సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 4, 2011

మామ్మయ్య - ఊరగాయలు !


 
మా మామ్మయ్య(నాన్నమ్మ) పెట్టే ఊరగాయల గురించి చెప్పేముందు ఆవిడ పాకప్రావీణ్యం గురించి కొంచెం చెప్పాలి. ఆవిడ చేతిలో అద్భుతం ఉండేది. ఏది వండినా రుచి అమోఘమే. ఆవిడ అత్తారింట్లో ప్రతిరోజూ పాతిక మందికి తక్కువకాకుండా వండేదిట. అది కూడా మడి వంట. ఇక పండగలు తద్దినాలు వస్తే వంటింట్లోనే మకాం. ఆవిడ కొబ్బరి పచ్చడి రుబ్బుతూంటే రోట్లో ఉండగానే సగం పచ్చడి అయిపోయేదిట.(అలా తినేసేవారట అటుగా వచ్చినవాళ్ళు). పనసపొట్టు కూర లెఖ్ఖగా వండినా సరే సగం మంది తినేసరికీ అయిపోయేదిట.

ఆవిడ ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు చేతనైనంతగా మాకు వండిపెట్టింది. వేసవిశెలవులకు వెళ్ళేసరికీ రేగొడియాలు, బంగాళాదుంప చిప్స్, సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు, జంతికలు,చెక్కలు,పంచదారపూరీలు మొదలైనవన్నీ మా కోసం రెడీగా ఉండేవి. రోజంతా మిల్లాడిస్తూ ఉండండి అని మా మావయ్య జోక్ చేసేవాడు. ఇదంతా మామ్మయ్య పాకప్రావీణ్యం గురించి చెప్పటానికే. ఇక వేసవిలో ఊరగాయల సంగతికొస్తే ఆ రకం పెట్టినా అన్నీ సమపాళ్ళలో కుదిరేవి. ఆవీడ పెట్టినన్ని ఊరగాయల రకాలన్నీ తినగలగటం మా పిల్లల అదృష్టం.


కాకినాడలో మా ఇంట్లోని వంటింట్లో ఓ మెష్ డోర్ ఉన్న గూడు ఉండేది. దాన్నిండా చిన్నవి, పెద్దవి రకరకల సైజుల్లో జాడీలు ఓ ముఫ్ఫై పైనే ఉండేవి. ఆ జాడీల ఆకారాలు కూడా రకరకాలుగా ముద్దుగా ఉండేవి. గుర్తు కోసం నేనో రెండు జాడిలు తెచ్చుకున్నాను కూడా. మాకు నెల నెలా సామర్లకోట నుండి పప్పు నూనె తెచ్చే ఆదినారాయణ ఊరగాయలు పెట్టే సమయానికి సైకిలు మీద ఫ్రెష్ పప్పు నూనెతో వచ్చేసేవాడు. మా పిన్నివాళ్ల అత్తగారు అయితే ఊరగాయలకు మావిడికాయలు చెట్టు నుండి దగ్గరుండి మరి కోయించుకునేవారు మొన్నమొన్నటిదాకా. పప్పునూనె కూడా గానుగలో దగ్గరుండి ఆడించుకునేవారు.


ఇక నాన్న ఆవకాయలకు ముక్కలు కొట్టేవారు. ఇంట్లోని మహిళలేమో మాగయకు తరిగగేసేవారు. అటు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నా రానిచ్చేవారు కాదు. మాగయ ముక్కలు తరగటానికి చిల్లు పెట్టిన ఒక ఆల్చిప్ప ఉండేది. దాంతో మావిడికాయను చెక్కితే మాగాయకు ముక్కలు వచ్చేవి.(ఇప్పటి పీలర్ లాగన్నమాట). పెరట్లోనేమో పనమ్మాయి లక్ష్మి తాలూకూ కొందరు ఆడవాళ్ళు వచ్చి కారం కొట్టేవారు. ఆ రోకళ్ళ చప్పుడు భలేగా ఉండేది. అటువైపు అసలు వెళ్లనిచ్చేవారు కాదు ఘాటుకి తుమ్ములు వస్తాయని. వెల్లుల్లిపాయలు కూడా వాళ్ళే వొలుచుకునేవారు.



ఇక మా మామ్మయ్య పెట్టే ఆవకాయ రకాలు ఏమిటంటే:

1) వెల్లుల్లి ఆవకాయ
2)ఉత్తి ఆవకాయ (వెల్లుల్లి తిననివాళ్ళ కోసం)
3)పులిహార ఆవకాయ (కావాల్సినప్పుడల్లా కాస్తంత తీసుకుని పులిహోర పోపు పెట్టుకుంటారు)
4)అల్లం ఆవకాయ (దీంట్లో అవపిండి ఉండదు)
4)పచ్చావకాయ (పచ్చ మెరపకాయలతో పెడతారు)
5)పెసర ఆవకాయ (దీంట్లో అవపిండి బదులు పెసరపిండి వాడతారు)
6)బెల్లం ఆవకాయ
7)సన్న ఆవాల ఆవకాయ (ప్రత్యేకం సన్న ఆవపిండితో పెడతారు.ఘాటు ఎక్కువగా ఉంటుంది)
8)శనగల ఆవకాయ (ఎండిన శనగలు వెస్తారు. కొన్నాళ్ళకు అవి ఊరి తినటానికి బావుంటాయి)
9)నువ్వుపిండి ఆవకాయ(దీంట్లోనూ అవపిండి బదులు నువ్వుపిండి వాడతారు)
10)మావిడి పిందెలతో అవకాయ (కేరళావాళ్ళు ఎక్కువ చేస్తారు దీన్ని)

మాగాయ రకాలు:
1)నూనె మాగాయ
2) తొక్కు మాగాయ
3) ఎండు మాగాయ
4)తురుము మాగాయ/ కోరు మాగాయ
5)ఉల్లిమాగాయ(వెల్లుల్లి తో)

ఇవి కాక మెంతిపిండి ఎక్కువ వేసి చేసే
* మెంతికాయ
* చెంప మెంతికాయ ఆవిడ స్పెషల్స్.


ప్రతి ఏడాదీ ఈ రకాలన్నీ చెయ్యకపోయినా ఒకో ఏడూ వీటిలో సగం పైనే కవర్ చేసేది మామ్మయ్య. నెమ్మది నెమ్మదిగా ఓపిక తరిగేకొద్దీ రకాలూ తగ్గి రెండు,మూడు రకాలు మాత్రమే పెట్టే స్టేజ్ కి వచ్చేసింది చివరిరోజుల్లో.


మా ఇంట్లో ఆవకాయ తినటం తక్కువవటం వల్ల అమ్మ ఎప్పుడు ఇన్ని రకాలు ప్రయత్నించలేదు. ఇప్పుడిక డాక్టర్లు ఊరగాయలు తినద్దంటున్నారని అసలు పెద్ద ఎత్తున ప్రయత్నాలే లేవు. ఏదో శాస్త్రానికి నాలుగైదు రకాలు పెడుతోంది మా పిల్లల కోసం. మేము కూడా డైట్ కంట్రోల్, ఆయిల్ ఫ్రీ ఫుడ్ అంటూ చాలావరకూ ఊరగాయలకు దూరంగా ఉండిపోతున్నాం. తిన్నా తినకపోయినా ఊరగాయ పెట్టాలనే సరదా కొద్దీ నేనే నాలుగైదు రకాలు కాస్త కాస్త చప్పున పెడ్తూ ఉంటాను.

7 comments:

మనసు పలికే said...

అమ్మో.. ఊరగాయల్లో/మాగాయల్లో ఇన్ని రకాలు ఉన్నాయని నాకిప్పుడే తెలిసింది. నాకు తెలిసిన కొన్ని పచ్చళ్ల పేరు చూడగానే నోరు ఊరిపోతుంది తృష్ణ గారూ..;)
మీరు నిజంగా అదృష్టవంతులు, అన్ని రకాల ఊరగాల్ని అన్ని సంవత్సరాలు తిన్నందుకు. అదంతా మీ నాన్నమ్మ గారి చలవే కాబట్టి క్రెడిట్ గోస్ టు హర్ కదా..:)

కృష్ణప్రియ said...

చెంప మెంతికాయ పేరు మాత్రం వినలేదు.. మా ఇంట్లో ..
తూర్పావకాయ (పూర్తి కాయ కి గాటు పెట్టి పచ్చకారం కూరి), బెల్లపావకాయ, నువ్వుపిండావకాయ, అని ఒకటి, పులిహారావకాయ, నీళ్ళావకాయ, లాంటివి చేసేవారు.. తలచుకుంటుంటేనే నాకు తెగ నోరూరిపోతుంది.

Tejaswi said...

టెంప్టింగ్ టే(పో)స్ట్

SHANKAR.S said...

" పనసపొట్టు కూర లెఖ్ఖగా వండినా సరే సగం మంది తినేసరికీ అయిపోయేదిట."
మోండా మార్కెట్ లో మొదటి సారి పనసపొట్టు కొనుక్కొచ్చి స్వాతి కిచ్చి చేయమన్నప్పుడు "పనసపొట్టుతో కూర చేస్తారా?" అని అడిగి నా గుండెల్లో గ్రానైట్లు పేల్చిన విషయం గుర్తొచ్చింది. తర్వాత పాపం నేర్చుకుందనుకోండి. మా నాయనమ్మ చేసిన స్టైల్ మాత్రం అనితర సాధ్యం.

"ఆవిడ ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు చేతనైనంతగా మాకు వండిపెట్టింది. వేసవిశెలవులకు వెళ్ళేసరికీ రేగొడియాలు, బంగాళాదుంప చిప్స్, సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు, జంతికలు,చెక్కలు,పంచదారపూరీలు మొదలైనవన్నీ మా కోసం రెడీగా ఉండేవి."

ప్లేటు నిండా చేగోడీలు పెట్టుకుని పెరట్లో కొబ్బరిచెట్టు కింద సిమెంటు చప్టా మీద చాప వేసుకుని విష్ణు మూర్తి ఫోజులో చందమామ సంచికల బౌండ్ పుస్తకం చదువుతూ గడిపేసిన నా చిన్నప్పటి వేసవి శలవలు గుర్తొచ్చాయి.

"మాగయ ముక్కలు తరగటానికి చిల్లు పెట్టిన ఒక ఆల్చిప్ప ఉండేది."
నాకు గుర్తున్నంత వరకు ఆ చిల్లు షేప్ రాడానికి ఆల్చిప్పను గచ్చు మీద అరగదీసే వారు.

"తిన్నా తినకపోయినా ఊరగాయ పెట్టాలనే సరదా కొద్దీ నేనే నాలుగైదు రకాలు కాస్త కాస్త చప్పున పెడ్తూ ఉంటాను."
ఒకట్రెండు జాడీలు మా ఇంటికి పార్శిల్ ల్ ల్ ల్ ......ప్లీజ్ :)

నాగేస్రావ్ said...

బావున్నాయండీ మీఆవకాయూసులు, నోరూరింతలూ.
ఈలిస్టేనా, ఏమైనా రెసిపీలుకూడా రాయబోతున్నారా? ఒకటిరెండైనా ఇస్తే ట్రైచేసుకుంటాం.

Rao S Lakkaraju said...

ప్లేటు నిండా చేగోడీలు పెట్టుకుని పెరట్లో కొబ్బరిచెట్టు కింద సిమెంటు చప్టా మీద చాప వేసుకుని విష్ణు మూర్తి ఫోజులో చందమామ సంచికల బౌండ్ పుస్తకం చదువుతూ గడిపేసిన నా చిన్నప్పటి వేసవి శలవలు గుర్తొచ్చాయి.
----------
వావ్. ఇటువంటి బాల్య స్మ్రుతులన్నీ మనస్సు లో నుండి బయటికి వచ్చేటట్లు చేసిన తృష్ణ గారి పోస్ట్ కి శభాష్.

లత said...

బావున్నాయి మీ ఊరగాయ కబుర్లు.
ఇన్ని రకాలు కాదు గానీ నాకూ పచ్చళ్ళు పట్టడం సరదానే త్రుష్ణ గారూ