సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, April 20, 2012

బాపూ ప్రాణం పోసిన "మన్యంరాణి"






పుస్తకాల షాపులో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే ఒకచోట కనబడింది తెల్లని అట్టమీద అందమైన బాపూ బొమ్మ. ఏమిటా అని చూస్తే అది సినీదర్శకుడు వంశీ రాసిన "మన్యంరాణి" నవల. పుస్తకం తెరిచి, లోపల ఉన్న బొమ్మలు చూసి ఆశ్చర్యపోయాను. అవన్నీ నేను గత ఏడాది "బాపు బొమ్మల కొలువు"లో తీసిన ఫోటోల్లోవి. "మన్యంరాణి" నవల ఏదో పత్రికలో సీరియల్ గా వచ్చినట్లు, ఆ తర్వాత పుస్తకంగా రిలీజయినట్లు తెలుసుగానీ ఈ బొమ్మలు ఆ నవల తాలూకూ అని ఆ ఫోటోలని తీసినప్పుడు నాకు తెలీదు. పుస్తకం ఖరీదు చూస్తే 250/- ! కొనాలా వద్దా అని ఆలోచన... కాసేపు మిగతా పుస్తకాలు చూసేసి, కావాల్సినవి కొనేసాకా మళ్ళీ "మన్యంరాణి" దగ్గరకు వెళ్ళా. ఆర్ట్ పేపర్ మీద అందమైన ప్రింట్ తో బాపూ గీసిన అందమైన రంగురంగుల బొమ్మలు.. ప్రతి పేజీకీ సైడ్ బార్(మార్జిన్లా) గీసి అందులో కూడా చిన్న చిన్న బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ పుస్తకాన్ని ఆఖరుకి కొనేసాను. అంతగా కొనుక్కోవాలనిపించేలా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన అక్షర క్రియేషన్స్ వారు అభినందనీయులు.


గత ఏడాది "బాపు బొమ్మల కొలువు"లో నే తీసిన ఈ నవల తాలూకూ ఫోటోలు:










ఇక ఈ నవల కథా కమామిషు ఏంటా అని అంతర్జాలంలో వెతికితే, పుస్తకం.నెట్లో జంపాల గారు రాసిన వ్యాసం , ఈ పుస్తకఆవిష్కరణ సమయంలో వంశీ చెప్పిన మాటలు కనబడ్డాయి. తాను చిన్నప్పటినుండి `తిరిగిన రంపచోడవరం,మారేడుమిల్లి, గోకవరం మొదలైన ప్రాంతాలలో తనకెదురైన అనుభవాలను అక్షరీకరించి మన్యంరాణి నవల రచించినట్లు; రంపచోడవరం దగ్గర ఉన్న తన సొంతఊరు చుట్టుపక్కల పలు ప్రాంతాలలో,ఎన్నో మారుమూల ప్రాంతాలలో, ట్రైబల్‌ ఏరియాలో కూడా తాను తిరిగాననీ, ఆ అడవి చూస్తుంటే...ఈ నవల ఆలోచన కలిగాయి అని వంశీ చెప్పారు.




వంశీ చేసిన ఈ పరిశోధనాత్మక ప్రయాణాల వల్లనే ఈ నవలలో గిరిజనుల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచారాలు,నమ్మకాలు మొదలైనవాటి గురించిన మంచి వివరణాత్మక వర్ణన సాధ్యమైంది అనిపించింది. ఈ నవల ద్వారా గిరిజనుల గురించి, ఆయా పల్లెల గురించీ ఎన్నో విషయాలు తెలిసాయి. కథ చదువుతుంటే అడవుల్లో నానాటికీ అంతరించిపోతున్న వృక్షసంపదల గురించి, మాయమౌతున్న అరుదైన పశుపక్ష్యాది జాతుల గురించి రచయిత పడే ఆవేదన స్పష్టంగా కనబడుతుంది. నవలలో చెప్పిన రకరకాల పక్షి జాతులు, ఎన్నో రకాల చెట్లు, పూతీగెలు, వివిధరకాల పళ్ళ గురించిన వివరాలు ఎంతో పరిశోధన చేస్తేనే తెలుస్తాయి. అరుదైన ఇంతటి విషయ సేకరణ చేయటం సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా వంశీ వర్ణించిన అడవి అందాలు కళ్ళకు కట్టినట్లుగా, ఆ ప్రాంతానికి వెళ్ళి చూడాలి అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం వంశీని అభినందించకుండా ఉండలేము.





అయితే, బాపూ గీసిన ఇంత అందమైన చిత్రాలకు సరిపోయే దీటైన కథ కూడా ఉంటే మన్యంరాణి ఒక అద్భుతమైన నవలగా మిగిలిపోయేదే. కానీ కథలో ఎక్కువైన నాటకీయత, చివర్లో అతకలేదనిపించిన ముగింపు కథను తేల్చేసాయి. కథకు ప్రాణంపోసేంతటి అందమైన బొమ్మలను బాపూ గీసినా, వాటికి దీటుగా నిలబడేంతటి గొప్ప కథ నవలలో లేకపోవటం నన్నెంతో నిరాశకు గురిచేసింది. కథలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన అందమైన నాయిక "కొమరం రాజమ్మ"కు ప్రత్యేకమైన వ్యక్తిత్వమేమీ లేకపోవటం, తన అందాన్ని అద్దంలోనో, కొలనులోనో చూసుకోవటం తప్ప కథనంలో ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది. నవలలో నాకు నచ్చిన ఏకైక పాత్ర "కొమరం లచ్చన్న". ఈ లచ్చన్న మావే కథలో హీరో ! అడవితల్లిపై ఆ ముసలిగిరిజనుడికి ఉన్న ప్రేమాభిమానాలు, వన సంపదను రక్షించాలనే అతని తాపత్రయం, తోటి గిరిజనులకు అతను అందించే ఉచిత వైద్యసేవ అతడిని గుర్తుంచుకునేలా చేస్తాయి. ఇంతకు మించి కథలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.






పేజీల్లో మధ్య మధ్య ముఖ్యమైన సన్నివేసాలకు బాపు వేసిన అద్భుతమైన బొమ్మలే ఈ నవలకి ప్రాణం పోశాయి. ఆ బొమ్మలే నేనీ పుస్తకం కొనుక్కునేలా చేసాయి. ఇంతటి పరిశోధన జరిపాకా తనకు లభించిన సమాచారాన్ని ఇలా నవలలా కాకుండా, గిరిజనుల జీవనాన్ని గురించిన ఒక సమాచారాత్మక పుస్తకంగా వంశీ రాసి ఉంటే ఎంతో బాగుండేది. ఆయన సేకరించిన వివరాలకు సాహిత్యంలో సుస్థిర స్థానం దొరికిఉండేది అనిపించింది నాకైతే..!

6 comments:

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్...

స్వాతి లో వచ్చినప్పుడు మన్యంరాణి ఫుల్ గా ఫాలో అయ్యానండీ.
స్టోరీ బిగినింగ్ సూపర్ గా ఉంటుంది. ఇక బాపు గారి బొమ్మల్ చెప్పక్కరలేదు.
మద్య మధ్య లో ప్రకృతి వర్ణన, నోరు తిరగని ఊరి పేర్లు, అక్కడి వ్యవహారాలు మరీ ఎక్కువగా మోతాదుకి మించి ఉంటాయ్. చివర్లో హడావిడిగా ముగించేసినట్టు అనిపించింది నాకు. కొమరం లచ్చన్న మామ క్యారెక్టర్ కేక. ఆ క్యారెక్టర్ చనిపోయాక ఇక నవల మీద ఇంట్రస్ట్ పోయింది నాకయితే.

మీరు ఈ బొమ్మలు మళ్ళీ చూపెట్టి, పుస్తకం కొనేట్టూ చేసేలా ఉన్నారు. సూపర్..

A Homemaker's Utopia said...

మంచి రివ్యూ రాసారు తృష్ణ గారు...బాపు బొమ్మలు చాలా చాలా బాగున్నాయి..

Anonymous said...

price chaala ekkuva unnattundi..

SHANKAR.S said...

నేనూ స్వాతిలో సీరియల్ గా వచ్చినప్పుడే చదివానండీ. కథ కన్నా బాపుగారు గీసిన బొమ్మలే హైలెట్. ఒక్కోసారి వంశీ పదాల్లో సరిగ్గా వ్యక్తపరచలేనివి కూడా బాపుగారు అలవోకగా చూపించేవారు. కథ మాత్రం అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందనిపించలేదు. మొత్తం మీద మాత్రం ఇడ్లీ కన్నా చట్నీ బావుందనిపించే పుస్తకం :)

తృష్ణ said...

@రాజ్: అవునా? విన్నాను కానీ నాకు ఏ పత్రికలో పడిందో తెలీదు. నాకూ లచ్చన్న మామే బాగా నచ్చాడు. ఈ బొమ్మలు సేవ్ చేసేస్కో...పుస్తకం కొనక్కర్లేదు..:))
ధన్యవాదాలు.

@నాగిని గారూ, అవునండి బాపు బొమ్మలే ఈ పుస్తకానికి ప్రాణం. ధన్యవాదాలు.

@సన్నాయి రాగాలు: ధర గురించే నేను కొనటానికి వెనకాడాను కానీ బాపూ బొమ్మలు కొనిపించేసాయి..:)
ధన్యవాదాలు.

@శంకర్.ఎస్: అవును కదా...చాలా సార్లు బొమ్మలు చూస్తూ నేనదే అనుకున్నాను...వాటిని చూస్తే చాలు సగం కథ అర్ధమైపోతుందని..! టపా సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పేసారు..:)
ధన్యవాదాలు.

మనసు పలికే said...

బొమ్మల కోసమైనా పుస్తకం కొనాలనిపిస్తుంది. రివ్యూ బాగా రాశారు :)