చిన్నప్పటి నుండీ ప్రతి సెలవులకీ ఓ పాతికేళ్ళపాటు కొన్ని వందలసార్లు విజయవాడ నుండి కాకినాడ, కొన్నిసార్లు అమ్మావాళ్ళ రాజమండ్రి వెళ్ళాం కానీ ఎప్పుడూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు చూడలేదు. పెద్దయ్యాకా ఆ ఊళ్ళూ, అక్కడి గుళ్ళూ గోపురాలూ, వాటి ప్రాముఖ్యత తెలిసే సమయానికి వాటిని చూడాలనుకున్న తడవే చూడలేనంత దూరంలోకొచ్చేసాం. అందుకని ఎప్పుడు అటువైపు వెళ్ళినా వీలైనన్ని చూడని ప్రదేశాలు చూసిరావాలని అనుకున్నాం మేము. గత ఆరేళ్లలో రెండుసార్లు మా గోదావరి వైపుకి వెళ్ళాను. వేరే పనుల మీద వెళ్ళినా సమయం కుదుర్చుకుని కొన్ని ప్రదేశాలు చూసాం అప్పట్లో. అప్పుడా ప్రయాణం కబుర్లతో రెండు సిరీస్ లు నా బ్లాగ్ లో ఙ్ఞాపకాల గుర్తుగా పదిలపరుచుకున్నాను.
ఆసక్తి ఉన్నవారి కోసం ఆ లింక్స్:
తూర్పుగోదావరి ప్రయాణం కబుర్లు:
యానాం - పాపికొండలు - పట్టిసీమ ప్రయాణం కబుర్లు:
ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా పదిరోజుల క్రితం మళ్ళీ అమ్మతో వాళ్ల పుట్టింటికి(రాజమండ్రి) బయల్దేరాం. ఎప్పటిలానే ట్రైన్ విజయవాడ చేరేసరికీ మెలకువ వచ్చేసింది. అప్పర్ బెర్త్ మీద ఉన్నందువల్ల క్రిందకిదిగలేకపోయా:( ఇక నిద్రపట్టలేదు. ఐదున్నరవుతూండగా పక్కసీట్లు ఖాళీ అవ్వగానే క్రిందకి దిగి హాయిగా కిటికీ పక్కన సెటిలయ్యా. వెలుతురు వస్తూనే పచ్చని పొలాలు.. వాటి వెనుక రారామ్మని మాకు ఆహ్వానం పలుకుతున్నటుగా వరుసగా నిఠారైన కొబ్బరిచెట్లు.. కొబ్బరాకుల వెనుక నుండి ఎర్రటి సూర్యకిరణాలు.. ఒక్కసారిగా నిద్రలేమి తాలూకూ చికాకు మాయమై మనసంతా హాయిగా అయిపోయింది. గబగబా ఫోన్ తీసి నాలుగు ఫోటోలు క్లిక్కుమనిపించా.
అదేమిటోగానీ ఇన్నాళ్ళూ ఎక్కడో ఉన్న ప్రాణం ఒక్కసారిగా ఇప్పుడే తనువులో ప్రవేశించినట్లు నూతనోత్సాహంతో మనసంతా నిండిపోయింది. కిటికీలోంచి కనబడుతున్న ప్రతి చెట్టూ, ప్రతి పైరూ, ప్రతి ఆకూ పలకరిస్తున్నట్టే అనిపించింది. సూర్యుడు పైకి వచ్చేసాకా అసలా ఆకుపచ్చని పచ్చదనం చూడగానే ఆనందంతో పాటుగా.. ఈ నేలని ఈ మట్టినీ వదిలి ఆ దూర తీరంలో ఆ పొరుగూరిలో ఎందుకున్నట్లో.. అని పుట్టెడు దిగులు పుట్టింది. ఇలా అప్పుడప్పుడూ వచ్చిపోకపోతే ఇక్కడి మట్టివాసనని కూడా మర్చిపోతామేమో అనే బరువు ఆలోచన కలిగింది. ఇంతలో గోదావరి చూద్దువు లేవమని అమ్మ పాపని లేపి తీసుకువచ్చింది. కాస్త ఊహ వచ్చింది కదా.. కొత్తగా గోదారమ్మని చూస్తోంది అమ్మాయ్..! "అదిగో పాత బ్రిడ్జ్.. ఆ బ్రిడ్జ్ మించే సర్కార్లో కాకినాడ వెళ్ళేవాళ్ళం తెల్సా... చివరచివర్లో ఆ బ్రిడ్జ్ ఊగేది కూడానూ... అదిగో ఆ మధ్యలో కనబడుతున్న ద్వీపంలాంటిది లేనప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ మించే వెళ్ళాం తెలుసా.. ప్రతిసారీ వెళ్ళీనప్పుడల్లా కాస్త కాస్త చప్పున పెరుగుతూ ఇలా ద్వీపంలా అయిపోయిందిది.. ఇలా కాయిన్స్ నీళ్ళల్లో వేసేవాళ్ళం..." అంటూ గబగబా కబుర్లు చెప్తున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ... "ఒకటే బ్రిడ్జికి ఎన్ని ఫోటోలు తీస్తావూ.." అని వేళాకోళం చేసింది. ఎన్ని ఫోటోలు తీసుకుంటే తనివితీరుతుందని చెప్పనూ...!?
రాజమండ్రిలో మావయ్య ఇల్లు చేరాం. ఈసారి కూడా వేరే పని మీద వెళ్ళినా, ఉన్న రెండురోజుల్లో ఏవన్నా చూడని ప్రదేశాలు చూడాలని మా మావయ్య అనుమతితో వాళ్ల మనవరాలిని తీసుకుని బయల్దేరా..! నా పెళ్ళికి తోడపెళ్ళికూతురైన ఆ బుల్లి మేనకోడలు ఇప్పుడు వైజాగ్ లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసేసి నాకు గైడ్ అయ్యేంత పెద్దదైపోయింది.. ఇదే కాలం మహిమ :)
ఆ రోజు శుక్రవారం. పిఠాపురంలో శక్తిపీఠం చూడాలని ఎప్పటి నుండో కోరిక. బస్ కాంప్లెక్స్ కి వెళ్తే సామర్లకోట వెళ్ళి, అక్కడ నుండి ఆటోలో పిఠాపురం వెళ్ళచ్చని చెప్పారు. కాకినాడ బస్సు ఎక్కేసాం. దాదాపు గంటన్నరకి సామర్లకోట చేరిపోయాం. ఇంట్లో మేము బయల్దేరడమే లేటయినందువల్ల సామర్లకోట చేరేసరికీ పావుతక్కువ పన్నెండయ్యింది. గుడి పన్నెండింటికి మూసేస్తారేమో, ప్రయాణం వృధా అవుతుందని భయం. అందుకని షేరాటో ఎక్కకుండా డైరెక్ట్ గా పిఠాపురానికి ఆటో మాట్లాడేసుకున్నాం. గుడి చేరేసరికీ పన్నెండూ పది. ఇరవై నిమిషాల్లో చేరాం. చిన్నప్పుడు అమ్మో పిఠాపురం, అమ్మో రాజోలు.. అనుకునేవాళ్ళం. సిటీ దూరాలతో పోలిస్తే ఇవసలు దూరాలే కాదనిపిస్తుందిప్పుడు. ఇక్కడ అమ్మావాళ్ళింటికి నలభై కిలోమీటర్ల దూరం. మూడు బస్సులు మారి, ఒక షేర్ ఆటోలో వెళ్ళాలి. తరచూ వెళ్లట్లేదు కానీ పనున్నప్పుడు పొద్దున్నకెళ్ళి రాత్రికి వచ్చేస్తూ ఉంటాను.
పిఠాపురం గుడి పన్నెండున్నరదాకానని రాసి ఉన్న బోర్డు చూసి హమ్మయ్యా అనుకుని లోనికి అడుగుపెట్టాం. విశాలమైన ప్రాంగణం. దీనినే "పాద గయ"అని కూడా పిలుస్తారుట. ఈశ్వరుడు కుక్కుటేశ్వరస్వామి గా ఇక్కడ వెలిసాడు. అమ్మవారి పేరు పురుహూతిక. అమ్మవారి పీఠభాగం ఇక్కడ పడినందువల్ల ఈ ఊరికి పీఠికాపురం అని పేరు వచ్చి అదే పిఠాపురం అయ్యిందిట. ఈ క్షేత్రం తాలూకూ పురాణకథ ఇక్కడ .
శుక్రవారమైనా జనం ఎక్కువ లేరు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది గుడి. ముందర ప్రాంగణంలో ఉన్న మిగిలిన విగ్రహాలను చూశాము. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద వల్లభస్వామి గుడి అక్కడ ఉంది. శ్రీపాద వల్లభస్వామి ఈ క్షేత్రంలోనే ఆవిర్భవించారని ఇక్కడి స్థలపురాణంట. తెల్ల తామరలతో అలంకరించిన విగ్రహం ఎంత బాగుందో చెప్పలేను. ఆలయం బయట పాదుకలు, మరో పక్క శంకరాచార్యులవారి విగ్రహం ఉన్నాయి. ఈ దత్తాత్రేయ అవతారం గురించిన వివరాలు, అక్కడ మిగతా ఫోటోలు క్రింద ఈ లింక్ లో చూడచ్చు.
ఇక్కడ ప్రస్తుతం ఉన్నది అసలు అమ్మవారి శక్తిపీఠం ఉన్న స్థలం కాదట. దానిని గురించి రెండు మూడు కథనాలు విన్నాను. కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం పక్కగా దక్షిణముఖంగా ఒక అమ్మవారి విగ్రహం ఉంది. అదే అసలు శక్తిరూపం అని అక్కడి అర్చకులు చెప్పారు. పదిరూపాయిలు టికెట్టు కి లోనికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోనిచ్చారు. విగ్రహం పూర్తిగా బయటకు కనబడేలా కుడి పక్కన ఐమూలగా అద్దం అమర్చారు. అందులోంచి అమ్మావారు బాగా కనబడ్డారు. కాసేపు అలా నింఛుని ప్రార్థించి బయటకు వచ్చేసాం. ఆ పక్కగా కొత్తగా కట్టిన అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము గుడి మూసేసారు.
గుడి వెనుక వైపు ఉన్న తటాకాన్ని "పాదగయ" అంటారుట. అక్కడ స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన పుణ్యంట. మరణానంతరం గయుడనే రాక్షసుడి పాదాలు అక్కడ పడినందువల్ల పాదగయ అని పేరు వచ్చిందిట. ఆ రాక్షసుడి కథ ఇక్కడ ఉంది. ఆ తటాకం పక్కనే గయాసురుడు పడి ఉన్న విగ్రహం, చుట్టూ త్రిమూర్తుల విగ్రహాలు అవీ ఉన్నాయి.
|
ఆలయప్రాంగణంలో శారదాదేవి గుడి కడుతున్నారు. |
తటాకానికి వెనుకవైపు ఉన్న గోశాల కూడా చూసేసి బయటకు వచ్చేసరికీ పన్నెండున్నర. కాసేపు ఎదురుచూశాకా షేర్ ఆటో దొరికింది. తిరిగి సామర్లకోట వచ్చేసి రాజమండ్రి బస్సు ఎక్కేసాం. సామర్ల కోటలో భీమేశ్వరస్వామిని కూడా చూద్దామనుకున్నా కానీ గుడి నాలుగింటికి గాని తెరవరన్నరని ఇంక బయల్దేరిపోయాం. అయినా అది చిన్నప్పుడోసారి చూసేసాను :)
"కుక్కుటేశ్వరస్వామి గుడి వీధిలోనే ఇంకా ముందుకి వెళ్తే ఇంద్రుడు నిర్మించిన ఐదు మాధవాలయాలలో ఒకటైన కుంతీమాధవస్వామి ఆలయం ఉంది తప్పక చూడాల్సిన గుడి.. అదీ చూసి రండి.." అని మావయ్య చెప్పిన మాటలు మర్చిపోయాం!ఇంటికొచ్చాకా మావయ్య అడిగాకా గానీ గుర్తురాలే:( ఇంక రేపు ఇంట్లో ఉండండని మిగతా పెద్దలన్నారు కానీ "ఇంత దూరం వచ్చారు కదా వెళ్ళనియ్యండి..ఇంట్లో కూచుని చేసేదేముంది.." అని మావయ్య మమ్మల్ని సపోర్ట్ చేసాడు పాపం. హమ్మయ్య అనుకుని రేపటి ట్రిప్ కి ప్లాస్ మొదలెట్టాం..
*** *** ***
ట్రిప్ తాలూకూ మరికొన్ని ఫోటోలు ఇక్కడ..
http://lookingwiththeheart.blogspot.in/2014/10/blog-post.html