మా చిన్నప్పుడు దూరదర్శన్ లో అన్ని భారతీయ భాషా చలనచిత్రాలతో పాటూ విదేశీ భాషా చలనచిత్రాలను కూడా తరచుగా చూపెట్టేవారు. ఇతర దేశాల తాలుకూ ఎన్నో ఉత్తమ చిత్రాలను దూరదర్సన్ వల్లనే చూడగలిగాం అప్పట్లో. ఇప్పుడు రకరకాల ఛానల్స్ ఎన్నో ఉన్నా కూడా ఆ క్వాలిటి ఉన్న సినిమాలు తక్కువగా చూస్తున్నాం. నేను ఇటీవల చూసిన "Children of Heaven" అనే ఇరానియన్ ఫిల్మ్ మళ్ళీ పాత దూరదర్శన్ రోజులను గుర్తు చేసింది. అసలు ఇంత చిన్న అంశం మీద కూడా సినిమా తీయచ్చా? అని ఆశ్చర్యం వేసింది. దర్శకుడు ’Majid Majidi’ కి ఎన్నో అవార్డులను, ప్రశంసలనూ తెచ్చిపెట్టిన ఈ సినిమాకు 1998 లో దక్కాల్సిన ఆస్కార్ అవార్డ్ ను మరో Italian Film "Life Is Beautiful" చేజిక్కించేసుకుంది. ఆ సినిమా కూడా అంతటి గొప్ప సినిమానే మరి.
ఒక పేద కుటుంబం. అందులో కష్టపడే తండ్రి, చదువుకునే ఇద్దరు పిల్లలు, మూడవ కాన్పు తరువాత ఆరోగ్యరీత్యా ఇంకా కోలుకోని తల్లి. స్కూలుకెళ్ళే పిల్లలిద్దరూ అన్నాచెల్లెళ్ళు. అన్నగారు అలీ(Amir Farrokh Hashemian) ఒకరోజు చెల్లెలు జారా(Bahare Seddiqi) షూ రిపేరు చేయించి తెస్తూండగా ఒక కూరల కొట్లో ఆ షూస్ ఉన్న కవర్ మిస్సవుతుంది. రోజూ స్కూలుకి వేసుకుని వెళ్ళాల్సిన షూస్ లేకపోతే ఎలా? వెతుక్కురాకపోతే నాన్నకు చెప్పేస్తా.. అని బెదిరిస్తుంది చెల్లెల్లు. అన్న వెనక్కు వెళ్ళి ఎంత వెతికినా అవి దొరకవు. తల్లితండ్రి మాట్లాడుకుంటూ ఉండగా, హోంవర్క్ చేస్తూ అన్నాచెల్లెలూ షూస్ గురించి రహస్యంగా మాట్లాడుకునే సన్నివేశం చాలా హృద్యంగా ఉంటుంది. తండ్రి కొత్త షూస్ కొనలేడని, షూస్ పోయిన సంగతి తెలిస్తే బాధపడతాడనీ, తల్లితండ్రులకి ఆ సంగతి తెలియకుండా దాచాలని పిల్లలు చేసే ప్రయత్నం మనసుకు హత్తుకుపోతుంది. పిల్లలు ఏ మాలిన్యం అంటని స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు కాబట్టి సినిమాకు "Children of Heaven" అని పేరు పెట్టారని నాకనిపించింది.

ఒకరోజు షూస్ దుమ్ముకొట్టుకుపోతాయి. రాత్రి వాటిని ఉతికి ఆరబెడతారు పిల్లలు. కానీ ఆ రాత్రి వర్షం వచ్చి అవి సరిగ్గా ఆరవు. ఇలా జరుగుతుండగా ఒకరోజు మొక్కలకు తోటపని చేసేందుకు తండ్రి వెళుతూ పిల్లవాణ్ణి కూడా తీసుకువెళ్తాడు. పెద్దపెద్ద ఇళ్ళలో తోటలో కలుపు ఏరి, మొక్కలకు ఎరువు వేసి తోటంతా బాగుచేస్తే ఆ ఇంటివాళ్ళు కాసిని డబ్బులిస్తారన్నమాట. అలా ఇల్లిల్లూ వెతుక్కుంటూ వెళ్తే ఒక ఇంట్లో వాళ్ళు పిలిచి తోటపని చేయించుకుని డబ్బులిస్తారు. పిల్లాడి సహాయానికి తండ్రి సంతోషించటం, ఇద్దరూ సైకిల్ మీద వెళ్తూ మాట్లాడుకోవటం బావుంటుంది. చేతికి డబ్బు వచ్చిందని తండి అవీ ఇవీ కొంటానంటుంటే, "ఇవేం కాదు చెల్లి షూస్ పాతవయిపోయాయి కొత్తవి కొను నాన్నా" అంటాడు ఆ పిల్లాడు తెలివిగా. ఈ మొత్తం సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది.
ఒకరోజు తన స్కూల్లో ఒకమ్మాయి తన పోయిన షూస్ వేసుకుని ఉండటం చూసి, అన్నగారితో కలిసి ఆ పిల్లను వెంబడిస్తారు. కానీ వాళ్లది తమకన్నా దయనీయమైన స్థితి అని తెలుసుకుని నిరాశతో వెనక్కు తిరిగివెళ్పోతారు. తర్వాత స్కూలు నోటీసు బోర్డ్ లో పరుగుపందెం గురించిన ప్రకటన చూస్తాడు అన్న. దాంట్లో మూడవ బహుమతి షూస్ అని చూసి, వాటి కోసం పరుగుపందెంలో పాల్గొంటాడు. చివరికి ఏమయ్యింది? అతనికి షూస్ దక్కాయా లేదా ఓడిపోయాడా? అన్నది పతాక సన్నివేశం.

ఈ సినిమా ట్రైలర్:
No comments:
Post a Comment