(బ్లాగర్ ప్రాబ్లం వల్ల ఈ టపా మొన్న పెట్టిన కాసేపుకి డిలీట్ అయిపోయింది. ఆ కాసేపులో వచ్చిన నాలుగు వ్యాఖ్యలు కూడా డిలీట్ అయిపీఓయాయి. అందుకని ఈసారి ఫోటోతో పెడుతున్నాను...:))
పట్టుమని పది మావిడికాయలతో ఈసారి ఆరు రకాలు:
వెల్లుల్లి ఆవకాయ
నూపప్పు ఆవకాయ
పెసర ఆవకాయ
అల్లం ఆవకాయ
మాగాయ
తురుము మాగాయ !!
(ఇది 12thన రాసినది..:))
పొద్దున్నుంచీ బయటకు వెళ్ళి వచ్చి, వెళ్ళి వచ్చీ, వెళ్ళి వచ్చీ...
డాబాపై ముక్కలు పెట్టి..మళ్ళీ తీసుకువచ్చి..
కారం, ఉప్పు , ఆవ కొలుచుకుని
పెసరపొడి జల్లించి
మెంతులు, ఆవాలు వేయించి.. చల్లర్చి
ఇంగువ నూనె కాచి
ఒక్కొక్కటీ కలిపి...
అన్నీ మూతలు పెట్టి
గోడకి జారలబడి
ఎందుకో ఈ ఊరగాయలు పెట్టడం?
దండిగా తింటే పడేనా?
అసలివన్నీ అరోగ్యానికి ఏం మంచి చేస్తాయని?
పక్షానికో నేలకో ఓసారి నాలిక్కి రాసుకోటానికి
ఇన్ని తంటాలు అవసరమా?
కూర్చున్న చోట్నుంచి లేచాకా ఫోన్ దగ్గరకు పరుగు
అమ్మకి, అన్నయ్యకీ డప్పు కొట్టడానికి
'ఉరేయ్ నేనూరగాయలు పెట్టేసానోచ్' !!
'సాంపిల్ ఎప్పుడు తెస్తావు' అని వాడు..
'నన్నడిగితే పెట్టివ్వనా? ఎందుకన్ని తంటాలు పడటం?' అని అమ్మ...
అంటూంటే
'మరి నా సరదా తీరేదెలా?' అని నేను.
'అమ్మా, మెంతికాయ ఎలా చెయ్యాలో చెప్పవే
మళ్ళీ ఏడు చేస్తాను...'!
...దీన్ని 'ఊరగాయ వైరాగ్యం' అంటారు !!
__________________________________
జయగారు, మీరు శ్రమ తీసుకుని మళ్ళీ వ్యాఖ్య రాసినా ఇలా రెండవసారి టపా పెట్టటం వల్ల అది కూడా పోయింది...ఏమీ అనుకోవద్దండీ..! ఒకటో రెండో కాక, ఇన్నిరకాలు పెట్టడం ఇదే మొదటిసారి నాకూనూ. అన్నీరకాలు కూడా బాగా కుదిరాయి. టేస్ట్ చేసినవాళ్ళందరూ బాగుందనే అన్నారు !!
8 comments:
ఫోటో చూస్తుంటే నోరూరుతుంది.
దిష్టి తగులుతుంది , గుప్పెడు ఉప్పు, గుప్పెడు ఆవపిండి, గుప్పెడు కారం తిప్పి పారేయండి (జాడీల్లో కాదు బయట)
పది మామిడి కాయలతో ఇన్ని రకాలా? మీరు మరీ నాలుక కు రాసుకోవటం కోసమే పట్టినట్లు వున్నారే. మొన్న మా అమ్మ కు విపరీతం గా సాయం చేసి ఇక్కడ కూడా నేను ఒక పది కాయలతో పచ్చడి పట్టేను. ఒకటే రకం వెల్లుల్లి ఆవకాయ. అదే నాకు నాలుగు నెలలు కూడా రాదు. :-(
బాగుంది తృష్ణ మీ పచ్చడి.
నిన్న మీ పోస్ట్ చూసి...తెగ నోరూరిపోయిన్దండి. చాలా రోజుల క్రితం ఫ్రిడ్జ్ లో స్టోరే చేసిన పచ్చడి గుర్తొచ్చి..రూం కి వెళ్ళాకా వేడి వేడి అన్నం, పచ్చడి, నెయ్యి వేసుకొని కుమ్మేసానండి.
@శ్రీ: :) థాంక్స్ అండి.
@ఆత్రేయ: అంతే అంటారా? అలాగే చేస్తా.. ధన్యవాదాలు.
@జయ: మొత్తానికి మీ నవ్వు ప్రచురించేసానండీ..:)
ధన్యవాదాలు.
@భావన: ఇదేమిటీ క్రితం ఏడాది అసలు ఏ ఊరగాయా పెట్టనే లేదు. వాళ్ళు వీళ్ళు ఇచ్చినదానితోనే లాగించేసాం. మా అత్తగారింట్లో పెద్ద ఎత్తునే పెడతారు. మా అమ్మగారింట్లో చాలా తక్కువేనండి తినటం. పెట్టాలనే సరదా కొద్దీ ఇదైనా పెట్టడం కానీ పచ్చళ్ళు తినటం పూర్తిగా మానేసామండి. మాదంతా చాలావరకూ సత్విక భోజనమే. ఎవరైనా వస్తే మాత్రం పాపం కాస్త ఉప్పుకారాలు వేసే పెడతాలెండి..:)
@ప్రబంధ్ చౌదరీ.పూదోట: నావల్ల మీ ఫ్రిజ్ లోని పచ్చడికి మోక్షం వచ్చిందన్నమాట పాపం !
abbaa meeku bhale Opika....pachchallu pettinanduku+manchi post wraasinanduku+delete ayina post mallee wraasinanduku+photolu pettinanduku+inni rakaala aavakaayala gurinchi cheppinanduku+oka bottle naaku pampinanduku(chivaridi okkatee advance gaa annamaata)
@ennela:ఏదో మీవంటి అభిమానులిచ్చే బలం..అంతే. ధన్యవాదాలు.
Post a Comment