సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, January 23, 2010

ऐ मालिक तेरे बंदे हम...


భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో వి.శాంతారాం ఒకరు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లలో కూడా ఒకరు. ఆయన నిర్మించిన, నటించిన చాలా సినిమాలు చూసి ఆయన అభిమానిగా మారాను . అయన చిత్రాల్లో "దో అంఖే బారః హాత్" కూడా నాకెంతో ఇష్టమైన చిత్రాల్లో ఒకటి .

"ఓపెన్ ప్రిజన్" పరిశోధనల ఆధారంతో,గాంధీయ సిద్ధాంతాలతో తయారైన చిత్రం ఇది.ఒక జైలర్ కొందరు ఖైదీలని జైలుకి దూరంగా తీసుకువెళ్ళి వాళ్ళలో గొప్ప మార్పుని ఎలా తీసుకువచ్చాడన్నది ఈ చిత్ర కధాంశం. చాలా గొప్ప సినిమా. శాంతారామ్ చిత్రాలన్నింటిలో నాకు నచ్చిన సినిమా ఇది.ఈ చిత్రానికి బెర్లిన్ ఫిమ్ ఫెస్టివల్లో "సిల్వర్ బేర్" మరియు "గోల్డెన్ గ్లొబ్ అవార్డ్" కూడా వచ్చాయి. ఈ సినిమాలోని "ఏ మాలిక్ తేరే బందే హం.." నేను ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ వినే పాట.






Movie Name: Do Aankhen Bara Haath (1957)
Music Director: Vasant Desai
Lyrics: Bharat Vyas
singer: Lata

ऐ मालिक तेरे बंदे हम
ऐसे हो हमारे करम
नेकी पर चलें
और बदी से टलें
ताकि हंसते हुये निकले दम

जब झुल्मों का हो सामना
तब तू ही हमें थामना
वो बुराई करें
हम भलाई भरें
नहीं बदले की हो कामना
बढ चुके प्यार का हर कदम
और मिटे बैर का ये भरम
नेकी पर चलें ...

ये अंधेरा घना छा रहा
तेरा इनसान घबरा रहा
हो रहा बेखबर
कुछ न आता नज़र
सुख का सूरज छिपा जा रहा
है तेरी रोशनी में वो दम
जो अमावस को करदे पूनम
नेकी पर चलें ...

बडा कमझोर है आदमी
भी लाखों हैं इसमें कमीं
पर तू जो खडा
है दयालू बडा
तेरी कर कृपा से धरती थमी
दिया तूने जो हमको जनम
तू ही झेलेगा हम सबके गम
नेकी पर चलें ...

బ్లాగ్మిత్రులకు:

నా సిస్టం పాడయిపోవటం వల్ల వారం నుంచీ నేను బ్లాగ్ తెరవలేకపోయాను. కొద్దిగా ఆరోగ్యం కూడా సహకరించకపోవటంవల్ల టపాలు రాయటానికి వేరే ప్రయత్నాలు కూడా ఏమీ చేయలేకపోయాను. సిస్టం బాగు చేయిస్తే ఆరోగ్యం పట్ల అశ్రధ్ధ వహిస్తానని శ్రీవారు పి.సి.ని బజ్జోపెట్టే ఉంచేసారు :)

బ్లాగుల్లోని చాలా టపాలకు వ్యాఖ్యలు బాకీ ఉన్నానని ఇవాళ బ్లాగులు చూస్తే తెలిసింది....కానీ ప్రస్తుతానికి ఎవ్వరికీ వ్యాఖ్యలు రాయలేను...మిత్రులందరూ అన్యధా భావించద్దని మనవి.

ఆరోగ్యం పట్ల శ్రధ్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో ఈ బ్లాగ్లో కొన్నాళ్ళు పాటు రెగులర్గా టపాలు ఉండవు. ఏ మాత్రం వీలున్నా వారం పదిరోజులకు ఒక టపా అయినా రాయటానికి ప్రయత్నిస్తాను...ఇంతకాలం వ్యాఖ్యలు రాసి,నా బ్లాగ్ చదివి నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

Thursday, January 14, 2010

హాస్య బ్రహ్మగారి " చంటబ్బాయ్ "


"లిటిరేచర్" అధ్యయనం చేసేప్పుడు కామెడి లో రకాలు చెప్తూంటారు. Romantic comedy, Farce, Comedy of humours, comedy of manners, Satiric comedy, High comedy,Tragi-comedy అని బోలెడు రకాలు. హాస్యంలోని ఈ రకాలన్నింటినీ తెలుగు వెండితెరకు పరిచయం చేసిన ఘనత హాస్యబ్రహ్మ "జంధ్యాల" గారిది. ఇవాళ జనవరి 14న మనందరికీ "జంధ్యాల(14 Jan 1951 - 19 Jun2001)"గా తెలిసిన హస్యబ్రహ్మ "జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి"గారి పుట్టినరోజు.


హాస్య చిత్రాలకు ఒక ప్రత్యేక గుర్తింపు, తన సంభాషణలతో తెలుగు భాషలోనే గొప్ప మార్పు తెచ్చినవారు "జంధ్యాల" అనటం అతిశయోక్తి కాదేమో. "సుత్తి" అనే పదం మనందరి వాడుక భాషలో ఎంత సుస్థిరమైన స్థానం సంపాదించుకుందో వేరే చెప్పనక్కరలేదు. ఇలాంటి పదాలూ, పద ప్రయోగాలూ, మేనరిజమ్స్...ఆయన సినిమాల నిండా కోకొల్లలు. వాటిలో చాలామటుకు మన ప్రస్తుత భాషా ప్రయోగాల్లో కలిసిపోయినవనేకం. రెండు జెళ్ళ సీత, రెండు రెళ్ళు ఆరు, మొగుడు పెళ్ళాలు, చంటబ్బాయ్, పడమటి సంధ్యారాగం, అహ నా పెళ్ళంత, వివాహ భోజనంబు, హై హై నాయకా, జయమ్ము నిశ్చయమ్మురా, ఇష్..గప్ చుప్....ఇలాంటి సినిమాల పేర్లన్నీ తలుచుకుంటే చాలు తెలుగు ప్రేక్షకుల వదనాల్లో ఇప్పటికీ దరహాస మందారాలు పూయించగల సామర్ధ్యం ఉన్న చిత్రాలు.


కొత్తగా ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పటమంటే సూర్యునికి దివిటీ చూపించటమే అవుతుంది. ఆయన సినిమా ప్రస్థానం, వచ్చిన అవార్డులు, ఇతర జీవిత విశేషాలను గురించి "
ఇక్కడ" చూడండి.
క్రితం అక్టోబర్లో "బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్" కోసం నేను రాసిన "చంటబ్బాయ్" సినిమా కబుర్లు....ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా వారిని తలుచుకుంటూ....మరోసారి.
*** *** ***


ఆహాహా....సుహాసినీ సుమధుర హాసినీ...వందే...."

ఎవరది?వేళకాని వేళ వందేమాతరం పాడుతున్నారు..?
అయ్యో, మా నాన్నగారండి......గుమ్మం అటు....
నాకు తెలియదనుకున్నారా? వాస్తు ప్రకారం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు గృ..గృ..గృ...గృహం మధ్యదాకా వచ్చి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకనే..ఇలా...."
*** *** ***

"కఐ కలౌ కయూ..."
"కమి కటూ..."
ఏమిటిది మనిషంత మనిషిని పిల్లకి తండ్రిని నా ఎదురుగుండా నాకు అర్ధంకాని భాషలో మా అమ్మాయితో మాట్లాడటానికి వీల్లేదయ్యా వీల్లేదు..."
*** *** ***


"ఏమండేమండీ..మీరు సినిమా తీస్తున్నరాండీ...నా పేరు విశ్వనా"ధం" అండీ, చాలా నాటకాలు వేసానండి..ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమలో ఏక్ట్ చెయ్యాలని కోరికగా ఉందండి...ఒక్క చిన్న బిట్ ఏక్ట్ చేస్తాను...బాబ్బాబు కాదనకండి.."
"ఆల్ రైట్. ఆకలితో బాధ పడుతున్న ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా..?"
"నటిస్తానండి..బాగా ఆకలితో కదండి....అయ్యా, బాబూ...ధర్మం చెయ్యండి బాబూ...ఒక్క ఐదు రూపాయలు ధర్మం చేస్తే అజంతా హొటల్లో చికెన్ బిర్యానీ తింటాను తండ్రీ...బాబూ.....అయ్యో వాళ్ళేరీ?"
(ఇంతలో అతని తండ్రి వస్తాడు...)
"ఎవర్రా వాళ్ళు... సినిమానా నీ శార్ధమా? అడ్దగాడిద. ఏం మేమంతా చచ్చాం అనుకుంటున్నావా? అనాధ జన్మంటూ అడుక్కు తింటున్నావ్? ముప్పొద్దులా మూడు కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా..!"
"అది కాదు నాన్నా, సినిమాలో వేషం ఇస్తానంటేనూ..."
"ఫో రా, సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తింటూ బ్రతుకు.నా కొడుకు పుట్టగానే టి.వి. చూసి ఝడుసుకుని చచ్చాడనుకుంటాను..."
"నాన్నా...”
"ఫో...”
"నాన్నా... "
"ఫో...”
నాన్నా...
*** *** ***

"ఏమిటో...జరిగిందంతా విన్నాకా ఆశువుగా నాకొక కవిత వచ్చేస్తోంది....జీవితమంటే...."
"ఏమండీ...వన్ మినిట్...నేనలా బయటకు వెళ్ళాకా కన్టిన్యూ చేసుకోండి.."
*** *** ***

"నేను కొన్ని కవితలు రాసాను..మచ్చుక్కొకటి వినిపిస్తాను వినండి...
ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుండి? ఎర్రగా ఉంటే బాగుండదు కనుక.
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? నీలంగా ఉంటే బాగుండదు కనుక.
మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు కనుక."
"ఇవి విన్నాకా కూడా నేను ఎందుకు బ్రతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనుక."
"చాలా బాగుందండి..ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను..వీటిని మీ పత్రికలో వేయించండి."
"ఇవిక్కడే ఉంచుతానమ్మా. మేమిక పత్రిక నడపలేము అని నిర్ణయించుకున్నాకా ప్రచురిస్తాము. ఇది రిలీజయే టైముకి మేము ఏ ఆఫ్రికానో, అండమానో పారిపోతామమ్మా !"

"థాంక్స్ అండి.....పోతే..."
ఎవరు పోతేనమ్మా, నేనా?
"ఇది కాస్త తినండి...”
పోవటానికేనామ్మా?
"నేనే స్వయంగా తయారు చేసిన స్వీటండి. వంటా-వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి.అతరిపండు లంబా లంబా అని దీని పేరు."

"(బొందా బొందా అనకపోయావ్). మళ్లీ తినటం ఎందుకు రిస్కు. జీవితం మీద ఆశున్నవాణ్ణి. ఇదిక్కడే పెట్టమ్మా."

"వస్తానండి.మళ్ళీ వచ్చేప్పుడు మరిన్ని కవితలూ,స్వీటు పట్టుకొస్తాను."
"...ఎప్పుడొస్తారో ముందుగా చెబితే సెలవు పెట్టుకుంటాను.."
"అబ్బే, సెలవు పెట్టుకుని మరీ వినాల్సిన అవసరం లేదండి...ఆఫీసులో వింటే చాలు...”

*** *** ***


"కాల యముడు కినుక వహించిన ఆ క్షణం తన కింకనులని పుణ్యమూర్తి ఆఫీసుకే పంపాడు పాడు యముడు."
చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి, చిత్రవధ చేసి, ఒకదానిక్రింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు.
"కవితనక పోతే ఏమంటారు?”

ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరూ ఏ పేరూ పెట్టలేదు.
"అయితే ఆ పేరూ నేనే పెడతాను... కవిత కాకపోతే తవిక."
తవికా..
"అవును. కవితను తిరగేసాను."
అద్భుతం. కవిత్వాన్నే తిరగేసిన మీకు పేర్లు తిరగేయటం ఒక లెఖ్ఖా..?
"ఇదిగోనండీ...ఇంకో తవిక..నోటికి మాట, నెత్తికి రీటా, కాలికి బాట, నాకిష్టం సపోటా..."
నీకూ నాకూ టాటా తొందరగా ఫో ఈ పూట.
"ఏమన్నారు..?"
అబ్బే ఏం లేదండీ..!!
*** *** ***


"ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏమి చెయ్యాలి?"
"రామకృష్ణా బీచ్ కెళ్ళి సముద్రంలో దూకాలి.
"ఎడిటర్ గారూ..."

"నోర్ముయ్! నెల రోజులుగా నా ప్రాణాలు పిచుమిఠాయిలా కొరుక్కు తినేసావు కదే రాక్షసీ...నీ పిచ్చిరాతలకి నా తల తిరిగిపోయి, మా ఆవిడని "సీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు" అని...మా ఆరేళ్ళ అమ్మాయిని "దీర్ఘ సుమంగళీ భవ" అనీ దీవించటం మొదలెట్టానే....

నోరెత్తావంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను....ఇవి తవికలా...పిడకలే....నీ పాడె మీద పెట్టుకునే పిడకలు.
ఇవేమిటి....ఇవి కధలా...ఆకుపచ్చని కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనుప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి...ఇవి కధలా?.....
*** *** ***

"ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చెయ్యటం. ఏం గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను? నాతో పెట్టుకోకొరేయ్... కుంతీస్ సెకెండ్ సన్స్ బూన్ (అదే..భీమవరం) లో వన్ పర్సన్ ని చావ కొట్టాను. పెట్టేయ్.. ఫోన్ కీప్ చెయ్.."
*** *** ***


ఈ డైలాగులన్నీ చదివాకా ఇదే చిత్రమో అర్ధం అయ్యే ఉంటుంది...క్లాసిక్ కామెడీ "చంటబ్బాయ్" లోని డైలాగ్స్ ఇవి.మా ఇంట్లో కేసెట్ అరిగిపోయే దాకా విని విని మాకు బట్టీ వచ్చేసిన డైలాగులివన్నీ..!!నా ఫేవరేట్ కమీడియన్ "శ్రీలక్షి"గారి "కవయిత్రి" పాత్ర ఈ చిత్ర విజయానికి బలమైన కారణం అంటే అతిశయోక్తి కాదు.


"చంటబ్బాయ్" చిత్రం గురించిన విశేషాలు:
1986లో జంధ్యాలగారి దర్శకత్వం లో వచ్చిన హాస్యచిత్రం ఈ "చంటబ్బాయ్". చిరంజీవి గారి సినీ కెరీర్ లోని ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. యాక్షన్ సినిమాలే కాదు, కామిడీని కూడా అద్భుతంగా పండించగలడు అని చిరంజీవి ఋజువు చేసారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల "చంటబ్బాయ్" ఈ సినిమా ఆధారం. ఇదే కాక బ్రిటిష్ కమిడియన్ Peter Sellers నటించిన A Shot in the Dark నుంచి ఈ సినిమా కధ తీసుకోబడిందని వినికిడి. ఏది ఏమైనా ఒక క్లాసిక్ హాస్య చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపొయిందీ సినిమా.

చిత్ర కధ:
"జేమ్స్ పాండ్" గా తనని తాను పిలుచుకునే పాండురంగారావు ఒక ప్రైవేటు డిటెక్టివ్. అతను ప్రేమించే టెలిఫోన్ డివైజ్ క్లీనరైన "జ్వాల" అనే అమాయకపు మంచి మనసున్న అమ్మాయి, ఒక హత్య కేసులో ఇరికించబడుతుంది. పాండు రంగంలోకి దిగి తాను పని చేసే డిటెక్టివ్ ఏజన్సీ బాస్ ఈ హత్య చేసినట్లు కనుక్కుని, నిరూపించి, జ్వాలను హత్య కేసు లోంచి విడిపిస్తాడు. ఇది విని జ్వాల స్నేహితురాలైన డాక్టర్ నిశ్చల, తన తండ్రికి వేరే వివాహం ద్వారా పుట్టిన తన అన్నయ్య "చంటబ్బాయ్" ను వెతికిపెట్టమని కోరుతుంది. ఆమె తండ్రి పేరుమోసిన వ్యాపారవేత్త కాబట్టి, దొరికిన "చంటబ్బాయ్" కాక మరో వ్యక్తి తానే "చంటబ్బాయ్" నని వస్తాడు. అసలు కొడుకు ఎవరన్నది సమస్యగా మారుతుంది.


ఎవరు అసలైన "చంటబ్బాయ్" అనే పరిశోధనలో, చివరిదాకా అనేక హాస్య సన్నివేశాలతో సినిమా నడుస్తుంది. చివరికి పాండురంగారావే చంటబ్బాయ్ అని తెలుస్తుంది. చిత్రం లో చిరంజీవి, సుహాసిని ప్రధాన పాత్రలు. సుహాసినికి చాలా సినిమాల్లో డబ్బింగ్ వాయిస్ అందించిన సరిత ఈ సినిమాలో కూడా చక్కని తన గాత్రంతో మెప్పిస్తారు. జగ్గయ్య, ముచ్చర్ల అరుణ, శ్రీలక్ష్మి, సుధాకర్, చంద్ర మోహన్, రావి కొండల రావు, పొట్టి ప్రసాద్ మొదలైన వారు మిగిలిన పాత్రధారులు. బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రానికి సాహిత్యం వేటూరి,సంగీతం చక్రవర్తి సమకూర్చారు. పాటలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల లు తమ గళాలనందించారు.

Tuesday, January 12, 2010

సంక్రాంతి...ముగ్గులు...


స్కూల్లో ఉన్నన్నాళ్ళూ ప్రతి "సంక్రాంతి"కీ నానమ్మా వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ప్రతి ఏడూ భోగి రోజున చీకటిఉదయనే రిక్షాలో ఇంటికి వెళ్తూంటే, చల్లని చలిలో్ దారి పొడుగునా వెచ్చని భోగిమంటలు...ప్రతి ఇంటి ముందూ మట్టినేల మీద తెల్లని, రంగురంగుల ముగ్గులతో నిండిన లోగిళ్ళు...
నలుగుపిండి స్నానాలూ, పట్టు పరికిణీలూ,
వంటింట్లోంచి పిండివంటల ఘుమఘుమలూ,
బొమ్మల కొలువులూ, భోగిపళ్ళ పేరంటాలూ,
గొబ్బెమ్మలూ...వాటిపై ముద్దబంతి పూలూ,
గంగిరెద్దులాటలూ , సన్నాయి మేళాలూ,

డుడు బసవన్నలు, హరిదాసు గానాలూ,
....ఆ స్మృతుల మధురిమలే అంబరాన్నంటే సంబరాలు...!!
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని జ్ఞాపకాలో..ఎన్ని నిట్టూర్పులో...ఎన్ని సరదాలో...ఇప్పుడే చిలికిన వెన్నలా తెల్లగా,మెత్తగా,కరిగిపోయే జ్ఞాపకాలు...అపురూపాలు.

సంక్రాంతి అనగానే నాకు నచ్చిన, గుర్తొచ్చే "సింధూరం" సినిమాలో పాట....




ఆ పాట తాలూకూ యూట్యూబ్ లింక్:
http://www.youtube.com/watch?v=Zj-S2_gYfVo

ఇక సంక్రాంతి అనగానే మొదట గుర్తు వచ్చేవి నాకెంతో ఇష్టమైన "ముగ్గులు". ఇంకా చెప్పాలంటే ముగ్గులంతే పిచ్చి. ధనుర్మాసం ఆరంభమౌతూనే నెలపట్టి ఇంటి ముందర ముగ్గులేయటం మొదలుపెట్టేవాళ్ళం. నానమ్మ, అత్త, పెద్దమ్మా, పిన్నిలు, అమ్మా....ఇంట్లో అందరు ముగ్గుల స్పెషలిస్టులే. మా అత్త పేరు వీధిలో ఎవరికీ తెలియదు. ఆవిడని అందరూ "ముగ్గులత్తయ్యగారు" అనే పిలుస్తారు ఇప్పటికీ.

మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న ఒక ముగ్గు టెక్నిక్ "వెడల్పు పోత ముగ్గు". మామూలుగా సన్నని గీతలా కాక బొటనవేలూ,చూపుడువేలూ,మధ్యవేలు కలిపి మూడు వేళ్ళతో వేసే ముగ్గును "వెడల్పు పోత ముగ్గు" అంటారు.మా అమ్మ వాళ్ళ అత్తగారి దగ్గర నెర్చుకుంది.నేను అమ్మ చూసి నేర్చుకున్నా..క్రింద మట్టి నేలపై ఉన్న ముగ్గులన్ని ఆ విధంగా వేసినవే. ఎప్పుడో వేసినవి....ఇదివరకూ మొదట్లో ఎప్పుడో ప్రచురించిన కొన్ని "ముగ్గులు"...








బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Sunday, January 10, 2010

స్వర రాగ గంగా ప్రవాహమే...


"चलो मन जाये घर अपनॆ
इस परदॆस में वॊ पर भॆस में
क्यॊ परदॆसी रहॆं....
चलो मन जाये घर अपनॆ....."


అంటూ 1998 లో G.V.Iyer గారు దర్శకత్వం వహించిన "స్వామి వివేకానంద" హిందీ చిత్రానికి ఒక అద్భుతమైన పాట పాడారు ఏసుదాస్ గారు.
గుల్జార్ రాయగా, ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు "సలీల్ చౌదరి" గారు స్వరపరిచిన పాట ఇది.
ఈ పాట ఈ లంకెలో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=d5oOvxcff0g



నాకు చాలా ఇష్టమైన గాయకుల్లో "ఏసుదాస్" గారు ఒకరు. K.J.Yesudas గొంతు నాకు ఇష్టం అనటం "వెన్నెల" అంటే నాకూ ఇష్టమే అని చెప్పటమే అవుతుంది. ఆయన పాటల గురించి, ఆ స్వరంలోని మాధుర్యాన్ని, విలక్షణమైన ఒరవడి గురించీ ఎంత చెప్పినా తనివి తీరదు. కాబట్టి ఆయిన పాడిన కొన్ని తెలుగు ,హిందీ పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు గుర్తు చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తాను.

ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని తెలుగు పాటలు:

ఓ నిండు చందమామ..నిగనిగలా భామా (బంగారు తిమ్మరాజు)
కొంగున కట్టేసుకోనా(ఇద్దరు మొనగాళ్ళూ)
కురిసెను హృదయములో తేనె జల్లులే (నేనూ నా దేశం)
నీవు నా పక్కనుంటే హాయి(శివమెత్తిన సత్యం)
చిన్ని చిన్ని కన్నయా కన్నులలో నీవయ్యా(భద్రకాళి)
ఎవ్వరిది ఈ పిలుపు..(మానస వీణ)
ఊ అన్నా...ఆ అన్నా....ఉలికి ఉలికి పడతావెందుకు....(దారి తప్పిన మనిషి)
అమృతం తాగిన వాళ్ళు (ప్రతిభావంతుడు)
లలిత ప్రియ కమలం(రుద్రవీణ)
తులసీ దళములచే(రుద్రవీణ)
నీతోనే ఆగేనా(రుద్రవీణ)
తెలవారదేమో స్వామీ(శృతిలయలు)
చుక్కల్లే తోచావే(నిరీక్షణ)
ఇదేలే తరతరాల చరితం(పెద్దరికం)
రాధికా కృష్ణా(మేఘసందేశం)
ఆకాశ దేశానా(మేఘ సందేశం)
సిగలో అవి విరులో(మేఘ సందేశం)
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా(పచ్చని సంసారం)
పచ్చని చిలుకలు(భారతీయుడు)
స్వర రాగ గంగా ప్రవాహమే(సరిగమలు)
కృష్ణ కృపా సాగరం(సరిగమలు)
ముద్దబంతి నవ్వులో మూగబాసలూ(అల్లుడుగారు)
నగుమోము(అల్లుడుగారు)
పూమాల వాడెనుగా పూజసేయకే(సింధు భైరవి)
నీవేగ నా ప్రాణం అంట(ఓ పాపా లాలి)
ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా(కుంకుమ తిలకం)
మా పాపాలు కరిగించు (శ్రీ షిర్డీసాయిబాబా మహత్యం)
నాకు చాలా ఇష్టమైన "హరివరాసనం" పాటను ఈ లింక్ లో వినవచ్చు.
http://www.youtube.com/watch?v=rcQCkkVKC5w


ఏసుదాస్ గారు పాడిన, నాకు నచ్చిన కొన్ని హిందీ పాటలు:

१)चांद जैसॆ मुख्डॆ पॆ...
२)दिल के टुकडॆ टुक्डॆ कर कॆ मुस्कुराकॆ चल दियॆ...जातॆ जातॆ यॆ तॊ बता जा हम जियॆंगॆ किस्कॆ लियॆ..
३)गॊरि तेरा गांव बडा प्यारा में तो गया मारा आकॆ यहा रॆ...(चित चॊर)
४)आज से पेह लॆ..आज सॆ ज्यादा खूशी आज तक नही मिली..(चित चॊर)
५)जब दीप जले आना..जब शाम ढलॆ आना(चित चॊर)
६)जानॆ मन जानॆ मन तॆरॆ यॆ नयन..
७)निस..गम..पनि....आ ..आभीजा..(आनंद महल)
८)सुरमयि अखियॊं में..(सदमा)
९)का करू सजनी आयॆ ना बालम (स्वामी)
१०)माना हॊ तुं बॆहद हसी..(टूटॆ खिलॊनॆ)
११)कहा सॆ आयॆ बदरा -- (चष्मॆ बद्दूर, Singers: K.J. Yesudas & Haimanti Shukla)
నాకు చాలా ఇష్టమైన ఈ పాట ఇక్కడ చూడండి...





2000లో ఈయన పాడిన "Sitaron mein tu hi" ప్రైవేట్ హిందీ అల్బమ్ చాలా ఆదరణ పొందింది. "మెహబూబ్" రాయగా, హిందీ చిత్ర స్వరకర్త "లలిత్" స్వరపరిచిన ఈ అల్బం లోని పది పాటలూ చాలా బావుంటాయి. వాటిలోని ఒక "చమక్ ఛం ఛం" అనే పాటని ఇక్కడ చూడండి..





ఏసుదాస్ గారికి "పిన్నమనేని అవార్డ్" ను విజయవాడలో ఒక సభలో ప్రధానం చేసారు. అప్పుడు ఆయన చేసిన "లైవ్ కచేరి" వినలేకపోయినా, రికార్డింగ్ ను దాచుకోగలగటం నా అదృష్టం. K.J.Yesudas గురించిన మరిన్ని వివరాల కోసం "
ఇక్కడ" చూడండి. కొందరు ప్రముఖులు ఆయనకు ఇచ్చిన ప్రశంసలు, ఆయనకు వచ్చిన అవార్డులు, పాడిన భాషల వివరాలూ అన్నీ ఈ వికిపీడియా లింక్ లో ఉన్నాయి. అందుకని ఇంక ప్రత్యేకంగా ఆయన గురించి ఇంకేమీ రాయటం లేదు.

ఏసుదాస్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మనకందరికీ ఇంకెన్నో అద్భుతమైన పాటలనందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఆయన టపా ద్వారా ఇవాళ ఏసుదాస్ గారి పుట్టిన రోజని తెలిపి నాకు ఈ మధురమైన పాటలన్నీ మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన "మురళిగారికి" ప్రత్యేకధన్యవాదాలు.

Friday, January 8, 2010

A Patch of Blue


1961 లో ఆస్ట్రేలియన్ రైటర్ "Elizabeth Kata" రాసిన నవల "Be Ready With Bells and Drums" ఆధారంగా అమెరికన్ డైరెక్టర్ Guy Green 1965 లో తీసిన చిత్రం "A Patch of Blue". కలర్ లో తీసే అవకాశం ఉన్నా "బ్లాక్ అండ్ వైట్" లోనే ఈ సినిమా తీసాడు దర్శకుడు. నవలకు 'Writers Guild of America అవార్డు' కూడా వచ్చింది. కానీ నవల కన్నా ఎక్కువగా "సినిమా"కు బాగా ఆదరణ లభించింది. ఆఫ్రికన్-అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ జోరుగా సాగుతున్న నేపధ్యంలో "ప్రేమకు జాతి, వర్ణ భేదాలు ఉండవు" అనే సూత్రాన్ని తెలిపేలా తీసిన చిత్రం ఇది. Bahamian - American నటుడైన Sir Sidney Poitier నల్లజాతీయుడైన "Gordon" పాత్రలో నటించారు అనేకన్నా జీవించారు అని చెప్పాలి. స్టేజ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా Sidney Poitier ఎంతో ప్రాఖ్యాతి గాంచారు. పేరు పొందిన ఆయన చిత్రాల్లో "టు సర్, విత్ లవ్" మరో ఉత్తమ చిత్రం.

టూకీగా చెప్పాలంటే ఇది "Gordon Ralfe" అనే ఒక నల్ల జాతీయునికీ, "Selina D'Arcey" అనే పధ్ధెనిమిదేళ్ళ అంధురాలైన అమెరికన్ యువతికీ మధ్య నడిచిన ప్రేమ కధ. ఐదేళ్ళ వయసులో తల్లి "Rose-Ann" వల్ల ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయిన Selina, నిర్దయురాలైన తల్లితో, తాగుబోతైన తాత "Ole' Pa" అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉంటుంది. స్కూల్ మొహం కూడా ఎరుగని ఒంటరి. ప్రపంచం తెలియని అమాయకురాలు. వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇల్లు క్లీన్ చేయటం, కౄరురాలైన తల్లి చేతిలో దెబ్బలు తినటం ఆమె దైనందిక చెర్యలు. "బీడ్స్" దండలుగా గుచ్చటం కొద్దిపాటి సంపాదనతో పాటూ ఆమెకున్న ఎకైక వ్యాపకం. రోజూ ఆమె వినే రేడియోనే ఆమెకు తోడు.

దగ్గరలోని పార్క్ కు రోజూ తీసుకువెళ్ళి, మళ్లీ పని నుంచి తిరిగి వచ్చేప్పుడు ఇంటికి తీసుకువెళ్ళేలా తల్లికి తెలియకుండా ఒప్పందం కుదురుతుంది Selina కు, ఆమె తాతకూ. ఇల్లు తప్ప మరో లోకం తెలీని Selina వెంఠనే ఒప్పుకుంటుంది. అక్కడ ఆమెకు Gordon పరిచయమౌతాడు. Selina - Gordon మొదట్లో పార్క్ లో కలుసుకున్న ఒకటి రెండు సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఎనిమిది నిమిషాల ఈ క్రింది వీడియోలో ఆ సన్నివేశాలు చూడండి.




ఆ పరిచయం ఓ మంచి స్నేహంగా, హృద్యమైన ప్రేమగా మారుతుంది. నిరసన, చీత్కారాలు తప్ప ఆప్యాయతన్నది ఎరుగని Selina, Gordon మంచితనానికీ, అభిమానానికీ, దయార్ద్ర హృదయానికీ కదిలిపోతుంది. అతడి చుట్టూ తన ప్రపంచాన్ని,ఆశల్ని పెంచుకుంటుంది. ఆమెలోని నిర్మలత్వాన్ని, అమాయకతను, మంచితనాన్ని అతడు ప్రేమిస్తాడు. తాను నల్ల జాతీయుడినని తెలిస్తే ఆమె స్నేహాన్ని పోగొట్టుకుంటానన్న భయంతో అతను ఆ సంగతి దాస్తాడు. తన తమ్ముడు Mark కు పరిచయం చేసినప్పుడు అతడు కూడా జాతి భేదాన్ని గుర్తు చేసి వారి అనుబంధాన్ని నిరుత్సాహపరుస్తాడు. ఒకరోజు పక్కింటి స్నేహితురాలి ద్వారా Selina, Gordon ల స్నేహం గురించి తెలుసుకున్న ఆమె తల్లి వారిద్దరినీ విడదీయటానికీ తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తుంది. అవాంతరాలన్ని అధిగమించి వారిద్దరు కలుస్తారా? విడిపోతారా? అన్నది క్లైమాక్స్.

సూక్ష్మమైన భావాలను కూడా మొహంలో చూపెట్టిన Sidney Poitier నటన ఈ చిత్రానికి ప్రాణం. Jerry Goldsmith అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో పియానో వాడిన విధానం ఆకట్టుకుంటుంది. Selina గా నటించిన "Elizabeth Hartman" నటన కూడా మనకు గుర్తుండిపోతుంది. నిర్దయురాలైన తల్లిగా నటించిన Shelley Winters కు ఆ సంవత్సరం "బెస్ట్ సపోర్టింగ్ ఏక్టర్" Oscar లభించింది. ఇంకా బెస్ట్ ఏక్ట్రస్, బెస్ట్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మొదలైన కొన్ని కేటగిరీల్లో ఆ ఏటి అకాడమీ అవార్డ్ నోమినేషన్స్ సంపాదించుకుంది ఈ చిత్రం.


సున్నితమైన భావాలకూ, ఆర్ద్రమైన ప్రేమకూ భాష్యం చెప్పే ఈ సినిమా తప్పక చూడవలసిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఎప్పుడో పదేళ్ళ క్రితం టి.వి.లో చూసిన ఈ చిత్రం నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటి.

Thursday, January 7, 2010

ఇక కావలసినదేమి...


వాగ్గేయకారుల్లో నాకు అత్యంత ఇష్టమైన "త్యాగయ్య" గురించి ప్రత్యేకం చెప్పటానికేముంది? పొద్దున్నే ఆయన కృతులు వింటుంటే ఈ కృతిని బ్లాగ్లో రాయాలనిపించింది..."బోంబే సిస్టర్స్"(సరోజ,లలిత)పాడిన కృతి వినటానికి పెడుతున్నను...




త్యాగరాజ కృతి, బలహంస రాగం, ఆది తాళం :

పల్లవి
: ఇక కావలసినదేమి మనసా సుఖముననుండవదేమి

అనుపల్లవి
: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాథుడు
అంతరంగమున నెలకొనియుండగ (ఇక)

చ1: ముందటి జన్మములను జేసినయఘ బృంద విపినముల-
కానంద కందుడైన సీతా పతి నందక యుతుడైయుండగ (ఇక కావలసిన)

చ2
: కామాది లోభ మోహ మద స్తోమ తమమ్ములకును
సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రుడే నీయందుండగ (ఇక కావలసిన)

చ3: క్షేమాది శుభములను త్యాగరాజ కామితార్థములను
నేమముననిచ్చు దయా నిధి రామభద్రుడు నీయందుండగ (ఇక కావలసిన)


త్యాగరాజ కృతికి అర్ధాన్ని రాసేంతటి గొప్పదాన్ని కాదు కానీ నాకు అర్ధమైన అర్ధాన్ని కూడా రాయటానికి సాహసించాను...

అర్ధం:

ఓ మనసా, ప్రశాంతంగా ఎందుకుండవు? ఇంకేమికావాలి నీకు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీ మనసునందు నిండి ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఆనందకారకుడైన శ్రీరాముడు తన నందక ఖడ్గంతో పుర్వ జన్మలందు చేసిన పాపారణ్యములను నాశనం చేయటానికి సిధ్ధముగానుండగ ఇంకేమి కావాలి నీకు?

నీలోని కామము,లోభము,మదము,మోహమూ మొదలైన అంధకారములను తొలగించటానికి, సూర్య చంద్రాదులను తన నేత్రాలలో నింపుకున్న శ్రీరామచంద్రుడు నీలో కొలువై ఉండగా ఇంకేమి కావాలి నీకు?

ఈ త్యాగరాజాశించెడి క్షేమాది శుభములను నీకొసగ గలిగిన దయానిధి అయిన శ్రీరామభద్రుడు నీలో ఉండగా ఇంకేమి కావాలి నీకు?
ఓ మనసా....

Tuesday, January 5, 2010

స్టీవియా


"స్టీవియా" ఒక హెర్బల్ ప్లాంట్. ఈ మొక్క ఆకులు పంచదార కన్నా ఇరవై,ముఫ్ఫై శాతం తియ్యదనం కలిగి ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా "సౌత్ అమెరికా"లో కల్టివేట్ చెయ్యబడుతున్న ఈ మొక్క పధ్ధెనిమిదవ శతాబ్దంలో మిగిలిన ప్రపంచ దేశాలకి పరిచయమైంది. ఇప్పుడిది ఒక "నేచురల్ స్వీట్నర్" గా ప్రసిధ్ధి చెందిన హెర్బ్.

దాదాపు ఒక పదేళ్ళ క్రితమేమో ఆదివారం ఈనాడు పుస్తకంలో "నేచురల్ సుగర్ సబ్స్టిట్యూట్" గా "స్టీవియా" గురించి ఉన్న ఆర్టికల్ చదివాను. కట్టింగ్ దాచలేదు కానీ నాకు ఆ ఆర్టికల్ బాగా గుర్తు. భవిష్యత్తులో నేను దాన్ని వాడతానని అప్పుడు అనుకోలేదు. 1 spoon sugar లో కనీసం 25 కేలరీస్ ఉంటాయట. "పందార" మానేసి ఆ అధిక కేలొరీలన్నీ తగ్గించాలని ఐదేళ్లక్రితం నిర్ణయించుకున్నాను. కొన్నాళ్ళు "తీపిలేని టీ" తాగాను.తరువాత కొన్నాళ్ళు మార్కెట్లో లభ్యమైన "ఆర్టిఫిషియల్ సుగర్ సబ్స్టిట్యూట్స్" కొన్ని ట్రై చేసా. కానీ "ఏస్పర్టీమ్", "సర్కోజ్" వంటివాటి దీర్ఘకాల వాడకం మంచిది కాదని చాలా చోట్ల చదివి వాడటం మానేసాను.

2,3ఏళ్ళ క్రితమేమో ఒక ఎగ్జిబిషన్ లో హెర్బల్ ప్రోడక్ట్స్ స్టాల్ లో "బయో ఫుడ్ సప్లిమెంట్" అంటూ అమ్ముతున్న "స్టీవియా పౌడర్" ను చూశాను నేను. స్టాల్ లో అబ్బాయి చాలా ఉపయోగాలు చెప్పాడు. దీనిలో
కేలరీలు ఉండవు ,
బ్లడ్ సుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది,
హై బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తుంది,
అధిక బరువు తగ్గిస్తుంది,
జీర్ణ ప్రక్రియను సరిచేస్తుంది,
దంత క్షయాన్ని నివారిస్తుంది,
గొంతు నెప్పి, జలుబు లను తగ్గిస్తుంది,
గాయాలూ, కురుపులకు, చర్మ సంబంధిత సమస్యలలో కూడా ఉపయోగకరం...
అంటూ...చెప్పుకువచ్చాడు. అవన్ని కరక్టేనని తరువాత నేను జరిపిన "నెట్ సర్వే"లో తెలుసుకున్నాను.

ఏదిఏమైనా ఇది ఒక "నేచురల్ స్విట్నర్" అన్న సంగతి నాకు నచ్చింది. మిగతా ఉపయోగాల సంగతి ఎలా ఉన్నా టీ లో వాడుకోవచ్చు అని ఆ "స్టీవియా పౌడర్" కొనేసాను. అయితే దీని వాడకానికి ఒక పధ్ధతి ఉంది. ఒక కప్పు పౌడర్ కి నాలుగు కప్పుల నీళ్ళు కలిపి, బాగా మరిగించి, అవి మూడు కప్పుల నీళ్ళు అయ్యాకా దింపేసుకుని 10,15 గంటలు ఆ ద్రావకాన్ని అలా ఉంచేసుకోవాలి. అలా చేయటం వల్ల ఆకు పొడిలోని సారం అంతా ద్రావకంలోకి వచ్చి, ద్రావకం బాగా తియ్యగా అవుతుంది. తరువాత దాన్ని పల్చటి బట్టలోంచి వడబోసుకుని, ఒక సీసాలోనో, ప్లాస్టిక్ బోటిల్ లోనో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇది ఒక 2,3 వారాలు నిలవ ఉంటుంది కాబట్టి కొద్దిగానే తయారు చేసుకుంటే మంచిది. ఇది వాడేప్పుడు ఒక 1/4 స్పూన్ కన్నా తక్కువ అంటే 3,4 చుక్కలు కాఫి, టి లలో డైరెక్ట్గా కలిపేసుకుని తాగచ్చు. లేకపోతే టి మరిగేప్పుడు దాంట్లో కూడా వేసుకోవచ్చు. కాని ఎక్కువ వేసుకుంటే అ తీపి అసలు భరించలేము. ఓ సారి వాడితే ఎంత వేసుకోవాలో ఎవరికి వారికే తెలుస్తుంది.

దీనికి కొన్ని" సైడ్ ఎఫెక్ట్స్" ఉన్నాయని అంటారు. కానీ అది ఎక్కువగా వాడితేనే. పైగా నేను వాడేది ఒక్క "టీ" లోకే కాబట్టి, కాఫీ టీల వరకూ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కన్నా వాడకానికి వంద రెట్లు ఇదే నయం అని నా అభిప్రాయం. ఈ "స్టీవియా" గురించి తెలుసుకోవాలి అనుకునేవారు "ఇక్కడ" మరియూ "ఇక్కడ" చూడవచ్చు.


పైన లింక్ పనిచేయనివారు ఈ క్రింది విధంగా ప్రయత్నించి చూడండి:

1)"www.healthy.net" లోకి వెళ్ళి search లో
"stevia - The Natural Sweetener: Resources and additional links " అని కొట్టి చూడండి..

2) "http://en.wikipedia.org/wiki/Stevia." ఈ లింక్ లో చూడండి.

ఈ పౌడర్ వెల వెల వంద గ్రాములు Rs.70/- ఒకసారి కొంటే రెండు,మూడు నెలలు వస్తుంది. నాకు రెగులర్గా దొరికేది
"Trishakti farms"వారు తయారుచేసినది. పేకెట్ మీద ఉన్న అడ్రస్,ఫోన్ నంబర్ క్రింద ఇస్తున్నాను:
Trishakti Enterprises
H.no.5-115,chinnamamgalaram,
moinabad Mandal, R.R. dist
A.P.-501504
cell:9391157340

Hyd branch:
16-Vikaspuri,
ESI-AG Colony road,
S.R.nagar(PO)
HYD-38
ph:23811220

Monday, January 4, 2010

పందార...పందార...


బాసుందీ, జీడిపప్పు పాకం, పూతరేకులు, గవ్వలు, బొబ్బట్లు, కాకినాడ కాజాలు,గులాబ్ జాం, మడత కాజాలూ, కజ్జికాయలు, పంచదార పూరీలు, పేటా(బుడిది గుమ్మడితో చేసే స్వీట్), బొంబే హల్వా, సేమ్యా హల్వా, చక్రపొంగలి.....ముఖ్యంగా ఇవి...ఇంకా కొన్ని...ఇవన్నీ ఏమిటి? అంటే నాకిష్టమైన తీపి పదార్ధాలు ! ఇంకా వివరంగా చెప్పాలంటే అసలు "తియ్యగా" ఉంటే చాలు ఏవన్నా నోట్లోకి వెళ్పోయేవి ఒకప్పుడు...!

మేం అన్నిరకాలూ తినాలని మా అమ్మ అన్నింటిలో "పందార"(పంచదార కి కొల్లోక్వియల్ పదమన్నమాట) వేయటం మొదలెట్టింది. టమాటా, బీరకాయ, ఆనపకాయ, మొదలైన కూరల్లో, వాటి పచ్చళ్ళలో, ఆఖరుకి కొబ్బరి పచ్చడిలో కూడా పందారే..! ఉప్మా తింటే పైన పంచదార చల్లుకుని, పూరీలు తింటే, ఆఖరులో ఒక పూరీ పందార వేసుకుని తినకపోతే పూరీ తిన్న తృప్తే ఉండేది కాదు. చారులో, పులుసుల్లో కూడా పందారే. ఈ పదార్ధాలన్నీ పందార లేకుండా కూడా వండుకుంటారని అసలు తెలియనే తెలియదు. కాఫీలో,టీ లో కూడా మన పాళ్ళు ఎక్కువే. అలా పందార మా జీవితాల్లో ఒక భాగమైపోయింది.

కేనింగ్ సెంటర్(పదార్ధాలు మనం తీసుకువెళ్తే, జామ్లు అవీ మనతో చేయించే సెంటర్) కు వెళ్ళి మా కోసం పెద్ద హార్లిక్స్ సీసాడు(నే చాలా ఏళ్ళు తాగిన హెల్త్ డ్రింక్) మిక్స్డ్ ఫ్రూట్ జామ్, ఆపిల్ జామ్, ఇంకా రెమ్డు మూడు రకాల జూస్ లూ చేసి పట్టుకు వచ్చేది అమ్మ. ఇంక మజ్జిగలోకి,ఇడ్లీల్లోకి, దోశల్లోకి అన్నింటిలోకీ జామే..! సీసా అయిపోయేదాకా నేనూ, మా తమ్ముడూ పోటీలుపడి తినేసేవాళ్ళం. శెలవులకు మా తమ్ముడు వస్తే వాడున్న వారం,పది రోజులూ రొజుకో రకం స్వీట్ చేసేసేదాన్ని.నా పెళ్ళయాకా అల్లుడికి లడ్డూలూ, సున్నుండలూ ఇష్టం అని తెలిసి మా అమ్మ తిరుపతి లడ్డు సైజులో మిఠాయీ, సున్నుండలు చేయించింది సారెలోకి. నా సీమంతానికి పన్నెండు రకాల స్వీట్లు తెచ్చింది మా అమ్మ.

ఆ విధంగా పందార తిని, తినీ పెరిగిన నేను అత్తారింట్లో వంటల స్పెషలిస్ట్ ననే ధీమాతో, అన్ని పనులు బాగా చేసేసి అందరి మన్ననలు పొందెయ్యాలనే "అజ్ఞానం"లో మొదటిసారి వంట చేసాను. అందరూ బావుందంటారనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చూస్తున్నా...."ఈ కూరలో ఎన్ని పచ్చిమెరపకాయలు వేసావమ్మా?" అనడిగారు మామగారు."ఈ పచ్చడేమిటి తియ్యగా ఉంది?" అనడిగారు శ్రీవారు. "ఇది చారా పానకమా?" అనడిగాడు మరిది. "మేము చారులో,పచ్చడిలో పంచదార వేసుకుంటాము" అన్నాను ఎర్రబడిన మొహంతో..! ఆ మర్నాడు మా అత్తగారు దగ్గరుండి కూరలో ఐదారు పచ్చిమెరపకాయలూ, తీపి లేని చారు, పందార లేని పచ్చడి చేయించారు. నాకు విడిగా కాస్త కారం తక్కువగా కూర, పందార వేసిన పచ్చడి చేసుకున్నా...!ఆ తర్వాత కొన్నాళ్ళు అలా విడిగా తీసుకున్నాకా విసుగొచ్చి మానేసి, నేనూ "వాళ్ళ మెనూ"లో జాయినయిపోయా. నేను తీపి వేసుకోవటం మానేసాను. కాలక్రమంలో వాళ్ళూ కారం కాస్త తగ్గించారు. ఇప్పుడిక ఇంటికి వెళ్తే తియ్యకూరలు వండకు అని నేనే చెప్తాను అమ్మకి. "పెళ్ళయాకా ఇది మారిపోయింది" అంటారు అమ్మావాళ్ళిప్పుడు.

చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూలు,కాలేజీ ఎగ్గొడదామంటే "జ్వరమన్నా రాదేమమ్మా...." అంటే అమ్మ తిట్టేది. అటువంటి రాయిలాంటి ఆరోగ్యం కాస్తా ఒక్క డెలివెరీ తో చిందర వందర అయిపోయింది. సిరియస్ వి కాకపోయినా ఏవేవో రకరకాల సమస్యలు. ఇక స్వీట్లు, ఫాటీ పదార్ధాలూ తినకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడో సుగరు,బి.పీలూ వచ్చాకా మానేయటం కన్నా ముందుగానే మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం శ్రేయస్కరం అనిపించింది. పైగా ఇప్పుటినుంచీ మానేయటం వల్ల ముందు ముందు విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా, రక్తంలో కొవ్వు శాతం "మితంగా" ఉంటే ఆయా ఆరోగ్య సమస్యల వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా వరకూ తగ్గుతాయి అని నేను చేసిన నెట్ సర్వేతో నాకర్ధమైన విషయం. ఐదేళ్ళ నుంచీ టీ లో "పందార" కూడా వేసుకోవటం మానేసాను. ఏస్పర్టీమ్, సర్కోజ్ వంటి "ఆర్టిఫీషియల్ స్వీట్నర్లు" కాక ఒక "నేచురల్ స్వీట్నర్" గురించి తెలుసుకుని అది వాడటం మొదలెట్టాను. దాని గురించి తదుపరి టపాలో...

"ఏది జరిగినా మన మంచికే" అని నమ్మే మనిషిని నేను. తలెత్తిన ఆరోగ్య సమస్యలు "తీపి" మీద నాకున్న మోహాన్ని వదలగొట్టాయి. ఇప్పుడు ఐస్ క్రీం చూసినా, ఏదన్నా స్విట్ చూసినా తినాలనే ఏవ పూర్తిగా పోయింది. పెళ్ళిలలో, పండుగల్లో తప్ప "పందార" "స్విట్"ల జోలికే పోను.చేసి అందరికీ పెడతాను కానీ నేను మాత్రం తినను."దంపుడుబియ్యం" మంచిదని తెలుసుకుని అది కూడా తినటం మొదలుపెట్టాము ఇంట్లో."ఆరోగ్యమే మహాభాగ్యం" అనేసుకుని, ఇలా రకరకాల కారణాలతో నాకు చాలా ఇష్టమైన వాటి పట్ల నాకున్న మోహాన్ని పోగొడుతున్న భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను.