బాల్యపు అమాయకత్వం, చురుకు వయసు ఆశలు,ఆశయాలు, స్మృతులు, కలలు, కోరికలు, మాటలు, పాటలు అన్నీ కలగలిస్తే ఓ మనిషి అస్తిత్వం తయారవుతుంది. అయితే వేళ్ల సందుల్లోంచి జారిపోయే ఇసుకలాగ ఏళ్ళు గడిచేకొద్దీ జీవనసమరంలో ఈ అస్తిత్వాన్ని, ఒక్కొక్క అనుభూతినీ కోల్పోతూంటాడు మనిషి. నేను నేనేనా? అని తనని తాను ప్రశ్నించుకునే సందర్భాలు బోలెడు. సంసార సాగరంలో నేను కూడా నన్ను నేను మర్చిపోయి కొట్టుకుపోతున్న తరుణంలో అనుకోకుండా మొదలెట్టిన ఈ బ్లాగ్ ప్రయాణం కోల్పోయిన నా అనుభూతులను చాలావరకూ వెతికి తెచ్చి నన్నే నాకు కొత్తగా పరిచయం చేసింది. ఇవాళ్టికి ఈ పయనానికి రెండేళ్ళు..!
ఈ రెండేళ్ళలో మామూలుగా అయితే ఎంతో కొంత భారంగా గడవాల్సిన సమయాలు బ్లాగ్ మూలంగా త్వరగా, కాస్తంత తేలికగా గడిచిపోయాయి అనటం అతిశయోక్తి కాదు. ఇష్టమైన విషయాలను గురించి రాసే ప్రతి టపా మనసుని ఎంతో హాయిలో ముంచుతుంది. అదే హాయి ఒడిదొడుకుల జీవితాన్ని అలవోకగా గడిపేయటానికి శక్తినిచ్చింది. బ్లాగింగ్ ఒక వ్యసనం అంటారు అందరూ. కానీ ఇదొక "ఆటవిడుపు" అంటాను నేను. మొదట్లో ఏది రాస్తే చదువుతారు? అని ఉండేది. అప్పుడు "ఎవరన్నా చదువుతారో లేదో, వ్యాఖ్యలు రాస్తారో లేదో" అన్న ధ్యాసే ఉండేది. కాని నెమ్మదిగా "ఏది రాస్తే నాకు తృప్తి?" అనే ఆలోచన మొదలైంది. నా సంతృప్తి కోసం నేను రాసుకోవటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత "ఏది రాస్తే ఉపయోగకరం?" అనే ఆలోచన మొదలైంది. మన తర్వాత కూడా మన రాతలు నిలిచిపోయే ఈ అంతర్జాల ప్రపంచంలో ఎప్పుడెవరు చూసినా "ఇది ఉపయోగకరం అనో, బావుంది అనో, ఉత్సాహాన్ని నింపింది అనో.. అనుకోవాలి" అనిపిస్తోంది ఈ మధ్యన.
నిజం చెప్పాలంటే బ్లాగింగ్ నాకు ఇచ్చిన ఆనందం తక్కువ, నేర్పిన పాఠాలు ఎక్కువ. ఎంతో కష్టపడి ఇష్టంగా రాసిన టపాలకు స్పందన లభించనప్పుడు కోపం వచ్చేది. నావల్ల కాదని బ్లాగింగ్ మానేసి పారిపోదామనిపించేది. కానీ దేనికైనా పారిపోవటం పరిష్కారం కాదు కదా. "ఇప్పుడు వ్యాఖ్యలు రాకపోతే నష్టం ఏమిటి? ఎవ్వరూ చూడరు. పోనీ మానెయ్యమను. రాయదల్చుకున్నది రాసుకుంటూ ఫో. ఇప్పుడు కాకపోయినా ఎవరో ఒకరికి ఏదో రిఫరెన్స్ అవసరం అయితే అప్పుడు నువ్వు రాసింది పనికిరావచ్చు కదా. రాయటం అనేది తృప్తినిస్తున్నప్పుడు, మరేమీ చెయ్యలేనప్పుడు.. ఇదైనా చేసుకుంటూ పోవటమే " అని సమాధానపరుచుకున్నా. " ऎ हॊंसला कैसॆ झुकॆ..ऎ आर्जू कैसॆ रुकॆ...मंजिल मुष्किल तो क्या.. बुंद्ला साहिल तो क्या.." అని పాడుకుంటూ రాసేసుకోవటం మొదలుపెట్టా.
చాలా రోజుల తర్వాత ఈ మధ్యన నా బ్లాగ్ చూసిన అన్నయ్య అడిగాడు "ఏంటి దేనికోసం వెతుకుతున్నావో అది దొరికేసిందా?" అని. అవునని నవ్వాను. ఎవరైనా గమనించారో లేదో మరి..అదివరకూ "తృష్ణ... a woman's search for identity" అని ఉండేది. ఈ మధ్యనే "తృష్ణ ... జీవితాన్ని ప్రతిక్షణం జీవించాలని" అని మారిపోయింది. నేను బజ్ మొదలెట్టినప్పుడు బజ్ కి కేప్షన్ పెట్టి అదే బావుందని బ్లాగ్ కు కూడా పెట్టేసా. ఇప్పుడు ఇక నాకు ఏ ప్రశ్నలూ లేవు. ఏ వెతుకులాట లేదు. నిన్న లేదు. రేపు లేదు. ఇవాళ..ఈ క్షణమే శాశ్వతం. అంతే. జీవితాన్ని ప్రతి క్షణం జీవించటం ఒక్కటే నేను ప్రతినిత్యం చేసేది. ఇది ఈమధ్య కాలంలో నేను అలవర్చుకున్న సత్యం.
చివరిగా ఒక చిన్న కోరిక... నా బ్లాగ్ చాలా మంది చదువుతామని చెప్తారు. కానీ అలా అప్పుడప్పుడు చదివేవాళ్ళు, కొంత కాలం నుంచీ చదివేవాళ్ళు కాకుండా మొదటి నుంచీ అంటే కూడలికి లంకె వేసిన దగ్గర నుంచీ నా అన్ని టపాలూ మొదటి నుండీ ఇప్పటికీ మానకుండా చదివేవాళ్ళు ఒక్కరైనా అని నాకు సందేహం. మొదటినుంచీ కాకపోయినా కొంత కాలం నుంచీ చదువుతున్నా మొత్తం నా నాలుగు బ్లాగులు చదివేవాళ్ళు, నా అన్ని టపాలూ మొదటి నుండీ ఇప్పటి వరకు పాతవన్నీ చదివినవాళ్ళు ఒక్కరైనా ఉన్నారేమో చెప్తారా ? అలా ఒక్కరున్నా నా అక్షరాలకు ప్రాణం ఉన్నట్లే.
31 comments:
మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు
మీకు అభినందనలు త్రుష్ణ గారూ, మీవి చాలా టపాలు చదివాను నేను. చాలా బాగా రాస్తారు మీరు
మీ ఈ పయనం నిరంతరంగా సాగాలని కోరుకుంటూ
అయితే మీ బ్లాగ్ రెండో పుట్టిన రోజన్నమాట. అన్నట్టు మీ మిగిలిన బ్లాగుల మొదటి పుట్టినరోజు కూడా దగ్గరలోనే ఉన్నట్టుంది కదా. ఇంక తృష్ణ బ్లాగ్ విషయానికొస్తే రెండేళ్లలో 503 పోస్టులు. ఏం రన్ రేట్ మెయింటెయిన్ చేస్తున్నారండీ బాబూ!!!!! గ్రేటో గ్రేటు. ఇక మీ పోస్టులలో నేను ఇప్పటి వరకు చదివిన వాటిలో నాకు బాగా నచ్చిన పోస్టులుగా టాప్ త్రీ రేటింగ్స్ ఇవ్వమంటే
1. రావుడు నుంచి "రామం" వరకు ...నాన్న కథ (మొత్తం సీరీస్) తో పాటు "నాన్న" విభాగం లో పోస్టులన్నీ
ఈ సీరీస్ చదివినప్పుడల్లా మీ నాన్న గారి మీద విపరీతమయిన అసూయ. రేప్పొద్దున్న నాకూతురు కూడా నన్ను ఇంతగా ప్రేమించాలి అన్న ఆశ. మీ నాన్న గారి మీద మీకున్న అభిమానం నాకు చా........లా నచ్చింది.
2. జ్ఞాపకాల పూలు
3. వెన్నెల్లో వాకింగ్
(ఇంకా మీ బ్లాగు పూర్తిగా చదవడం పూర్తవలేదు కాబట్టి రెండు, మూడు స్థానాలలో ఉన్న పోస్టులు భవిష్యత్ లో మారచ్చు)
అన్నట్టు మీ పోస్టుల్లో నాకు అస్సలు నచ్చనివి మీరు "గడ్డీగాదం" తో చేసే ప్రయోగాలు :).
సారీ సారీ 503 కాదు 347. ఇందాకా స్వాతి తో ఫోన్ లో మాట్లాడుతూ తనేదో ఫోన్ నెంబర్ చెప్తూంటే నేను అది వింటూ టైపు చేయడం వలన పొరపాటు. పోస్ట్ చేశాక గుర్తొచ్చింది 503 అని ఇక్కడ టైపు చేశానని. అయినా పోయింది లేదు లెండి. ఈ ఏడాదిలో ఆ నంబర్ రీచ్ అయిపోతే మూడో పుట్టిన రోజుకి లెక్క సరిపోతుంది. :)
తృష్ణ,, మీ బ్లాగులో, బజ్జులో అన్నీ చదువుతాను కాని అన్నీ కామెంటను. మీరన్న ఈ మాట నేను కూడా ఈ మధ్యే అంటే బ్లాగుల్లోకి వచ్చినతర్వాతే తెలుసుకున్నాను. పాటిస్తున్నాను కూడా..
నిన్న లేదు. రేపు లేదు. ఇవాళ..ఈ క్షణమే శాశ్వతం. అంతే. జీవితాన్ని ప్రతి క్షణం జీవించటం
బ్లాగ్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
హార్థిక అభినందనలండీ. ఇలాంటి మైలు రాళ్ళు ఇంకా ఎన్నో దాటాలని కోరుకుంటూ
రామకృష్ణ
బ్లాగ్లో పెట్టలేకపోయానని క్రాంతిగారు నా బజ్ లో పెట్టిన వ్యాఖ్య:
kranti ch - Couldnt comment on your blog... I guess blogger's issue...
>>ఏ వెతుకులాట లేదు. నిన్న లేదు. రేపు లేదు. ఇవాళ..ఈ క్షణమే శాశ్వతం. అంతే. జీవితాన్ని ప్రతి క్షణం జీవించటం ఒక్కటే నేను ప్రతినిత్యం చేసేది. ఇది ఈమధ్య కాలంలో నేను అలవర్చుకున్న సత్యం
Yes.. True... :)
>>నా అన్ని టపాలూ మొదటి నుండీ ఇప్పటి వరకు పాతవన్నీ చదివినవాళ్ళు
మీ బ్లాగు మొదటినుండి చదువుతూనే ఉన్నాను.. కాకపోతే మధ్యలో పని ఒత్తిడి వల్ల కూడలి చూడకపోవడం వల్ల కొన్ని మిస్స్ అయ్యి ఉండచ్చు.. కూడలి ఓపెన్ చేస్తే, మీ టపా ఉంటే మాత్రం తప్పకుండా చదువుతాను .. :) 8:39 pm
అన్నీ అనను కాని... కొన్ని కొన్ని మీ టపాలు చదువుతుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంటుంది.
ఎవరు ఎన్ని చదివారని చూసుకోకుండా, మీరనుకున్నట్టుగానే ఆ క్షణం కోసం.. దాని వల్ల వచ్చే ఆనందం కోసం రాయండి.
మీ భావాలు మరింత లోతుగా వెళ్ళి, ఇంత స్పష్టంగానూ తెలపాలని కోరుకుంటూ...
రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలరో...
శ్రీలలిత...
తృష్ణ గారూ !
మీకు, మీ బ్లాగుకి హృదయపూర్వక ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు భవిస్యత్తులో మరిన్ని మైలురాళ్ళు దాటాలని, మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
అభినందనలు తృష్ణగారు, మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు :-)
నేను తరచుగా చదివే బ్లాగుల్లో మీదీ ఒకటండీ.. అన్ని టపాలు చదివాను అని చెప్పలేను కానీ మీ అన్నిబ్లాగుల్లోనూ కలిపి ఒక తొంభైశాతం టపాలు చదివి ఉంటాను. మీరు నాకు కొంచెం ఆలస్యంగా పరిచయం అవడం వలన మొదట్లో రాసిన టపాలు మిస్ అయ్యాను. ఎప్పటికప్పుడే చదవాలి అనుకుంటాను కానీ అన్నీ చదవడం ఇంకా కుదరలేదు.
తృష్ణ గారు,
నేనున్నాను. మీ పోస్ట్లన్నీచదివిన వాడిని, చదువుతున్న వాడిని. నేను ఈ జనవరి నుండి బ్లాగ్ లు చదవడం మొదలెట్టాను. చదవడం స్టార్ట్ చేసిందే మీ బ్లాగ్ తో.. గత నెలలో మీ అన్నీ పోస్ట్ లు పూర్తి చేసాను. ముఖస్తుతి కాదు కానీ మీ బ్లాగ్, శరత్కాలం గారి బ్లాగ్, బావకుడన్ గారి బ్లాగ్, ప్రవీణ గారి బ్లాగ్ లు చదవడం నాకు బాగా ఇష్టం. నేను నా తిసిస్ రాసేప్పుడు మీ బ్లాగ్స్ తోనే బ్రేక్ లు తీసుకునే వాడిని.. కామెంటాలంటే మొదట్లో కాస్త బయమేసిది కూడా..ఏమనుకుంటారో అని. మీ బ్లాగ్ ల నుండే వేరే బ్లాగ్ ల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసాను. నేను కూడా ఒక బ్లాగ్ స్టార్ట్ చేసాను. నాకైతే మీ బ్లాగ్ చాలా ఇష్టం అండి. బెజవాడ లో పిన్ని ఈమధ్యే నెట్ కనెక్షన్ తీసుకుంది.. తనకి కూడా చెప్పను..చదవమని..అంత అనచ్చింది నాకు.
మీరు ఆ స్టేటస్ మార్చడం నేను గమనించానండి. ఈ స్టేటస్ నాకు చాలా ఇష్టమండి..కైకలూరులో ఉండేప్పుడు ఒక పెద్దాయన చెప్పాడు నాకు. చాలా నచ్చింది. అప్పటినుండి పాటిస్తున్న..
మొత్తానికి..మీకు కంగ్రాట్స్ అండి. ఇలానే రాస్తూ వుండండి, చదివి మేము ఆనందిస్తూ ఉంటాము..
తృష్ణ గారూ, మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు. "బ్లాగ్ వ్యసనం కాదు ఆటవిడుపు"-నిజమేనండీ...
ఇన్ని అవిడియాలు ఎలా వస్తాయండీ పోస్టులు వ్రాయడానికీ...?? ప్లీస్ ప్లీస్ నాకూ చెప్పరూ!
మీ బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు శుభాభినందనలు.
నిజం చెప్పాలంటే గత 3-4 నెలల నించి మాత్రమే మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతున్నాను. రెగ్యులర్ గా చదువుతున్నాను అంటే నచ్చింది అని వేరే చెప్పఖ్ఖర్లేదు కదా.
మీరు అనుకున్నది సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.
abhinandanalu trushna garu.
అభినందనలు.. నేను మీ బ్లాగులో అక్కడక్కడా కొన్ని మిస్సయి ఉండొచ్చు కానీ, ఖచ్చితంగా మూడొంతులైనా చదివుంటాను. అంతే కాదు, అవన్నీ నాకు గుర్తున్నాయి కూడా.. అంటే అంతగా నచ్చాయనేగా అర్థం! ;) రాస్తూ ఉండండి.. :)
మీ పాండా పోస్టు చుస్తూ ఇక్కడికి వచ్చాను...వీకెండ్ మెస్ వల్ల మీ ఈ పోస్టు మిస్సు అయ్యాను...మీ అక్షరాలకి ప్రాణం ఉన్నట్టే..మీరు నిశ్చింతగా ఉండండి..
మీ బ్లాగులను క్రమం తప్పకుండా అని అనను కాని సమయం దొరికినప్పుడల్లా చదువుతూ ఒకటి అరా మిస్ అయితే మళ్ళి వెనక్కి వెళ్ళి చదువుతుంటా...మీ రుచి బ్లాగుకైతే నేను వీరాభిమనిని..ఎంతో ఓపికగా చిన్న చిన్న essentials miss అవకుండా భలే చేస్తారు ..అలానే రాస్తారు..మీ బ్లాగు ఇలా త్రి , చతుర్ , పంచ ,....ఎన్నో వసంతాలు జరుపుకోవాలని ఆఆశిస్తూ..
మీ పాండా పోస్టు చుస్తూ ఇక్కడికి వచ్చాను...వీకెండ్ మెస్ వల్ల మీ ఈ పోస్టు మిస్సు అయ్యాను...మీ అక్షరాలకి ప్రాణం ఉన్నట్టే..మీరు నిశ్చింతగా ఉండండి..
మీ బ్లాగులను క్రమం తప్పకుండా అని అనను కాని సమయం దొరికినప్పుడల్లా చదువుతూ ఒకటి అరా మిస్ అయితే మళ్ళి వెనక్కి వెళ్ళి చదువుతుంటా...మీ రుచి బ్లాగుకైతే నేను వీరాభిమనిని..ఎంతో ఓపికగా చిన్న చిన్న essentials miss అవకుండా భలే చేస్తారు ..అలానే రాస్తారు..మీ బ్లాగు ఇలా త్రి , చతుర్ , పంచ ,....ఎన్నో వసంతాలు జరుపుకోవాలని ఆఆశిస్తూ..
Congrats Trishna. Please keep it up. I wish you all the best.
తృష్ణ గారు,
మీకు శుభాకాంక్షలు! మీరు రాసే విషయాలు చదవటం గత మూడు నాలుగు నెలలు గా బాగా అలవాటై కూర్చుంది. మీరు ఇలాగే రాస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను...
congratulations....మీ బ్లాగు నేను పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడూ చదువుతూ ఉంటాను. మీ నాలుగు బ్లాగులు ఓమారు తిరగేస్తూ ఉంటాను. చదివిన ప్రతీసారీ కామెంటు తప్పకుండా పెడతాను. మీ నాలుగు బ్లాగులో నా కామెంట్లు కచ్చితంగా ఉంటాయి...కావాలంటే వెతకండి.:)
congratulations..
అభినందనలండి. మీ బ్లాగ్ తరచుగా చదువుతుంటాను.
మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు
కొంచెం లేట్ గా చెప్తే ఎక్కువ గురుతుంటానుగా మరి నేను :)
తృష్ణగారు....నేను మీ బ్లాగుపట్ల ఆకర్షితమైంది మీ మొక్కల మీద ప్రేమ వల్ల....అలాగే మీరు చేసే రకరకాల వంటలు..ఇంకా మీరు పెట్టే పాటలు! ఇవి నేను ఎక్కువగా మీ బ్లాగులో ఇష్టపడింది.అన్నిటినీ మించి నాకు బాగా నచ్చింది మీ నాన్నగారిమీద మీరు వ్రాసిన ధారావాహిక! అసలు అది చదివితే ఒక్కొసారి అలాగే ఉండిపోయేదాన్ని....నాకు మా నాన్న గ్నాపకం వచ్చి!! నాకు అప్పటినించి మీరంటే చాలా ఇష్టం!
నేను తెలుగుబ్లాగులు చూస్తోందే ఒక పదినెలలనించి....అప్పటిదాకా అసలు నాకు తెలుగు బ్లాగుల ఊసే తెలీదు! అందువల్ల మీ అన్ని టపాలు చదవక పోవచ్చు....కాని మీరు నాకు తెలిసిన దగ్గరనించి అన్ని టపాలు చదువుతాను! మీ అన్నిబ్లాగులలోవి! కాని కొన్నిసార్లు కామెంటకపోవచ్చు! 99.99% కామెంట్ పెడదామని ఉన్నా....లేఖిని పనిచేయకో...ఏదన్న పని ఉండో కుదరకపోవచ్చు!! కానీ మీ టప పడిందంటే...తప్పక చదువుతా :)
మీ బ్లాగుకి హాప్పి హాప్పి బర్త్ డే! :)
@లత: మీ ప్రోత్సాహమే నాకు ఉత్సాహమండి. ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: అన్ని పుట్టినరోజులు ఏం చేస్కుంటాను...ఒక్కటి చాలు లెండి..:)
మీ రేటింగ్ బావుంది కానీ మీరన్నట్టు అన్ని చదివితే ఈ పేర్లు మారిపోతాయి. ఖచ్చితంగా. నాకు నచ్చిన నా పాత టపాలు అని కూడా ఏ టపా పెడతానుండండి.
రోజూ వ్యాఖ్య రాసి ప్రోత్సాహాన్నిస్తుంన్నందుకు కృతజ్ఞతలు.
@జ్యోతి:
@మూర్తి:
@క్రాంతి:
@శ్రీలలిత:
@ఎస్.ఆర్.రావు:
@వేణూ శ్రీకాంత్:
మీ అందరికీ చాలా థాంక్స్ అండీ.
prabandh chowdary.pudota:మీరొక్కరు ఉన్నారన్నమాట. చాలా థాంక్స్ అండి. టాగ్ మార్చటమ్ కూడా చూశారన్నమాట. ఇలానే చదువుతూ ఉండండీ...:)పని వత్తిడిలో వ్యాఖ్యలు రాయరు కానీ ఇంకొందరు నా స్నేహితులు(బ్లాగుల్లేనివాళ్ళు) కూడా ఉన్నారండి.
@ఎన్నెల: ఏమోనండి..ఇంకా ఇంకా రాయాలనే ఉంటుంది. ఎవరూ చదవరని రాయట్లేదంతే.::))
@బులుసు సుబ్రహ్మణ్యం: చాలా సంతోషం అండి.
@సుధీర,
@మధుర
@,నైమిష్,
@జయ,
@ఆ.సౌమ్య,
@గిరీష్,
@నేస్తం:(అంతే అంతే)
@శిశిర:
అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
ఇందు: శరన్నవరాత్రులలో మీరు రాసినది నేను చదివిన మీ మొదటి టపా.అప్పటి నుండీ మీ బ్లాగ్ కూడా నేను మిస్సవకుండా చదువుతున్నాను. చాలా బాగా రాస్తున్నారు. రాస్తుండండి. ధన్యవాదాలు.
మొత్తం కాకపోయినా కొన్ని నెలలుగా అయినా ఇందరు నా బ్లాగ్ రెగులర్గా చదువుతున్నందుకు చాలా సంతోషం కలిగింది. నా బ్లాగ్ చదువుతున్న నా స్నేహితులందరికీ (వ్యాఖ్యలు రాయనివారికీ) కూడా బ్లాగ్ముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
Chala rojula taruvata teerika ga anee chaduvutoo vunnanu ammayi
@లక్ష్మీ రాఘవ: చాల సంతోషమండీ.. మీరూ చాలా రోజులకు కనబడ్డారు. కులాసా అని తలుస్తాను.
Post a Comment