అచ్చం పెయింటింగ్ లా ఉంది కదూ.. |
(నిన్నటి తరువాయి.. )
దూరాలు వెళ్తే మధ్యాహ్నం లోగా రాలేము.. ఇంట్లో గడిపినట్లు ఉండదని ఈసారి దగ్గరలో ఏమున్నాయని ఆలోచించాం. ద్వారపూడి, బిక్కవోలు లక్ష్మీగణపతి, కడియం మొదలైనవన్నీ ఇదివరకూ చూసేసాం. అయితే ఈమధ్యన మేం పారాయణ చేస్తున్న శివమహాపురాణంలోని 'స్కందోత్పత్తి -కుమారసంభవం' ఛాప్టర్ లో "బిక్కవోలు గ్రామంలో ఉన్న దేవాలయంలోని సుబ్రహ్మణ్యుడు కూడా పరమశక్తివంతుడు.." అని చదివిన గుర్తు. బిక్కవోలు దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్లి వచ్చేద్దాం అని డిసైడయ్యాం.
శనివారం పొద్దున్నే తయారయ్యి ఏడున్నరకల్లా బస్టాండు కి చేరిపోయాం. అప్పటికే ఎండ వేసవిలా చికాకు పెట్టేస్తోంది. బిక్కవోలు మీదుగా వెళ్ళే బస్సు ఎక్కాం. కడియం, ద్వారపూడి రూటు. ఒకవైపు కడియం నర్సరీలు, మరోవైపు ఏదో కాలువ ఉంది. రోడ్డు పొడువునా చాలా దూరం మాతో పాటూ వచ్చిందది. ఆ కాలువకు అటు ఇటు కొన్ని చోట్ల తెల్లని రెల్లుదుబ్బులు, మరి కొన్ని చెట్లు, పొలాలు.. పైన నీలాకాశంలో తెల్లని మబ్బులు.. అసలా అందం వర్ణనాతీతం. ఎండగా ఉన్నా కూడా ఎంత బాగుందో..!
కడియం సెంటర్లో ఈ అమ్మవారి విగ్రహం ఉంది. బస్సులోంచే రెండు మూడు పిక్స్ తీస్తే ఇది బాగా వచ్చింది..
ద్వారపూడిలో విగ్రహాలు ఇదివరకటి కన్నా ఇంకా కట్టినట్లున్నారు. బయట వైపు కృష్ణార్జునుల గీతోపదేశం విగ్రహం కొత్తది. చాలా బాగా చేసారు. అది ఫోటో తీసేలోపూ బస్సు ముందుకెళ్ళిపోయింది :( కెమేరా అయితే క్లిక్ దొరికుండేది. ఫోన్ కెమేరాకి అందలేదు. సుమారు గంటన్నరకి బిక్కవోలు చేరాం. ఎలానూ వచ్చాం కదా ముందర అన్నగారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. గుడి కిలోమీటర్ దూరం అన్నారు. నడుచుకుపోదాం సరదాగా అని బయదేరాం. దారిలో ఒక ఇల్లు అచ్చం 'లేడీస్ టైలర్' ఇల్లులా ఉంది. మరీ ఎదురుగా ఫోటో తీస్తే బాగోదని ముందుకెళ్ళి పక్కనుండి తీసా..
తర్వాత ఒక ఇంటి ముందు రెండు మూడు గుత్తులతో ద్రాక్ష తీగ ఉంది! భలే భలే అని దానికీ ఫోటో తీసా :)
ఆ పక్కనే నిత్యమల్లి చెట్టు చూసి ఆహా ఓహో అని గంతులేసేసా. గత కొన్నాళ్ళుగా ఈ విత్తనాల కోసం కనబడినవారినీ, కనబడని వారినీ.. అందరినీ అడుగుతున్నా. ఒక మొక్క ఉంటే ఇంక దేవుడికి పూలే పూలు. ఈ పూలు తెల్లవి కూడా ఉంటాయి. చాలా బావుంటాయి. సరే ఆ విత్తనాలు కాసిని కోసి పొట్లం కట్టా. కాస్త ముందుకి వెళ్లాకా ఓ పక్కగా దడికి అల్లించిన పెద్ద పెద్ద ఆకుల బచ్చలితీగ ఉంది. విత్తనాలు లేవు. చిన్న ముక్క కట్ చేయచ్చు కానీ ఇంక అది పీకలేదు. ఊరెళ్ళేదాకా కాపాడ్డం కష్టమని :)
దారిలో కనబడ్డ విచిత్ర వేషధారి.. |
కాస్త ముందుకెళ్లగానే రోడ్డుకి కుడిపక్కన లోపలికి ఓ పాత గోపురం కనబడింది. ఏమీటా అని వెళ్లి చూస్తే ఏదో గుడి.. దగ్గరకు వెళ్ళి అడిగాము. 1100 ఏళ్ళ క్రితం కట్టిన పాత శివాలయమట అది. ఎవరు కట్టారో తెలీదుట. అప్పుడే గేటు తెరిచి తుడుస్తున్నాడు ఒకతను. గుడి చుట్టూరా బట్టలు ఆరేసి ఉన్నాయి. అది గుడి అనే స్పృహ లేనట్టే..! ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి శివలింగ దర్శనం చేసుకున్నాం. చిన్న గుడి.. లోపల బాగా చీకటిగా ఇరుకుగా ఉంది. కాసేపు ఆ గోడలూ అవీ పరీక్షించేసి బయటకు వచ్చేసాం.
లక్ష్మీగణపతి దేవాలయానికి చేరాం. నాలుగేళ్ల క్రితం చూసిప్పుడు గుడి చుట్టూ పొలాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఊరి మధ్యలో గుడి ఉన్నట్లు ఉంది! బయట తెల్ల తామరలు అమ్ముతుంటే కొన్నాం. లోపల చాలామంది అయ్యప్ప భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. కాస్త ఖాళీ అయ్యాకా మేము దర్శనం చేసుకున్నాం. పొద్దున్న టిఫిన్ తినలేదేమో గుడిలో పెట్టిన వేడి వేడి పులిహోర ప్రసాదం అమృతంలా అనిపించింది. గుడికి ఒకవైపు వరి పైరు, మరో వైపు చిన్న కొలను దాని చుట్టూ కొబ్బరిచెట్లు.. ఆ దృశ్యం చాలా బాగుందని కెమేరాలో బంధించా!
best pic of the trip అన్నమాట :) |
అక్కడ నుండి కుమారస్వామి గుడి దగ్గరే అని చెప్పారు. దారిలో ఎడమ పక్కన మళ్ళీ పొలాలు. కాస్త దూరంలో ఇందాకా చూసినలాంటి గుడి ఉంది పొలాల మధ్యన. అది కూడా శివాలయమే కానీ మూసేసారు. వెళ్ళేదారి లేదు అన్నారు అక్కడ పొలాల్లో పని చేస్కుంటున్నవారు.
కుమారస్వామి ఉన్నది ఒక శివాలయం. గుడిలో మొత్తం శివ కుటుంబం ఉంది. చాళుక్యులు కట్టిన గుడిట అది. చాలా విశాలంగా ఉంది ఈ ప్రాంగణం కూడా. ప్రధానద్వారం ఎదురుగా గోలింగేశ్వరుడు పేరుతో శివలింగం ఉంది. ఇంకా మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అమ్మవార్ల విగ్రహాలు, గణపతి విగ్రహం మరో పక్క కుమారస్వామి విగ్రహం ఉన్నాయి. ఈ కుమారస్వామి విగ్రహమే మహిమాన్వితమైనదిట. కానీ లోపల విగ్రహం పక్కగా గోడవారగా అభిషేకం చేసిన తేనె సీసాలూ, కొబ్బరి పీచు తుక్కూ అలానే పడేసి ఉన్నాయి.. ఏమిటో కాస్త బాధనిపించింది. తమిళనాడులో పురాతన ఆలయాలను వాళ్ళు ఎంత బాగా పరిరక్షించుకుంటారో.. మనవాళ్ళకు అసలు శ్రధ్ధే లేదు.. వాటి విలువే తెలుసుకోరు అనిపిస్తుంది కొన్ని ఆలయాల్లో ఇటువంటి అపరిశుభ్రపు వాతావరణాన్ని చూసినప్పుడల్లా! అక్కడే గుమ్మం పక్కగా "రుద్రిణి దేవి" పేరుతో ఒక ప్రతిమ ఉంది. ఆ దేవత ఎవరో.. ఎప్పుడూ వినలేదు పేరు. పూజారి ఇచ్చిన పుట్టమన్ను, విభూతి పెట్టుకుని బయటకు నడిచాం.
పొద్దున్న దిగిన బస్ స్టాప్ వద్దకు వచ్చేసాం. టిఫిన్ తినలేదు, ఎండలో నడిచి నడిచి ఉన్నామేమో బాగా అలసటగా అనిపించింది. కొబ్బరినీళ్ళు తాగి లేత కొబ్బరి తినేసాం. ఉడకపెట్టిన మొక్కజొన్నలు అమ్ముతుంటే చెరోటీ కొనుక్కుని తినేసాం. రెష్ గా ఉందని ఓ బస్సు వదిలేసిన అరగంటకు మరో రెష్ గా ఉన్న బస్సు వచ్చింది. ఇంక అదే ఎక్కేసాం. అరగంట నించున్నాకా సీటు దొరికింది. మొత్తానికలా 'దేవ్డా..' అనుకుంటూ రామిండ్రీ చేరాం.
నిన్న సాయంత్రం మా బంధువులింటికి వెళ్ళి వచ్చేసాం కాబట్టి ఇవాళ భోంచేసాకా అమ్మ కోరిక ప్రకారం ఉప్పాడ చీరల కోసం"తాడితోట" అనే చీరల దుకాణాల సముదాయానికి వెళ్ళాం అందరం. ఎప్పుడూ మావయ్యావాళ్ళు వెళ్ళే కొట్లోకి వెళ్ళి పర్సులు ఖాళీ చేసేసి.. హమ్మయ్య ఓ పనైపోయింది అనేస్కున్నాం. ఆ తర్వాత ఓ మాంచి స్వీట్ షాప్ కి వెళ్ళి పూతరేకులూ, తాపేశ్వరం కాజాలు, స్వీట్ బుందీ.. గట్రా గట్రా కొనేసాం. ఇంటికొచ్చి పెట్టెలు సర్దేసి, టిఫినీలు చేసేసి, మావయ్యని స్టేషన్ కు రావద్దని వారించి ఆటో ఏక్కేసాం. రైల్వేస్టేషన్లో పాపిడీ దొరికింది. అది కూడా కొనేస్కుని రైలెక్కేసాం. తత్కాల్లో బుక్ చేస్కోవడం వల్ల నాకు మళ్ళీ అప్పర్ బెర్త్ శిక్ష తప్పలేదు :( తనకు తోడొచ్చినందుకు అమ్మ థాంక్యూలు చేప్పేసింది. రెండునెల్లుగా నానాగందరగోళాల్లో ఉన్న నాకూ రిలీఫ్ ఇచ్చావని నేనూ అమ్మకి థాంక్స్ చెప్పేసా.
ఏదో మా ఆసామి ఆఫీసు పని మీద ఊరెళ్లబట్టి అమ్మకు తోడెళ్ళాను గానీ నేనెప్పుడు తన్ను వదిలి ఊరెళ్ళాననీ..?! వదిలేసి వెళ్లడమే... సుఖపడిపోరూ :-))))
2 comments:
Good post :)
Photoes kuudaa superr
last line baavundi :)
Radhika (nani)
Pics excellent.... ladies tailor excellent..... lastlo excellent.
Post a Comment