..!

తన టార్గెట్ ప్రేక్షకులు మధ్యతరగతి యువత అని ఒక ఎఫ్ ఎం.రేడియోలో శేఖర్ చెప్పినట్లు ఈ సినిమా యువతకు బాగా నచ్చవచ్చు. But i feel sekhar has definetly lost his magic somewhere around "happy days" itself! ఇకపోతే, "Beauty lies in the eyes of the beholder " అన్నట్లు చూసే కళ్ళను బట్టే కదా.. నా కళ్ళలోనే ఏదన్నా దోషం ఉందేమో మరి..అందుకేనేమో నాకు ఈ 'లైఫ్' బ్యూటిఫుల్ గా ఉన్నా కాస్త రంగు తక్కువగానే కనపడింది..

Sunday, March 18, 2012

KAHAANi - It's a one-woman show !





రిలీజైన పది రోజుల తర్వాత, బాగుందన్న టాక్ విన్నాకా నిన్న విద్యాబాలన్ నటించిన "కహానీ"(హిందీ) సినిమా చూశాం. హీరో డామినేషన్ ఎక్కువ ఉన్న భారతీయ సినిమాల్లో నాయికకు పెద్ద పాత్ర ఉండటం అరుదుగా కనబడుతూ ఉంటుంది. అలాంటిది తన ఒక్క పాత్రతోనే సినిమా మొత్తం నడిపించగల సత్తా తనకు ఉంది అని మరోసారి విద్యాబాలన్ నిరూపించింది. It's a one-woman show !



"పరిణీత" లో ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర నాయిక లలితగా ఒదిగిపోయినా, "గురు" సినిమాలో చక్రాల కుర్చీ లోంచి లేవలేని అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా కంట తడిపెట్టించినా, "పా" లో సింగిల్ మదర్ గా జీవించినా, "భూల్ భులయ్య" (మన చంద్రముఖి సినిమా రీమేక్)" లో మానసిక రుగ్మత ఉన్న పాత్రలో మెప్పించినా, "డర్టీ పిక్చర్" లో స్టార్ హోదా నుంచి అపజయంపాలైన నటిగా మారిపోయినా... అది విద్య కే చెల్లింది. ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టిన "ఇష్కియా", "హూ కిల్డ్ జెస్సికా" నేను మిస్సాయా.

తాజాగా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్నీ, ఉత్తమ నటిగానే మరికొన్ని పురస్కారాలను అందుకున్న విద్యాబలన్ "కహానీ" సినిమాలో హీరోయిన్ ఇమేజ్ కు భిన్నమైన ప్రెగ్నెంట్ లేడీ పాత్ర పోషించింది. విభిన్నమైన పాత్రలు పోషించటంలో తనదంటూ ఒక ప్రత్యేక పంథా సృష్టించుకున్నవిధ్యాబాలన్ ఈ సినిమాలో కూడా అసామాన్య ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. లండన్ నుంచి భర్తను వెతుక్కుంటూ వచ్చిన "విద్యా బాగ్చీ" అనే ప్రెగ్నెంట్ పాత్ర చుట్టూ మొత్తం సినిమా అల్లుకుపోయి ఉంటుంది. విద్య చెప్పే డైలాగ్స్ కన్నా ఆమె కళ్ళే ఎక్కువ సందేశాన్ని అందిస్తాయి. ఇక ఆమె నవ్వు వెన్నెలలు కురిపిస్తుంది అనటం అతిశయోక్తి కాదు. ఆందోళననూ, అమాయకత్వాన్నీ, కోపాన్నీ, హాస్యాన్నీ, ధైర్యాన్నీ, తెగింపునూ సమపాళ్లలో నింపుకున్న ఈ మహిళ చిట్టచివరిదాకా భర్త కోసం జరిపే వెతుకులాటలో మనమూ భాగమైపోతాం.


మెయిన్ స్ట్రీం మసాలా సినిమాలకు భిన్నంగా తయారైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు దర్శకుడైన Sujoy Ghosh సహనిర్మాత కూడా. టైటిల్స్ మొదలుకుని చివరి దాకా ఎక్కడా కూడా చూసేవారికి విసుగు రాకుండా స్క్రీన్ ప్లే ను తయారుచేసుకోవటం ఈ దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. సినిమాలోని ఆఖరి సీన్ మంచి ట్విస్ట్ ను అందించింది. ఆ సీన్ లో విద్య నటన కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే నెల క్రితం ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే నేను ఈ సినిమా క్లైమాక్స్ ఊహించాను. నేను ఊహించిన రెండు గెస్ లూ నిజమయ్యాయి.


సబ్ ఇన్స్పెక్టర్ రాణా/సాత్యకి పాత్రలో బెంగాలీ నటుడు Parambrata Chattopadhyay చాలా బాగా ఇమిడిపోయాడు. విద్యా బాగ్చీ పాత్ర తరువాత నాకు బాగా నచ్చేసిన పాత్ర ఇది. సాత్యకి పేరుని ఈ పాత్రకు పెట్టడం సింబాలిక్ గా బాగుంది. ఇతను విద్యాబాలన్ కెరీర్ మొదట్లో ఆమెతో కలిసి ఒకటి రెండు సినిమాలు వేసాడుట. క్లర్క్ + కాంట్రాక్ట్ కిల్లర్ గా చూపెట్టిన మనిషి ఫన్నీగా, ఇలా కూడా ఉంటారన్న మాట అనిపించేలా ఉన్నాడు. విశాల్-శేఖర్ అందించిన నేపధ్యసంగీతం ఆకట్టుకుంది. చివర్లో నాకు చాలా ఇష్టమైన రవీంద్రుడి గీతం "ఏక్లా చలో" వినిపించటం చాలా బావుంది. అది అమితాబ్ పాడినట్లున్నాడు.


కలకత్తా నగరాన్ని సినిమా నేపథ్యంగా చేసుకోవటం బాగుంది. పురాతన నగరం, పండుగ వతావరణం, దుర్గ పూజ ఇవన్నీ చూపించిన విధానం సినిమాలోని సస్పెన్స్ వాతావరణానికి సమంగా సరిపోయాయి. ఈ సినిమా భవిష్యత్తులో మరిన్ని సస్పెన్స్ సినిమాలకు దారి చూపెడుతుందేమో అనిపించింది.

Wednesday, March 7, 2012

"Children of Heaven"


మా చిన్నప్పుడు దూరదర్శన్ లో అన్ని భారతీయ భాషా చలనచిత్రాలతో పాటూ విదేశీ భాషా చలనచిత్రాలను కూడా తరచుగా చూపెట్టేవారు. ఇతర దేశాల తాలుకూ ఎన్నో ఉత్తమ చిత్రాలను దూరదర్సన్ వల్లనే చూడగలిగాం అప్పట్లో. ఇప్పుడు రకరకాల ఛానల్స్ ఎన్నో ఉన్నా కూడా ఆ క్వాలిటి ఉన్న సినిమాలు తక్కువగా చూస్తున్నాం. నేను ఇటీవల చూసిన "Children of Heaven" అనే ఇరానియన్ ఫిల్మ్ మళ్ళీ పాత దూరదర్శన్ రోజులను గుర్తు చేసింది. అసలు ఇంత చిన్న అంశం మీద కూడా సినిమా తీయచ్చా? అని ఆశ్చర్యం వేసింది. దర్శకుడు ’Majid Majidi’ కి ఎన్నో అవార్డులను, ప్రశంసలనూ తెచ్చిపెట్టిన ఈ సినిమాకు 1998 లో దక్కాల్సిన ఆస్కార్ అవార్డ్ ను మరో Italian Film "Life Is Beautiful" చేజిక్కించేసుకుంది. ఆ సినిమా కూడా అంతటి గొప్ప సినిమానే మరి.


ఒక పేద కుటుంబం. అందులో కష్టపడే తండ్రి, చదువుకునే ఇద్దరు పిల్లలు, మూడవ కాన్పు తరువాత ఆరోగ్యరీత్యా ఇంకా కోలుకోని తల్లి. స్కూలుకెళ్ళే పిల్లలిద్దరూ అన్నాచెల్లెళ్ళు. అన్నగారు అలీ(Amir Farrokh Hashemian) ఒకరోజు చెల్లెలు జారా(Bahare Seddiqi) షూ రిపేరు చేయించి తెస్తూండగా ఒక కూరల కొట్లో ఆ షూస్ ఉన్న కవర్ మిస్సవుతుంది. రోజూ స్కూలుకి వేసుకుని వెళ్ళాల్సిన షూస్ లేకపోతే ఎలా? వెతుక్కురాకపోతే నాన్నకు చెప్పేస్తా.. అని బెదిరిస్తుంది చెల్లెల్లు. అన్న వెనక్కు వెళ్ళి ఎంత వెతికినా అవి దొరకవు. తల్లితండ్రి మాట్లాడుకుంటూ ఉండగా, హోంవర్క్ చేస్తూ అన్నాచెల్లెలూ షూస్ గురించి రహస్యంగా మాట్లాడుకునే సన్నివేశం చాలా హృద్యంగా ఉంటుంది. తండ్రి కొత్త షూస్ కొనలేడని, షూస్ పోయిన సంగతి తెలిస్తే బాధపడతాడనీ, తల్లితండ్రులకి ఆ సంగతి తెలియకుండా దాచాలని పిల్లలు చేసే ప్రయత్నం మనసుకు హత్తుకుపోతుంది. పిల్లలు ఏ మాలిన్యం అంటని స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు కాబట్టి సినిమాకు "Children of Heaven" అని పేరు పెట్టారని నాకనిపించింది.





తన షూస్ చెల్లెలు స్కూలుకి వేసుకెళ్ళి, ఆమె స్కూల్ నుంచి రాగానే తాను వాటిని వేసుకుని వెళ్ళేలా అలీ ఒప్పందం కుదుర్చుకుంటాడు చెల్లితో. రోజూ చెల్లి స్కూల్ నుంచి వచ్చేదారిలో నించోవటం, ఆమె షూస్ ఇవ్వగానే అవి వేసుకుని గబగబా పరిగెత్తుకువెళ్లటం జరుగుతూ ఉంటుంది. ఇలా తంటాలు పడుతుంటే ఒకరోజు చెల్లెలు స్కూల్ నుంచి వస్తుంటే ఒక షూ మురికికాలవలో పడిపోతుంది. కాలవ ప్రవాహంలో ఆ షూ కొట్టుకుపోయేప్పుడు వెనకాల వచ్చే నేపథ్యసంగీతం చాలా బావుంటుంది. చివరికి ఎవరో ఒక పుణ్యాత్ముడి సాయంతో షూ బయటకు తీసుకోగలుగుతుంది ఆ అమ్మాయి. స్కూలుకి లేటయిపోయిందని అన్నగారు కేకలేస్తాడు పాపం. రోజూ స్కూలుకి ఆలస్యంగా వస్తున్నాడని ప్రిన్సిపాల్ అతన్ని కోప్పడుతూంటాడు మరి.

ఒకరోజు షూస్ దుమ్ముకొట్టుకుపోతాయి. రాత్రి వాటిని ఉతికి ఆరబెడతారు పిల్లలు. కానీ ఆ రాత్రి వర్షం వచ్చి అవి సరిగ్గా ఆరవు. ఇలా జరుగుతుండగా ఒకరోజు మొక్కలకు తోటపని చేసేందుకు తండ్రి వెళుతూ పిల్లవాణ్ణి కూడా తీసుకువెళ్తాడు. పెద్దపెద్ద ఇళ్ళలో తోటలో కలుపు ఏరి, మొక్కలకు ఎరువు వేసి తోటంతా బాగుచేస్తే ఆ ఇంటివాళ్ళు కాసిని డబ్బులిస్తారన్నమాట. అలా ఇల్లిల్లూ వెతుక్కుంటూ వెళ్తే ఒక ఇంట్లో వాళ్ళు పిలిచి తోటపని చేయించుకుని డబ్బులిస్తారు. పిల్లాడి సహాయానికి తండ్రి సంతోషించటం, ఇద్దరూ సైకిల్ మీద వెళ్తూ మాట్లాడుకోవటం బావుంటుంది. చేతికి డబ్బు వచ్చిందని తండి అవీ ఇవీ కొంటానంటుంటే, "ఇవేం కాదు చెల్లి షూస్ పాతవయిపోయాయి కొత్తవి కొను నాన్నా" అంటాడు ఆ పిల్లాడు తెలివిగా. ఈ మొత్తం సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది.



ఒకరోజు తన స్కూల్లో ఒకమ్మాయి తన పోయిన షూస్ వేసుకుని ఉండటం చూసి, అన్నగారితో కలిసి ఆ పిల్లను వెంబడిస్తారు. కానీ వాళ్లది తమకన్నా దయనీయమైన స్థితి అని తెలుసుకుని నిరాశతో వెనక్కు తిరిగివెళ్పోతారు. తర్వాత స్కూలు నోటీసు బోర్డ్ లో పరుగుపందెం గురించిన ప్రకటన చూస్తాడు అన్న. దాంట్లో మూడవ బహుమతి షూస్ అని చూసి, వాటి కోసం పరుగుపందెంలో పాల్గొంటాడు. చివరికి ఏమయ్యింది? అతనికి షూస్ దక్కాయా లేదా ఓడిపోయాడా? అన్నది పతాక సన్నివేశం.



పిల్లలిద్దరు కూడా చక్కగా నటించారు. ముఖ్యంగా అలీ గా వేసిన పిల్లాడు నాకు బాగ నచ్చాడు. పాత్రకు తగ్గ హావభావాలను, పరిపక్వతను బాగా కనబరిచాడు. పిల్లలు తమ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని నడుచుకోవాలనే నీతిని కూడా ఈ సినిమా చెబుతుంది. నేపధ్యసంగీతం చాలా బావుందీ సినిమాలో. అతిచిన్న కథాంశంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఇలాంటి సినిమాలు నిరూపిస్తాయి.


ఈ సినిమా ట్రైలర్:





Monday, March 5, 2012

The Artist - ఒక సృజనాత్మక ప్రయోగం




ఈ సినిమా ట్రైలర్


రెండు హాల్స్ లో రెండే షోలు, అవి కూడా టైమింగ్స్ సరిగ్గా లేని కారణంగా పదిహేను రోజులుగా వెళ్లాలనుకుంటన్నా ఓ సినిమా చూడటం కుదర్లేదు. ఈలోపూ అదృష్టవశాత్తు ఈ సినిమాకు ఐదు ఆస్కార్స్ వచ్చేసి మరో థియేటర్లో మరో షో వెయ్యటం మొదలెట్టాకా నిన్న ఆదివారం మాకు వెళ్లటం కుదిరింది. 2011 - 'Cannes International Film Festival' లో ప్రీమియర్ కాబడి, అప్పటి నుంచీ వరుసగా ఎన్నో అవార్డులను చేజిక్కించుకుంటున్న ఫ్రెంచ్ సినిమా "The Artist". ఇటీవలే ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న ఈ చిత్రానికి మరో నాలుగు విభాగాల్లో కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. ( ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, సంగీతం, కాస్ట్యూమ్స్). కేవలం ఒక ప్రయోగాత్మక చిత్రంగా ఈ సినిమా తీసిన ఫ్రెంచ్ దర్శకుడు Michel Hazanavicius కు ఒక్కసారిగా యావత్ ప్రపంచం ప్రశంసల బంగారు కిరీటం పెట్టించిన సినిమా ఇది. ఈ black & white సినిమా నిజంగా ఒక పాత తరం సినిమాను చూస్తున్నామనే భ్రమను, మాటలు అవసరం లేకుండా దర్శకుడి భావాలను ప్రేక్షకుల మనసులకు అందించే ప్రయత్నంలోనూ నూరు శాతం సఫలం అయ్యిందనే చెప్పాలి.


ఇది పూర్తిగా దర్శకుడి చిత్రం. సినిమాలో డైలాగులు లేకున్నా జరుగుతున్న కథ సులువుగా ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా సన్నివేశాలను రూపొందించారు. కాకపోతే మధ్య మధ్య కొన్ని ముఖ్యమైన డైలాగ్స్ స్లైడ్స్ లాగ(చార్లి చాప్లిన్ సినిమాల్లో లాగ) చూపెట్టారు. కొన్ని సన్నివేశాల్లో ఇవి అనవసరం అనిపించాయి కూడా. డైలాగులు లేవు కాబట్టి చిత్రం అంతా నటీనటుల హావభావలపై నడుస్తుంది. తెరపై ఎక్కువగా కనబడ్డ హీరో, హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యుత్తమ నటన కనబరిచారు. జార్జ్ పాత్ర వేసిన ఫ్రెంచ్ నటుడు Jean Dujardin ఆస్కార్ నే కాక, 2011 ప్రీమియర్ తోటే Cannes Film Festival లో తన నటనకు గానూ Palme d'Or (Golden Palm) అవార్డ్ దక్కించుకున్నాడు. ప్రముఖ మూకీ చిత్ర హీరోగా, ఆ తర్వాత ఓటనిమి అంగీకరించలేని అహంకారాన్ని, అంతలోనే నిస్సహాయతనూ, పెప్పీ పై అభిమానాన్నీ, సాటి నటిగా ఆమెలోని ప్రతిభను మెచ్చుకునే నటుడిగా అతడు కనబరిచిన హావభావాలు బాగా ఆకట్టుకుంటాయి. పెప్పీగా నటించిన ఫ్రెంచ్ నటి "బెరెనిస్ బిజో" (ఈ సినిమా దర్శకుడి భార్య) కూడా ఉత్తమ అభినయాన్ని కనబరిచింది. డాన్సర్స్ లో ఒకతెగా అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు కావల్సిన సహజత్వాన్ని, తరువాత ప్రముఖ నటి అయ్యాకా అవసరమైన హుందాతనాన్నీ రెండిటినీ సమపాళ్ళలో తన నటనలో చూపెట్టింది.


హాల్లో ఈ సినిమా మొదలవగానే నాకు మొట్టమొదట గుర్తుకొచ్చిన వ్యక్తి "సింగీతం శ్రీనివాసరావు". చెప్పదలుచుకున్న సందేశాన్ని వ్యక్తపరచటానికి భాష, మాటలు ఏదీ అవసరం లేదు... అనే ఉద్దేశంతో సృజనాత్మక ప్రయోగంగా "పుష్పక విమాన"మనే మూకీ చిత్రాన్ని పదిహేనేళ్ల క్రితమే తీసి, అదే 'Cannes International Film Festival' లో అందరి ప్రశంసలు పొందారు 'సింగీతం' గారు. ఇది colour లో తీసిన ఒక social satire. "The Artist" సినిమా పూర్తిగా నలుపు తెలుపుల్లో చిత్రీకరించిన ఒక నటుడి జీవితకథ.1927 లోని మూకీ చిత్రాల్లో నటించిన ఒక ప్రముఖ నటుడి నటజీవితం ఎలా, ఎన్ని మలుపులు తిరిగింది అన్నది ఈ చిత్ర కథాంశం. కేవలం ముఫ్ఫై ఐదు రోజుల్లో ఈ చిత్రాన్ని ఎలా తీసారో, ఏ ఏ విధానలను వాడారో ఈ వికీ లింక్ లో చదివి తెలుసుకోవచ్చు.


ఈ చిత్రం గురించి చెప్పుకునేప్పుడు దర్శక నటీనటులతో పాటూ తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో వ్యక్తి సంగీత దర్శకుడు. డైలాగులు లేని ఈ సినిమాకు ప్రాణం సంగీతమే. ప్రతి సన్నివేశానికీ అనుగుణమైన, భావవ్యక్తీకరణకు అవసరమైన సంగీతాన్ని అందించటంలో ఫ్రెంచ్ స్వరకర్త Ludovic Bource సఫలీకృతుడయ్యడు.



1927 లోని మూకీ చిత్రాల్లో నటించిన ఒక ప్రముఖ నటుడి నటజీవితం ఎలా, ఎన్ని మలుపులు తిరిగింది అన్నది ఈ చిత్ర కథాంశం. కథాసమయం ఐదారేళ్ళు. జార్జ్ వేలెంటిన్ ఒక ప్రముఖ మూకీ చిత్ర నటుడు. డైలాగులు ఉండే మాట్లాడే సినిమాల నిర్మాణం మొదలవ్వగానే జార్జ్ వెలుగు తగ్గిపోతుంది. పంతంతో అతడు తన ఆస్తంతా పెట్టుబడిగా పెట్టి తీసిన సినిమా నష్టపోతుంది. ఆస్తిని, ఇంటిని, పేరుప్రతిష్ఠలనూ అన్నింటినీ పోగొట్టుకున్న అతనితో గొడవపడి అతని భార్య కూడా విడిపోతుంది. తన విలువైన సామానులను సైతం వేలం వేసుకుని అంత గొప్ప నటుడూ వీధినపడతాడు. అతనిని అభిమానించే 'పెప్పీ మిల్లర్' అనే ఒక సాధారణ డాన్సర్ అంచలంచలుగా ప్రముఖ నటి స్థాయికి ఎదుగుతుంది. మొదట్లో తనను ఆదరించిన జార్జ్ కు ఆమె ఏ విధంగా సహాయపడింది అనేది మిగిలిన కథ. కొంతవరకూ ఈ సినిమా గురుదత్ తీసిన "కాగజ్ కే ఫూల్" సినిమాను గుర్తుకు తెస్తుంది.



సినిమాలో నాకు అందరికన్న బాగా నచ్చినది హీరో పెంపుడు కుక్క. ఆత్మహత్యకు పాల్పడుతున్నప్పుడు తన యజమానిని రక్షించుకోవాలనే తపనతో పరిగెత్తుకువెళ్ళి వీధిలో కనబడ్డ పోలీసాఫీసరును తీసుకువచ్చే సీన్ కళ్ళ నీళ్ళు తెప్పించింది. మనుషులకు లేని విశ్వాసం, ప్రేమ పెంపుడు జంతువుల్లో ఉంటాయి. వాటికి మనిషి డబ్బుతో గానీ, పరపతితో గాని పనిలేదు అని ఈ సన్నివేశం చెప్తుంది. మరి కొన్ని సన్నివేశాల్లో.. ఈ పెంపుడు కుక్కతో కూడా ఎంత చక్కగా నటింపజేసాడీ దర్శకుడు అనిపించింది.


ఇక గుర్తుండిపోయే సన్నివేశాల గురించి చెప్పాలంటే,

* సినిమా మొదట్లో సెట్స్ లో తెర వెనుక ఉన్నదెవరో ఒకరికొకరికి తెలీకుండా హీరోహీరోయిన్లు చేసే టాప్ డాన్స్ సీన్ చాలా నచ్చింది నాకు.

* తర్వాత జర్జ్ కోట్ లో చెయ్యిపెట్టి పెప్పీ చేసిన అభినయం,

* "నువ్వు గొప్ప నటివి అవ్వాలంటే అందరికన్న విభిన్నమైనదేదైనా నీలో ఉండాలి.." అంటూ ఆమె పై పెదవిపై ఒక బ్యూటీ స్పాట్ పెట్టే దృశ్యం,

* పెప్పీ గొప్ప నటిగా మారే విధానాన్ని టైటిల్స్ ద్వారా చూపెట్టడం (చివరిలో ఉండే పేరు నెమ్మది నెమ్మదిగా మైన్ టైటిల్స్ లోకి మారినట్లుగా చూపెట్టడం)

*  నలుగురైదుగురు మాత్రమే ఉన్న హాల్లో  తాను కూర్చుని ఫ్లాప్ అయిన జార్జ్ తీసిన సినిమాను చూసి పెప్పీ కంటతడిపెట్టే సన్నివేశం,

* పెంపుడు కుక్క జార్జ్ ని రక్షించటం

* తాను వేలం వేసిన తన వస్తువులను పెప్పీ ఇంట్లో జార్జ్ చూసే సన్నివేశం

* బజార్లో షాపులో సేల్ కు ఉన్న కోటును బయట నుంచుని అద్దంలోంచి చూసుకునే దృశ్యం

* చివర్లో ఇద్దరు కలిసి టాప్ డాన్స్ చేసే సన్నివేశం

ఈ చివరి దృశ్యంలో నిజంగా వాళ్ళిద్దరి కళ్ళలో ఉన్న ఆనందం మన కళ్ళలో,మనసులో కూడా నిలిచిపోతుంది. అది ఇద్దరు నటులు తమ గెలుపును చూసుకునే ఆనందం.



అద్బుతమైన సినిమా అనను కానీ సినిమా అమ్టే ఇష్టం ఉన్నవారంతా చూసి తీరాల్సిన చాలా మంచి సినిమా ఇది. ఇటువంటి మంచి సినిమాలను మల్టిప్లెక్సులకు, ఒకటి రెండు షో లకూ పరిమితం చేయటం మంచి సినిమాలకు సామాన్య ప్రేక్షకుడికి దూరం చేయటమే అవుతుంది !


Tuesday, February 28, 2012

'Love ఫెయిల్యూర్' బావుంది





ఆనందం... నిన్నంతా..! డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువగా ఉన్న సమయంలో, మొత్తానికి ఒక స్ట్రైట్ తెలుగు సినిమా, "తారలు" కాని నటులతో, కొత్తదనంతో ముందుకొచ్చిందని. వచ్చి ఆకట్టుకుందని.

కొత్త దర్శకుడైన "బాలాజీ మోహన్" మొదటి ప్రయత్నంతోనే విజయాన్ని సాధించాడు. " Kadhalil Sodhapuvadhu Eppadi”  పేరుతో అతను తీసిన ఒక తమిళ లఘు చిత్రం చూసి, ఇదే సినిమాని తెలుగు,తమిళ భాషల్లో వెండితెరపైకి ఎక్కించమని సిధ్ధార్ధ ప్రోత్సాహించటంతో ఈ సినిమా తయారయిందని ఎక్కడో చదివాను. మొదటి భాగం చూస్తూంటే ఈ సినిమా లక్ష్యం "విద్యార్ధులు" మాత్రమేనేమో. ఈమధ్యన వస్తున్న అన్ని సినిమాల్లాగా ఈ సినిమా రెండవభాగం కూడా బోర్ కొడుతుందేమో అని భయపడ్డాను. కానీ మామూలుగా అనిపించిన మొదటి భాగం కన్నా, విరామం తర్వాత సినిమా అప్పుడే అయిపోయిందా అనుకునేంత ఆసక్తికరంగా, ఉత్సాహవంతంగా గడిచిపోయింది. నాకు బాగా నచ్చినది ఈ రెండవ భాగమే.

ఇద్దరు కాలేజీ విద్యార్ధులు, వారి మధ్యన ప్రేమ. చాలా మాములు పాత కథాంశం. కానీ ఇద్దరి ప్రేమికులు విడిపోవటం దగ్గర నుంచీ మొదలై, మళ్ళీ చివరికి వారు కలిసేదాకా ఏo జరిగింది అన్నది వైవిధ్యంగా చిత్రికరించాడు దర్శకుడు. కథనంలో కొత్తదనం ఆకట్టుకుంది. విద్యార్ధి దశలో వారిలో ఉండే అపోహలు, కలలు, వెర్రి వ్యామోహాలు, స్నేహితుల తప్పుడు సలహాలు, పర్యవసానాలు, అపార్ధాలు మొదలైనవన్నీ చాలా చక్కగా చూపించారు సినిమాలో. అన్ని సినిమాల్లో ఒకే రకమైన హాస్యాన్ని, హాస్యనటుల్నీ చూసీ చూసీ విసుగెత్తిన నాకు కామెడి ట్రాక్ విడిగా పెట్టకుండా కథలోనే అంతర్లీనంగా హాస్యం చొప్పించటం నచ్చింది.



నటినటులందరూ బాగా చేసారు. సిద్ధార్థ నటనకు వంక పెట్టలేం కానీ అతని మొహంలో మునుపటి తాజాదనం లేదు. కృష్ణ అయినా, శోభన్ బాబు అయినా మరెవరయినా వయసుపెరిగి, శారీరకమార్పులు వచ్చినా మన మునుపటి హీరోల మొహాలు చాలా ఆకర్షణీయంగా ఉండేవి. ఇప్పటి హీరోలయినా, హీరోయిన్లయినా పది సినిమాలు అవ్వగానే మొహాల్లో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇది ఎందువల్లో తెలీదు కానీ ఈ ముఖం లోని మార్పు వారి నటనను కప్పేస్తుంది. కేరళ సుందరి "అమలాపాల్" మాత్రం చక్కని నటనతో ఆకట్టుకుంది. చూడటానికి బాలీవుడ్ నటి "Deepika Padukone" చెల్లెలేమో అనేలా ఉంది. ముఖ్యంగా కళ్ళు ఆకర్షణీయంగా ఉన్నాయి. అమాయకమైన మొహం అదనపు ఆకర్షణ. ముందు ముందు ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతానికి వృధ్ధిలోకి వచ్చేలాగే కనబడింది. మధ్యతరగతి అమ్మాయిగా చూపించటానికి అతిగా అలంకరణలు లేకుండా, మొత్తం సినిమాలో జుట్టు కూడా విరబొయ్యకుండా "జడ"తోనే చూపించటం నాకు బాగా నచ్చింది. అది కూడా నాకు బాగా ఇష్టమైన ఫ్రెంచ్ ప్లేట్ తో !



హీరోయిన్ తల్లిగా టివీ ఆర్టిస్ట్ సురేఖ బాగా నటించినా, ఇంత చిన్న వయసులో తల్లి పాత్రలు పోషించాల్సిన అవసరమేమిటీ అనిపించింది. ఒక పాత్రలో ఫిక్స్ ఐతే ఇక అదే మూసలో పడేస్తారు కదా వెండితెర మీద. అందుకని. సురేష్ ను కూడా తండ్రి పాత్రలో నేను చూట్టం ఇదే మొదటిసారి. (ఇంతకు ముందు ఎక్కడైనా వేసాడేమో తెలీదు మరి) సన్నగా, ఆకర్షణీయంగా ఉండే అతడిలో వయసు తెచ్చిన మార్పులు చూడాటానికి కాస్త ఇబ్బందే అయ్యింది. ఎల్లకాలం మనుషులు ఒకేలా ఉండరు కదా..! కానీ హీరోయిన్ తల్లిదండ్రులుగా వీరిద్దరి మధ్య నడిచే కథను చాలా విలక్షణంగా చూపెట్టారు. ఒక సందర్భంలో సురేష్ కూతురుతో చెప్పే "ఫర్ ఈచ్ అదర్ అని ఉండరు. నచ్చిన మనిషికి అనుగుణంగా మనం మారటం, మనకు అనుకూలంగా వాళ్లు మారటం... ఇలా ఒకరికోసం ఒకరు మారటమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ " అని చెప్తాడు.( సరిగ్గా ఇవే మాటలు కాదు కానీ ఇదే అర్ధం). ఈ డైలాగ్ ఈ సినిమా ఇచ్చే మెసేజ్ అనిపించింది. ఇలాంటిదే "మిస్టర్ ఫర్ఫెక్ట్"  సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది "ప్రేమంటే ఇద్దరు కలిసి కూర్చుని మంచి కాఫీ తాగటం కాదు... ఇద్దరు కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకోవటం" అని.

సిధ్ధార్థ తల్లిదండ్రులు, వారి పాత్రల్ని చిత్రించిన విధానం బాగున్నాయి. తల్లిదండ్రుల మధ్యన ప్రేమాభిమానాలు, ద్వేషాలు-కొట్లాటలు పిల్లల వ్యక్తిత్వాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అన్నది హీరో హీరోయిన్ పాత్రల ద్వారా చూపించారు. తల్లిదండ్రులు విడిపోవాలనుకున్నా, కలవాలనుకున్నా పిల్లల భావాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పిన తీరు బావుంది. తల్లి తమ విడాకుల ప్రసక్తి తెచ్చినప్పుడు పార్వతి(హీరోయిన్) చెప్పిన డైలగులు అందుకు నిదర్శనం. హీరో ఫ్రెండ్స్ తో పాటూ యానాం వెళ్లినప్పుడు, అక్కడ ఓ స్నేహితుడు పెళ్లాడబోయే అమ్మాయి పాత్ర బాగుంది. సొంతమో కాదో కానీ ఆ అమ్మాయి వాయిస్ భలే ఉంది.

తమన్ సంగీతం బానే ఉంది. తెలుగు కన్నా తమిళ్ పాటలు బాగున్నాయని హాల్లో కురాళ్ళు అనుకుంటున్నారు. సినిమాలో హీరో సిధ్ధార్థ రెండు పాటలు కూడా పాడాడు. నాకు మాత్రం కార్తీక్ పాడిన "ఇంతెజారే..." పాట చాలా నచ్చేసింది. కార్తీక్ తన పాటతో మళ్ళీ మాయ చేసేసాడు !! శ్రీమణి రాసిన సాహిత్యం కూడా బావుంది.




వాల్ పోస్టర్ మీద డల్ గా కూర్చున్న సిధ్ధార్ధ ను చూసి, ఏడుపు సినిమానేమో అనుకున్నా. ఈ సినిమాకి "Love ఫెయిల్యూర్ - ఇది tragedy కాదు" అని టాగ్ లైన్ పెట్టల్సిందేమో...:)) మొత్తం మీద ఒక బరువైన కథాంశాన్ని తేలికైన పధ్ధతిలో, సంతోషకరమైన ముగింపుతో నడిపించిన తీరు ప్రశంసనీయం. కొత్త దర్శకుడికే ఈ సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది.


Friday, February 10, 2012

Timepass movie !


ఏళ్ల తరువాత.. First day First show చూసా!! సాధారణంగా ఏ ప్రత్యేకతా లేనిదే సినిమాలకు వెళ్ళను నేను. అంటే...అవార్డ్ మూవీ అనో..మంచి డైరెక్టర్ అనో, హీరోహీరోయిన్ల కోసమో, పాటలు నచ్చాయనో...అన్నమాట. అలా కొన్ని మంచిసినిమాల కోసం ఎదురుచూసీ కూడా చూడటం కుదరని రోజులున్నాయి. అయితే ఒకోసారి కేవలం ఉల్లాసం కోసం, బిజీ రొటీన్ నుంచి బ్రేక్ కోసం ఏదన్న సినిమా చూడాలనిపిస్తుంది. అలా ఏ ఎదురుచూపూ లేకున్నా ఏదన్నా చూడాలి అనుకుంటూంటే ఇవాళ రిలీజయిన "Ek Main Aur Ekk Tu" సినిమా కనబడింది. మొత్తానికి చూసేసా ! ఇందులో నటీనటులు,దర్శకుడు ఎవరి పట్లా నాకు ఆసక్తి లేదు. గొప్ప సినిమా కాకపోయినా నా మూడ్ ని రిఫ్రెష్ చేసిందీ సినిమా. aimless timepass movie అన్నమాట.


ఏడుపులు,పెడబొబ్బలు, ఢిషుం ఢిషుంలూ, కక్షలు, ప్రతీకారాలూ లేకుండా సాదా సీదాగా రెండుగంటల కాలం కులాసాగా గడిచిపోయేలా చేసిందీ సినిమా. కథ గురించి పెద్దగా చెప్పేందుకు ఏమీ లేదు. మన తెలుగు "బొమ్మరిల్లు" సినీకథను కాస్త అటు ఇటు చేసారు. స్నేహం-ప్రేమ, స్నేహితులు ప్రేమికులు కాలేరు, ప్రేమికులు-స్నేహితులు ఒకటి కాదు అంటూ ప్రేక్షకులకు ప్రైవేటు చెప్పే సినిమాల నుంచి కూడా కాస్తంత కాన్సెప్ట్ తీసుకుని ఒక కిచిడీ కథను తయారు చేసారు. చివరికి ఏదో ఒక స్టేట్మెంట్ పై ఖరారుగా నిలబడి ఉంటే, కనీసం 'దర్శకుడు చెప్పదలుచుకున్న విషయం ఇది' అని క్లారిటీ ఉండేది. కథలో బలం లేకపోవటం వల్ల ఉన్న సన్నివేశాలనే సాగదీసి, చివరికి ఎటూ కాకుండా కథను గాలికి వదిలేసారు. దర్శకుడు చెప్పదలుచుకున్న సందేశం ఏమీ లేదు. కథాబలం ఉండుంటే తప్పకుండా గుర్తుంచుకోదగ్గ సినిమా అయిఉండేది. కొన్ని సన్నివేశాలు మాత్రం మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.


రత్నా పాఠక్ షా(Naseeruddin Shah భార్య) లాంటి అనుభవజ్ఞురాలైన నటి ఇలాంటి చోద్యమైన పాత్ర వేసిందేమిటి అనిపించింది. ఈ పాత్ర కన్నా ఇంకా 'Jaane Tu Ya Jaane Na' సినిమాలో తల్లి పాత్ర సరదాగా బావుంది . డబ్బు పెట్టి చూసే ప్రేక్షకులకే తప్ప డబ్బు తీసుకుని నటించే నటులకు ఇలాంటి పట్టింపులు ఉండవేమో మరి ! కరీనా కపూర్ మొహం నాకు అస్సలు నచ్చకపోయినా ఆమె అభినయంలో వంక ఎప్పుడూ ఉండదు. ఇమ్రాన్ కూడా బాగా చేసాడు కానీ బలంలేని కథనంతో వీరిద్దరి నటనా వృధా అయినట్లు అనిపించింది నాకు. కరీనా ఇమ్రాన్ కన్నా పెద్దగా కనబడింది అనకుండా ఉండటానికీ ఆమె వయసులో కాస్త పెద్ద అని ఓ డైలాగ్ చెప్పించేసారు.


టైటిల్స్ లో వచ్చిన పాట బావుంది కానీ అది ఆడియోల్లో ఎక్కడా కనబడలేదు. బాలీవుడ్ లో కొత్తతరం గీతరచయితలూ, సంగీత దర్శకులు బలమైన స్థానాన్నే సంపాదించుకుంటున్నరనటానికి ఈ ఆడియో సక్సెస్సే సమధానం. 'అగ్నిపథ్' లో పాటలకు సాహిత్యాన్ని అందించిన "అమితాబ్ భట్టాచార్య" ఆ చిత్రానికి కూడా విలువైన సాహిత్యాన్ని అందించారు. అతని సాహిత్యానికి నేను అభిమానిని అయిపోయానేమో కూడా. "దేవ్ డి" తో జాతీయపురస్కారాన్ని అందుకున్న "అమిత్ త్రివేది" కూడా నిరుత్సాహపరచలేదు. "ఆహటే.." పాట మాత్రం నాకు విన్నప్పుడే బాగా నచ్చింది. కార్తీక్ చాలా బాగా పాడాడు కానీ శిల్పా రావు వాయిస్ మాత్రం పాటకు నప్పలేదు. వేరెవరితోనయినా పాడిస్తే బావుండేది.




రెండుగంటలు సమయం ఉండీ, లేక ఏమీ తోచక టైం పాస్ చెయ్యాలనిపిస్తే ఈ సినిమా చూడచ్చు.




Thursday, February 2, 2012

మనసుని తాకని 'Agneepath'




సినిమా ఒక ఊహాప్రపంచం ! వాస్తవంలో మనం చెయ్యలేనివీ, కేవలం ఊహించగల పనులను సినిమాల్లో హీరోలు చెయ్యటం చూసి మనం ఆనందపడతాం. అది నిజం కాదు... మానవమాత్రులెవ్వరూ అలా చెయ్యలేరు అని తెలిసినా సరే. ఊహాజనితమైన భ్రమలోకి మనలను తీసుకువెళ్ళి మనలో నిద్రాణమైఉన్న ఊహలకు, కోరికలకూ తమ పాత్రల ద్వారా రూపం కల్పిస్తారు కాబట్టి మనం నటినటులను అభిమానిస్తాం. కానీ అభిమానిస్తున్నాం కదా అని తర్కవిరుధ్ధమైన కథలున్న సినిమాల్లో నటిస్తే... అభిమానులకు మిగిలేది నిరాశే !

నేటితరం మేటి తారలతో తీయబడిన హిందీ చిత్రం "అగ్నిపథ్". హేమాహేమీలున్నారు... పబ్లిసిటి బాగుంది.. సినిమా అద్భుతంగా ఉంటుందని వెళ్ళిన నాకు మాత్రం నిరాశనే మిగిల్చింది "అగ్నిపథ్". నటీనటులందరు తమతమ పాత్రలలో శక్తివంచన లేకుండా నటించారు. అయితే కథనంలోని లోపాలు ఈ చిత్రంలోని రసానందానికి అడ్డుకట్టు వేసాయి. నటినటులు ఎంత బాగా చేస్తున్నా కథలో చెప్పబడిన 'ప్రతీకారాగ్ని' మనసుని తాకలేకపోయింది. సినిమాలో జరిగే సన్నివేశాలేమీ మనసుని కదిలించలేకపోయాయి. ఎప్పుడయిపోతుందా అని టైమ్ చూసుకున్నాను. Total feel is missing అనిపించింది నాకు.


ఈ చిత్రం అమితాబ్ గతంలో నటించిన అగ్నిపథ్(1990) చిత్రదర్శకుడికి శ్రధ్ధాంజలి మాత్రమే... అనే ఒక వివరణ సినిమా మొదలయ్యే ముందు చూపెట్టారు. అందువల్ల ఆ సినిమాను యధాతథంగా పాత కథతో పునర్నిర్మించలేదని తెలుస్తోంది. రెండిటిలో సామ్యం చెప్పటానికి నేను పాత అగ్నిపథ్ చూడలేదు కూడా. ఒక కొత్త చిత్రంగా చూస్తే, కొత్త అగ్నిపథ్ లోని లోపాలు నన్ను చాలా నిరాశపరిచాయి. పాత సినిమా కథ ఖచ్చితంగా కొత్త చిత్రానికి భిన్నంగా ఉండిఉంటుందని నా అంచనా... లేదా అది కూడా అమితాబ్ అభిమానుల వల్ల హిట్ చిత్రమయి ఉండచ్చు...!


సినిమా మొదట్లో పూలదండలు వేసి మరీ సత్కరించి, అభిమానించిన స్కూల్ టీచర్ పై నింద పడిన వెంఠనే గ్రామప్రజలు ఏ విచారణ చేయకుండా, అతను చెప్పేది ఒక్క మాటా వినకుండా అమాంతం అతడిని చితకబాది, ఉరి తీయటం అనేది చాలా అన్యాయమైన తీర్పు. ఊరి జమిందారు కూడా అసూయపడేంత జనాదరణ కలిగిన టీచర్ పై ఘోరమైన నింద పడితే గ్రామప్రజలు అతడికి సంజాయిషీ చెప్పుకునే అవకాశం ఇవ్వరా? మాస్టారిపై అమితమైన గౌరవ మర్యాదలు చూపిన ప్రజలు అంత సంస్కారరహితంగా ఎలా ఉంటారు? అన్నది నా మెదడు దొలిచిన ప్రశ్న.


ఇక చిత్రం మొదటి భాగంలో పగే ప్రాణంగా, ప్రతీకారమే ఊపిరిగా పెరిగిన కథానాయకుడు ఎన్నో తెలివైన పథకాలతో 'రౌఫ్ లాలా' లాంటి గేంగ్స్టర్ నే మోసగించగలుగుతాడు. అంచలంచలుగా అతడి స్థానాన్ని ఆక్రమించగల సమర్ధ్యం, తెలివి ఉన్న శక్తివంతమైన పాత్రగా చూపెట్టిన "విజయ్ చౌహాన్" చిట్టచివరలో ఏ జాగ్రత్తా లేకుండా మాండ్వా కు వెళ్లటం, అక్కడ నరరూపరాక్షసుడైన కాంచా దగ్గరకు ఏకాకిగా వెళ్ళి చావుదెబ్బలు తినటం నాకు హాస్యాస్పదంగా తోచాయి. తెలివైన నాయకుడిగా చూపెట్టినప్పుడు ఒక తెలివైన పథకంతో కాంచా లాంటి దుర్మార్గుడిని అంతం చేసినట్లు చూపెడితే, లేదా కాంచా తన తప్పును గ్రామ ప్రజల ముందర ఒప్పుకునేట్లు చూపెట్టినా బాగుండేది. ఏ ముందస్తు పథకాలు లేకుండా కాంచా చేతిలో సులభంగా తన్నులు తిని, కత్తిపోట్లు పొడిపించుకుని హీరో నేలకూలటం అనేది సినిమాలో మొదట చూపిన అతడి తెలివికీ,పరాక్రమానికీ అవమానం.


చివరలో చూపెట్టినట్లు కేవలం తన బలం ద్వారానే ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం ఉంటే, ఏ అడవిలోనో లేదా వేరే ఊళ్ళోనో ఉండి...కండలు పెంచి పెద్దయ్యాకా వచ్చి విలన్ ని చంపెయ్యచ్చు కదా. ముంబై మాఫియా గొడవల్లో తలదూర్చి, అక్కడ తన శక్తియుక్తులతో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించినట్లు చూపించటం ఎందుకు? అదీకాక రెండు మూడు కత్తిపోట్లతో, బోలెడు దూరం బరాబరా ఈడ్చబడ్డాకా కూడా లేచి, నుంచుని, 'కాంచా' లాంటి బలమైన వ్యక్తిని అమాంతం లేవనెత్తి క్రిందపడేయ్యటం మానవమత్రులవల్ల అయితే కాదు...! (సినీహీరోల వల్లే అవుతుంది మరి..:)) ఇక అప్పటికప్పుడు తిరుగుబాటు చేసిన ఆ ఊరిప్రజలు అంతకు ముందు 'కాంచా' హీరోను ఒక్కడినీ చేసి కొడుతుంటే ఎందుకు ముందుకు రాలేకపోయారు? అన్నది కూడా అర్ధం కాని ప్రశ్నే !


రౌఫ్ లాలా, కాంచా ఇద్దరి మరణాలూ చాలా సులభంగా ఉండి ఏళ్ల తరబడి నాయకుడిలో పెరిగిన ప్రతీకారానికి తగ్గట్టుగా లేవు. నరరూప రాక్షసులు అని చెప్పినప్పుడు వాళ్ల చావు కూడా భయానకంగానే ఉండాలి కదా..! నటీనటులందరూ పోటీపడి నటించారేమో అనిపించింది. హృతిక్, రిషీ కపూర్, జరీనా వహబ్, ఓంపురి అంతా తమ పాత్రలకు నూరుశాతం న్యాయం చేసారు. గతంలో "ఖల్ నాయక్" సినిమాతోనే నెగెటివ్ పాత్రలో రాణించగలనని సంజయ్ దత్ నిరూపించాడు. ఇప్పుడు ఒక పూర్తిస్థాయి ప్రతినాయకుడిగా అద్భుతంగా చేసాడు. కానీ అతడి పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఎక్కువగా నటించే అవకాశం ఇవ్వనేలేదు. ఐటెమ్ సాంగ్ చేసిన కత్రీనా, నాయకురాలి పాత్రలో ప్రియాంక ఇద్దరూ కూడా (ఎంత బాగా చేసినా) మరింత సన్నబడి గడకర్రలుగా కనబడ్డారు తప్ప వినోదాన్ని పంచే అందగత్తెలుగా నాకయితే కనబడలేదు.

ఏ చిత్రానికయినా నేపథ్యసంగీతం ఊపిరి లాంటిది. అందులో భాగంగా కీలకమైన సన్నివేశాల్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి ప్రేక్షకుడి నోట ఈలగా మారే 'theme music' ఒకటుంటుంది. సంజయ్ దత్ తాలుకూ సన్నివేశాలు వచ్చినప్పుడు, హృతిక్ ఎత్తులు వేసినప్పుడూ ఈ సినిమాలో theme music వినిపిస్తుంది. అది బావుంది  కానీ మొత్తమ్మీద నేపథ్యసంగీతం లో వాయిద్యాల హోరు ఎక్కువగా ఉందనిపించింది. నాకు సినిమాలో నాకు బాగా నచ్చినవి పాటలు. ఈ చిత్రంలో పాటలకు ఉత్సాహవంతమైన, హృద్యమైన సంగీతాన్ని అందించారు అజయ్-అతుల్. ప్రతి పాటకూ "అమితాబ్ భట్టాచార్య" అందించిన సాహిత్యం ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా నాకు రెండు పాటలు బాగా నచ్చేసాయి. రూప్ కుమార్ రాథోడ్ పాడిన "ऒ सय्या..", సోనూ నిగం పాడిన "अभी मुझ में कही.." ."గున్ గున్ గునారే..గున్ గున్ గునారే", "చిక్నీ ఛమేలీ" ఉత్సాహవంతంగా ఉన్నాయి.


Greater expectations can indeed lead to disappointment అని నాకు నిరూపించింది ఈ సినిమా. రీమేక్ చెయ్యాలనుకుంటే హింసాత్మక చిత్రాలే ఎందుకు? ఉత్సాహభరితమైన లేదా హాస్యరసప్రధానమైన చిత్రాలనెందుకు ఎన్నుకోకూడదు? అన్నది నా ప్రశ్న.

Wednesday, January 25, 2012

వంశవృక్షం - వెండితెర నవల



ప్రఖ్యాత కన్నడ రచయిత డా. ఎస్.ఎల్.భైరప్ప గారికి 1966 లో కన్నడ సాహిత్య అకాడమీ బహుమతి తెచ్చిన నవల "వంశవృక్ష". ఈ నవల ఆధారంగా అదే పేరుతో తీసిన కన్నడ చిత్రానికి జాతీయ బహుమతి (దర్శకత్వానికి) కూడా లభించింది. ఈ చిత్రాన్ని తెలుగులో బాపు-రమణలు "వంశవృక్షం(1980)" పేరుతో రీమేక్ చేసారు. సంభాషణలు, సినీ అనుకరణ, ముళ్ళపూడి. నవలీకరణ చేసినది శ్రీరమణగారు.ఇది బాపూ సినిమా అని తెలీనివారు, విశ్వనాథ్ సినిమా ఏమో అనుకునేలా ఉంటుందీ సినిమా కథ. 'శంకరాభరణం' తరువాత మరో గుర్తుండిపోయే పాత్రలో జె.వి.సోమయాజులు ఇందులో కనిపిస్తారు. కె.వి.మహాదేవన్ గారు అందించిన బాణిల్లో "వంశీకృష్ణ.. యదు వంశీకృష్ణా..." పాట చాలా బావుంటుంది.


ఈ సినిమా బాగా చిన్నప్పుడు హాల్లో చూసిన గుర్తు మాత్రమే ఉంది. బయట సీడి కూడా దొరకలేదు కానీ శ్రీరమణగారు నవలీకరించిన పుస్తకం మా ఇంట్లో ఉండేది. అది అప్పుడప్పుడు చదువుతూ ఉండేదాన్ని. ఇటీవలే ఈ వెండితెరనవల చాన్నాళ్ళకు దొరికింది. గొల్లపూడిగారి ’సాయంకాలమైంది’ చదివినప్పుడు నాకు ఈ సినిమానే గుర్తు వచ్చింది. బాపూ గారి "తూర్పువెళ్ళే రైలు" సినిమాలో నటించిన నటి జ్యోతి ఈ సినిమాలో నాయిక. బాపూ ఇతర చిత్రనాయికల్లాగనే ఈ చిత్రంలో బాపూబొమ్మ అయిపోతుందీ అమ్మాయి. మొదట్లో కాసేపు కలవారింటి కోడలుగా నగలన్నీ పెట్టుకుని కన్నులకింపుగా కనబడుతుంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.


ఈ చిత్ర కథ చాలా భారమైనదనే చెప్పాలి. గోదారొడ్డున ఉన్న తిరుమలపురం గ్రామంలో వంశప్రతిష్ట, పరువు,గౌరవం కల కుటుంబం శ్రీనివాసాచార్యుల వారిది. ఆయన ఏకైక కుమారుడు మాధవాచార్యులు. అతని భార్య సరస్వతి. వారి ముద్దుల కుమారుడు నామకరణమహోత్సవంతో కథ ప్రారంభం అవుతుంది. ఆనందకరమైన సరస్వతి జీవితంలో అనుకోని విధంగా చీకట్లు అలముకుంటాయి. మాధవాచర్యులను గోదారి తనలో కలిపేసుకుంటుంది. 'బిడ్డ బాధ్యత చూసుకుంటే చలదూ... ' అన్న అందరి మాటలూ తోసివేసి, ప్రొఫెసర్ పార్థసారథి గారి ప్రోద్బలంతో కోడలిని గోదారి ఆవలి వడ్డున ఉన్న కాలేజీలో చేరుస్తారు శ్రీనివాసాచార్యులవారు. అక్కడ ప్రొఫెసర్ గారి తమ్ముడు, ఇంగ్లీషు లెక్చరర్ అయిన శేషుతో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరి స్నేహం బలపడుతుంది.




మొదట ఒప్పుకోకపొయినా శేషు తెచ్చిన వివాహ ప్రస్థావనను తోసేయలేకపోతుంది సరస్వతి. పెద్ద మనసున్న అత్తమామలంటే అమెకెంతో గౌరవం. తన సమస్యను ఉత్తరంలో రాసి మామగారి వద్ద పెడుతుంది ఆమె. వంశప్రతిష్ట అంటే ప్రాణం పెట్టే శ్రీనివాసాచర్యులు గారు సరస్వతితో చెప్పిన మాటలకు ఆమె తలవంచుతుంది. కానీ శేషుని వదిలి ఉండలేనని తెలుసుకుని, ఇంట్లో చెప్పకుండా అతడిని వివాహం చేసుకుంటుంది. అయితే బిడ్డనూ కూడా ఆమె వదుకోలేకపోతుంది. శేషు భార్యగా తన బిడ్డ కోసం శ్రీనివాసాచార్యుల గడప ఎక్కుతుంది సరస్వతి. అదే రోజు మొదటి భర్త అబ్దీకం జరుగుతూండటం యాదృచ్ఛికం. సరస్వతిని దుయ్యబుడుతున్న అందరినీ శాంతపరిచి ఆమెతో ఉచితానుచితాలు మట్లాడి నిర్ణయం ఆమెకే వదిలేస్తారు శ్రీనివాసాచార్యులవారు. మామగారి మాటలను కాదనలేక బిడ్డను వదిలి ఒంటరిగా వెళ్ళిపోతుంది సరస్వతి. అయితే పిల్లవాడి తాలూకూ బెంగ, అశాంతి ఆమెను జీవితాంతం వెంటాడి ఆమెను కృశింపజేస్తాయి.





ఉపకథ గా ప్రొఫెసర్ పార్థసారధి,  డాక్టరేట్ చేస్తూ ఆయనకు సహాయ పడుతున్న కరుణ; ఆయన రాస్తున్న భారతీయ తత్వశాస్త్రం పై థీసీస్ , వారిద్దరి వివాహం ఎన్నో ఆలోచనలను కదిలిస్తాయి. సినిమా మొదట్లో పార్థసారధి భార్య నాంచారి, కొడుక్కు తలంటు పొయ్యటానికి అతని వెనకాల పరిగేట్టే సీన్ నవ్వుతెప్పిస్తుంది. అది నాకిప్పటికి లీలగా గుర్తుంది. తరువాత ఆయన చివరి దశలో భార్య వద్దకు వచ్చి క్షమాపణ అడిగే దృశ్యం కూడా మర్చిపోలేము.






పెరిగి పెద్దయిన మనవడికి ఒకరోజు బృందావనంవారి  వంశవృక్షాన్ని చూపెడుతున్న సమయంలో తన తండ్రిగారు రాసిపెట్టిన ఒక లేఖ శ్రీనివాసాచార్యుల కళ్ళబడుతుంది. నిప్పులాంటి ఓ నిజం ఒక్కసారిగా ఆయనలో అలజడిని రేపుతుంది. ఈ నేపధ్యంలో వచ్చే పాటలోని సి.నారాయణరెడ్డి గారి సాహిత్యం బావుంటుంది..

ఏది వంశం? ఏది గోత్రం? ఏది పరమార్ధం?
ఏది బీజం? ఏది క్షేత్రం? ఏది పురుషార్థం?
ఏది పాపం? ఏది పుణ్యం? ఏది గీటార్థం?
మత్స్యమై కూర్మమై - వరాహమై నరసింహమై
బ్రాహ్మణాకృతి వామనుండై - క్షత్రియాకృతి రాముడై
యదుకులమ్మున కృష్ణుడై - ఇన్ని అవతారములు దాల్చిన
ఆదిదేవుని వంశమేదీ వర్ణమేదీ - గోత్రమేదీ సూత్రమేదీ?

ఆ నిజం ఏమిటి? సరస్వతి జీవితం చివరికి ఏమైంది? తల్లి పనిచేస్తున్న కాలేజీలోనే ఇంటర్లో చేరిన ఆమె కొడుకు కృష్ణకు తల్లి ఎవరో తెలిసిందా? అన్నది మిగిలిన కథ. ఈ మొత్తం కథలో ప్రభావవంతమైన పాత్ర బృందావనం శ్రీనివాసాచార్యులవారిదే. ఆలోచింపజేసే ఎన్నో ప్రశ్నలు పుస్తకం మూసాకా కూడా మనల్ని వెంటాడతాయి. ఈ కథకు  సినిమాను శ్రీరమణగారు నవలీకరించిన తీరు బాగుంటుంది.





"వంశవృక్షం" సినిమా పాటలు క్రింద లింక్ లో వినవచ్చు:
http://www.raaga.com/channels/telugu/album/A0002467.html

డౌన్లోడ్ కోసం:
http://www.telugusongsfree.com/2011/08/vamsa-vruksham-1980-telugu-movie-audio-mp3-songs.html