సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 21, 2012

బీరకాయ పీచు చుట్టరికం

చుట్టరికాలు రకరకాలు. మనం ముఖ్యంగా పరిగణించే అమ్మ తరఫువాళ్ళు, నాన్న తరఫువాళ్ళు కాక అమ్మమ్మ,తాతయ్య వైపు చుట్టాలు, నాన్నమ్మ,తాతయ్య వైపు వాళ్ల అన్నదమ్ముల తాలూకా, అక్కచెల్లెళ్ళ తాలూకా చుట్టాలుంటారు కదా వాళ్ళ చుట్టరికాలని బీరకాయ పీచు చుట్టరికం అంటారు. పూర్వకాలపు ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు ఈ దూరపు చుట్టరికాలు కూడా అందరికీ తెలుస్తూ ఉండేవి. కానీ రానురానూ కుటుంబాలు చిన్నవి అయ్యే కొద్దీ బంధుత్వాలు, చూట్టరికాలు కూడా దూరంగానే జరిగిపోతున్నాయి. ఎప్పుడైనా అందరం కలిసినప్పుడు వీళ్ళు ఫలానా అని మన అమ్మమ్మలో, మావయ్యలో చెప్తే తప్ప మనకెవరూ తెలియదు. అలా అందరం కలిసే సందర్భాలు కూడా తక్కువైపోతున్నాయి రానురానూ.


గృహప్రవేశాలూ, ఇతర చిన్నపాటి వేడుకల్లో కన్నా పెళ్ళిళ్లలో మాత్రం చాలావరకు దూరపు బంధువులను మనం కలుస్తూ ఉంటాము. వేరే ఎక్కడా,ఎప్పుడు మనం వాళ్లను కలవకపోయినా కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళలో మాత్రం కొందరిని తప్పక కలుస్తూంటాము. హలో అంటే హలో అనుకోవటం, ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారని పలకరించుకోవటం మినహా పెద్దగా స్నేహబాంధవ్యాలు ఉండవు వీరితో. అమ్మ ద్వారానో, పిన్ని ద్వారానో వాళ్ల తాలుకూ కబుర్లు వింటుంటాం తప్ప వాళ్ల ఇళ్ళకు కూడా ఎప్పుడు వెళ్లం మనం. కానీ అలా అప్పుడప్పుడు కేవలం పెళ్ళిళ్ళలో మాత్రమే కలిసే కొందరు చుట్టాలు ఎందుకనో గుర్తుండిపోతారు మనకి. అలా నేను చిన్నప్పటి నుండీ చూస్తున్న/ఎరిగిన ఒక బీరకాయ పీచు బంధువు గురించి అమ్మ చెప్పిన వార్త విని ఈ టపా రాయాలనిపించింది.


ఆ బంధువు మా అమ్మమ్మ అక్కయ్యకు మనవడో ఏదో అవుతారు. నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లోని అన్ని ముఖ్యమైన పెళ్ళీళ్లకూ హాజరయ్యేవారు. ప్రతీ పెళ్ళి లోనూ ఎక్కడో ఆడుకుంటున్న నన్ను పిలిచి "ఏమే బావున్నావా? ఏం చదువుతున్నావు? " అని పలకరించేవారు. వాళ్ళావిడను పిలిచి "ఇదిగో ఈ అమ్మాయి గుర్తుందా..?" అని నేనెవరో చెప్పేవారు. ఎంత హడావుడి పెళ్ళిలోనైనా కనీసం భోజనాల సమయంలో అయినా సరే ఆయన పలకరింపు అలా అలవాటైపోయింది నాకు. కాస్త ఊహ వచ్చాకా ఏ పెళ్ళిలో అయినా ఆయన కనబడకపోతే "ఫలానావాళ్ళు ఈ పెళ్ళికి రాలేదా?" అని అమ్మని అడిగేంతగా నాకు ఆయన గుర్తుండిపోయారు. నాచిన్నప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు ఆయనకు.


నాపెళ్ళయాకా నేను కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళు మిస్సయ్యా. చాలారోజులతర్వాత ఒకసారి మాత్రం వాళ్ళను కలిసాను. "మీరిద్దరూ మా ఊరు రండి" అని ఆహ్వానించారు. ఓ పేరున్న హిల్ స్టేషన్లో ఉండేవారు వాళ్ళు. తర్వాత అమ్మ ద్వారా వాళ్ల అమ్మాయికి ఇంటర్ అవ్వగానే పెళ్ళి చేసేశారని విన్నాను. ఇప్పుడు మనవలు కూడాట. ఇక అబ్బాయికి ఇంజినీరింగ్ పూర్తయ్యి ఉద్యోగంలో చేరాడని విన్నాను. ఈమధ్యన ఆయన అమ్మకి ఫోన్ చేసారుట వాళ్ల అబ్బాయి పెళ్లి.. శుభలేఖ మిస్సయినా తప్పకుండా పెళ్ళికి రావాలి అని. మా పిల్లలందరిని పేరుపేరునా అడిగారుట. అమ్మ మళ్ళీ నాకీ సంగతి చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎక్కడో బీరకాయపీచు చుట్టరికం.. ఇంకా గుర్తుపెట్టుకుని పేరుపేరునా అడగటం, పెళ్ళికి అహ్వానించటం..! ఏళ్లపాటు బంధుత్వాలు నిలిచిఉన్న కొందరు చుట్టాల దగ్గరే సఖ్యత కనిపించదు. అలాంటిది ఇళ్ళకు వెళ్ళటాలు, ఉత్తరప్రత్యుత్తరాలు లేకపోయినా కేవలం పెళ్ళిళ్లలో కలిసిన పరిచయంతోనే ఇంతవరకూ ఈ బీరకాయ పీచు చుట్టరికం నిలిచి ఉండటం...నాకయితే విచిత్రంగానే తోస్తుంది. పైగా నే చిన్నప్పుడు చూసిన పాకే వయసుపిల్లలు ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చి పెళ్ళిళ్ళు అయ్యేంత పెద్దవారయిపోయారని విని ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి !!

12 comments:

buddhamurali said...

నాదీ ఆలాంటి పరిస్థితే ...బంధువులను ఎవరిని గుర్తు పెట్టుకోను. ఇది చాలా తప్పు అని తెలుస్తోంది . ఈ మధ్య మాత్రం వీలున్నంత వరకు పెళ్ళిలకు వెళుతూ పలకరిస్తున్నాను.

కృష్ణప్రియ said...

పెద్దమ్మమ్మ మనవడు అంటే మరీ దూరం కాదు కదా.. మీ అమ్మ కి కజిన్ కి కొడుకు. మీకు రెండో తరం కజిన్. పర్వాలేదు దగ్గరే :)

కొంతమంది పెద్దమ్మ/పిన్ని/మామ/బాబాయి/అత్త కొడుకులూ,కూతుళ్ళూ , ఇంకా రెండో తరం కజిన్లతో ఎక్కువ స్నేహం గా ఉండేదాన్ని చాలా కాలం. ఇప్పుడు ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నా ఫేస్ బుక్ పుణ్యాన మళ్లీ బాగానే దగ్గరయిపోయాం.

కొందరు మాత్రం సొంత కజిన్లే.. పలకరించి దశాబ్దం దాటిపోయింది.

రాజ్ కుమార్ said...

హ్మ్.. నిజమేనండీ..
చిన్నప్పుడూ పెళ్ళిళ్ళకి రమ్మంటే రామని గోల గోల చేసేవాళ్ళం తమ్ముడూ నేనూ.
ఇప్పుడు ఏ పెళ్ళిలో అయినా కలిస్తే.. మా నాన్న/అమ్మ "ఒరేయ్.. ఈయనెవరో తెలుసా?ఈవిడెవరో చెప్పు " అని ముందు క్విజ్ ప్రోగ్రాంస్ పెడతారు. తెల్లమొహాలేసుకొని సిగ్గుపడతాం మేము. ;( ;(
ఆపేరు ఎలా వచ్చిందో చెప్తారనుకున్నా.. ;)

ఇందు said...

:) Bagundi Trishna garuu!! Naku ee chuttalu knowledge baga takkuvandi :) evaru evariki emavutaaru anedi entha aaalochinchinaa ardham kaadu :)))) Engineering lo campus interviews ki prep avutnnappudu reasoning lo ee relations meeda q^ns daggara naku break padipoyedi :P adannamaata sangati :)

కొత్తావకాయ said...

"ఫలానా వాళ్ళ మనవరాలివా? మీ తాతా నేనూ ఒక కుదుట్లో వాళ్ళమే " అని ఆ మధ్య ఓ పెళ్ళిలో పండు ముసలి తాతగారు పలకరిస్తే నవ్వేసి చాలా సేపు ఆలోచించుకున్నాను చుట్టుపక్కల ఎందరు తెలుసో నాకూ అని.

ఫేస్ బుక్ పుణ్యమా అని కజిన్స్ మాత్రం ఎవరెక్కడ ఉన్నారో, వాళ్ళకి పిల్లలు ఎందరో, వివరాలేమిటో తెలుస్తున్నాయి. మా అమ్మ అత్త కూతురి పిల్లలు కూడా నన్ను add చేసుకున్నారు. నేనెప్పుడూ వాళ్ళని ప్రత్యక్షంగా చూడలేదు. వాళ్ళకయితే ఫ్రెండ్స్ కౌంట్ పెంచుకోవడానికే ఏమో కానీ నాకయితే "కనీసం పేర్లు తెలిసాయిగా!" అని సంబరంగా ఉంటుంది. :)

కొత్తావకాయ said...

@ రాజ్ కుమార్ గారు! అవును. ఆ క్విజ్ లలో తెల్లమొహాలెయ్యడం భలే గుర్తు తెచ్చారు. తెలీదు అనకూడదు. గుర్తు పట్టలేం. :(

A Homemaker's Utopia said...

నిజమండీ....మేమే మా బంధువులు ఎవరో సరిగ్గా గుర్తు పట్టలేము..ఇంక మా పిల్లల సంగతి సరే సరి....మీ టపా చదివాకా అనిపించింది,ముందు మేము అందరి బంధువుల గురించి తెలుసుకోవాలని...తరువాత పిల్లలకి చెప్పొచ్చు...:-)

Found In Folsom said...

నేను క్రిష్ణ ప్రియ గారితొ ఏకీభవిస్తాను..సెకెండ్ కసిన్ అంటె మరీ అంత దూరం కాదెమో :) అది మనకి చిన్నప్పటి నుండి ఉన్న రిలేషన్ని బట్టి ఉంటుందెమొ..

Found In Folsom said...

నేను క్రిష్ణ ప్రియ గారితొ ఏకీభవిస్తాను..సెకెండ్ కసిన్ అంటె మరీ అంత దూరం కాదెమో :) అది మనకి చిన్నప్పటి నుండి ఉన్న రిలేషన్ని బట్టి ఉంటుందెమొ..

తృష్ణ said...

@బుధ్ధా మురళి: అయితే ఇక చాలా మంది మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారన్నమాట..:)

@కృష్ణప్రియ: hi !
yap, మరీ దూరం కాదు కానీ మా అమ్మమ్మగారి సంతానమే పెద్దది. ఇక వాళ్ల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇంకా ఎక్కువ మంది. వాళ్ళెవరితోనూ ముఖ్యమైన పెళ్ళిళ్లకి తప్ప, ఇళ్ళకి రాకపోకలు లేక మాకు వాళ్ళు దూరపు చుట్టాల్లాగానే అనిపిస్తారు మరి.
ఊళ్ళో ఉన్న సొంత కజిన్స్ ని కలిసి ఏడాది దాటుతోంది..:( ఫేస్ బుక్లో cousins అందరూ ఉన్నారు, నన్నూ ఏడ్ చెసుకున్నారు కానీ నేను అది పెద్దగా వాడను. అదో మయసభలా తోస్తుంది నాకు...:)
ధన్యవాదాలు.

తృష్ణ said...

@రాజ్: దూరపు చుట్టరికాలని అలా అంటారు. ఆ పేరు వెనుక కథ నాకూ తెలీదు..:) ఇలాంటి క్విజ్ ప్రోగ్రామ్స్ నుంచి తప్పించుకోవాలని ఈమధ్యన వీలయినంతమంది చుట్టాల వివరాలు రాసిపెట్టుకుంటున్నా..:)
థాంక్యు.

@ఇందు: హాస్టల్లో ఉన్నా కూడా అంతే ఇందు. చాలా పెళ్ళిళ్ళు తద్వారా చాలామంది చుట్టాలను కలిసే అవకాసమ్ మిస్సయిపోతాం.
ధన్యవాదాలు.

@కొత్తావకాయ: బడ్ంహువులను తెలుసుకునేందుకు, కలిపుకుందుకు ఫేస్ బుక్ బానే ఉంటుంది కానీ పైన రాసినట్లుగా నాకెందుకో ఆ ఫేస్బుక్ ఫేసే నచ్చదు...:(
ధన్యవాదాలు.

తృష్ణ said...

@A Homemaker's Utopia: పెద్దవాళ్లని అడిగి వాళ్ల వాళ్ళ చూట్టాల వివరాలు రాసి ఉంచుకోండి. పిల్లలకు చెప్పటానికి పనికివస్తుంది. నేను కూడా అడిగి రాసుకుంటున్నా ఈ మధ్యన.
ధన్యవాదాలు.

@Found In Folsom : పైన కృష్ణప్రియ గారికి రాసిన జవాబే మీకూనూ.. మా బంధుబలగం పెద్దదవటం వల్ల ముఖ్యమైన పెళ్ళిళ్లకి తప్ప, ఇళ్ళకి రాకపోకలు లేక తెలియనివాళ్ళు మాకు వాళ్ళు దూరపు చుట్టాల్లాగానే అనిపిస్తారు మరి..:(
ధన్యవాదాలు.