సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, January 31, 2014

రెండు శాంతకుమారి పాటలు..



తెలుగు వెండితెరపై చల్లని తల్లిగా పేరుపొందిన పి. శాంతకుమారి నటిగానే కాక గాయనిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న అభినేత్రి. నవ్వుతూ ఉండే శాంత స్వరూపం ఆమెది. అందుకే ఆ పేరు పెట్టారేమో! ఆవిడ అసలు పేరు సుబ్బమ్మట. నలుపు తెలుపు చిత్రాల్లో "అమ్మ" అంటే శాంతకుమారే గుర్తుకు వస్తారు. వదిన, అమ్మ మొదలైన పాత్రల్లో వేయకముందు హీరోయిన్ పాత్రలు కూడా ఆమె చేసారు. నాగేశ్వరరావు కు హీరోయిన్ గా 'మాయలోకం' అనే చిత్రంలో నటించి, 'జయభేరి'లో వదిన పాత్ర వేసి, మళ్ళీ 'అర్థాంగి' లో సవతి తల్లి పాత్ర వేసారామె.


చిన్న వయసులోనే శాస్త్రియ సంగీతంతో పాటూ, వయోలిన్ వాదన కూడా అభ్యసించిన శాంతకుమారి తన చక్కని స్వరంతో ఎన్నో సినీగీతాలను ఆలపించారు. దర్శక,నిర్మాత పి.పుల్లయ్య గారిని వివాహమడిన శాంతకుమారి, ఆయన ప్రోత్సాహంతో చాల ఏళ్లపాటు తన నటనను కొనసాగించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లోనే కాక, తాను నటించిన ఇతర చిత్రాల్లో కూడా శాంతకుమారి పాటలు పాడారు. సారంగధర, కృష్ణప్రేమ, ధర్మదేవత, ధర్మపత్ని మొదలైన చిత్రాల్లో ఆవిడ గానం చేసారు కానీ అవన్నీ చాలా పాత చిత్రాలవ్వడం వల్ల అంతర్జాలంలో ఆవిడ పాటలు చాలావరకు లభ్యమవడం లేదు :( 


'సిరిసంపదలు', 'శ్రీ వేంకటేశ్వర మహత్యం' ఈ రెండు చిత్రాల్లో పాడిన పాటలు మాత్రం దొరికాయి. రెండు పాటలూ చాలా బాగుంటాయి. వాటిల్నిక్రిందన చూడవచ్చు..


'శ్రీ వేంకటేశ్వర మహత్యం' చిత్రంలో వకుళాదేవి పాత్ర పోషించారామె.
పాట: ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ

 


 పాట: చిట్టి పొట్టి పాపలు చిరుచిరు నవ్వుల పువ్వులు 
చిత్రం: సిరిసంపదలు

  

Thursday, January 30, 2014

తగిన సమయం


ప్రతీ విషయానికీ... అది జరగడానికీ, అగి.. సాగడానికీ, లేదా పూర్తిగా ఆగిపోవడానికీ,ఒక 'తగిన సమయమంటూ' ఉంటుంది. ఆ సమయం వచ్చేదాకా మనం ఎంత కిందామీదా పడ్డా కొన్ని సంగతులు, ఆగిన పనులు ముందుకు కదలవు. సమయమంటూ వచ్చాకా ఎంతసేపు నిరీక్షించామో అంతకన్నా వేగంగా ఆ పనులు అయిపోతాయి. ఆ సంగతులు జరిగిపోతాయి. ఇంత సులువుగా జరిగిపోయిందేమిటీ? అని మనం హాచ్చర్యపడిపోతాం కూడా! ఇదంతా జరిగేలోపూ మనం పడే వేదనో, బాధో, కంగారో, చిరాకో కూడా ఆ ఫలానా పని జరిగిపోగానే ఠక్కున మాయమైపోతుంది. అప్పుడూ 'ఓసి చిరాకానీ ఇన్నాళ్ళు ఇంత సతాయించి ఇప్పుడిలా మాయమైపోయావేమిటే' అని చిరాకు మీదే చిరాకు పడిపోతాం కూడా మనం లేదా 'ఓస్ దీనికేనా ఇంత చింతించాము...' అని నవ్వేసుకుంటాం.


ఒకోసారి పని జరగదేమో అనిపించినా, అది మనకి తెలిసిన విషయమే అయినా మనం గమనించము. కావాలనే గమనించమేమో కూడా. ఫలానాది.. ఫలానాది.. అని మనకి జరగాలనుకున్న ఏదో ఓ సంగతి గురించి నిరంతరం చింతిస్తూ గడిపేస్తాం. మనం చింతించడం వల్ల అది జరగదని తెలిసినా కూడా. కొన్ని విషయాలైతే ఎంత త్వరగా వదిలేస్తే అంతగా మనసుకూ, ఆరోగ్యానికీ కూడా మంచిది.. అని మనకు తెలిసినా మనం వాటిని వదలం.. వదలాలా వద్దా అనే మీమాంస తాలూకూ త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతూ ఉంటాం. ఏదో ధోరణిలో అలా కొట్టుకుపోతూండగా ఒక్కసారిగా ఏదో స్ఫురిస్తుంది.. 'ఇలా చెయ్యి' అని మనసు గట్టిగా చెప్తుంది. అదే 'తగిన సమయం' రావడం అంటే!


నాకూ అలానే ఓ విషయమై తగిన సమయం వచ్చింది. వచ్చేదాకా నాకూ తెలీదు అదే తగిన సమయమని. చాలాకాలంగా మధనపడుతున్న ఆలోచనలనన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చేసి... ఎనఫ్.. దిస్ ఈజ్ ద ఎండ్ అని గట్టిగా నిర్ణయించేసుకుని.. చరమగీతం పాడేసా! నాకు తెలుసు ఆ విషయానికి అదే పరిష్కారమని! కానీ ఇన్నాళ్ళూ నేనే అలక్ష్యం చేస్తూ వచ్చా. కానీ నాకూ ఎందుకో హఠాత్తుగా అనిపించింది.. తగిన సమయం వచ్చినట్లుంది అని!! ఇంక ఆలస్యం చెయ్యలేదు. చెయ్యవలసింది చేసేసాను. అసలిన్నాళ్ళు ఈ పని చెయ్యకుండా ఎందుకున్నాను.. అని ఆలోచిస్తే అనిపించింది.. ఇన్నాళ్ళూ తగిన సమయం రాలేదని.. ఈ సమయం వచ్చేదాకా నే పడాల్సినవన్నీ పడి తీరాలని రాసి ఉందన్నమాట!


ఇప్పుడు చాలా అంటే చాలా హాయిగా ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏదైనా కూడా మనం పట్టుకుని వేళ్ళాడినంతసేపే నెప్పిగా ఉంటుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా వదిలేసామా... ఇంక ఏ చింతా ఉండదు. 
Feeling very happy and refreshed.. 
specially relieved.. !!



Sunday, January 26, 2014

మాయరోగమదేమోగాని..




"తీతా.." అనే రాజబాబు డైలాగ్స్ గుర్తొచ్చి, సరదాగా చూద్దామని "అందాల రాముడు" పెట్టుకున్నాం. చాలా ఏళ్లైంది చూసి..!కథ కూడా మర్చిపోయా. రామకృష్ణ పాడిన అతిచక్కని పాటల్లో ఒకటైన "మము బ్రోవమని చెప్పవే.. " పాట మొదలయ్యింది.. హనుమ,లక్ష్మణ సమేతంగా మందిరంలో అందమైన సీతారామల విగ్రహాలు ముద్దులొలుకుతుంటే.. 'భలే ఉందే సాహిత్యం గుర్తే లేదు..' అనుకుంటూ వింటున్నా... 

రెండవ చరణంలో అన్నాడు కదా..పులిని చూసి పులి బెదిరిపోదట, మేకను చూసి మేక భయపడదట కానీ... "మాయరోగమదేమోగాని మనిషి మనిషికీ కుదరదు..." అన్నాడాయన! ఒక్కసారిగా.. ఒళ్ళు గగుర్పాటు అంటారే.. అలాంటిదేదో అనిపించింది. చరణం పూర్తయ్యేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. రామకృష్ణ గాత్రం కూడా ఎంతో భావయుక్తంగా, అసలు కథలో రాము పాత్ర తాలూకూ ఫీల్ అంతా తన గొంతులో చూపెడుతూ.. అద్భుతంగా పాడారు. సి.నా.రె గారూ ఏం రాశారండీ... ఆహా.. అనుకున్నా!

ఆ రెండవ చరణం:

పులిని చూస్తే పులీ ఎన్నడు బెదరదూ
మేక వస్తే మేక ఎన్నడు అదరదూ
మాయరోగమదేమోగాని మనిషి మనిషికీ కుదరదు...
ఎందుకో తెలుసా తల్లీ..

ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకెక్కేవాళ్లము
మీ అండ కోరే వాళ్ళము
కరుణించమని చెప్పవే మా కన్నతల్లీ... 
కరుణించమని చెప్పవే !
((మముబ్రోవమని..))



ఎంత చక్కగా విడమర్చి చెప్పాడో కదా! మీరు ఆ పాట ఇక్కడ వినేయండి:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1253


ఇక్కడ చూసేయండి:
http://www.youtube.com/watch?v=-fr-SgXN6Ew



మొత్తం సాహిత్యం:



Thursday, January 23, 2014

ఆత్మబంధువైన బాటసారి..


హ్మ్!!!!! 
ఏం రాయమంటావు నాగేశ్వర్రావ్! చెప్పు... 

నిన్న పొద్దున్న లేవగానే అలవాటుగా రేడియో పెట్టేసరికీ నీ గురించిన వార్త!! ఈసారి ఎంతమందికని ఫోన్లు చెయ్యను? అమ్మానాన్నలకా? పిన్నికా? పెద్దమ్మకా? మావయ్యకా? అందరికీ నువ్వంటే ఎంత ఆరాధనో నీకు తెలీనిదా? పదిపదిహేను రోజుల క్రితం అనుకుంటా నీకు బాగోలేదనీ..వార్తల్లో చెప్పారనీ అమ్మనాన్న కంగారు పడిపోతే వాళ్లకి పేద్ద పుడ్డింగ్ లా .. "చక్కని జీవితాన్ని గడిపాడు. పిల్లల అభివృధ్ధి చూశాడు. తృప్తిగా జీవితాన్ని గడిపాను అని గర్వంగా చెప్పుకున్నాడు. నాగేశ్వర్రావ్ గురించి బెంగెందుకర్రా..." అంటూ ధైర్యం చెప్పాను. నిన్న కూడా రేడియోలో వినగానే ఇంకా నిద్రలేవని అమ్మని లేపేసి "వార్తలు విని కంగారడకండి..జాగ్రత్త.." అని చెప్పానే గానీ ఆ తర్వాత మాత్రం నెట్, రేడియో అన్నీ ఆపేసి రోజంతా ఐదారు ఫోన్లు చేసి అమ్మ బుర్ర తినేసాను. ఎందుకేమిటీ? నువ్వేమైనా పరాయివాడినా.. మా ఇంట్లో మనిషివి కదూ...


అసలు మావయ్యకి ఫోన్ చెయ్యాలని ఎన్నిసార్లు ఫోన్ దాకా వెళ్లి.. ఆపేసానో! ఏం మాట్లాడాలో తెలీక. అసలు మా పిల్లలందరికీ మావయ్యంటే నువ్వే కనబడతాడు. నీ మేనరిజంస్ అన్నీ జీర్ణించేసుకుని చేయి తిప్పడం, మాట్టాడ్డం మాత్రమే కాక నీ ఆలోచనలని కూడా తనవి చేసేసుకున్న మహాభిమాని కదూ మా మావయ్య! ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి నిన్ను కలిసాడు.. ఎన్ని ఆల్బమ్స్, ఎన్ని ఫోటోలు, ఎన్ని పేపర్ కట్టింగ్స్.. అన్నీ నీవే! మావయ్యావాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా నీతోనూ, కృష్ణంరాజుతో తీయించుకున్న ఫోటోలు, నీకు రాసిన ఉత్తరాల కాపీలు, వాటి జవాబులు.. ఒకటేమిటి అన్నీ నీ కబుర్లే. ట్రన్స్ఫర్ల వల్ల మావయ్య తిరగని జిల్లా లేదు. వాళ్ళున్నఊరు దగ్గరలో నీ షూటింగ్ ఉందంటే పరిగెత్తుకు వచ్చేసేవాడు కదా మా మావయ్య. 'సీతారామయ్యగారి మనవరాలు' షూటింగ్ అప్పుడు ఒక్క ఉదుటనలో ఎడ్లబండి ఎక్కేసావని.. 'ఈ వయసులో కూడా ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నాడనుకున్నారూ..' అని ఎంత సంబరంగా చెప్పాడో మాకు. 'గాండీవం' సినిమాలో "గోరువంక వాలగానే గోపురానికీ" పాట చూసొచ్చి ఎంత చక్కగా స్టేప్పులేసాడో చూడండి చూడండి..అని సిన్మా చూపించేసాడు మాకు. మరి ఆస్కార్ కమిటీ వాళ్లకి నీ ప్రతిభ గురించి చెప్తూ సుదీర్ఘమైన నలభై పేజీల ఉత్తరం రాసి, వాళ్ల నుండి వచ్చిన జవాబు కాపీ కూడా నీకు పంపాడు కదా! అంత వీరాభిమానికి కాబట్టే నీకులాగ గట్టివాడైపోయాడు మావయ్య. 


ఇంక మావయ్యకు తోడుగా నాన్న కూడా నీ పుస్తకాలు, సీడీలు ఎన్ని కొన్నారనీ! చిన్నప్పుడూ "ఎందుకు నాన్నా నీకంతిష్టం నాగేశ్రావ్..?" అనడిగితే నాన్న ఒకటే చెప్పారు.. "కేవలం హీరోయిక్ రోల్స్ నే కాక వైవిధ్యభరితమైన ఎన్నో పాత్రలు వేసాడు. కష్టపడి పైకొచ్చాడు. శ్రమ విలువ తెలిసినవాడు. మనిషిగా ఎదిగినవాడు. అందుకే నాకిష్టం" అని! టివీలో నువ్వా మధ్యన 'గుర్తుకొస్తున్నాయి..' అంటూ చెప్పిన కార్యక్రమం సిరీస్ తాలూకూ సీడీల సెట్ మొత్తం కొనేసారు కదా! అమ్మ మాత్రం తక్కువ తిందా? మేం స్కుల్లో ఉన్నప్పుడు ఊళ్ళోకొచ్చిన నీ సినిమాలన్నీ ఆదివారాలు మార్నింగ్ షోలకి తీసుకువెళ్ళి మరీ చూపించలేదూ! సందు చివరన ఉండే 'విజయటాకీస్' లో, ఇంకా 'దుర్గాకళామందిర్' లో కీలుగుర్రం, ముగ్గురు మరాఠీలు, తెనాలి రామకృష్ణ, పరమానందయ్య శిష్యుల కథ, మూగమనసులు, గుండమ్మ కథ, గోవుల గోపన్న, మిస్సమ్మ, ప్రేమించి చూడు, నవరాత్రి, డాక్టర్ చక్రవర్తి, దొంగ రాముడు, సువర్ణసుందరి, తోడికోడళ్ళు, అందాల రాముడు... ఎన్ని చూపించిందో.. లైలామజ్ను, దేవదాసు మాత్రం ట్రేజడీలు.. మీకొద్దులే అని చూపెట్టలే! 



ఆ పైన పెట్టినది రాబోయే కొత్త సినిమాలోది..నీ ఫోటోనే! అయినా ఇప్పుడంత తొందరేమొచ్చిందనీ? మొన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు.. ఆ ధైర్యంతోనే కదా హాయిగా కూర్చున్నాం అందరమూ! ఎంతమంది టాటా చెప్పేసినా అయ్యో..అనో, వయసయిపోయిందనో సరిపెట్టేసుకున్నా కానీ నీ గురించి ఎందుకనో అలా అనుకోలేకపోతున్నాను... ఎందుకంటావ్??? నాగేశ్వర్రావ్ అంటే ఎవర్ గ్రీన్..ఎప్పుడూ యంగ్ మ్యానే నాకు. అయినా నిన్ను నటుడిగా నేనసలెప్పుడు చూసానని? నాకు నువ్వు నటుడిగా కంటే ఓ నాగేశ్వర్రావ్ గానే ఎక్కువ అభిమానం. నీ క్రమశిక్షణ, వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరు, నేర్చుకున్న పాఠాలు.. ఎన్ని చెప్పావు.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎవరికైనా ఎంత ఉపయోగపడతాయవి! ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త, శ్రధ్ధ చూపెట్టేవాడివో ఎన్ని ఇంటర్వ్యూల్లో విన్నానో.. ! ఇవాళ తెలుగుజాతి ఒక గొప్ప నటుడినే కాదు.. ఒక మహామనిషిని కూడా కోల్పోయింది... అందుకే.. ఆ బాధతోనే ఏం రాయాలో తెలీలేదు నిన్నంతా... 


నెట్లో ప్రశాంతంగా నిద్రోతున్న నీ ఫోటో చూడకపోతే ఇవాళ కూడా ఏమీ రాసేదాన్ని కాదేమో... అయినా నువ్వెక్కడికి వెళ్లావని.. మా మనసుల్లో, నీ సినిమా సీడీల్లో, నీ పుస్తకాల్లో, నీ మాటల్లో.. ఇంకా చెప్పాలంటే ఈ సినీరంగం ఉన్నంతవరకూ నువ్వు సజీవమే...! అవును కదూ... 




Monday, January 20, 2014

మన బాపు..





మన బాపు..  మన తెలుగువాళ్ళకి గొప్పే కదా! 

యాదృఛ్ఛికంగా ఇవాళ యూట్యూబ్ లో ఈ లింక్స్ దొరికాయి... 18నెలలుగా కేబుల్ కనక్షన్ పీకిపారేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న మాకు ఇటువంటివి చూడటమంటే పండగే మరి! 

మాకులాగ ఎవరన్నా మిస్సయినవాళ్ళు ఉంటే చూస్తారని లింక్స్ ఇక్కడ పెడుతున్నాను..


 మొదటి భాగం:


    


రెండవభాగం:

    


 ఫేస్బుక్ లో బాపూ గారి పేజీ...(తెలియనివాళ్ళకి..) 
https://www.facebook.com/pages/Bapu-ramana/134126756633596

Saturday, January 18, 2014

तॆरॆ बिना जिंदगी सॆ कॊई...




ఏమిటో...కూడబలుక్కున్నట్లు వరుసగా తారరందరూ గగనతలాలకు ప్రయాణం కడుతూంటే చిత్రంగా ఉంది! వెంఠవెంఠనే నివాళులు రాయడం ఎందుకని ఆగాను గానీ సుచిత్రాసేన్ గురించి నాలుగు వాక్యాలు రాయకపోతే తోచడం లేదు... 


సుచిత్రాసేన్! ఒకప్పటి ప్రఖ్యాత తార! మొట్టమొదటిసారి నాన్న కలక్షన్లో చూశాను సుచిత్రా సేన్ ఫోటోని! అసిత్ సేన్ తీసిన బెంగాలీ చిత్రం "దీప్ జ్వలే జాయ్"(హిందీ "ఖామోషీ") లో సుచిత్రాసేన్ నటన అసలు మరువలేనిది. ప్రేమను తెలుపలేక, దాచుకోలేక ఓ డ్యూటీఫుల్ నర్స్ గా ఆమె పడే తపన,వేదన ఆమె కళ్ళలో కనబడుతుంది. భావాల్ని వ్యక్తీకర్తించడానికి ఆమెకు మాటల అవసరం లేదు. మన సావిత్రి లాగ, మీనాకుమారి లాగ కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో భావాన్ని వ్యక్తపరచగల నేర్పరి. గొప్ప నటి. 


బిమల్ రాయ్ తీసిన "దేవ్ దాస్" చిత్రంలో ఆమె నటన ఎంతో ప్రశంసలనందుకుంది. బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ తో ఎక్కువ చిత్రాలు చేయగా, వాటిల్లో "ఇంద్రాణి", "సప్తపది" మొదలైన చిత్రాలు ప్రఖ్యాతిగాంచాయి. "సాత్ పకే బాంధా" అనే బెంగాలీ చిత్రంలో ఆమె నటనకు గానూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులనందుకుంది సుచిత్రాసేన్. "ఆంధీ" సినిమాలో నటించే సమయానికి సుచిత్రా సేన్ కు సుమారు నలభై నాలుగేళ్ళు ! అయినా ఎంతో చార్మింగ్ గా, అంతకు పదేళ్ళు యంగ్ గా కనిపిస్తారావిడ ఆ చిత్రంలో! 


సుచిత్రాసేన్ తీసుకునే కొన్ని దృఢమైన నిర్ణయాలు ప్రపంచన్ని ఎంత ఆశ్చర్యపరిచినా ఆమె తన నిర్ణయాలకే కట్టుబడి ఉండేవారు. కారణాలు ఏవైనా రాజ్ కపూర్, సత్యజిత్ రే అంతటి గొప్ప దర్శకుల సినీఅవకాశాలను ఆమె నిరాకరించారు. పాతికేళ్ల ప్రఖ్యాత సినీ జీవితం అనంతరం ఏకాంతవాసం లోకి వెళ్పోయి ప్రతిష్ఠాత్మకమైన 'దాదాసాహెబ్ ఫాల్కే'  పురస్కారాన్ని కూడా వదులుకున్నారు. 


సుచిత్రాసేన్ స్మృతిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పాట... 
ఎన్ని వందల పాటలు చాలా ఇష్టమనిపించినా, అర్థం తెలియని చిన్ననాటి రోజుల నుండీ ఈ పాట మాత్రం, ఆర్.డి.బర్మన్ ట్యూన్ మహిమో ఏమో ఎందుకో నాకు చాలా నచ్చేది.. అర్థం తెలిసి, పాట మధ్యలోని వాక్యాలతో సహా కంఠస్థం వచ్చేసాకా గుల్జార్ మాటల్లోని లోతులు తెలిసాకా.. ఇంకా ఇంకా మనసులో నిలిచిపోయిందీ గీతం...

Thursday, January 16, 2014

జ్ఞాపకాల 'అంజలి'..



ప్రముఖ నటి అంజలీ దేవి స్వర్గతి వార్త విన్నప్పుడు వెంఠనే నాన్న గుర్తుకు వచ్చారు. తనకు ఫోన్ చేసి ఎలా చెప్పాలా అనుకుంటూంటే రేడియో వార్తల్లో విన్ననని తనే చెప్పారు..!ఆయనకు ప్రియమైన నటీమణుల జాబితాలో మొదటిస్థానం అంజలీదేవిదే! అప్పటికి వారం రోజులుగా కాస్త నలతగా ఉండి పండుగకు రానని చెప్పినదాన్ని కూడా ఎలాగో తంటాలు పడి ఇంటికి వెళ్ళి నాన్నగారిని కలిసి, కాసేపు గడిపి వచ్చాను. తిరిగి వస్తూ చిన్నప్పటి నుండీ ఆయన దగ్గర వింటూ వచ్చిన అంజలీదేవి జ్ఞాపకాలు కొన్ని మూటకట్టుకు వచ్చాను. కాస్త కూచుని రాసే ఓపిక వచ్చాకా ఆ జ్ఞాపకాల పూలన్నీ ఈ టపాలో గుమ్మరించేస్తున్నా...! పెద్ద వయసు, సంతృప్తికరమైన పూర్ణజీవితాన్ని చూసినావిడ కనుక చింతపడనవసరం లేకపోయినా తెలుగుతెరపై వెలిగిన ఒక మహానటిగా ఆమె  జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకోవాలని నా అభిలాష..



నాన్నావాళ్ళూ చిన్నప్పుడూ వాళ్ళ ఊరు ఖండవిల్లి నుండి ఏడుమైళ్ళు గుర్రబ్బండిలో తణుకు వెళ్ళి సినిమా చూసి వచ్చేవారుట. ఆ కాలంలో సినిమా చూడాలంటే అంత యాతన పడాల్సివచ్చేది. నాన్నకు పదిపన్నెండేళ్ళు ఉన్నప్పుడు చూసిన సినిమాల్లో అంజలీదేవి నటించిన పరదేశి(1951), అనార్కలి(1955), ఇలవేల్పు(1956) చిత్రాలు బాగా గుర్తుండిపోయాయి... రువాత ఎన్ని అంజలి సినిమాలు చూసినా, 'పరదేశి'లో "నేనెందుకు రావాలి ఎవరికోసమో.." అనే పాట, 'అనార్కలి'లో "రావోయీ సిపాయి..’ , 'ఇలవేల్పు' లో "చల్లని రాజా ఓ చందమామ.." పాటలు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయాయి అంటారు నాన్న. డాన్స్  బాగా చేసేది.. ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా మంచి క్లోజప్ షాట్స్ ఉండేవి.. పైగా అప్పటి cameramen కెమేరాకి డిఫ్యూజర్లు అవీ వేసి, అంజలి ని బాగా గ్లామరస్ గా చూపించేవారు కూడా అని చెప్తారాయన. అలనాటి అంజలి నుండీ ఇవాళ్టి నిత్యామీనన్ వరకూ తనకెందరో ప్రియమైన నటీమణులున్నా, వారందరిలో తను మొట్టమొదట అభిమానించిన అంజలిదే ప్రధమ స్థానం అంటారు నాన్న!



నాన్న స్కూల్లో చదివే కాలంలోనే మద్రాసు చాలాసార్లు వెళ్ళొస్తుండేవారుట. వీనస్ స్టూడియో తాలూకూ కెమేరా డిపార్ట్మెంట్ లో నాగేశ్వర్రావ్ అనే సమీప బంధువు పనిచేస్తూ ఉండడం వల్ల, తరచూ నెల్లూరు నుండి మద్ర్రాసు వెళ్ళి లా షూటింగులు చూస్తూండేవారిట. అక్కడ ఆళ్వార్ పేట లోని వీనస్ స్టూడియోలో 'అంజలీ పిక్చర్స్' వాళ్ల చిత్రాలు షూటింగ్ జరుగుతూ ఉండేవిట. నాన్న కాలేజీ రోజుల్లో ఉండగా ఒకసారి ఎన్.టి.ఆర్,అంజలీదేవి నటించిన స్వర్ణమంజరి(1962) చిత్రం క్లైమాక్స్ సీన్ షూట్ జరుగుతోందిట. ఓ కొండ కొమ్ము మీద ఎన్.టి.ఆర్ వేళ్ళాడుతూండగా, రాజనాల తన కాలుతోటి హీరో చేతిని తొక్కుతూండడం ఆనాటి సన్నివేశం. క్రింద అగాధమైన లోయ.. అదొక ట్రిక్ షాట్. కొంద కొమ్ము వరకూ సినిమా సెట్, అగాధమైన లోయ మాత్రం పెద్ద అద్దం మీద పెయిటింగ్ చేసి, దాని వెనక కెమేరా పెట్టి ఆ ట్రిక్ షాట్ తీస్తున్నారుట. అలానే ఆ సినిమాలోని మిగిలిన ట్రిక్ షాట్స్ కూడా చూసే అవకాశం అప్పుడు నాన్నకు దొరికిందిట. అంజలీ పిక్చర్స్ వారే "ఫూలోం కీ సేజ్" అనే హిందీ చిత్రాన్ని నిర్మించారుట. అందులో మనోజ్ కుమార్ , వైజయంతిమాల ప్రధాన పాత్రధారులు. ఆ షూటింగ్ కూడా వీనస్ స్టూడియోలోనే తీశారుట. ఆదినారాయనరావు దంపతులు పాల్గొన్న ఆ పిక్చర్ ముహుర్తం షాట్ కి కూడా నాన్న హాజరయ్యారుట.



ఎనభైల తర్వాత బెజవాడ రేడియో స్టేషన్ కొత్త స్తూడియోల్లోకి మారిన తరువాత ఓసారి ఆదినారాయణరావు గారు, అంజలీ దేవీ బెజవాడ వచ్చారుట. ఆ కాలంలో బెజవాడే సినీపరిశ్రమకు ముఖ్య రంగంగా ఉండేది. ఎందుకంటే సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన కీలక రంగాలవారు అక్కడే ఉండేవారు మరి. బెజవాడలో పిక్చర్ కి హిట్ టాక్ వస్తే, ఆ పిక్చర్ సక్సెస్సయినట్లే అనుకునే కాలం. అందుకని సినీరంగ ప్రముఖులు, నటీనటులు బెజవాడే ఎక్కువ వస్తూండేవారు అప్పట్లో. అలాంటి ఒక సందర్భంలో అంజలీదేవి దాంపతుల్ని రేడియో స్టేషన్ కి ఆహ్వానించారుట.  అప్పట్లో విజయచిత్ర మాస పత్రికవాళ్ళు 'సినీ నేపధ్య సంగీతం' అనే అంశం మీద  వ్యాస రచన పోటీ నిర్వహించారు. అందులో మొదటి బహుమతి నాన్న రాసిన వ్యాసానికి వచ్చింది. ఆ పోటీకి న్యాయనిర్ణేతగా ఆదినారాయణరావు గారు వ్యవహరించారని తర్వాత తెలిసింది. ఆ విషయం ఈ సందర్భంలో ప్రస్తావించారుట నాన్న. అప్పటికే ఆదినారాయనరావు గారు పెద్ద వయసులో ఉన్నందువల్ల, ఆయనకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేనందువల్ల ఆయనతో కార్యక్రమం చెయ్యడానికి వీలుపడలేదుట కానీ అంజలీదేవితో మాత్రం వివిధభారతి వాణిజ్యవిభాగంలో, అప్పటికి ప్రజాదరణలో ఉన్న 'ప్రత్యేక జనరంజని' కార్యక్రమాన్ని నాన్న ప్రొడ్యూస్ చేసారుట. అలా తనకత్యంత ప్రియమైన నటీమణిని ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగించిందని నాన్న చెప్తారు.


అలనాటి నటీమణుల్లో సావిత్రి నాకు బాగా ఇష్టమైనా, అంజలీదేవి చిత్రాల్లో సంఘం, లవకుశ, అనార్కలి, చెంచు లక్ష్మి, రంగులరాట్నం, బడిపంతులు, సతీ సక్కుబాయి మొదలైన చిత్రాలు బాగా నచ్చుతాయి నాకు. మేము పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా వి.ఐ.పి ల లైన్స్ లో మొదటి వరుసలో అంజలి, జమున, గాయని సుశీల కనబడుతూ ఉండేవారు మాకు. మా తమ్ముడి కోసం పర్తిలో హాస్టల్ కు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆవిడ మనవడి కోసమనుకుంటా అంజలీదేవి కూడా వచ్చేవారు. అలా చాలాసార్లు దగ్గరగా ఆవిడను చూడటం జరిగింది. చిరునవ్వుతో ఎప్పుడూ ప్రసన్నంగా కనబడే ఆమె మొహం చాలా బావుంటుంది.





మూడు,నాలుగేళ్ల క్రితం ఓసారి మా పాపకు పిల్లల కథల సీడీలు అవీ కొంటూంటే అంజలీదేవి ఉన్న షార్ట్ ఫిల్మ్ సీడీ ఒకటి కనబడి అది కొన్నాం. "చిన్నారి పంతులమ్మ" అనే ఆ కథలో మనవరాలి దగ్గర తెలుగు నేర్చుకునే అమ్మమ్మ పాత్ర అంజలిది. ఇంట్లో పెద్దవాళ్ళున్న తీరే వేరని ఆ సీడీ చూసినప్పుడల్లా అనుకుంటూంటాం మేము. బావుంటుంది ఆ కథ కూడా. చాలాసార్లు ఆ సీడీ పెట్టుకుని చూస్తుంటుంది మా పాప. మొన్న శనివారమే ఆ సీడీ పెట్టుకుని చూస్తూంటే దానితో పాటూ మేమిద్దరం కూడా చూసాం మళ్ళీ! వయసు దాచడానికి మేకప్ బాగా వేసేసారు గానీ అంత వయసులో కూడా ఎలా నటించారో.. ఎంత పెద్దావిడైపోయారో ఈవిడ అనుకున్నాం ఆ రోజు.





హ్మ్..!! కాలమెవరి కోసమూ ఆగదు కదా.. ప్రపంచంలోని వింతలనూ, విశేషాలను, చరిత్రనూ, మనుషులనూ, వారి తాలూకూ స్మృతులనూ కూడా తనలో కలిపేసుకుంటూ పోవడమే దానికి తెలుసు..! మొన్న ఎందరో.. నిన్న అంజలి.. రేపు ఇంకెవరో.. ఇదే కాలచక్రం.. ఇదే జీవనగమనం..



Monday, January 13, 2014

సంక్రాంతి శుభాకాంక్షలు..


బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Friday, January 10, 2014

రెండు పాటలు..




 మధుర గాయకుడు శ్రీ కె.జె. యేసుదాస్ 74 వ పుట్టినరోజు సందర్భంగా.. 

1998లో G.V.Iyer గారు దర్శకత్వం వహించిన "స్వామి వివేకానంద" హిందీ చిత్రానికి ఒక అద్భుతమైన పాట పాడారు ఏసుదాస్ గారు. గుల్జార్ రాయగా, ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు "సలీల్ చౌదరి" గారు స్వరపరిచిన పాట ఇది. నాకు చాలా ఇష్టం ఈ పాట..


.  


"స్వామి వివేకానంద"లో మరో పాట కూడా చాలా బావుంటుంది.. 
కవితా కృష్ణమూర్తి పాడినది.. 
surdas bhajan..


 

 నాలుగేళ్ల క్రితం ఆయన పుట్టినరోజునాడు రాసిన టపా: 
http://trishnaventa.blogspot.in/2010/01/blog-post_10.html

శ్రీనగజాతనయం..





పొద్దున్నే "పాటతో నేను" బ్లాగ్ లో "జోహారు శిఖిపింఛమౌళీ" చూస్తూ పెండ్యాల గారి పాటలు తలుచుకుంటూంటే, మాకు "శ్రీనగజాతనయం" గుర్తుకొచ్చింది..!  గూగులమ్మ పుణ్యమా అని ఎక్కువ వెతుక్కునే శ్రమలేకుండా యూట్యూబ్ లో చూసాం.. చాలా అందమైన సాహిత్యం... 'వాగ్దానం' చిత్రం లోది.. 
మంచి హరికథాగానం.. మీరూ చూసేయండి.. 

రచన: శ్రీశ్రీ, (పాటలో కరుణశ్రీ గారి పద్యాలను వాడుకున్నారు) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 



 

 ఈ హరికథ సాహిత్యం నా దగ్గర ఉన్న పాత సినిమా పాటల పుస్తకం నుండి :





Thursday, January 9, 2014

ఏకాంతం..





ఒంటరితనానికీ ఏకాంతానికీ చాలా తేడా ఉంది.. రెండూ నిశ్శబ్దంలో జనించేవే అయినా ఒంటరితనం దు:ఖ్ఖాన్ని పెంచితే, ఏకాంతం ఆ భారాన్ని తగ్గిస్తుంది. మనలో మనం, మనతో మనం ఉండేలా చేసి మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజులో కొద్దిపాటి ఏకాంత ప్రశాంత క్షణాలు గడిపినా అవి జీవితాన్ని స్థిరంగా గడపడానికి సరిపోయేంతటి ఇంధనాన్ని మనకి అందివ్వగలవు.

చాలా ఏళ్ల క్రితం మాట... మేము విజయవాడ రేడియో క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఓ మూడేళ్ళూ సెకెండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మా బాల్కనీ వీధివైపు రోడ్డు కనబడేలా ఉండేది. మా బ్లాక్ లోపలికి ఉండడం వల్ల మా బాల్కనీ లోంచి గేటు దాకా ఉన్న పొడుగాటి రోడ్డూ, లోపల్నుండి బయటకు వెళ్తూ,వస్తూ ఉండే జనం కనబడుతూ ఉండేవారు. అంతే కాక చుట్టూ ఉండే పెద్ద పెద్ద చెట్లూ, పక్షులు, ఆకాశం అన్నీ కలిపి ఓ మంచి వ్యూ ఉండేది. 10th, ఇంటర్ రెండేళ్ళూ స్కూలు, కాలేజీ అయ్యి రాగానే ఆ బాల్కనీ లో ఉండే ఉయ్యాల లోనే నా మకాం ఉండేది. టేప్ రికార్డర్ కూడా అక్కడే పెట్టేసుకుని పాటలు వింటూ, ఆ ఉయ్యాల లో కూచుని అక్కడే కాఫీ, టిఫిన్, చదువు, తిండి..అన్ని అక్కడే! ఎండనీ, వర్షాన్నీ , చలినీ కాలాల మార్పులన్నింటినీ ఆ ఉయ్యాలలో కూచునే గమనిస్తూ ఉండేదాన్ని. ఆ నిశ్శబ్దం, ఆ ఏకాంతం నాకెంతో హాయిని ఇచ్చేవి. ముఖ్యంగా రాత్రి పూటలు ఏ వాద్య సంగీతమో, భూలే బిస్రే గీత్ నో వింటూ గడిపే ఏకాంతాలకు తిరుగేలేదు.. అవన్నీ మరువలేని మధురస్మృతులు నాకు..!


ఆ ఇల్లు వదిలాకా మళ్ళీ ఇన్నేళ్ళలో అలాంటి బాల్కనీ వ్యూ దొరకలేదు నాకు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడున్న ఇంటి బాల్కనీ లోంచి మళ్ళీ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం వచ్చింది. ఈసారి ఇది వీధి వైపు కాదు పొలాలవైపు. మనుషులసలు కనబడరు. ఉయ్యాల వెయ్యలేదు కానీ బీన్ బ్యాగ్ ఒకటి అక్కడ వేసేసి ఉంచా. పొద్దున్నే టీ తాగుతూ ఆ మంచునీ, ఎర్రబారుతున్న ఆకాశాన్నీ చూడడం ఓ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది కానీ పొద్దుటే పని హడావుడిలో ఎక్కువసేపు కూచోవడం కుదరదు. మధ్యాహ్నమో సాయంత్రమో మాత్రం ఏ పుస్తకమో పట్టుకునో, ఖాళీగానో కనీసం ఓ గంట అయినా ఇక్కడ గడుపుతాను. తీ తాగుతూ మౌనంగా ఉన్న ఆకాశాన్నీ, వలయాకరంలో తిరుగుతున్న ఇరవైముఫ్ఫై దాకా ఉండే పావురాల గుంపునీ చూడటం ఒక వ్యాపకమైపోయింది నాకు. ఒక్కరోజు కూడా మానకుండా రోజూ ఆ పావురాలు అలా ఆటలాడుకుంటాయి. కోతలైపోయి, ఎండిపోయిన వరిపొలాలపై గుంపుగా చేరి కాసేపు కూచుంటాయి. మళ్ళీ పైకెగిరి ఓ రౌండ్ తిరుగుతాయి. గుంపుగా అన్నీ కలిసే తిరుగుతాయి చిత్రంగా. ఒకసారి కాదు ఓ గంట పైగా అలా తిరుగుతూనే ఉంటాయి. చూసేందుకు మనకి విసుగు రావాలి కానీ తిరిగేందుకు వాటికి రాదేమో!


"పద పదవే వయ్యారి గాలిపటమా.." అంటూ దూరంగా ఆకాశంలో మూడు నాలుగు గాలిపటాలు పోటీ పడుతూ ఎగురుతూ ఉంటాయి. దూరంగా ఆడుకుంటున్న పిల్లల అరుపులూ, కేరింతలు..! పక్కనే పల్లెలోంచి అప్పుడప్పుడు మైకుల్లోంచి పాటలు, ఉపన్యాసాలు, భజనలు వినబడుతూ ఉంటాయి. టైం ప్రకారం రోజులో నాలుగైదుసార్లు ’అల్లా హో అక్బర్...’ కూడా వినబడుతుంది. గంటకోసారి ఏదో ఒక రైలు పక్కనున్న రైల్వే ట్రాక్ మీంచి కుయ్యిమని వెళ్తూ నిశ్శబ్దాన్ని చెదరగొడుతుంది కానీ అలా వెళ్ళే రైలుని చూడ్డం కూడా బాగుంటుంది. ప్రపంచంతో, ట్రాఫిక్ హోరుతో, మనుషులతో ఏమాత్రం సంబంధం లేని ఈ ఏకాంతం మళ్ళీ ఇన్నాళ్ళకు నాకు చేరువయ్యింది.. ఆ చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెస్తూ..!! 


చీకూ చింతా లేని ఆ చిన్నప్పటి రోజుల్లోని ప్రశాంతత ఇప్పుడు మనసుకు లేకపోయినా, ఇన్నాళ్ళకు నాతో నేను గడిపగలిగే కొన్ని ఏకాంతపు క్షాణాలను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూంటాను రోజూ.. ఇప్పుడు కూడా బాల్కనీలో కూచునే ఈ టపా రాస్తున్నా! చీకటి పడితే మాత్రం ఇక్కడ ఉండలేం..దోమలు పీకేస్తాయి.. ఇంక లోపలికి పోవాలి మరి... !!




పాట వెంట పయనం : అందం



ఈ నెల పాట వెంట పయనం నేపథ్యం.. "అందం". మరి అందం గురించి సినీకవులు ఏమేమి వర్ణనలు చేసారో వినేద్దామా..

http://magazine.saarangabooks.com/2014/01/08/%E0%B0%AD%E0%B0%B2%E0%B1%87-%E0%B0%AD%E0%B0%B2%E0%B1%87-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE/


Wednesday, January 8, 2014

'అలంకృత'




ఆమధ్యన వెళ్లిన ఒక నర్సరీ దారిలోనే మరికొంత దూరం వెళ్తే "అలంకృత" రిసార్ట్స్ ఉన్నాయి. స్టే కి వెళ్లకపోయినా, గార్డెన్ చూడటానికి విజిటర్స్ ని పర్మిట్ చేస్తారు. షామీర్పేట్ మండలం, తూముకుంట అనే పల్లె ప్రాంతం ఇది. మొన్నదివారం అక్కడికి వెళ్లాం. 'పచ్చందనమే పచ్చదనమే..' అన్నట్లు.. పెద్ద పెద్ద వృక్షాలు, వాటిపైకి పాకి వేలాడుతున్నతీగెలూ, రంగురంగుల పువ్వులతో చూడముచ్చటగా ఉంది అలంకృత


అక్కడ రెండు మూడు రోజులు ఉండేవాళ్ళే కాక గార్డెన్ చూడటానికి వచ్చే విజిటర్స్ కూడా చాలామందే ఉన్నారు. నాలుగైదు రకాల రెస్టారెంట్లు కూడా ఉన్నాయి లోపల. చాలా చోట్ల ధ్యాన ముద్రలో ఉన్న బుధ్ధభగవానుడి విగ్రహాలు ఆ ప్రాంతంలోని ప్రశాంతతను పెంచాయి. ఓ గంటసేపు ఆ ప్రశాంతతని ఆస్వాదించి తిరిగివచ్చేసాము.


దూరాలు వెళ్లలేని నగరవాసులకు చక్కని ఆటవిడుపు ఈ ప్రదేశం. కొన్ని ఫోటోలు..






violet lotus






ఈ పళ్ళు భలే ఉన్నాయి..










nightqueen


figs?

బాబోయ్..









Friday, January 3, 2014

మరచిపోవబోకె బాల..

అడివి బాపిరాజు


కవి, చిత్రకారుడు, నాటక కర్త, స్వాంతంత్ర్య సమరయోధుడు, మానవతావాది, లాయరు, ప్రిన్సిపాల్, పాత్రికేయుడు, గాయకుడు, కళా దర్శకుడు, అయిన అడివి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన గేయాలను చాలావరకూ ఆయన పాడి మిత్రులకు వినిపించేవారుట. గాంధీజీని గురించి ఆయన పాడుతూంటే తన్మయంతో వినేవారుట అందరూ. బాపిరాజు గారి గేయాలలో "మరచిపోవబోకె బాల" నాకు బాగా నచ్చుతుంది. ఈ గీతంలోని భావానికి అంతే చక్కని సంగీతాన్నీ, మధురమైన గాత్రాన్నీ అందించి శ్రీ కె.బి.కె. మోహన్ రాజు గారు ఆ అక్షరాల్లోని ఆత్మను తన గాత్రంలో నింపుకుని పాడారేమో అనిపిస్తుంది..


ఈ గీతాన్ని క్రింద లింక్ లో వినవచ్చు.. అక్కడ లిస్ట్ లో మూడవ పాట..
http://kbkmohanraju.com/songslist.asp?tab=Lalithageethalu#

సాహిత్యం: 

మరచిపోవబోకె బాల మరచిపోవకే
అరచి అరచి పిలువలేను 
తరిచి తరిచి వెదకలేను
పరచి ఎగురుకాంక్షలతో 
పడిచెదురును నా గుండెలు
((మరచిపోవబోకె బాల ))

హోరుమనేవారి రాశి 
మారుమోగె నా పాటలు
విరిగిపడే తరగలలో 
నురుగులలో పరుగులలో
((మరచిపోవబోకె బాల ))

ఒఖ్ఖడ్నేఇసుకబయలు
ఒఖ్ఖడ్నే కదలిచదలు
దవ్వుదవ్వుల జరిగిపోవు 
దశదిశాంతరాళమందు
((మరచిపోవబోకె బాల ))

అదుముకున్న నీ తలపుల 
చిదికిరాలు హృదయసుమము
ఏరలేను రేకలను 
ఏరలేను పుప్పొడిని
((మరచిపోవబోకె బాల ))



Thursday, January 2, 2014

అంతర్లోచన...



ప్రతి ఏడాదీ జనవరి 1st న ఎప్పుడో కుదిరినప్పుడు కాసేపు కూర్చుని ఇంతదాకా ఏం చేసాను? ఇకపై ఏం చెయ్యగలను? అని నాలో నేను మాట్టాడుకోవడం అలవాటు నాకు. నిన్న అలా ఖాళీగా కూచునే సమయమే దొరకలేదు :(  మొన్న రాత్రి కాలనీలో జరిగిన న్యూ ఇయర్ పార్టీ ఎగ్గొట్టేసాం. చాలా బిజీ ఏమీ కాదు కానీ చాలా మామూలుగా గడిచిపోయింది నిన్నంతా! ఆఫీసు కి శెలవు లేక కేరేజీ తీసుకుని శ్రీవారు ఆఫీసుకెళ్ళిపోయారు. మా పాప బుక్స్ సర్దుతుంటే నే చూడని, మిగిలిపోయిన హోం వర్క్ కనబడింది! అయ్యబాబోయ్..అని భయపడిపోయి రాత్రిలోపూ అది పూర్తి చేయించే ఫుల్ టైమ్ పనిలో పడ్డా! ఇవాళ్టి నుంచీ స్కూలు మొదలు వాళ్లకి. 


అందుకని ఇవాళ పొద్దున్నే కాస్త ఖాళీ చిక్కగానే కూచున్నా తీవ్రంగా అంతర్లోచన చేసేసి, డైరీ ఎలానూ సరిగ్గా రాయట్లేదు ఇక్కడైన రాసుకుందామని..:)  ఈ బ్లాగ్ మొదలెట్టాకా రెగులర్ గా డైరీ రాసే అలవాటు కూడా గతి తప్పింది. ఖాళీగా అక్కడక్కడ మాత్రమే నిండిన పది పదిహేనుకి మించని మూడేళ్లనాటి పాత డైరీలను చూసుకుని, క్రితం ఏడాది కొత్త డైరీ తీసుకోవడం మానేసా. ఓ వాడని పాత డైరీలోనే వరుసగా రాయాలనిపించినప్పుడల్లా తారీఖులు వేసి రాసుకుంటూ వచ్చా! ఈసారైతే అసలింకా వెతుక్కోలేదు పాతవాటిల్లోంచి! అంటే అన్ని వాడని పాత(కొత్తగా ఉన్న) డైరీలు ఉన్నాయి నా దగ్గర. పిచ్చో వెర్రో.. ఈ డైరీలేంటో.. ఇవన్నీ ఏం చేసుకుంటానో అని విరక్తి వేసేస్తుంది ఇల్లు సర్దినప్పుడల్లా!(ఆ కాసేపే..:)) 



రిజల్యూషన్స్ అనేవి వదిలేసి చాలా కాలమైంది. ఎందుకంటే అనుకునేదాన్ని గానీ అవెప్పుడూ సరిగ్గా అమలుపరచలేదు.. అందుకని ! (న్యూ ఇయర్ కి మానేసాను కానీ ప్రతి పుట్టినరోజుకీ మాత్రం ఏదో ఒకటి అనుకుని అది అమలుచేసే అలవాటు మానలేదు.) చాలా ఏళ్ల తరువాత ఈసారి జనవరి 1st న ఎందుకనో ఒకటి, రెండు తీర్మానాలు గట్టిగానే చేసుకున్నాను. నిజం చెప్పాలంటే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకా చాలా పాఠాలని నేర్చుకున్నానని చెప్పాలి. అవన్నీ అమలులో పెట్టకపోతే ఇంక కొత్త విషయాలు నేర్చుకుని ఏం ప్రయోజనం? అసలు ఇదివరకటి రోజులు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది.. జనవరి 1st  అంటే ఏదో పండగలాగ ముందురోజు రాత్రి పేద్ద ముగ్గు, కొత్త బట్టలు, ఫ్రెండ్స్ ఇళ్లకి వెళ్ళడం, గ్రీటింగ్స్, ఫోన్ కాల్స్...బ్లా.బ్లా..బ్లా...! అప్పటిదాకా సెలబ్రేషన్ అంటే అదే డెఫినిషన్ !! అంతకు మించిన ఆలోచన ఉండేది కాదు. అసలు న్యూ ఇయర్స్ డే అప్పుడు మాత్రమే తీర్మానాలు ఎందుకు? తలకు దెబ్బ తగిలి బొప్పి కట్టిన తరువాత బుధ్ధి వచ్చిన ప్రతిసారీ తీర్మానాలు చేసుకోవచ్చు కదా? ఓహో ఇదా జీవితమంటే... అని అర్థమైన ప్రతిసారీ, కొన్ని బంధుత్వాల్లో.. స్నేహాల్లో..మనుషుల్లో.. డొల్లతనం బయటపడిన ప్రతిసారీ రేపట్నుండే నాకు న్యూ ఇయర్.. ఇకపై ఇలా ఉండద్దు..  అనుకోవాలని అప్పట్లో తెలీదు మరి! 




ఏదేమైనా ప్రతి నిన్నా ఇవాళ్టికి ఓ స్మృతిగా మిగిలిపోయేదే కదా! అందుకని స్మృతుల్లో కలిసిపోయిన నిన్నల్లోంచి అనుభవాల పాఠాలను వెతుక్కుని, వాటిని మర్చిపోకుండా నా చేతుల్లో ఉన్న ప్రతి ఇవాళనీ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చెయ్యాలన్నది... ప్రస్తుతానికి నే చేసుకుంటున్న తీర్మానం..! మీరూ ఏవో కొన్ని తీర్మానాలు చేస్కునే ఉంటారు కదా... అవి ఏదైనా, క్రింద బొమ్మలో చెప్పినట్లు అందరూ చెయ్యాలనీ, ఉండాలని కోరుకుంటున్నా!!