సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, April 24, 2012

MANGO MELA 2012


మామిడిపళ్ళు పండించటానికి ఎక్కువగా వాడుతున్న "కార్బైడ్" వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతున్నందువల్ల కార్బైడ్ వాడకంపై నిషేధం విధించిన విషయం అందరికీ విదితమే. అందువల్ల ప్రతిఏడూ వేసవిలో ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా కనబడే మామిడిపళ్ళు కనబడ్డమే మానేసాయి. హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక మామిడిపళ్ళ మేళా ఏర్పాటు చేసారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన "కార్బైడ్ రహిత మామిడిపళ్ల విక్రయం" ఈ మేళా లోని ప్రత్యేకత. ఈనెల 1౩ నుంచీ మే నెల పధ్నాలుగు వరకు ఒక నెల పాటు ఈ మామిడిపళ్ల మేళా జరుగుతుందిట.

పేపర్లో చదివి ఈ మేళా ప్రారంభించిన రోజు మేము వెళ్ళాము. అప్పటికి ఇంకా అన్ని ప్రాంతాల నుండీ పళ్ళు రాలేదు. మొదటిరోజు అయినా జనం కూడా బాగా ఉన్నారు. ఆ రోజు వచ్చినపళ్ళు వచ్చినట్లే అయిపోయాయి. కొందరు అక్కడికక్కడే మావిడిపళ్ళు కొనుక్కుని తినేస్తుంటే ఆశ్చర్యం కలిగింది కూడా.






మళ్లీ ఓ వారం తరువాత వెళ్ళాము. కాస్త అన్ని స్టాల్స్ రకరకాల మామిడిపళ్ళతో నిండి ఉన్నాయి. మామిడిపళ్ళ రకాలు కూడా ఎక్కువ కనబడ్డాయి. జిల్లాలవారీగా ఈ ఎగ్జిబిషన్ లో మామిడిపళ్ళ విక్రయం జరుగుతుందిట. ఒక వారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, కృష్ణా, ఖమ్మం మొదలైన జిల్లాల నుండి పళ్ళు వస్తాయిట. నిన్నటితో ఈ జిల్లాల అమ్మకం అయిపోతుందనుకుంటా.







మాకు బంగినపల్లి, చెరుకురసాలు, సువర్ణరేఖ, పంచదారకలస, భూలోకసుందరి(బాగా ఎర్రగా ఉన్న ఈ పళ్ల గురించి వినలేదు నేను..:)), పెద్దరసాలు,చిన్న రసాలు, పచ్చడి కాయలు మొదలైనవి కనబడ్డాయి. పచ్చడి కాయల కోసం మార్కెట్ లోకి ప్రత్యేకం వెళ్ళక్కర్లేదు మళ్ళీ అని అక్కడే పచ్చడి కాయలు కొనేసాను. ఆవకాయకు ముక్కలు కొట్టి ఇస్తున్నారు కూడా.






ఇవాళ్టి నుంచీ పదిరోజులు గుంటూరు, నెల్లూరు, మెదక్,నిజామాబాద్ మొదలైన జిల్లాల నుంచీ, ఆ తర్వాత చివరిలో నల్గొండ, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, నల్గొండ మొదలైన జిల్లాల నుండి వచ్చిన మామిడిపళ్ళ అమ్మకం జరుగుతుందిట. ఇక మేళా లో మొదట్లో ఓ పక్కగా తెర్రెస్ గార్డేన్ లో మొక్కలు ఎలా పెంచవచ్చు, ఏ ఏ రకాలు పెంచవచ్చు చెబుతు కొన్ని మొక్కలు పెట్టారు. విత్తనాలూ, గార్డెనింగ్ పరికరాలు కూడా అమ్మకానికి పెట్టారు. జనాలు చూడటానికి పెంచిన కొన్ని బుజ్జి బుజ్జి మొక్కలు భలే ముద్దుగా ఉన్నాయి. వంకాయ, మిరప, కాకర, క్యాబేజ్, ఇంకా ఆకుకూరల మొక్కలతో పాటుగా మామిడి,అరటి,నిమ్మ మొదలైన పెద్ద పెద్ద చెట్లు టెరెస్స్ పై ఎలా పెంచవచ్చో చూపెట్టారు.



















మేళా లో ఓ పక్క సమోసా,చాట్,టీ లాంటివి ఉన్న స్టాల్, మరోపక్క ఫ్రెష్ ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ కూడా ఉన్నాయి. ఇలాంటిదే ఫ్రూట్ ఐస్క్రీం స్టాల్ జనవరిలో జరిగిన హార్టికల్చర్ ఎగ్జిబిషన్ లో కూడా పెట్టారు. మేమూ సీతాఫలం ఐస్క్రీం తిన్నాం. చాలా బాగుంది ఫ్లేవర్.



ఇక్కడ మామిడిపళ్ళ ధరలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. స్టాల్స్ వాళ్ళు ఇస్తున్న ఈ మేళా లోగోతో తయారు చేసిన ప్లాస్టిక్ కవర్లు కూడా బాగున్నాయి. ఈ మ్యాంగో మేళా ఇంకా మరో ఇరవై రోజుల పాటు ఉంటుంది కాబట్టి కార్బైడ్ రహిత మామిడిపళ్ళు కావాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ మామిడి మేళాకి వెళ్ళి కొనుక్కోవచ్చు.


6 comments:

Indira said...

అప్పుడే మేంగో మేళా చూసేశారన్నమాట!ఆవకాయ సహజంగా మే రెండోవారంలో పెడతాము మేము.అప్పటికికానీ టెంక బాగాముదరదని!మాచిన్నప్పుడు హిమావుద్దీన్ అనే వెరైటీని మా నాన్నగారు ప్రత్యేకంగా తెప్పించేవారు.పండు ఘుమ ఘుమలాడుతూ మంచి సువాసనగా వుండేది రుచికూడా చాలాబాగుండేది.ఈమధ్యకాలంలో ఎక్కడాచూడలేదు.మొజాంజాహి మార్కెట్ ప్రాతంలో కార్నర్లో రకరకాల లోకల్ మేడ్ ఐస్ క్రీంస్ అమ్ముతారు.అక్కడ సీతాఫలం,సపోటా,జామ మొదలైన ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి.

శశి కళ said...

కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్....నోరు ఊరించుట న్యాయమా?

SHANKAR.S said...

చివరికి సహజమైన మామిడి పళ్ళని ఇలా ఎగ్జిబిషన్లలో చూసుకునే రోజోచ్చింది :(.

చిన్నప్పుడు వేసవి శలవుల్లో తాతగారి ఇంటికి వెళ్ళేసరికే ఆయన మాకోసం స్టోర్ రూం లాంటి గదిలో నెల మీద గడ్డి పరిపించి దానిమీద తోటలోంచి వచ్చిన మామిడి కాయలు పరిపించి, వాటి మీద ఇంకో లేయర్ గడ్డి వేసి మగ్గబెట్టేవారు. పచ్చివైనా పర్లేదు తినేస్తాం అని మేము, ముగ్గనివ్వండ్రా అని ఆయన రోజూ ఇదే తంతు. ఇంకా ఒక సారి అవి ముగ్గిన తర్వాత ఆయనే పిలిచి మరీ ఇచ్చిన ఆ మామిడి పళ్ళ రుచి ఇంకా మనసులోనే ఉంది.

ఇక ఇంట్లో ఆవకాయ పెట్టేటప్పుడు ముక్కలు కొట్టే అబ్బాయిని పిలిపించేవారు. అతను చకచకా ఏదో మెషీన్ లా ముక్కలు కొడుతూంటే అటొచ్చి,ఇటొచ్చి ఒకటి రెండు ముక్కలు తీసుకుని పారిపోవడం. అరుగుమీద కూర్చుని ఉప్పూ, కారం అడ్డుకుని ఆ పులుపుని ఎంజాయ్ చేస్తూ తినడం...గుర్తోస్తేనే భలే ఉంటుంది.

తృష్ణ said...

@ఇందిర: ఫ్రూట్ ఫ్లేవర్డ్ ఐస్క్రీమ్స్ మేము బొంబాయిలో ఉండగా తినేవారం.ఇక్కడ ఇదే తినటం నేను. ఇందులో నిజమైన ఫ్రూట్ పల్ప్ వేసి అప్పటికప్పుడు చేసి ఇస్తున్నాడు.
ధన్యవాదాలు.

@శశికళ: ఊరించాలని కాదండి... ఈ ఊళ్ళోవాళ్ళైతే అక్కడ కొనుక్కుంటారని వివరంగా రాసాను ఫోటోలతో పాటూ.
ధన్యవాదాలు.

@శంకర్.ఎస్: నిజమేనండి.. మా చిన్నప్పుడు కూడా వేసవిశెలవులకు కాకినాడ వెళ్ళేసరికీ టేబుల్ కిందో, మంచం కిందో ఎండుగడ్డి క్రింద మగ్గిన మావిడిపళ్ళ వాసన గుప్పుగుప్పుమని వస్తుండేది..:) భోజనాల దగ్గర అందరి కంచాలలోకీ మావిడిపండు కడిగివేసే డ్యూటీ నాకు ఉండేది. ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకుని పళ్ళన్నీ శుభ్రంగా కడిగి, తుడిచి, తొడిమ దగ్గర చిల్లు పెట్టి, కాస్త రసం బయటకు పిండేసి కంచాల దగ్గర పెట్టడం భలే సరదాగా ఉండేది...
ధన్యవాదాలు.

Anonymous said...

hyderabad city exhibition grounds means nampally??

pls pls konchem tondaraga cheppeyandi.

Ee weekend velli techukontamu.

Thanks for the sweet info about this mela :)

తృష్ణ said...

@sravya:అవునండి నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే. ఇప్పుడక్కడ "చిల్డ్రెన్స్ కార్నివాల్" కూడా జరుగుతోంది.