Thursday, January 2, 2014

అంతర్లోచన...ప్రతి ఏడాదీ జనవరి 1st న ఎప్పుడో కుదిరినప్పుడు కాసేపు కూర్చుని ఇంతదాకా ఏం చేసాను? ఇకపై ఏం చెయ్యగలను? అని నాలో నేను మాట్టాడుకోవడం అలవాటు నాకు. నిన్న అలా ఖాళీగా కూచునే సమయమే దొరకలేదు :(  మొన్న రాత్రి కాలనీలో జరిగిన న్యూ ఇయర్ పార్టీ ఎగ్గొట్టేసాం. చాలా బిజీ ఏమీ కాదు కానీ చాలా మామూలుగా గడిచిపోయింది నిన్నంతా! ఆఫీసు కి శెలవు లేక కేరేజీ తీసుకుని శ్రీవారు ఆఫీసుకెళ్ళిపోయారు. మా పాప బుక్స్ సర్దుతుంటే నే చూడని, మిగిలిపోయిన హోం వర్క్ కనబడింది! అయ్యబాబోయ్..అని భయపడిపోయి రాత్రిలోపూ అది పూర్తి చేయించే ఫుల్ టైమ్ పనిలో పడ్డా! ఇవాళ్టి నుంచీ స్కూలు మొదలు వాళ్లకి. 


అందుకని ఇవాళ పొద్దున్నే కాస్త ఖాళీ చిక్కగానే కూచున్నా తీవ్రంగా అంతర్లోచన చేసేసి, డైరీ ఎలానూ సరిగ్గా రాయట్లేదు ఇక్కడైన రాసుకుందామని..:)  ఈ బ్లాగ్ మొదలెట్టాకా రెగులర్ గా డైరీ రాసే అలవాటు కూడా గతి తప్పింది. ఖాళీగా అక్కడక్కడ మాత్రమే నిండిన పది పదిహేనుకి మించని మూడేళ్లనాటి పాత డైరీలను చూసుకుని, క్రితం ఏడాది కొత్త డైరీ తీసుకోవడం మానేసా. ఓ వాడని పాత డైరీలోనే వరుసగా రాయాలనిపించినప్పుడల్లా తారీఖులు వేసి రాసుకుంటూ వచ్చా! ఈసారైతే అసలింకా వెతుక్కోలేదు పాతవాటిల్లోంచి! అంటే అన్ని వాడని పాత(కొత్తగా ఉన్న) డైరీలు ఉన్నాయి నా దగ్గర. పిచ్చో వెర్రో.. ఈ డైరీలేంటో.. ఇవన్నీ ఏం చేసుకుంటానో అని విరక్తి వేసేస్తుంది ఇల్లు సర్దినప్పుడల్లా!(ఆ కాసేపే..:)) రిజల్యూషన్స్ అనేవి వదిలేసి చాలా కాలమైంది. ఎందుకంటే అనుకునేదాన్ని గానీ అవెప్పుడూ సరిగ్గా అమలుపరచలేదు.. అందుకని ! (న్యూ ఇయర్ కి మానేసాను కానీ ప్రతి పుట్టినరోజుకీ మాత్రం ఏదో ఒకటి అనుకుని అది అమలుచేసే అలవాటు మానలేదు.) చాలా ఏళ్ల తరువాత ఈసారి జనవరి 1st న ఎందుకనో ఒకటి, రెండు తీర్మానాలు గట్టిగానే చేసుకున్నాను. నిజం చెప్పాలంటే బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టాకా చాలా పాఠాలని నేర్చుకున్నానని చెప్పాలి. అవన్నీ అమలులో పెట్టకపోతే ఇంక కొత్త విషయాలు నేర్చుకుని ఏం ప్రయోజనం? అసలు ఇదివరకటి రోజులు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది.. జనవరి 1st  అంటే ఏదో పండగలాగ ముందురోజు రాత్రి పేద్ద ముగ్గు, కొత్త బట్టలు, ఫ్రెండ్స్ ఇళ్లకి వెళ్ళడం, గ్రీటింగ్స్, ఫోన్ కాల్స్...బ్లా.బ్లా..బ్లా...! అప్పటిదాకా సెలబ్రేషన్ అంటే అదే డెఫినిషన్ !! అంతకు మించిన ఆలోచన ఉండేది కాదు. అసలు న్యూ ఇయర్స్ డే అప్పుడు మాత్రమే తీర్మానాలు ఎందుకు? తలకు దెబ్బ తగిలి బొప్పి కట్టిన తరువాత బుధ్ధి వచ్చిన ప్రతిసారీ తీర్మానాలు చేసుకోవచ్చు కదా? ఓహో ఇదా జీవితమంటే... అని అర్థమైన ప్రతిసారీ, కొన్ని బంధుత్వాల్లో.. స్నేహాల్లో..మనుషుల్లో.. డొల్లతనం బయటపడిన ప్రతిసారీ రేపట్నుండే నాకు న్యూ ఇయర్.. ఇకపై ఇలా ఉండద్దు..  అనుకోవాలని అప్పట్లో తెలీదు మరి! 
ఏదేమైనా ప్రతి నిన్నా ఇవాళ్టికి ఓ స్మృతిగా మిగిలిపోయేదే కదా! అందుకని స్మృతుల్లో కలిసిపోయిన నిన్నల్లోంచి అనుభవాల పాఠాలను వెతుక్కుని, వాటిని మర్చిపోకుండా నా చేతుల్లో ఉన్న ప్రతి ఇవాళనీ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చెయ్యాలన్నది... ప్రస్తుతానికి నే చేసుకుంటున్న తీర్మానం..! మీరూ ఏవో కొన్ని తీర్మానాలు చేస్కునే ఉంటారు కదా... అవి ఏదైనా, క్రింద బొమ్మలో చెప్పినట్లు అందరూ చెయ్యాలనీ, ఉండాలని కోరుకుంటున్నా!!