కొన్ని సినిమాలు వాటిని తీసిన కాలం నాటి దేశ పరిస్థితులను అద్దం పట్టి చూపిస్తాయి. 70లలోని దేశ రాజకీయ, కాల, సామాజిక పరిస్థితులకు ఒక అద్దం వంటి సినిమా "ఆకలిరాజ్యం". 1980లో తమిళం లో "Varumayin Niram Sivappu" పేరుతో విడుదలైన ఈ సినిమాను తరువాత 1981లో తెలుగులో రీమేక్ చేసారు. నిరుద్యోగ సమస్య తారస్థాయిలో ఉన్న రోజులు అవి. ఎందరో చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో, పేదరికంతో, అవమానాలతో, నిస్పృహలతో కాలం వెళ్లదీసిన పరిస్థితులను ఈ సినిమాలో అత్యంత ప్రభావితంగా ప్రతిబింబించారు శ్రీ కె.బాలచందర్. ఈ సినిమా వచ్చి ఇప్పటికి ముఫ్ఫై ఏళ్ళు. ఈ ముఫ్ఫై ఏళ్ళలో మన దేశకాలపరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. నిరుద్యోగ సమస్య అయితే అరికట్టబడింది కానీ పేదరికం, ఆకలి చావులు మొదలైన వాటిల్లో పెద్దగా మార్పులేవీ రాలేదనే చెప్పాలి. తమ తమ పాత్రల్లో అత్యుత్తమ నటనను ప్రదర్శించారు ముఖ్య భూమికలు పోషించిన కమల్ హాసన్, శ్రీదేవిలను ...at their best అనచ్చు. దర్శకుడు, నాయకుడు, సంగీత దర్శకుడు, గీతకర్త, పాడినవారూ....ఇలా చాలామంది ఇష్టమైనవాళ్ళతో నిండిన ఈ సినిమా ఇష్టమైన సినిమాల్లో ఒకటిగా నిలవటం ఆశ్చర్యకరమేమీ కాదు.
ఇది ఒక ఆకలి కావ్యం. దారిద్ర్యపు అంచుల్లో మునిగితేలిన బాధాతప్త హృదయాలు పడే అశ్రుకావ్యం. ముగ్గురు నిరుద్యోగ మిత్రులు రాజధాని నగరంలో ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ ఉత్సాహ నిరుత్సాహాలు, ఆకలి బాధల చుట్టూ చిత్రకథను అల్లారు బాలచందర్. ఉద్యోగం కోసం కమల్ పడే పాట్లు, ఆకలి తాళలేక డబ్బు కోసం శ్రీశ్రీ పుస్తకాలను సైతం అమ్ముతున్నప్పుడు అతని వేదన, దుర్భరమైన జీవనయానంలో ఎడారిలో ఒయాసిస్సు లాంటి శ్రీదేవి పరిచయం, వారిద్దరికీ దొరికిన మరొక స్నేహితుడు ఒక మూగ చిత్రకారుడు అవటం, నాయికా నాయకులు తమతమ స్వగతాలను అతని ముందు చెప్పుకోవటం...ఇవన్నీ కథనం లోని తీక్షణతను పెంచుతాయి. ఈ చిత్రం ఒక దృశ్య కావం అని చెప్పుకోవచ్చు. ఇంకా చిత్రంలో ముఖ్యంగా తలుచుకోవాల్సిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే... ముగ్గురు స్నేహితులు అన్నం తింటున్నట్లు నటించే సన్నివేశం, భోజనం ముందు కూర్చున్నా తినలేకపోయిన సన్నివేశం, తండ్రి కమల్ పనిచేసే బార్బర్ షాపు కు వచ్చిన సన్నివేశం, శ్రీదేవి తండ్రిని కమల్ బెదిరించే సన్నివేశం, చిత్రకారుడైన మిత్రుని చావు, పార్క్ లో కమల్, శ్రీదేవి కలిసే సినిమాలోని చివరి సన్నివేశం..మొదలైనవి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే ఆర్ద్రమైన సన్నివేశాలు.
కమల్ శ్రీశ్రీ వాక్యాలను ఉదహరించే కొన్ని సన్నివేశాలను క్రింద లింక్లో చూడవచ్చు:
దక్షిణ భారతంలోని గొప్ప సంగీతకారుల్లో ఒకరైన ఎం.ఎస్. విశ్వనాథన్ ఈ చిత్రానికి కమనీయమైన బాణీలను సమకూర్చారు. "ఆకలిరాజ్యం" అని పేరు వినగానే వెంఠనే గుర్తుకొచ్చే రెండు పాటలు.. "సాపాటు ఎటూ లేదు", "కన్నెపిల్లవని కన్నులున్నవని". వీటిలో మొదటి పాట గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పాడిన మంచి పాటల జాబితాలోకి వస్తుంది. పాటలో పలికిన హావభావాలు, కిషోర్ కుమార్ లాగ Yodeling చేసిన తీరూ ప్రశంసాపాత్రమైనవి. రెండవది నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఒకటి. సాహిత్యం కూడా బాణీతో పోటీపడేలా అద్భుతంగా కుదిరిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా విసుగురాదు. బాలు, జానకి గార్లు ఇద్దరూ సమగ్రమైన న్యాయం చేకూర్చారు ఈ పాటకు. సుశీల పాడిన "గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య..", జానకి పాడిన "तु है राजा.. मैं हू रानी.." పాటలు కూడా బావుంటాయి. ఆత్రేయ గారి సాహిత్యం గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. ఈ నాలుగు పాటలు ఈ లింక్ లో చూడొచ్చు:
http://www.bharatmovies.com/telugu/songs/akali-rajyam-songs.హతం
ఏది చీకటి? ఏది వెలుతురు?
ఏది జీవిత మేది మృత్యువు?
ఏది పుణ్యం? ఏది పాపం?
ఏది నరకం? ఏది నాకం?
ఏది సత్యం? ఏదసత్యం?
ఏదనిత్యం? ఏది నిత్యం?
ఏది ఏకం? ఏదనేకం?
ఏది కారణ మేది కార్యం?
ఓ మహాత్మా….. ఓ మహర్షి…..
ఏది తెలుపు? ఏది నలుపు?
ఏది గానం? ఏది మౌనం?
ఏది నాది? ఏది నీది?
ఏది నీతి? ఏది నేతి?
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షి…..ఓ మహాత్మా…